Friday, May 1, 2015

మార్టిన్ సన్ మూడు కవితలు


కవిత
ఇప్పుడు మనమీ భూమ్మీద ఒక తాళం వాయిద్దాం
ఆ తాళం మరేదో కాదు, ఒకప్పటి నీ చందమామనే.
వానాకాలపు అడవుల్ని కొమ్ముతో గోరాడినంతకాలం గోరాడి
ఇప్పుడు ఏడు సత్రాల యజమానిలాగా లావెక్కిపోయాడు.
చిత్తడినేలలలోతుల్లోంచో,ఆకాశమంత ఎత్తుల్లోంచో
నువ్వు ఊహించగలిగిన మాటల్లోనే మేం మాట్లాడతాం
వికసించినవో, వాడిపోయినవో నక్షత్రాలకుమళ్ళా ప్రాణంపోసి
నీ చేతుల్లో ఉన్న పువ్వులో కొత్త పరిమళం ఊపిరూదుతాం
తమ్ముడూ, తమ్ముడూ, ఏమైనా రానివ్వు-
దవానలం, బీభత్సం, నేల నాలుగు చెరగులా విప్లవం,
కాని గుర్తుపెట్టుకో,ఎప్పటికీ, ఈ రెండుమాటలూ:
పువ్వుకి పరిమళాలూదు.
స్వగ్రామం
నీ స్వగ్రామంలో వానపాములు గుల్లబరిచిన తోటలో
కాశీరత్నం తీగె ఇంకా పూస్తూనే ఉంది.
ఇళ్ళల్లో పాతాకాలపు పొడవాటి గోడగడియారాలు టిక్కుటిక్కుమంటూనే ఉన్నాయి.
ఇళ్ళ కప్పుల్లోంచి యూపస్తంభాల్లాగా పొగపైకి లేస్తోనే ఉంది.
ఎన్నో సముద్రాల మీద ఎంతో కఠినాతికఠిన జీవితం ముగించుకుని
క్రూరాతిక్రూరమైన తావులన్నీ చూసి వచ్చినవాడికి
ఈ శాంతిమయ గ్రామం ఒక ప్రశాంత అసత్యంగా గోచరిస్తుంది.
కాని ఈ అసత్యానికే జీవితమంతా చుట్టుకుపోవాలనిపిస్తుంది.
ఈ ఒక్క అసత్యం కోసం
ఎన్ని దుష్టసత్యాల్నైనా కాళ్ళతో మట్టేసి రావాలనిపిస్తుంది.
శ్రోతలు
వినడమొక్కటే తెలిసిన ఆ రోజుల్లో
నెగడిచుట్టూ చేరి పెద్దవాళ్ళంతా
అంతిమదినందాకా, ఒక రక్షకుడెవరో
వాళ్ళని శుభ్రపరిచే క్షణంకోసం వేచిచూస్తూ
తమ పాపమయదేహాల్ని చలిగాచుకుంటూ ఉండేవాళ్ళు.
ఎక్కణ్ణుంచో ఒక పిల్లి మావుమనేది, నెగడి రగుల్తుండేది,
పొగగొట్టాలు కూతపెట్టేవి.
కాలుజారిన ఒక పిల్లను తలుచుకుంటూ
ఎవరో శోకభరితంగా గొంతెత్తేవారు.
పళ్ళూడి పొద్దువాటారినవాళ్ళు
పొల్లుపోయిన ధాన్యంగురించో
పురుగుపట్టినపంటగురించో మాట్లాడుకునేవాళ్ళు.
ఆ చిన్నప్పటి నెగడిదగ్గరే నేనిప్పటికీ గడ్డకట్టుకుపోయాను.

No comments:

Post a Comment

Total Pageviews