Monday, May 4, 2015

జోల పాటలను విని ఎంత కాలమయ్యిందో!

                                              జోల పాటలను విని ఎంత కాలమయ్యిందో!
                                *******************************

జో అచ్యుతానంద జో జో ముకుందా!
లాలి పరమానంద రామగోవిందా!
తెలుగు సాహిత్యంలో గల గొప్పతనం పసితనం నుంచి పిల్లల్ని గోముగా భక్తిరసము రంగరించి పెంచదం సంప్రదాయంగా వస్తూంది.పిల్లల పెంపకంలో జోలపాట వారిని సంతోషపెట్టటమే కాక మనలో భక్తి రసాన్ని నింపేది.
పసిడి వయసులో పసిడి నవ్వుల పాప మేలుకున్నప్పుడు నిద్రపుచ్చడానికి జోల పాట పుట్టింది.ఇది కవిత్వం కోసమో,సంగీతంకోసమో కల్పింపబడిన పాట కాదు.మాతృవాత్సల్య ప్రతీక.కామక్రోధ,లోభ,మోహ మద మాత్సర్యాలకు అతీతమైన చిరతానందస్వరూపుడైన శిశువును జో కొట్టడమే ఈ లాలిపాట ఆంతర్యం.
కౌసల్యా మాత శ్రీరామచంద్రుని పసితనంలో ఊయలలో పడుకోబెట్టి జోల పాడితే కాని పడుకునేవాడు కాడుట.
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా-అని పాడితే కాని నిదురపోయెవాడు కాడుట.
నా చిన్నతనంలో తల్లులు ఈ పాటను పాడేవారు
పదునాలుగు భువనములు తొట్టె గావించి
నాలుగు వేదాల గొలుసులమరించి
-అంటూ వుయ్యాల ఊపుతూ నిదురబుచ్చేవారు.
నా చిట్టిపాప-నా చిట్టి తండ్రి
నిదురపోర-నా బంగారు బుజ్జి -అంటూ ఇంటింటా తల్లులు వాత్సల్యంతో పసిబిడ్డలను తరతరాలుగా వస్తున్న కర్ర ఉయ్యాలలోనో లేదా ఇంటిలో వాసానికో,పొలం పనులు చేసే తల్లులైతే ఏ చెట్టుకొమ్మకో చీరను కట్టి పిల్లలను పడుకోపెట్టి జోల పాడేవారు.
కొందరు మాటలను మాధుర్యంగా స్వరం చేసుకుని జోల పాడేవారు.
ఊరుకోర నా తండ్రి ఊరుకోరా
అమ్మ అలసి పోయింది పొద్దుపోయింది
చిన్ని తండ్రి నిదురపో,నా కన్నబాబు నిదురపో
అన్న అలసిపోయాడు,వాడికి బువ్వ పెట్టాలి.
నిదురపోరా నాన్న ! నిదురపోరా!
అందమైన గుర్రాలు నీకోసమొచ్చాయి
చక్కని చందమామ చుక్కల్ని పంపింది!
ఏడవకు చిన్నా ఏడవకమ్మా
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను!
నా బుల్లి రామయ్యా నిదుర పోవయ్యా!
నా చిన్ని కృష్నయ్యా నిదుర పోవయ్యా!
-అంతకూ పిల్లవాడు ఊరుకోకపోతే-
అందాల నీ కనుల కాటుక
కరిగేల ఏడుస్తున్నావు,బాబూ!
అత్తమ్మ కొట్టిందా నా అందాల బాబు
పిన్నమ్మ కొట్టిందా నా చేమంతిమొగ్గా
మామ కొట్టాడా నా మల్లెచెండూ
తాత కొట్టారా నా తామరపూచెండూ
పాలుపట్టే అత్త పట్టుకు కొట్టిందా?
నీ చెంప కందితే నా గుండే చెరువౌవురా
నీ కళ్ళు ఎర్రబారితే నే చూడలేను
నను కన్న తండ్రి ఊరుకోరా-
అని తల్లి పాటతీరులో కాసేపు ఊరుకున్నట్టే ఊరుకుని మళ్ళి ఏడుపు ప్రారంభిస్తాడు.మిగతా ఏడుపును ఆపడానికి ఆ తల్లి తిరిగి గొంతెత్తుతుంది.
ఊరుకో నా బాబు ఊరుకో బుజ్జీ
నిదురపో చిన్నారి నిదురపోవయ్యా
నిదుర లేచేసరికి నీ నాన్న తెస్తాడు బుల్లి గుర్రాలు
బండి కట్టి బజారుకెడదాము!
నీకు కావలసినవన్ని కొనుక్కొందాము
అక్కలూ వస్తారు అన్నలూ వస్తారు
మామయ్య వస్తాడూ అత్త వస్తుంది
అందరూ కలిసి నిన్నెత్తుకుంటారు.
-అంతవరకు ఉంగా ఉంగా అంటూ ఏడిచిన పాప హాయిగా నిదుర పోతుంది.
బువ్వ తినడానికి మారాము చేసే పిల్లల్ని చంకలో ఎత్తుకుని చందమామను చూపిస్తూ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
బండిమీద రావే బంతిపూలు తేవే
వెండి పళ్ళెములో వేడిబువ్వ తేవే
అబ్బాయి తినగానే ఆటకులారగించి పోవే!
-ఇలా పిల్లల్ని జోలపాడి ఊరుకోపెట్టేవారు.ఆ తల్లులంతా చదువుకున్నవారు కాదు, పల్లెలలో వుండేవారు. పిల్లలకు మూడేళ్ళు వచ్చేవరకూ వారిని ఆడిస్తూ పాడిస్తూ ప్రేమ వాత్సల్యాలను కురిపించేవారు.రామాయణ భారతాలను చిన్నచిన్న కధలుగా చెప్పేవారు.చిన్నచిన్న శతక పద్యాలను చెప్పేవారు.ఇప్పటి పిల్లలకు ఈ అచ్చట ముచ్చట లేనేలేవు. టీవీల ముందు కూర్చోపెట్టి పోగో చానల్,బార్బీ బొమ్మలు ,టాయ్ గన్నులు ,మార్పు వస్తుందా? ఎవరు పూనుకోవాలి?ఎక్కడ నించి ప్రారంభించాలి?
నేను ఆలోచిస్తూనే వున్నాను,మీరు ఆలోచించండి.

-గోటేటి వెంకటేశ్వరరావు,

No comments:

Post a Comment

Total Pageviews