Thursday, September 3, 2015

శుభోదయం../\..

శుభోదయం../\..
అనంత శక్తుల ఆదిలక్ష్మి వాత్సల్యం నుండే భోగభాగ్యాలు, సౌందర్య లావణ్యాలు, ఐశ్వర్య మాధుర్యాలు ఉద్భవిస్తున్నాయి . మనం చూపించే చిటికెడు భక్తికి దోసిళ్లకొద్దీ ఐశ్వర్యాలను ప్రసాదించే దయాంబురాశి  శ్రీహరి దేవేరి, ఆగమనిగమాలకు ఆధారమైన అమ్మ తళతళల తెజోరేఖలు జన్మజన్మలకూ మనపై  ప్రసరిస్తూ ఉండాలని కోరుకొంటున్నాను.  



తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకుంటారు?

 తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకుతీసుకుంటారు?

మొదటి సారి తీర్ధము శరీర శుద్ధి, శుచికి
రెండవసారి తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు, 
మూడవసారి తీర్ధము పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. 
ఓం అచ్యుతాయనమః అని మొదటిసారి భక్తులు తీసుకోన్నచో వారి ఆత్మా పవిత్రము అగును. 
ఓం అనంతాయ నమః అని రెండవసారి, ఓం గోవిందాయనమః అని మూడవసారి తీర్ధము తీసుకొంటే వారికి మోక్షమునకు యోగ్యతా లభించును. శ్రీమన్నారాయణుని అనుగ్రహము వలన స్త్రీ, బాల, వృద్దులు అందరూ శ్రద్ధా భక్తులతో మూడుసార్లు తీర్ధం సేవించవలెను.
తీర్ధమంత్రము:- 
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం!
సమస్త పాప శమనం విష్ణు పాదోదకం శుభం!! 
పై మంత్రముతో తీర్ధం పుచ్చుకొని అందరూ ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకొంటున్నాను
                                                               ../\..

మంచిమాట!!

మంచిమాట!!

మంచి నడవడిక ఎవరో ఇచ్చే కానుక కాదు 
ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి !!!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి !!!


Wednesday, September 2, 2015

గుండె లోతుల్ని ఆవిష్కరించే కథనం🌼

గుండె లోతుల్ని ఆవిష్కరించే కథనం
.
సరోజ టీచర్ ఆ రోజు ఐదవ తరగతి లోకి వెళ్ళింది . పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని . అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడో వరసలో ఉన్న మహేశ్ తీరు ఆమెకు నచ్చలేదు . ఏడాదిగా అతడిని గమనిస్తోంది. అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో పాల్గొనడం లేదు , డ్రెస్ సరిగా వేసుకోవడం లేదు. దీంతో ఆమెకు అతడంటే సదభిప్రాయం కలగలేదు . 
.
కాలం గడిచిపోసాగింది . అతడి పేపర్స్ లో ఆమె ఎర్ర సిరా గుర్తులు పెరిగిపోసాగాయి.. మార్కులు తక్కువగా పడుతున్నాయి. అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . 
.
పిల్లల గురించి టీచర్ సీసీఈ కుమ్యలేటివ్ రికార్డు రాయాలి . అందరి రికార్డులూ రాసేసినా ఎందుకో ఆమెకు మహేశ్ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . వార్షిక పరిక్షలూ దగ్గర పడుతున్నాయి. మహేశ్ వివరాలు నమోదుచేయాలి. 
.
ఒక రోజు అతడి రికార్డు ముందరేసుకుని తిరగేయసాగింది . పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది.
.
అతడి ఒకటవ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది " మహేశ్ చాలా తెలివైన కుర్రాడు . అందరితో కలసి పోతాడు. అతడితో అందరూ చాలాస్నేహంగా ఉంటారు. ఇంటిపని నీట్ గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ " 
.
రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ ఈమద్య అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు " 
.
మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ది చాలా కష్టపడేతత్వం. చదువులో బాగానే ఉన్నాడు కానీ అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు " 
.
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ చదువులో వెనుకబడి పోయాడు . అతను ఫ్రెండ్స్ తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక సమస్యాత్మక పిల్లవాడు కాబోతున్నాడు " 
.
.
సరోజ టీచర్ కి సమస్య అర్ధ మైంది. ఇన్నాళ్ళూ తను మహేశ్ గురించి తెలుసుకోనందుకు బాధ పడింది .

అంతలోనే టీచర్స్ డే వచ్చింది. ఏర్పాట్లలో సరోజ తలమునకలైంది . మహేశ్ నీ సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు .
.
.
టీచర్స్ డే రోజు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు
ఇస్తున్నారు . అందమైన రంగుకాగితాలతో చుట్టిన విలువైన కానుకలు ఇవ్వసాగారు .
.
ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బ్యాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు మహేశ్. ఆ బ్యాగ్ సగం చిరిగి ఉంది . అందులో ఒక సహజరాళ్ళ నెక్లెస్ ఉంది .అందులో సగం ఊడిపోయాయి .
.
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వతున్నారు . సరోజ వారిని కసిరి ఆ నెక్లెస్ మెడలో వేసుకుంది .
.
" చాలా బాగుంది " అని మహేశ్ తో అంది .
.
ఆమెకు దూరంగా నిల్చున్న మహేశ్ " మీరు ఈ రోజు మా అమ్మలా కనిపిస్తున్నారు" అన్నాడు .
.
.
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా సరోజ టీచర్ మాత్రం క్లాసును వదల లేక పోయింది . క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది .
ఆ రోజు నుండి ఆమె మహేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . మహేశ్లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు .
.
.ఆతర్వాత అతను సెకండరీ స్కూల్ కి పోయాడు.
ఇక్కడితో అయిపోలేదు .
.
.
మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది. అందులో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఆ ఉత్తరం సారాంశం .
.
మరో నాలుగేళ్లకు వచ్చిన ఉత్తరంలో " నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించాను . అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
మరో రెండేళ్లకు ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి ఉత్తరం లో చివరన సంతకం కింద మహేశ్, M.D. అని సంతకం చేశాడు .
.
.
ఇంతటితో ఈ కధ అయిపోలేదు .
.
ఇంకో ఉత్తరం వచ్చింది .
" నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసిందే..నాన్న గారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . వివాహంలో పెళ్ళికొడుకు తల్లి స్థానంలో మీరుండాలని నా కోరిక "
..
.
సరోజ పెళ్ళికి వెళ్ళేటపుడు మహేశ్ ఐదవ తరగతిలోబహూకరించిన నెక్లెస్ ధరించింది.. అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి .
..
.
ఆ పెళ్లి రోజు మహేశ్ కి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది .
.
.
( మనం ఎలాంటి వారమో, మన ప్రభావం ఎవరి మీద ఎలా పడుతుందో ఊహించలేము . అందుకని మిత్రులారా !కొన్నేళ్లపాటు మనచుట్టే ఉంటూ..మనముందే ఎదుగుతున్న పిల్లల గురించి నాలుగు మాటలు రాసిపెట్టండి. వారి శక్తియుక్తులు నమోదు చేయండి. ఎదుటి వ్యక్తి చరిత్రను సమగ్రంగా గమనించండి. అవగాహనకు రండి. ప్రేమగా ఉండండి . ప్రేమను పంచండి)... 
పేస్ బుక్ లో నెమలి ఈక లాగ పదికాలాలు దాచుకోవలసిన రచన పోస్ట్ చేసిన వారికి హృదయపూర్వక  అభినందనలు!  

ఒక పువ్వు భావకుని అంతరంగం నిండా వికసిస్తే....చినవీరభద్రుడు గారి అంతరంగం చదవండి!

ఎన్నాళ్ళుగానో ఓ కోరిక, ఓ కల, తెల్లవారగానే ఇంటిముంగిట్లో ఒక తామరపూల కొలను కనబడాలని,కనీసం ఒక తొట్టెలోనైనా ఒకటిరెండు తామరపూలేనా వికసిస్తుంటే చూడాలని.
అద్దె ఇల్లే కానీ, ఇన్నాళ్ళకు ఈ కల నిజమయ్యింది, ఆదివారం తెచ్చి ఒక తామరతీగ తొట్టెలో నాటానా, రాత్రి కురిసిన రహస్యపు వానకి, తెల్లవారగానే-
'చూసావా,పువ్వు పూసింది 'అన్నాడు ప్రమోద్.


ఒక్క ఉదుటున పోయి చూద్దునుకదా, నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను.
ఆ రేకల్లో అంత కాంతి, అంత నిర్మలత్వం, ఆకాశమంతా అక్కడే కుదురుకుందా అన్నంత ఒద్దిగ్గా, నిండుగా, పరిపూర్ణంగా.
యుగాలుగా భారతీయ కవులు, వేదాంతులు, శిల్పులు, చిత్రకారులు కీర్తిస్తూ వచ్చిన పద్మమిదేనా?
అందరికన్నా ముందు టాగోర్ గుర్తొచ్చాడు. గీతాంజలి లో సుప్రసిద్ధ గీతం:
'పద్మం వికసించిన రోజున నాకు తెలీనే లేదు, నా మనసెక్కడో సంచరిస్తూంది,నా సజ్జ శూన్యంగా మిగిలిపోయింది, ఆ పువ్వు పిలుపు నా చెవిన పడనే లేదు.
ఇప్పుడు నన్ను దిగులు చుట్టుముట్టింది, నా కలల్లోంచి ఉలికిపడి మేలొన్నాను, దక్షిణమారుతంలో ఏదో ఒక మధురపరిమళం అనవాలు తోచింది.
ఆ అస్పష్టమాధుర్యం ఏదో వెతుకులాటతో నా హృదయాన్ని కలతపరిచింది. పరిపక్వం కావటానికి వేసవి మారుతం పడుతున్న ఆరాటం లాగా తోచిందది.
అప్పుడు తెలియనేలేదు నాకు, అది నాకింత సన్నిహితంగా ఉందనీ, అది నాదేనని, ఆ పరిపూర్ణమాధుర్యం నా హృదయాంతరాళంలోనే వికసించిందనీ.'
భగవదనుగ్రహాన్ని గుర్తుపట్టకపోవడంలోని దిగులూ, గుర్తుపట్టినతరువాతి ప్రశాంతీ రెండూ ఈ కవితలో కనిపిస్తాయి. కాని నేను మరింత అదృష్టవంతుణ్ణనిపించింది.
భగవదనుగ్రహం నన్నింత త్వరగా చేరవస్తుందని ఊహించలేదు నేను.
ఎర్రని ఆ మట్టినీళ్ళల్లో ఆ తామరపువ్వు మరింత ప్రకాశభరితంగా ఉంది. ఎరుపు రంగు నేపథ్యంలో ఎరుపు ఇట్లా శోభించగలదని నేనెప్పుడూ ఊహించలేదు.వాన్ గో పొద్దుతిరుగుడు పూలు బొమ్మ గీసినప్పుడు బంగారు రంగుపసుపు బాక్ గ్రౌండ్ మీద మళ్ళా బంగారు రంగు పొద్దుతిరుగుడుపూలని గీసినప్పుడు ఆ పూలకి అంత శోభ ఎట్లా సాధ్యమయ్యిందో ఇప్పటికీ అంతుపట్టనట్టే.
ఆ రేకల్ని, ఆ సుకుమారమైన ఆ రేకల్ని మరింత దగ్గరగా చూసాను. అందులో గులాబీల ఎరుపు ఉంది, కలువ పూల తెలుపూ ఉంది.
గత మూడువందల ఏళ్ళుగా గులాబీలకీ, లిల్లీపూలకీ మధ్య యూరోప్ లో పెద్ద స్పర్థ కొనసాగుతూనే ఉంది. గులాబీ ఆసియా ఖండంనుండి పారశీక ఉద్యానాల్లోంచి యూరోప్ లో అడుగుపెట్టింది. లిల్లీ ఉత్తరభూగోళానికి చెందిన సమశీతోష్ణదేశాలకి చెందిన పువ్వు. ఆ రెండు పూలలో ఏది అందమైందో ఐరోపీయ కవులు ఒక పట్టాన తేల్చుకోలేకపోయారు.
తూర్పు దేశాల వర్ణవైభవాన్ని విరజిమ్మే డెలాక్రా చిత్రాలా,లేక ఐరోపీయ రేఖావిన్యాసాన్ని ప్రతిబింబించే ఇంగ్రె చిత్రాలా ఏవి గొప్పవని అడిగితే ఏం చెప్పగలం?
గులాబీకీ, లిల్లీకి మధ్య తలెత్తిన ఈ స్పర్థని విలియం కౌపర్ (1731-1800) అనే ఒక ఇంగ్లీషు కవి సానునయంగా పరిష్కరించే ప్రయత్నం చేసాడు. ఆ రెండింటి సౌందర్యం సమానమేననీ, ఆ రెండింటినీ మించిన మూడవ పువ్వొకటి తలెత్తేదాకా, పుష్పసామ్రాజానికి ఆ రెండు పూలూ రాణులేననీ వనదేవత సర్దిచెప్పిందని ఆయన తన The Lily and The Rose (1782) లో ప్రకటించాడు. కాని పారశీక దేశాల ఐహిక జీవితేచ్ఛని మనసారా అంగీకరించలేకపోయిన విలియం బ్లేక్ (1757-1827) మళ్ళా లిల్లీకే పట్టం కట్టాడు. తన The Lily (1794) కవితలో ఆయన లిల్లీది ముల్లు లేని సంతోషమనీ, సౌందర్యమనీ ప్రస్తుతించాడు.
బ్లేక్ క్రైస్తవమిస్టిసిజంలో పారశీక సూఫీతత్త్వానికి చోటులేకపోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకని లిల్లీకి,గులాబీకీ మధ్య ఆ స్పర్థ కొనసాగూనే ఉంది, చివరికి కౌపర్ చెప్పినట్టు ఆ రెండింటికన్నా మహిమాన్వితమైన మూడవ పువ్వు తలెత్తేదాకా.
అపురూపమైన భారతీయాంగ్ల కవయిత్రి తోరూదత్ (1856-1877)ఒక సౌగంధికాన్ని తెచ్చి ప్రతిష్టించేదాకా.
గులాబీనీ, లిల్లీని, రెండింటి అందాన్నీ పొదువుకున్న ఆ పువ్వు తామరపువ్వని తోరూదత్ ఇట్లా సుమనోహరంగా చిత్రించేదాకా:
పువ్వులన్నింటికీ రారాణిలాంటి పువ్వేదని
ప్రేమదేవి ఒకనాడు వనరాణిని ప్రశ్నించింది,
ఘనగౌరవంకోసం గులాబికీ, లిల్లీకి మధ్య
చిరకాలం రగులుతున్న స్పర్థ తెలిసిందే కద.
కవిగాయకులు రెండింటితరఫునా వంత పాడారు
గులాబీ లిల్లికెప్పుడు సాటిరాగలదని కొందరు,
లిల్లీ నిజంగా అంతప్రేమాస్పదమా అనిమరికొందరు.
పూలవీథుల్లోని కలకలం రతీనికుంజాన్ని తాకింది.
'నాకొక పువ్వు కావాలి,' అనడిగిందామె వనదేవిని.
'గులాబిలాగ సుకోమలం, కలువలాగ సుధీరం'
'సరే, మరి రంగు?' 'గులాబిలాగా ఎర్రగా 'అని
అన్నంతలోనే మాట మార్చి, 'లిల్లీలా తెల్లగా' అంటూ
సరిదిద్దుకుని, 'కాదు రెండు రంగులూనూ' అంది,
అప్పుడనుగ్రహించింది వనలత, గులాబిరక్తిమ
దిద్దిన శ్వేతోత్పలాన్ని, పుష్పసామ్రాజ్ఞిని.
ఆ పూలరాణి, ప్రాక్పశ్చిమాల మేలుకలయికగా తోరూదత్ కి సాక్షాత్కరించిన ఆ సౌందర్యసామ్రాజ్ఞి నా ముందు నా ఇంటిముంగిట్లో ప్రత్యక్షమైతే నా గుండె ఎట్లా కొట్టుకుని ఉంటుందో ఊహించండి.
ఆ కమలం ( దానికీ రాజకీయాలకీ సంబంధం లేదు) నాలో ఒక కాంతి ధారకి తలుపు తీసినట్టనిపించింది. ఆ పువ్వు నిజంగానే ఈ లోకానికి చెందిన పువ్వు కాదు. కాని ఈ లోకం తాలూకు పంకంలోనే అది వేళ్ళు తన్నుకుంది. కాని దాని చూపు, దాని సంతోషం ఆకాశానివి, సూర్యుడివి, అందుకనే భూమ్యాకాశాలు మేళవించే చోటు ఎక్కడుందంటే వైదిక ఋషికి పద్మమే స్ఫురించింది.
ఆ రోజంతా ఆ పద్మాన్నే ధ్యానిస్తూ ఉన్నాను. అది ఒట్టి పువ్వా? అరవిందులు అన్నట్లుగా అది భగవంతుడి గులాబి.
రాత్రి పొద్దు పోయి ఇంటికి వచ్చేటప్పటికి, ఆ పువ్వు పూర్తిగా ముడుచుకుపోయిఉంది. ప్రమోద్ ఇంటికి రాగానే 'అమ్మా, ఆ పువ్వు ఏమైపోయింది' అని కంగారుపడ్డాడని విజ్జి చెప్తోంది. అట్లా రేకలన్నీ తనలోకి ముడుచుకుని ఒద్దిగ్గా ఆకులమధ్య ఇమిడిపోయిన ఆ పువ్వుని చూస్తే నాకు ఆశ్చర్యమనిపించింది. అచ్చు కవులు వర్ణించినట్టే ముడుచుకుపోయికనిపించింది. కాని ఆ ముడుచుకున్న రేకలకొనలమధ్య ఒకింత రాగరేఖ, కాళిదాసు శ్లోకమొకటి గుర్తుచేస్తూ.
బద్ధకోశమపి తిష్టతి క్షణం సావశేషవివరం కుశేశయమ్
షట్పదాయ వసతిం గ్రహీష్యతే ప్రీతిపూర్వమివ దాతుమంతరమ్ (రఘువంశం:8:39)
(పద్మం పూర్తిగా మొగ్గగా ముడుచుకుపోయాక కూడా, ఒకింత చోటు వదిలిపెట్టినట్టే ఉంది,ప్రేమతో తచ్చాడుతున్న తుమ్మెదకి నీడనివ్వడంకోసమా).
తెల్లవారుతూనే మళ్ళా పోయి చూసాను. రాత్రి ముకుళితమైన ఆ పువ్వు మళ్ళా రేకలు చాపుతూ ఉంది. 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాంతికేంద్రంతో అది అప్పుడే సంభాషణ మొదలుపెట్టింది.ఇంతకన్నా గొప్ప సూర్యారాధకులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండగలరా అనిపించింది. ఇన్నేళ్ళుగా సంధ్యావందనం ఆచరిస్తూనే ఉన్నానే, కాని సావిత్రీ ఉపాసనలో ఈ చిన్నారిపువ్వు ముందు నేను చాలనని తోచింది, సిగ్గనిపించింది.
అట్లా జీవించగలనా, కాంతికి మాత్రమే విప్పారి, చీకటికి ముడుచుకుపోయి, మళ్ళా కాంతికోసం తెరుచుకుని.
జీవిస్తే అట్లా కదా జీవించాలి, జీవితమంతా ఒక 'సద్ధర్మ పుండరీక సూత్రం'లాగా.

కరుణశ్రీ గారి మందార మకరందాలు 2 (అనసూయాదేవి ---- మహాకవి పోతన)


కరుణశ్రీ గారి మందార మకరందాలు!
. 
అనసూయాదేవి

గర్భములేదు - కష్టపడి కన్నది లే - దిక బారసాల సం
దర్భము లే - దహో ! పురిటిస్నానముల్ నడికట్లులేవు - ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠి కీ
యర్భకు ? లంతులేని జననాంతర పుణ్యతపఃఫలమ్ములై.


మహాకవి పోతన !

(కరుణశ్రీ గారి మందార మకరందాలు - )

ఉ.
గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ ? నిల్కడ యింటిలోననో
పంటపొలానొ ? చేయునది పద్యమొ సేద్యమొ ? మంచమందు గూ
ర్చుంటివొ మంచెయందొ ? కవివో గడిదేరిన కర్షకుండవో ?
రెంటికి చాలియుంటివి సరే ! కలమా హలమా ప్రియం బగున్ ?

ఉ.
కాయలు గాచిపోయినవిగా యరచేతులు ! వ్రాతగంటపున్
రాయిడిచేతనా ? మొరటు నాగలిమేడి ధరించి సేద్యమున్
జేయుటచేతనా ? కవికృషీవల ! నీ వ్యవసాయదీక్ష " కా
హా " యని యంతలేసి కనులార్పక చూచిరిలే దివౌకసుల్ !


ఉ.
"నమ్ముము తల్లి నాదు వచనమ్ము ; ధనమ్మునకై బజారులో
అమ్మనుజేశ్వరాధముల కమ్మను ని " న్నని బుజ్జగించి నీ
గుమ్మములోన నేడ్చు పలుకుం జెలి కాటుకకంటి వేడి బా
ష్పమ్ములు చేతితో తుడిచివైచెడి భాగ్యము నీకె యబ్బెరా ! !

ఉ.
కమ్మని తేటతెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ
క్యమ్ముగ కైత లల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లో
కమ్మున లేరు - నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా
హమ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగు గడ్డపై ?

సీ.
భీష్ముని పైకి కుప్పించి లంఘించు గో
పాలకృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొఱపెట్ట పరువెత్తు కఱివేల్పు
ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నులనుండి
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ
సందు మాగాయి పచ్చడి పసందు

గీ.
ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి
రయ్య ! ఏరాత్రి కలగంటివయ్య ! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు !
సహజపాండితి కిది నిదర్శనమటయ్య ! ! 

ఉ.
ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర ! మధ్య మధ్య అ
ట్లద్దక - వట్టిగంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా ?

ఉ.
ఖ్యాతి గడించుకొన్న కవు లందరు లేరె ! అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద, జోహారు సేతకై
చేతులు లేచు ; ఈ జనవశీకరణాద్భుతశక్తి చూడగా
నాతని పేరులో గలదొ ; ఆయన గంటములోన నున్నదో !
--------

Total Pageviews