Monday, October 31, 2016

నవంబర్ 1 వ తేదీ,

నవంబర్ 1 వ తేదీ, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రమే కాదు. తెలుగు వారికంటూ, తెలుగు భాషకంటూ గుర్తింపు తెచ్చిన రోజు. తెలుగు వారందరికీ చరిత్రాత్మకమైన రోజు. ఉత్తరాది వారు మనల్ని మద్రాసీలు, సాంబారు గాళ్ళు అని గేలి చేసే వారు (ఇప్పటికీ చేస్తూనే ఉంటారు) తెలుగు భాషమాట్లాడే వారందరి కోసం రాష్ట్రం కావాలని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పడడానికి అసువులు బాసిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి దేశ రాష్ట్రాల పట్టికలో ఆంధ్ర అనే పదం ఉంటే అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఉండి, అగ్రస్థానంలో ఉంటుందని తద్వారా ఎక్కువ గుర్తింపు ప్రయోజనం ఉంటుందని ఎంతో ముందు చూపుతో తమ పదవులను సైతం తృణప్రాయంగా ఆశించిన బూర్గుల రామ కృష్ణా రావు గారి లాంటి ఎందఱో మహనీయులు ఎన్నెన్నో త్యాగాలు చేసారు. రాష్ట్రాలు ఏర్పడవచ్చు విడిపోవచ్చు కానీ వాటి ఏర్పాటుకు కారణ భూతులయిన,మూలపురుషులయిన మహనీయులను స్మరించుకోవడం, వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం ప్రతి ఒక్క తెలుగు వాడి కృతజ్ఞతా పూర్వక కర్తవ్యం! ఈ సందర్భంగా
శ్రీ సామవేదం జానకిరామ శర్మ గారి కవితను నివాళిగా అర్పిద్దాం!
అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల.
ఆంధ్ర రాష్ట్రం అంటే అర్ధం:-
ఆం - అందరినీ
ధ్ర - ధృడమైన విశ్వాసముతో ...
రాష్ట్రం - అందరినీ ప్రేమించే రాష్ట్రం.
                                                    __/i\__

కార్తిక పురాణం1రోజు


విస్సా ఫౌండేషన్ బ్లాగ్ సందర్సక బంధుమిత్రులకు శుభోదయం! 
ఈ రోజు నుంచి శ్రీ కార్తిక మాస పుణ్యకాలం శివ కేశవారధనతో పునీతులమవుదాం! అయితే ఎన్నో చెయ్యాలని ఉంటుంది, ఎన్నో సందేహాలు ఏమిచెయ్యాలి? భక్తి సమాచారం సౌజన్యంతో ఎలాచేయ్యాలి? ఈ కార్తీక పురాణం ప్రతి రోజు చదివి పునీతులమవుదాం!..తెలుసుకోండి ఆచరించండి. తరించండి. సత్యసాయి విస్సా ఫౌండేషన్.  
కార్తిక పురాణం
కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిశారణ్య ములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.

ఒకనాడు శౌనికాది మునులు గురుతుల్యుడగు సుతునిగాంచి" " ఆర్యా! తమ వలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహాస్యములు సంగ్రహముగ గ్రహించినాము. కార్తీకమాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరావ్రతమును వివరించవలసినది" అని కోరిరి. అంత నా సూతమహర్షి " ఓ మునిపుంగవు లారా! ఒకప్పుడు యీదే కోరికను నారదుడు సృష్టి కర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి- విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సా౦బశివుడు పార్వతీదేవికి తెలియ చేసిన విదముగా నా గాథను వివరించెను.అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు కలుగుటయే గాక, యీహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రదగానాలకింపు " డని యిట్లు చెప్పెను.

పూర్వ మొకానొక దిన౦బున పార్వతి పరమేశ్వరులు గగన౦బున విహరించుచుండగా పార్వతి దేవి " ప్రాణేశ్వర సక లైశ్వర్యములు కలుగ చేయునట్టిది , సకల మానవులు వర్ణ  భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు నాచరింపబడేడిది యగు వ్రతమును వివరింపు"డని కోరెను.అంతట మహేశుడు మందహాసమొనరించి " దేవి ! నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమును చెప్పబడియున్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు. చూడు, మా మిథిలా  నగరమువైపు"అని మిథిలానగరపు దిశగా చూపించెను.

అట, మిథిలానగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొని' మహాయోగి!మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేశము పవిత్రమైనది. తమరిచటికేల వచ్చితిరో సెలవొసంగు' డని వేడుకొనెను. అందులకు వశిష్టుడు - జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము, నిన్నడిగి  క్రతువు ప్రారంభి౦చమని నిశ్చయి౦చి యిటు వచ్చితిని-అని పలుకగా జనకుడు" మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరి౦పుడు. కానీ, చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్న! సంవ త్సరములో  గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి  వివరించవలసివున్నది" యని ప్రార్ధి౦చెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి" రాజ! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది . ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నాన౦ద దాయకమైనది. అ౦తియే గాక వినినంత మాత్రముననే యెట్టి నరక బాధలును లేక యీహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్దగా ఆలకింపు'మని యిట్లు చెప్పసాగెను .

వశిష్టుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట

ఓ మిథిలేశ్వర! జనక మహారాజ! ఏమానవుడైనాను యే వయసువాడైనను " ఉచ్చ- నీచ' అనే భేదములేక కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశి య౦దుడగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి ,  దానధర్మములను, దేవతపూజలను చేసినచో - దాని వలన ఆగణిత పుణ్యఫలము లబించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డ వలెను. ముందుగా కార్తిక మాసమునునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి " ఓ దామోదర నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలెను.

కార్తిక స్థాన విదానము
ఓ రాజ! యీ వ్రత మాచరి౦చు దినములలో సుర్యోదయమునకు పుర్వమేలేచి కాలకృత్యములు తీర్చుకొని, నదికిబోయీ స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ , పరమేశ్వరునకు, బైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యపాదన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్ళు పోయవలెను. ఈకార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమునా మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తనే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప , నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, గంధము తీసి భగవంతునికి సమర్పించి తను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిది అభాగ్యతులను పూజించి వారికి ప్రసాద మిడి, తన యింటి వద్దగానీ,దేవాలయములో , లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని విష్ణాలయమందుగాని తులసికోట వద్ద గాని , దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను. ఈ విధ ముగా వత్త్రమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును , ప్రస్తుత  జన్మమందును చేసిన పాపమూ పోయి మోక్షమునకు ఆర్హులగుదురు . ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి , వారికి నమస్కరించినచొ వారికి కూడా తత్సమాన ఫలముదక్కును .

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమ౦దలి
మొదటి అధ్యాయము - మొదటి రోజు పారాయణము సమాప్తం
శ్లో ఓమిత్యే కక్షార౦  బ్రహ్మవ్యాహరితి త్రయశిఖ:
తాసై తరాత్మ నే మేతదశినముర్తాయే నమ:

Sunday, October 30, 2016

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళినాడు లక్ష్మీదేవినే ఎందుకు పూజిస్తుంటాం ?

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళినాడు లక్ష్మీదేవినే ఎందుకు పూజిస్తుంటాం ? తమసోమా జ్యోతిర్గమయ - తమస్సు అంటే చీకటి అనీ, అజ్ఞానం అనీ అర్ధం. చీకట్లు పోగొట్టే దీపం లాంటిదే అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞాన జ్యోతి కూడా.మన పూర్వికులు దీపాన్ని దైవంతో పోలుస్తూ " దీపం జ్యోతి పరబ్రహ్మ" అని చెప్పటం జరిగింది. 'భా' అనగా కాంతి. 'రత ' అంటే ఇష్టం గలవారు.కాబట్టి భారతీయులు అంటే కాంతికి, జ్ఞానానికి విలువనిచ్చేవారని అర్ధం. ఏకార్యక్రమమైనా దీపోజ్వలనం తో మొదలుపెట్టటం మన ఆనవాయితీ. వెలుగుతూవుం డే దీపంలో తాను కొలువుంటానని మహాలక్ష్మీదేవి శెలవిచ్చింది. దీపం ఆతల్లి ప్రతిరూపం అని అంటారు. దీపావళి రోజున అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపాలను వెలిగిస్తాం. దీపావళి రోజున దీపకాంతులతో ఏగృహము అయితే కాంతిభరితంగా వుంటుందో ఆగ్రుహం లక్ష్మీనిలయముగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెపుతూవుంటారు. దీపానికి నమస్ఖరిస్తే అది లక్ష్మీదేవికి నమస్ఖరించినట్లే.దీపావళినాడు లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.మన దేశంలోని అన్ని ప్రాంతాలవారు దీపావళి సాయంత్రం కొత్తవస్త్రాలు ధరించి దీపాలను వెలిగించి ధనలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవికి పెట్టిన ప్రసాదాన్ని తాము, తమ కుటుంబం వారు స్వీకరించడమే గాక యిరుగుపొరుగు వారికీ, బంధు మిత్రులకి పంచటం ఆచారంగా వస్తున్నది. శుభప్రదమైన దీపాల శోభతో మెరిసే ముంగిల్లతో నున్న మీ నట్టింట్లో ఈ దీపావళి అనంతమైన ఆనందాలను నింపాలని కోరుకొంటున్నాము.  నాగమణి విస్సా.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు



దీపావళి శుభాకాంక్షలు!...సత్యసాయి విస్సా ఫౌండేషన్.

మీకు, మీ కుటుంబసభ్యులకు, తెలుగుమిత్రులందరికీ, ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు!శుభాభివందనాలు!! దీపావళి శుభాకాంక్షలతో...దీపావళి నాడు ఏమిచెయ్యాలి? ఎలా జరుపుకోవాలి?  ఈ శుభవేళ మీకోసం ...'విచిత్రబంధం' చలన చిత్రం లోని "చీకటి వెలుగుల రంగేళి"  ఈ అద్భుత గీతాన్నిఈ దిగువన లంకె పై నొక్కి చూడండి ఆస్వాదించండి.. సత్యసాయి విస్సా ఫౌండేషన్. 
https://www.youtube.com/watch?v=buhFHTTOkXg








Saturday, October 29, 2016

ఇహం పరం జ్యోతిర్మయం! దీపావళి దీపాల పండుగ. ..

ఇహం పరం జ్యోతిర్మయం!  ఈనాడు ఎడిటోరియల్   30-10-2016
దీపావళి దీపాల పండుగ. దీపం పరబ్రహ్మ స్వరూపం. అది వెలుగుకు మూలం. వికాసానికి సంకేతం. ‘దీపం తమస్సును సమూలంగా నిర్మూలిస్తుంది’ అన్నది వైదిక భావన, శుభ దీవెన. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం. ‘చీకటి నుండి వెల్గులకు జీవనయానము సాగగా వలెన్‌’ అని రుషులు ఆకాంక్షించారు. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, దుఃఖం నుంచి ఆనందానికి, నిరాశ లోంచి గట్టి ఆశాభావంలోకి చేరాలన్న మనిషి నిరంతర తపనకు దీప ప్రకాశనం మంగళకరమైన ప్రతీకగా పెద్దలు భావించారు. ‘గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు’ అంటూ కవులు ధైర్యం చెప్పారంటే- దాన్ని గట్టిగా నమ్మబట్టే! ‘దీపావళి దీపావళి దీపావళి యంచు పల్క- ధీమంతులకున్‌... దీపసముదాయం లోంచి జ్ఞాన వికాసం పొడగడుతుంది’ అనడానికి కారణం అదే! నిజానికి దీపం లక్ష్యమే అది. భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఆవరణలను జ్యోతిర్మయం గావించేదే దీపావళి పండుగ! ‘దీపము జ్ఞానదీపమై చీకటి దూరమౌట సుఖజీవన సారమటంచు ఎరుంగరే’ అన్న కవుల హితబోధను మనం ఆ కోణంలోంచే అర్థం చేసుకోవాలి. కృష్ణదేవరాయల కాలంలో దీపావళిని ‘లక్ష్మీ ఉత్సవం’గా జరుపుకొనేవారని సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాహిత్య చరిత్ర’లో పేర్కొన్నారు. దీన్నిబట్టి దీపకాంతులకు వారు ఎంతటి పవిత్రతను ఆపాదించారో మనకు తెలుస్తుంది. కాంతిమంతమైన నవీన విద్యుద్దీపావిష్కారం జరిగినా, ఇప్పటికీ సభాసంప్రదాయంలో జ్యోతిప్రకాశనం శుభారంభ సూచనగా నిలిచిపోవడంలో రహస్యం అదే! పుట్టినరోజున దీపాలార్పడాన్ని మనవాళ్ళు గట్టిగానే నిరసించారు. ‘దీపమార్పుచున్‌ షోకులవేల? జన్మదిన శోభనవేళల అమంగళంబుగన్‌’ అని ప్రశ్నించారు. నోటితో దీపాన్ని వూదేయడం అశుభమని మనవారి నమ్మకం.
దీపావళి ముందురోజు నరకచతుర్దశి. నరకాసురుడు మరణించినరోజుగా దాన్ని భావిస్తారు. భాగవతం దశమస్కంధంలోని ఈ కథ పోతన పుణ్యమా అని బాగా ప్రసిద్ధికెక్కింది. నరకుడు లోక కంటకుడయ్యేసరికి కృష్ణుడు- నరకాసుర సంహారానికై బయలుదేరాడు. ‘నీ మానిత బాహుదుర్గముల మాటున ఉండగ ఏమిశంక? నీతో అరుదెంతు’ అంది సత్య. యుద్ధంలో కృష్ణుడు గాయపడ్డాడు. వెంటనే ‘వేణింజొల్లెము వెట్టి(జుట్టు ముడిపెట్టి) సంఘటిత నీవీబంధయై(కోకచుట్టి)’ సత్య నరకుడితో తలపడింది. ‘వీరశృంగార భయరౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యెనో’ అన్నట్లుగా విజృంభించింది. ‘జ్యావల్లీ(వింటితాడు) ధ్వని గర్జనంబుగ సురల్‌ సారంగ యూధంబుగా... అలినీలాలక చూడ నొప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో’ అంటూ పోతన లోకోత్తరంగా వర్ణించాడు. చివరకు నరకుడు కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. ‘అమర్త్యులు మునులున్‌ మింటన్‌ పువ్వులు కురియుచు’ పండుగ చేసుకున్నారు. దరిమిలా నరకుడు మరణించిన ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరకచతుర్దశిగాను, విజయోత్సవాలు జరిగిన తరవాతి రోజు దీపావళి పండుగగాను మారిపోయాయి. వాస్తవానికి చతుర్దశిని ‘దీపరాత్రి’గా ఆరాధించడం కృష్ణుడికన్నా ఎంతో ముందే ఉంది. పితృదేవతలు తరించాలన్న కోరికతో స్వర్గం దిశగా దీపాలు చూపిస్తూ దీపదానాలు చేయాలని వామన పురాణం ఏనాడో చెప్పింది. సంతానానికో దారి చూపించిన పెద్దలు ఏ చీకటి లోకాల్లోనో మార్గం తోచక తపిస్తున్నారేమోనని ప్రేమతో స్వర్గానికి తోవ చూపించడాన్ని మానవీయ కోణంలోంచి ఆలోచిస్తే, వామన పురాణ వాక్కులోని ఉదాత్తత బోధపడుతుంది. వైజయంతీ విలాసంలో ‘దీపము భవహరము శుభంకరము’ అన్న పలుకుల ప్రాశస్త్యం తెలుస్తుంది. ‘నరక భయాన్ని పోగొట్టే చతుర్దశి’గా నరకచతుర్దశిని ధర్మశాస్త్రాలు వ్యాఖ్యానించడంలోని ప్రామాణికత అర్థమవుతుంది. ‘సంతానము దీపధారులయి తాపము తీర్చిరి నాక(స్వర్గ)మందగా’ అని పితృదేవతలు సంతృప్తి చెందడంవల్ల నరకచతుర్దశి పండుగ అవుతుంది. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న ప్రార్థన స్వర్గస్థులైన పెద్దలకు సైతం వర్తింపజేయడం దానికి కారణం.
పితృదేవతలకు వెలుతురు చూపించేందుకు దీపాలు, కాగడాలు వెలిగించే సంప్రదాయమే క్రమంగా మతాబులు కాల్చడంగా మారిందంటారు. అక్కడితో ఆగితే బాగుండేది. దాసు శ్రీరాములు చెప్పినట్లు ‘ఉద్భటముగ ఢమ్ము ఢామ్మను తుపాకులవెన్ని మతాబులెన్ని పిక్కటిలెడు ఝల్లులెన్ని మరి కాకరపూవతులెన్ని గాల్తురో’ లెక్కే లేకుండా పోయింది. భారీ శబ్దాల బాణసంచా పేలుళ్ళతో తీవ్ర ధ్వని, వాయు కాలుష్యాలకు దీపావళి నెలవైంది. ‘దిబ్బు దిబ్బు దీపావళి...’ కాస్తా డబ్బు డబ్బు దీపావళిగా మారి పర్యావరణానికి చేటయింది. మామూలు మనిషికి చేదయింది. ఆర్భాటాలు పెరిగిపోయాయి. ‘ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ మతః శాంతిం ప్రయచ్ఛమే’ అనే ప్రార్థనతో దీపాలు వెలిగించి ఇహపరాలను జ్యోతిర్మయం చేయాలన్న పెద్దల మౌలిక ఆలోచనలను ఈ జాతి విస్మరించింది. ‘తైలంలేని వత్తిని ఏ అగ్గిపుల్లా వరించదు’ అన్నట్లుగా తైలం(ధనం) లేని వ్యక్తిని దీపావళి వరించడమే లేదు. ‘కుప్పనూర్చుట పొల్లు కొరకా, కూడు వండుట గంజి కొరకా?’ అన్న ‘నార్లమాట’ను గుర్తుకు తెస్తోంది. ‘ఈ గడ్డునాళ్ళలో పండుగ పండుగంచు గుదిబండగ దండిగ కైతలల్లి వేదండమునెక్కి(ఏనుగునెక్కి) చాటినను దండగ’ అని కవులు తీర్మానిస్తున్నారు. పండుగరోజుల్లో పెద్దలు నిర్దేశించిన విధివిధానాల వెనక మన సంస్కృతీ బీజాలున్నాయి. వారి ఆలోచనల వెనక చరిత్ర ముందుచూపు అంతరార్థాలు పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మరిచిపోతే పండుగ పరమ లక్ష్యమే మసకబారి బాణసంచా నుసి మిగులుతుంది. ‘పరబ్రహ్మ స్వరూపమైన ఓ దీపమా! ధీయోయోనః ప్రచోదయాత్‌’ అంటూ వేడుకోవడం మినహా చేసేదేం లేదేమో... ‘దీపేన సాధ్యతేసర్వం’ అన్నారుగా... చూద్దాం!

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే?

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే?
సంపదలకు అధినేత్రి శ్రీ మ‌హాల‌క్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు.ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. శుచి, శుభ్రత, నిజాయతీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు, హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. హనుమంతుడికి భవిష్యత్‌ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం, పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇంటికి సిరి ఇల్లాలు ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడి పెడితే ల‌క్ష్మి వెళ్లిపోతుంది. అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో పఠించిన కనకధార స్తోత్రాం, లక్ష్మీదేవిఅష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. మనకున్న దానిలో దానం చేయాలి ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.

Total Pageviews