Sunday, December 4, 2016

పెద్దలమాట చద్దిమూట


సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు!!!


సుబ్రహ్మణ్య షష్ఠి దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజు ఈరోజు. సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు.  ఈరోజును  పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు.శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఈనాడు ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.   తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది.

స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు వాటి అర్ధాలు తెలుసుకుందాం!!
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ - తమిళం లో పిలుస్తారు.

అందరికి ఆ స్వామి అనుగ్రహం కలిగి సుఖంగా ఉండాలని కోరుకొంటూ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు!!!

సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు! పర్వదినం దివ్య విశేషాలు తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!!

 సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం శుభాకాంక్షలు!  ఆ స్వామి యొక్క దివ్య విశేషాలు తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!! ఇది చదవండి
ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. "సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి" అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.
అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.
తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.
సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.
ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.
సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి? అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది. ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వత్రంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి.
సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది.
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్
హే స్వామినాథ కరుణాకర దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవ గణపూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
దేవాది దేవసుత దేవ గణాధినాథ!
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
నిత్యాన్నదాన నిరతాఖిల రోగాహారిన్!
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
క్రౌంచా సురేంద్ర పరి ఖండన శక్తి శూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపానే
శ్రీ కుండలీశ ధృతతుండ షిఖీస్ట్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
దేవాదిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠనగరం దృడ చాపహస్తమ్
శూలం నిహత్య సురకోటి భిరీడ్యమాన!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
హారాది రత్న మణియుక్త కిరీట హార!
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయీ మర బృంద
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
పంచాక్షరాది మనుమంత్రిత గాజ్ఞతోయై పంచామృతై:
ప్రముదితేన్ద్ర ముఖైర్మునీంద్రై:
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా!
కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్
భక్త్వా తు మా మవ కళాధర కాంతికన్త్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
ఫలశృతి
సుబ్రహ్మణ్య కరావలంబమ్ పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదత:
సుబ్రహ్మణ్య కరావలంబమ్ ఇదం ప్రాతరుత్థాయ య: పఠేత్
కోటి జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి
మరిన్ని విశేషాలు కొరకు ఈ దిగువ లింక్ మీద నొక్కి మరిన్ని విశేషాలు చదవండి.
http://www.teluguone.com/devotional/content/subrahmanya-sashti-is-the-birthday-of-lord-subrahmanyaswamy-1309-25720.html

సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం ఈ సందర్భంలో గతంలో శ్రీ సత్యసాయి బాబావారు ఆలపించిన సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖ నాధా సుబ్రహ్మణ్యం భజన వినండి పిల్లలు, పెద్దలు ఈభజన ఆలపించండి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందండి.



బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సుబ్రహ్మణ్యప్రవచనం ఈ  లింక్ పై క్లిక్ చేసి వినండి 
https://www.youtube.com/watch?v=01OVLq5Vrlw

Saturday, December 3, 2016

కందిపప్పు పచ్చడి ఎలా తింటే బాగుంటుంది...Virabhadra Sastri Kalanadhabhatta


కందిపప్పు పచ్చడి ఎలా తింటే బాగుంటుంది! అని శ్రీ గోటేటి వెంకటేశ్వరరావుగారి సూచనపై నాస్పందన 
ఇక్కడే చిన్న మార్పిడి చేద్దాం
ముందు కూర అన్నం తింటే కందిపప్పు పచ్చడి మోతాదు తగ్గదూ?
కనుక అరవ వాళ్ళు సాంబారు ముందుగా అన్నంలో పోసుకొని దాంతోటే కూర పచ్చడి వగైరాలు తినేసి చివర్లో తైరు సాదం అనగా పెరు అన్నం తింటారు 
అల్లా కందిపప్పు పచ్చడి ముందుగా అన్నంలో కలుపుకొని దానిపైన పురిషెడు కరిగిన ఘుమఘుమలాడే నెయ్యివేసుకొని ఆకలిపిన అన్నంతోబాటే ఒక సారి ఉల్లిపాయ తీపి పులుసు, మరొకసారి కూర ఇంకొకసారి ఉల్లావకాయ ఇత్యాది దినుసులతో తింటే
అది అహో అద్భుతం కదండీ
ఇక్కడ తమకో చిన్న ఉపాఖ్యానంమనవిచేస్తా (ఇది నేను ఏభై సంవత్సరాలక్రితంవిన్న సంఘటన కల్పితమేమో మరి)
ఒక బ్రాహ్మణ బడిపంతులు ఇస్కూలుతణిఖీకి వచ్చిన ఇనస్పెక్టరుగారిని (ఆయనా బ్రాహ్మణుడే) ఆరాత్రికి తనయింట్లో భోజనం ఏర్పాటుచేసాడు
పల్లెటూరుకదా. నో హోటల్స్
అందుకని ముందుగా ఒక కుర్రాణ్ణి యింటికి పంపి భార్యను రాత్రికి కందిపచ్చడి, బెల్లం వేసి వంకాయ పులుసుపచ్చడి చెయ్యమని పురమాయిస్తాడు.
సరే రాత్రికి ఇద్దరూ భోజనానికి ఉపక్రమించి పంతులు భార్య చాటుగా చేసే సంకేతనలు గమనించకుండా కొసరి కొసరి కందిపప్పు పచ్చడి వేయమని వంకాయ పులుసు పచ్చడితో మొత్తం ఖతం చేసేసారు ఇద్దరూ కలిసి
చీకటిగావుంది. అందుకని ఇనస్పెక్టరుగార్ని దొడ్డిగుమ్మందగ్గరే వున్న కాకరపాదులో చెయ్యికడుక్కోమని తీసుకు వెళ్ళి తను కొంచేందూరంలోవున్న దొండపాదుదగ్గరకి వెళ్తాడు పంతులు .
అక్కడ రోజూ ఇతగాడే చేయికడుక్కోవడం ఆనవాయితీ
ఇకపోతే భార్యకు కూడా కందిపప్పు పచ్చడి అంటే ఎంతో ఇష్టం. తనకు మిగల్చకుండా అంతా తినేసారని అసలే కోపంతో రగిలిపోతున్న భార్య దొడ్డి గుమ్మందగ్గరకు వెళ్ళి మొగుడనుకొని ఇనస్పెక్టరుగారి చెవిపట్టుకొని
ఏం నాక్కూడా కందిపప్పు పచ్చడి ఇష్టం అనితెలిసీ కూడా నాకు మిగల్చకుండా మొత్తం తినేస్తారా అంది
పాపం ఇన్స్పెక్టరుగారు బాధతో విలవిల్లాడిపోతూ పొరపాటమ్మా రుచిగావుందని తినేసాను తప్పైపోయింది అన్నాడు.
తరువాత ఏంజరిగిందో వ్రాయడానికి కంప్యూటరుమీద నావ్రేళ్ళు సహకరించడంలేదు. మొద్దుబారిపోయాయి.

Friday, December 2, 2016

సాహిత్యం-రసాస్వాదన పద్ధతులు. Vadrevu Ch Veerabhadrudu

కాకినాడ వెళ్ళినప్పుడు ఆదివారం పొద్దున్న కొంతమంది మిత్రులు ఒక కథాగోష్టి పెట్టుకున్నారు. పిఠాపురం వెళ్ళేదారిలో తిమ్మాపురం దగ్గర ఒక మామిడితోటలో కూచుని కథలెలా చదవాలో చెప్పమని అడిగారు నన్ను.
బావుంది, మామూలుగా, కథలెలా రాయాలో చెప్పమని అడిగేవాళ్ళున్నారుగాని, కథలెలా చదవాలో చెప్పమని అడిగినవాళ్ళు అరుదు.
ఒకప్పుడు సాహిత్యాస్వాదన చిన్నచిన్న బృందాల్లోనూ, గురుకులాల్లోనూ జరిగేది. గొప్ప గురువులు తమ శిష్యులకి అన్నిటికన్నా ముందు ఒక కావ్యాన్నెట్లా చదవాలో చెప్పేవారు. పిల్లవాడు విద్యాభ్యాసం మొదలుపెట్టగానే మేఘసందేశంలో కొన్ని శ్లోకాలో, రఘువంశంలో ఒకటి రెండు సర్గలో మాత్రమే గురువు బోధించేవాడు. అట్లా బోధించేటప్పుడు, వ్యాకరణమో, అలంకారమో, రసమో కాదు, అసలు ఒక పద్యమెట్లా చదవాలో నేర్పేవాడు. ఆ తర్వాత తక్కిందంతా ఆ విద్యార్థి తానే స్వయంగా సాధించుకోవలసి ఉండేది.
ఆధునిక కాలంలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తరువాత,

సాహిత్యం సార్వజనీనం అయినతరువాత, రచనలైతే అందుబాటులోకి వచ్చాయిగాని, రసాస్వాదన పద్ధతులు బోధించేవాళ్ళు కరువై పోయారు. పాఠశాలల్లో భాషలు బోధించవలసిన ఉపాధ్యాయులకు కూడా అట్లాంటి పద్ధతులు తెలియకుండానే ఉపాధ్యాయశిక్షణ పూర్తి చేసుకుంటున్నందువల్ల వాళ్ళనుంచి మనం ఆశించగలిగేది కూడా ఏమీ లేకపోయింది.
ఉదాహరణకి ఒక హైస్కూలు భాషాపండితుడు, తెలుగులోగానీ, ఇంగ్లీషులోగానీ, హిందీలోగానీ నన్నయదో, కీట్స్ దో, కబీరుదో ఒక పద్యాన్ని ఇప్పుడు బోధించే పద్ధతి ఏమిటి? బహుశా ఆ కవిత ఒకటికి రెండు సార్లు చదివి వినిపిస్తాడు, ప్రతిపదార్థ తాత్పర్యాలు చేప్తాడు. కఠినపదాలకి అర్థాలు చెప్తాడు. వ్యాకరణాంశాలు, సమాసాలూ, అలంకారాలు వివరిస్తాడు. ఆ పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయిస్తాడు. ఇంతేకదా! (కాని, ఈ కనీస కార్యక్రమమైనా ఎన్ని పాఠశాలల్లో జరుగుతోందన్నది అనుమానమే).
కాని పూర్వకాలపు గురువులు తమ ఇంట్లోనో, గురుకులంలోనో బోధించే పద్ధతి ఇలా ఉండేది కాదు. వాళ్ళు ఒక పద్యాన్ని శిష్యులకి చెప్పేటప్పుడు, అన్వయక్రమం, వ్యాకరణం, అలంకారాల్ని వివరించడంతో ఆగిపోయేవారు కారు. అవి ప్రాథమిక సామగ్రి. వారు నిజంగా బోధించేది అక్కణ్ణుంచే మొదలయ్యేది. భారతదేశంలోనే కాదు, రినైజాన్సుకాలంలో గ్రీకు క్లాసిక్సు చదవడానికీ, చైనాలో కన్ ఫ్యూసియస్ గ్రంథాల్ని అధ్యయనం చేయడానికి, మధ్యాసియాలో పారశీక వీరగాథలు చదవడానికీ కూడా పాటించింది దాదాపు అట్లాంటి పద్ధతుల్నే.
ఆ రోజు కాకినాడలో ఆ చిన్న గోష్టిలో నేను ఆ పద్ధతుల ప్రకారం ఒక కథ చదివించే ప్రయోగం చేసాను. అట్లా చదవడానికి ఆరు సూత్రాలు వాళ్ళకి పరిచయం చేసాను.
ఆ మిత్రబృందం చేతుల్లో సుప్రసిద్ధ ఇటాలియన్ నాటక కర్త,నోబెల్ బహుమతి స్వీకర్త లూగీ పిరాండెల్లో (1867-1936) రాసిన 'యుద్ధం ' (War) పెట్టబోయే ముందు వారికి మొదటి సూత్రం పరిచయం చేసాను:
_______________
'ఊహించండి' (Predict):
_______________
• ఈ కథ దేనిగురించి అయిఉండవచ్చు?
• దీనిద్వారా మీకెటువంటి భావాలు పరిచయం కాగలవనుకుంటున్నారు?
• ఈ కథని నేను ఎందుకు పరిచయం చేస్తూండవచ్చు?
• మీరు పద్మరాజు గారి 'గాలివాన 'చదివి వచ్చారు కదా, ఆ కథకీ, ఈ కథకీ ఏదైనా సంబంధం ఉండవచ్చనుకుంటున్నారా?
• మీరు కథ చదవడం మొదలుపెట్టాక కూడా మధ్యమధ్యలో ఆగి ఆగి ప్రశ్నించుకుంటూ ఉండండి. తర్వాత ఏమి సంభవించవచ్చు?
• కథని ఎట్లా ముగించబోవచ్చు?
వాళ్ళంతా ఇరవై నిమిషాల పాటు ఆ కథ చాలా శ్రద్ధగా చదివారు. కాని చేతిలో ఒక పెన్సిలు లేకుండా, పక్కన చిన్న నోటు పుస్తకం లేకుండా సాహిత్యం చదవడం తాను ఊహించలేనని అకిరా కురసోవా అన్నాడు. ఆ మాటలు గుర్తు చేసాను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళల్లో ఒకరిద్దరిదగ్గర తప్ప మరెవరిదగ్గరా పెన్నుగాని, పెన్సిలు గాని కనిపించలేదు.
వాళ్ళు చదవడం పూర్తిచేసాక, మరొక నాలుగు సూత్రాలు పరిచయం చేసాను:
_________________
'ప్రశ్నించండి' (Question)
_________________
• ఈ కథ లో రచయిత ఏం చెప్పాలనుకున్నాడు?
• యుద్ధం గురించి చెప్పడానికి రైలు బోగీ ఎందుకు ఎంచుకున్నాడు?
• ప్రతి పాత్రనీ ఎందుకట్లా ఎంచుకున్నాడు? ఆ పద్ధతిలోనే ఎందుకు పరిచయం చేసాడు?
• కథ రోం లో ఎందుకు మొదలైంది? వెనిస్ లో ఎందుకు మొదలవలేదు?
• రచయిత మనతో పంచుకోవాలనుకున్న భావం పూర్తిగా మనతో పంచుకోగలిగాడా?
• ఈ కథ మనం జీవితంలో ఎదుర్కొనే ఏ ప్రశ్నల్ని లేవనెత్తుతోంది?
• ఆ ప్రశ్నల్ని కథకుడు సరిగానే గుర్తుపట్టాడనుకుంటున్నారా?
• ఇందులో కథకుడు వాచ్యంగా చెప్పకుండా సూక్ష్మంగా చెప్పిన సత్యమేదైనా ఉందా?
• ఈ కథ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందా? లేక రచయిత ఊహాగానమా?
• కథ వాస్తవంగానూ, స్వాభావికంగానూ చెప్పాడనుకుంటున్నారా? అయితే ఎందుకని?
• ఈ రచన గొప్ప రచన అని మీకు అనిపిస్తోందా?
• పదేళ్ళ తర్వాత కూడా ఈ కథ మీకు గుర్తుంటుందా? ఎందుకు?
________________________
'మనసులో చిత్రించుకోండి' (Visualize)
________________________
• ఈ కథలో ఏ ఘట్టం మీ కళ్ళకి కట్టినట్టు అనిపించింది?
• ఏ పాత్ర మీకు విస్పష్టంగా కనబడింది?
• కథ చదవగానే మీకు ఆ స్థలం,ఆ టైమూ, ఆ వాతావరణం కళ్ళముందు కనిపించాయా? అయితే ఏ వర్ణన, ఏ విశేషణం, ఏ మెటఫర్ మీకు బాగా ఉపయోగపడ్డాయి?
• దీన్నెవరైనా నాటకంగానో, సినిమాగానో చూపించాలనుకుంటే, మీరు మనసులో చిత్రించుకున్నదానికన్నా బాగా చూపించగలరా?
_______________________________
'ఒకదాన్నొకటి కలుపుకుని చూడండి'' (Connect)
_______________________________
• ఈ కథ చదవగానే మీకిట్లాంటి కథలేవైనా గుర్తొచ్చాయా? సినిమాలు? (సాహిత్యంలో ప్రతి రచనా తనకన్నా పూర్వపు రచనలతోనూ, తన సమకాలిక రచనలతోనూ అల్లుకునే ఉంటుంది. ఆ అల్లికని intertextuality అంటారు. ఒక రచనలో అంతర్వాహినిగా ఉన్న అనేక రచనల్ని గుర్తుపట్టగలగడం గొప్ప సాహిత్యవిద్యార్థి లక్షణం)
• ఈ కథ చదవగానే మీ జీవితంలోనో, మీకు తెలిసినవాళ్ళ జీవితాల్లోనో ఇట్లాంటి అనుభవాలేవైనా మీరు విన్నవి గుర్తొచ్చాయా?
• ఈ కథలో ఏ పదప్రయోగం, ఏ విశేషణం, ఏ రూపకాలంకారం మీకు ఎక్కువ నచ్చింది? ఎందుకు నచ్చింది? అందుకు కారణాలు గుర్తుపట్టగలరా?
• ఏ పాత్ర మీకు ఎక్కువ సన్నిహితంగా తోచింది?
• ఇందులో మీకు నచ్చిన అంశమేది? ఎందుకు నచ్చింది?
• నచ్చనిదేది? ఎందుకు నచ్చలేదు?
• ఈ కథ చదివాక మీలో ఏదైనా మార్పు వచ్చిందా? లేదా రాగలదనుకుంటున్నారా?
________________
'గమనించండి' (Monitor)
________________
• ఈ కథలో మీకు అర్థం కాని భాగం, అంశం ఏదైనా ఉందా?
• కఠినపదాలు ఏవైనా కనిపించాయా?
• కథసారాంశాన్ని పట్టిచ్చే కీలక పదం లేదా వాక్యం ఏదై ఉండవచ్చు?
• కథ ఎక్కడ మొదలయిందనుకుంటున్నారు? (అంటే, మీరు సరిగ్గా ఏ బిందువు దగ్గర కథలోకి మానసైకంగా ప్రవేశించారు?)
• కథ ఎక్కడ మలుపు తిరిగింది?
• కథ ఎక్కడ ముగిసిందనుకుంటున్నారు?
• ఆ ముగింపు సరైనదేనా?
• కథ పూర్తి చేసాక మీకేమైనా అసంతృప్తిగా అనిపించిందా? అయితే ఎందుకనిపించింది?
ఈ నాలుగు సూత్రాల ప్రకారం చాలాసేపే చర్చ జరిగాక, చివరగా ఆరవసూత్రం పరిచయం చేసాను:
_______________________
'సంక్షిప్తంగా చెప్పండి' (Summarize)
_______________________
• ఈ కథ దేనిగురించో ఒక్క వాక్యంలో చెప్పండి (పూరకాలపు నీతికథల్లో చివర 'నీతి ' అని ఒక వాక్యముండేది. ఆధునికకథలో అట్లాంటి వాక్యం రచయిత రాయడుగాని, పాఠకుడు తనకై తాను చెప్పుకోవలసి ఉంటుంది).
• ఈ కథలో ఇతివృత్తమేమిటో మీ మిత్రుడికి రెండు వాక్యాల్లో చెప్పండి.
• ఈ కథని మీరు ఇంతకన్నా బాగా రాయగలరా?
• ఈ కథ ఎక్కడ ఆగిపోయింది? అక్కణ్ణుంచి మొదలుపెట్టి మీరో కథ చెప్పగలరా? అట్లా ఎవరేనా ఏదైనా కథ రాసారా?
• ఈ కథనే మీరు రచయిత దృక్పథంలోంచి కాకుండా, ఇందులో ఏదైనా పాత్ర దృక్పథం నుంచి మళ్ళా చెప్పగలరా?
ఇక చివరి ప్రశ్న:
• మొదటి సూత్రం గుర్తు చేసుకోండి. కథ చదివే ముందు మీరు ఈ కథ గురించి కొంత ఊహ చేసారు. కథ చదివారు కదా? మీ ఊహలు ఎంతమేరకు సరిపోయాయి?
లూగీ పిరాండెల్లో కథ మీద చర్చ పూర్తికాగానే, ఈ ఆరుసూత్రాల ప్రకారం వాళ్ళతో 'గాలివాన ' కథ గురించి మాట్లాడించేను.
నా ప్రయోగం చాలామేరకు ఫలించిందనే అనిపించింది.
______________________________________________
ఈ కథ చదవాలనుకుంటే https://www.scribd.com/document/333050390/Yuddham క్లిక్ చేయండి

Thursday, December 1, 2016

నలభై జబ్బులను దూరం చేసుకోండి.

ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి ….. నలభై జబ్బులను దూరం చేసుకోండి
• నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారమునందు ప్రతిదినము నియమపూర్వకంగా తినినచో జీవశక్తి,
ఆయుర్దాయము పెరుగును.
• ప్రతిరోజూ వామురసము పుచ్చుకొనుచుంటే గుండెనొప్పి హరించును.
• రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతీ ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మపండ్ల రసం తీసుకుంటే రక్త వృద్ధి, శుద్ధి అగును.
• పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరువాత పట్టుతేనెలో నానబెట్టి 6 మాసములు ఊరిన తర్వాత రోజూ ఒకటి తినుచుండిన రక్తపోటు, హృదయకోశ వ్యాధులు దరిచేరవు. ఎంతటివారికైనా మంచి చురుకుదనము వచ్చు.
• బొల్లి నివారణకు బాదంచాల గింజల గంధము, ప్రతతాళక చూర్ణము కలిపి మచ్చలపై పూయాలి.
• మునగ ఆకు రసము, మునగ ఆకుతో వండిన వంటకములు తింటే రోగములు హరించును.
• ప్రతిదినము తేనె, అల్లపురసం కలిపి తాగిన రక్తశుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగును.
• తులసిఆకు పసరు, తేనె కలిపి త్రాగిన సర్వ కఫములు హరించును.
• దెబ్బలకు, పైనుండి పడుట వలస కలిగిన నొప్పులకు శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి.
• గుంటకన్నాకు, మిరియాలు నూరి మాత్రలు చేసి సేవించిన వాతావరణ మార్పులవల్ల వచ్చే జ్వరాలు తగ్గును.
• ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళాదుంపలు, తులసిఆకులు బీపీ తగ్గించును.
• రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి(నువ్వులతో చేసినది) తింటే మలబద్ధకం హరిస్తుంది.
• అల్లపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటివల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది.
• అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతిలో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది.
• గోరుచుట్టుకు పచ్చి పసుపుదుంప మెత్తగా నూరి వేలిపై పూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉండే బాధలు తగ్గి నయమగును.
                                                   సర్వేజనా సుఖినోభవంతు. 

కలుపుకుంటే కలదు సుఖం

 కలుపుకుంటే కలదు సుఖం 
లంకాధిపతి రావణబ్రహ్మ
యుద్ద భూమిలో..
మృత్యు శయ్యపై
అవసాన దశలో
శ్రీరాముడితో ఇలా అన్నాడు..
"రామా !!
నీ కంటే నేను
అన్నింటిలో గొప్పవాణ్ణి.
నేను బ్రాహ్మణ జాతి లో పుట్టాను
నీది క్షత్రియ జాతి.
నేను నీ కంటే వయసులో పెద్ద.
నా కుటుంబం...
మీ కుటుంబం కన్నా పెద్ద.
నా వైభవం..
నీ వైభవం కన్నా అధికం.
మీ అంత:పురమే స్వర్ణం..
నా లంకానగరమే స్వర్ణమయం
నేను బలపరాక్రమాలలో ...
నీకంటే శ్రేష్ఠుడిని.
నా రాజ్యము,
నీ రాజ్యము కంటే పెద్దది.
జ్ఞానంలో, తపస్సులో
నీ కంటే శ్రేష్ఠుడిని".
"ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా ..
యుద్ధంలో నేను
నీ ముందు ఓడిపోయాను.
దీనికి కారణం ఒకటే...
నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు..
నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు".
నీతి
కుటుంబం పరివారమై వెంట ఉంటే
ఎంతటి కష్టమైన యుద్దమైనా
విజయం సాదిస్తుంది
పరివారమే కుటుంబమయితే
ఆనందం మన వెంటే ఉంటుంది
కుటుంబం దూరమైతే
బతుకే భారమవుతుంది
రావణబ్రహ్మ లాంటి వాడే
ఓటమి పాలయ్యాడంటే..
మనలాంటి వాళ్ళ బ్రతుకెంత?
ఎందుకంటే...
ఏ వృక్షమూ....
కఱ్ఱ సహాయం లేని గొడ్డలితో
తెగి పడదు.
వృక్ష జాతి స్నేహం తోనే...
గొడ్డలి విజయం సాధిస్తుంది.
అందుకే
అందరం కలిసి ఉందాం....!
విజయాలు సాదిద్దాం !!
కుటుంబాలు విచ్చిన్నం కాకుండా అందరం ప్రయత్నిద్దాం!!!
💐💐🙏💐💐

Total Pageviews