Saturday, July 8, 2017

" గురుపూర్ణిమ "

మీ అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.
ఓం శ్రీ గురుభ్యోం నమహా: ఓం శ్రీ మహాగణేశాయ నమహా : ఓం శ్రీ సరస్వత్యై నమహా:
" గురుపూర్ణిమ " పర్వదిన సందర్భంగా గురుదేవులందరికీ, ముఖపుస్తక మిత్రులకు, బందువులకు, చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
గురుర్బ్రహ్మా గురువిష్ణు: గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమహా:
అంటూ పిల్లలకు విద్యాభ్యాసాన్ని ప్రారంబిస్తారు.పై శ్లోకం గురుదేవుడనే మాటకు అర్ధం చెపుతుంది.గురువు అంటే త్రిమూర్తులతో సమానమని ఉద్భోదిస్తోంది. మన " శ్రీ గురువు " కనులముందు కనిపించే మహానీయుడు. అందుకే ప్రతి శిష్యుడు గురువును దైవంగా పూజించాలి. మంచి విద్యాబుద్ధులు ప్రసాదించి, మంచి జీవితాన్నిచ్చిన గురువుకు శిరస్సు వంచి పాదాభి వందనం చేయాలని గుర్తు చేస్తోందీ గురు పూర్ణిమ.
మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువు రుణం ఒక్కటే. అందువల్లనే " మాతృదేవోభవ " "పితృదేవోభవ " అన్న తరువాత " ఆచ్చార్యదేవోభవ " అని చెప్పి గురువు స్థానాన్ని తెలియచేసారు మన పూర్వీకులు. తల్లితండ్రి తరువాత స్థానం గురువుదే. దైవత్వాన్ని కుడా గురువు ద్వారానే దర్శించవలసి వుంటుంది.
ఈ సందర్భంగా గురువులకే గురువు, విజ్ఞాన ఖని, విశ్వ గురువు అయిన శ్రీ దత్తాత్రేయుడిని
జన్మ సంసార బన్ధఘ్నమ్స్వరూపానంద దాయకం
నిశ్రేయసప్రద వందే స్మర్త్రుగామీ నమావతు!
అని స్మరించుకుందాము. మహాభారత గ్రంధకర్త , మన పురాణాలలో పేర్కొన్న చిరంజీవులలో ఒకరైన వేదవ్యాసుడు జన్మించినది ఈరోజే. "వ్యాసో నారాయణో హరి:" అసలు ఈయన పేరు "కృష్ణద్వైపాయనుడు". భూత భవిష్య ధ్వర్తమానాల నెరిగిన మహా పౌరాణికుడు.ఋషులకే ఋషి, పండితులకే మహా పండితుడాయన.
"వ్యాసం వశిష్టనప్తారం శక్తే: పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాటం తపొనిధిమ్,
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే,
నమో వై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమహా:"
అని స్మరిసూ అదేవిధంగా ఆది గురువైన శంకరా చార్యులను, సదా శివుని స్వరూపమైన దక్షిణా మూర్తి ని స్మరిస్తూ ఆది నుండి ఈ నాటి గురువరేణ్యు లందరికీ శతసహస్ర పాదాభివందములు. గురు పూజోత్సవ శుబాకాంక్షలు.

Friday, July 7, 2017

స్నేహం గురించి మహనీయులు చెప్పిన సూక్తులు


కల్పాంతాలు కాలగతి చెందినా కోట్ల సంవత్సరాల ప్రస్థానంలో చెదిరిపోని బంధం స్నేహం.
-గుంటూరు శేషేంద్రశర్మ
నా స్నేహితుడి దగ్గర నేను నిజాయితీగా ఉంటాను. లోతుగా ఆలోచిస్తాను.
-ఎమర్సన్
స్నేహితుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాడికన్నా గొప్ప ప్రేమికుడు ఉండడు.
-బైబిల్
ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన స్నేహం.
-గాంధీజీ
బంధువులు బలవంతంగా ఏర్పడుతారు. స్నేహితులు స్వేచ్ఛగా ఏర్పడుతారు.
- వాట్స్‌మన్ ఫోర్డ్
జీవన క్రమంలో కొత్త స్నేహాలు చేయని మనిషి కొంత కాలానికి ఒంటరి వాడవుతాడు
-శామ్యూల్ జాన్సన్
స్నేహమనేది రెండు దేహాల్లో ఉండే ఒక ఆత్మ
-అరిస్టాటిల్
ప్రతి ఒక్కరూ మంచి మిత్రుల మధ్య కాలం గడపాలి
-షేక్‌స్పియర్
మిత్రుడిని మించిన అద్దం లేదు
-సెయింట్ బెర్నార్డ్
తెలివైన, నమ్మకమైన మిత్రుడి కంటే మంచి సంబంధమేమీ లేదు
-టాల్‌స్టాయ్

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..


మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ..అని కీర్తించిన ఈ సృష్టిలోని అలౌకికమైన తీయదనాల్లో స్నేహం ముఖ్యమైనది. ఈ సృష్టిలోని సమస్త జీవకోటి కోసం ఆ భగవంతుడు సృష్టించిన అద్భుతం ఈ స్నేహం. నిజమైన మిత్రులకు ఈ స్నేహం ను మించిన ఆస్తిలేదు. మరో మాటలో చెప్పాలంటే స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. జీవన వికాసానికి బాటలు వేస్తుంది. ఇద్దరు మనుషుల నడుమ పంటపొలాల మధ్య పాటలా పరవశించే ఈ స్నేహంలో ఎగుడుదిగుడు రహాదారుల్లో కూడా అలుపులేకుండా ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది. మధురమైన క్షణాలు, అలకలతో మూతి ముడుచుకున్న వైనాలు, బుజ్జగింపులు, రాయబారాలు, వెనువెంటనే చిరునవ్వుల సందళ్ళు.. ఇవన్ని తొంగి చూసేది స్నేహబంధంలోనే. ఈ మధురానుభూతుల బంధంలో ఒక మనసు బాధపడితే చెమ్మగిల్లే కన్నులు, ఒక పాదం తడబడితే ఉతమిచ్చే చేతులు ఎన్నో!
చిరునవ్వు విలువెంతో, దానిని అందుకొన్న అతిధికే తెలుసు. సూటి మాటలకున్న పదునెంతో వాటి ద్వారా గాయపడిన మనసుకే తెలుసు. జారిన కన్నీటి బరువెంతో అది జారడం ద్వారా తేలికపడిన గుండెకే తెలుసు. అలాగే స్నేహం గొప్పతనం ఏమిటో దానిని అనుభవిస్తున్న వారికే తెలుసు. కిరణానికి ఎలాగైతే చీకటి ఉండదో.. చిరునవ్వుకు ఎలాగైతే మరణం ఉండదో ఈ స్నేహమనే మధురభావనకి అంతం అనేది ఉండదు. జీవితమే ఉద్యాన వనంలో పుష్పించిన అందమైన పుష్పంగా కూడా మైత్రిబంధాన్ని అభివర్ణించవచ్చు. అది ఒక్కసారి హృదయపు తలుపును తడితే అందులోని మాదుర్యమంత ప్రతి మదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడుంటుంది. ఇద్దరు వ్యక్తులకు, ఇద్దరు మనసులకు (అంతకు ఎక్కువైనా కావచ్చు) సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తీపిని పెంచుతుంది. కాలాలకతీతంగా మైత్రి మధురిమ పెరుగుతోంది. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులతో చెప్పుకోవడం స్నేహం బంధంలోని గొప్పతనం. కష్టసుఖాల్లో అండగా ఉండే వారు.. నిస్వార్ధంగా సాయం అందించే వారు నిజమైన మిత్రులు. ఒక మంచి మిత్రుడు మనకు తోడుగా ఉంటె ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.
స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఆటపాటలాడుకునే చిన్నారుల దగ్గరినుంచి పండు వృద్దాప్యంలో ఉన్న అందరిలోనూ స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తున్న మనమందరం చాల అదృష్టవంతులం. ఎందుకంటే సృష్టిలో నా అన్నవారు, బంధువులు లేని వారెవరైనా ఉంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో ఉన్న ఆత్మీయులతో చెప్పుకోలేని ఎన్నో సమస్యలను స్నేహితుల వద్ద చెప్పుకుని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం గొప్పతనం.
స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు హాయిని ఇస్తుంది. “జీవనయానంలో స్నేహం శ్వాస వంటింది”, “స్నేహం అమ్మ ప్రేమకన్నా తియ్యనైనది”, “స్నేహితులతో కలిసి ఉంటే ఆనందం వర్ణించలేనిది”.. ఇలా ఎన్ని రకాలుగా వర్ణించినా స్నేహం గొప్పతనం ముందు దిగదుడుపే. అందుకే ఈ పవిత్ర బంధానికి చిహ్నంగా ఈరోజుని (ప్రతి ఆగస్టు నెల మొదటి ఆదివారాన్ని) ఫ్రెండ్ షిప్ డే గా జరుపుకుంటున్నాము.
కొసమెరుపు: “వివరిస్తున్నది అద్దం.. మన అనుబంధానికి అర్థం.. నువ్వు నాలాగే, నేను నీలాగా కనిపించడమే సత్యం” అంటూ ఒక సినీగేయ రచయిత స్నేహం గొప్పతనాన్ని వర్ణించాడు. అలా ఉండటమే నిజమైన స్నేహం.

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న:

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న:
నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం లేని ఆత్మ ఎలా ఉంటుంది?
దానికి గురువుగారు అన్నారు,
పాలు ఉపయేగపడేవే, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి.
పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది. పెరుగు మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది.
కాని పెరుగు మరొక రోజుకి పాడైపోతుంది.
పెరుగును మదిస్తే వెన్న అవుతుంది.
వెన్న మరొక రోజు వరకే ఉంటుంది.
తరువాత అదికూడా పాడైపోతుంది.
ఆ వెన్నను మరిగిస్తే నెయ్య అవుతుంది.
ఈ నెయ్య ఎన్నటికి పాడవ్వదు.
ఒక్కరోజులో పాడైపోయే పాలలో, ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.
అలాగే అశాశ్వతమైన ఈ శరీరమునందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది.
మానవ శరీరము పాలు
సంకీర్తన మజ్జిగ
సేవ వెన్న
సాధన నెయ్యి.
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే
ఆత్మ పవిత్రత పొందుతుంది

Monday, July 3, 2017

మన‌ దేశాభివృద్ధికి మనవంతుగా తోడ్పడదాం!


మన‌ దేశాభివృద్ధికి మనవంతుగా తోడ్పడదాం! 
ఈ వీడియో అందరికీ షేర్ చేయండి! 
అందరూ ఆచరించేటట్లు చైతన్య పరచండి!


https://www.facebook.com/vardhan.rao.75/videos/693675010824790/

ఎవరు గొప్ప…..?

ఎవరు గొప్ప…..?
పూర్వము ఏడేడులోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యుడికి, ప్రాణికోటికి ప్రాణాధారమైనటువంటి వాయుదేవుడికి మద్య పోటీ మొదలయ్యింది. వారిరువురిలో ఎవరు బలవంతులన్న సమస్య ఏర్పడింది.
ఈ సమస్యను పరిష్కరించుకొనుటకు వారివురి మద్య పోటీ ఒకటి నిర్వహించుకొన్నారు. అదే సమయానికి భూలోకంలో ఒక గొఱ్ఱెలకాపరి గొఱ్ఱెలను మేపుతూ కొండప్రాంతములో సంచరించడం సూర్యుడు, వాయుదేవుడు గమనించారు.
అతను ఒక తెల్లటి వస్త్రమును శరీరముపై కప్పుకొని గొఱ్ఱెలను తోలుతూ కొండప్రాంతంలో కూనిరాగాలుతీస్తూ వెళ్తున్నాడు. 
పోటి ఏమనగా ఎవరు తన బలంతో ఆ గొఱ్ఱెలకాపరిపై వున్న వస్త్రాన్ని తొలగించగలరో వారు మహాబలవంతులని పరీక్ష పెట్టుకున్నారు.
పోటీ మొదలయ్యింది.
మొదట వాయుదేవుడు శరవేగంతో గాలిని వీచడం ప్రారంభించాడు.
కొండప్రాంతములో ఉన్నట్లుండి పెద్దహోరుగాలి మొదలయ్యింది.
గొఱ్ఱెలకాపరి ఉన్నట్టుండి మొదలైన ఎదురుగాలికి స్పందించి చెట్టు చాటుకు పరుగులుతీశాడు. వాయుదేవుడు తనప్రతాపాన్ని పెంచాడు. హోరుగాలి దుమారంగా మారింది.
గొఱ్ఱెలకాపరిని ఉన్నట్టుండి చుట్టుముట్టింది.
తన తెల్లటివస్త్రము గాలికి నిలువలేక అతని నుంచి దూరంగా ఎగరసాగింది.
గొఱ్ఱెలకాపరి గట్టిగా లాగుతూ పెనుగులాడాడు. వాయుదేవుడు తన బలాన్నంతా ప్రయోగించి వస్త్రాన్ని అతని వొంటిమీదనుంచి తొలగించడానికి ప్రయత్నించాడు.
గొఱ్ఱెల కాపరి చలికి వణుకుతూ ఈదురుగాలికి బెదరి ఒక కొండక్రింద తలదాచుకున్నాడు. వాయుదేవుడుశాంతించి తనఓటమిని అంగీకరించాడు.
పోటిపరీక్షలో తనవంతుగా సూర్యుడు బరిలోకిదిగాడు.
ఉన్నట్టుండి వేడిసెగలను వదిలాడు. దానితొ గొఱ్ఱెల కాపరికి చెమటలు పట్టాయి.
సూర్యుడు తన వేడి ఉద్రుతాన్ని పెంచసాగాడు. దానితో ఉక్కపోతకు తట్టుకోలేక గొఱ్ఱెలకాపరి వొంటిమీదవున్న వస్త్రాన్ని తొలగించి సంచిలో వేసుకున్నాడు.
సూర్యుడు పోటిపరీక్షలో జయం తనదే అని గర్వంతో విర్రవీగసాగాడు.
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వగతుడు, సర్వసమర్థుడు అయిన శ్రీహరి ప్రత్యక్షమైనాడు.
శక్తిని పరులకు ఉపయోగపడేలా ఉపయోగించాలికాని పరులకు కీడుచేయడానికి కాదని జ్ఞానోపదేశం చేశాడు.
“మీ ఇద్దరి బల ప్రదర్శనతో గొఱ్ఱెలకాపరి భయగ్రస్తుడై అనోరోగ్యముతో రోగగ్రస్తుడైనాడని, ఒకరికొకరు బలప్రదర్శనగావిస్తే సృష్టి తలక్రిందులౌతుందని, ఎవరికర్తవ్యాన్ని వారు నెరవేర్చాలని ధర్మోపదేశాన్ని చేశాడు.
సూర్యుడు-వాయుదేవుడు తమ అజ్ఞానానికి సిగ్గుతో తలవంచి శ్రీహరిని శరణుకోరి తమ విధులను నిర్వర్తించుటకు బయలుదేరారు.
*ఇదేవిదంగా మనుష్యులైన మనము కూడా మానవత్వంతో భగవంతుడు మనకు నిర్దేశించిన కర్తవ్యాన్ని తెలుసుకొని ధానిని అమలపరచాలి. ఏకారణంతో అయినా ఇంకొకరితో మనల్ని పోల్చుకోవడం, కయ్యానికి దిగడం మంచిది కాదు. మనల్ని సృష్ఠించిన భగవంతుడే గీతలో “స్వధర్మే నిదనం శ్రేయః..” అని అన్నాడు.
కావున ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించడం
అన్ని విధాల శ్రేయస్కరం అన్న నీతిని గ్రహించాలి.

తొలి ఏకాదశి పర్వదినం

రేపు తొలి ఏకాదశి పర్వదినం మరి ఆ విశేషాలు చూద్దామా  
హిందూ సాంప్రదాయములో పరమపవిత్రమైన తిథి ఏకాదశి. ఏ మంచిపని ప్రారంభించినా దశమి, ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తొలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! తొలిఏకాదశి వచ్చిందంటే ఇక వరుసగా పండుగలు వస్తాయన్నమాట! అప్పటికి రెండు నెలలుగా ఎలాంటి పండుగలూ లేక బోసిపోయిన ఇళ్ళకి కొత్తకళ వస్తుంది. ఈ ఏకాదశితో మొదలుపెడితే వెంటనే గురుపూర్ణిమ వస్తుంది. ఆషాడం వెళ్ళగానే శ్రావణమాసం నోములు, వ్రతాలు, తరువాత వినాయకచవితి, ఆపై దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి...ఇలా పండుగలు పండుగలు. ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు.
చాలా ప్రాంతాల్లో ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
చాలామంది ఈ తొలిఏకాదశి పర్వదినాన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆ స్వామి అనుగ్రహం పొందుతారు.ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము. మన సంస్కృతి ...సాంప్రదాయాలను రక్షించుకుందాము.

Total Pageviews