మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ..అని కీర్తించిన ఈ సృష్టిలోని అలౌకికమైన తీయదనాల్లో స్నేహం ముఖ్యమైనది. ఈ సృష్టిలోని సమస్త జీవకోటి కోసం ఆ భగవంతుడు సృష్టించిన అద్భుతం ఈ స్నేహం. నిజమైన మిత్రులకు ఈ స్నేహం ను మించిన ఆస్తిలేదు. మరో మాటలో చెప్పాలంటే స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. జీవన వికాసానికి బాటలు వేస్తుంది. ఇద్దరు మనుషుల నడుమ పంటపొలాల మధ్య పాటలా పరవశించే ఈ స్నేహంలో ఎగుడుదిగుడు రహాదారుల్లో కూడా అలుపులేకుండా ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది. మధురమైన క్షణాలు, అలకలతో మూతి ముడుచుకున్న వైనాలు, బుజ్జగింపులు, రాయబారాలు, వెనువెంటనే చిరునవ్వుల సందళ్ళు.. ఇవన్ని తొంగి చూసేది స్నేహబంధంలోనే. ఈ మధురానుభూతుల బంధంలో ఒక మనసు బాధపడితే చెమ్మగిల్లే కన్నులు, ఒక పాదం తడబడితే ఉతమిచ్చే చేతులు ఎన్నో!
చిరునవ్వు విలువెంతో, దానిని అందుకొన్న అతిధికే తెలుసు. సూటి మాటలకున్న పదునెంతో వాటి ద్వారా గాయపడిన మనసుకే తెలుసు. జారిన కన్నీటి బరువెంతో అది జారడం ద్వారా తేలికపడిన గుండెకే తెలుసు. అలాగే స్నేహం గొప్పతనం ఏమిటో దానిని అనుభవిస్తున్న వారికే తెలుసు. కిరణానికి ఎలాగైతే చీకటి ఉండదో.. చిరునవ్వుకు ఎలాగైతే మరణం ఉండదో ఈ స్నేహమనే మధురభావనకి అంతం అనేది ఉండదు. జీవితమే ఉద్యాన వనంలో పుష్పించిన అందమైన పుష్పంగా కూడా మైత్రిబంధాన్ని అభివర్ణించవచ్చు. అది ఒక్కసారి హృదయపు తలుపును తడితే అందులోని మాదుర్యమంత ప్రతి మదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడుంటుంది. ఇద్దరు వ్యక్తులకు, ఇద్దరు మనసులకు (అంతకు ఎక్కువైనా కావచ్చు) సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తీపిని పెంచుతుంది. కాలాలకతీతంగా మైత్రి మధురిమ పెరుగుతోంది. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులతో చెప్పుకోవడం స్నేహం బంధంలోని గొప్పతనం. కష్టసుఖాల్లో అండగా ఉండే వారు.. నిస్వార్ధంగా సాయం అందించే వారు నిజమైన మిత్రులు. ఒక మంచి మిత్రుడు మనకు తోడుగా ఉంటె ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.
స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఆటపాటలాడుకునే చిన్నారుల దగ్గరినుంచి పండు వృద్దాప్యంలో ఉన్న అందరిలోనూ స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తున్న మనమందరం చాల అదృష్టవంతులం. ఎందుకంటే సృష్టిలో నా అన్నవారు, బంధువులు లేని వారెవరైనా ఉంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో ఉన్న ఆత్మీయులతో చెప్పుకోలేని ఎన్నో సమస్యలను స్నేహితుల వద్ద చెప్పుకుని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం గొప్పతనం.
స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు హాయిని ఇస్తుంది. “జీవనయానంలో స్నేహం శ్వాస వంటింది”, “స్నేహం అమ్మ ప్రేమకన్నా తియ్యనైనది”, “స్నేహితులతో కలిసి ఉంటే ఆనందం వర్ణించలేనిది”.. ఇలా ఎన్ని రకాలుగా వర్ణించినా స్నేహం గొప్పతనం ముందు దిగదుడుపే. అందుకే ఈ పవిత్ర బంధానికి చిహ్నంగా ఈరోజుని (ప్రతి ఆగస్టు నెల మొదటి ఆదివారాన్ని) ఫ్రెండ్ షిప్ డే గా జరుపుకుంటున్నాము.
కొసమెరుపు: “వివరిస్తున్నది అద్దం.. మన అనుబంధానికి అర్థం.. నువ్వు నాలాగే, నేను నీలాగా కనిపించడమే సత్యం” అంటూ ఒక సినీగేయ రచయిత స్నేహం గొప్పతనాన్ని వర్ణించాడు. అలా ఉండటమే నిజమైన స్నేహం.
No comments:
Post a Comment