Wednesday, July 12, 2017

చమత్కార సంభాషణ

ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.

ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,
పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.

రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.

దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.

పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.

ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.

అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.

ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.
అలాగ, మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.

No comments:

Post a Comment

Total Pageviews