Thursday, July 27, 2017

చిన్న కథ - పెద్ద పాఠం

చిన్న కథ - పెద్ద పాఠం
---------------------------------------------

తొమ్మిది ఎనిమిదిని లాగి లెంపకాయ కొట్టింది.
ఎనిమిదికి దిమ్మదిరిగి పోయింది.
"ఎందుక్కొట్టావ్?"
"నేను నీకన్నా పెద్దదాన్ని. అందుకే కొట్టాను."
ఎనిమిది పక్కకి చూసింది. ఏడు నిలబడి ఉంది. ఏడుని లాగి లెంపకాయ కొట్టింది.
"ఎందుక్కొట్టావ్?"
"నేను నీకన్నా పెద్దదాన్ని. అందుకే కొట్టాను."
ఏడు ఆరుని కొట్టింది.
ఆరు అయిదుని కొట్టింది.
అయిదు నాలుగుని కొట్టింది.
నాలుగు మూడును కొట్టింది.
మూడు రెండును కొట్టింది.
రెండు ఒకటిని కొట్టింది.

ఒకటి పక్కకు చూసింది.
అర్భకపు సున్నా అక్కడ ఉంది.
అది దాన్ని కొట్టలేదు. ఎత్తుకుని ఎడమ పక్క కూర్చోబెట్టుకుంది.
ఒకటి సున్నా కలిస్తే పది అయ్యాయి.
పది కన్నా తొమ్మిది తక్కువ. అది పెద్దోడిని చూసి దణ్ణం పెట్టి పక్కకి ఒదిగింది.
ఎనిమిది తొమ్మిదిని అనుసరించింది.
ఏడు ఎనిమిదిని అనుసరించింది.
ఆరు ఏడుని అనుసరించింది.
అయిదు ఆరుని అనుసరించింది.
నాలుగు అయిదుని, మూడు నాలుగుని, రెండు మూడుని అనుసరించాయి.

పది నిదానంగా చెప్పింది.
"పదిమందీ కలిసి బతకండి!"

No comments:

Post a Comment

Total Pageviews