Monday, July 24, 2017

*పరమ పవిత్రం శ్రావణమాసం*

*శ్రావణమాసం నేటి నుండి ప్రారంభం*
*పరమ పవిత్రం శ్రావణమాసం*
శ్రావణమాసం వచ్చిందంటేచాలు ప్రతీ ఇల్లు దేవాలయాన్ని తలిపిస్తుంది. నెల రోజుల పాటు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణ వినిపిస్తుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి దైవ కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు వేదపండితులు. అంత గొప్ప పవిత్రమాసం నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది.
అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టపండుగలు సైతం రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవదైన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు ఏర్పడింది. ఈ శ్రావణమాసంలోనే వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రీమూర్తులలో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి (భార్య) అయినటువంటి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణం. మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణనక్షత్రం కావడం, అటువంటి శ్రావణనక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైన మాసం. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. నెల రోజులు నిష్ట, నియమాలతో పూజలు నిర్వహించినట్లయితే కోరిన కోరికలు తప్పక నేరవేరుతాయానేది భక్తుల ప్రగాఢవిశ్వాసం.
శ్రావణ మాసంలోని మరిన్ని విశిష్టతలు...
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే ఎంతో మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రాఖీపౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన లాంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటి ముఖ్య పండుగలు సైతం శ్రావణమాసంలో రావడం శ్రావణమాసానికున్న ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ మాసంలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచాతప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్నాయి మన పూరాణాలు.
శివారాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసం..
శ్రావణమాసంలోని దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణమాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ బేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంత ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయాని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉపవాసం ఉండి దీక్షను పూర్తిచేయాలి. అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని బుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణశుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఈ పక్షంలోని ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉటుందంటున్నారు పండితులు. అందుకే శ్రావణమాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.

No comments:

Post a Comment

Total Pageviews