Tuesday, July 25, 2017

నచ్చిన అయిదు పుస్తకాల పేర్లు

మీకు నచ్చిన అయిదు పుస్తకాల పేర్లు చెప్పండి అని అడిగాడో మిత్రుడు. 'నచ్చినవా? మెచ్చినవా? తెలుగులోనా? ప్రపంచ సాహిత్యంలోనా ' అనడిగాను.
'ప్రపంచసాహిత్యంలోంచే చెప్పండి ' అన్నాడు.
ఆలోచించాను, ఒక రోజంతా. నచ్చినవీ, మెచ్చినవీ చాలానే ఉన్నాయి. ఎంచడం కష్టమే కాని, ఏదోలా ఎంచి చూపించవచ్చు.
కాని, ఆ ప్రశ్న నేను మరోలా వేసుకున్నాను. నిన్ను ప్రభావితం చేసిన పుస్తకాలేవి? నీ జీవితాన్ని మార్చిన పుస్తకాలు? ఏ పుస్తకాలు చదవకపోయి ఉంటే నీ జీవితం మరోలా ఉండేదో, కనీసం ఇప్పట్లాగా ఉండేది కాదో ఆ పుస్తకాలు. ఏ పుస్తకాలు నీ వ్యక్తిత్వపు మూలధాతువులో భాగమైపోయాయో,ఆ పుస్తకాలు.
అసలు మనిషి ఏదన్నా చదివో, వినో, ఎవరినయినా చూసో ప్రభావితమయ్యేది ఎప్పుడు? చిన్నప్పుడు అని చెప్పవచ్చు. ఎంతదాకా? బహుశా ఇరవయ్యేళ్ళ వయసు వచ్చేదాకా. నేను మరొక అయిదేళ్ళు కలుపుకున్నాను. నా పదేళ్ళ వయసునుంచి పాతికేళ్ళ వయసు దాకా చదివినవాటిలో నన్ను అప్పటికప్పుడు ఉద్వేగపరిచినా ఆ తర్వాత వాటివైపు మళ్ళా చూడాలనిపించని పుస్తకాలు పక్కన పెట్టేసాను. నా జీవితాన్ని తొలిరోజుల్లో మలుపు తిప్పిన రెండు మూడు పుస్తకాలున్నాయి. వాటిని మళ్ళా చదవలేదు. కాని, వాటిని చదవకపోయుంటే, నా జీవితమిట్లా ఉండేది కాదని చెప్పగలను. ఇక మరికొన్ని పుస్తకాలు నా జీవితసారాంశాన్ని రూపొందించాయి,నా రక్తంలో కలిసిపోయాయి. వాటిని జీవితం పొడుగునా మళ్ళీ మళ్ళీ చదువుకోవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ పుస్తకాల వల్ల నాకు విస్తృత ప్రపంచ సాహిత్యంలోకి, ఆధ్యాత్మిక వాజ్మయంలోకి తలుపులు తెరుచుకున్నాయి. కాబట్టి, వాటిని నేను నా పారాయణగ్రంథాలుగా లెక్కించుకున్నాను.
రెండు వారాలుగా నన్ను నేను శోధించుకున్నాక, అన్ని వడపోతల తర్వాత నేను ఎంచుకున్న పుస్తకాలివీ:
1. శ్రీ మహాభక్తవిజయము
నా చిన్నప్పుడు,అంటే పదేళ్ళ వయసుకన్నా ముందే, మా ఇంట్లోనూ, రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీలోనూ నాకు దొరికిన పుస్తకాలన్నిటిలోనూ నన్ను గాఢంగా ఆకట్టుకున్న పుస్తకం శ్రీ మహాభక్తవిజయము. ఆ పుస్తకాన్ని కొన్ని వందలసార్లేనా చదివి ఉంటాను. తర్వాత రోజుల్లో ఆ పుస్తకాన్ని రెండు భాగాలుగా మా నాన్నగారు బైండు చేయించారు. ఆ పుస్తకం ముందు పుటలు పోవడంతో నాకు కొద్దిగా సాహిత్య జ్ఞానం వచ్చేటప్పటికి ఆ రచయిత ఎవ్వరో తెలియకుండా పోయింది. చాలా కాలం పాటు అది మహీపతి రాసిన భక్తవిజయానికి అనువాదమేమో అనుకున్నాను. కాదని తెలిసింది. ఎన్నాళ్ళుగానో నన్ను వేధిస్తున్న ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో నని, ఈ మధ్య నెట్ లో బ్రౌజు చేస్తే,ఆశ్చర్యం, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో ఆ పుస్తకం కనిపించింది. ఆ రచయిత పేరు చూస్తే ఆశ్చర్యానందాలు ముంచెత్తాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి! వావిళ్ళవారి ప్రచురణ (1952). ఆ పుస్తకం నాలో ఇంకిపోయిందని చెప్పవచ్చు. నా తదనంతర జీవితమంతా ఆ భక్త కవుల్ని ఒక్కొక్కరినీ వెతుక్కుంటూ ఉండటమేనని ఇప్పుడు తెలుస్తోంది నాకు.
2. ఉపనిషత్తులు
నేను డిగ్రీ మొదటిసంవత్సరంలో ఉండగా, గాంధీజీ ఈశోపనిషత్తు మీద రాసిన కొన్ని వాక్యాలు చదివాను. ఆ వాక్యాలు కలిగించిన ప్రేరణతో నేను రాజమండ్రిలోఉండగా, దశోపనిషత్తులురామకృష్ణమఠం వారి తెలుగు అనువాదాలు చదివాను. ఈశ, కఠ, తైత్తిరీయ ఉపనిషత్తులు నన్ను వెంటనే ఆకట్టుకున్న ఉపనిషత్తులు. ఆ తర్వాత రోజుల్లో ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు మరింత వివరంగా చదువుకున్నాను. మాండూక్య, ముండక, కేన, ఐతరేయ, ప్రశ్నోపనిషత్తులు ఆ తర్వాత చదివాను. కాని ఉపనిషత్తుల్ని ఒకసారో లేదా పదిసార్లో చదివి చదివాం అని చెప్పేవి కావు. అవి జీవితకాలం అధ్యయనం చెయ్యవలసిన పాఠాలు.
3. సువార్తలు
నా చిన్నప్పుడు తాడికొండ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా స్కూల్లో ఎవరికో సువార్తలు పోస్టులో వచ్చాయి. ఆ పుస్తకాల్ని చిలకలూరిపేట నుంచి ఎస్.జాన్ డేవిడ్అనే ఆయన ఉచితంగా పంపుతున్నాడని తెలిసాక, పిల్లలం అందరం ఆ పుస్తకాలు తెప్పించుకున్నాం. అందమైన రంగుల ముఖచిత్రాలతో ఆ పుస్తకాలు మమ్మల్ని చాలా సమ్మోహపరిచేవి. తర్వాత రోజుల్లో పాతనిబంధన, సామగీతాలు, సొలోమోన్ గీతంతో పాటు చదివినప్పటికీ, జెరిమియా, యోబు, ఇషయ్యా, డానియేలు, జోనా వంటి ప్రవక్తల వేదన హృదయానికి సన్నిహితమయినప్పటికీ, సువార్తల వెలుగు మాత్రం అద్వితీయమైంది అని చెప్పగలను. కాలం గడిచేక అగస్టయిన్, ఎక్కార్ట్, టాల్ స్టాయి వంటి వారిమీద సువార్తలు చూపించిన ప్రభావం గురించి తెలుసుకుంటున్న కొద్దీ, సువార్తలు పసితనంలోనే నా హృదయం మీద వదిలిపెట్టిన గాఢముద్ర తక్కువేమీకాదని అర్థం చేసుకున్నాను. మొదట్లో యోహాను సువార్త అన్నిటికన్నా గొప్పదని అనుకునేవాణ్ణి కాని, బైబిల్ పరిజ్ఞానం మరింత అందుబాటులోకి వస్తున్నకొద్దీ, నాలుగు సువార్తల్లో ప్రతి ఒక్కటీ దానికదే అద్వితీయమైందని బోధపడుతూ ఉంది.
4. సురా అల్ ఫాతిహా
మా తాడికొండ గురుకుల పాఠశాలలో ఒక సంప్రదాయం ఉండేది. నరసింగరావుగారనే గొప్ప ఉపాధ్యాయుడు ప్రారంభించిన సంప్రదాయం అది. రోజూ సాయంకాలం ఆరుగంటలకి ప్రార్థనాసమావేశం ఉండేది. ఆ సమావేశంలో పిల్లలందరం హిందూ, క్రైస్తవ, మహ్మదీయ ప్రార్థనలు చేసేవాళ్ళం. మా స్కూల్లో ఒకే ఒక్క మహ్మదీయ బాలుడు ఉండేవాడు. అతడు మాత్రమే ఆ ప్రార్థన చేస్తూ ఉంటే మేమంతా అతడి వెనకనే ఆ ప్రార్థన అప్పచెప్పేవాళ్ళం. కాని ఒకసారి సెలవుల తర్వాత, ఆ పిల్లవాడు తిరిగి పాఠశాలకు వచ్చాక ఆ ప్రార్థన చెయ్యడానికి నిరాకరించాడు. తన తండ్రి అట్లా చెయ్యొద్దని చెప్పాడన్నాడు. కాని మా ఉపాధ్యాయుడికి ఆ ప్రార్థన లేకుండా ఆ సమావేశాలు నడపడం ఇష్టం లేకపోయింది. అతడి బదులు మరెవరైనా ఆ ప్రార్థన చెయ్యగలరా అనడిగాడు. అప్పటికెన్నో రోజులుగా ఆ ప్రార్థన చేసి చేసి ఆ వాక్యాలు నాకు కంఠతా వచ్చేసాయి. నేను లేచి నిల్చున్నాను. ఆ తర్వాత ఆ పాఠశాల నుంచి వచ్చేసాదాకా, మూడునాలుగేళ్ళ పాటు ప్రతి సాయంకాలం ఆ ప్రార్థన నేనే చేస్తూండేవాణ్ణి. కేవలం పదాలు పలకడమే కాని, అర్థం తెలియని ఆ ప్రార్థన, దివ్య ఖొరాను లోని మొదటి సూక్తమనీ, సురా అల్ ఫాతిహా అని నాకు తెలిసిన రోజున నాకు కలిగిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఆ దివ్యప్రార్థనకి మౌలనా అబుల్ కలాం ఆజాద్ తర్జుమన్ ఉల్ ఖురాన్ పేరిట వ్యాఖ్యానం రాసారని తెలిసినప్పుడు, ఆ పుస్తకం వెతికి పట్టుకుని మరీ చదివాను. ఆ వ్యాఖ్యానం చదువుతుంటే, అది ఈశోపనిషత్తు మీద శంకరాచార్యుల భాష్యంలానే అనిపించింది. తర్వాత రోజుల్లో రూమీ, తబ్రీజీల దివ్యపారవశ్యం నన్ను ఆకట్టుకోవడానికి ఆ ప్రార్థన ఆ పసితనంలో నా రక్తంలో ఇంకిపోయినందువల్లనే అని నిస్సంకోచంగా చెప్పగలను.
5. గౌతమబుద్ధుడు
నేను డిగ్రీ రెండవసంవత్సరంలో ఉండగా, కాకినాడ కేంద్ర గ్రంథాలయంలో 'గౌతమ బుద్ధుడు ' అనే పుస్తకం చూసాను. దామోదర ధర్మానంద కోశాంబి రాసిన పుస్తకానికి పుట్టపర్తి నారాయణాచార్యుల అనువాదం. ఆ పుస్తకం చదివిన తర్వాత బుద్దుడు నాకెంతో సన్నిహితంగానూ, అత్యంత మానవీయంగానూ తోచాడు. బౌద్ధసాహిత్యం చదవాలన్న గాఢమైన ఉత్సాహం రేకెత్తింది. అందుకని, తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేయాలనుకున్నప్పుడు, రెండవ సంవత్సరం రెండు స్పెషల్ పేపర్లు రాయవలసి ఉంటే, అందులో ఒకటి బౌద్ధదర్శనం ఎంచుకున్నాను. తర్వాతి రోజుల్లో బుద్ధుడి దీర్ఘ, మధ్యమ సంభాషణలు, దమ్మపదం, జాతకకథలు, థేరీగాథలు, వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్రం, సద్ధర్మపుండరీక సూత్రం, బుద్ధ చరిత్ర, మిళింద ప్రశ్న వంటివి చదివినప్పుడు, నా పక్కన ఒకరు నిల్చుని దీపం ఎత్తిపట్టుకున్నట్టుగా అనిపించేదంటే, అది కోశాంబి-పుట్టపర్తి రచననే.
6.బనగర్ వాడి
మా తాడికొండ స్కూలు పెట్టిన చోట అంతకు ముందు బేసిక్ ట్రయినింగ్ స్కూలు నడిచేది. బేసిక్ ట్రయినింగ్ స్కూలంటే, గాంధేయ విద్యావిధానానికి అనుగుణంగా నడిచే పాఠశాల అన్నమాట. ఆ స్కూలుకి నుంచి మా స్కూలుకి భవనాలతో పాటు మంచి లైబ్రరీ కూడా దక్కింది. అందులో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన మేలిమి గ్రంథాలు కూడా మాకు లభించాయి. వాటిలో బనగర్ వాడి కూడా ఒకటి. వ్యంకటేశ మాడ్గూళ్కర్ అనే మరాఠీ రచయిత రాసిన పుస్తకం అది. తర్వాత రోజుల్లో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది. ఒక నిరక్షరాస్య కుగ్రామంలో పిల్లల్ని అక్షరాస్యుల్ని చెయ్యడంకోసం ఒక ఉపాధ్యాయుడి ప్రయత్నాలకీ, పోరాటానికి సంబంధించిన కథ అది. అది నాకు తెలియకుండానే నన్ను తీవ్రాతితీవ్రంగా ప్రభావితం చేసింది. ఎంత ప్రభావితం చేసిందంటే, నాకు పదవతరగతిలో రాష్ట్రంలో పదవ రాంకు వచ్చినప్పటికీ, లెక్కలు, సైన్సు గ్రూపుల్లో ప్రవేశం ఉచితంగా ఇస్తామన్నప్పటికీ, కావాలని సియిసి లో చేరాను. ఇంజనీరింగ్, మెడిసిన్ కాక సాంఘికశాస్త్రాలు చదువుకోవాలనీ, గ్రామాలకు పోయి, పేదప్రజల కోసం పనిచెయ్యాలనీ కోరుకున్నానంటే అందుకు కారణం బనగర్ వాడి అని స్పష్టం గా చెప్పగలను.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Total Pageviews