Wednesday, March 14, 2018

రాముడి వంశ వృక్షo



ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం

బ్రహ్మ కొడుకు మరీచి

మరీచి కొడుకు కాశ్యపుడు.

కాశ్యపుడు కొడుకు సూర్యుడు.

సూర్యుడు కొడుకు మనువు.

మనువు కొడుకు ఇక్ష్వాకువు.

ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.

కుక్షి కొడుకు వికుక్షి.

వికుక్షి కొడుకు బాణుడు.

బాణుడు కొడుకు అనరణ్యుడు.

అనరణ్యుడు కొడుకు పృధువు.

పృధువు కొడుకు త్రిశంఖుడు.

త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)

దుంధుమారుడు కొడుకు మాంధాత.

మాంధాత కొడుకు సుసంధి.

సుసంధి కొడుకు ధృవసంధి.

ధృవసంధి కొడుకు భరతుడు.

భరతుడు కొడుకు అశితుడు.

అశితుడు కొడుకు సగరుడు.

సగరుడు కొడుకు అసమంజసుడు.

అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.

అంశుమంతుడు కొడుకు దిలీపుడు.

దిలీపుడు కొడుకు భగీరధుడు.

భగీరధుడు కొడుకు కకుత్సుడు.

కకుత్సుడు కొడుకు రఘువు.

రఘువు కొడుకు ప్రవుర్ధుడు.

ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.

శంఖనుడు కొడుకు సుదర్శనుడు.

సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.

అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.

శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.

మరువు కొడుకు ప్రశిష్యకుడు.

ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.

అంబరీశుడు కొడుకు నహుషుడు.

నహుషుడు కొడుకు యయాతి.

యయాతి కొడుకు నాభాగుడు.

నాభాగుడు కొడుకు అజుడు.

అజుడు కొడుకు ధశరథుడు.

ధశరథుడు కొడుకు రాముడు.

రాముడి కొడుకులు లవ కుశలు . .

ఇది రాముడి వంశ వృక్షo ...

ఉపసంహారం Teens pemapkam oka kala - By Sri Yandamuri



ఉపసంహారం
ముగింపుకొచ్చాం. అంతా చదివి, పిల్లల పెంపకం ఇంత కష్టమా అనుకోకండి. ఇంత ఇష్టమా అనుకోండి..! ఇదంతా సాధ్యమా అనుకోకండి. సాధ్యమైనంత చేయండి..! ఎవరి కర్మకి వారే బాధ్యులు అనుకోకండి. పిల్లల కర్మకి మనమే బాధ్యులమని అని నమ్మండి..!
ఇంత చెప్పారు కదా... మీరు పిల్లల్ని మీరు ఇలాగే పెంచారా? అని మీరు ప్రశ్నించవచ్చు. నేను కాదు. నా తండ్రి నన్ను ఇలా పెంచారు.
గోదావరి పక్క ‘గుత్తెనదీవి’ అనే పల్లెటూళ్ళో మా తాతగారు స్కూలు గుమస్తాగా పూరి పాకలో ఉండేవారట. మా తండ్రికి ఎనిమిదేళ్ళ వయసులో ఆయన చనిపోయారట. ఆ రోజుల్లో రాజమండ్రిలో సీతారామయ్యగారనే ఒక దయార్ద్రహృదయుడు అనాధ పిల్లల్ని చేరదీసి చదివిస్తూ ఉంటే, మా తండ్రి అక్కడ చదువుకున్నారు. మా వంశంలో ఆయనే మొదటి గ్రాడ్యుయేటు. పోషించలేక నన్ను మాతాత (అమ్మనాన్న) గారి దగ్గర ఉంచారు. నేను పెద్దగా తెలివైనవాడిని కాను. దానికి తోడు తాత గారి గారాబం. అందువల్ల అయిదు, ఆరు క్లాసుల్లో ఫెయిల్ అయ్యాను కూడా. ఆరో క్లాసులో ఉన్నప్పుడు తాతగారి మరణంతో తండ్రి దగ్గరకు వచ్చాను. అప్పడు వారు చాలా తక్కువ స్థాయిలో ఉండేవారు. టేబిల్ ఫ్యాన్ కొన్నప్పుడు మా అమ్మ కొబ్బరికాయ కొట్టి పూజ చేయటం నాకు తెలుసు.
అనంతపురంలో నా తండ్రి ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి, వీధిలో పిల్లలందరికీ సాయంత్రాలు ఉచితంగా పాఠాలు చెప్పేవారు. కేవలం తండ్రి పెంపకం వల్ల ఏడో తరగతి నుంచి దశ తిరిగింది. ఆపై చదువులో వెనుదిరిగి చూసుకోలేదు. కాకినాడలోనే బి.కాం పి.ఆర్. కాలేజి ప్రధముడిగా వచ్చినా, విశాఖపట్నం వెళ్లి ఎమ్.కాం చదివేటoత డబ్భు లేదు కాబట్టి, ఉన్న ఊర్లోనే సి.ఏ. (ఆ కోర్సు ఫీజు ఆ రోజుల్లో 1200) చదివాను. నాలుగు సంవత్సరాల కోర్సు మూడేళ్ళలో పుర్తయిపోయింది. 
ఒక కుర్రవాడి జీవితానికి ఇంట్లో పెద్దల సారధ్యం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇంకేమి తార్కాణం కావాలి? స్వోత్కర్ష అనుకోకపోతే, నా తండ్రి అడుగుజాడల్లోనే నేనూ కొడుకుని పెంచాను. 
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, వారానికొకసారి కూర్చుని, ఏమి చదువుతున్నాడో చర్చించేవాడిని. వాడు ఇంటర్ స్టేట్ రాంకర్. పాకెట్ మనీ కాన్సెప్టు నా తండ్రి నాకు నేర్పారు. ఖమ్మంలో ఎనిమిదో క్లాసు చదువుతూ చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్తూ సంపాదిoచుకునేవాడిని. ఇంటర్ అవగానే, నా కొడుకు కూడా పగలు నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్ లో ఇండస్ట్రియల్ ట్రైనీగా 1500 కి పని చేస్తూ, సాయంత్రం పూట ఇంటి పక్కనే ఉన్న కాలేజిలో బి.కాం చదివాడు. యూనివర్సిటీ థర్డ్ రాంకర్. ఇరవై రెండేళ్ళకే సి.ఏ. పూర్తి చేసి, (ఈ లోపులోనే నాలుగు సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండటంతో) IIT, Ph.Dలతో పోటీ పడి ప్రపంచ బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించాడు. కొంతకాలం పని చేసాక, ఎం.బి.ఏ చదివి ప్రస్తుతం ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఏడాదికి మూడు కోట్ల జీతంతో పనిచేస్తున్నాడు. అతడి భార్య చార్టెడ్-అకౌంటెన్సీలో ఇండియా టాప్ రాంకర్. మనవడు టెన్నిస్ లో తన దేశం (వియత్నాం) తరుపున సింగపూర్ వెళ్ళాడు. పియానో లో ప్రావీణ్యం ఉన్నది. ఇంటర్నేషనల్ ఒలంపియాడ్‌లో గోల్డ్ మెడలిస్ట్. ఏషియా అబాకస్ కోసం రష్యా వెళ్ళాడు. అతడి వయసు పన్నెండు సంవత్సరాలు. పుట్టిన రోజులు జరుపుకోకుండా ఆ డబ్బులు ఛారిటీలకి ఇస్తాడు.
వారాలు చేసుకుంటూ చదివిన ఒక తండ్రి వంశం, మూడు తరాల్లో ఎలా మారిందో చూస్తే, వంశంలో ఒక్కరు బాగుపడితే వంశం మొత్తానికి అది టర్నింగ్ పాయింటై, సింగిల్ బెడ్ రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ విల్లాకి మారుతుందని చెప్పటానికే ఈ స్వోత్కర్ష. అవునా కాదా? ఆలోచించి చూడండి. 
మనిష బాగుపడకుండా ఉండటానికి కారణం డబ్బు లేకపోవటం కాదు. శ్రద్ధ లేక పోవటం. మంచి పెంపకం బ్రహ్మ విద్యేమీ కాదు. అన్ని వ్యాపకాలకన్నా (ముఖ్యంగా టి.వీ చూడటం కన్నా) అది నిజoగా బావుంటుంది. పెట్టుబడి ఏమీ అక్కరలేదు. పెంచటం పై ‘పాషన్’ ఉండాలంతే. 
అదీ ఈ వ్యాస పరoపర ఉద్దేశ్యం. పాతికేళ్ళ కొడుకు భుజం మీద ఒక తండ్రి చేయివేసి మాట్లాడగలిగితే అది అద్భుతమైన ప్రేమ ప్రకటన.
ఆకాశం పక్క మీద వెన్నెల దుప్పటేస్తే, చందమామ తలదిండు... జీవితం.
అమ్మవడి పక్కమీద ప్రేమ దుప్పటి పరిస్తే నాన్న చెయ్యి తల దిండు... బాల్యం.
బెస్ట్ ఆఫ్ లక్.

Tuesday, March 13, 2018

మావి చిగురు తినగానే కోయిల పలికేనా --- ఆ పాట సాహిత్యాన్ని ఈ చిత్రాలకు అన్వయిస్తూ సాయిత్యం

శుభోదయం!! వేసవి కాలం మరీ ముఖ్యంగా వసంత కాలం వస్తోందంటే, ఇన్నాళ్లు జడత్వంతో ఉన్న ప్రకృతిలో ఒక చైతన్యం వనంలో నవత్వం ఇదిగో ఇలా మౌనం గా ఉన్న ఓ దుంప లొంచి   ఒక పువ్వు అలా అలా ఇలా మొలకెత్తి, తలయెత్తి ఠీవిగా ఎలా రాజసాలు పోతోందో ఈ రోజు నా ఉదయపు నడకలో చూసినప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాట సీతామాలక్ష్మి సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చిన గీతానికి పువ్వుకు తావి అబ్బినట్లుగా బాలు సుశీలగారి గళాల పరిమళం "మావి చిగురు తినగానే కోయిల పలికేనా" పాట గుర్తుకు తెచ్చింది.
మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునోగాని ఆమని ఈవని
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమనునోగాని ఆమని ఈవని
మావి చిగురు తినగానే
కోయిల పలికేనా కోయిల పలికేనా
ఆ పాట సాహిత్యాన్ని ఈ చిత్రాలకు అన్వయిస్తూ ఆస్వాదించండి.
మీ కోసం ఆ పాట యూట్యూబ్ ఈ లింక్ https://www.youtube.com/watch?v=Wd5xLjDmet0నొక్కి ఆనందించండి!!  శుభోదయం!!
సత్యసాయి విస్సా ఫౌండేషన్.

Thursday, March 8, 2018

"ప్రతి కుర్రాడికీ ఒక పాఠం. ప్రతీ వృద్ధుడికీ ఒక నమ్మకం".జపనీస్ కథ

ఐ లవ్యూ డియర్
నర్సాపురం నుండి పాలకొల్లు ట్రైన్ లో వెళ్తున్నాను. గోధూళివేళ. కిటికీ లోంచి పొలాలు, అందమైన ప్రకృతి, స్వచ్చమైన గాలి... అక్కడక్కడా పెంకుటిళ్ళు, డాబాలు... ఇంత అందమైన ప్రకృతిలోనూ ప్రకృతికే అందానిచ్చే అద్భుతమైన దృశ్యం. ఇంటి పెరట్లో మొక్కల మధ్య గట్టు మీద కూర్చున్న తండ్రి, పక్కన నిల్చుని తల రుద్దుతూన్నభార్య, చెంబుతో నీళ్ళు అందిస్తున్న పదేళ్ళ కొడుకు, గిన్నె పట్టుకొని కుంకుడో, శీకాకాయరసమో తల మీద పోస్తున్న కూతురు... ఇలాంటి దృశ్యం చూసి ఎన్నో ఏళ్ళు అయింది.
చేస్తున్న పనిలో ఇలా కుటుంబ సభ్యులందరూ మమేకమవడం చాదస్తంగా, కాస్త పాతచింతకాయ పచ్చడిగా ఉందని అనేవారూ ఉండకపోరు. తినడానికే సమయం దొరకని ఈకాలంలో, ఏ షాంపూతోనో రెండునిముషాల్లో అయిపోయే స్నానానికి సొంత పనులు మానుకొని ఇంతమంది చేయడం ఏమిటని వాదించేవారూ ఉంటారు. కానీ జీవితంలో చెరిగిపోని సంపద ఈ మధురానుభూతులే కదా.
మామని చంపటానికి కోడలు చేసే ప్రయత్నాలూ… రక్త సంబంధికుల మధ్య చిచ్చులు పెట్టే విలన్ కథలూ చూస్తూ సాడిస్టిక్ భావప్రాప్తి చెందే టి.వీ. నుంచి ఒక పది నిముషాలు పిల్లలకి (మానవ సంబంధాల మీద, ప్రేమా ఆప్యాయతల మీదా) కథలు చెప్పటానికి కేటాయిస్తే బావుంటుంది. ఎన్నో మంచి కథలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ క్రింది జపనీస్ కథ చదివండి.
ఒక యువకుడు పుట్టిన రోజు నాడు తన ఎనభై ఏళ్ళ తాతని డిన్నర్‌కి తీసుకువెళ్ళాడు. భోజనం మధ్యలో పొలమారి, ఆ వృద్ధుడు గ్లాసు సరిగ్గా పట్టుకోలేక వదిలెయ్యటంతో ఆ హడావుడీ, కంగార్లో అన్నం ఆయన బట్టల మీద పడి, దాని మీద చిక్కటి సూపు జారి, అసహ్యంగా తయారైంది. పెద్ద శబ్దంతో గ్లాసు క్రింద పడటంతో అటు తిరిగిన కస్టమర్లు, వాళ్ళ వైపు జిగుప్సగా చూసారు.
ఇదేమీ పట్టనట్టు ఆ యువకుడు ఆయన భోజనం పూర్తయ్యేవరకూ ఆగి, ఆ తరువాత వాష్-బేసిన్ దగ్గరకు తీసుకు వెళ్ళి, అన్నం మెతుకులు చేత్తో దులిపి, బట్టల మీద పడిన సూపు శుభ్రంగా కడిగి, తడి చేసిన జేబు రుమాల్తో మొహం తుడిచి, దువ్వెన తీసి తల దువ్వి, కళ్ళజోడు తిరిగి సరిగ్గా సర్ది, మొత్తం పరికించి సంతృప్తి చెంది, తిరిగి టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు.
అప్పటి వరకూ శబ్దపు వర్షంలో మునిగిపోయిన రెస్టారెంటు ఒక ఇబ్బందికరమైన స్వీయ అపరాధనా భావపు అవమానంతో నిశ్శబ్దమై పోయింది. బిల్లు పే చేసి ఇద్దరూ బయటకు వెళ్తూ ఉండగా, వెనుక నుంచి ఒక కస్టమరు "బాబూ... నువ్వు ఇక్కడ ఏవో వదిలేసి వెళ్తున్నావ్" అని అరిచాడు.
ఆ యువకుడు వెనక్కి తిరిగి తన టేబుల్ వైపు చూసి "ఏమీ లేవే. ఏమిటి?" అని అడిగాడు.
"ప్రతి కుర్రాడికీ ఒక పాఠం. ప్రతీ వృద్ధుడికీ ఒక నమ్మకం".
(From: velugu vennela deepaalu: bedtime stories for your child)

Tuesday, March 6, 2018

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

*ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.*
*ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?*
వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.
“ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము
చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”.
👉పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు.
తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.
మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని,
నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.
👉ఇక జవాబుల సూచికలు-
ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,
*ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి.* (ఉదా;- “ కిటికి”వలె ).
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?
*ఈ క్రింది జవాబులు చూడండి.*
1.తోకమూకతో!
( వానరాలకి ఇంకొక పేరు.)
2.రంగనగరం!
( శ్రీరంగం )
3.లకోల కోల!
( కోల= బాణం)
4.జంబీర బీజం!
( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)
5.మందార దామం!
( దామం అంటే దండ)
6.వికట కవి!
( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)
7.పంచాస్య చాపం!
( శివుని విల్లు)
8.నంద సదనం!
( నందుని ఇల్లు)
పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి.
👉అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం.
*ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి*.
ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.
పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

భయంలో చాలా రకాలున్నాయి - యండమూరి

భయంలో చాలా రకాలున్నాయి. శ్రీమతి ఆఫీస్ నుంచి ఆరింటికి ఇంటికి రాకపోతే ఏడుపొస్తే అది 'అభధ్రతాభావం'. ఆమెపై కోపమొస్తే అది 'చిరాకు'. మాటిమాటికి కొట్టుకుంటూన్న కిటికి తలుపు రాబోయే సునామీకి నిదర్శనమేమోనని భయపడితే అది 'టెన్షన్'. బంగాళాఖాతం నుంచి ఆ సునామీ హైదరాబాద్ వరకూ వస్తుందేమోనన్న ముందు చూపుతో చర్మినార్ ఎక్కాలనిపిస్తే అది 'ఏంగ్జయిటి.' అగ్నిపర్వతాలకీ, భూకంపాలకి ఆలవాలమయిన జపాన్ వచ్చే నెల వెళ్ళాల్సివచ్చినప్పుడు, అప్పుడు అక్కడ హొటల్ కూలిపోతుందేమో అన్న భయంతో ఇక్కడ ఇండియాలో నిద్ర పట్టకపోతే అది 'ఆoదోళన'. కాసింత నిద్ర పట్టగానే ఎర్రటి లావా చుట్టుముట్టినట్టు కల వస్తే అది 'నెర్వస్‌నెస్'.

Total Pageviews