Wednesday, March 14, 2018

ఉపసంహారం Teens pemapkam oka kala - By Sri Yandamuri



ఉపసంహారం
ముగింపుకొచ్చాం. అంతా చదివి, పిల్లల పెంపకం ఇంత కష్టమా అనుకోకండి. ఇంత ఇష్టమా అనుకోండి..! ఇదంతా సాధ్యమా అనుకోకండి. సాధ్యమైనంత చేయండి..! ఎవరి కర్మకి వారే బాధ్యులు అనుకోకండి. పిల్లల కర్మకి మనమే బాధ్యులమని అని నమ్మండి..!
ఇంత చెప్పారు కదా... మీరు పిల్లల్ని మీరు ఇలాగే పెంచారా? అని మీరు ప్రశ్నించవచ్చు. నేను కాదు. నా తండ్రి నన్ను ఇలా పెంచారు.
గోదావరి పక్క ‘గుత్తెనదీవి’ అనే పల్లెటూళ్ళో మా తాతగారు స్కూలు గుమస్తాగా పూరి పాకలో ఉండేవారట. మా తండ్రికి ఎనిమిదేళ్ళ వయసులో ఆయన చనిపోయారట. ఆ రోజుల్లో రాజమండ్రిలో సీతారామయ్యగారనే ఒక దయార్ద్రహృదయుడు అనాధ పిల్లల్ని చేరదీసి చదివిస్తూ ఉంటే, మా తండ్రి అక్కడ చదువుకున్నారు. మా వంశంలో ఆయనే మొదటి గ్రాడ్యుయేటు. పోషించలేక నన్ను మాతాత (అమ్మనాన్న) గారి దగ్గర ఉంచారు. నేను పెద్దగా తెలివైనవాడిని కాను. దానికి తోడు తాత గారి గారాబం. అందువల్ల అయిదు, ఆరు క్లాసుల్లో ఫెయిల్ అయ్యాను కూడా. ఆరో క్లాసులో ఉన్నప్పుడు తాతగారి మరణంతో తండ్రి దగ్గరకు వచ్చాను. అప్పడు వారు చాలా తక్కువ స్థాయిలో ఉండేవారు. టేబిల్ ఫ్యాన్ కొన్నప్పుడు మా అమ్మ కొబ్బరికాయ కొట్టి పూజ చేయటం నాకు తెలుసు.
అనంతపురంలో నా తండ్రి ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి, వీధిలో పిల్లలందరికీ సాయంత్రాలు ఉచితంగా పాఠాలు చెప్పేవారు. కేవలం తండ్రి పెంపకం వల్ల ఏడో తరగతి నుంచి దశ తిరిగింది. ఆపై చదువులో వెనుదిరిగి చూసుకోలేదు. కాకినాడలోనే బి.కాం పి.ఆర్. కాలేజి ప్రధముడిగా వచ్చినా, విశాఖపట్నం వెళ్లి ఎమ్.కాం చదివేటoత డబ్భు లేదు కాబట్టి, ఉన్న ఊర్లోనే సి.ఏ. (ఆ కోర్సు ఫీజు ఆ రోజుల్లో 1200) చదివాను. నాలుగు సంవత్సరాల కోర్సు మూడేళ్ళలో పుర్తయిపోయింది. 
ఒక కుర్రవాడి జీవితానికి ఇంట్లో పెద్దల సారధ్యం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇంకేమి తార్కాణం కావాలి? స్వోత్కర్ష అనుకోకపోతే, నా తండ్రి అడుగుజాడల్లోనే నేనూ కొడుకుని పెంచాను. 
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, వారానికొకసారి కూర్చుని, ఏమి చదువుతున్నాడో చర్చించేవాడిని. వాడు ఇంటర్ స్టేట్ రాంకర్. పాకెట్ మనీ కాన్సెప్టు నా తండ్రి నాకు నేర్పారు. ఖమ్మంలో ఎనిమిదో క్లాసు చదువుతూ చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్తూ సంపాదిoచుకునేవాడిని. ఇంటర్ అవగానే, నా కొడుకు కూడా పగలు నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్ లో ఇండస్ట్రియల్ ట్రైనీగా 1500 కి పని చేస్తూ, సాయంత్రం పూట ఇంటి పక్కనే ఉన్న కాలేజిలో బి.కాం చదివాడు. యూనివర్సిటీ థర్డ్ రాంకర్. ఇరవై రెండేళ్ళకే సి.ఏ. పూర్తి చేసి, (ఈ లోపులోనే నాలుగు సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండటంతో) IIT, Ph.Dలతో పోటీ పడి ప్రపంచ బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించాడు. కొంతకాలం పని చేసాక, ఎం.బి.ఏ చదివి ప్రస్తుతం ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఏడాదికి మూడు కోట్ల జీతంతో పనిచేస్తున్నాడు. అతడి భార్య చార్టెడ్-అకౌంటెన్సీలో ఇండియా టాప్ రాంకర్. మనవడు టెన్నిస్ లో తన దేశం (వియత్నాం) తరుపున సింగపూర్ వెళ్ళాడు. పియానో లో ప్రావీణ్యం ఉన్నది. ఇంటర్నేషనల్ ఒలంపియాడ్‌లో గోల్డ్ మెడలిస్ట్. ఏషియా అబాకస్ కోసం రష్యా వెళ్ళాడు. అతడి వయసు పన్నెండు సంవత్సరాలు. పుట్టిన రోజులు జరుపుకోకుండా ఆ డబ్బులు ఛారిటీలకి ఇస్తాడు.
వారాలు చేసుకుంటూ చదివిన ఒక తండ్రి వంశం, మూడు తరాల్లో ఎలా మారిందో చూస్తే, వంశంలో ఒక్కరు బాగుపడితే వంశం మొత్తానికి అది టర్నింగ్ పాయింటై, సింగిల్ బెడ్ రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ విల్లాకి మారుతుందని చెప్పటానికే ఈ స్వోత్కర్ష. అవునా కాదా? ఆలోచించి చూడండి. 
మనిష బాగుపడకుండా ఉండటానికి కారణం డబ్బు లేకపోవటం కాదు. శ్రద్ధ లేక పోవటం. మంచి పెంపకం బ్రహ్మ విద్యేమీ కాదు. అన్ని వ్యాపకాలకన్నా (ముఖ్యంగా టి.వీ చూడటం కన్నా) అది నిజoగా బావుంటుంది. పెట్టుబడి ఏమీ అక్కరలేదు. పెంచటం పై ‘పాషన్’ ఉండాలంతే. 
అదీ ఈ వ్యాస పరoపర ఉద్దేశ్యం. పాతికేళ్ళ కొడుకు భుజం మీద ఒక తండ్రి చేయివేసి మాట్లాడగలిగితే అది అద్భుతమైన ప్రేమ ప్రకటన.
ఆకాశం పక్క మీద వెన్నెల దుప్పటేస్తే, చందమామ తలదిండు... జీవితం.
అమ్మవడి పక్కమీద ప్రేమ దుప్పటి పరిస్తే నాన్న చెయ్యి తల దిండు... బాల్యం.
బెస్ట్ ఆఫ్ లక్.

No comments:

Post a Comment

Total Pageviews