Tuesday, March 20, 2018

మీ ఇంట్లో తొమ్మిది , పది లేదా ఇంటర్ ఒకటవ, రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలు వున్నారా ? ఇంకా కింది { 7 , 8 వ తరగతులు } లేదా పై తరగతులు { ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా బి ఎస్ సి లాంటి డిగ్రీ లేదా పీజీ అయినా } అయినా సరే !

మీ ఇంట్లో తొమ్మిది , పది లేదా ఇంటర్ ఒకటవ, రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలు వున్నారా ? ఇంకా కింది { 7 , 8 వ తరగతులు } లేదా పై తరగతులు { ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా బి ఎస్ సి లాంటి డిగ్రీ లేదా పీజీ అయినా } అయినా సరే !
ఒక్కసారి దయ చేసివినండి . చూస్తున్నారుగా చుట్టూరా ఏమి జరుగుతుందో ? "మీ అంచనాలను అందుకోలేక పోతున్నాము" అంటూ పిల్లలు సెల్ఫీ వీడియో లు తీసి మరీ ఆత్మ హత్య చేసుకొంటున్నారు . అంటే వారు చిన్న బుచ్చుకొంటున్నది మీ అంచనాలను అందుకోలేమో అనే ఆందోళన వల్ల. ఇపుడు తల్లితండ్రులుగా మీరు అర్జెంటు గా చెయ్యాల్సింది ఒకటి వుంది . అబ్బో .. మా అబ్బాయి / అమ్మాయి అంత బలహీన మనస్తత్వం వున్నవారు కాదండీ.. వారు చదువులో అద్భుతంగా రాణిస్తారు అని అనుకోకండి . ప్రతి తల్లితండ్రి అలాగే అనుకొంటారు . జరగరానిది జరిగితే ఇక జీవితాంతం జీవచ్ఛవాల్లా ఉండాల్సి వస్తుంది . సరే మీ పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు . అలాంటి ఆలోచన రాదు . మంచిదే . కానీ ఇలా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు . దీని కోసం మీరు ఏమి ఖర్చుపెట్టనక్కర లేదు . కావాల్సిందల్లా మీ అరగంట సమయమే .
ఇంట్లో టీవీ గట్రా ఆఫ్ చెయ్యండి . ప్రశాంతగా దంపతులిద్దరూ కూర్చోండి . పిల్లల్ని ఎదురుగా కూర్చుపెట్టుకోండి . లేదా ఇంట్లో వద్దుఅనుకొంటే దగ్గరగా వున్నా పార్క్ లో కూర్చోపెట్టి ఇలా మాట్లాడండి .
నువ్వు నీ శక్తి కొద్దీ కష్ట పడి చదువు . మనసు లగ్నం చేసి చదువు . ఇప్పుడే ముగిసిన ఇంటర్ లాంటి పరీక్ష లు అయినా సరే రేపు జరగ బోయే ఎంట్రన్స్ పరీక్ష లు అయినా సరే . నీ శక్తి కొద్దీ చదువు. అదే చాలు . రిజల్ట్ ఎలా వున్నా ఫరవా లేదు . మేము ఏమీ అనుకోము . చిన్న బుచ్చుకోము . బాధ పడం. టెన్త్ లోనో ఇంటర్ లోనో ఫెయిల్ అయినా ఏమీ కాదు . ఇంజనీరింగ్ లోనో మెడిసిన్ లోనో సీట్ రాకపోయినా ఏమీ కాదు .
అయినా మనం చెయ్యాల్సింది కష్ట పడడం వరకే . ఫలితాలు మన చేతిలో వుండవు . మీరు ఆస్తికులైతే ఇలా చెప్పండి .. అయినా అన్నీ ఆ భగవంతుడు ముందుగానే నిర్ణయించి ఉంటాడు . శివుని ఆజ్ఞ లేనిదే { లేదా జీసస్ లేదా అల్లా - మీ మతాన్ని బట్టి ; మీరు నాస్తికులు అయితే దీన్నే హేతుబద్దంగా వివరించండి } చీమ అయినా కుట్టదు అంటారు . గీత లో కృష్ణుడు చెప్పినట్టు పని చెయ్యడం వరకే మన భాద్యత . దాని ఫలితం పై కాదు . అసలు ఫలితం గురించి ఆలోచిస్తే టెన్షన్ పెరిగి లక్షాన్ని అందుకోలేము . మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ చూసారు కదా . చివరి ఓవర్ ల లో ఇండియన్ బాట్స్మన్ ఎలా పరుగులు కొట్టి బంగ్లా దేశ్ ను ఓడించారో . వారు బాటింగ్ పై ద్రుష్టి పెట్టారు . అయ్యో పరుగులు వస్తాయో మ్యాచ్ గెలుస్తామో లేదో అని ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పెరిగి ఫలితం తయారు మారు అయ్యివుండేది .
జీవితం లో నీకు మేము వున్నాము . ఫలితం ఎలా వున్నా పరవా లేదు . ఇది కాక పొతే మరొకటి . అసలు నీకు ఒకటి తెలుసా . కృత్రిమ మేధస్సు, రోబో ల వినియోగం వల్ల నువ్వు చదువు ముగించి జాబ్ మార్కెట్ లో కి అడుగు పెట్టేటప్పటికీ ఇప్పుడున్న ఉద్యోగాల్లో చాల మటుకు వుండవు . కొన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి . ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి . జ్ఞాపక శక్తి పై ఆధార పడి జరిగే నేటి పరీక్షల్లో వచ్చే మార్కులు రాంక్ లు వాటి ఆధారంగా జరిగే కోర్స్ లు రేపు ఎందుకు కొరగావు .
జీవితం లో ఓటమి అంటూ ఏమీ ఉండదు . ప్రతి అపజయం ఒక చక్కటి అవకాశం . అది ఎన్నో పాఠాల్ని మనకు నేర్పుతుంది . నీలో శక్తికి పదును పెట్టు . చుట్టూరా జరిగే పరిణామాల్ని కనిపెట్టు . పాఠాల్ని గ్రహించు . ఇంజనీరింగ్ పరీక్షలో మంచి రాంక్ సాధించిన వాడు రేపు ఇంజినీర్ అవుతాడు . నువ్వు కాలేదనే బాధ వద్దు . వాడికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి నువ్వు ఎదుగు . ఇందుకు డబ్బు మూటలు అక్కర లేదు . గాడ్ ఫాదర్ అక్కర లేదు . కావలసింది సంకల్పం . ఇంటర్ నెట్ చేతిలో వుంది . అంటే అర చేతిలో ప్రపంచం . సమాజాన్ని చదువు . నీ శక్తి సామర్త్యాలను పెంపొందించుకో . ఎదగాలి అనే బలమైన సంకల్పము ఉంటే చాలు . మిఠాయల్ని అమ్ముకొనే వాడు ఏదో ఆ రోజుకి సంపాదిస్తాడు అనుకొంటారు . కానీ పుల్లా రెడ్డి గారు మరోలా ఆలోచించారు . వందల మందికి ఉపాధి కల్పించారు . అయన స్థాపించిన సంస్థల్లో ఇప్పుడు ఎంతో మంది చదువుతున్నారు . థింక్ బిగ్ . అపజయమే నీకు ఆయుధం కావాలి . నీలో కసిని పెంచాలి . ఇందుకు తల్లితండ్రిగా మేము నీకు అండగా ఉంటాము . మేము వద్దన్నా మరో ముప్పై ఏళ్ళు బతుకుతాము . అంతకాలం నీకు మా అండ ఉంటుంది .
పక్కింటి అంకుల్ లేదా పై ఇంటి ఆంటీ లేదా మీ ఫ్రెండ్ లేదా పక్క ఇంటి అమ్మాయి నువ్వు ఫెయిల్ అయ్యావని నవ్వని . ఏమి కద్దు . వారి నవ్వులే నీకు ఆశీర్వాదాలు . వారి వెక్కిరింపులే నీ ప్రగతి కి సోపానాలు . నాన్నా నీ పై ప్రాణం పెట్టుకొని బతుకుతున్నాము . నువ్వు మా కళ్ళముందు ఉంటే చాలు . ఎన్ని పరీక్షలు ఫెయిల్ అయినా ఏమి కాదు . ఎలాంటి అఘాయిత్యానికి పాలుపడను అని మా పైన ప్రమాణమా చెయ్యి . నీ result ఎలా వున్నా నీకు అండగా ఉంటామని మేము ఇదిగో దేవుడిపై { లేదా మీ అంతరాత్మ పై } ప్రమాణం చేస్తున్నాము .
ఇలా ఒక అరగంట గడపండి . తెలుగిళ్ళలో { ఆ మాట కొస్తే ఏ బాషా వారైనా} చావు మేళాలు మోగకూడదు. పిల్లల్ని కోల్పోవడానికి మించిన నరకం మరొకటి ఉండదు . అనారోగ్యం వల్ల అమ్మాయి ని కోల్పయిన నాకు తెలుసు గుండె కోత ఎలా ఉంటుందో . ఇలా చెప్పే నైతిక హక్కు నాకు వుంది . మరోకోణం లో కూడా నాకు అపజయాలు మన ప్రగతికి సోపానాలు అనే చెప్పే హక్కు నాకు వుంది . అండర్ ఏజ్ వల్ల నాకు ఆ రోజుల్లో ఎంబీబీస్ చేసే అవకాశం రాలేదు . అయ్యో ఎంతబాగా చదివినా ఎంబీబీస్ లేదా చివరికి వేటిర్నరీ లేదా అగ్రికల్చర్ bsc చేసే అవకాశం దక్క లేదు అని బాధ పడ్డా. అటుపై ఐఏఎస్ ను లక్ష్యం గా చేసుకొని మూడు సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్లినా ఏదో సర్వీస్ అయితే వచ్చింది కానీ అనుకొన్న ఐఏఎస్ రాలేదు . ఇప్పుడు వెనుతిరిగి చూస్తే నా తో పాటు చదివి డాక్టర్స్ అటు పైన ఐఏఎస్ లు అయినా వారికంటే ఎక్కువ సంతోషంగా బతుకుతున్నా. వందల మందిని డాక్టర్ లు గా ఐఏఎస్ లు గా తీర్చి దిద్దా . ఐఏఎస్ ల కంటే డాక్టర్ ల కంటే ఎక్కువ పేరు సంపాదించా . నా జీవితం లో చెప్పుకోదగ్గ విజయం లేదు . అన్నే పరాజయాలే. కానీ జీవితంగా మొత్తంగా చూస్తే నా జీవితమే ఒక సక్సెస్ స్టోరీ . పరాజయం తెచ్చివ విజయం ఇది . నేను జీవితం అనే పరుగు పందెం లో గెలిచిన తాబేలు .
ఇంతకూ వంద రేట్లు వెయ్యి రేట్లు మీ పిల్లలు విజయాన్ని సాధిస్తారు . నేడు ప్రపంచమే ఒక అవకాశాల గని . కావాల్సిందల్లా ఆలోచన . కృషి పట్టుదల . చికెన్ ముక్కలు అమ్మి డబ్బు సంపాదించాలి అంటే మీరు ఏమంటారు . అరేయ్ రోజుకు వంద రూపాయిలు కూడా సంపాదించ లేవు అంటారు . కానీ KFC వాడు మరోలా ఆలోచించాడు . అందుకే ప్రపంచ సామ్రాజ్యాన్ని నిర్మించాడు . అన్ని తలా కిందులు కానున్న రేపటి రోబో యుగం లు మార్కుల చదువులు చట్టుబండలు కానున్నాయి . ఆలోచనే పెట్టుబడి . అదే భవిష్యత్తు . మీ పిల్లలని ఎగరనివ్వండి. ఆ రెక్కల కు శక్తి నివ్వండి .
ఈ సందేశం మరొకరికి ఉపయోగ పడుతుంది అను కొంటె వారితో పంచుకోండి

No comments:

Post a Comment

Total Pageviews