Tuesday, March 6, 2018

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి 4

నిశ్శబ్దం రెండు రకాలు. లోపలా, బయట..! ఎనిమిదో క్లాసు వరకూ బాగా వచ్చిన మార్కులు సడెన్‌గా తగ్గిపోతే, దానికి చాలా కారణాలు ఉండవచ్చు. అందులో ఒకటి స్ట్రెస్. పిల్లల్లో నిరంతరం లోలోపల ఛాటింగ్ జరుగుతూనే ఉంటుంది. అది ఒక విధమైన మానసిక అలసటకి దారి తీస్తుంది. దానికి బెస్ట్ మందు ‘ధ్యానం’. అంటే ముక్కు మూసుకోవటం కాదు. నిశ్సబ్దంగా ఉండటం.
నిశ్శబ్దం అంటే చుట్టూ ఉన్న బిజీ, క్రేజీ ప్రపంచంలో నీ అస్థిత్వాన్ని నువ్వు గుర్తించుకోవటo. గమ్యం మీద దృష్టి నిలుపుతూ తనలోకి తాను అంతర్ముఖుడవటం. ఎంతోసేపు అవసరం లేదు. అయిదు నిముషాలు. మొదట్లో అయిదు నిమిషాలుగా ప్రారంభమైన ఈ ప్రక్రియ, సాగిoచే కొద్దీ మరింత ఆనందప్రసాదిని అవుతుంది. మిత్రుడు సీతారామశాస్త్రి వ్రాసినట్టు తనతో తాను రమించటమంటే అదే. ఆత్మవిమర్శకీ, అంతర్విమర్శకీ రోజుకో అయిదు నిముషాలు కేటాయించటంలో నష్టమేమున్నది?
ఒంటరితనం వేరు - ఏకాంతం వేరు. ఏకాంతం అంటే నీ నిశ్శబ్దాన్ని నువ్వు ప్రేమించటం. ఒంటరితనం అంటే నీ ఏకాంతాన్ని నువ్వు భరించ లేకపోవటం.
ఏకాంతం అంటే నీతో నువ్వు కమ్యూనికేట్ చేసుకోవటం. ఒంటరితనం అంటే ఛాటింగ్ కోసం మనసు తహతహలాడటం.
“కేవలం నా నిశ్శబ్దపు గ్యాపులను పూరించటానికి మాత్రమే మాటల్ని వాడతాను” అని ఎక్కడో వ్రాసాను. నిశ్శబ్దంగా పని చేసుకోవటం ఒకసారి అలవాటయితే, ఈ 'నిశ్శబ్దంతో మాట్లాడే ప్రక్రియ'ని, పిల్లలు తొందర్లోనే పెంచుకుంటారు.

No comments:

Post a Comment

Total Pageviews