Tuesday, March 6, 2018

పిల్లల మానసిక సమస్యలు - యండమూరి

పిల్లల మానసిక సమస్యలు
పిల్లల్లో కనపడే ఈ క్రింది సమస్యలకి డాక్టర్లు అవసరం లేదు. మీరు చాలు.
1. సమస్య - విశ్లేషణాలోపం: ‘హిమాలయాలకి అవతలి వైపు ఉన్న చైనా మన దేశానికి ఏ దిక్కున ఉన్నది? ఉత్తరమా? దక్షిణమా?’ అని అడిగితే ఇంటర్ చదివే అమ్మాయికి అసలు ప్రశ్నే అర్థం కాదు. కొందరు పిల్లలు ఈ విధంగా సమస్యల్ని విశ్లేషించలేరు. ఇది మానసిక రుగ్మత కాదు. చిన్న చిన్న క్విజ్ ప్రోగ్రాములు నిర్వహిస్తే ఈ సమస్య తగ్గిపోతుంది.
2. ధృక్పథ మార్పు లోపం: సమస్యని ఒకే దృక్పథంతో చూస్తూ, మరో రకంగా ఆలోచించలేకపోవటం కొందరి పిల్లల్లో లోపం. 'ఒక బెగ్గర్ అన్నయ్య చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి తమ్ముళ్ళు లేరు, ఎలా?' అన్న ప్రశ్నకి చాలాసేపు ఆలోచిస్తే అందులో తప్పేమీలేదు. కానీ 'బిచ్చగాళ్ళు అందరూ మగవారే అయ్యుండాలన్న రూల్ లేదు కదా' అని హింట్ ఇచ్చినా కూడా, సమాధానం చెప్పలేకపోతే ఈరకమైన లోపం ఉన్నదన్నమాట. ఈ పిల్లలు ‘ఆలోచించవలసిన’ ప్రశ్నల్ని అవాయిడ్ చేస్తారు. హేతువు, తర్కం పట్ల ఏ మాత్రం కుతూహలం ఉండదు.
3. కమ్యునికేషన్ లోపం: కొందరు పిల్లలు మాట్లాడుతూoటే అర్థంకాదు. అది మూడు రకాలుగా వస్తుంది. 1. నెమ్మది నెమ్మదిగా కూడబలుక్కుని మాట్లాడటం. 2. వేగంగా మాటలు దొర్లిస్తూ మాట్లాడటం. 3. కర్త కర్మ క్రియ లేకుండా మాట్లాడటం..! మొదటిదానికి స్పీచ్ తెరపిస్ట్ అవసరం. రెండోది హైపరాక్టివ్ లక్షణం. దీని గురించి తరువాత చర్చిద్దాం. మూడోది మాత్రం కాస్త ఆలోచించవలసిన విషయం. ఇంట్లో అందరూ వాడే భాషనే మాట్లాడుతున్నా, ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాడంటే ఎక్కడో లోపం ఉన్నదన్నమాట. అది భాషలోనా? మనస్తత్వంలోనా? అన్న విషయం గుర్తించాలి.
4. పక్క తడపటం (bed wetting): పిల్లల్లో ఉండే కొన్ని అతి సామాన్య లక్షణాలు పెద్దల్ని భయభ్రాoతులని చేస్తాయి. నిద్రలో ఉలిక్కిపడటం, పక్క తడపడం, మొదలైనవి ఉదాహరణలు. వారసత్వo, స్కూల్లో వత్తిడీ, ఇంట్లో గొడవలూ పిల్లలు పక్క తడపటానికి ముఖ్యకారణాలు. దాదాపు 80% పిల్లల్లో అయిదేళ్ళ వయసొచ్చేసరికి తగ్గిపోతుంది. ఈ లక్షణం దానంతట అదే తగ్గిపోవటo నిజానికి చాలా మంచి పరిణామo. అప్పటివరకూ బెడ్-వెట్టింగ్ చేసిన పిల్లవాడు ఆ అవలక్షణం పోగానే ‘నన్ను నేను కంట్రోల్ చేసుకోగలిగాను’ అని ఫీల్ అవుతూ స్వీయగౌరవాన్నీ, తన పట్ల నమ్మకాన్నీ పెంచుకుంటాడు. మీకు తెలుసా? సచిన్ టెండుల్కర్ నిద్రలో కలవరించేవాడు. అంతే కాదు, అతడికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉండేది. కానీ ఆ తరువాత అతడు క్రికెట్ వీరుడయ్యాడు.
5. ప్రతిస్పందనా లోపం: అడిగిన ప్రశ్నలకి మీ పిల్లలు ఎంత తొందరగా సమాధానాలు చెపుతున్నారు? ప్రతిస్పందనలునాలుగు రకాలు. 1) 1000+ 40+ 1000+ 30+ 1000+ 20+ 1000+ 10 ఎంతని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా 5000 అనటం తొందరపాటు ప్రతిస్పందన. 2) ఆరుగుళ్ళ రివ్వాల్వర్‌లో ఒక బులెట్ పెట్టి మాగజైన్ గిర్రున తిప్పి పేలిస్తే, అవతలివారు చావటానికి 1/6 ఛాన్స్ ఉంటుందని ప్రతిస్పందించటం కాన్ఫిడెన్స్. నుదిటి మీద పెట్టుకుని పేల్చి చూపించటం ఓవర్-కాన్ఫిడెన్స్. 3) రాముడి తండ్రికి సీత కొడుకు ఏమవుతాడని అడిగితే రెండు నిముషాలు ఆలోచించటం జడత్వ ప్రతిస్పందన (స్లో రిఫ్లెక్స్). 4) అసలు ఆలోచించటానికే ఇష్టపడక పోవటం ప్రతికూల ప్రతిస్పందన.
6. ఎడమ చేతివాటం: ఇది అసలు అవలక్షణమే కాదు. ఒక రకంగా అది మంచిది కూడా. రెండు చేతులూ సమానంగా ఉపయోగపడి, ఎడమ చేతివాటం ఉన్నవారు మిగతా పిల్లలకన్నా చురుగ్గా ఉంటారు.
6. అతి వాగుడు Vs ఇంట్రావర్షన్ Vs రిజర్వ్‌డ్‌నెస్: అవసరం లేకపోయినా మాట్లాడటం అతి వాగుడు, అవసరo ఉన్నా మాట్లాడ లేకపోవడం ఇంట్రావెర్షన్. రెండూ తప్పే. క్లుప్తంగా మాట్లడడం రిజర్వ్‌డ్‌నెస్. క్లాసులో ‘అమెరికా ప్రధానమంత్రి ఎవరు?’ అని అడగగానే దూరంనుంచి మరెవరో ‘మోడీ’ అని సమాధానం చెప్తారు. ‘ఆడిగింది ఎవరిని? నువ్వెందుకు చెప్తున్నావు?’ అని ప్రశ్నిస్తే అటునుంచి సమాధానం ఉండదు. జ్ఞానులు మాట్లాడవలసి ఉంది కాబట్టి సంభాషిస్తారు. అజ్ఞానులు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అవసరం లేకపోయినా ఎక్కువ మాట్లాడటాన్ని ‘డయేరియా ఆఫ్ టాకింగ్’ అంటారు. ఒక వయసు వచ్చాక కూడా పిల్లలు లొడలొడా మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులకి బావుంటుందేమో కానీ, అది ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అలా అని ఏమీ మాట్లాడకుండా ముంగిలా ఉంటే అది మరింత ప్రమాదకరం. స్నేహంగా హుషారుగా ఉండటం వేరు, అతివాగుడు వేరు.
పరిష్కార మార్గాలు:
1. ముందు పిల్లవాడికి ఫలానా బలహీనత ఉంది అని నమ్మండి. (a+b)2 ఎంతో చెప్పగలిగిన కుర్రవాడు (b+a)2 చెప్పలేకపోతే జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. వాళ్ళ తెలివితక్కువతనం మీదా, బలహీనతల మీదా దృష్టి నిలపకుండా, వాటినుంచి బయట పడడానికి వారు చేసే ప్రయత్నాలకి చేయూతనివ్వండి.
2. షాప్కి వెళ్ళి నెలసరి దినుసులు తీసుకురావటం, బిల్లు సరిగ్గా ఉన్నదో లేదో చూడటం, సొంతంగా ఆటో మాట్లాడుకుని సామాన్లు ఇంటికి తీసుకురావడం లాంటి చిన్నచిన్న విషయాలు కూడా మానసిక వికాసానికి తోడ్పడతాయి.
3. చాలెంజస్లో పాల్గొనేలా చేయండి. ఉదాహరణకి మీ ఎత్తు ఎంతో ఉజ్జాయింపుగా చెప్పమని బంపర్ బహుమతి ఆఫర్ చెయ్యండి. మీ డైనింగ్ టేబుల్ పొడవు 70 అంగుళాలా? అంతకన్నా ఎక్కువా? అని మీ పిల్లల్తో పందెం కట్టండి. ఆ తరువాత స్కేల్తో కొలిచి చూడండి. ఉత్సాహభరితమైన ఈ రకo లెక్కలు పిల్లల్లో చురుకుదనాన్ని ప్రేరేపిస్తాయి.
4.. చిన్న వయసులోనే పిల్లలకి డైరీ రాసే అలవాటు చేయండి. పిల్లలకి మీరిచ్చే గొప్ప బహుమతి అది. డైరీ అంటే మనసుతో డేటింగ్ చేసుకోవటం. ముఖ్యంగా ఇంట్రావర్ట్ పిల్లలకి ఈ అలవాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 'పడుకోబోయే ముందు, మరోలా చెప్పాలంటే, రోజు చివర్లో స్వీయ-విమర్శ చేసుకోవటం కోసం అయిదు నిమిషాలు గడపలేని వాడు జంతువుతో సమానం. ఎందుకంటే జంతువులు డైరీలు రాయవు' అంటాడు బెర్నాడ్ షా.
6. తల్లిదండ్రులు పక్కన లేకపోతే తమ పనులు తాము చేసుకోవటం, తోటి పిల్లలతో కలిసి పని చేయాల్సిన అవసరం... ఆ విధంగా పిల్లలు తమ గుహలోనుంచి బయటకి రావడానికి సమ్మర్ కాంప్స్, టూరిజం మొదలైనవి సహాయపడతాయి. వారి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.
7. చిత్రలేఖనం, మ్యూజిక్ మొదలైన అభిరుచుల్ని కొందరు పెద్దలు మొగ్గలోనే త్రుoచివేయటంతో, మరే రకమైన అభిరుచీ, ఆర్టూ లేని పిల్లలు అతివాగుడికి అలవాటు పడతారు. ఈ చిన్న విషయం పేరెంట్స్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బావుంటుంది.
పిల్లలకి ఇంకా మాటలు రాలేదనీ, చెవులు వినిపించటం లేదనీ కంగారూ పడే పేరెంట్స్ ఒక విషయం గమనిచాలి. భయం వేరు. జాగ్రత్త వేరు. పిల్లల్లో హైపర్-ఆక్టివ్ డిజార్డర్ పదేళ్ళు వచ్చేసరికి దాదాపు తగ్గిపోతుంది. కొన్ని స్వభావ సిద్ధమైన సహజ ప్రవర్తనా లోపాలు వయసు పెరిగిన తరువాత కూడా కొనసాగితే భయపడాలే తప్ప, చిన్నపిల్లల్లో అలాంటి లక్షణాలు ‘లేకపోతేనే’ భయపడాలి. పొరపాటున మీరు ఏ ‘ఫేక్’ కౌన్సిలర్ దగ్గరకో, హిప్నాటిస్ట్ దగ్గరకో వెళ్తే మిమ్మల్ని మరింత భయపెట్టే ప్రమాదం ఉంది. ముందే చెప్పినట్టు, మంచి క్వాలిఫైడ్ వైద్యుడి దగ్గరకు మాత్రమే తీసుకువెళ్ళండి. అది కూడా, వయసు పెరిగిన తరువాత కూడా ఆ లక్షణాలు ఉంటేనే..! లేకపోతే మీ లావు పర్సు సన్నబడుతుంది.

No comments:

Post a Comment

Total Pageviews