Tuesday, March 6, 2018

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి - 5

'ఆపిల్‌ తినొద్దు' అన్నాడు భగవంతుడు. 'ఎందుకూ?' అన్నాడు మనిషి. 'కారణాలు అడక్కు. ఆపిల్ తినొద్దన్నానంతే' అరిచాడు దేవుడు. ఆయన మాటలు వినకుండా అతడూ, అతడి భార్యా పండు తిన్నారు. కోపమొచ్చిన భగవంతుడు వాళ్ళకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు.
వారికి సంతానాన్ని ఇచ్చాడు.
...
"నేను రాక్షసుల్నీ, భూతాల్నీ పెంచుతున్నానా?" అన్నది మీ ప్రశ్నయితే దానికి సమాధానం… ‘కాదు. నిశ్చయంగా కాదు..!’
ఇంట్లో కుటుంబసభ్యులందరూ మాటిమాటికీ ఆనంద భాష్పాలు తుడుచుకోవటం కేవలం టీ.వీ. అడ్వర్టైజ్మెంట్లలోనే చూస్తాం. ఘర్షణలు లేకుండా ఏ ఇల్లూ ఉండదు. కానీ కొద్ది ప్రయత్నంతో ‘హౌస్’ని ‘హోమ్’ చేసుకోవచ్చు. ప్రేమ ఆప్యాయతలు సిమెంటు ఇసుకలుగా కలిపి పిల్లలకి ‘వ్యక్తిత్వo’ అనే మంచి భవంతిని నిర్మిస్తే, తిరిగి అంతే ప్రేమ వృద్ధాప్యంలో దొరుకుతుంది. బంధం మల్లె తీగలాంటిది. అది పెరిగి పూలు పూయాలంటే మంచి పోషణ కావాలి. పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వంతో వికసించాలంటే, వయసుతో బాటు వచ్చే వారి మానసిక పరిణామాల గురించి తెలుసుకుంటూ దానికి తగ్గ పోషణనివ్వాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాo.
1. నమ్మకం / అపనమ్మకం:
పద్దెనిమిది నెలల వయసు వరకూ పిల్లలు ‘నమ్మకం/అపనమ్మకం‘ స్టేజ్లో పెరుగుతారు. తమ అవసరాలన్నీ పెద్దలు తీరుస్తూoటే, చుట్టూ ఉన్న వాళ్ళంతా దయార్ద్ర హృదయులనీ, ప్రపంచమంతా మంచిదనీ నమ్మకం పెంచుకుంటారు. తల్లి ఎలాగూ పక్కనే ఉంటుంది కాబట్టి, తండ్రి కూడా ఎక్కువ సమయం గడిపే కొద్దీ, పిల్లలకి మనుష్యుల పట్ల మరింత సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అలా కాకుండా... పనుల వత్తిడి వల్ల పెద్దలు చంటి పిల్లలని సరిగ్గా చూసుకో లేదనుకుందాం. పసి వయసులోనే ప్రపంచం పట్ల వారికి అపనమ్మకం ఏర్పడుతుంది. ఒక ఉదాహరణ ద్వారా ఇది పరిశీలిద్దాం.
ఇరవై ఏళ్ళ అమ్మాయి తల్లి అయింది. అందం చెడిపోతుందన్న భయంతోనో, ఫేస్బుక్ పిచ్చివల్లనో, చాటింగ్లో పడి పిల్లవాడి పెంపకం పట్టించుకోదు. పాలు కూడా ఇవ్వదు. ఏడ్చిఏడ్చి పిల్లవాడే ఆపాలే తప్ప ఆపాల గురించి పట్టించుకోదు. అప్పుడతడు రెండు రకాలుగా మారవచ్చు. (ఏ) ప్రతి చిన్న విషయానికీ ఇతరుల మీద ఆధారపడటం. (బి) ఎవరినీ లెక్క చేయకుండా ఏకాకిగా బ్రతకటం.
‘పిల్లలపై వారి బాల్యం తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది’ అన్న విషయాన్ని, ప్రపంచపు అత్త్యుత్తమ ఇద్దరు సైకాలజిస్టులు కెల్లీ, ఫ్రాయిడ్ రెండు విభిన్నమైన దృక్పథాలతో చూస్తున్నారు.
 బాల్యం బాగా లేని ఎందరో ప్రముఖుల జీవితాలు పరిశీలించిన కెల్లీ “... చిన్న వయసులో కష్టాలు అనుభవించిన పిల్లలు స్వతంత్రభావాలతో ఎదిగి, తాము అనుకున్నది సాధిస్తారని" అంటాడు. లింకన్, థామస్ ఆల్వా ఎడిసన్, లాల్ బహదూర్ శాస్త్రి, హారిసన్ ఫోర్డ్ (ఇండియానా జోన్స్) లాంటి గొప్పవాళ్ళ ఉదాహరణలు చూస్తే ఈ థియరీ కరెక్టే అనిపిస్తుంది.
 మరో పక్క ఫ్రాయిడ్ దానికి వ్యతిరేకంగా “బాల్యంలో ప్రేమ రాహిత్యం వల్ల పిల్లలు మాఫియా లీడర్లు, టెర్రరిస్టులుగా మారతారు” అని వాదిస్తాడు. స్టాలిన్, హిట్లర్ మొదలైనవారి జీవితాలని చూస్తే ఆ థియరీ కూడా కరెక్టే అనిపిస్తుంది.
దీనిబట్టి మనకో విషయం అర్థం అవుతుంది. బాల్యంలో పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు ఏదో ఒక విపరీత ధోరణిలో పయనించక తప్పదు. అటు కోపం, చెడు అలవాట్లు, డిప్రెషన్ లాంటి నెగటివ్ పరిణామాలు కావచ్చు. లేదా పట్టుదల, గమ్యం, కసి లాంటి పాజిటివ్ (మంచి) కావచ్చు. ఫ్రాయిడ్ చెప్పినా, కెల్లీ చెప్పినా అదే కదా..! పిల్లల భవిష్యత్తుని ‘విధి’ కి వదిలేయ్యాకుండా ఉండటమే ఉత్తమ పేరెంటింగ్.
2. నిర్ధారణ / అనుమానం:
ఒకటి నుంచీ మూడు సంవత్సరాల పిల్లల్లో, తమ చుట్టూ ఉన్న వాతావరణం పట్ల కుతూహలం మొదలవుతుంది. వారికో ఐడెంటిటి ఏర్పడుతుంది. తప్పటడుగులకే తల్లి సంబరం, ముద్దుముద్దు మాటలకి పెద్దలు ముచ్చటపడే విధానం, వీటన్నిటి వల్లా ప్రపంచం అంతా తననే ప్రేమిస్తుందన్న నమ్మకం కలుగుతుంది. తనని చూసి ఓ అబ్బాయి నవ్వగానే తనలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుందన్న అమ్మాయి అమాయకత్వం లాంటి స్టేజి ఇది. దీని తరువాత పిల్లలు అతి ప్రమాదకరమైన మూడో స్టేజ్లోకి వెళ్తారు.
3. తెలివి / జడత్వం:
మూడేళ్ళ వయసులో పిల్లలు తొలిసారి ఇల్లు వదిలి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య పెరిగిన పిల్లలు టీచర్లు, ఆయాల సంరక్షణలోకి వెళ్తారు. స్కూల్లో తోటి పిల్లల మధ్య కొత్త వాతావరణం... ఇంట్లో ప్రేమ స్థానే బయట టీచర్ల విసుగు అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ ప్లే-స్కూల్స్ ని తక్కువ చెయ్యటం కాదు. ప్లే-స్కూల్స్‌లో ఆయాలు. టీచర్స్ చాలా ఓర్పు, సహనంతో ఉంటారు. అయినా వారూ మనుష్యులేగా..! అప్పుడప్పుడు వారి బాధ్యతారహిత రుసరుసల మధ్య పసిపిల్లల బాల్యం కొత్త మలుపు తిరుగుతుంది.
మరోపక్క ఇంట్లో వాతావరణం కూడా కాస్త వేడెక్కుతుంది. అల్లరికి తల్లిదండ్రులు విసుగు ప్రదర్శిoచటం మొదలుపెడతారు. అప్పటివరకూ అడిగిందల్లా ఇచ్చిన పెద్దలు, అసంబద్ద కోర్కెలని తిరస్కరిoచటం ప్రారంభిస్తారు. ‘నిరాదరణ’ అంటే ఏమిటో కొద్ది కొద్దిగా తెలుస్తుంది. జీవితం అంటే పరమాన్నమే కాదు, పచ్చిమెరపకారం అనేది తొలిసారి అర్థమవుతుంది.
ఈ షాక్‌ని వారు ఓపట్టాన తట్టుకోలేరు. తమ హక్కుల కోసం ప్రతిఘటించటం నేర్చుకుంటారు. అక్కడి నుంచీ అల్లరి ప్రారంభం అవుతుంది. పిల్లల హైపర్-ఆక్టివిటీకీ, పెద్దల కంట్రోల్ కీ మధ్య ఇల్లు యుద్ధరంగం అవుతుంది.
ఈ విషయమై 69 పిల్లల్ని కని ప్రపంచ రికార్డ్స్ సృష్టించిన మిస్సెస్ ఫీయొడెర్ “ఏడాది రాగానే పిల్లలకి ‘…మ్ ...మ్మ ...అమ్మ... అనమ్మా’ అంటూ ప్రోత్సాహిస్తాం. రెండేళ్ళు వచ్చేసరికి “దామ్మ... దా” అంటూ నడవమని బలవంతపెడతాము. ఆ తరువాత ఇరవై ఏళ్ళ పాటు వాళ్ళని “కాస్సేపు మాట్లాడకుండా ఉండవా, కదలకుండా కుదురుగా కూర్చోవా. ప్లీజ్. నీకు దణ్ణం పెడతాను’ అంటూ ప్రార్థిస్తాం” అంటుంది.
4. క్రియేటివిటి / ఆత్మన్యూనత:
అయిదు నుంచి పదమూడేళ్ళ వయసులో పిల్లలు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. తమ తెలివితేటలని బహిర్గత పరచాలన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వారి ఉత్సాహానికి ప్రోత్సాహం లభించిన పిల్లలు తెలివైన వారుగా; లేని పిల్లలు జడులుగా (జడత్వం అంటే క్రియేటివిటి లేకపోవటం), ప్రయాణం మొదలుపెడతారు. పెద్దల కోపం అర్థమవటం ప్రారంభం అవుతుంది ప్రేమ ఆప్యాయతలు బలంగా పెనవేసుకునేది ఈ స్టేజ్‌లోనే.. ఆ సమయంలో పెద్దల నుంచి నిరాదరణా, విమర్శా, దండనా ఎక్కువైతే వాళ్ళు ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు.
5. గెలుపు / అయోమయం:
13-20 మధ్య వయసులో పిల్లలకి ఒక రంగుల లోకం కనబడటం ప్రారంభం అవుతుంది. ఎవరికీ చెప్పుకోలేని శారీరకమార్పులతో పాటూ, అందం తాలూకు అవగాహన కూడా మొదలవుతుంది. కాస్త థ్రిల్. చాలా అయోమయం. ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, తమపట్ల తమకి నమ్మకం ప్రారంభం అవుతుంది. ఆ నమ్మకం మితి మీరితే రాష్ డ్రైవింగ్ (సూడో-గెలుపు), అపోజిట్ జెండర్‌తో ప్రేమ (గుర్తిoప బడాలన్న కోరిక), చిన్న వయసులోనే సెక్స్ (విచక్షణా లేమి) మొదలైన - దార్లలోకి వెళ్ళవచ్చు. తమపై నమ్మకం తగ్గితే పిరికితనం, నత్తి, నిర్ణయలేమి మొదలైన అవలక్షణాలకు గురి అవ్వొచ్చు.
తల్లిదండ్రులని వదిలేసి స్నేహితుల వైపు మొగ్గే వయసిది. తమ అస్తిత్వం (ఐడెంటిటి) నిలుపుకోవడానికి వీళ్ళు తరచూ ఇంట్లో పోట్లాడుతూ ఉంటారు. ఎదిగిన ఒక పేరెంట్కీ, ఎదుగుతూన్న ఒక వ్యక్తిత్వానికీ మధ్య ఘర్షణే అల్లరి. ఈ పోరాటంలో గెలిచినా/ఓడినా పెద్దలకి దూరం అవుతారు. మరోరకంగా చెప్పాలంటే తమ పోరాటంలో పెద్దల్ని గెలిచిన తరువాత, తమ గెలుపుని (కొత్త మోటర్ బైక్, పబ్కి డబ్బులు) స్నేహితులతో పంచుకుంటారు. ఇంట్లో గడపటం తక్కువ అవుతుంది. ఒకవేళ పెద్దలు ఇటువంటివి నిరాకరించినా, ఆ కారణం వలన పెద్దలకి దూరం అవుతారు.
ఆ పైది యుక్త వయసు. ‘తన కుటుంబం’ అన్న ధ్యాస ప్రారంభం అవుతుంది. కొందరు లంచగొండితనం, స్వార్థం వైపు వెళితే, మరికొందరు సమాజంలో గుర్తింపు, ఇతరులకి సహాయం, దయాగుణo మొదలైనవి అలవర్చుకుంటారు. వీరు గెలిచినవారు. తాము సాధించిన విజయాలని తలుచుకుంటూ, మరణం గురించి దిగులు చెందకుండా వార్ధక్యపు అంతిమ గమ్యాన్ని సంతృప్తితో చేరుకుంటారు. అయితే ఈ పుస్తకం పిల్లల గురించే తప్ప ఇరవై ఏళ్ళు దాటిన వారి గురించి కాదు కాబట్టి ఈ వివరణ ఇక్కడితో ఆపుదాం.

No comments:

Post a Comment

Total Pageviews