Monday, March 5, 2018

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు 1

"టీన్స్ పెంపకం ఒక కళ" యండమూరి పుస్తకం నుంచి కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకోవలసినవి, మనం అందరం ఆచరించవలసినవి. అందుకే మంచి పుస్తకాలు చదువుదాం! పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చేద్దాం! సత్యసాయి విస్సాఫౌండేషన్! .......ఒక వాస్తవం జీవితాన్ని మారుస్తుంది:

డెలాయిట్ కంపెనీలో సెమినార్ పూర్తయిన తరువాత ఒక యంగ్ ఎగ్జిక్యూటివ్ తన అనుభవం చెప్పాడు. "మాది మధ్య తరగతికి కాస్త దిగువ కుటుంబం. డిగ్రీ చదువుతున్న అన్నయ్య. పెళ్లి కావలసిన ఇద్దరు అక్కలు. నేను ఇంటర్ చదివే రోజులు. మా స్నేహితులందరికీ మోటార్ సైకిల్స్ ఉండేవి. రైడింగ్ నాకు చాలా ఇష్టం. మా నాన్నని కొనమని అడిగాను. ఒప్పుకోలేదు. ‘ఎలాగైనా కొనాల్సిందే’ అని తిండి మానేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసాను. మామూలుగా కన్నా ఎక్కువ నీరసం నటించాను. మూడు రోజులయ్యేసరికి నాన్న దిగివచ్చారు. గదిలో పడుకుని ఉన్నాను. అమ్మ నా పక్కనే కూర్చొని బ్రతిమాలుతోంది. నాన్న లోపలకి వచ్చి అమ్మతో ముక్తసరిగా, “వాణ్ణి తిండి తినమను. రేపు కొనిస్తానని చెప్పు" అని వెళ్ళిపోయాడు. అంత తొందరగా నాన్న దిగి వస్తాడనుకోలేదు. ఎవరెస్టు ఎక్కినంత సంతోషం వేసింది. అమ్మ తడి గుడ్డతో మొహం తుడిచి వంటింట్లోకి తీసుకెళ్తూండగా, వాష్ బేసిన్ దగ్గర నాన్న నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ఏడుస్తూ ఉండటం చూసాను. వళ్ళంతా జలదరించింది. బహుశా అప్పుడే నా జీవితం మలుపు తిరిగి ఉంటుంది. నేనీ రోజు ఇక్కడ ఇలా ఉన్నతస్థితిలో ఉన్నానంటే ఆ సంఘటనే కారణం. ఉద్యోగంలో చేరిన అయిదు సంవత్సరాలవరకు బైక్ కొనలేదు. ముందు నాన్నగారి ఇంటి అప్పు తీర్చాను."

యూ ఆర్ డిఫరెంట్:

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కాలేజికి వెళ్ళటం మానేసిన అమ్మాయి, పిక్నిక్ కి డబ్బులివ్వలేదని చేతి నరం కోసుకున్న అబ్బాయి మాకు తెలుసు. పిల్లలకు మీ ఆర్థిక పరిస్థితులు అర్థమయ్యేట్టుగా చెప్పండి. సర్దుకుపోవడం, రాజీపడడం నేర్పoడి. క్రికెటర్ రోహిత్ శర్మ తండ్రి, కొడుకుని సరిగ్గా పోషించలేక తన తండ్రి (తాత) దగ్గర వదిలేసాడు. రోహిత్ శర్మ పని చేస్తూ చదువుకున్నాడు. సి.ఏ. చదివేరోజుల్లో మధ్యాహ్నం లంచ్ కి మా ఇంట్లో ముప్పై పైసలు ఇచ్చేవారు. దానికి ఒక దోశ వచ్చేది. చెట్ని ఫ్రీ కాబట్టి ఐదారుసార్లు వేయిoచుకునే వాడిని. ఇదంతా, రొమాంటిసైజింగ్-ది-పాస్ట్ గా గొప్పలు చెప్పటం కాదు. అర్థం చేసుకునే వయసు రాగానే, లేనిపోని హెచ్చులకి పోకుండా తమ ఆర్థిక పరిస్థితి చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశ్యం.

"క్లాసులో అందరికీ సెల్ఫోన్స్ ఉన్నాయి. నాకే లేదు" అని మీ పిల్లవాడు పోరు పెడుతూంటే, "నువ్వు డిఫరెంటమ్మా. వాళ్ళు వేరు, మనం వేరు. మనకి అంత స్తోమతులేదు” అనండి.

“వడ్డున కుర్చుని సలహాలివ్వటం సులభం. మీకేం తెలుసు? అడిగింది ఇవ్వకపోతే ఇల్లు పీకి పాకం పెడతారు” అంటారా? అవసరాలు మానుకుని పిల్లలు అడిగిందల్లా కొనివ్వటం, సుఖాలు తగ్గించుకుని వారికి సౌఖ్యాలు అమర్చటం... ఇలా చేస్తూ పోతే, కొంతకాలం అయ్యేసరికి పిల్లలు దాన్ని ప్రేమగా గుర్తించరు. ఇవ్వటం మీ బాధ్యత అనుకుంటారు. ఇవ్వటం ప్రేమ కాదు. ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎంత ఇవ్వాలో తెలుసుకుని అంతే ఇవ్వటం ఆరోగ్యకరమైన ప్రేమ. మరోలా చెప్పాలంటే, వారి పట్ల మీ ప్రేమ ప్రూవ్ చేసుకోవటం కోసం ఇవ్వటం కన్నా... వారి మంచి భవిష్యత్తు కోసం, కోర్కెల్ని కంట్రోల్‌లో పెట్టుకునే గుణం వారికి నేర్పటం కోసం… కావలసింది మాత్రమే ఇస్తున్నారన్న మాట. పిల్లల్ని ఇన్వాల్వ్ చెయ్యటమంటే, మీ (ఆర్థిక) సునామీ ఆటుపోట్లలో చుక్కాని వారి చేతికి ఇవ్వటం అన్నమాట. ఆ చుక్కానికి మరో పేరే ‘బాధ్యత’.
From: TEENS PEMPAKAM OKA KALA

No comments:

Post a Comment

Total Pageviews