Saturday, February 1, 2020

సిరి ధాన్యం చిరాయువు

కరోనా వైరస్ వల్ల మానవ జాతి అంతరించి పోతుందా ?

మీకు తెలుసా ? ప్రకృతి లో అనేక రకాల వైరస్ లు వున్నాయి . అందులో మానవుల పై దాడి చేయగలిగిన వైరస్ లు 219  . ఇప్పటిదాకా జంతువులకు మాత్రమే  పరిమితమైన కొన్ని వైరస్ లు  ఆహార ఇతరత్రా అలవాట్ల వల్ల మానవుల్లోకి ప్రవేశిస్తున్నాయి . HIV , కరోనా వైరస్ లు ఇలా వచ్చినవే !

వైరస్ లు మన చుట్టూరా వున్నాయి . మనం పీల్చే గాలిలో , తాగే నీటిలో , భూమి పైన ఇలా అన్ని చోట్ల వున్నాయి . వీటిలో చాల మటుకు గాలి ద్వారా వ్యాపించేవే ! కేవలం కొన్ని వైరల్ వ్యాధులకు మాత్రమే నివారణ టీకా లు వున్నాయి . వైరల్ వ్యాధులకు చికిత్స లేదు .

 మరి చికిత్స లేని వైరస్ లు ఇన్ని వున్నప్పుడు వైరల్ వ్యాధి వస్తే మనిషి మరణించాలి కదా ? కరోనా వైరస్ ను పక్క పెట్టండి . ఫ్లూ , మసూచి లాంటి వ్యాధులకు మనుషులు పెద్ద ఎత్తున మరణించి ఉండాలి కదా ?  ఆలా జరిగిందా ?

 మీకు తెలుసా ? ఫ్లూ జ్వరం { అంటే వైరస్ వల్ల వచ్చే జలుబు } వల్ల ఏటా నాలుగు లక్షల మంది చని పోతున్నారు . ఈ సంఖ్య చాల పెద్దదిగా అనిపించవచ్చు . కానీ ఈ వ్యాధి సోకిన వెయ్యి మంది లో పది మంది మాత్రమే మరణిస్తారు . చికిత్స లేని ఈ వైరల్ వ్యాధి సోకినా ఎలా బతుకు తున్నారు ? ఎలా కోలుకొంటున్నారు ?

మీరు సినిమా థియేటర్ లోనో విమానం లోనో కూర్చున్నారు . అక్కడ ఒక వ్యక్తికి జలుబు వుంది . ఆ వైరస్ మీ శరీరం లోకి ప్రవేశిస్తుంది . మీరు ఒక తలుపునొ ఒక లిఫ్ట్ బటన్నో తాకారు . అక్కడ బాక్టీరియా  వుంది . అది  మీ చేతిని నుండి మీరు కళ్ళు తుడుచుకొన్నప్పుడో , ముక్కు రాసుకొన్నపుడో , మీ శరీరం లోకి ప్రవేశిస్తాయి . ఇలా రోజూ కొన్ని వందల సార్లు .. కొన్ని వందల సూక్ష్మ జీవులు..  మీ శరీరం పై దాడి చేస్తాయి . ఇది నిరంతరం జరిగే ప్రక్రియ . మీ సెల్ ఫోన్ లో కొన్ని లక్షల సూక్ష్మ జీవులు వున్నాయి . మీ కంప్యూటర్ కీ బోర్డు,  మీ కార్ సీటు ఇలా  ప్రతి  చో టా సూక్ష్మ జీవులే . అవి నిరంతరం శరీరం పై దాడి    చేస్తూనే ఉంటాయి .

 మరి శరీరం ఏమి చేస్తుంది ?    మీరు ఏదైనా ఫంక్షన్ లోనో , పబ్ లోనో,  హీరో లేదా హీరోయిన్ చుట్టూరా కండలు తిరిగిన వీరుళ్ళను చూసి వుంటారు . వాళ్ళను బౌన్సర్లు అంటారు . మన శరీరం లో కూడా పెద్ద సంఖ్య లో బౌన్సర్లు వున్నారు . దాన్నే ఇమ్యూన్ సిస్టం అంటారు . పిలవని పేరంటం గా బాక్టీరియా లేదా వైరస్ శరీరం లోకి ప్రవేశిస్తే ఈ బౌన్సర్లు వెంటనే వాటి పై దాడి చేసి చంపేస్తాయి . ఇది రోజు జరిగేదే . మీరు నా పోస్ట్ చదివే లోపే మీ శరీరం లో బౌన్సర్ లు తమ పని తాము చేస్తూ పదుల సంఖ్యలో సూక్ష జీవులను చంపేసుంటాయి . మనిషి చనిపోయాక ఒక రోజులో శరీరం కుళ్ళు వాసన వస్తుంది . ఎందుకిలా ? అంటే చనిపోగానే బౌన్సర్లు లు పని చెయ్యరు . అప్పుడు బాక్టీరియా దాడి చేసి శరీరాన్ని జయించి  తినడం మొదలు పెడుతుంది .

 సో కరోనా  నో .. మరొకటో .. ఇలాంటి గాలి ద్వారా సోకి చికిత్స లేని వైరస్ ల నుండి మనకు రక్షణ కల్పించేది మన శరీరం లోని బౌన్సర్లు . అదేనండి ఇమ్యూన్ సిస్టం . మరి ఇమ్యూన్ సిస్టం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి ?
 
నాకు కొన్ని నెలల దాక చాల సులభంగా జలుబు సోకేది .  వాతావరణం మారినా .. ఎక్కువగా అలసిపోయినా పచక్ పచక్ అంటూ తుమ్ములు .. మూడు రోజుల పాటు.. జలుబు దగ్గు .. ; అటు పై తగ్గి పొయ్యేది .  గత ఎనిమిది నెలలుగా ఒక్కటంటే ఒక్క సారి  కూడా   నాకు జలుబు రాలేదు . మొన్న సముద్రం లో గంటల కొద్దీ ఈదినా , వరుసగా విమాన ప్రయాణాలు చేసి అలిసి పోయినా , కొద్దిగా గొంతు కరకర అనిపించినా ఒకటి రెండు గంటల్లో దానంతట అదే తగ్గి పోతోంది . ఒకప్పుడు నేను రోజూ హోమియో వాడేవాడిని . ఇంట్లో ANTI  BIOTIC మాత్రలు ఎప్పుడూ ఉండేవి . మొన్ననే మా శ్రీమతి " అవన్నీ EXPIRY డేట్ అయిపోయివుంటాయి . తీసి పడేసాను"  అంది .

నా లోని  బౌన్సర్లు   ఇలా బాహుబలి    లా బలోపేతం కావడానికి ప్రధమ కారణం నేను తింటున్న మిల్లెట్స్ -- కొర్రలు , అందు కొర్రలు మొదలైన అయిదు రకాల సిరి ధాన్యాలు . వారం అంటే ఏడు రోజులు . రోజుకి మూడు సార్లు అంటే మొత్తం 21  సార్లు . కనీసం 17  సార్లు నేను సిరి ధాన్యాలే తింటున్నాను . ఇది నిజంగా అద్భుతాలు చేస్తోంది . వీరమాచినేని లేదా మంతెన డైట్ గురించి నాకు తెలియదు . ఖాదర్ వలి గారు ప్రాచుర్యం లోకి తెచ్చిన డైట్ నిజానికి కొత్తది కాదు .     వేల సంవత్సరాలు మన పూర్వీకులు తిన్న  సిరి ధాన్యాలే . సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ వుండవు . మనం తింటున్న బియ్యం విషంగా మారి     పొ  య్యింది . హరిత విప్లవం  దాకా    వున్న బియ్యం,  గోధుమలు వేరు ; నేటి బియ్యం గోధుమలు వేరు అని గుర్తించండి . మనసు ను నియంత్రిస్తే మిల్లెట్స్ ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు . ఒక  పూట  తిని రుచికరంగా లేదని దాన్ని వదిలేసి ఇలాంటి డైట్ పై సోషల్ మీడియా లో సెటైర్ లు వేస్తె త్వరగా రిటైర్ అయ్యి పొయ్యేది మీరే! ఖదీర్ వాలి కో ప్రకృతివనం ప్రసాద్ రెడ్డి గారికి ఏమీ నష్టం లేదు .

 ఇమ్మ్యూనిటి సిస్టం  బల   పడాలంటే మంచి ఆహారం తో పాటు .. చక్కటి విశ్రాంతి .. రెగ్యులర్ గా వ్యాయామం అవసరం .

మన ఇంటిని రోజూ శుభ్రం చేస్తామా లేదా ? బండిని రెగ్యులర్ గా సర్వీసింగ్ చేస్తామా లేదా ? అలాగే మనకు వున్న ఒకే ఒక శరీరాన్ని జాగ్రత్త్తగా కాపాడుకోవాలండి . మంచి తిండి . నిద్ర . పని . వ్యాయామం . లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోషల్ మీడియా పై ఆ నాయకుడి ని ఈ నాయకుడి ని తిడుతూ హేట్ పోస్ట్ లు కూడా వద్దు . ఎందుకంటే తన కోపమే తన శత్రువు . నెగటివ్ ఫీలింగ్స్ ముందుగా మీ శరీరానికి హాని చేస్తాయి . మీకు తెలియకుండా శాడిస్ట్ గా CYNICAL గా మారిపోతారు . యు అర్ ఆ ప్రోడక్ట్ అఫ్ వాట్ యు ఈట్ .. వాట్ యూ థింక్

వృద్ధులు వ్యర్ధలు కారు

మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు
ముంగిట్లో కూచోబెడితే
ఇంటిని కాచే ఈశ్వరుడు
                                                                  బతుకుబాటలో గతుకుల్ని
ముందుగా హెచ్చరించి.
కాపాడే సిద్ధుడు వృద్ధుడు
వృద్ధులు సారధులైతే
యువకులు విజయులౌతారు
అనుభవాల గనులు ఆపాత బంగారాలు
                                                                            వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు
చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం
మూడుకాళ్ల ముసలివాడు
తగిన గుర్తింపునిస్తే
విజయాన్నిచ్చే త్రివిక్రముడు
                                                                        ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు
తనను పట్టించుకోకున్నా
నువ్వు పచ్చగా ఉండాలని తపించే
ఉదాత్తుడు వృద్ధుడు
                                                                             పలకరిస్తే చాలు
పాలకడలిలా పొంగులు వారే
పసివాడు వృద్ధుడు
వృద్ధుడంటే పైపైన చూస్తే
జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు
అంతర్గతంగా
తలపండిన పండితుడు.  👇.   🙏🙏🙏
అందుకే మన పూర్వీకులు వృద్ధులకు అమిత గౌరవాన్నిచ్చేరు, ఇమ్మన్నారు.

Tuesday, January 28, 2020

సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూno 7 Secunderabad Railway

సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందనో, పుస్తకం ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పరుచుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ బాధ అది. (Mere Mehboob చిత్రంలో 'మేరే మెహబూబ్ తుఝే' పాటలో రాజేంద్రకుమార్-సాధన ల మధ్య చిత్రీకరించిన అద్భుత సన్నివేశం గుల్జార్ గారికి గుర్తుకి వచ్చిందేమో మరి!)

సామెతలతో కధ

🥁🥁🥁🥁🥁🥁🥁🥁

    *అరవై సామెతలతో.. అందమైన కధ* .

     " కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.." అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి..
   " ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..
      " ఏం చెప్పమంటారు.. " చిలక్కి చెప్పినట్లు చెప్పాను" మీకు.. విన్నారా.. మీ అక్కగారి" నోట్లో నువ్వు గింజ దాగదు " అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందే గా
" తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని" మనమ్మాయికి కుజ దోషం వుందని   ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.." మన బంగారం మంచిదవాలి కానీ".. ఇక దీనికి పెళ్లి అయినట్టే.." అంది సుమతి.

      " ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..
" అనుమానం.. పెను భూతం.." అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.
    " ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు " ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు."ఆడలేనమ్మ మద్దెల గోల" లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.
        " ముంజేతి కంకణానికి అద్దమేల".. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. " చెవిలో జోరీగ లాగా " నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.
      " ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ" కడుపే కైలాసం.. ఇల్లే వైకుంఠం"  నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు గనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అని గానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి  నిష్ఠూరం గా..
  " ఓసి, పిచ్చిదానా..     " కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే "..  ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..
   " అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా " తల ప్రాణం తోకకివస్తోంది" . " చెవినిల్లు కట్టుకుని పోరినా" వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి
" గుండెల మీద కుంపటి " దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి. " అంది సుమతి.
      " వాడినా.. వాడు " ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయేరకం." వాడినుంచి నేను సహాయం ఆశించడం " ఇసుకలో నూనె పిండినంత".. అయినా వాడు
" అయినవాళ్ళకి ఆకులు.. కాని వాళ్ళకి కంచాలు " పెట్టే తరహా.. వాడిని చచ్చినా అడగను. " అన్నాడు కాంతారావు.
  " అయ్యో.. అలా అనుకుంటే ఎలా అండీ..
 " వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు  పట్టుకున్నాడు " ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన
" నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత" అందితే జుట్టు అందకపోతే కాళ్లు"  పట్టుకుందాం." అంది సుమతి.
    " వాడి గురించి " అరటిపండు వలచి చేతిలో
పెట్టినట్లు "  చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే..
" తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే " నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా..
   " హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు.. "
    " మేనరికమా... లేదన్నయ్యా.. నీకు తెలీనిదేముందీ.. " పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు" అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... " మొక్కై వంగనిది మానై వంగునా" వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనేవుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. " అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు "  వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..."  అన్నాడు కాంతారావు..
    ఆ ఫోను లో ఆ అన్నగారి  మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..
    " ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య? " అంది సుమతి.
    " నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. " మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట " ఇలాంటి వాడే..." కళ్ళు నెత్తికెక్కాయి " వాడికి." కడుపు నిండిన బేరాలూ.. కడుపు నిండిన మాటలూ " వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని " గంతకి తగిన బొంతని " వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు." ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు" అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను " అన్నాడు కాంతారావు కోపంగా..
      " అయ్యో.. అంతమాటన్నారా.. అయినా..
 " జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి" పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... " తలని తన్నేవాడొకడుంటే.. తాడిని తన్నేవాడొకడుంటాడు. " ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. " ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు "..  మీరేం బాధ పడకండి..  " మనసుంటే మార్గముంటుంది ".. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి  వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో...  " విత్తం కొద్దీ  వైభోగం "  పైగా మన దురదృష్టం " గోరు చుట్టు మీద రోకలి పోటు " లాగా  పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.. " అంది సుమతి.
   మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.
  " ఏంటోయ్.. " గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ ".... కొంపతీసి ఉదయం నేను" నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను".. అన్నారు.. చమత్కారంగా..
     " పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. " ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి" అంది. " ముద్దొచ్చినపుడే చంకకెక్కాలి " అనుకుంది సుమతి.
        బుద్ధి గా చేతులుకట్టుకుని.." ఆ.. ఇప్పుడు చెప్పు " అన్నాడు కాంతారావు.
      " నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా..  మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన  బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన  వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా
 " చిదిమి దీపం  పెట్టుకునేలా వుంది" అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. " అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది" అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి
  ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా      ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... " వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు " అనిపించింది. " ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో" మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.
    " నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం. " అన్నాడు కాంతారావు.
      రేపటిదాకా ఎందుకూ..
   " శుభస్య శీఘ్రం... " ." తలుచుకున్నపుడే తాత ప్రయాణం " అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను." మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది ".. లేవండి.. లేవండి.." అంది సుమతి.
     " లేడికి లేచిందే పరుగు  ".. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.
" గంతకి తగిన బొంత " అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి " కుక్క కాటుకి చెప్పు దెబ్బ " అనిపించాలి. " ఇనుము విరిగినా అతకవచ్చుకానీ.. మనసు విరిగితే అతకలేము..".. అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు. " అన్నాడు కాంతారావు.
       " పోన్లెండి.. " ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి" వదిలేయండి.. ఆయనని.. " గురివింద గింజ తనకింద నలుపెరగదట " మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.
       వెళ్లే దారిలో..." ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషం తో.. నానా మాటలు అన్నారు.." ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి ".. ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయిసంబంధాలకి పోతున్నారూ.. " కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది" అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ..
" శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు... ఏది ? " అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు " అంది సుమతి.
    " పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.." గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు"  పట్టించుకోకు..." గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం " తప్ప దానికి వేరే పనీపాటా లేదు.
 " పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు" అది అలా వాగుతూనే వుంటుంది.  వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.. " అంటూ భార్య ని ఓదార్చాడు.
          పెళ్లి  చూపులు అయిపోవడం..  పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమోత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద.. కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.
      పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ..
 " అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా" అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి.
     ఈ జాతకాలు కుదరడం  లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.
       ఇంతలో ఫోన్ మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ...  కాంతారావు పెదనాన్న కొడుకు.... " ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట..   సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.. " అన్నాడు..


    " ఆ.. అన్నయ్యా... " దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట".. అర్ధమయిందనుకుంటాను.. " అంటూ ఫోన్ పెట్టేసాడు.




" కొత్తొక వింత పాతొక రోత" ఇలా మారిపోతున్నాయి రోజులు.

ఒకప్పుడు.. మన ముందు  తరం వారు.. అంతకు ముందు వారు.. మాట్లాడుకునే భాష కానీ..
ఆ వ్యవహారిక సంభాషణలు కానీ..
 ప్రస్తుతం కనుమరుగైపోయాయనే చెప్పవచ్చు..

" కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయింది"
అన్న చందాన..

ఇదివరలో.. మనవారి మాటలలో.. నిత్య జీవితంలో తరచూ  సామెతలు..
ఆయా సందర్భానుసారంగా కనపడుతూవుండేవి.
ఎంతో తేలికగా చెప్పేస్తూవుండేవారు వాటిని. ఆ సందర్భానికి అది సరైనదే కదా అనిపించేది.
ఇప్పుడు ఏభై, అరవై ఏళ్ల వయసున్నవారికి ఇవి సుపరిచితాలే... కానీ ఆ తర్వాత తరం..

ముఖ్యంగా ఇప్పటి యువతకి ఇవి తెలీడం లేదు. వారికి ఈ సామెతలు, నానుడులు, ఇటువంటి వాటి మీద ఇంట్రస్ట్ లేకుండా వుంది.
భాషని ఖూని చేసేస్తున్నారు. అందుకే..

మనం మన తర్వాత తరాల వారికి మన
తేట తేనెల తెలుగుని
వారికి అందించడంలో తగినంత కృషి చేయాలి.
మన తెలుగు ని వెలుగులోకి తేవాలి...
ఆ ప్రయత్నంలో..
చేపట్టిన ప్రక్రియ...
మనకి పెద్దలు చెప్పిన సామెతలలో కొన్నిటిని సేకరించి...
ఈ కధలో పొందుపరిచారు.. ఈ కధ మొత్తం సామెతల చుట్టూనే తిరగడం విశేషం.

ఎవరు వ్రాసారోకానీ  వారికి
తెలుగు భాషాభిమానులందరి తరపున నమో వాక్కాభినందనలు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, January 20, 2020

ఓ గోదారోడి మనసులో మాట.

పండగెళ్ళి పోయి ఇంటికొచ్చినోళ్ళు అళ్ళింటికి ఆళ్ళు ఎళ్ళిపోతా ఉంటే మనసు బిగపెట్టేసి ఏటోలా అయిపోయిందండి.  పరాసికా లాడుకుంటూ, ఏళాకోళం మాట లాడుకుంటూ... ఆనందించినంత సేపు పట్లేదండి, క్షెణాల్లో గడిసి పోయాయి రోజులు.

భీవ్వారం పందెం కోళ్ళని పందెం అయినాక పచ్చడెట్టేసినట్టు,   బంధువుళెళ్ళి పోతావుంటే దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టయిపోయింది.  మళ్ళీ ఈళ్ళంతా  ఎంత కాలానికొస్తారో?

తాపేశ్వరం పూతరేకులు, పెద్దాపురం పాలకోవా, ఏలూరు పెరుగుసెట్టు కాడట్టు కొచ్చిన జున్ను పాలతో తియ్యటి జున్నూ, అన్నీ కబుర్లెట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి, సంబరం గాల్లోకి ఎగిరిపోయింది.   కళ్ళకి మసకేసి చీకటి కమ్మినట్టయి పోయిందండి. 

ఇప్పుడిప్పుడే  దిగుతున్న మావిడి పిందెలతో మెంతి బద్దలెడితే, పిల్లలు ఇరగదీసుకుంటా కంచాలమీద కలబడ్డారు.  ఇయన్నీ రుసి కుదరటం వల్లనుకున్నాం గానీ, చుట్టాల్తో వచ్చిన పిల్లల్తో జతకట్టిన  సరదావల్లే,  అనే నిజం తెలియలేదండి. అదే పచ్చడిపుడెడితే బుడ్డోళ్ళెవరూ కంచంవైపు రావటం లేదు. 

చాలా కాలం తర్వాతొచ్చిన ఆడబిడ్డలు,  కళ్ళనీళ్ళెట్టుకుంటూ,ఇంటికెళ్ళేటప్పుడు, కాళ్ళకి  దండాలెడతా వుంటే లోపల కెలికేసినట్టనిపించింది. 

ఏం చేస్తావండీ?ఎవరి సంసారాలాళ్ళవి.  బరువెక్కిన గుండెతోటే చెంగున చలివిడి కట్టి, కాళ్ళకి పసుపురాసి, కొత్త బట్టలతో కట్నాలెట్టి పంపుతా ఉంటే మళ్ళీ అప్పగింత లప్పుడొచ్చిన దుఃఖం పొగిలి పొగిలి వచ్చిందండి. 

గోదారోళ్ళంటే ఏళాకోళం మడుసు లనుకుంటారు గానీండి, పేమలెక్కువున్న ఎర్రోళ్ళని చాలామందికి తెలియదండి. 

రైతులంతా పెపంచకానికి బువ్వెట్టడానికి పొలంవైపు పోవడానికి సిద్ధవయి పోతున్నారు.  పాలోళ్ళు కేన్లు తోముకుని, రేపట్నించి పాలొయ్యడానికి తయారవుతున్నారు.  కూరగాయాలమ్మేటోళ్ళు పొద్దుగాలే వచ్చే ఆటో బండోళ్ళతో మాట్లాడుకుంటన్నారు.‌‌

పెతీ ఊర్లో జనం గుంపులు గుంపులుగా బస్టాండింగ్ ల్లో,  రైలు స్టేషనింగుల్లోను అవుపడ్తన్నారు.

చూస్తా ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ. 

ఎల్తా ఎల్తా మా మానేళ్ళుల్లు, మేనగోడళ్ళు ఏసంగి సెలవలకి వత్తాం మాయ్యా అంటూ ఏడుత్తూ ఎల్లిపోతావుంటే  గొంతులో ఏదో అడ్డడినట్టు అయిపోయిందండి. 

మా పిల్లల మొకాలు చూస్తే జాలేసింది.  హాయిగా ఆడుకుంటా నవ్వుతూ తుళ్ళుతూ పండగ రోజులు గడిపేశారు.  రేపట్నించి మల్లా మావూలే.‌‌.

అనుకుంటాం గానండీ, సంబరం ఒకేసారి ఎల్లువలా వస్తే,  అదిపోయేటపుడు పుట్టెడు దుఃఖం కూడా ఇత్తాదండి. 

ఈ క్షణంలో గోదారి చూడాలంటే మీరు రాజమెండ్రీ ఎల్లక్కర్లేదండి, మా మడుసుల మనసులూ, కళ్ళూ చూస్తే చాలండి. 

పెతీ మడిసిలోనూ మూడు గోదార్లు కనిపిస్తాయి.  రెండు కళ్ళల్లో రెండుపాయలూ, మనసులో అఖండ గోదారీను.

ఎంత బాధొచ్చినా తప్పదు కదండీ‌. రోజులు గడవాలంటే మళ్ళీ అందరూ ఎవురి పనుల్లోకి ఆళ్ళొచ్చేయాలండి.

ఉంటానండి.  దేవుడు మనందరికీ మంచి చేయాలని కోరుకుంటా....

ఓ గోదారోడు.

సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి
శ్రీకాకుళం, 19.01.2020

Sunday, January 19, 2020

పండుగ అయిపోయింది... 😞

సందడి ఆగిపోయింది... 😞

పల్లె మూగపోయింది.... 😞

పిల్లల కేరింతలతో కళకళలాడిన పొలం గట్లు దీనం గా చూస్తున్నాయ్....

వీధి చివర వరకు చెయ్యి ఊపి టాటా చెప్పిన అమ్మ మనసులో బాధ కొండంత అయింది.....

జేబు లో డబ్బులు పెట్టి "జాగ్రత్త రా నాన్న!!" అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న నోట మాట లేదు....

సందడి అంతా మాదే అంటూ పాటలు పాడిన హరిదాసులు చెదిరిపోయారు.....

పందెం కోళ్ల బరులు సర్దేశారు....

సెలవులు ముగించుకుని పట్టణానికి బయలుదేరిన విద్యార్థులు ఏదో కోల్పోయిన భావన లో ఉన్నారు.....

ఇన్ని నాళ్ళు ముగ్గులతో కళాకళలాడిన వీధులు ఇప్పుడు అవే రధాల ముగ్గులతో టాటా చెప్తున్నాయి....

అయినా సరే మీ కోసం ఈ పల్లెటూరు ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆ కేరింతలు మళ్ళీ వస్తాయిలే అన్న భరోసా తో మీ కోసం వేచి చూస్తూ ఉంటుంది.
ఎక్కడికెళ్లినా ఈ పల్లెటూరుని మరువకండి.
మన మూలాలు బలంగా ఉండాలి.
మన పల్లెటూరు బాగుండాలి.

ఎందుకాంటే పల్లెలే దేశానికీ పట్టుకొమ్మలు.....

#జాగ్రత్తగా_వెళ్లి_రండి.
ఇక్కడ మీ కోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయ్.
 ఎక్కడెక్కడ నుండో తన కన్నా భూ తల్లి వద్దకు వచ్చి పండగ జరుపుకున్న అందరకీ ధన్యవాదము.🙏💐😊

Total Pageviews