Tuesday, May 10, 2016

6). గౌరీ పూజ-వర పూజ- మధు పర్కం
ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది. మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధుపర్కం: మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.
గోత్రం-ప్రవర
గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-…. …. …. త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న …… గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన … అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు. కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.
గంపలో వధువు-కాళ్లు కడగడం
గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు. వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.
మహా సంకల్పం
మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.
కన్యాదానం
ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.
"జీల కర్ర- బెల్లం"
వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద. జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.








































5) విడిది ఏర్పాట్లు స్వాగత సన్నాహాలు!! 
మా తమ్ముడు కల్యాణానికి ప్రయాణం మా స్వగృహం నుండి పూర్వికుల పెద్దల ఆశీస్సులు తీసుకుని కళ్యాణి ట్రావెల్స్ బస్సు లో బంధుమిత్ర సమేతంగా భాగ్యనగరానికి తరలి వెళ్ళాము. మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి . మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు. వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. విడిది ఏర్పాట్లు స్వాగత సన్నాహాలు ఆడపెళ్ళివారు సాంప్రదాయబద్ధంగా చేసారు.
పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం
పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు.
"స్నాతకం" సన్నాహం 
పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. "సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ. స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.
కాశీ యాత్ర
కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.
















Monday, May 9, 2016

చందమామ కథ
ఏమండోయ్ ! ఇవాళ ఎక్కువ బట్టలు వెయ్యకండి ! పని మనిషి రెండు రోజులు రానంది .
ఏమొచ్చింది ? అడిగాడు ప్రకాష్.
వాళ్ళ ఊరు వెడతాను, కూతురినీ మనుమలనూ చూసి వస్తాను అందండీ ! అక్కడ పండగట .
" సరేలే బట్టలు ఎక్కువ వెయ్యను " అన్నాడు ప్రకాష్
" ఏమండీ ! పాపం దానికి ఒక 500 ఇస్తానండి . వినాయక చవితికి ఇచ్చినట్టు ఉంటుంది . పిల్ల దగ్గరకి వెడుతోంది కదా ! ఏదైనా పట్టుకు వెడుతుంది . "
" నీ చేతికి ఎముక లేదు . వచ్చే దీపావళికి ఇద్డువులే ! . రేపు పిజ్జా కొనుక్కోవాలి "
" ఈ వారం పిజ్జా మానేద్దాము . పాచిపోయిన 8 ముక్కాలా బ్రెడ్ కోసం ఎందుకండీ ! దానికి ఇస్తే ఎంత సంతోషిస్తుందో... ?"
" మా పిజ్జా దానికి ఇచ్చెస్థావన్నమాట . సరే నీ ఇష్టం " మనసులో ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్.
నాలుగు రోజుల తరువాత పనిమనిషి వచ్చింది
" పండుగ బాగా జరిగిందా ? " అడిగాడు ప్రకాష్
సంతోషంగా చెప్పింది ఆమె
" అమ్మగారు నాకు 500 ఇచ్చారండి. రెండు రోజులు 500 ఖర్చు పెట్టి చాలా బాగా గడిపాము 150 పెట్టి మనవరాలుకి డ్రెస్ కొన్నాను .. 40 రూపాయలతో బొమ్మ కొన్ననండి . 50 రూపాయలతో స్వీట్స్ కొన్నానండి . 50 రూపాయలు గుడిలో ఇచ్చానండి . 60 రూపాయలు బస్ టిక్కెట్లు అయ్యాయండి. అల్లుడికి 50 రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నానండి. 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నానండి. 75 రూపాయలు మిగిలాయండి. పిల్లకు కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ కొనమని మా పిల్లకి ఇచ్చానండి.
ఆశ్చర్య పోయాడు ప్రకాష్. 500 రూపాయలతో ఇన్నా ?
తన 8 ముక్కల పిజ్జాను గురించి ఇలా అనుకున్నాడు
మొదటి ముక్క - 150 రూపాయల డ్రెస్
రెండో ముక్క -40 రూపాయల బొమ్మ
మూడో ముక్క - 50 రూపాయల స్వీట్స్
నాలుగో ముక్క - గుడిలో ఇచ్చిన 50 రూపాయలు
ఐదో ముక్క - బస్ టికెట్లు 60 రూపాయలు
ఆరో ముక్క - 50 రూపాయల అల్లుడి బెల్ట్
ఏదో ముక్క - 25 రూపాయలు గాజులు
ఎనిమిదో ముక్క - కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ
ఎనిమిది ముక్కలో కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి
ఇన్నాళ్ళూ పిజ్జా ఒక వైపే చూశాడు. పిజ్జా రెండో వైపు ఎలా ఉంటుందో పనిమనిషి ఖర్చు చూశాక తెలిసింది.
తనది ఖర్చు పెట్టడానికి జీవితం
ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం.
"విలాసం .... అవసరం .... అత్యవసరం"... తేడా తెలుసుకున్నవాళ్ళు ధన్యజీవులు....!!!

శుభోదయం


ప్రతి మనిషి వెనకా ఒక కథ ఉంటుంది.
ఓ 24 ఏళ్ల యువకుడు రైల్లో కిటికీ దగ్గర కూర్చొని గట్టిగా అంటున్నాడు:
నాన్నా చూడండి చెట్లన్నీ వెనక్కి ఎలా పరిగెడుతున్నాయో!
తండ్రి చిన్నగా నవ్వి అవును అన్నాడు.
ఎదురు సీట్లో కూర్చొన్న దంపతులు ఆ అబ్బాయి చిన్న పిల్లాడిలా మాట్లాడడం చూసి జాలి పడ్డారు.
మళ్ళా కాస్సేపటికి ఆ అబ్బాయి మరింత ఆశ్చర్యంగా అన్నాడు:
నాన్నా చూడండి మేఘాలు మనతో పాటే పరిగెడుతూ వస్తున్నాయి!
తండ్రి చిన్నగా నవ్వి అవును అన్నాడు.
ఎదురు సీట్లోని దంపతులు ఇంక ఆపుకోలేక ఆ పెద్దాయనతో అన్నారు:
సార్ మీ అబ్బాయిని ఎవరైనా మంచి డాక్టరుకు చూపించలేక పోయారా?
తండ్రి నవ్వి అన్నాడు:
" చూపించానండీ. ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
మా అబ్బాయి పుట్టుకతో అంధుడు. ఈ మధ్యనే చూపు వచ్చింది."
భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికీ ఒక కథ ఉంటుంది.
ఎవరి గురించీ నిజం తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రాకూడదు.
ఆ నిజం మనల్ని ఆశ్చర్యానికీ, ఆవేదనకూ, పశ్చాత్తాపానికీ కూడా గురి చేయవచ్చు......!!!
నీళ్ళ దాతా సుఖీభవ!!

'పరోపకారార్ధం ఇదం శరీరం' అంటే ఇదే...మనం ఎన్నో ప్రవచనాలు ధర్మపన్నాలు వింటాం, చెప్తాం ధర్మసందేహాలు అడుగుతాం... తీరుస్తాం... చలివేంద్రాలు పెట్టాలనుకుంటాం ఆ వెంటనే అబ్బో డబ్బు ఖర్చు శ్రమ అని విరమిస్తాం...ఇదిగో చూడండి మనసుంటే మార్గముంటుంది...ఇలా... మండే ఎండవేళ కాసిని నీళ్ళు దప్పిక తీర్చగలిగితే...నీళ్ళ దాతా సుఖీభవ!! ఒక గిన్నెలో కాసిని నీళ్ళు ఇంటి బయట పెడితే మూగ జీవాలకు దాహం తీరుతుంది...మరి మనమూ చేద్దామా.



Thursday, May 5, 2016

అనగనగా ఓ చెరువు కధ!

అనగనగా ఓ చెరువు కధ! అనాదిగా ఊరూరా జీవులకు నోరారా
నీటి కరువు తీర్చిన ఎన్నెన్నో చెరువుల కన్నీటి వ్యధ!!
అదిగో మా ఊరు పినపళ్ళ చెరువుగట్టు
ఆ గట్టున కొలువైన చెట్లు ఎదురుగా ఠీవిగా నాడు
కీ.శే. బచ్చు వీర్రాజు వీర్రాజు గారు నాటిన రావిచెట్టు!...

మరోవైపు రేవు నానుకుని శ్రీ సిద్ది వినాయక ఆలయం!!
దూరంగా మా విస్సా నిలయం!!!
ఎండిన మా వూరి చెరువును ఇలా చూస్తె
నా గుండె చెరువయ్యింది!
మా కుటుంబ సాహితీ మిత్రులు, మా విస్సా ఫౌండేషన్ 'యాత్రా ప్రియమిత్ర' బిరుదాంకితులు శ్రీ కొత్తపల్లి సూర్యనారాయణ గారితో ఒక ఉదయపు నడక ఆమె గర్భంలోకి పయనం. చినుకు కోసం తన గొంతుని వేల నేరలుగా పోరలుగా చీల్చుకుని నీరీక్షిస్తున్న ఆమె లోకి... ఆ చల్లని చెరువు గర్భంలో అనాదిగా నిలిచి మౌన సజీవ సాక్షిగా నిలిచి సగం విరిగిన జలస్తంభం దగ్గరికి చెరువు గర్భంలోకి పయనమయ్యాము. మా నాన్నగారు అనేవారుట ఈ చెరువు మన ఊరు వాస్తుకు అనుకూలంగా లేదు ఇది పూడ్చి మరో చోట తవ్వాలని చోటు కూడా సూచించారట. ఆ వివరాలు ఇతర విషయాలు ముచ్చటించు కుంటూ
దాశరధి గారి "ఆ చల్లని సముద్రగర్భం" పాట గుర్తుచేసుకుంటూ... పాడుకుంటూ ఆమె గర్భంలోకి పయనమయ్యాము. మీకోసం ఆ పాటను మీరూ ఆస్వాదించండి!
పల్లవి : ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడ బానలమెంతో ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో
1. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో
2. మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసిప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు ధగ్ధమైన బ్రతుకులు ఎన్నో
3. అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసి పాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవిగుండెలలో వ్రాయబడిన కావ్యాలెన్నో".... అంటూ రాసిన ఆ మహాద్భుత గేయాన్ని తలుచుకుంటూ తవ్వించిన మహనీయులను తలచుకుంటూ మేలుచేసిన మహానుభావులను, భావకవులను నాటి చలం, నేటి వాడ్రేవు చినవీరభద్రుడు వరకూ తలచుకుంటూ నీటి చెంత ప్రభవించిన నాగరికత నీటి ఆనవాళ్ళను చెరిపేస్తూ ...పల్లెల నుండి నగరాలదాక చెరువులు చెరిపేసి వాటిపై భవనాలు కట్టి చినుకు చినుకు ఇంకే చోటు, చెరువులు కానరాక వానలై, వరదలై ఊరును ముంచిన వైనాలు నిన్న మొన్నటి చెన్నై వరకు ఎన్నెన్నో అయినా నీటిని అవసరానికి వాడుకోవడమే తప్ప జలవనరులను రక్షించాలన్న ఇంగిత జ్ఞానం కరవైన మన జన గణం...స్వచ్చందంగా ఇంటింటా ఇంకుడు గుంటలు ఏర్పాటుతో నీటి ని బొట్టు బొట్టుగా చినుకు చినుకును ఒడిసిపట్టి, రాజకీయాలు పక్కన పెట్టి భుజం భుజం కలిపి, నాలాంటి వారు ఇలా చెరువు గర్భం లోకి ఉదయపు నడకకు వెళ్ళకుండా...కబ్జాలకి గురికాకుండా ప్రతివారు ఊరూరా ఉద్యమంగా చెరువుల సంరక్షిస్తే... ఊరూరా చెరువులు తర తరాలకి తరగని జలసిరులతో అలరారుతాయి. అలా జీవనదుల్లా అలలతో అందరినీ అలరించాలని మనసారా కోరుకుంటూ....సత్యసాయి విస్సా ఫౌండేషన్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Total Pageviews