Wednesday, December 14, 2016

మార్గశిర లక్ష్మివార వ్రత కధ!!

శుభోదయం../\..
మార్గశిర లక్ష్మివార వ్రత కధ:
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచేప్పినది. ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలడువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురుమాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుంధం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తనకోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా.... నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృస్యము అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం పరమాన్నము, మూడవ వారం అట్లు లేదా కుడుములు , నాల్గవ వారం గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధలోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

రక్షణ శాఖ మనోహర్ పారికర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు !

ఈ రోజు భారత కేబినేట్‌లోని నవరత్నాల్లొ ఒకరైన మనోహర్ పారికర్ గారి పుట్టినరోజు.... ఆయన వ్యక్తిత్వాన్ని తెలిపే ఓ చిన్న కథ, తప్పక చదవండి !
గోవా నగరం లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది అది చూసి స్కూటర్ నడుపుతున్న వ్యక్తి బండి ఆపేసాడు.
.
వెనుకగా ఒక కార్ వచ్చింది ఒకటే హారన్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు. స్కూటర్ పైన ఉన్న వ్యక్తి రెడ్ లైట్ చూపాడు.
.
నాకు తెలుసులే నువ్ తప్పుకో నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని అన్నాడు.
.
స్కూటర్ మీదున్న వ్యక్తి చిన్నగా నవ్వి 'నేను గోవా ముఖ్యమంత్రిని' అన్నాడు.
.
ఒక సామాన్య ముఖ్య మంత్రి.
అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు.
ప్రోటోకాల్ ఉండదు.
పోలీస్ కేస్ లలో జోక్యం ఉండదు
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది.
.
ఒక ముఖ్య మంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే సంతోషించే వారే కదా ప్రజలు.
.
కానీ....
.
ఆయన్ని గోవా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించామని కొరినపుడు యావత్ గోవా కంటతడి పెట్టింది
.
రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం, జుగుప్స ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో ఇట్టే చెప్పొచ్చు.
.
ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటెర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగేస్తాడు.
బడ్డీ కొట్టు లో టీ తాగేస్తాడు.
ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టులో తెలిసినంత మరెక్కడా తెలీదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు.
.
గోవా ముఖ్య మంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది, కార్ ఆగింది ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బ్యాగ్ మరో చేత్తో ఫైల్స్ పట్టుకుని మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక సెక్యూరిటీ వచ్చారు ఎక్కడ గోవా ముఖ్య మంత్రి అని వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పరట ఆ సెక్యూరిటీ.
.
తీరా లోపలికెళ్లాక ఆ స్టార్ హోటెల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు లోపలికి వెళుతున్నారు అని ఆపేశారట వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్యమంత్రి అని చెబితే అవాక్కయ్యరట.
.
అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళుతుంటే బాధ తో కన్నీరు పెట్టారంటే నమ్మలేము ఆ వ్యక్తి ఎంతటి ధనికుడో మీరే చెప్పాలి.
.
అవును నేను చెప్పేది మన రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారి గురించి.
.
అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి IIT పట్టా పొందిన పరికర్.
.
మోదీకి నమ్మిన బంటు... అందుకే కీలకమైన రక్షణ శాఖ కేటయించారు !
మనోహర్ పారికర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు !

చెట్టు...చల్లా రామ ఫణి 14.12.2016

చెట్టు
చెట్టు అంటే నీడ కదా!
చెట్టు పక్కన చెప్పకుండా చేరిన పదం నీడ కదా!
చెట్టుతో పాటు పుట్టింది నీడ!
నీతో పాటు పుట్టింది పీడ!
నేలతల్లికి పుట్టిన తల్లి కదా చెట్టు!
తల్లి మీద గొడ్డలితో చెయ్యెత్తమేమిట్రా త్రాష్ఠుడా!
రోడ్డు మీద చెట్టంటే నీ గాలి కోసం నిలచిన నిలువెత్తు విసనకర్ర!
ఆకులు తోరణాలకి
పూలు పూజకి
కాండం వంట కట్టెలకి
నీ బతుక్కి నైవేద్యం పెడుతుంది కదరా చెట్టు!
మొండిదిరా చెట్టు తల్లి!
నీకు నీడనివ్వడానికి నిలబడ్డదాన్ని
మొండెం చేసినా మొండిగా మళ్ళీ చిగురిస్తుంది చెట్టు!
నీ మూర్ఖపు పొగరు మీద నీళ్ళు చల్లుతూ
వేదన పడ్డ వేళ్ళకు నచ్చచెప్పి
చిగుళ్ళై పరిమళిస్తుంది చెట్టు!
పాకే ఉడతలకు, ఎగిరే పక్షులకు
దూకే కోతులకు ఇల్లు కదరా చెట్టు!
కొమ్మల చేతులు చాచి చెట్టంత గొడుగులా
నీడనిచ్చే చెట్టుతల్లి పైకి గొడ్డలి ఎత్తుతావురా గొడ్డలి!
నిలబడి నలుగురికి నీడనివ్వలేని నువ్వు నీడనిచ్చే చెట్టు మీద
అసూయతో గొడ్డలి ఎత్తుతావురా గొడ్డలి!
ఒక్క చోట నిలబడి నింగి దాకా ఎదగాలని
నీడనిస్తూ నేర్పే చెట్టుతల్లిపైకి గొడ్డలి ఎత్తుతావురా గొడ్డలి!
నీ తల్లి నీకు చేతులిచ్చింది గొడ్డలి ఎత్తడానికా!
చేతుల్లేకుండా నువ్వు పుట్టి ఉంటే చెట్లు పండగ చేసుకునేవి!
చెట్టు చేసే ప్రాణాయామ శబ్దం వినబడలేదా!
చెట్టు విషం పీల్చి నీకు అమృత వాయువు నిచ్చే తల్లి!
చెట్టు దుమ్మును పీల్చి నీకు దమ్మునిచ్చే తండ్రి!
నీ చేతి గొడ్డలి దెబ్బ తిన్న చెట్టు నువ్వు చచ్చాక పాడె అవుతుంది!
కాటికి పోయాక నీ కట్టె కాల్చే కాష్టమవుతుంది!
నీ కష్టం తీర్చే కట్టె అవుతుంది!
చెట్టు అంటే ఆయువు!
చెట్టు అంటే ప్రాణం!
చెట్టు అంటే ప్రాణవాయువు!
చెట్టు అంటే జగతికి జీవన దాత!
చెట్టు నేలకు పుట్టిన ఊపిరి మెట్టు!
మనిషిలో మెదిలే ఊపిరి!
మానవ జాతి సిరి!
-చల్లా రామ ఫణి
14.12.2016
9247431892
(పూర్తిగా మా ఇంట్లోకి ఒదిగి నీడనిస్తున్న వారి మామిడి చెట్టుని కొట్టేయడం తమ హక్కుగా మా పక్కింటి వాళ్ళు నిన్న కొట్టేసినపుడు రాసుకున్న కల్లోల కలవరం)

శ్రీ సత్యసాయి హాస్పిటల్ లో అందించే వైద్య సేవలు: పుట్టపర్తి



హార్ట్ ఆపరేషన్ అయినా, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా…అక్కడంతా ఫ్రీనే.! లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం అక్కడ ఉచితంగా అందుతుంది. దీనికి మీరు చేయాల్సిందంతా ఒక్కటే…. ఇంతకు ముందు మీరు చూపించుకున్న హాస్పిటల్స్ రిపోర్ట్స్ ను వెంట తీసుకెళితే చాలు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో పుట్టపర్తి సాయిబాబా కట్టించిన సత్యసాయి స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. 1991 లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుచే ప్రారంభింపబడిన 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మన్ననలు పొందుతుంది. ఇక్కడ వైద్యం చేయించుకోడానికి దేశ విదేశాల నుండి రోగులు వస్తుంటారు. ప్రపంచస్థాయి డాక్టర్లు ఇక్కడ సేవలందిస్తుంటారు.
ఉదయం 6 గంటల వరకు… ఆసుపత్రి ప్రాంగణం ముందు క్యూలు కడితే…7 వరకు టోకెన్స్ ఇచ్చి లోపలికి పంపుతారు. పేషెంట్స్ వ్యాధులను బట్టి వారిని ఆయా ప్రత్యేక వార్డ్ లకు పంపించి, అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. ఇక్కడి డాక్టర్ల చేతి మహిమో.. ఏమోకానీ… వ్యాధి ఇట్టే నయం అయిందన్న చెప్పే వాళ్లు, అంతా పుట్టపర్తి సాయిబాబా దయ అని… కీర్తించేవారు చాలామందే ఉన్నారు.
సత్యసాయి హాస్పిటల్ లో అందించే వైద్య సేవలు:
గుండె సంబంధిత వ్యాధులు.
మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు.
ఫ్లాస్టిక్ సర్జరీ.
కంటిచూపుకు.
ఆర్థ్రోపెడిక్.
గ్యాస్ట్రోఎంటరాలజీ( ఎండోస్కొపి)
పేదల వైద్యం కోసం పుట్టపర్తి సాయిబాబా స్థాపించిన ఇతర సంస్థలు.
పుట్టపర్తిలోని Sri Sathya Sai Institute of Higher Medical Sciences 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 333 పడకల ఆసుపత్రి.
అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్
ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి.
ఇతర కార్యక్రమాలు:
అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు
చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200కోట్ల రూపాయల పైన ఖర్చుతొ నిర్మించిన ప్రాజెక్టులు త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి.
33 దేశాలలో వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య (Educare, Education in Human Values) నేర్పే పాఠశాలలు ప్రాంభించారు.

Tuesday, December 13, 2016

బ్రహ్మీ ముహూర్తం విశిష్టత

బహు పుణ్యప్రదం బ్రహ్మీ ముహూర్తం:--

నలుబై ఎనిమిది నిమిషములు సూర్యోదయానికి ముందుగా మేల్కోని, తమతమ పాఠ్యాంశాలను అధ్యాయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కాని పెద్దల మాటను ఈ విషయంలో చాల మంది పిల్లలు పెడచెవిన పెడతారు.

ఇందులోని వాస్తవమేమిటంటే , ఈ సమయంలో చదివిన చదువు బాగా ఒంటబట్టి గుర్తుంటుంది. ఒక పరిశోధనా సంస్థ విధ్యలో వెనకబడటంపై అధ్యాయనం జరిపి అలాంటి విధ్యార్థులు బ్రహ్మ ముహూర్తమున చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్థారించారు.

సూర్యోదయానికి నలుబై ఎనిమిది నిమిషాలకు ముందు బ్రహ్మ ముహూర్తము ప్రారంభమవుతుంది. ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీ దేవి యొక్క పతి పేరు పెట్టడం జరిగింది. కళాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతోంది. ఈ సమయాన్ని "సరస్వతీ యానం" అని కూడా అంటారు.

బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ఠే స్వాస్థ్య రక్షార్ధ మాయుషః
తత్ర సర్వార్థి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనమ్

‘బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుని స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం, రక్షణ, ఆయుష్షు, సర్వ సంపదలు, సుఖ శాంతులు లభిస్తాయి.’

"ఆలస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనమ్ అథనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం"

ఆలస్యంగా లేచే వానికి విద్య ఎలా వస్తుంది? విద్య లేకుండా ధనం ఎలా? ధనం లేకుంటే మిత్రులుండరు. ఇవి లేకుంటే సుఖముండదు.

తెల్లవారుజామున లేచి ఆరోజు ఆరోగ్యంతో నిద్రలేచి నందుకు సృష్టి-స్థితి-లయ కర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు చేయాల్సిన పనులు స్మరించుకుని నియమబద్ధంగా కర్తవ్యాన్ని నేరవేరుస్తానని సంకల్పం తీసుకుంటూ, దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి.

కశ్యప ప్రజాపతికి వినీతకి పుట్టిన అనూరుడు వినీత తొందరపాటు వల్ల జన్మతోనే కాళ్లు లేకుండా జన్మించాడు. బ్రహ్మదేవుడు అతణ్ణి సూర్యరథానికి సారధిగా నియమించి అతను (అనూరుడు) సూర్య రథాన్ని తీసుకువచ్చే సమయానికి ఎవరు నిద్ర లేచి కార్యసాధనలో నిమగ్నలవుతారో వారిపై ఏ గ్రహం, నక్షత్రం చెడు ప్రభావం చూపలేదని వరమిచ్చాడని ఒక కథ.

మహర్షి శుశ్రుతుని ప్రకారం తెల్లవారు జాము సమయం ( బ్రహ్మ ముహూర్తం) అమృతం వంటిది. అధర్వణ వేదం ప్రకారం ఈ సమయంలో చేసే సాధన వల్ల సత్వగుణ సంపద పెరుగుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, ఆలస్యం, అజాగ్రత్త...) పెరుగుతుంది. అర్థరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన...) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివికా! రాత్రి నిద్రోన్ముఖుడివికా! అంటారు మన మహర్షులు.

తెల్లవారు జామున ఆలోచించి ప్రణాళికలు వేసుకోవటం వల్ల వ్యూహాత్మకంగానూ, ముందు చూపుతోనూ ఆలోచించి ప్రతి స్పందించగల్గుతాం అంటారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్. తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి.

తెల్లవారు జామున లేచే వారికి సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి కాంతి లభించటం వల్ల అది అత్యంత శక్తివంతమైన సమయమనీ, ఆ సమయంలో లేచే వారి జీవితం కాంతివంతమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి.

"కర్తవ్యమ్ ఆచారం కామమ్ అకర్తవ్యమ్ అనాచారమ్
తిష్ఠతి ప్రాకతాచారో యసః ఆర్య ఇతిస్మ్రతః"

చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ, చేయకూడనివి వదిలేస్తూ సదాచారంతో మసలేవాడే ప్రాజ్ఞుడు/ వివేకవంతుడు.

‘తెల్లవారు జాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది’. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించేసిందని నాలో నేనే సిగ్గుపడేవాడినంటారు.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్!

తెల్లవారు జామున లేవటం అనేది ఒక బాధ్యతగా మారాలి. అప్పుడే దాన్ని ఆనందించగల్గుతాం. దాన్ని బరువుగా భావించి ఎవరి కోసమో లేస్తున్నాం అనుకుంటే దాని ఫలితం, ఆనందం రెండూ తక్కువైపోతాయి. మార థాన్ పరుగు పందెంలో పాల్గొనే వారిలో 90 శాతం పైగా తెల్లవారు జామున లేచి, సాధన చేసి పతకాలు సాధించిన వారే. స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించిన మేథావులు, రాజకీయ వేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, అధికశాతం తెల్లవారు జామున లేచి సాధన చేసిన వారే. తెల్లవారు జామున లేవడం తమ జీవిత ప్రాథమిక సూత్రంగా మలచుకున్నవారే. ఇదే విషయాన్ని సశాస్త్రీయంగా నిరూపించారు.

తలలో కుడివైపున ఉన్న ఒకానొక గ్రంధి జాగృతమై ఉన్నప్పుడు విద్యాభ్యాస పాటవాన్ని పెంచుతుంది. నువ్వుల నూనె లేదా ఆవునెయ్యి లేదా దీపారాధనకు వాడే ఏ నూనెనైనా వాడి వెలిగించిన దీపం ముందు స్నానాంతరము బ్రహ్మ ముహూర్తమున కూర్చొని ఆ రోజు పనులు ప్రారంభించడం చాలా శుభకరం. ఇలా చేయడ ద్వారా దీపం నుండి వెలువడిన అనుకూల శక్తి ఆ ప్రదేశం చుట్టుతా వ్యాపింపబడి మానసిక బలసమర్థ్యాలను, బుద్ధిబలాన్ని మెరుగుపరుచుతుంది. ఈ కారణంగానే ప్రాచీన మేధావులు మరియు ప్రస్తుతపు పరిశొధకులు విధ్యను ఆర్జించాలని కుతుహలమున్నవారిని బ్రహ్మ ముహూర్తమున మేల్కోనమని చెప్పడం జరిగింది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.

బెంజమిన్ ఫ్రాంక్లిన్. ‘గత 50 సంవత్సరాల్లో నేను నిద్రపోతూ ఎప్పుడూ సూర్యుడికి పట్టుబడలేదు.’ అంటారు.. అమెరికా రాజ్యాంగ పితామహుడు థామస్ జెఫర్‌సన్! జాతిపిత మహాత్మాగాంధీ కూడా తెల్లవారు జామున ఒక గంటలో చేయగలిగిన పని మిగతా ఏ సమయంలోనైనా కనీసం రెండు, మూడు గంటలు పడుతుందని, ఆలోచనా స్పష్టత, అమలు చేసే పటిమ ఆ సమయంలో మెండుగా ఉంటాయని, తన జీవితంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు తెల్లవారు జామున తీసుకున్నవేననీ చెప్పడం ఈ సమయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది.
లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి.

కన్యాదానం - విశిష్టత

కన్యాదానం - విశిష్టత

వివాహకాండలో కీలక ఘట్టం కన్యాదానం. నిజానికి వివాహమంటేనే కన్యాదానం. కన్యాదానం కూడా ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైనది మరియు విశిష్టమైనది. సంతానార్ధం, త్రిధర్మ రక్షణార్ధం కన్యాదానం చేస్తారు. ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చింది. కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపరయుగంలో యజ్ఞాలకి, కలియుగంలో దానానికి విశిష్ట స్థానం కల్పించింది. ఇది స్పష్టంగా పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది.

మొత్తం 16 రకాల దానాలు చెప్పబడ్డాయి. వాటిలో నాలుగు దానాలు మరింత విసిష్టమైనవి. అవి కన్యాదానం, గోదానం, భూదానం మరియు విద్యాదానం. వీటిని చతుర్విధ దానాలంటారు.

భూదానంలో భూమి మీదనో, గోదానంలో గోవు మీదనో గల అన్ని హక్కులనూ దానం పుచ్చుకున్నవారికి ఇచ్చి వేస్తారు. వారు వాటిని అనుభవించవచ్చు. ఇంకొకరికి ఇవ్వవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. కన్యాదానం వాటికి భిన్నమైనది. వధువు యొక్క సర్వబాధ్యతలను మరి ఒకరికి బదిలీ చేయడానికి, కన్యాదాన ఉద్దేశ్యం ఇంత దాకా ఆమె పోషణ, రక్షణ, సంతోషం, ఓదార్పు, ప్రోత్సాహం, అన్నీ తల్లిదండ్రుల బాధ్యతలు. ఇకపై ఆమె భర్తకు, అత్తవారింటికి మార్చబడతాయి. వివాహం అనేది ద్వైపాక్షిక ఒప్పందం. దాన్ని దైవసాక్షిగా, అగ్నిసాక్షిగా, మనస్సాక్షిగా అంగీకరించాలి, గౌరవించాలి, అనుసరించాలి. ఇవి వధూవరులకి కాదు, వారి కుటుంబీకులకు వర్తిస్తుంది.

కన్యాదానకాండ లక్ష్యం ఒక్కటే. పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు, రక్షణ, ప్రోత్సాహకాలూ అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవడానికి, సర్దుకుపోవడానికి మానసికంగా సంసిద్ధపరుస్తుంది. భరోసా కల్పిస్తుంది. ధైర్యస్థైర్యాలనిస్తుంది. వరుని కాళ్ళు కడిగి కన్యాదాత శచీదేవిని పూజించి కన్యాదానం చేస్తాడు. వధూవరుల మధ్య తెరను సుముహూర్తం వరకు అలానే ఉంచి కన్యాదానం చేస్తూ, నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణుస్వరూపుడైన నీకు ఇస్తున్నాను. నా పితరులు తరించడానికి ఈ కన్యను దానం చేస్తున్నాను. భగవంతుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులగుదురుగాక. సాధుశీలమైన, అలంకరింపబడిన ఈ కన్యను ధర్మ, కామార్ధ సిద్ధి కలిగే నిమిత్తము మంచి శీలం కలిగిన, బుద్ధిమంతుడవైన నీకు దానం చేస్తున్నాను, అంటూ చతుర్ధీవిభక్తి వేయకుండా కన్యాదాత దానం చేస్తాడు.

సాక్షాత్ విష్ణుస్వరూపుడైన అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దానం చేయడు కన్యాదాత. వరుడి దగ్గిర నుండి కొన్ని ప్రమాణాలు అడుగుతాడు. మరి ఇన్ని సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న గారాలపట్టిని, తన ఇంటి మహారాణిని, కన్యాదాత అంత సులువుగా వరుడి చేతిలో పెట్టకుండా కొన్ని ప్రమాణాలు అడుగుతాడు.

1. నీవు ధర్మమునందు ఈమెను అతిక్రమించకూడదు అని అడిగితే, వరుడు దానికి అంగీకరిస్తాడు. ధర్మమునందు ఈమెను అతిక్రమించనని
ప్రమాణం చేస్తాడు.

2. అర్ధము నందు నీవు ఈమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటి వరకు ఎంతైతే సంపాదించావో, ఇక ముందు సంపాదించబోయెదానికి ఈవిడ సర్వాధికారిణి. ఒప్పుకుంటావా? అని అడిగితే దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు.

3. నీ మనసులో కామం కలిగితే నీకు మా అమ్మాయే గుర్తుకు రావాలి. నా కూతురి ద్వారానే నీవు సంతానాన్ని పొందాలి. అర్హత ఇంకొకరికి ఇవ్వడానికి వీలులేదు అనగానే, దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు.

అప్పుడు ఒక మహాద్భుతమైన కన్యాదాన ఘట్టం జరుగుతుంది. ముందుగా విష్ణుస్వరూపుడిగా ఉన్న వరుడు ఎదురుపడితే, మరి ఆయన ఆతిధ్యం ఇవ్వాలంటే అర్ఘ్యం, పాద్యం ఇవ్వాలి కదా!. దీనికంటే ముందు కన్యాదాత, వరుడు వివాహవేదికకు వచ్చే ముందే ఒక ఆసనం ఏర్పాటు
చెయ్యాలి. అది దర్భాసనం అయి ఉండాలి. ఎందుకంటే విష్ణుమూర్తి వచ్చి నీ ఎదురుగా నుంచుంటే ఉచితాసనం వేసి గౌరవించాలి కదా! మరి దర్భాసనాన్ని మించిన ఉచితాసనం ఏముంటుంది కనక. అందుకని కన్యాదాత తప్పక దానిని ఏర్పాటు చేసుకోవాలి.

కాళ్ళు కడిగేటప్పుడు కూడా ముందుగా కుడికాలుని ఉంచితే, తనకు కాబోయే మామగారు, అత్తగారు మరచెంబుతో సన్నటి ధారతో నీటిని పోస్తుంటే, మామగారు బహుజాగ్రత్తగా రెండు చేతులతో ఆ పాదాలను కడుగుతాడు. అలాగే, దాని తరువాత ఎడమ పాదాన్ని ఉంచాలి. ఆ పాదాన్ని కూడా మామగారు అంతే ప్రీతితో కడుగుతాడు. మామగారు, అల్లుడి పాదాలు కడుగుతుంటే చాలా ఆనందంగా, వింతగా Photographer వంక, Videographer వంక చూడడం కాదు, వరుడు చెయ్యాల్సింది. తనకంటే వయసులో పెద్దాయన తన కాళ్ళు కడుగుతున్నాడు. తాను చేసుకున్న పుణ్యం అంతా తరిగిపోతుంది. కాబట్టి, ఒక చిన్న శ్లోకం చదువుకోవాలి (మయి, మయి, యశోమాయి) అని. బ్రహ్మగార్ని అడిగితే ఆయన చెబుతాడు. ఈ విషయం వరుడి తండ్రి చెప్పుకోవాలి. కన్యాదాత చెప్పుకోలేడు కదా... బాబూ! నేను నీ కాళ్ళు కడుగుతుంటే నువ్వు అలా మెడ వేళ్ళాడేసి Videographer వంక చూడటం కాదు, ఇది చదువుకో అని చెబితే తనను తాను పోగుడుకున్నట్లు అవుతుంది అని తండ్రి చెప్పుకోవాలి. నీ పుణ్యం ఎగిరిపోతుందిరా... నువ్వు ఇది చదువుకో అని, లేకపోతే బ్రహ్మస్థానంలో కూర్చున్న బ్రహ్మగారు చెప్పాలి. మనకి ఇవేమీ అఖ్ఖర్లేదు, అల్లరి తప్ప. అలా అల్లుడి కాళ్ళు కడిగిన తరువాత కన్యని సాలంక్రుతకన్యాదానం చేస్తారు. ఏమి పెట్టినా, పెట్టకపోయినా ఆడపిల్లకి సాధ్యమైనంతవరకు కన్యాదానం సమయంలో వడ్డాణము, చెవికి తాటంకాలు, ముక్కుపుడక పెట్టి కన్యాదానం చెయ్యాలి.

మరి, అందరి ఆడపిల్లల తండ్రులకి అంత ఆర్ధిక పరమైన శక్తి ఉండదు కదా! మన సనాతన ధర్మము, శాస్త్రము ఎంతో ఉత్తమమైనటువంటివి. నీవు ఊరంతా అప్పులు చేసి ఇవన్నీ పెట్టాల్సిందే అని చెప్పదు. మనకి తరుణోపాయం తెలియచేస్తుంది. పైగా, కన్యాదానం అనేది చాలా పెద్ద దానం. అందుకే కదా ఆడపిల్లలు లేనివారు కన్యాదానం చెయ్యాలని ఉవ్విళ్ళూరేది. అందుకే కన్యాదానంకంటే ముందు కన్యాదాత దశదానాలు చెయ్యాలి. మరి అంత శక్తి లేనివారు కన్యాదానం చేసే ముందు వధువు చేతిలో పూర్ణఫలం, కొబ్బరిబోండాం పెడతారు. దానిమీద గుమ్మడిపండు, దానిపైన మంచి గంధపు చెక్క పెట్టి కన్యాదానం చేస్తే, కన్యాదాత దశదానాలు చేసి సాలంక్రుతకన్యాదానం చేసినట్లే. ఈ పూర్ణ ఫలంతో ఉన్న అమ్మాయి చేతిని అబ్బాయి దోసిట్లో పెట్టి సన్నటి నీటి ధారతో ప్రక్కన భార్య పోస్తుండగా కన్యాదాత కన్యాదానం చేస్తాడు. సామాన్యంగా భార్య, భర్తకి ఎడమ చేతి ప్రక్కన కూర్చుంటుంది. కాని, కొన్ని విశేష క్రతువులు చేసేటప్పుడు భార్యాస్థానం మారిపోతుంది. ఆవిడ ఆ సమయంలో కుడివైపుకి వస్తుంది.

ఇలా కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం జరిగేటప్పుడు బ్రహ్మగారు వరుడిని, వధువుని కొన్ని ప్రమాణాలు చెయ్యమని దానికి అగ్ని, వాయువు, ఇంద్రుడు మొదలైనవారు సాక్షులనుకుని ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతిచరామి అని వారిద్దరిచేతా ప్రమాణాలు చేయిస్తాడు. వారి చేత ఈ మంత్రాలను పలికించాలి. ఇలా ఎంతో మహోన్నతమైన కన్యాదానం జరిగేటప్పుడు పితృదేవతలు కూడా తన కొడుకు లేక మనవడు కడుగుతున్న శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని చూసి వారు పితృదేవతా స్థానంలో ఉండి కన్యాదానం చేస్తున్నవారిని, వధూవరులను ఆశీర్వదిస్తారు.

మన వివాహకాండ ఎంతో మహోన్నతమైనది. అంతటి ఉత్తమమైనది కాబట్టే పాశ్చాత్య దేశాలు కూడా మన వివాహ సంస్కృతిని చూసి చేతులెత్తి నమస్కరిస్తున్నాయి. ఈ వివాహ సంస్కృతిని మన సనాతనధర్మం ఎలా చెప్పిందో అలా ఆచరిస్తూ, ఇంతే పదిలంగా ముందు తరాలకు అందించాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాబట్టి, మనందరం వీటి గురించి తెలుసుకుంటూ పదిమందికి ఈ విషయములను తెలియచేస్తూ మన సంస్కృతి, సాంప్రదాయాలపట్ల ఆసక్తిని పెంచే దిశతో అందరం పయనిద్దాం.

*సర్వేజనా సుఖినోభవంతు

అందరికీ (ఎనర్జీ కన్సర్వేషన్ డే) ఇంధన పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు! రేపటి వెలుగుకు నేడే పొదుపు!



అందరికీ (ఎనర్జీ కన్సర్వేషన్ డే) ఇంధన పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు!
రేపటి వెలుగుకు నేడే పొదుపు!
దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్తు ఇవ్వాలంటే ఆ మేరకు ఇంధన ఉత్పత్తి జరగాలి. అదే సమయంలో సరఫరాకు, పంపిణీకి తగిన స్థాయిలో సమర్థమైన వ్యవస్థలు అవసరం. విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా పటిష్ఠ స్థితిలో ఉండటం తప్పనిసరి. ఆ పరిస్థితికి భారత్‌ ఇంకా చేరుకోలేదనే చెప్పాలి. ఇవ్వాళ ఇంధన పరిరక్షణ దినోత్సవం. అన్ని స్థాయుల్లోనూ ఇంధన వినియోగంపట్ల సదవగాహన మొగ్గతొడిగితే దేశ విద్యుత్‌ అవసరాలను సమర్థంగా తీర్చడం పెద్ద కష్టం కాబోదు.
నూతన సాంకేతిక విజ్ఞానం మానవ జీవనాన్ని ఎంత సౌకర్యవంతంగా మారుస్తోందో అంత సంక్లిష్టమైన మలుపులూ తిప్పుతోంది. పెరుగుతున్న అవసరాలకు పరిమిత వనరులు వేగంగా కరిగిపోతున్నాయి. దేశ విద్యుత్‌ రంగాన్ని ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో పరిపుష్టం చేసుకోకపోతే సమస్యలు ముమ్మరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే విద్యుత్‌ రంగంలో భారత్‌ చాలావరకు కొరతను అధిగమించింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ లోటునుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఇటీవల పార్లమెంటుకు వెల్లడించిన వివరాలు ఇదే విషయం ధ్రువీకరిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక నాలుగు శాతంమేర లోటు ఎదుర్కొన్నట్లు వెల్లడవుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల గిరాకీ మేరకు విద్యుత్తును సరఫరా చేయగలిగినట్లు కేంద్ర విద్యుత్‌ అథారిటీ విశ్లేషణ తెలియజేస్తోంది. దేశంలో నేటికీ వేల గ్రామాలకు విద్యుత్‌ అందని పరిస్థితి ఉన్నప్పటికీ- ప్రతి గ్రామానికి, ఇంటికి విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వ కృషి ముమ్మరమైందన్నది నిజం. 2019నాటికి ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని మోదీ సర్కారు లక్ష్య నిర్దేశం చేసుకొంది. నిరంతరాయంగా 24 గంటలూ విద్యుత్‌ అందించాలన్నది మరో సంకల్పం. ఈ విషయమై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.
పర్యావరణానికీ ప్రాధాన్యం
పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలు నెరవేరుస్తూనే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కృషి చేయాల్సిన తరుణమిది. ఆ క్రమంలోనే దేశంలో పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం పెరిగింది. దేశ విద్యుత్తు అవసరాలు ఇప్పటికీ చాలావరకు థర్మల్‌ విద్యుత్‌ ద్వారానే తీరుతున్నాయి. మన దేశంలో ప్రస్తుతం విద్యుత్‌ స్థాపక సామర్థ్యం 3.07 లక్షల మెగావాట్లు. అందులో 1.86 లక్షల మెగావాట్లు బొగ్గు ఆధారితమే. అంటే సుమారు 61 శాతమన్నమాట! బొగ్గుతోపాటు గ్యాస్‌ వంటి ప్రాజెక్టులనూ కలిపినప్పుడు థర్మల్‌ విద్యుత్‌ వాటా 69 శాతానికి చేరుతుంది. దేశంలో సుమారు 74వేల మెగావాట్ల స్థాపక సామర్థ్య లక్ష్యంతో చేపట్టిన థర్మల్‌ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరోవైపు పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం ఇప్పటికే జల విద్యుత్తును అధిగమించింది. ఆరో దశకం తొలినాళ్లలో దేశ మొత్తం విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యంలో జల విద్యుత్‌ వాటా 51 శాతం. ఇప్పుడది 14 శాతానికి చేరింది. పునరుత్పాదక ఇంధన వనరుల వాటా ఇప్పటికే 15 శాతానికి చేరుకుంది. ఈ రంగంలో విద్యుత్‌ ఉత్పాదన సైతం నిరుటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చినపుడు 28 శాతం పెరిగినట్లు కేంద్ర విద్యుత్‌ అథారిటీ తాజా లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో సంప్రదాయ ఇంధన వనరుల విద్యుత్‌ ఉత్పత్తిలో పెరుగుదల కేవలం 4.52 శాతంగా తేలింది. థర్మల్‌ ప్రాజెక్టుల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే ప్రక్రియ. సౌర విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు అంత సమయం అక్కర్లేదు. ప్రతి నెలా దేశంలో సౌర విద్యుత్తు సామర్థ్యం పెరుగుతుండటానికి కారణమదే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలల్లోనే దేశంలో దాదాపు రెండు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ స్థాపకత పెరిగిందని అంచనా! దేశ సౌర విద్యుత్‌ స్థాపక సామర్థ్యం తొమ్మిది వేల మెగావాట్లకు చేరువలో ఉంది. వచ్చే ఏడాది ఇదే కాలానికి అది రెట్టింపయ్యే అవకాశాలూ ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన వనరులుగా చిన్న జల విద్యుత్‌ కేంద్రాలనే పరిగణించేవారు. పెద్ద జల విద్యుత్‌ కేంద్రాలనూ ఆ పరిధిలో చేర్చాలని ఇటీవల గుజరాత్‌లోని వదోదరలో జరిగిన రాష్ట్రాల విద్యుత్‌ మంత్రుల సమావేశం అభిప్రాయపడింది. పెద్ద జల విద్యుత్‌ కేంద్రాలనూ ఆ పరిధిలోకి తీసుకువస్తే దేశ విద్యుత్తులో దాని వాటా దాదాపు 30 శాతానికి చేరుతుంది. పునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌర, పవన విద్యుత్‌ ప్రధానమైంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకే పవన విద్యుత్‌ ప్రధానంగా పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణలోనే పవన విద్యుత్‌కు ఎక్కువ అవకాశముందని విశ్లేషణల్లో వెల్లడైంది. దేశంలో పవన విద్యుత్‌ స్థాపక సామర్థ్యం ఇప్పటికి 28 వేల మెగావాట్లకు చేరుకుంది. ఈ విషయంలో తమిళనాడు దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్ర పవన విద్యుత్తు సామర్థ్యం ఏడున్నర వేల మెగావాట్లపైనే. తరవాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ ఉన్నాయి. దేశంలో పవన విద్యుత్తు సామర్థ్యం మూడు లక్షల మెగావాట్ల వరకు ఉన్నట్లు ఓ అంచనా. ఇప్పటివరకూ అందులో ఉపయోగించుకుంది పరిమితమే. లక్షా నలభై అయిదు వేల మెగావాట్లతో ప్రపంచ పవన విద్యుత్‌ రంగంలో చైనా అగ్రభాగాన నిలుస్తోంది. ప్రపంచ పవన వినియోగ పటంలో భారత్‌ది నాలుగో స్థానం. ఇక దేశవ్యాప్తంగా అనంతంగా లభించే సౌరశక్తిని వినియోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయడమన్నది రాష్ట్రాల చొరవపై ఆధారపడిన అంశం. సౌర విద్యుత్తు ధర అందుబాటులోకి రావడం ఉత్సాహం కలిగించే పరిణామం. ఒకప్పుడు యూనిట్‌ ధర పన్నెండు రూపాయలకుపైగా ఉంటే, నేడది అటుఇటుగా అయిదు రూపాయలకు చేరింది. సౌర ఫలకాల రేటూ తగ్గుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూత అందించడమూ ఇందుకు కారణం. భవనాల పైకప్పుల మీద సౌర ఫలకాలు అమర్చి నలభై వేల మెగావాట్ల విద్యుత్తు సాధించే లక్ష్యంతో కేంద్ర సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ భవనాల మీద సౌర వ్యవస్థలను అమర్చడం ద్వారా ఒకేసారి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తును సాధించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలూ ఈ తరహా కార్యక్రమాలను చురుగ్గా అందిపుచ్చుకొంటున్నాయి. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్‌ పంపుసెట్లకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, దేశంలోని 55వేల పెట్రోలు బంకులను సౌర ఆధారిత కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర సర్కారు సంకల్పించింది.
పునరుత్పాదక ఇంధనానికి ప్రోత్సాహం
దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం క్రమంగా ఇనుమడిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు గ్రిడ్‌కు ఈ వ్యవస్థలను అనుసంధానించడం, స్థిరీకరించడం చాలా ముఖ్యం. గాలి లేకుంటే పవన విద్యుత్తు ఆగిపోతుంది. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ లోటును పూడ్చుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానంలో ఏమాత్రం లెక్క తప్పినా విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలుతుంది. తమిళనాడులో పవన విద్యుత్‌ సామర్థ్యం అత్యధికం. కాబట్టి ఈ రాష్ట్రం చాలావరకు గ్రిడ్‌కు సంబంధించి సుస్థిరతను సాధించింది. విద్యుత్‌ మిగులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ఇది కత్తిమీద సాము లాంటి వ్యవహారమేనని చెప్పవచ్చు. పునరుత్పాదక ఇంధన వనరులను వాడుకోవడానికి సంప్రదాయ (థర్మల్‌) విద్యుత్తును తగ్గించాలి. ఈ తరహాలో కోత పెట్టడమంటే అది ఒకరకంగా పూర్తిస్థాయిలో విద్యుత్తును వాడుకోలేకపోవడం కిందికే వస్తుంది. ఆ మేరకు భారం వినియోగదారుడిపై పడుతుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సాహం ఇస్తున్న రాష్ట్రాలు- నిర్దిష్ట ప్రణాళిక, నిర్మాణాత్మక వ్యూహం, పకడ్బందీ ఆచరణతో అడుగులు కదపకపోతే వినియోగదారులకు చివరకు మిగిలేది కష్టాలే!
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
దేశంలో అందరికీ విద్యుత్తు అందించడం ఓ సవాలే. ఇప్పటికీ దేశంలో ఎనిమిది వేలకుపైగా గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. ఉత్పాదన పెంచుకోవడంతోపాటు సమర్థంగా విద్యుత్తును వినియోగించుకోవడమూ కీలకమే అని గుర్తించాల్సిన తరుణమిది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన పారిస్‌ ఒప్పందంలో అధికారికంగా చేరుతూ భారత ప్రభుత్వం ఇదే విషయం స్పష్టం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సాహం, కర్బన ఉద్గారాల తగ్గింపు ఆ వ్యూహంలో ఒక భాగం. ఇంధన సమర్థ వినియోగం మరో భాగం. విద్యుత్తు పొదుపు చర్యలకు కేంద్రం తగిన సానుకూల వాతావరణం కల్పిస్తోంది. పొదుపు చర్యలను ముమ్మరం చేయడం ద్వారా ఏడాదికి అదనంగా 19,598 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం తగ్గించాలని లక్షిస్తోంది. 2018-19 సంవత్సరానికి 10 శాతం విద్యుత్‌ ఆదా చేయాలని భావిస్తోంది. విద్యుత్‌ బల్బుల వ్యవస్థలో సమూల మార్పులు ఇందులో భాగం. ఎల్‌ఈడీ బల్బుల వాడకం దేశంలో పెరిగింది. గృహ రంగంలో 18.25 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ జరిగింది. దీనివల్ల ఏడాదికి 23వేల మిలియన్‌ యూనిట్లకుపైగా విద్యుత్తు ఆదా అవుతోందని అంచనా! ఎల్‌ఈడీ బల్బుల ధరలూ బాగా దిగివచ్చాయి. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థ కొలువుతీరనుంది. తద్వారా విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గడంతోపాటు, కర్బన ఉద్గారాలకూ కోతపడుతుంది. గృహోపకరణాల విద్యుత్‌ సామర్థ్యం ఎంతో తెలియజేసే లేబుల్‌ వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 21 రకాల పరికరాలకు లేబుల్‌ పద్ధతి అమలవుతోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి వాటిలో గతంతో పోలిస్తే ఇంధన సామర్థ్య పెరుగుదల 30 శాతం వరకూ ఉన్నట్లు అంచనా. వ్యవసాయ రంగంలో నాసి రకం పంపుసెట్ల వల్ల విద్యుత్‌ వృథా అవుతోంది. ఇంధన సామర్థ్యం 30 శాతం మేర ఉన్న పంపుసెట్ల ప్రవేశాన్ని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రైతులకు ఈ తరహా పంపుసెట్లను ఉచితంగా అందించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దేశంలో రెండు కోట్లకుపైగా పంపుసెట్లు ఉన్న నేపథ్యంలో పొదుపు చర్యల ద్వారా పెద్దయెత్తున ఇంధనం ఆదా చేయవచ్చు. ఈ క్రమంలో రైతుల భాగస్వామ్యం కీలకం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఇంధన పొదుపు పంపుసెట్ల కార్యక్రమం అంతంతమాత్రంగా సాగుతోంది. ఈ ప్రాంత రైతులకు 2,496 పంపుసెట్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం సగమైనా పూర్తి కాలేదు. రాష్ట్రాలు ఇలాంటి అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందడుగు వేయాలి. విద్యుత్తు పొదుపును దృష్టిలో పెట్టుకుని వాణిజ్య భవనాలకు కేంద్రం ఇంధన వాడక స్మృతిని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఎనిమిది రాష్ట్రాలు ఈ ప్రమాణాలు పాటించేందుకు ముందుకు వచ్చాయి. మరీ ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవడంపై కేంద్ర సర్కారు చురుగ్గా కదులుతోంది. దేశంలో వనరులకు కొదవలేదు. వాటిని జాగ్రత్తగా, సమర్థంగా ఉపయోగించుకుంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఇంధన వనరుల వినియోగంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భవిష్యత్తు తరాలకు చీకటి మిగులుతుంది. ప్రభుత్వాలు, ప్రజలు ఇది గుర్తెరిగి వ్యవహరించాలి!
- వల్లభనేని సురేశ్‌

Total Pageviews