Friday, August 31, 2018

అంతర్జాతీయభాష (international language), ప్రపంచ భాష (global language) ల మధ్య తేడా

దాదాపు పదిహేనేళ్ళ కిందట ఇంటర్నెట్లో Spanish as a global language అనే ఒక వ్యాసం చదివాను. ఆ వ్యాసరచయిత ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీషుతో స్పానిష్ ని పోలుస్తూ, స్పానిష్ కూడా ఒక ప్రపంచ భాషగా మారడం గురించి కొన్ని ఆలోచనలు పంచుకున్నాడు. అతడికి ఆ విషయంలో డేవిడ్ క్రిస్టల్ రాసిన English as a Global Language (1997) అనే రచన స్ఫూర్తినిచ్చింది.
డేవిడ్ క్రిస్టల్ నేడు జీవించి ఉన్న ఇంగ్లీషు భాషాపండితుల్లో ఒక విజ్ఞాన సర్వస్వం వంటివాడు. అతడు ఇంగ్లీషు భాషాపరిణామాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తూ ఇంగ్లీషు గ్లోబల్ భాషగా పరిణమిస్తోందని చెప్తున్నప్పుడు, అంతర్జాతీయభాష (international language), ప్రపంచ భాష (global language) ల మధ్య తేడా ఉందని గుర్తుపట్టాడు.
ఒక భాష మాట్లాడే ప్రజలు వివిధ దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పుడు ఆ భాష కేవలం అంతర్జాతీయ భాష మాత్రమే అవుతుంది. అలా కాక, వివిధ దేశాల్లో ఉండే వివిధ భాషావ్యవహర్తలు కూడా ఒక భాష మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, ఆ భాష ప్రపంచభాషగా మారుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచమంతా వ్యాపించి ఉన్న రోజుల్లో ఇంగ్లీషు ఒక అంతర్జాతీయ భాష గా మాత్రమే ఉండింది. కాని 1980 తర్వాతనే ఇంగ్లీషు ఒక గ్లోబల్ భాషగా వికసించడం మొదలుపెట్టింది. చాలా కాలం పాటు ఇంగ్లీషుకి దూరంగా ఉన్న చైనా లాంటి మహాదేశం కూడా ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకోక తప్పని స్థితికి ఇంగ్లీషు చేరుకుంది.
అయితే, ఈ అవకాశం ఇంగ్లీషుకు మాత్రమే స్వంతమా? మరొక భాష ఈ స్థాయికి చేరుకునే అవకాశం లేదా? ఈ ప్రశ్నలతో ఆ స్పానిష్ భాషాభిమాని తన వ్యాసం మొదలుపెడుతూ, ఒక భాష ప్రపంచ భాష గా ఎదగాలంటే ఉండవలసిన ఈ లక్షణాలను స్థూలంగా పేర్కొన్నాడు.
ఒక భాష ప్రపంచభాషగా ఎదగడానికి ఆ భాష ని మాట్లాడే మూలవ్యవహర్తల సంఖ్యతోగాని, ఆ దేశం పరిమాణంతోగాని, ఆ భాషతాలూకు వ్యాకరణ నిర్మాణంతో గాని సంబంధం లేదు.
ఒక భాష ప్రపంచానికి పరిచయం కావడానికి, ఆ భాష మాట్లాడేవాళ్ళ రాజకీయ శక్తి తొలిరోజుల్లో ఉపయోగపడుతుంది. కాని, ఆ తరువాత కేవలం రాజకీయ శక్తి వల్ల ఆ భాష గ్లోబల్ భాషగా మారిపోదు.
ఒక భాష అంతర్జాతీయ స్థాయినుంచి ప్రపంచభాషగా మారే క్రమంలో అన్నిటికన్నా ముందు అవసరమైంది ఆ భాష కుండే చలనశీలత. అంటే వివిధ ప్రపంచ పరిణామాల్ని ఆ భాష ఎంత తొందరగా పట్టుకోగలదు, వ్యక్తం చేయగలదు అన్నది ముఖ్యం.
రెండవది, ఒక భాష ప్రపంచభాష కావాలంటే, ఆ భాష నేర్చుకోవడంలో ఒక ఆర్థిక ప్రయోజనం ఉండాలి. అంటే, ఆ భాష జీవనోపాధి భాషగా కూడా వికసించవలసి ఉంటుంది. ఉదాహరణకి, జపనీస్.
ఒక భాష జీవనోపాధి భాషగా మారాలంటే, ఆ భాష మాట్లాడే ప్రజలు ప్రపంచ వాణిజ్యంలోనూ, వస్తుసేవల ఉత్పత్తిలోనూ ప్రధానపాత్ర పోషించగలగాలి. ప్రపంచంలోని వివిధ దేశాలవారికి ఆ మూలభాషా వ్యవహర్తలతో మాట్లాడే అవసరం ప్రతిరోజూ కలగాలి. ఇందుకు ఉదాహరణ చైనీస్.
ఒక భాష ఆర్థికంగా ముందంజ వేస్తేనే చాలదు, ఆ భాషలో అత్యంత మౌలికమైన వైజ్ఞానిక, సాంకేతిక, తాత్త్విక వాజ్ఞ్మయం కూడా రావలసి ఉంటుంది. ఉదాహరణకి కిర్క్ గార్డ్ ని మూలంలో చదవడానికి ఎందరో డేనిష్ నేర్చుకోడానికి సిద్ధపడుతుంటారు. 500 ఏళ్ళ కిందట మిడిల్ ఇంగ్లీష్ గా ఉన్న ఆంగ్లో సాక్సన్ భాషను ఇంగ్లీషుగా మార్చిన వాళ్ళల్లో షేక్ స్పియర్ తో పాటు ఫ్రాన్సిస్ బేకన్, థామస్ హాబ్స్ కూడా ఉన్నారు. ఒక భాష సుసంపన్నం కావాలంటే గొప్ప సాహిత్యం రావాలి. కాని, అది 18 వ శతాబ్దం దాకానే సత్యం. గత రెండు వందల ఏళ్ళుగా ఏ భాషలో మౌలికమైన వైజ్ఞానిక పరిశోధన, తాత్త్విక చింతన, చర్చ జరుగుతున్నాయో, ఆ భాషలు మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకి జర్మన్. ఆధునికభాషల్లో అంత తాత్త్వికభాష మరొకటి లేదు. హిడెగ్గర్ లాంటి తాత్త్వికుణ్ణి ఇంగ్లీషు అనువాదంలో చదువుతున్నప్పుడు, ఇంగ్లీషు ఆ చింతన బరువు మోయలేకపోతున్నదనీ, తక్షణమే మనం జర్మన్ నేర్చుకోకతప్పదనీ గ్రహిస్తాం.
సరే, ఒక భాష బృహద్భాషగా పరిగణించబడాలంటే ఆ భాషలో గొప్ప సాహిత్యం వచ్చి ఉండాలనేది మళ్ళీ చెప్పవలసిన పనిలేదు. కాని, మనం కొత్తగా చెప్పుకోవలసిందేమంటే, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగాపెరుగుతూ వస్తేనే ఆ భాష ప్రపంచభాషగా మారుతుందనేది.
అంటే, ఆ మూలభాషలో గొప్ప సాహిత్యం ఉందనీ, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవలేకపోతే ప్రపంచం పేదదైపోతుందనే భావన కలిగేటంతగా, ఆ భాషా సాహిత్యం వివిధ ప్రపంచ భాషల్లోకి అనువాదం కావాలి. ఇందుకు చెప్పదగ్గ గొప్ప ఉదాహరణ రష్యన్.
ఒక భాష ప్రపంచభాషగా మారుతున్నదనడానికి క్రిస్టల్ చెప్పిన ఒక కొండ గుర్తు, ఆ భాషని ద్వితీయ భాషగా నేర్చుకోడానికి ఇష్టపడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎంత పెరుగుతోందో చూడమని.
ఆయన ఆ మాట రాసి ఇరవయ్యేళ్ళయ్యింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక డిజిటల్ పరికరం తయారు చేసినప్పుడు, అందులో డిఫాల్టుగా పొందుపరిచే భాషల్లో ఒకటికాగలినప్పుడే ఆ భాషని ప్రపంచ భాషగా పరిగణించగలమని. ఎన్నో భారతీయభాషలకన్నా ఎంతో చిన్నదైన జపనీస్ ని ఈ సూచిక ప్రకారమే నేను గ్లోబల్ భాషగా పేర్కొంటున్నాను.
ఒక భాష వికసించాలంటే, లిపి, వ్యాకరణం, పదజాలం ముఖ్యమైనవే గాని, మరీ ఏమంత ముఖ్యమైనవి కావు. ఒక భాషలో ఆ భాషా పదజాలం ఉన్నంతమాత్రాన దాన్ని మనం సజీవ భాష అనడానికి లేదు. వేరే భాషల పదజాలాన్ని ఆ భాష ఎంత శీఘ్రంగా, ఎంత విస్తారంగా స్వీకరించగలదో లేదో అన్నదాన్నిబట్టే ఆ భాష సజీవం అవునోకాదో చెప్పగలం. ఉదాహరణకి, ఇప్పటి ఇంగ్లీషులో మూల ఆంగ్లో సాక్సన్ పదజాలం 25 శాతం కన్నా తక్కువే. మూడొంతులు విదేశీ పదజాలంతోనే ఇంగ్లీషు వికసిస్తున్నది. భాషని పదజాలంగా పొరపడకూడదు.
నలుగురూ భాష నేర్చుకోడానికి మనం లిపిని సంస్కరించవలసిన అవసరం లేదు. అత్యంత సంక్లిష్టమైన లిపులు కలిగిన చైనీస్, కొరియన్, జపనీస్ వంటి భాషలు నేర్చుకోడానికి ప్రపంచానికి ఆ భాషల లిపి అడ్డం పడటం లేదు. అసలు ఒక భాషకి లిపి ఏమంత ముఖ్యం కూడా కాదు. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే హిందీకి స్వంత లిపి లేనే లేదు. మలేషియన్ భాష రోమన్ లిపినే వాడుకుంటున్నది.
ఒక భాషని వికసింపచేయడానికి ఆ భాషలో అక్షరాలు తగ్గించనక్కర్లేదు. ఏ భాషకైనా ఏదో ఒక సంక్లిష్ట పార్శ్వం ఉంటుంది. ఇంగ్లీషులో అక్షరాల సంక్లిష్టత తక్కువ, నిజమే, కాని స్పెల్లింగు సంక్లిష్టత చాలా ఎక్కువ. తానే కనుక భాషాదేవత అయి ఉంటే, ఇంగ్లీషు గ్లోబల్ భాష కావడానికి ఎంత మాత్రం ఇష్టపడి ఉండేవాడిని కానని స్వయంగా డేవిడ్ క్రిస్టల్ నే అన్నాడు. అందుకు ఆయన చూపించిన కారణం వికృతమైన ఇంగ్లీషు స్పెల్లింగు వ్యవస్థ. But ని బట్ అని పలుకుతున్నప్పుడు put ని మటుకు పుట్ అనీ ఎందుకు పలకాలో అర్థం కావటం లేదని డేవిడ్ క్రిష్టల్ కన్నా యాభై ఏళ్ళ ముందే 'విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు' రచయిత వాపోయాడు. ఒక భాషలోని అక్షరసంపద ఆ భాషలోని ఉచ్చారణసంపదకు కారణమవుతుంది. సంస్కృతమే ఇందుకు ఉదాహరణ.
వ్యాకరణం భాషకి వెన్నెముకనే గాని, స్థిరమైన వ్యాకరణం ఏ భాషకీ లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. తాను ఈజిప్టు వెళ్ళినప్పుడు అక్కడివాళ్ళు Welcome to Egypt అనకుండా, Welcome in Egypt అన్నారనీ, ఆ ఇంగ్లీషుని కూడా తాను ఆమోదించక తప్పలేదనీ క్రిష్టల్ ఒకచోట రాసుకున్నాడు.
ఈ నేపథ్యంలో తెలుగు భాష ఎక్కడుంది? ethnologue.com లెక్కల ప్రకారం సుమారు ఎనిమిదికోట్ల మంది మొదటిభాషగానూ, 5 కోట్ల మంది ద్వితీయ భాషగానూ మాట్లాడుతున్న ఈ భాష ప్రపంచ పటంలో ఎక్కడుంది?
గత ఇరవయ్యేళ్ళలో ఈ భాష నేర్చుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ముందుకొచ్చారు?
గత పదేళ్ళలో ఎన్ని వైజ్ఞానిక, తాత్త్విక గ్రంథాలు తెలుగు భాషలో వెలువడ్డాయి? ఎన్ని అనువదించబడ్డాయి?
ఎన్ని ప్రాచీన తెలుగు కావ్యాలు ఎన్ని ప్రపంచభాషల్లోకి అనువదించబడ్డాయి? ఎన్ని ప్రపంచవ్యాప్త సర్వశ్రేష్ఠ రచనలు తెలుగులోకి అనువదించబడ్డాయి?
తెలుగు భాషలో ఎన్ని వెబ్ సైట్లు నడుస్తున్నాయి? ఎన్ని బ్లాగులు నడుస్తున్నాయి? వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎందరు వీక్షించారు?
గత పదేళ్ళలో ప్రపంచ భాషల్లోంచి ఎన్ని కొత్త పదాలు తెలుగులోకి వచ్చాయి? ఎన్ని తెలుగు పదాలు ప్రపంచభాషల్లోకి ప్రవేశించాయి?
ఎన్ని నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు తెలుగులో రూపొందాయి? ఎన్ని స్పోకెన్ తెలుగు కోర్సులు కొత్తగా రూపొందాయి?
ఎన్ని డిజిటల్ పుస్తకాలు, ఎన్ని ఆడియో పుస్తకాలు తెలుగులో ప్రచురించబడ్డాయి? ఎన్ని ఆన్ లైన్లో కుదురుకున్నాయి?
మార్కెట్లోకి వస్తున్న కొత్త మొబైల్ ఫోనుల్లో ఎన్నింటిలో తెలుగు ఒక భాషగా by default అమర్చిఉంటున్నది?
మిత్రులారా, ఆలోచించవలసింది వీటి గురించి. అంతే తప్ప, ఒక్క ఇంగ్లీషు మాట కూడా లేకుండా ఎన్ని నిముషాలు మాట్లాడగలం, ఎన్ని ఇంగ్లీషు పదాలకి కృత్రిమ తెలుగు సమానార్థకాలు రూపొందించగలం, 56 అక్షరాల్లోనూ ఎన్ని అక్షరాల్ని నిర్మూలించాం, ఎన్ని సైన్ బోర్డులు తెలుగులో పెట్టామని కాదు.

Wednesday, August 29, 2018

సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించే మిత్రులంద‌రికీ ఒక 4 జాగ్ర‌త్త‌లు

🅾సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించే  మిత్రులంద‌రికీ ఒక 4 జాగ్ర‌త్త‌లు

* బ్రేకులు చ‌క్రాల‌కే గాని కారుకు కాదు. 70-80 కిలోమీట‌ర్ల లోపు అయితే, స‌డెన్ బ్రేకేస్తే కారు ఆగుతుంది. కానీ అంత‌కు మించితే బ్రేకు వ‌ల్ల ఉప‌యోగం లేదు.
  * ప్రమాదాలు ఎవ‌రూ ఆప‌లేరు గాని... మ‌రీ ఇలా ఆగిఉన్న లారీల‌ను ఢీకొట్ట‌డం మాత్రం క‌చ్చితంగా స్వ‌యంకృతాప‌రాధ‌మే.
 డ్రైవింగ్‌లో జాగ్ర‌త్త లేన‌పుడు మాత్ర‌మే ఇది జ‌రుగుతుంది.
 * మీరు హ‌ర్ట‌యినా ప‌ర్లేదు గాని.. మీరేమీ ప్ర‌ధాని కాదు, సీఎం కాదు.. మీరు కొంచెం లేటెల్తే కొంప‌లేం మునిగిపోవు. పైగా మీ కొంప మునిగిపోయే అవ‌కాశాలెక్కువ‌. స్పీడు 160 దాకా కూడా వెళ్లొచ్చు. కానీ స్ట్రెయిట్ హైవేలు కాన‌పుడు 80 కి.మీ. కంటే, రాత్రి ప్ర‌యాణాల్లో 80-100 కంటే ఎక్కువ‌ స్పీడు క‌చ్చితంగా మిమ్మ‌ల్ని చంపేస్తుంది.
 * అయినా రాత్రిపూట సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అర్జెంటుగా మీరు ఉద్ద‌రించాల్సిందేంటో ఆలోచించాలి.

 రిస్కు.... 
వ్యాపార‌ల్లో చేస్తే డ‌బ్బులు పోతాయి.
రోడ్ల మీద చేస్తే ప్రాణాలు పోతాయి

మీరు లేకుంటేమిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పడే బాధను ఊహించి జాగ్రత్త గా డ్రైవ్ చేయండి
జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద్వారా మన ప్రాణాలని నిలుపుకుందాం...
ఎదుట వచ్చే వారి ప్రాణానికి హామీ ఇద్దాం......
వేగం వద్దు....ప్రాణం ముద్దు

నిదానమే ప్రదానం అని ఊరికే అనలేదు భయ్యా, ఆలోచించండి, ఆచరించండి.. ☝☝

80Kmph స్పీడ్ కి 100-120kmph స్పీడ్ కి మధ్య తేడా కేవలం 10 నిమిషాలు మాత్రమే... లేటైతే పోయేది ఏమి లేదు, కానీ తొందర పడితే పోయేది కొన్ని జీవితాలు...

ఇట్లు మీ
శ్రేయోభిలాషి..🅾

Sunday, August 26, 2018

స్వరాల పల్లకి: కలువకు చంద్రుడు ఎంతో దూరం

స్వరాల పల్లకి: కలువకు చంద్రుడు ఎంతో దూరం: చిత్రం: చిల్లర దేవుళ్ళు (1975) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: బాలు పల్లవి: కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి...

Tuesday, August 21, 2018

హృదయం ''సాయంకాలపు మంచు రాలుతున్న వేళ

హృదయం
''సాయంకాలపు మంచు రాలుతున్న వేళ
మహా శకుంతం తన రెక్కల మీది నుంచి
సూర్యబింబ సుగంధాన్ని తుడిచేసుకుంటున్న వేళ
మిణుగురు పురుగుల కాంతిలో
ప్రతి పక్షీ గూడు చేరుకున్నది
నదులన్నీ సాగరానికి చేరుకున్నవి
చీకటి చిక్కబడింది...''
దూరంగా రెల్లుగడ్డి అంచుల మీద ఓ చిన్నపిట్ట ఉయ్యాల ఊగడం...! అలా చూస్తూ ఉంటే మనసుకు ఎంత హాయిగా ఉన్నదో...! ఎంత ఆనందాన్ని నింపిందో.. ఆ బుజ్జి పిట్టకు ఎవరు నేర్పారో కదా...! ఆ పిట్ట రెల్లుగడ్డి చివర్న కూచుంటుంది. ఆ చిన్ని పక్షి బరువుకి పాపం ఆ గడ్డిపరక కిందిదాకా వంగి పోతుంది. ఇక ఆ పచ్చని పరక నేలను తాకుతుందనగా ఆ బుల్లిపిట్ట తుర్రుమని ఎగిరిపోతుంది. మళ్లీ ఎంచక్కా ఆ రెల్లుగడ్డి నిటారైపోయి...ఆ పిట్ట ఎగిరిపోయిన దిక్కే చూసి...హుష్‌...! నా తల్లి ఒడి నుంచి నన్నే గుంజుతావా..? బుద్ధి వున్నదా నీకు.. మరీ బండబారెనా నీ హృదయం...? నీ ఉయ్యాల జంపాలకు ఇంతటి నాజూకైన నా నడుమే దొరికినదా...!? చిరుకోపంతో ఆ సన్నని రెల్లుగడ్డి స్పందిస్తుంది...!
ప్రకృతికీ మానవ హృదయానికీ ఉన్న సంబంధం అటువంటిది. అది నిర్వచనాలకు అందనిది. ప్రకృతి ఉన్నంత పరిధిలో మానవ హృదయం పరుచుకుని ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతి చెవిలో మానవ హృదయం గుసగుసలు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో అది రుసరుసలూ పోతుంది. ఈ చేష్టలకు ప్రకృతి తనలో తానే నవ్వుకుంటుంది. అది గమనించిన హృదయం తన ముఖం ముడుచుకుంటుంది. తనకేమో అవుతోందని తలపోస్తూ... తనను ఓదార్చే వారి కోసం తపిస్తూ ఉంటుంది. కానీ, ప్రకృతి మాత్రం హృదయాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలా.. అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా బుజ్జగించి తన దారికి తెచ్చుకోవాలా..అని తన మనసును మదిస్తుంది. వెదురుకర్రను చిలికి వెన్నవంటి వేణుగానం వినిపిస్తుంది. నెమలి అడుగుల్లో చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. పరిణామం..? హృదయం వెన్నలా కరిగిపోతుంది. తన కళ్లు తెరిచి, సరోజంలా విప్పారి వికసిస్తుంది. అదిగో ప్రకృతికీ మానవ హృదయానికీ ఉన్న అనుబంధం అంతటి రమణీయం. నిర్వచనానికి అతీతం.
నిర్మలంగా ఉండే వినీలాకాశం ఎప్పుడూ అలాగే ఉంటుందా...? ఊహూ..ఉండదు. ఎందుకనీ..? ఆకాశం మీద మబ్బుతునకలు చిన్న చిన్న మడతలుగా పేరుకుంటాయి. మరికొద్దిసేపట్లోనే ఆ మడతలు విస్తరిస్తాయి. సువిశాల వెండిమబ్బులుగా మారిపోతాయి. క్రమక్రమంగా అవి ఆకాశాన్నే ఆక్రమిస్తాయి. మధ్య మధ్య తళుక్కున మెరుపులు.. ఆ మెరుపులతో ఆకాశమంతా తెల తెల్లని వెలుగులు.. అంతటితో ఆ మేఘాలు ఆగిపోవు. అవి చిటపట చినుకులై.. వర్షధారలుగా మారిపోయి పుడమి నిండుగా కురుస్తాయి. అప్పుడు చెట్లు పులకరించి మనోవికాసాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మబ్బులు మబ్బులుగా వుండవు. జలరూపంలోకి మారిపోయి.. భూమిలో ఇంకిపోయి..చెరువులన్నీ పుష్కలంగా నిండిపోయే... జలపుష్పాలెన్నో వికసించే..
అందుకని సువిశాల ప్రపంచంలో నడిచేది కేవలం మనిషే కాదు సుమీ..ఏరు నడుస్తుంది అలల అడుగులలో.. ఆ అలల మీద నురగలు నడుస్తాయి. ఆ అలలపైనే చేపలు ఎగిరి గంతులేస్తాయి. ఆ తెల్లని నురగలమీద సరాగాలు ఆడాలని బుల్లిబుల్లి నీలిరంగు పక్షుల చిన్ని చిన్ని ఆశ.. చింతలే లేక చిందులేయాలీ..అని ఆశ.. హృదయం మౌనంగా ఉన్నా, తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. 'హృదయమెక్కడున్నదీ... హృదయమెక్కడున్నదీ...నీ చుట్టూనే తిరుగుతున్నదీ...! అందమైన అబద్ధం ఆడుతున్న మనసే..' అని పాడుకుంటూ ఉంటుంది. చల్లగ వీచే గాలితో చుట్టుపట్టి తిరిగి మెల్ల మెల్లగా ఆ తెమ్మెరలతో నిశ్శబ్దంగా మాటలాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తగవులాడుతూ ఉంటుంది. అదే ఓ చల్లని సాయంత్రం అనుకోండీ..ఆహా..! ఎంతహాయి..! ఈ సాయంత్రం కానీ, ఎటు వెళ్లిందో యిన్నినాళ్లూ..!!
ఈ నీలిమేఘమాలలూ
గులాబీల గుసగుసలూ
లేలేత చివుళ్ల ముసిముసి నవ్వులూ
పచ్చని ఆకుల కూనిరాగాలూ
నన్నాదరించే ఈ చల్లని వేళ..!
అరెరే...! తోటలోకొచ్చావా...
సీతాకోక చిలుకా...!
మకరందమా...!
మందారమా...!
మలయ మారుతమా...!
హృదయరాగమా...!!
ఏమి కావాలో చెబుదూ...!
తెల తెల్లని మల్లెలమ్మలకు
ఎందుకో అలుక
చెంతకు పోనందుకు కినుకా...
పిల్లతెమ్మెరతో పోయొచ్చానే అందాకా...
ఏమో మరి...?!
ఈ ఆకుల సవ్వడీ...
ఈ విరుల సందడీ...
తెస్తూ తెస్తూ చుట్టేస్తోందీ చిరుగాలీ
ఇంతకు మించి ఇంకేమి కావాలీ..?
ఈ చల్లని సాయంత్రం..!!
ఇలా ప్రతి సాయంత్రం ఎంతో సంతోషం. ప్రతి సూర్యోదయం ఎంతో ఉత్తేజం.. మరెంతో ఉల్లాసం.. ప్రతి హృదయం ఒక కొత్త ప్రభాతంలా వికసిస్తుంది. ప్రకృతి పరిభ్రమిస్తూ ఉంటుంది. బంగరు రంగుల చిలకలా మనకు చేరువలోనే ఉంటుంది. కొమ్మల మీదికి ఒంగి ఆకుల్ని నిమురుతుంది ఆకాశం. భూమిని అంటిపెట్టుకుని ఉన్నానన్న మెచ్చుకోలు దాని స్పర్శలో.. నిండైన చందమామ..మెరిసే నక్షత్రాలు..!! ''ప్రతి మనసుకు స్పందన ఉంది. అనుభూతులు గుణిస్తే మమత విలువ తెలిసింది

Monday, August 20, 2018

చిత్రకవితా ప్రపంచం: సరిగమల - పద్యం

చిత్రకవితా ప్రపంచం: సరిగమల - పద్యం: సరిగమల - పద్యం సాహితీమిత్రులారా! ఒకమారు పీఠాపురం రాజావారి దివాణంలో ప్రభు సమక్షంలో తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారి వీణకచ్చేరి జరిగింది....

Sunday, August 19, 2018

మంకెన పుష్పం: జంధ్యాల పూర్ణిమ/శ్రావణ పౌర్ణమి

మంకెన పుష్పం: జంధ్యాల పూర్ణిమ/శ్రావణ పౌర్ణమి: SRAVANA POORNIMA   శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రా...

Saturday, August 18, 2018

Gayatri Seva Samithi: నిత్య త్రికాల సంధ్యా వందనము

Gayatri Seva Samithi: నిత్య త్రికాల సంధ్యా వందనము: నిత్య త్రికాల సంధ్యా వందనము శరీర శుద్ధి:   అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః...

Total Pageviews