Tuesday, August 21, 2018

హృదయం ''సాయంకాలపు మంచు రాలుతున్న వేళ

హృదయం
''సాయంకాలపు మంచు రాలుతున్న వేళ
మహా శకుంతం తన రెక్కల మీది నుంచి
సూర్యబింబ సుగంధాన్ని తుడిచేసుకుంటున్న వేళ
మిణుగురు పురుగుల కాంతిలో
ప్రతి పక్షీ గూడు చేరుకున్నది
నదులన్నీ సాగరానికి చేరుకున్నవి
చీకటి చిక్కబడింది...''
దూరంగా రెల్లుగడ్డి అంచుల మీద ఓ చిన్నపిట్ట ఉయ్యాల ఊగడం...! అలా చూస్తూ ఉంటే మనసుకు ఎంత హాయిగా ఉన్నదో...! ఎంత ఆనందాన్ని నింపిందో.. ఆ బుజ్జి పిట్టకు ఎవరు నేర్పారో కదా...! ఆ పిట్ట రెల్లుగడ్డి చివర్న కూచుంటుంది. ఆ చిన్ని పక్షి బరువుకి పాపం ఆ గడ్డిపరక కిందిదాకా వంగి పోతుంది. ఇక ఆ పచ్చని పరక నేలను తాకుతుందనగా ఆ బుల్లిపిట్ట తుర్రుమని ఎగిరిపోతుంది. మళ్లీ ఎంచక్కా ఆ రెల్లుగడ్డి నిటారైపోయి...ఆ పిట్ట ఎగిరిపోయిన దిక్కే చూసి...హుష్‌...! నా తల్లి ఒడి నుంచి నన్నే గుంజుతావా..? బుద్ధి వున్నదా నీకు.. మరీ బండబారెనా నీ హృదయం...? నీ ఉయ్యాల జంపాలకు ఇంతటి నాజూకైన నా నడుమే దొరికినదా...!? చిరుకోపంతో ఆ సన్నని రెల్లుగడ్డి స్పందిస్తుంది...!
ప్రకృతికీ మానవ హృదయానికీ ఉన్న సంబంధం అటువంటిది. అది నిర్వచనాలకు అందనిది. ప్రకృతి ఉన్నంత పరిధిలో మానవ హృదయం పరుచుకుని ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతి చెవిలో మానవ హృదయం గుసగుసలు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో అది రుసరుసలూ పోతుంది. ఈ చేష్టలకు ప్రకృతి తనలో తానే నవ్వుకుంటుంది. అది గమనించిన హృదయం తన ముఖం ముడుచుకుంటుంది. తనకేమో అవుతోందని తలపోస్తూ... తనను ఓదార్చే వారి కోసం తపిస్తూ ఉంటుంది. కానీ, ప్రకృతి మాత్రం హృదయాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలా.. అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా బుజ్జగించి తన దారికి తెచ్చుకోవాలా..అని తన మనసును మదిస్తుంది. వెదురుకర్రను చిలికి వెన్నవంటి వేణుగానం వినిపిస్తుంది. నెమలి అడుగుల్లో చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. పరిణామం..? హృదయం వెన్నలా కరిగిపోతుంది. తన కళ్లు తెరిచి, సరోజంలా విప్పారి వికసిస్తుంది. అదిగో ప్రకృతికీ మానవ హృదయానికీ ఉన్న అనుబంధం అంతటి రమణీయం. నిర్వచనానికి అతీతం.
నిర్మలంగా ఉండే వినీలాకాశం ఎప్పుడూ అలాగే ఉంటుందా...? ఊహూ..ఉండదు. ఎందుకనీ..? ఆకాశం మీద మబ్బుతునకలు చిన్న చిన్న మడతలుగా పేరుకుంటాయి. మరికొద్దిసేపట్లోనే ఆ మడతలు విస్తరిస్తాయి. సువిశాల వెండిమబ్బులుగా మారిపోతాయి. క్రమక్రమంగా అవి ఆకాశాన్నే ఆక్రమిస్తాయి. మధ్య మధ్య తళుక్కున మెరుపులు.. ఆ మెరుపులతో ఆకాశమంతా తెల తెల్లని వెలుగులు.. అంతటితో ఆ మేఘాలు ఆగిపోవు. అవి చిటపట చినుకులై.. వర్షధారలుగా మారిపోయి పుడమి నిండుగా కురుస్తాయి. అప్పుడు చెట్లు పులకరించి మనోవికాసాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మబ్బులు మబ్బులుగా వుండవు. జలరూపంలోకి మారిపోయి.. భూమిలో ఇంకిపోయి..చెరువులన్నీ పుష్కలంగా నిండిపోయే... జలపుష్పాలెన్నో వికసించే..
అందుకని సువిశాల ప్రపంచంలో నడిచేది కేవలం మనిషే కాదు సుమీ..ఏరు నడుస్తుంది అలల అడుగులలో.. ఆ అలల మీద నురగలు నడుస్తాయి. ఆ అలలపైనే చేపలు ఎగిరి గంతులేస్తాయి. ఆ తెల్లని నురగలమీద సరాగాలు ఆడాలని బుల్లిబుల్లి నీలిరంగు పక్షుల చిన్ని చిన్ని ఆశ.. చింతలే లేక చిందులేయాలీ..అని ఆశ.. హృదయం మౌనంగా ఉన్నా, తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. 'హృదయమెక్కడున్నదీ... హృదయమెక్కడున్నదీ...నీ చుట్టూనే తిరుగుతున్నదీ...! అందమైన అబద్ధం ఆడుతున్న మనసే..' అని పాడుకుంటూ ఉంటుంది. చల్లగ వీచే గాలితో చుట్టుపట్టి తిరిగి మెల్ల మెల్లగా ఆ తెమ్మెరలతో నిశ్శబ్దంగా మాటలాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తగవులాడుతూ ఉంటుంది. అదే ఓ చల్లని సాయంత్రం అనుకోండీ..ఆహా..! ఎంతహాయి..! ఈ సాయంత్రం కానీ, ఎటు వెళ్లిందో యిన్నినాళ్లూ..!!
ఈ నీలిమేఘమాలలూ
గులాబీల గుసగుసలూ
లేలేత చివుళ్ల ముసిముసి నవ్వులూ
పచ్చని ఆకుల కూనిరాగాలూ
నన్నాదరించే ఈ చల్లని వేళ..!
అరెరే...! తోటలోకొచ్చావా...
సీతాకోక చిలుకా...!
మకరందమా...!
మందారమా...!
మలయ మారుతమా...!
హృదయరాగమా...!!
ఏమి కావాలో చెబుదూ...!
తెల తెల్లని మల్లెలమ్మలకు
ఎందుకో అలుక
చెంతకు పోనందుకు కినుకా...
పిల్లతెమ్మెరతో పోయొచ్చానే అందాకా...
ఏమో మరి...?!
ఈ ఆకుల సవ్వడీ...
ఈ విరుల సందడీ...
తెస్తూ తెస్తూ చుట్టేస్తోందీ చిరుగాలీ
ఇంతకు మించి ఇంకేమి కావాలీ..?
ఈ చల్లని సాయంత్రం..!!
ఇలా ప్రతి సాయంత్రం ఎంతో సంతోషం. ప్రతి సూర్యోదయం ఎంతో ఉత్తేజం.. మరెంతో ఉల్లాసం.. ప్రతి హృదయం ఒక కొత్త ప్రభాతంలా వికసిస్తుంది. ప్రకృతి పరిభ్రమిస్తూ ఉంటుంది. బంగరు రంగుల చిలకలా మనకు చేరువలోనే ఉంటుంది. కొమ్మల మీదికి ఒంగి ఆకుల్ని నిమురుతుంది ఆకాశం. భూమిని అంటిపెట్టుకుని ఉన్నానన్న మెచ్చుకోలు దాని స్పర్శలో.. నిండైన చందమామ..మెరిసే నక్షత్రాలు..!! ''ప్రతి మనసుకు స్పందన ఉంది. అనుభూతులు గుణిస్తే మమత విలువ తెలిసింది

No comments:

Post a Comment

Total Pageviews