మారిషస్‌లో తెలుగు తేజం/తృతీయ ప్రపంచ తెలుగు మహాసభలు
మారిషస్‌లో తృతీయ ప్రపంచ తెలుగుమహాసభలు-పూర్వరంగం
మలేషియాలో ద్వితీయ ప్రపంచ మహాసభలలో పాల్గొన్న మారిషస్ ప్రతినిధులు తృతీయ తెలుగు మహాసభలు తమ దేశంలో జరుపుతామని ముందుకు వచ్చారు.
ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకైన పాత్ర నిర్వహించిన డాక్టర్ బి.కృష్ణంరాజు 1989 లో మారిషస్ లో జరిగిన విశ్వహిందూ సమ్మేళనంలో పాల్గొనటానికి వెళ్ళారు.
డాక్టర్ కృష్ణం రాజు తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ గురించి మారిషస్ ఆంధ్రులతోనూ, ప్రభుత్వ నేతలలోనూ చర్చలు జరిపారు. వారిలో ఉత్సాహాన్ని రేపి మహాసభల నిర్వహణకు పురికొల్పారు.
డా॥ కృష్ణం రాజు రేకెత్తించిన ఉత్సాహంతో మారిషస్ ఆంధ్ర మహాసభవారు ఒక చిన్న కమిటీని ఏర్పర్చుకుని కార్యనిర్వహణకు ఉపక్రమించారు.
మారిషస్ నుంచి తిరిగి వచ్చిన డా॥ కృష్ణం రాజుగారు హైద్రాబాద్‌లో ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ తరువాత మారిషస్ మంత్రి శ్రీ పరశురామ్ వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావుగారితో చర్చించడం, మహాసభలనిర్వహణకు కావలసిన సహాయం ఆంధ్ర ప్రభుత్వ పక్షాన అందిస్తామని శ్రీ రామారావు హామీ ఇవ్వడం జరిగింది.
ఇది జరిగిన కొద్ది దినాలకే డా॥ కృష్ణంరాజు స్వర్గస్థులు కావటంతో సమన్వయ లోపం ఏర్పడింది. 1990 లో మారిషస్‌లో మహాసభల నిర్వహణకు నేషనల్ ఆర్గనైజేషన్ కమిటీ, మారిషస్ విద్యా కళా సాంస్కృతిక శాఖామంత్రి గౌ॥ శ్రీ ఆర్ముగం పరశురామన్ అధ్యక్షులుగా, మారిషస్ ప్రధానమంత్రి గౌ॥ సర్ అనిరుద్ జగన్నాద్ గౌరవాధ్యక్షులుగా, గవర్నర్ జనరల్ గౌ॥ సర్ వీరాస్వామి రింగడు పోషకులుగా, మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్తులు శ్రీ పూసరాజ్ సూరయ్య ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటైంది.
దీంతో మారిషస్ ప్రభుత్వం పూర్తిగా తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ముందుకు వచ్చినట్లయింది.
1990 డిసెంబరు 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు మారిషస్‌లోని మోకానగరంలోని మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌లో మహాసభలు జరుపుటకు నిర్ణయించారు.
- చరిత్ర పునరావృతం
ఆంధ్రప్రదేశ్‌లో డా॥ మర్రి చెన్నారెడ్డిగారినాయకత్వాన నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ పూసరాజ్ సూరయ్య, శ్రీ ఎన్. రమణ, శ్రీమతి గీతాంజలి హైదరాబాద్ వచ్చి చెన్నారెడ్డిగారిని కలిశారు.
మారిషస్‌లో తెలుగు మహాసభల ఏర్పాటు గురించి వివరించి, మారిషస్ ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాద్ ముఖ్యమంత్రి డా. చెన్నారెడ్డిని మహాసభలకు ఆహ్వానిస్తూ పంపిన సందేశాన్ని అందించారు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ముచ్చటించుకోవలసిన అవసరం వుంది. 1975లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మాన ఫలితంగా ఏర్పాటైన అంతర్జాతీయ తెలుగు సంస్థను 1983లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు తాను కొత్తగా ఏర్పరిచిన తెలుగు విశ్వ విద్యాలయంలో విలీనం చేశారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరిట అది తెలుగు విశ్వ విద్యాలయంలో ఒక ఉపాంగమైంది. అదృష్టవశాత్తు డా॥ సి. నారాయణరెడ్డిగారు తెలుగు విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులైనారు. ఆయన జగత్ర్పసిద్ధ తెలుగు కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన ప్రముఖ పాత్రధారి. అంతేకాకుండా అనేక పర్యాయాలు విదేశీ పర్యటనలు విస్తృతంగా చేసిన వారగుట వలన విదేశాంధ్రుల సమస్యలు తెలిసిన వారగుటచే సహజసిద్ధంగా మారిషస్‌లో తెలుగు మహాసభల నిర్వహణకు తెలుగు విశ్వవిద్యాలయ పక్షాన సానుకూలత చూపి అండగా నిలిచారు.
తెలుగు మహాసభల పట్ల మక్కువలేని ముఖ్యమంత్రి డా॥ చెన్నారెడ్డిని మొత్తానికి ఒప్పించి రంగంలోకి దింపి మారిషస్ మహాసభలకు వెళ్తున్నానని ప్రకటింపజేయడంలో డా॥ సి. నారాయణరెడ్డి కృతకృత్యులైనారు.
అంతేకాకుండా మహాసభల ఏర్పాటు నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పరిచింది. దీనికి అధ్యక్షులు ముఖ్యమంత్రి డా॥ మర్రి చెన్నారెడ్డి, ఆర్ధిక మంత్రి శ్రీ కె. రోశయ్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి గీతారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.పి. రామారావు సభ్యులు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ సి.వి. నరసింహారెడ్డి సమన్వయాధికారి.
స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలోని కొంతమంది తెలుగు ప్రముఖులను, పరిశోధకులను, కవులను, కళాకారులను మారిషస్ పంపేటందుకు నిర్ణయించింది. అలా పంపబడేటందుకు నిర్ణయించిన ప్రముఖులలో ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్, సాహితీవేత్త డా॥ బెజవాడ గోపాలరెడ్డి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సేవా నిరతులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు ప్రభృతులు వున్నారు.
వారితోపాటు ఆరుద్ర వంటి పరిశోధకులు, వివిధ విశ్వ విద్యాలయాల ఆచార్యులు, కవులు సదస్సులో పాల్గొనటానికి ఆహ్వానింపబడ్డారు. ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి వారు మారిషస్‌లో తాము సమర్పించవలసిన ప్రసంగ వ్యాసాలను సిద్ధపరచుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు వారికి కావాల్సిన పాస్‌పోర్టులు, విమాన టిక్కెట్టు సిద్దం చేసే పనిలో నిమగ్నమై వున్నారు.
ఇంతలో హఠాత్తుగా ముఖ్యమంత్రి డా॥ చెన్నారెడ్డి తాము మారిషస్‌కి వెళ్ళటం లేదని, మంత్రులుగాని, ఇతరులుగాని వెళ్ళనక్కరలేదని నిర్ణయం తీసుకున్నారు. దానితో తొలుత ఆహ్వానించిన పెద్దలకు, పండితులకు రానక్కర్లేదని ప్రభుత్వ నిర్ణయాన్ని టెలిగ్రాముల ద్వారా తెలిపారు. డా॥ చెన్నారెడ్డిగారి ఆకాల ఆగ్రహానికి ఒక కారణముందని అంటూరు. శ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డిగారు ఉన్నత విద్యాశాఖామంత్రి (శాసనసభా నాయకత్వానికి డా. చెన్నారెడ్డితో శ్రీ జనార్దనరెడ్డి పోటీపడ్డారు) ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో సమభాగం వహించే తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ జనార్దనరెడ్డిగారి ఆధీనంలో ఉన్నత విద్యాశాఖ క్రింద వుంది. అయితే స్టీరింగ్ కమిటీలో శ్రీ జనార్దనరెడ్డిగారికి స్థానం లబించలేదు. దానిపై శ్రీ జనార్దనరెడ్డి ముఖ్యమంత్రికి నిరసన తెలపటంతో ఆ కోపం మహాసభలపై చెన్నారెడ్డి చూపారని ఒక కథనం. పెద్దఎత్తున ఏర్పాట్లలో వున్న మారిషస్ ఆంధ్రులకు ఈ వార్త అశనిపాతం అయ్యింది. వారు మ్రాన్పడిపోయారు. అంతులేని నిరుత్సాహానికి గురయ్యారు.
"మొగుడు కొట్టినందుకు కాదు కాని తోటికోడలు దెప్పినందుకు" అన్న చందాన పరభాషల వారి ముందు అవమానభారంతో తలవంచుకోవలసిన పరిస్థితి దాపురించిందని బాధపడ్డారు వారు. -
అయితే పట్టువదలనివిక్రమార్కుడిలా డా॥ సి. నారాయణరెడ్డిగారు ప్రయత్నించి సాంస్కృతిక బృందాలను మాత్రం తీసుకుని వెళ్ళటానికి మాత్రం ప్రభుత్వ అంగీకారం సాధించగలిగారు.
ప్రతినిధి బృందానికి డా॥ నారాయణరెడ్డిగారినే నాయకత్వం వహించమని ప్రభుత్వం కోరింది.
ఇది యిలా వుండగా శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారిని మారిషస్ మహాసభలలో పాల్గొనమని ప్రభుత్వం ఆహ్వానం పంపినప్పడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన తొలుత ఉత్సాహం చూపించలేదు.
ఎప్పడైతే ప్రభుత్వ నిర్ణయం మారిందో పిలిచి అవమానించినట్లయింది. ఈ వార్త విన్న శ్రీ మండలి మిత్రులు ఎలాగైనా మీరు వెళ్ళి తీరాలని పట్టుబట్టారు. మారిషస్ నుంచి ఆంద్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ సూరయ్య మీరైనా రాకపోతే ఎట్లాఅని ఫోన్ చేశారు. మీరు లేకుండా తెలుగు మహాసభలేమిటని ప్రోత్సహించిన మాజీ మంత్రి డా॥ సిహెచ్ దేవానందరావుగారు, మరికొందరు మిత్రులు టిక్కెట్టు తెచ్చి మీరు వెళ్ళి రావలసిందేనని పట్టుబట్టారు.
అవనిగడ్డలో వున్న నాకు పరిస్థితి ఫోన్ ద్వారా వివరించారు. మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విదేశాలకు ప్రయాణం చేయడం మా కుటుంబ సభ్యులకు సుతారమూ ఇష్టం లేదు. నాన్నగారు 1983లో ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్న ఫలితంగా రెండుసార్లు చేతికి, ఒకసారి మెదడుకు శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది.
ఆ శస్త్రచికిత్స వలన ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ, శారీరకంగా బాగా నీరసపడిపోయారు. ప్రయాణంలో ఆయన వెంట తోడు ఎవరో ఒకరు వుండవలసిందే. ఈ పరిస్థితిలో నాన్నగారికి తోడుగా నేను కూడా మారిషస్ ప్రయాణం కావల్సి వచ్చింది.
ఆ స్వల్ప వ్యవధిలోనే మాకు పాస్‌పోర్టులూ, టిక్కెట్టు సాధించిపెట్టగలిగారు తెలుగు విశ్వ విద్యాలయం వారు. ఈ సందర్భంగా మాకు తోడ్పడిన డా॥ ఎన్. శివరామమూర్తి, డా॥ గౌరీ శంకర్, థామస్ కుక్ కంపెనీకి చెందిన శ్రీమతి గౌరి, శ్రీ చంద్రశేఖర్‌గార్ల సహాయం మర్చిపోలేనిది.
1990 డిసెంబర్ 6వ తేదీన ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుండి బొంబాయికి విమానంలో బయలుదేరాం. మా కుటుంబ సభ్యులు, అనేకమంది బంధుమిత్రులూ విమానాశ్రయానికి వచ్చి సాదరంగా వీడ్కోలు చెప్పారు. బొంబాయిలోని మా మిత్రులు శ్రీ సుంకర అంజయ్యనాయుడు విమానాశ్రయానికి కారు పంపారు. ఆ రోజు వారింట బసచేశాం. తెల్లవారుఝామున మారిషస్‌కు మా ప్రయాణం. రాత్రి 11 గంటలకే విమానాశ్రయానికి చేరాం. పాస్‌పోర్టుల తనిఖీ, ఇతర నియమ నిబంధనలను పూర్తిచేశాం.
- బొంబాయి విమానాశ్రయంలో తెలుగు వెలుగులు
తెలుగు దిగ్గజాలతో బొంబాయి సహారా అంతర్జాతీయ విమానాశ్రయం కళకళలాడిపోతోంది.
తెలుగు వెలుగుల అపూర్వ సంగమం అద్బుతదృశ్యంగా మనసుని రంజింపచేస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం నాయకులు డా॥ సి. నారాయణరెడ్డిగారు ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తెలుగు విశ్వవిద్యాలయం అధికారులకు సూచనలు యిస్తున్నారు.
మారిషస్‌లో తెలుగు చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించడానికి నటసామ్రాట్ డా॥ అక్కినేని నాగేశ్వరరావుగారు మారిషస్‌కు ఆహ్వానించబడ్డారు. ఆరు పదులు దాటినా, నవయువకుడ్ని తలపింపచేస్తూ టక్ చేసుకుని, మెడ చుట్టూ శాలువా లాంటి ఉత్తరీయంతో నటసామ్రాట్ విమానాశ్రయంలో హుషారుగా కలయ తిరుగుతూ అందర్నీ పలకరిస్తూ, ఛలోక్తులతో ప్రతివారిని ఆకర్షించసాగారు. అదే సమయంలో విమానాశ్రయంలో మరో మెరుపు మెరిసింది. ఆ మెరుపు తాలుకు వెలుగు ప్రసిద్ద సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి జమునా రమణారావు, భారత ప్రభుత్వం తరపున ఏకైక ప్రతినిధిగా ఆమె మారిషస్ తెలుగు మహాసభలకు వస్తున్నారు. ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల విజయానికి కృషి చేసిన వారిలో శ్రీమతి జమునా రమణారావుగారు ముఖ్యమైన వ్యక్తి ఆత్మీయురాలైన ఆమె రాక మాకెంతో" ఆనందాన్ని కలుగజేసింది.
తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డా॥ ఎన్.శివరామమూర్తిగారు మాకెంతో ఆప్తులు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త అయిన డా॥ శివరామమూర్తిగారు మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించిన సమయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా వుండేవారు. అప్పటినుంచి ఆయన మాకు సన్నిహితుడు. సౌమ్యుడు, స్నేహశీలి అయిన శివరామమూర్తిగారు కూడా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నాకు అత్యంత ఆప్తులైన మరో వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి శ్రీ గోవిందరాజు రామకృష్ణారావుగారు. వారి స్వగ్రామం అవనిగడ్డ కావటం వలన మా మైత్రి మరీ బలపడేందుకు కారణం అయ్యింది. చురుకైన వ్యక్తి మెత్తని మనిషి అయిన శ్రీ రామకృష్ణారావుగారు ఎవరి దగ్గర పనిచేసినా ఆర్భాటం లేకుండా కార్యదక్షత కనపరుస్తారు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక, అఖిల భారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాల ప్రత్యేక సంచిక ఆయన రూపకల్పన చేసినవే. బాల పిల్లల మాసపత్రిక సంపాదకమండలిలో మేమిద్దరం సభ్యులం. రచనా వ్యాసంగానికి నన్ను ఉత్సాహపరిచేవారు.
స్నేహశీలి, నిరాడంబరుడు, తాను చేపట్టిన ఏ పనినైనా చిత్తశుద్ధితో చేయగల సమర్ధుడైన అధికారి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ శ్రీ సి.వి. నరసింహారెడ్డిగారు మాకు చిరపరిచితులు, సన్నిహితులు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన ప్రముఖపాత్ర నిర్వహించారు. సమాచార పారసంబందాలలో నిష్ణాతులైన శ్రీ నరసింహారెడ్డి ప్రథమ ప్రపంచ సభలకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగటానికి కారకులయ్యారు.
ఇక సాంస్కృతిక బృందాలకు చెందిన ప్రతినిధులను గురించి ముచ్చటించవలిసి వస్తే, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మృదంగ విద్వాంసుడు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావుగారి గురించి సగర్వంగా చెప్పకోవచ్చు.
ముప్పై గంటలపాటు ఏకథాటిగా మృదంగాన్ని వాయించి వరల్డ్ రికార్డు స్థాపించి కళకు ఎల్లలు లేవని నిరూపించిన వ్యక్తి శ్రీ ఎల్లా.
శివతాండవం, నవమృదంగం ఆయన సృష్టించిన ప్రత్యేకమృదంగవివ్యాసాలు. అంతర్జాతీయ అవార్డులు, రాష్ట్రపతి స్వర్ణపతకాన్ని సాధించి ఉన్నత కళాపీఠాన్ని అధిరోహించిన కళాకారుడాయన. దేశ విదేశాల్లో అయిదువందలకు పైగా శిష్యులకు గురుకుల పద్దతిలో ఉచితంగా మృదంగ విద్య నేర్పిన కళాతపస్వి శ్రీ ఎల్లా.
ఎక్కడ హాస్యపు జల్లులు చిందుతూ నవ్వులు విరుస్తుంటాయో అక్కడ ధ్వన్యనుకరణ సమ్రాట్ శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ వున్నట్లే. ధ్వన్యనుకరణకు ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్టస్థానం సంపాదించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునకాని, సాంస్కృతిక సంస్థల తరపున కాని ఆయన అంతులేని ప్రదర్శనలు ఇచ్చారు.
మా నాన్నగారు మంత్రిగా వున్నప్పడు శ్రీ వేణుమాధవ్ శాసనమండలి సభ్యులుగా వున్నారు.
"అన్యుల మనము తానొప్పింపక.. తానొవ్వక" అనే మాటలకు ఆక్షరాల శ్రీ వేణుమాధవ్ ఒక ఉదాహరణ.
ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆర్ధిక సహాయంకై తెలుగు సినీ కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన సందర్భంలో నాన్నగారితో ఆయనకలసి సంచరించారు. ఆ తర్వాత శ్రీ వేణుమాధవ్ నాన్నగారితో మలేషియాలో విస్తృతంగా పర్యటించి ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు అక్కడ వారిని ఉత్తేజపరిచారు. 1977లో ఉప్పెన సందర్భంగా దివిసీమకు డా॥ నారాయణరెడ్డితో కలసి శ్రీ వేణుమాధవ్ వచ్చినప్పడు వారిని జీపులో తీసుకుని వెళ్ళి ఉప్పెనకు ఊడ్చుకుపోయిన గ్రామాల వెంట తిప్పాను. చింతకొల్లనే గ్రామం మేము చేరేసరికి యింకా అక్కడ చెట్టకు శవాలు వ్రేలాడుతూ కనిపించాయి. ఆ దృశ్యం చూడలేక కన్నీరు కార్చారు శ్రీ వేణుమాధవ్ ఆయన చాలా సున్నిత మనస్కులు.
నా ఆత్మబంధువు రంగస్థల మార్తాండుడు శ్రీ ఆచంట వెంకటరత్నం నాయ్డుసాంస్కృతిక బృందంతో మారిషస్‌కువస్తున్నందుకు నేనెంతో ఆనందించాను. "వొగిని కృష్ణ బొడ్డు జాతి మాది." నాటక రంగంలో రారాజుగా వెలుగుతున్నప్పటికీ అతి నిరాబడంబరంగా వుంటారు. ఆయన నడకలో రాజఠీవి, నటనలో భేషజం మౌలికించినా వ్యక్తిగా మాత్రం అందరికీ ప్రీతిపాత్రుడు. ఆయన స్నేహాన్ని డబ్బుతో ముడిపెట్టి చూడటం నా అనుభవంలో లేదు. ఎవరైనా స్నేహితులు నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి పారితోషికంగా ఎంతఇచ్చినా లెక్కపెట్టుకోకుండా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయే ఉన్నతమైన కళాకారుడు. వారితో దాదాపు రెండు దశాబ్దాల స్నేహపూర్వక అనుబంధం వుంది. తెలుగు నాటకరంగం గురించి సాధికారంగా మాట్లాడగల మంచి వక్త శ్రీ నాయ్డుగారు.
విజయనగరానికి చెందిన నృత్య కళాకారుడు శ్రీ సంపత్‌కుమార్, 'ఆంధ్ర జాలరి" నృత్యంతో ప్రపంచప్రసిద్ధిగాంచారు. ఆ అంశం ఆయనకు దేశ విదేశాలలో అనంతమైన కీర్తిని ఆర్జించిపెట్టింది. శ్రీ సంపత్ కుమార్‌తో నాకు 15 సంవత్సరాల పరిచయం వుంది. అన్నమాచార్యకీర్తనలతో అంతర్జాతీయ కీర్తిని ఆర్జించిన శ్రీమతి శోభారాజ్ అప్పడే మొదటిసారి కలవటం. రేడియో, టి.వీ.లద్వారానే అంతవరకూ ఆ కళాకారిణి నాకు తెలుసు. ఆమె భర్త శ్రీ డా.నందకుమార్ అందరిలో ఎంతో కలివిడిగా తిరుగుతూ ప్రయాణంలో మాకెంతో సహాయం అందించారు
ప్రముఖ జానపద నృత్య కళాకారుడు శ్రీ గోపాలరాజభట్ తన బృందాన్ని తీసుకుని మారిషస్ వస్తున్నారు. శ్రీ భట్ బృందం జానపద నృత్యాలు చూచి ఆనందపరవశులు అవ్వాలేకాని మాటలతో వారి నృత్య ప్రదర్శనను గురించి వర్ణించి చెప్పటం సాధ్యం కాదు. మన జానపద నృత్య సంపదను మారిషస్ వారికి చూప తలపెట్టడం చాలా ప్రశంసనీయం. 1977 లో దివిసీమ ఉప్పెనకు గురై ప్రజలు శోకతప్తులై ఉన్నప్పుడు శ్రీ భట్ తన బృందంలో తరలి వచ్చి ప్రదర్శనలిచ్చి ప్రజలకు ఊరట నివ్వటానికి ప్రయత్నించటం నాకు ఏనాటికీ మరుపురాదు.
తెలంగాణాలో ప్రాచుర్యం పొందిన జానపద కళారూపం "ఒగ్గు కధ" ను వినిపించటానికి మిద్దె రాములు, ఎ.అయిలయ్యల బృందం వస్తున్నది. అచ్చమైన జానపదులుగా. తెలంగాణా గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబాలుగా వారు విమానాశ్రయంలో దర్శనం ఇచ్చారు. పొట్టిగా, ఎర్రగా ఎఱ్ఱచీర కట్టుకుని నిలబడి ఉన్నదొకామె. ఆమెకు చేరువలో పొడుగుగా చామన ఛాయ మేనితో రాజస్తానీ అహుబూట్లు, గోధుమరంగు చుడీదార్ పైజమా, లాల్చీ ధరించి ఉన్నాడొకాయన. వారిని చూడగానే కళాకారులని ఎవరికైనా స్పురిస్తుంది. వారి ముఖాలు పరిచయం ఉన్నట్లుగా అనిపించినా అంతకు ముందు వారిని చూసినట్టు గుర్తు రావడం లేదు. వారెవరని ప్రక్కనున్న వారిని అడిగితే జగత్ర్పసిద్ధ కళాకారులు శ్రీమతి రాధారెడ్డి శ్రీ రాజారెడ్డి అని చెప్పారు. వారినిమా నాన్నగారు పరిచయం చేశారు నాన్నగారి పట్ల ఆ దంపతులు ఎంతో గౌరవం, ఆదరణ చూపించారు. మా దివిసీమలో సిద్ధేంద్ర యోగి సృష్టించిన కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక విశిష్టమైన కళగా ప్రాచుర్యం సంపాదించి జంట నగరాలలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడు ఉజ్వల శ్రీ మందడి కృష్ణారెడ్డి ప్రతినిధిగా మాతో మారిషస్‌కు బయలుదేరారు.
ఇంతలో నాన్నగారు విజయవాడ అశోకా బుక్‌సెంటర్ అధినేత శ్రీఅశోక్ కుమార్ ను నాకు పరిచయం చేశారు. వారి తల్లిగారు, మా నాన్నగారు కాలేజీలో క్లాస్ మేట్స్‌ట. శ్రీ అశోక్ కుమార్ తెలుగు మహాసభలలో పుస్తక, వస్తు ప్రదర్శన నిర్వహించటానికి మారిషస్ వస్తున్నారు. మా తనిఖీ కార్యక్రమం పూర్తవ్వగానే విమానాశ్రయం లాంజ్ లో ప్రవేశించాం. అక్కడ ఏంకొనాలన్నా డాలర్లనే వాడాలి. ఒక్కొక్క కాఫీకి డాలర్ చొప్పున చెల్లించి త్రాగాం.
- ఆకాశవీధిలో అందమైన అనుభూతి
ఎయిర్ మారిషస్ విమానంలోకి అడుగు పెడ్తుండగానే ఆ దేశాన్ని చేరుతున్న అనుభూతి హృదయాన్ని తాకింది. దాదాపు 250 మంది ప్రయాణించటానికి వీలున్న అత్యాధునిక విమానం అది. మా సీట్ల నెంబరు ప్రకారం కూర్చున్నాం.
ఆ విమానంలో మూడు తరగతులున్నాయి. శ్రీమతి జమున మొదటి తరగతి లోనూ, డాక్టర్ నారాయణరెడ్డి, అక్కినేని బిజినెస్ తరగతి లోనూ, మిగిలిన వాళ్ళం ఎకానమీ తరగతి లోనూ కూర్చున్నాం.
విమానంలో ముప్పై మంది తెలుగు ప్రతినిధులం మినహాయిస్తే మిగిలిన వారు విభిన్న సంస్కృతులకు, విభిన్న దేశాలకు చెందినవారు. ఎక్కువగా మారిషస్‌లో నివసిస్తున్న భారతీయ సంతతివారే. విమానంలో కూర్చోగానే సంగీతం విని ఆనందించటానికి "ఇయర్ ఫోన్స్" తెచ్చి ఎయిర్ హోస్టెస్ ఇచ్చింది. ఏడు ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్కో ఛానల్లో ఎవరి అభిరుచికి తగిన సంగీతం వారు వినవచ్చు. ఇంగ్లీషు సినిమాలు, న్యూస్ రీలు కూడా ప్రదర్శిస్తున్నారు. రాత్రి రెండు గంటలకు ఎయిర్ హోస్టెస్ మాకు భోజనం సర్వ్ చేశారు.
శాకాహార, మాంసాహారాలతో బాటు విమానంలో ప్రయాణీకులకు హాట్ డ్రింక్స్... కూల్‌డ్రింక్స్... జ్యూసెస్ సర్వ్ చేస్తారు. ఆకాశవీధిలో విమానంలో ఆ నిశిరాత్రి పయనిస్తూంటే వింత వింత అనుభూతికి మనసు లోనైంది.
భూమి నుంచి దాదాపు ముప్పైతొమ్మిదివేల మైళ్ళ ఎత్తున, గంటకు ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో విమానం మారిషస్ వైపు ఎగురుతోంది. బొంబాయి నుంచి మారిషస్ నాలుగువేల ఆరువందల తొంభైకిలోమీటర్ల దూరంలో ఉంది. విమానం మాల్దీవులు, నేషల్స్ మీదుగా ఎగురుతున్నప్పడు అవి అరుంధతీ నక్షత్రాల్లా మిణుకు మిణుకు మంటూ కనిపించాయి. మహాసాగర మధ్యంలో "ఇయర్ ఫోన్స్"లో సంగీతం వింటూ నిదురలోకి జారుకున్నాం. విమానంలో మొదలైన సందడికి మెలకువ వచ్చింది మాకు. ఒక్కొక్కరే టాయిలెట్‌కి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఎయిర్ హోస్టెస్లు ఉడుకులోన్ లో తడిపిన వేడి కాగితాలు ఇచ్చారు. వాటితో మొహం తుడుచుకుంటే ఎంతో హాయిగా అనిపించటమే కాకుండా బద్దకం వదిలి నూతనోత్సాహం కలిగింది.
విమానం కిటికీ లోంచి చూస్తోంటే పైన వినీలాకాశం - క్రింద మహాసాగరం తప్ప వేరే ఏం కనిపించలేదు. మేఘాలు మా విమానాన్ని త్రాకుతూ పరుగులు తీస్తున్నాయి. అరుణ కిరణాల మధ్య సూర్యోదయం ఒక అద్భుత దృశ్యంగా గోచరించింది.
- ఏ దేశమేగినా... ఎందుకాలిడినా
1990 డిశంబరు 7వ తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలు కావొస్తోంది. విమానం ప్లెజన్‌స్ లోని సర్ శివసాగర్ రామగులామ్ విమానాశ్రయంలో దిగుతున్నట్టు పైలెట్ ఎనౌన్స్ చేశారు. మారిషస్ చేరుతున్నప్పటికీ పరాయిగడ్డ మీద కాలుమోపు తున్నట్టు కాకుండా మన వాళ్ళ మధ్యకి వెడుతున్న అనుభూతికి హృదయం లోనయ్యింది. విమానం అద్దాల గుండా క్రిందకు చూస్తూంటే అది సముద్రం పైన దిగుతోందా అన్న భ్రమ కలిగింది. నిజానికి సముద్రతీరాన ఉన్న విమానాశ్రయంలో దిగుతోంది అది.
మనకు మహాత్మాగాంధీ జాతిపిత అయినట్టు మారిషస్ ప్రజలకు సర్ శివసాగర్ రామ్ గులామ్ జాతిపిత అందుకే విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. సర్ శివసాగర్ రామ్ గులామ్ బీహార్ ప్రాంతం నుండి మారిషంకు వలస వెళ్ళిన భోజపురి మాట్లాడే ఓ బీద కుటుంబంలో జన్మించాడు. ఇంగ్లాండులో చదివి డాక్టర్ అయినాడు.
1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి వెళ్ళిన మహాత్మాగాంధీని రామ్‌గులామ్ కలుసుకుని వలస దేశాల విమోచనోద్యమాన్ని గురించి చర్చించారు. ఆయనపై గాంధీ ప్రభావం మిక్కుటంగా వుంది. 1935లో ఇంగ్లాండు నుండి మారిషస్ చేరుకుని స్వాతంత్ర్య సముపార్జనకు నడుం కట్టారు. బానిసలుగానూ, కూలీలుగానూ ఫ్రెంచి వారి చేతుల్లోనూ, ఇంగ్లీషు వారి చేతుల్లోనూ నలిగి పోతున్న భారతీయులలో స్వతంత్రేచ్చ రగిలించారు.
1942లో భారతదేశంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో ప్రారంభం అయిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని రామ్ గులామ్ బహిరంగంగా సమర్ధించారు. 1948లో జరిగిన మారిషస్ పార్లమెంట్ ఎన్నికల్లో రామ్ గులామ్ నాయకత్వాన్న లేబర్ పార్టీ విజయం సాదించింది.
1967 ఆగష్టు 7వ తేదీన జరిగిన ప్రతిష్టాకరమైన ఎన్నికల్లో మారిషస్ ప్రజలు స్వాతంత్ర్య కాంక్షకు విజయం చేకూర్చారు. తత్ఫలితంగా 1968 మార్చి 12న మారిషస్ స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
సర్ శివ సాగర్ రామ్ గులామ్ స్వాతంత్ర మారిషస్‌కు తొలి ప్రథాని అయ్యారు. ఆ తరువాత గవర్నర్ జనరల్‌గా కూడా పనిచేసి స్వర్గస్థులైనారు.
1967 ఆగష్టు లో మారిషస్ లో జరిగిన విశ్వ హిందీ సమ్మేళనంలో మా నాన్నగారు భారతదేశ ప్రతినిధివర్గ సభ్యునిగా పాల్గొనటం జరిగింది. అప్పుడు సర్ శివసాగర్ రామ్ గులామ్ మారిషస్ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో వారిని కలిసే అవకాశం నాన్నగారికి దక్కింది. మహాత్మాగాంధీ సంస్థలో ఇతర భాషలతో పాటు తెలుగుకి కూడా అవకాశం కలిగించాలని నాన్నగారు చేసిన అభ్యర్ధనని వారు వెంటనే అంగీకరించారు.
- తెలుగుజాతికి మారిషస్ అపూర్వ స్వాగతం
మా విమానం రన్‌వే మీద పరుగులు తీసి విమానాశ్రయంలో ఆగింది. మారిషన్ భూభాగంపై కాలుమోపాము. మారిషస్ ఇంధనశాఖా మంత్రి శ్రీ మహేన్ ఉచ్చన్న, మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ పూసరాజ్ సూరయ్య పలువురు అధికార, అనధికార ప్రముఖులు మాకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాత్రికేయుడు శ్రీ గోవాడ సత్యారావు కూడా ఉన్నారు. శ్రీ సత్యారావు కొద్దిరోజులు ముందే మారిషస్ చేరుకుని తెలుగు మహాసభల ఏర్పాట్లను గురించి మన రాష్ట్రంలో పత్రికలకు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్నారు.
మేము చెకింగ్ పూర్తి చేసుకుని విమానాశ్రయం లాంజ్ లోనికి అడుగిడగానే ఒకే రకం చీరలు ధరించి మోమున చిరునవ్వులు చిందిస్తూ మారిషన్ లోని తెలుగు ఆడపడుచులు పుష్పగుచ్ఛాలు అందిస్తూహృదయపూర్వకమైన స్వాగతం పలికారు. మాకు స్వాగతం పలకటానికి వచ్చిన మారిషస్ మంత్రి శ్రీ మహేన్ ఉచ్చన్న తెలుగు వాడు కావటం మాకెంతో గర్వం అనిపించింది. ఆయన మారిషస్ ప్రభుత్వంలో ఇంధన జల వనరుల మరియు పోష్టల్ సర్వీసుల మంత్రిగా ఉన్నారు. మహాసభల స్టీరింగ్ కమిటీకి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. మారిషస్ ఆంధ్ర ప్రముఖుడు శ్రీ రమణగారి కారులో డా॥ సి.నారాయణరెడ్డి, నేను, మా నాన్నగారూ కలిసి హోటల్ కి బయలుదేరాం.
మారిషస్ దేశపు అందాలు తిలకిస్తూ- ముచ్చట్లు చెప్పుకుంటూ కారులో వెడుతున్నాం.
అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా మా నాన్నగారు మలేషియాలో ఆంధ్ర భాషా ప్రచారానికి ప్రముఖ కవులు డా॥ దాశరధి, డా॥ సి.నారాయణరెడ్డిగార్లను 1977 లో పంపించారు. -
అదే డా॥ నారాయణరెడ్డి గారి తొలి విదేశ పర్యటన. అది గుర్తు చేస్తూ. ఆ తర్వాత నేను చాలా దేశాలు ప్రపంచ వ్యాప్తంగా తిరిగాను కాని. మలేషియా పర్యటన కలిగించిన అనుభూతి, ఆనందం మరపురావంటూ చెప్పారు. "మలేషియా తిలకించితిని-మరీ మరీ పులకించితిని" ఆనాడు వారు వ్రాసిన కవిత నేను గుర్తుకు తెచ్చాను.
- హరిచాప శకలాలు - ఆనంద శిఖరాలు
ప్రపంచంలో అత్యంత సుందరమైన ద్వీపాలలో మారిషస్ ఒకటి అని ఎవరైనా అంగీకరించ వలసిందే. ఇంద్రధనస్సు రంగులలో రమణీయంగా కనిపించే ఆకాశం, ధవళ కాంతులతో పగడపు సైకత సముద్రతీరాలు, వాటి అంచుల్లో కొబ్బరిచెట్టు, సరుగుడు తోటలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. చూపరులకు కనువిందు చేస్తాయి.
ఇతర హిందూ మహాసముద్రపు దీవుల వలెనే మారిషస్ కూడా సముద్రంలో అగ్ని పర్వతాలు పేలడం వలన ఏర్పడింది. ఈ అగ్ని పర్వతాల శిలలు రెండు యుగాలకు చెందినవి. మొదటిది 130 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రాచీన లావాగానూ, రెండవది 22 మిలియన్ సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పడిన నవీన లావాగానూ చరిత్రకారుల భావన. ప్రాచీన లావాలు మారిషస్ దీవిలోని నిమ్నోన్నతమైన పర్వత పంక్తులను ఏర్పరిచినట్టు భావిస్తున్నారు. నవీన లావా మధ్య సమతల భూములను సృష్టించింది.
మెగ్నీషియమ్, ఇనుము పాళ్ళు అధికంగా ఉన్న మారిషస్ శిలలు మాగ్నా నుంచి ఉద్భవించాయని చెబుతారు. అందువలన కపిల వర్ణంలో ఎండిన ద్రాక్షలవలె వంకరటింకర ఆకృతిలో పెద్ద పెద్ద బండలు ద్వీప మంతటా కనిపిస్తాయి.
మారిషస్‌లోని పర్వతాల పేర్లు కూడా సమ్మోహన కరంగా ఉంటాయి. శిఖరాగ్ర ఆకృతుల ననుసరించి వాటికి పేర్లు పెట్టారు. రిక్డా (బొటనవ్రేలు) ఒక శిఖరం పేరు. థమ్స్అప్ చిహ్నంలా ఉండటం చేత ఆ పేరు పొందింది. మరో శిఖరం తలక్రిందులుగా పెట్టిన ఆవు పొదుగు ఆకృతిలో ఉన్నందు వలన "మౌంట్‌ట్రా ట్స్ మామెల్స్" అనే పేరు వచ్చింది
మారిషస్ పర్వత శిఖరాలు ఉన్నతమైనవి కాకపోయినా, శిఖరాలు ఒకే ఒక రోజులోనే అధిరోహించ గలిగినా మారిషస్ ప్రజలకు ఆ శిఖరాలు స్పూర్తి ప్రదాతలుగా నిలిచాయి.
పిటాన్ డిలా పిఫైటా రివిరినోయర్ (2,711 అడుగులు) పిటెడ్ బోట్ (2,699 అడుగులు) లిపాస్ (2,661 అడుగులు) ఇవీ మారిషస్ లోని ఉన్నత శిఖరాలు.
- పగడాలదీవి
మారిషస్ మన దేశానికి నైరుతి దిశగా దాదాపు మూడువేల మైళ్ళ అవతల హిందూ మహా సముద్రంలో ఉన్న అందమైన దీవి. 720 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపాన్ని 16వ శతాబ్దంలో పోర్చుగీసువారు మొదటిసారిగా ఈ ద్వీపాన్ని తమ ఆవాసంగా చేసుకున్నారు.
1721 లో ఫ్రెంచివారి ఆక్రమణలో 90 ఏళ్ళ పాటు "ఫ్రెంచిదీవి"(విల్ దే ప్రాంస్) గా ప్రసిద్ధి పొందింది. 1880లో మారిషస్ బ్రిటీష్ వారి ఆధిపత్యం క్రిందకు వచ్చి దాదాపు 150 సంవత్సరాలు వారి పాలనలో ఉండి చివరకు 1968 మార్చి 12న స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
మారిషస్ దేశ ఆర్ధిక వ్యవస్థ అంతా ఒకే ఒక పంట అనగా చెరుకు పై ఆధారపడి ఉంది. రహదారి అంచు వరకూ చెరుకు తోటలే ఉంటాయి. స్క్రిప్లింగ్ పద్ధతి ద్వారా నీరు చెరకు తోటల్లో విరజిమ్ముతూ చూడచక్కగా ఉంటుంది.
మారిషస్‌లో టూరిజమ్ చాలా అభివృద్ది చెందింది. ఈ సుందర దీవి దర్శనార్ధం ఎందరో విదేశీ యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ప్రశాంత ప్రకృతితో ఓలలాడే మారిషస్ చక్కటి విశ్రాంతి కేంద్రంగా బావుంటుందని నాకు అనిపించింది.
1972 జనాభా లెక్కల ప్రకారం మారిషస్ దేశ జనాభా 825,699. అందులో హిందువులు 428,167, ముస్లిములు 137,081, సినోమారిషయన్లు 24,084, ఇతరులు 236,367 మంది ఉన్నారు.
వివిధ మాతృభాషలు మాట్లాడేవారు ఈ క్రింది విధంగా ఉన్నారు. (1972 జనాభా లెక్కల ననుసరించి)
చైనీస్ | - | 20,608 | సింధీ | - | 320,831 | |
క్రియోల్ | - | 272,075 | మరాఠీ | - | 16,553 | |
ఇంగ్లీషు | - | 2,402 | తమిళ్ | - | 56,751 | |
ఫ్రెంచి | - | 36,729 | తెలుగు | - | 24,233 | |
గుజరాతి | - | 2,028 | ఉర్దూ | - | 71,668 |
ఇంగ్లీషు, ఫ్రెంచి-మారిషస్ ప్రభుత్వ అధికార భాషలు. అక్కడ ప్రజలు మాట్లాడే భాష క్రియోలి. ఇది ఫ్రెంచి యొక్క అపభ్రంశం. దీనికి లిపి లేదు. మారిషస్ చూస్తుంటే ఒక కోణం నుంచి భారత దేశానికి ప్రతిబింబంలా అనిపిస్తే, మరోకోణం నుంచి ప్రపంచానికే ప్రతిబింబంలా అనిపిస్తుంది. అన్నిభాషల - అన్ని సంస్కృతుల అపూర్వ సమ్మేళనం ఆ చిన్న ద్వీపం.
- మరువలేని ఆతిధ్యం
క్వార్టర్ బార్న్ నగరంలో ఉన్న గోల్డ్ క్రిస్ట్ (Gold Creast Hotel) హోటల్ లో విదేశీ ప్రముఖులకు విడిది ఏర్పాటు చేశారు. మారిషస్ రాజధాని నగరమైన పోర్టులూయిస్ కి 8 మైళ్ళ దూరంలో మా హోటల్ ఉంది. అధునాతనమైన ఈ హోటల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. బార్లు, రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. హోటల్ మొత్తం ఎయిర్ కండీషన్ చేయబడి ఉంది. గోల్డ్ క్రిస్ట్ హోటల్లో 308 నెంబరు రూము మాకు కేటాయించారు. విశాలంగా ఉన్న ఆ రూములో టెలివిజనూ, రేడియో, టెలిఫోన్ ఉన్నాయి. చాలా సౌకర్యంగా అనిపించిందా రూము భారత ప్రతినిధులతో బాటు దక్షిణాఫ్రికాకు చెందిన ప్రతినిధులు కూడా అదే హోటల్లో బస చేస్తున్నారు.
గోల్డ్ క్రిస్ట్ హోటల్ క్రింద భాగాన పెద్ద వాణిజ్య సముదాయం ఉంది. అన్నిరకాల, అన్నిదేశాల అధునాతన వస్తువులు అక్కడ లభ్యమవుతాయి. ఆ వస్తువుల ఖరీదులు మన దేశంలో కంటే ఎక్కువ. హోటల్ సమీపాన మార్కెట్టు ఉంది. ఆ మార్కెట్టును చూస్తే మన దేశంలో ఉండే సంతలు స్పురిస్తాయి. కాయకూరలు, పండ్లు, మాంసం, చేపలు అక్కడ విక్రయిస్తారు. మన దేశంలో లభ్యమయ్యే కూరగాయలన్నీ అక్కడ దొరుకుతాయి.
మన భారతదేశంలో డిశంబరు నెలలో శీతాకాలం అవుతుంది. అయితే మారిషన్ లో ఆ నెలలో వేసవి అవుతుంది. మనకు ఏప్రియల్లో, మేలో దొరికే మామిడిపళ్ళు అక్కడ డిశంబర్ నాటికే దర్శనమిచ్చాయి. మన ప్రతినిధులు వాటిని చూస్తూనే డాలర్లని మార్చుకుని వాటిని కొని రసాస్వాదన చేశారు.
ఆ రోజు మధ్యాహ్నం గోల్డ్ క్రిస్ట్ హోటల్లో భారతీయ ప్రతినిధుల గౌరవార్ధం మారిషస్ ఆంధ్ర మహాసభ విందు భోజనం ఏర్పాటు చేసింది. మారిషస్ ప్రభుత్వ మంత్రులు శ్రీ ఆర్ముగం పరుశురామన్, శ్రీ ఉచ్చన్న ప్రభృతులతో బాటు మారిషస్ ఆంధ్ర ప్రముఖులు అనేకులు ఆ విందులో పాల్గొన్నారు.
ఆంధ్ర మహాసభ ఆధ్యక్షులు శ్రీ సూరయ్య మహాసభల ఏర్పాట్ల గురించి, జరగబోయే కార్యక్రమాల గురించి వివరించి భారత ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం పలికారు.
మేము మారిషన్ లో అడుగు పెట్టిన డిశంబరు 7వ తేదీ నుండి డిశెంబర్ 13వ తేదీ తిరుగు ప్రయాణం వరకు తీరిక చిక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గం॥లకు హోటల్ నుండి బయలుదేరితే రాత్రి 11 గం॥ల లోపు ఎప్పుడూ హోటల్ కు తిరిగి చేరుకోలేదు. నిముష నిముష కార్యక్రమం వివరాలు పుస్తక రూపంగా ప్రచురించి ఆహ్వాన సంఘం వారు మాకు అందచేశారు.
మారిషన్ ఆంధ్ర ప్రముఖుడు, విద్యావేత్త స్వర్గీయ నారాయణస్వామి అచ్చుమన్న రాయ్డు గౌరవార్ధం వాకోస్ లోని ప్రభుత్వ పాఠశాలకు ఆరోజు ఆయన పేరు పెట్ట బడింది. తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్ర ప్రముఖునికి లభించిన అపూర్వ గౌరవం అది.
- కనులకు విందైన తెలుగు చలన చిత్రోత్సవం
అదేరోజు సాయంత్రం 4 గం॥లకు వాకోస్ లోని ట్రాఫల్లర్ హాలులో తెలుగు చలన చిత్రోత్సవాన్ని ప్రముఖ సినీ నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు.
నటుడిగా ఉన్నత శిఖరాలను ఆదిరోహించిన వ్యక్తి-వ్యక్తిగా అత్యున్నత వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకున్న మహామనీషి. తెలుగు వారికి సదా గర్వకారణమైన కళామతల్లి ముద్దుబిడ్డడు పద్మభూషణ్ డా॥ అక్కినేని చలన చిత్రోత్సవాన్ని ఆరంభించటం అందరినీ ఆనందపరిచింది.
19 సంవత్సరాల వయసులో చలన చిత్ర రంగంలో అడుగిడి అంచెలంచెలుగా కీర్తి శిఖరాల నధిరోహిస్తూ 46 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ మకుటం లేని మహారాజుగా వెలుగొందుతూ అక్కినేని తెలుగు సినీ పరిశ్రమకు పర్యాయపదం అయినాడు.
శ్రీ నాగేశ్వరరావు తన కుమారుడు శ్రీ నాగార్జునతో కలిసి నటించిన 'కలక్టర్ గారి అబ్బాయి' చిత్రాన్ని తొలి చిత్రంగా చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు
తెలుగువారు గర్వించతగ్గ మహానటి, శ్రీమతి జమునా రమణారావు పార్లమెంటు సభ్యురాలి హెూదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. మారిషస్ మంత్రులు, తెలుగు ప్రముఖులు, విదేశీ ప్రతినిధులతో హుందాగా జరిగింది ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ చలనచిత్రోత్సవంలో మారిషస్‌లో నిర్మించబడిన చిత్రం యుద్ధభూమి, అంకితం, మంగమ్మగారి మనుమడు, ఇరవయ్యవ శతాబ్దం చిత్రాలు ప్రదర్శించబడ్డాయి.
శ్రీ నాగేశ్వరరావు, శ్రీమతి జమునా రమణారావు నటులుగానే కాక తెలుగు తేజం దేశ దేశాల కాంతి కిరణాలై నిండాలనీ, తెలుగు భాష సుమధురంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిల్లాలనీ కోరుకునే వారిలో ప్రధములు.
- మారిషస్ తెలుగు జ్యోతి మహాసభ
వాకోస్ లో తెలుగు చలన చిత్రోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే పోర్టులూయిస్‌కి బయలుదేరాం. సుందర నగరమైన పోర్టులూయిస్ మారిషస్ దేశ రాజదాని.
పోర్టులూయిస్‌లోని రామకృష్ణ మందిరంలో మారిషస్ తెలుగుజ్యోతి మహాసభవారు ప్రార్ధన సమావేశాన్ని నిర్వహించారు. పోర్టులూయిస్‌లోని మొదటి తెలుగు దేవాలయం రామకృష్ణ మందిరం. దీనిని 1964 ఏప్రెల్ 19న శ్రీ ఎస్.హెచ్.కె.అవుమయ్య ప్రారంభోత్సవం చేశారు.
"ప్రపంచ తెలుగు మహాసభలను రక్షింపుము పాహిమాం' అంటూ వారు ప్రార్ధనలు చేశారు.-"జయ జయ ఓంకార.. జయ జయ చతుర ఓంకార" అంటూ భజనలు మధురంగా చేశారు. వారి భక్తి ప్రపత్తులు మమ్మల్ని ఎంతగానో పరవశింప చేశాయి. జ్యోతి మహాసభ అధ్యక్షులు తెలుగులో మాట్లాడుతూ సంప్రదాయ బద్దంగా పూజలు చేసేటందుకు పురోహితులను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించాలని కోరారు. భారతదేశం నుండి మారిషన్ కు వచ్చిన ఇతర జాతులకున్న అవకాశం తెలుగు వారికి లేకున్నదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
మారిషస్ జ్యోతి మహాసభవారు ఆ దేవాలయ ప్రాంగణంలోనే మాకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆంధ్ర వంటకాలు రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు స్త్రీ, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- మహాత్మాగాంధీ సంస్థాన్
మోకాలోని మహాత్మాగాంధీ సంస్థాన్‌లో ఆ రాత్రి 8 గంటలకు విదేశీ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ సంస్థాన్ మారిషస్‌లోని భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ. విశాలమైన ప్రాంగణంలో పెద్ద పెద్ద భవంతులు, వాటి మధ్య సువిశాలమైన ఆడిటోరియం ఉన్నాయి. ఈ ఆడిటోరియం 1976లో జరిగిన ద్యితీయ విశ్వ హిందీ సమ్మేళనాన్ని పురస్కరించుకుని నిర్మించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే తైలవర్ణ చిత్రాలతో ఆ ఆడిటోరియం అందంగా నిర్మించబడి ఉంది.
ఆడిటోరియం సమీపంలో అందమైన పచ్చికబయళ్ళమధ్య మహాత్మాగాంధీ నిలువెత్తు విగ్రహం చూపరులను ఆకర్షిస్తూ ఆ మహనీయుని పట్ల భక్తి ప్రపత్తులను కలిగిస్తుంది. మహాత్మాగాంధీ 1901 లో దక్షణాఫ్రికా నుండి మారిషస్ వచ్చి అక్కడి భారతీయులను ఉత్తేజ పరిచారు. మారిషస్ అంతటా విస్తృతంగా పర్యటించి భారతీయుల స్వాగత సత్కారాలు అందుకున్నారు. స్వభాషాభిమానం పెం చుకోమని, స్వశక్తితో కష్టాలను ఎదుర్కోమని వారికి భోదించారు. 21 రోజుల పాటు మహాత్ముడు మారిషస్ నలుమూలల చేసిన పర్యటన అక్కడి భారతీయులలో విశ్వాసాన్ని ప్రోది చేసింది.
1901 డిశెంబర్ 1 న మహాత్ముడు భారతదేశం చేరుకుని కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మారిషస్ భారతీయుల స్థితి గతులను గురించి ఒక సమగ్ర నివేదిక సమర్పించారు. మారిషస్ జాతిపిత సర్ శివసాగర్‌రామ్ గులామ్ పై మహాత్ముని ప్రభావం అమితంగా పడింది. మారిషస్ స్వాతంత్ర్యోద్యమంలో ఆయనకు మార్గదర్శకం అయ్యింది.
మహాత్మాగాంధీ పట్ల అపారమైన గౌరవంతో మారిషన్ లో ఆయన పేరుతో మహాత్మాగాంధీ సంస్థాన్ ఏర్పడటం-ఆయన కాంస్య విగ్రహం నెలకొల్పడం భారతీయులు గర్వించ తగిన విషయం.
- సాంస్కృతిక ప్రదర్శనలు
మహాత్మాగాంధీ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి మారిషస్ గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడు, ప్రధానమంత్రి అనిరుద్దీ జగన్నాథ్ మంత్రులు, స్పీకరు, పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికారులు విచ్చేశారు.
మారిషస్ విధ్యామంత్రి శ్రీ ఆర్ముగం పరుశురామన్ స్వాగతం చెబుతూ భారత ప్రతినిధి వర్గానికి అభినందనలు చెప్పారు. ప్రత్యేకించి ప్రపంచ తెలుగు మహాసభల వ్యవస్ధాపకుడు శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు రావటం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. తరువాత తెలుగులో మాట్లాడుతూ 'తెలుగు భాష మధురం. మనోహరం' అని తెలుగు హృదయాలను పులకింప చేశారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక బృందం నాయకుడు డా॥ సి.నారాయణరెడ్డి తాము సమర్పించబోయే సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలియ చేశారు.
శ్రీమతి శోభారాజ్ అన్నమయ్య కీర్తనల ఆలాపనతో" కార్యక్రమం ప్రారంభం అయ్యింది. పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తనలు శ్రీమతి శోభారాజ్ మధుర స్వరం ద్వారా జాలువారగా సభికులు ఆధ్యాత్మికానుభూతిలో పరవశులైనారు. "అదివో అల్లదివో శ్రీహరి వాసము' అనే కీర్తన ఆమె ఆలపిస్తూంటే పదివేల పడగల నడుమ శ్రీహరి దివ్య మంగళ విగ్రహం సాక్షత్కరించిన భావన కలిగింది.
'బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే' అంటూ ఆలపిస్తూంటే శ్రోతలు ఆనందాబ్దిలో మునిగి తాళం వేయటం జరిగింది. భాష తెలియక పోయినా-సంగీత జ్ఞానం లేకపోయినా సుమధుర స్వరంతో ఆమె పాడిన తీరుకు మారిషస్ పెద్దలు చప్పట్లు చరుస్తూ అభినందనలు తెలిపారు. అందుకే అన్నారు కాబోలు పెద్దలు సంగీతం పారలౌకికం అని.
శ్రీమతి రాధారెడ్డి, శ్రీ రాజారెడ్డిల కూచిపూడి నృత్యం మెరుపు వేగంతో సాగి ప్రేక్షకుల హృదయాలను ఆనంద తాండవం చేయించింది.
-
- అభినయానికి హృదయమర్పించుకుని కూచి
- పూడియే నాడిగా ఆడింది తెలుగు
అన్న సినారె గీతిని ఆ నృత్యం గుర్తుకు తెచ్చింది. మా దివిసీమలోని కూచిపూడిలో క్రీ.శ. 1500 పూర్వమే శ్రీ సిద్దేంద్రయోగి సృష్టించిన కూచిపూడి నృత్యాన్ని మారిషన్ లో శ్రీమతి రాధారెడ్డి, శ్రీ రాజారెడ్డిలు తమ ప్రతిభతో రక్తి కట్టించారు.
తర్వాత డాక్టర్ ఎల్లావెంకటేశ్వర్రావు మృదంగనాదవిన్యాసాలు హృదయానంద భరితుల్ని చేశాయి. దక్షిణ భారతదేశంలో తాళవాద్యాలలో మృదంగానిది అగ్రస్థానం. త్రిపురాసుర సంహార మొనర్చిన పిదప మహాదేవుడు జయసూచకంగా నొనర్చిన నాట్య మందు హంగు చేయుట కొరకు బ్రహ్మమృదంగమును సృష్టించెనని, మొదట గణేశుడు వాయించెనని పురాణగాధ. ఈశ్వర అంశతో కూడుకొనిన మృదంగమును చేబట్టి, తన పాండిత్య ప్రతిభతో అంతర్జాతీయ కీర్తినార్జించి అఖండ విఖ్యాతి సాధించిన మార్దంగికాగ్రేసరులు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు. మృదు అంగమైన మృదంగంతో శివతాండవం చేయించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాదులలో ముంచెత్తారు శ్రీ ఎల్లా, ఆయన మన తెలుగు వారు కావడం మనకు సదా గర్వ కారణం.
ధ్వన్యనుకరణ సామ్రాట్టు, ధ్వన్యనుకరణ చక్రవర్తి డా॥ నేరెళ్ళ వేణు మాధవ్ 'మిమిక్రీ' ప్రేక్షకులను మైమరిపించి ఆడిటోరియం లో నవ్వులు జల్లులు కురిపించింది. ఆంధ్రప్రదేశ్ లో ధ్వన్యనుకరణ, వెంట్రిలాక్విజంలను ప్రవేశపెట్టిప్రాచుర్యం సంతరించి పెట్టిన ఘనత శ్రీ వేణు మాధవ్ కే దక్కుతుంది.
ధ్వన్యనుకరణ విద్యలో శ్రీ వేణు మాధవ్ ఈ తరం మిమిక్రీ కళాకారులకు ద్రోణాచార్యుల వంటి వారు. మిమిక్రీ చేస్తానంటూ మైక్ ముందు నిలబడే ప్రతి ఔత్సాహిక మిమిక్రీ కళాకారుడు ఆయనకి ఏకలవ్య శిష్యుడే.
ధ్వన్యనుకరణకు స్వరాష్ట్రంలోనూ, స్వదేశంలోనూ పేరు ప్రఖ్యాతులు తేవడమే కాకుండా విదేశాలలో సహితం విశేషమైన గుర్తింపును తెచ్చిన కళాకారుడు శ్రీ వేణు మాధవ్.
- సౌందర్యరాశి మారిషస్
ఎనిమిదోతేదీ ఉదయం మారిషస్ దేశ ప్రకృతి రమణీయతను తిలకించటానికి వ్యానుల్లో బయలుదేరాం. వీధులు పరిశుభ్రంగా, అద్దంలానిగనిగ లాడుతూంటాయి. ఆ చక్కటి రహదార్లపై ఎంత దూరం ప్రయణం చేసినా అలుపూ సొలుపూ ఉండదు. కారు చాలా వేగంగా నడుపుతారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. వీధి మలుపుల్లో నెమ్మదిగా పోనీయటం, ఎదురుగా వస్తున్న కారును చూసి ఆపుకుని అది వెళ్ళిన తరువాత ముందుకు వెళ్ళటం అక్కడి వాళ్ళ జాగ్రత్తకూ, క్రమశిక్షణకూ నిదర్శనం. రోడ్లనడుమ ఎర్రని రేడియం చారలు ఉంటాయి. అవి రాత్రి పూట వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. పగటిపూట ఏమంత ప్రత్యేకంగానూ కనపడవు. ఒక క్రమపద్దతిలో అవి నడవటానికి తోడ్పడతాయి. బెంజి, ప్లిమత్, చవర్లెట్ లాంటి కార్ల వాడకం తక్కువ. చిన్న కార్లు అతి తక్కువగా కనిపించాయి.
ఆరోజు మధ్యాహ్నం మారిషస్‌లోని ఇండియన్ హై కమిషనర్ శ్రీ కె.కె.ఎస్. రాణా విదేశీ ప్రతినిధుల గౌరవార్ధం వాకోస్‌లోని ఇండియా హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. శ్రీ రాణా మా అందరితో ఎంతో కలివిడిగా తిరుగుతూ విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. చక్కని భోజనం పెట్టి అతిధి సత్కారం చేసిన శ్రీ రాణా ఆదరణ మరువరానిది.
భోజనానంతరం మధ్యాహ్నం 3 గంటలకు మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్లో మారిషస్‌లోని వివిధ సాంస్కృతిక సంస్థల వారు విదేశీ ప్రతినిధులకు పౌరసన్మానం చేశారు. డా#2405; సి.నారాయణరెడ్డి, శ్రీ మండలి వెంకట కృష్ణారావు, డా#2405; అక్కినేని నాగేశ్వరరావు, శ్రీమతి జమునారమణారావు, శ్రీ నరిశింగరెడ్డి, శ్రీ రాజారెడ్డి శ్రీమతి రాధారెడ్డి, శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు, శ్రీ వేణుమాధవ్, శ్రీమతి శోభారాజ్ దక్షిణాఫ్రికా ప్రతినిధి వర్గం నాయకుడు శ్రీ ఆర్.యస్.నాయ్డులను వివిధ సంస్థలవారు పుష్చమాలలతో సత్కరించారు.
పౌరసన్మానంతరం మారిషస్‌లోని ఆంధ్ర కళాకారిణి శ్రీమతిశైలజా రాముడి కూచిపూడి నృత్యం కనుల విందు చేసింది. భామా కలాపాన్ని ఆమె ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శించింది. నృత్య ప్రదర్శనకు ఆ నృత్య విశేషాన్ని అభినయపూర్వకంగా వివరిస్తూ ఇంగ్లీషులో ఆమె చేసిన వ్యాఖ్యానం ఆమె ప్రతిభను చాటింది. సత్యభామ విరహవేదనను హావ భావయుక్తంగా చక్కగా ప్రదర్శించింది. కేసెట్టు చేసిన పాటకు బదులు నేపధ్య సంగీతం ఉండి ఉంటే మరింత రక్తి కట్టి ఉండేది.
- మహారామ భజనం
మారిషస్‌లో జరిగిన తెలుగు సభలకే వన్నె తెచ్చిన మహెూన్నత కార్యక్రమం మహారామ భజనము.
బియోవాలన్‌నగరం ఆ రోజు వేలాది ఆంధ్ర స్త్రీ, పురుషులతో నిండి ఉంది. 150 సంవత్సరాల క్రితం మారిషస్ దేశంలో అడుగు పెట్టిన తెలుగు తల్లి తనయులు తమతో వారసత్వ సంపదగా తీసుకెళ్ళిన సంస్కృతీ సాంప్రదాయం మహారామ భజనము. భక్తితో ఆచరించడానికి అక్కడ చేరిన వేలాది మంది జనసందోహాన్ని చూసి పులకించని హృదయం ఉండదు.
ఏనాడో ఆంధ్ర దేశంలోని పల్లె సీమల్లో వర్ధిల్లిన రామభజనము ఈనాడు మాతృదేశంలో మాయమైనా మారిషస్‌లో వర్ధిల్లటం చూసి ఏ తెలుగు హృదయం గర్వించదు?
మారిషస్ ప్రభుత్వం వారు పదివేల మంది కూర్చోవడానికి వీలుండే విధంగా పెద్ద సర్కస్ గుడారం లాంటిది వేశారు. ఆ గుడారం మధ్య ఆకర్షణీయమైన ఇత్తడి దీపపు వృక్షాలు (సెమ్మెలు) అలంకరించి వెలిగించారు. బృందాలవారీగా ఒక్కొక్క సెమ్మ చుట్టూ చేరి ముందు లక్ష్మీ పూజ గావించి భజనకు ఉపక్రమించారు. రామభజనతో పాటు చిటి తాళాలతో రామదాసు కీర్తనలు, నరశింహ, వేమన శతక పద్యాలను పాడుతూ తెల్లవార్లు గడుపుతారు.
ప్రపంచ తెలుగు మహాసభల ఎంబ్లెమ్ ముద్రించిన బనీన్లు ధరించి మోకాలి వరకు పంచెకట్టు కట్టి తాళాలు చేత పట్టి వారు భజన చేస్తూంటే సంస్కృతీసాంప్రదాయాల పట్ల వారికి ఉన్న మక్కువ నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది.
వారి పంచెకట్టు దసరా బుల్లోడు చిత్రంలో నాగేశ్వరరావుగారి పంచెకట్టు పద్దతిలో ఉంది. నా ప్రక్కన కూర్చున్న నాగేశ్వరరావుగారితో అదేమాట అన్నాను.
మహారామ భజనము డిశంబరు 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 9 వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ముగిసింది. 12 గంటలపాటు నిర్విరామంగా జరిగిన మహారామ భజనంలో దాదాపు 10 వేల మంది తెలుగువారు పాల్గొన్నారు. మారిషస్ నలుమూలల నుండి ప్రత్యేక బస్సులలో వారక్కడకు వచ్చారు. మహారామ భజనానికి వచ్చిన 10 వేల మందికి అరటి ఆకులలో షడ్రసోపేతమైన తెలుగు భోజనం పెట్టడం ఒక విశేషం.
- బియోవాలన్ సింహాద్రి అప్పన్న దేవాలయం
బియోవాలన్ లో మహారామ భజన జరుగుతున్న ప్రదేశానికి ఎదురుగా రోడ్డుకి ఆవలి ప్రక్కన సింహాద్రి అప్పన్న దేవాలయం ఉంది. మారిషస్ తెలుగు వారు నిర్మించుకున్న ప్రాచీన దేవాలయాలలో ఇదొకటి.
దేవాలయాల చుట్టూరా మారిషస్ తెలుగు వారి సాంఘిక జీవనం అల్లుకుని ఉంది. తెలుగు వారు ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయతానుబంధాలు పెంచుకునేందుకు దేవాలయాలు తోడ్పడుతున్నాయి. గుడిని బడిగా మార్చుకుని రాత్రిపూట తెలుగు అక్షరాలు దిద్దుకుంటున్నారు. తెలుగు వారి ఐకమత్యానికి, సంఘజీవనానికి దేవాలయాలు కేంద్రాలు. మారిషస్‌లో తెలుగు వారికి సంబంధించి దాదాపు యాభై దేవాలయాలు ఉన్నాయి.
- మారిషస్‌లో తెలుగు పండుగలు
150 సంవత్సరాల క్రితం మారిషస్‌కి వలస వెళ్ళిన తెలుగు వారిలో రామభక్తులు 'రామభజనం, శ్రీ నరశింహస్వామి భక్తులు ' సింహాద్రి అప్పన్న పూజ శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులు 'గోవిందపూజ చేసేవారట.
ప్రారంభంలో రామభజనం చేసేవారు ఒక మట్టి దీపం వెలిగించి కీర్తనలు, భజనలు చేస్తూండేవారట. వారిలో శ్లోకాలు, మంత్రాలు తెలిసిన వారుంటే వారిని గౌరవ సూచకంగా 'దాసులనో, "అయ్యోరు' లనో పిలిచేవారు. ఐదారుగురు కలసి భజన గుంపుగా ఏర్పడి రామభజనం తెల్లవార్లు చేసేవారు. తెల్లవారిన తరువాత మట్టి దీపాలను నదిలో విసర్జించేవారు. అలా మొదలైంది రామభజనము.
మారిషస్‌లో ఉన్న తెలుగు వారిలో అధికులు విశాఖపట్నం చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. వారు సింహాచల శ్రీ వరాహ నరశింహస్వామి భక్తులు శ్రీ నరశింహస్వామిని వారు 'సింహాద్రి అప్పన్న' అని భక్తితో పిలుచు కుంటారు. సింహాద్రి అప్పన్న పూజలో విశేషమేమిటంటే మండుతున్న కోలాళ్ళు తీసుకుని భక్తితో నృత్యమాడటం. "హరి హరి నారాయణా .. ఆది నారాయణా.. కరుణించు మమ్మేలు కమలలోచనుడా!" అంటూ వారు భక్తి పారవశ్యంతో వెలుగుతున్న కోలాళ్ళు పట్టుకుని ఆడతారు. తెల్లవార్లు అప్పన్న పూజ చేసి తెల్లవారిన తరువాత కోలాళ్ళ లోని జ్యోతిని నదిలో నిమజ్జనం చేసి ఇంటికివచ్చి గుమ్మడికాయని పగలగొట్టి శాంతి పాఠం చెప్పి ప్రసాదం పంచి పెడ్తారు. కోలాళ్ళు పట్టుకునే మనిషి నలభై రోజులు నిష్టతో కొన్ని నియమాలు పాటించాలి.
మద్రాసు, తిరుపతీ ప్రాంతం నుంచి వచ్చిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. వీరు 'గోవిందపూజ' ఆచరించేవారు. అయితే ఈగోవిందపూజ మారిషస్‌లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఈమధ్యకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల సంఘం వారు సనాతన ధర్మ ప్రచారం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా వ్రతాదులను పాటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణంలో ఉంది. (ఆ విషయం మున్ముందు వివరిస్తాను.) మారిషస్‌లో జనప్రియమై న పండుగ అమ్మోరిపండుగ. అమ్మోరి పండుగను తెలుగు వారందరూ కలసి మెలసి చేసుకుంటూంటారు. మన పల్లెటూళ్ళల్లో గ్రామ దేవత సంబరాలను తలపింప చేసే పండుగ ఈ అమ్మోరి పండుగ.
పోశమ్మ ,ఎల్లమ్మ, పెద్దమ్మ, బాలమ్మ, మాచికమ్మ, ఈదమ్మ, మహంకాళమ్మ అనే ఏడుగురి దేవతా సోదరీమణుల పేరు మీదుగా ఈ అమ్మోరి పండుగ చేస్తారు. ఈ దేవతలు పొంగు, మశూచి వ్యాధులు రాకుండా కాపాడతారని, ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారని మారిషస్ తెలుగు వారి ప్రధాన నమ్మకం.
పూర్వ కాలంలో ఈ అమ్మోరు పండుగ పెద్ద ఎత్తున చేసేవారట. ప్రభలు కట్టేవారు, ఘటాలు యిచ్చేవారు, కోడి పుంజులు, మేకపోతులు తీసుకు వచ్చి అమ్మోరు గుడి ఎదుట బలి ఇచ్చేవారు. తదనంతరం అక్కడే పొయ్యిలు పెట్టి మాంసాహారం వండుకుని భుజించి మద్యం త్రాగి జాతర చేసుకునే వారు. రాను రాను త్రాగుడు మత్తు ఎక్కువై తగాదాలు పడటం, కొట్టు కోవటం జరిగేదట.
1984-85 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల సంఘం వారు బలి ప్రభని ఖండిస్తూ తీవ్ర ప్రచారం చేసి దానిని మాన్పించారు. ఇప్పుడు మేకపోతుల బదులు గుమ్మడి కాయలను బలి పెడుతున్నారు. మాంసాహారం బదులు గారెలు, బూరెలూ వండుకుని పండుగ చేసుకుంటున్నారు.
అమ్మోరు పండుగ విధానం విన్న నాకు మా అవనిగడ్డలో జరిగే లంకమ్మ సంబరం గుర్తుకు వచ్చింది. దానికీ-దీనికీ ఏం తేడా లేదు. తెలుగు వారు ఎక్కడున్నా వారి ఆచార వ్యవహారాలు ఒకటేనని ఈ అమ్మోరు పండుగ నిరూపిస్తోంది.
- శ్రీ వెంకటేశ్వర దేవాలయం
డిశెంబరు 9 వ తేదీ ఆదివారం మూ కార్యక్రమం లాలెరా, సెంట్‌ఫియరీలో నిర్మించ బడుతున్న శ్రీ వెంకటేశ్వర దేవాలయ సందర్శనతో ప్రారంభం అయ్యింది. ఆ క్రితం రోజే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ట్రస్టు కార్యదర్శి శ్రీ మహానంద రామయ్య మమ్మల్ని తప్పక రావలిసిందిగా కోరారు. లాలోరా గ్రామంలో ఒక ప్రక్క బారులు తీరిన కొండలూ, చెరుకు తోటలతో చూడ మనోహరంగా ఉంది.
మోకా పర్వత శ్రేణుల ప్రక్కన సుందర ప్రదేశంలో ఏడుకొండల వాని దేవాలయ నిర్మాణార్ధం దివ్య జీవన సంఘానికి చెందిన స్వామి వెంకటేశానంద స్థల నిర్ణయం చేశారు. ఆ స్థలాన్ని శ్రీ హెచ్. పులెనా దంపతులు దానం చేశారు. 1977 లో నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. శ్రీ భూపేంద్ర ఏ.దేశాయ్ అధ్యక్షునిగా, శ్రీ రామయ్య కార్యదర్శిగా ఏర్పడిన ట్రస్టు బోర్డు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది.
ఈ దేవాలయ నిర్మాణానికి వడ్డీ లేకుండా ధన సహాయం చేసేటందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. అయితే భారత విదేశీ మారక ద్రవ్య నిబంధనలు అడ్డంకిగా నిలిచాయి. ఆ సాయాన్ని తమకు చేరేలా తోడ్పడమని శ్రీ రామయ్య మమ్మల్ని ఆర్ధించారు.
స్వదేశం తిరిగి వచ్చాక నాన్నగారు ఈ విషయాన్ని ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ దృష్టికి తీసుకుని వెళారు. కానీ రిజర్వు బాంక్ ఆ అభ్యర్ధనని త్రోసి పుచ్చింది.
లాలౌరా లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన రిసెప్షన్‌కు ప్రధానమంత్రి శ్రీ అనిరుద్ జగనాధ్ హాజరుకావటం విశేషం. ఆనాటి సమావేశంలో డా॥ సి.నారాయణరెడ్డి, శ్రీ మండలి వెంకట కృష్ణారావు, ప్రధానమంత్రి శ్రీ అనిరుద్ జగనాధ్ ప్రసంగించి శ్రీ వెంకటేశ్వేర స్వామి దేవాలయ నిర్మాణం పట్ల ఆనందాన్ని వ్యక్త పరిచారు.
శ్రీ రామయ్య స్వాగతం చెప్పగా, శ్రీ రాజు, బి. ముల్లయ్య కార్యక్రమం నిర్వహించారు.
- విష్ణు మందిరం రిసెప్షన్
లాలౌరా నుంచి సెంట్‌ఫయరీలో ఉన్న విష్ణు మందిరంలో జరిగిన రిసెప్షన్‌కి హాజరయ్యాం. తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్‌ఫీయరీలో అల్మాసుగర్ ఎస్టేట్‌లో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న తెలుగు వారు 1920 లో స్థలాన్ని కొని విష్ణు మందిర నిర్మాణం తలపెట్టారు. 1923 మే 20వ తేదీన దేవాలయ ప్రవేశం జరిగింది. అక్కడ నివసిస్తున్న తెలుగు వారు వైష్ణవులు కావటంతో దానికి విష్ణు మందిరం అని పేరు పిలూరు. ఆనాటి కార్యక్రమంలో శీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీమతి జమునా రమణారావు ప్రసంగించి తెలుగు మహాసభల ప్రాముఖ్యం వివరించారు. ఆంధ్ర జనతా సహాయ సంఘం వారు విష్ణు మందిరంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.
- సంబరంతో కదిలిన జనవాహిని
రోజ్‌హిల్ చాలా అందమైన నగరం. ఆ నగరాన్ని చూస్తూంటే ఎంతో కళాత్మకంగా సినిమా సెట్టింగ్ లా అనిపించింది. చాలా పరిశుభ్రమైన నగరం. అందమైన భవంతులు. వాణిజ్య సముదాయాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. రోజ్‌హిల్ లోనిప్లాజా ధియేటర్ వద్ద నుంచి స్టేడియం వరకు తెలుగు మహాసభల సందర్భంగా మారిషస్ తెలుగు వారు పెద్ద ఊరేగింపు నిర్వహించారు. తెలుగు వారు పిల్లా పాపలతో ఆ ప్రదర్శనకు తరలివచ్చితమ మాతృ భాషాభిమానాన్ని చాటుకున్నారు, తెలుగు తల్లి, శ్రీ వెంకటేశ్వర స్వామి తదితర అంశాలతో అలంకృతమైన శకటాలు ఆ ప్రదర్శనలో పాల్గొన్నాయి. రంగు రంగుల పరికిణీలు, ఓణీలూ ధరించిన ఆంధ్ర బాలికలు కోలాట మాడుతూ ముందు నడిచారు.
ప్రదర్శన ప్రారంభమయిన కొంత సేపటికే వాన చినుకులు ప్రారంభం అయినాయి. అయినా ప్రదర్శన ఆగకపోవటం... ప్రదర్శకులు చెక్కు చెదరకపోవటం విశేషం. సమధికోత్సాహంతో ఊరేగింపు సాగి రోజ్‌హిల్ స్టేడియంకు చేరుకుంది. మారిషస్ ప్రభుత్వమంత్రులు, శ్రీ అర్ముగం పరశురామన్, శ్రీ ఉచ్చన్న ఊరేగింపు అగ్రభాగాన నడిచారు.
రోజ్‌హిల్ స్టేడియం స్త్రీ పురుషులతోనూ, బాలబాలికలతోనూ నిండింది. మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు సతీ సమేతంగా విచ్చేసి కళాప్రదర్శననూ, ఊరేగింపునూ తిలకించారు.
- సంస్కృతి తరంగ - సంగీత రసధుని
సాంస్కృతిక ప్రదర్శనలు మారిషస్ తెలుగు ఆడపడుచు శ్రీమతి ప్రమీలా రామన్న లలిత సంగీతాలాపనతో ప్రారంభమైనాయి. "కొండలలోనెలకొన్న కోనేటి రాయుడు" కీర్తన అత్యంత అద్బుతంగా పాడిందామె. విశేషమేమిటంటే శ్రీమతి ప్రమీలా రామన్నకు తెలుగు చదవటం, వ్రాయటం తెలియదు. పాటను ఇంగ్లీషులో వ్రాసుకుని పాడిందని అక్కడి వారు చెబితే ఆశ్చర్యపోయాం. సంగీతం నేర్వని ఆమె కేవలం ఆడియో కేసెట్ ద్వారా అన్నమాచార్య కీర్తనని నేర్చుకుని సుమధురంగా ఆలపించి జనరంజనం చేయటం ఆమెలోని సంగీత తృష్ణకు నిదర్శనం.
మారిషస్ ఆంధ్ర యువకులు శ్రీ రాజన్ అప్పడు, శ్రీ సురేన్ అప్పడు శంకరాభరణం చిత్రం లోని పాటలు చాలా బాగా పాడారు. వీరిని మారిషస్ ప్రభుత్వం విదేశాలకు సాంస్కృతిక బృందాలలో పంపి ప్రోత్సాహించిందని అక్కడివారు చెప్పారు. వీరిద్దరికీ కూడా తెలుగు చదవటం రాదట. మారిషస్ ఆంధ్రుల లలిత సంగీత కచేరీ ముగిసిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక బృందం వారి కళాప్రదర్శనలు మొదలియ్యూయి. శ్రీ గోపాలరాజ్ భట్ బృందం వారి జానపద నృత్యాలు మారిషస్ దేశస్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీయుతులు అనిల్‌కుమార్, ఎ.వి.శ్రీధర్, కుమారి ఆరతి, కుమారి కీర్తి, కుమారి ప్రీతి, శ్రీమతి సుబ్బలక్ష్మి ప్రదర్శించిన కోయ, లంబాడి నృత్యాలు ప్రేక్షకుల్ని ఆనంద పరవశుల్ని చేశాయి.
రంగస్థల రారాజ శ్రీ ఆచంట వెంకటరత్నం నాయ్డు "రారాజు" ఏకపాత్రాభినయం ప్రేక్షకులను పరవశుల్ని చేసింది. భాష వారికి అర్ధంకాక పోయినా అందులో చమత్కారం వారికి తెలీక పోయినా శ్రీ నాయుడుగారి గంభీర పద విన్యాసాలకు, హావ భావాలకు, వారి నటనా చాతుర్యానికి అడుగడుగునా ప్రశంసా పూర్వకమైన కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమ్రోగి పోయింది. వారు ధీర గంభీరంగా వేదిక వైపు నడుస్తూ దానిని అధిరోహించటమే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అదీకాక సంధ్యా సమయంలో జరిగిన ఆ కార్యక్రమం సమయంలో అంతకు ముందే చిరుజల్లులు పడి వెలిసి మబ్బుల చాటునుంచి సూర్యుడు దోబూచులాడు తున్నాడు. సూర్యుణ్ణి మబ్బులు మూస్తూ... అంతలోనే ప్రక్కకు తప్పుకోవటంలో సంధ్యా కాంతులు తళుకుమని నాయ్డుగారు ధరించిన విలువైన జరీ దుస్తులపై పడి వింత కాంతుల్ని విరజిమ్మ సాగాయి.
మాములుగా ప్రదర్శన పమయంలో వాడే ఫోకస్‌లైట్లు ఆ సమయంలో లేకపోయినా సహజమైన వెలుగులు జిగేల్మనిపిస్తూ కాంతులు వెదజల్లి అందరినీ ఆహ్లాద పరిచాయి.
తెలంగాణా జానపద కళారూపమైన 'ఒగ్గు కధ ను శ్రీ మిద్దే రాములు, శ్రీ ఆయిలయ్య వినిపించి ప్రేక్షకులను ఆనందింప చేశారు.
శ్రీ సంపత్ కుమార్'ఆంద్ర జాలరి" నృత్యం ప్రేక్షకులను ఎంతగానో రంజింప చేసింది. శ్రీ రమణమూర్తి వాయిద్య సహకారం తోడు కాగా తన నృత్య విన్యాసాలతో ఆయన మారిషస్ వారి హృదయాలను ఆకట్టుకున్నారు.
లబ్ద ప్రతిష్ఠులైన ఆంధ్ర కళాకారులు తమ ప్రదర్శనలతో మారిషస్ దేశస్థులను ఆకర్షించి, ఆనంద పరిచారనటంలో ఎట్టి సందేహం లేదు. ఈ ప్రదర్శనలు చూచి తన్మయులైన మారిషస్ టెలివిజన్ వారు ప్రత్యేకంగా వాటిని తమ దేశంలో ప్రసారం చేయుట కోసం చిత్రీకరించారు.
ఊరేగింపులో పాల్గొనటానికి చాలామంది వృద్ధులు సహితం తరలి వచ్చారు. వారిలో ఎనభైఏళ్ళు పైబడిన వృద్ధమూర్తి పండిట్ జగన్నాధ మాణిక్యం స్టేడియంలో నా చెంతనే కూర్చున్నారు. ఆయన నాతో మాట కలిపి 1977లో దివిసీమలో సంభవించిన తుఫాను-ఉప్పెనల గురించి ఆ సమయంలో మా నాన్నగారు చేసిన సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ విషయాలన్నీ ఆయనకెలా తెలుసా అని ఆశ్చర్యపోవటం నావంతైంది. మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన సంఘటనల పట్ల ఆసక్తి కనపరుసూ ఎప్పటికప్పుడు వారు వాటి గురించి తెలుసుకుంటున్నారంటే మాతృదేశం పట్ల వారికున్న ఆపేక్ష-అభిమానం ఎంతగానో తేటతెల్లమౌతున్నాయి. గాంధీటోపి-పంచెకట్టు-కోటుతో ఉన్న పండిట్ జగన్నాధ మాణిక్యం చక్కని తెలుగులో సంభాషించారు.
ర్యాలీ ముగిసిన తరువాత మారిషస్ ఆంధ్ర ప్రముఖుడు శ్రీ స్వామి, ఆయన కుమార్డు శ్రీ ప్రమోద్ కోరమండల్ బియోబాసిన్లో వారింటికి తీసుకుని వెళ్ళారు. శ్రీ స్వామి తాము నడుపుతున్న సూపర్ మార్కెట్టుని చూపించి మారిషస్ దేశపు టీ పేకెట్లను మాకు బహూకరించారు. వారింటి నుండి హైద్రాబాద్ మా చెల్లెలుతో ఫోనులో మాట్లాడి మా యోగక్షేమాలు తెలిపాము. శ్రీ స్వామి కుమార్డు శ్రీ ప్రమోద్ పోలీసు డిపార్ట్‌మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను రాజస్థానీ వనితను పెళ్ళి చేసుకున్నాడు.
ఆ రాత్రి బియోబాసిన్ మేయర్ శ్రీ రాజేష్ ఎ. భగవాన్ రోజ్‌హిల్ లోని టౌన్‌హాల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. టౌన్‌హాల్ చాలా అందమైన కట్టడం. డైనింగ్‌హాలూ, చక్కని మినీ ధియేటర్ కూడా ఉన్నాయి. పాశ్చాత్య పద్ధతిలో జరిగిందా విందు. అంతకు ముందు జరిగిన విందులకది పూర్తిగా భిన్నంగా ఉంది. మద్య పానీయాలు కూడా విందులో చోటు చేసుకున్నాయి. అవి త్రాగని వారికోసం పైనాపిల్‌జ్యూస్ ఇచ్చారు. మాంసాహారం-శాకాహారం రెండూ వడ్డించారు. మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ ఎస్.సి. ప్రసాద్ నాతో కలసి తమ దేశపు సంస్కృతీ, ఆచారాలను గురించి ముచ్చటించారు. విందులో మారిషస్ మంత్రులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
- ఎన్నినాళ్ళ స్వప్నమిది
డిశెంబర్ 10 వ తేది ఉదయమే మేము విడిది చేసిన గోల్డ్‌క్రిస్ట్ హోటల్ హడావిడిగా కళ కళ లాడుతూ ఉంది. బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని తృతీయ ప్రపంచ తెలుగుమహాసభల ప్రారంభోత్సవానికి ప్రతినిధులు బయలుదేరటానికి సిద్ద మౌతున్నారు. ఒక సుందరస్వప్నం నిజమౌతోంది-ఋజవౌతోంది. అందరిలో ఏదో ఉద్వేగం.. ఉత్సాహం. మారిషస్ విద్యాశాఖ వారు మా కోసం ప్రత్యేకంగా ఒక బెంజి కారు ఏర్పాటు చేశారు. డ్రైవర్ పేరు పరదేశి. ఆ కారులో గోల్డ్ క్రిస్ట్ హోటల్ నుంచి బయలుదేరి మోకాలోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌కి చేరుకున్నాం
మహాసభ ప్రాంగణం అంతా సంబరపు సందడిలో అత్యంత కోలాహలంగా ఉంది. తెలుగు సంస్కృతికి అద్దం పడుతూ ప్రవేశ ముఖద్వారం ముంగిట రంగుల రంగ వల్లికలు హరివిల్లులై దర్శనమిచ్చాయి. "సుస్వాగతం" అంటూ సుమాక్షరాలు కన్నుల కింపు కలిగిస్తూ తీర్చి దిద్దదిడి ఉన్నాయి. ద్వారానికి ఇరువైపులా అరటి చెట్లు అందమైన ఆలంకారాలుగా నిలిచాయి. ఇక మామిడి తోరణాలూ.. బంతి పూదండలతో విదేశంలో ఉన్న మాకు స్వదేశీ వాతావరణాన్ని స్పురణకు తెచ్చి అపురూపమైన అనుభూతిని అందించింది. నేత చీరలు దరించిన వనితలు ముకుళిత హస్తాలతో రెండువైపుల నిలబడి నుదుటన తిలకం దిద్ది ఆహ్వానం పలికారు.
తల్లీ నీ యుత్సవము గాంచ దరలినార
అనుగు దనయులు నైవేద్య వస్తులగుచు
ధన్యులెల్లరు నాత్మోచితంపు కాన్క
అర్పణము సేయ వచ్చిరి యందికొమ్ము
అనుగు దనయులు నైవేద్య వస్తులగుచు
ధన్యులెల్లరు నాత్మోచితంపు కాన్క
అర్పణము సేయ వచ్చిరి యందికొమ్ము
దువ్వూరి రామిరెడ్డిగారి పద్యం మనసులో మెదిలింది. తెలుగు తల్లిని భక్తితో కొలవటానికి దేశదేశాల నుంచి వచ్చిన తెలుగు తనయులతో సమావేశ మందిరం కిట కిట లాడింది.
ప్రతినిధులకు బ్యాడ్జిలు, వివిధ పత్రాలు ఉంచిన ఫైల్స్ ఇచ్చారు. దక్షిణాఫ్రికా ఆంధ్ర సంఘం తమ ప్రతినిధులు సదస్సుల్లో సమర్పించే పత్రాలతో కూడిన ఫైల్స్ ఇచ్చారు.
దక్షిణాఫ్రికా నుండి 52 మంది, భారతదేశం నుండి 32 మంది, మలేషియా నుంచి 20 మంది, బల్స్ నానా, బెల్జియం, రియూనియన్ల నుంచి ఒక్కరేసి చొప్పున ప్రతినిధులు మహాసభలకు విచ్చేశారు. మారిషస్ నుండి 200 మంది ప్రతినిధులు 100 మంది పరిశీలకులు సభలో పాలుపంచుకున్నారు.
- స్నేహవేదిక
మహాసభల వేదిక శోభాయమానంగా అలంకరించ బడింది. వేదిక ముందు దేశభాషలందు తెలుగు లెస్స' అనే బ్యానర్ని కట్టారు వేదికపై తెలుగు తల్లి కటౌట్ పెట్టి అరటి చెట్లని ఇరువైపుల ఉంచి అలంకరించారు. దాని ఎదుట దీపపుకుందులు ఉంచి మంత్రోచ్ఛారణల మధ్య వాటిని వెలిగించారు. వేదిక వెనుక భాగాన తృతీయ ప్రపంచ తెలుగు మహాసభలు అని ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఉన్న బంగారు రంగులో ఉన్న శాటిన్ బ్యానర్ కట్టారు.
మహాసభలకు విచ్చేసిన ప్రతినిధులు, మారిషస్ దేశపు మంత్రులు, స్పీకరు, పార్లమెంటు సభ్యులు, వివిధ నగరాల మేయర్లు, భారత హై కమిషనర్, అధికార ప్రముఖులు తమతమ ఆసనాలలో కూర్చుని ప్రారంభ సుముహర్తం కోసం వేచి చూడసాగారు.
సరిగ్గా 9-30 గంటలకు మారిషస్ గవర్నర్ జనరల్ సర్‌వీరాస్వామి రింగడు, ప్రధానమంత్రి సర్ అనిరుద్ జగన్నాథ్ విచ్చేశారు. వారిని మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలుకుతూ వేదిక మీదకు తీసుకుని వచ్చారు.
దేవతారాధన సమయంలోనూ, వివిధ శుభ కార్యక్రమాల సందర్భంగానూ కొన్ని వందల ఏళ్ళ నుండి ఆంధ్ర దేశంలో అనూచానంగ ఉపయోగిస్తున్న నాదస్వర వాయిద్యాన్ని మారిషస్ వారు గుర్తు పెట్టుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం హర్షించ తగిన విషయం.
మారిషస్ తెలుగు ఆడపడుచులు 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' అనే ప్రార్ధనాగీతం ఆలపిస్తూండగా సభాకార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తరువాత వేద మంత్రాలు పఠించటం జరిగింది.
మారిషస్ ఆంద్ర మహాసభ అధ్యక్షులు శ్రీ పుష్పరాజ్ సూరయ్య "మా పిలుపు స్వీకరించి వచ్చినందుకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అంటూ స్వాగతం పలికి సభారంభం చేశారు.
అటు పిమ్మట శ్రీ సూరయ్య మారిషస్ తెలుగు వారి వలస, ప్రస్తుత స్థితి గతులు వివరించి, 1981లో మలేషియాలో జరిగిన ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలో తీసుకున్న నిర్ణయాన్ని మారిషస్ ప్రభుత్వ సహకారంతో ఈ నాటికి నెరవేర్చగలిగామని ఆనందాన్ని ప్రకటించారు.
150 సంవత్సరాల క్రితం వివిధ దేశాలకు పలురకాల కారణాల వలన వలస వెళ్ళిన తెలుగు వారు తమ మాతృభాష నిలుపుకునే కృషిని తెలుసుకునేటందుకు ఈ మహాసభలు సహకరిస్తాయని అన్నారు.
మారిషస్ ప్రధాని మాన్య శ్రీ అనిరుద్ జగన్నాధ్ మహాసభలను లాంఛనంగా ప్రారంభిస్తూ -'వివిధ దేశాల నుండి పెద్ద సంఖ్యలో వ్యయప్రయాసల కోర్చి మహాసభలో పాల్గొనేటందుకు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తమ దేశం తరలి వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్త పరిచారు. తెలుగు భాష గొప్పతనాన్ని ఇది చాటుతుందని ఆయన అన్నారు. మారిషస్ దేశ ప్రగతికీ, అభ్యున్నతికీ తెలుగు వారు చేసిన అసమాన కృషిని ఆయన ప్రస్తుతించారు.
తెలుగు భాషా సంస్కృతుల అభ్యున్నతికి తమ దేశం పూర్తి తోడ్పాటు నందిస్తుందని తెలిపారు. మారిషస్‌లో హిందీ మాట్లాడే వారి స్థానంతరువాత తెలుగు వారిదేనని వెల్లడించారు. మారిషస్‌లో విభిన్న మతాలూ, భిన్నమైన సంస్కృతులూ, జాతులకు చెందిన ప్రజలు నివశిస్తున్నారని, వారి వారి భాషా సంస్కృతులను కాపాడు కోవటానికి వారు చేసే ప్రయత్నాలకు తమ ప్రభుత్వం తగు ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు.
తెలుగు వారు జరుపుకునే తెలుగు సంస్కృతికి దర్పణమైన 'మహారామ భజనం', 'సింహాద్రి అప్పన్న పూజ' 'అమ్మోరి' పండుగలకు ప్రభుత్వ పరంగా సహకారం లభిస్తుందని చెప్పారు. 1950 సంవత్సరపు మారిషస్ ప్రభుత్వ విధానానుసారం దేవాలయ నిర్మాణానికి సబ్సిడీలూ, పండుగలకు ప్రోత్సాహాలు మాతృభాషల అభ్యాసానికి బోధనావకాశాలను కల్పించి సంస్కృతీ పరిరక్షణకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు.
భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలు మహోన్నత మైనటువంటివని ఆయన కీర్తిసూ హిందూ సంస్కృతి కాలాన్ని అవరోధాన్ని అధిగమించి నిరంతర ప్రవాహంగా సాగుతుందని, ఇతర సంస్కృతులతో పాటు శక్తివంతమై అన్ని సంస్కృతులను గౌరవించే మారిషస్ సమాజ స్థాపనకు హిందూ సంస్కృతి దోహదకారైందని అన్నారు.
భారతీయ సంస్కృతీ వైభవ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తెలుగు వాడు కావటం తెలుగు వారి గొప్పతనానికి నిదర్శనం అని ప్రధాని శ్రీ జగన్నాధ్ అభిభాషించారు.
తెలుగు మహాసభలు మారిషస్‌లోని విభిన్న సంస్కృతీ విధానాన్ని మరింత పెంపొందించి శాంతియుత సౌభ్రాతృత్వ సహజీవనానికి తోడ్పడి ప్రపంచ వ్యాప్తంగా మారిషస్‌కి ఉన్న ఖ్యాతిని దృఢపరుస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని శ్రీ జగన్నాద్ వ్యక్తం చేశారు. మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, శ్రీమతిఏదే.వి.నృశింహులు ఆనందన్ వ్రాసిన 'ది ప్రిమోర్డియల్ లింక్ తెలుగు ఎధినిక్ ఐడెంటిటి ఇన్ మారిషస్' అనే సిద్ధాంత గ్రంధాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ప్రచురించిన ఈ గ్రంధం మారిషస్ తెలుగు వారిపై చక్కని అధ్యయనం.
సర్ వీరాస్వామి రింగడు ప్రసంగిస్తూ మారిషస్ సమాజంలోని ప్రతి వర్గానికి తమ సాంస్కృతిక వారసత్వం కాపాడుకోటానికి, తమ భాషాభివృద్ధి చేసుకోటానికి అవకాశాలు కలిగించాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతిని గురించి మరుగుపడి ఉన్న కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకు రావటానికి సభలు దోహదపడగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు మారిషస్ జీవన విధానంపై తగిన అవగాహన కలగటానికి ఈ సభలు ఉపకరిస్తాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్కృతీ వ్యవహారాల డైరెక్టర్ శ్రీ సి.వి.నరిశింహారెడ్డి రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణకాంత్, ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పంపిన సందేశాలను చదివి వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వర్గ నాయకుడు, తెలుగు విశ్వవిధ్యాలయ వైస్ ఛాన్సలర్ డా॥ సి.నారాయణరెడ్డి కీలకోపన్యాసంలో తెలుగు భాషా విశిష్టతను సోదాహరణగా వివరించారు. తన సహజ సిద్ధమైన ప్రసంగ శైలిలో మధ్య మధ్య తెలుగు పద్యాలు ఉటంకిసూ అంత్యప్రాసల నొక్కులతో వినిపించి సభికులను అలరించారు. 'త్యాగరాజ కీర్తన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు' రాగయుక్తంగా డాక్టర్ నారాయణ రెడ్డి ఆలపించారు. సభాప్రాంగణం కరతాళధ్వనులతో మారుమ్రోగింది. 'ఇంతింతై వటుడింతై...బ్రహ్మాండాంత సంవర్ధియై' అన్నట్లు మనకళ్ళెదుటే త్రివిక్రరూపం దాల్చిన డాక్టర్ నారాయణరెడ్డి జీవితంలో మారిషస్ సభలు మరో మధుర ఘట్టం.
దక్షిణాఫ్రికా ప్రతినిధి వర్గపు నాయకుడు శ్రీ నాయ్డు 'దండమయూ విశ్వంబర...' అనే పద్యంతో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగు భాష పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు ఆయన ప్రసంగంలో ప్రస్పుటించాయి. తెలుగు మహాసభల నిర్వహణకు సహాయంగా 5000/- ల విరాళం శ్రీ నాయుడు అందచేశారు.
మలేషియూ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీపాల్ నాయ్డు కూడా ప్రసంగించారు. భారతప్రభుత్వ ప్రతినిధి, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి జమునా రమణారావు ప్రసంగిస్తూ "తెలుగు మహాసభల నిర్వహణకు పూనుకున్న మారిషస్ ప్రభుత్వాన్ని అభినందించారు. ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాధ్ సారధ్యంలో మారిషస్ శీఘ్రగతిని అభివృద్ధి పధం వైపు పయినించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారత ప్రతినిధిగా పార్లమెంటు సభ్యురాలిగానే కాకుండా ఒక కళాకారిణిగా ఈ మహాసభలలో పాల్గొనటం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతా సూచకంగా ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాధ్‌కు పెంబర్తి నెమలి బొమ్మను, గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడుకు కొండపల్లి బొమ్మలను శ్రీమతి జమున బహుకరించారు.
ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణా రధసారధిగా మహాసభలలో సన్మానించబడిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ "ప్రపంచంలోని తెలుగు వారందరి మధ్య మరింతగా సన్నిహిత సంబంధాలు నెలకొనటానికి మహాసభలు తోడ్పడతాయనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. విదేశాలలోని తెలుగు ప్రజల భాషా సంస్కృతుల పరిరక్షణకు చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడ్పాటునందించ వలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మారిషస్ మహాసభలకు స్పూర్తినిచ్చిన స్వర్గీయ కృష్ణంరాజు సేవలను సంస్మరించి జోహార్లు అర్పించారు.
మహాసభలను దిగ్విజయంగా నిర్వహించిన మారిషస్ ప్రభుత్వానికీ, 'మారిషస్ ఆంధ్ర మహాసభకు శ్రీ కృష్ణారావు కృతజ్ఞతాభి వందనాలు తెలియచేశారు. నేషనల్ ఆర్గనైజేషన్ కమిటీ ఛైర్మన్, మారిషస్ విద్యామంత్రి శ్రీ ఆర్ముగం పరుశురామన్ మాట్లాడుతూ-"మారిషస్‌లో నివశిస్తున్న విభిన్న జాతుల ప్రజలు తమ పూర్వీకుల భాషా సంస్కృతులను కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందనీ, అందులో భాగంగానే తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ప్రభుత్వం పూనుకున్నదనీ అన్నారు."
మారిషస్‌లో గతంలో ప్రపంచ హిందీ మహాసభలు, తమిళ మహాసభలు జరిగాయని, రాబోయే సంవత్సరాలలో మరాఠీ, ఉర్దూ, చైనీస్, ప్రపంచ మహాసభలు నిర్వహిం చనున్నామని తెలిపారు, తెలుగు భాషకు తమ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని, 700 మంది తెలుగు విద్యార్థులు సి.పి.పరీక్షలకు, 20 మంది హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. 1962 నుంచి ప్రభుత్వం ఉగాది పర్వదినాన్ని జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోందని తెలియచేశారు.
శ్రీ పరుశురామన్ తమ ప్రసంగం ముగింపులో తెలుగులో ప్రసంగిస్తూ- "ఎంతో త్యాగం చేసి మన పెద్దలు తెలుగు భాషని కాపాడినారు, తెలుగు భాష తీయనిది. శ్రీ కృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స' అన్నారు.
పాశ్చాత్యులు "ఇటలీయన్ ఆఫ్ ది ఈస్ట్" అన్నారు. ఇంతగొప్ప భాష మారిషస్లో ఉన్నందుకు సంతోషిస్తున్నాం" అంటూ కరతాళధ్వనుల మధ్య తమ ప్రసంగం ముగించారు.
తెలుగు బిడ్డడు, మారిషస్ ప్రభుత్వ ఇంధన జల వనరుల, తపాలాశాభా మాత్యులు శ్రీ మహేన్ ఉచ్చన్న తెలుగులో మాట్లాడారు. ఆయన తమ ప్రసంగంలో—"ఈనాడు ఈ సభలు మనదేశంలో జరుగుతున్నాయంటే తెలుగు వాళ్ళం చాలా సంతోషిస్తున్నాం’ అని ఆనందం వ్యక్తం చేశారు.
- మారిషస్ తెలుగు వారి వలస - ప్రదర్శన
మారిషన్ లో తెలుగువారి వలస (Telugu Settlement in Mauritius) పై ఏర్పాటు చేసిన ప్రదర్శనను గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు ప్రారంభించారు.
మారిషస్‌కు తెలుగు వారు ఎప్పుడెప్పుడు వలస వచ్చిన వివరాలు తెలిపే చార్టులు, రికార్డులు, ఆనాడు వారు తమతో తీసుకుని వెళ్ళిన వస్తువులు, ఆభరణాలు, వంటపాత్రలు, రోళ్ళు, రోకళ్ళు, పుస్తకాలు సేకరించి ప్రదర్శనలో ఉంచారు.
ప్రస్తుతం మన దగ్గరున్న సాక్ష్యాధారాలను బట్టి ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.ఆ మరుసటి సంవత్సరం 1836 లో గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు కష్టజీవులుగా ఆ ద్వీపంలో కాలుపెట్టారు.
'కోరంగి' రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు కోరంగివాళ్ళు అనేపేరు వారికి వచ్చింది. (కోరంగిరేవు కాకినాడ సమీపాన ఉంది). వారు మాట్లాడే తెలుగు భాషకు 'కోరంగి భాష' అని పేరు పెట్టారు. 1843 సంవత్సరంలో దాదాపు 35 ఓడల్లో భారతీయులు మారిషస్‌కు వలస వచ్చారు. వారిని తీసుకుని వచ్చిన ఓడల పేర్లు సిటీ ఆఫ్ లండన్, కింగ్ స్టన్, ఫ్లవర్ ఆఫ్ ఉగీర్, సుల్తాన్, సిరంగపట్నం, బాబా బ్రాహ్మిన్, కోరంగి పికేట్ మొదలైనవి. వీటిలో కోరంగి పికేట్ తెలుగు వారిది. దాని యజమాని పేరు పానముండ వెంకటరెడ్డి. 231 టన్నుల బరువు కల ఆ ఓడ నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ. కాకినాడ దగ్గర కోరంగి రేవు నుండి బయలుదేరి ఆ సంవత్సరం రెండు సార్లు తిరిగి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.
1842 జనవరి 15న ఆర్డర్ ఇన్ కౌన్సిల్ జారీ చేసిన ఇండియన్ చార్ట్ లేబర్ సిస్టమ్ (Indian Chart Labour System) అనుసరించి మద్రాసు ప్రెసిడెన్సీనుంచి 3 లేక 5 సంవత్సరాల కాంట్రాక్టు పద్ధతిలో తెలుగు వారు అధిక సంఖ్యలో మారిషస్‌కు తరలి వచ్చారు. అలా దాదాపు 20 వేల మంది తెలుగువారు మారిషస్‌కు వచ్చి స్థిరపడ్డారు.
మారిషస్‌కు వచ్చేటప్పుడు వారు ఎంతో ఆశాపూరితంగా వచ్చేవారు. కానీ పోర్టులూయిస్ చేరుకుని వలస కేంద్రం యొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడే వారు ఏదో విషవలయంలో చిక్కుకున్నట్టు బాధపడేవారు. మానసికంగానూ, శారీరకంగానూ వారు బాధలు పడటానికి మారిషస్ వచ్చినట్టు తెలుసుకునేవారు. ఈ కాందిశీకులు బలోపేతమైన ఇనుప తీగల నడుమ రెండు రోజుల పాటు గడపవలసి వచ్చేది. అటుపిమ్మట వారిని పంచదార ఎస్టేటుకి పంపేవారు. వలస మెట్లు ఆనాటి ఓడల ఫోటోలు ప్రదర్శనలో పెట్టారు. సముద్రంలో ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని వారు ఓడలో ప్రయాణం చేసేవారు. మారిషస్‌లో కాలుపెట్టిన తరువాతే వారు బ్రతుకు జీవుడా అనుకునేవారు.
మార్గమధ్యంలో సముద్రయానంలోనే అనారోగ్యానికి గురై, ప్రకృతి వైపరీత్యాలకుగురై ఎందరో అసువులు బాసేవారు. 1859 సంవత్సరంలో 485 మంది ఉన్న షాజహాన్ అనే ఓడ నిప్పంటుకుని అందులోని ప్రయాణీకులందరూ సజీవదహనమై పోయారట. అలాంటి విషాద సంఘటనలకు దారిలో ఎందరో బిలి అయ్యారు.
1835 నుంచి తెలుగువారి వలస ప్రారంభం అయినా 1843 వరకు వచ్చిన వారిలో స్త్రీలు లేకపోవటం విశేషం. 1843 లో 88 మంది, 1844 లో 20 మంది మహిళలు వచ్చారు. తిరిగి 1851 లో 66 మంది స్త్రీలు వచ్చారు. తరువాత సంవత్సరాలలో పురుషులతో బాటు స్త్రీలు కూడా రావటం ప్రారంభించారు.
150 సంవత్సరాల క్రితం మన తెలుగు మహిళలు ధరించిన రకరకాల వెండి, బంగారు ఆభరణాలు ప్రదర్శనలో తిలకించాము. అప్పటి మన ఆంధ్రుల వేషధారణ, తలకట్టు, మీసకట్టు, క్రాపులు, జడలు ఫోటోలలో తిలకించాము. ఆనాడు వారు తమతో తీసుకు వెళ్ళిన రోళ్ళు, రోకళ్ళు, వంటపాత్రలు ప్రదర్శనలో చూశాము.
మారిషస్ ఆంద్రుడు జి.రెడ్డిలక్ష్ముడు తమ పూర్వీకుల వలసను గురించి ఈ క్రింది కవితను వ్రాశారు.
మంచి రోజుల కోసమేమో
ఇల్లు నాలిని బంధుకోటిని
వీడుకున్న కూలీరైతులు
దేశగడపను దాటినారే
గమ్య మెరుగక గతి తెలియక
ఆంధ్ర పుత్రులు అంధంలోన
పొట్ట చేతన పట్టుకున్న
పరదేశ ప్రయాణ మేసే
గంజినీళ్ళు కడుపునింపే
కలిమిలేక చెలిమిలేక
సాహసంతో సాగరంలో
చేరినారొక స్వర్ణభూమి
కూలిఘట్టాన కాలు పెట్టిన
దిక్కులేని దయనీయులై
మాతృభూమిని మరువలేక
మెప్పుపొందే మారిషస్లో
ఇల్లు నాలిని బంధుకోటిని
వీడుకున్న కూలీరైతులు
దేశగడపను దాటినారే
గమ్య మెరుగక గతి తెలియక
ఆంధ్ర పుత్రులు అంధంలోన
పొట్ట చేతన పట్టుకున్న
పరదేశ ప్రయాణ మేసే
గంజినీళ్ళు కడుపునింపే
కలిమిలేక చెలిమిలేక
సాహసంతో సాగరంలో
చేరినారొక స్వర్ణభూమి
కూలిఘట్టాన కాలు పెట్టిన
దిక్కులేని దయనీయులై
మాతృభూమిని మరువలేక
మెప్పుపొందే మారిషస్‌లో
మారిషస్‌కి వలస వచ్చిన తెలుగువారు ఐశ్వర్య సంపదలతో తరలి రాలేదు. కేవలం శ్రమజీవులుగా వచ్చి కాయకష్టంతో తమ జీవితం గడుపుకుని మారిషస్ అభివృద్దికి పాటుపడ్డారు.
ఆనాడు రాళ్ళు రప్పలతో నిండిన మారిషన్‌ని నేడు అధునాతన దేశంగా రూపుదిద్దుకోవడం వెనుక మనశ్రమజీవుల స్వేద బిందువులున్నాయి. ఆ దేశంలో "చెట్టుకొట్టి. మెట్టతవ్వి...కంపపొదల నరికి కాల్చి పుడమిదున్ని పండించిన మొదటివాడు తెలుగువాడు". మారిషస్‌కు తెలుగువారి వలస, స్థిరపడటం గురించిన ప్రదర్శన ఆనాటి స్థితిగతులను కళ్ళకు కట్టించి చూపించింది.
ఆ ప్రదర్శనతో పాటు మారిషస్ ఆంధ్ర పడుచుల తెలుగు వంటకాలపై ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి తెలుగు వంటకాలైన గారెలు-బూరెలు మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. తెలుగు వంటకాలు తయారు చేయు విధానం వివరించే ఇంగ్లీషులో చక్కటి పుస్తకాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు, తెలుగు విశ్వ విద్యాలయం వారు 'తరతరాల తెలుగు జాతి' ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
మారిషస్‌లోని తెలుగు ఉపాధ్యాయులు తెలుగు భోధనపై ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన అశోకా బుక్ సెంటర్ యజమాని శ్రీ అశోక్ కుమార్ పుస్తక, విక్రయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మారిషస్ ఆంధ్రులు ఈ ప్రదర్శనలోని పుస్తకాలూ, బొమ్మలూ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.
- సదస్సులు
ప్రారంభసభ ముగిసిన పిమ్మలు మధ్యాహ్నం 2 గంటలకు సదస్సులు ప్రారంభమైనాయి. సంస్కృతి-సమాజంపై జరిగిన సదస్సుకు శ్రీమతి ఎ.నృసింహులు ఆనందన్ అధ్యక్షత వహించారు.
'సంస్కృతి-సమాజ సంబంధాలు ' గురించి తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రారు డా॥ శివరామమూర్తి, "మారిషస్‌కు తెలుగువారి వలస-స్థిరపడటం" గురించి శ్రీమతి ఎస్.ఎన్.గయిన్, కుమారి పి.గోపాలు(మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్) 'దక్షిణాఫ్రికాలో తెలుగువారి సేవలు'అనే అంశం గురించి శ్రీ వి.కె.నాయ్డు ప్రసంగించారు.
మారిషస్‌కు తరలి వచ్చిన తెలుగువారు తమ మాతృభాష, సంప్రదాయ పరిరక్షణకు చేసిన కృషి, సముద్రతీరాన ఇసుక తిన్నెలో తెలుగు అక్షరాలు వ్రాసి తమ పిల్లలకు నేర్పిన విధానం, పూజా పునస్కారాల విధులు తెలియనప్పటికీ ఆచార వ్యవహారాలను కాపాడుకున్నరీతులు, రామభజనం, సింహాద్రి అప్పన్న పూజ, అమ్మోరు పండుగల ద్వారా తమ పూర్వీకుల సంస్కృతీ సంప్రదాయాలు కాపాడిన విధానం సదస్సులో పలువురు వక్తలు తమ ప్రసంగాలలో ప్రస్తావించారు.
సదస్సులో దక్షిణాఫ్రికా ప్రతినిధులు ఉత్సాహంతో పాల్గొన్నారు. వారంతా ఒక మిలటరీ డిసిప్లిన్ పాటిస్తున్నట్టు కన్పించేవారు. హోటల్లో కూడా వారెంతో క్రమశిక్షణతో కలసికట్టుగా తమ బృందపు నాయకుడి ఆదేశానుసారం నడుచుకునేవారు. అందరూ సూట్లు ధరించి 'ఓం' అని వ్రాసిన దక్షిణాఫ్రికా ఆంధ్రమహాసభ ఎంబ్లం ముద్రించిన టైలు కట్టుకుని తిరిగేవారు. మా కెవరికైనా వారు ఎదురైతే రెండు చేతులుజోడించి మందహాసంతో 'నమస్కారం' అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.
- దక్షిణాఫ్రికా సమాజాభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర
దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ వి.కె.నాయ్డు దక్షిణాఫ్రికా సమాజాభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర గురించి తొలిసదస్సులో ప్రసంగించారు. ఆ ప్రసంగం లో తెలిపిన విశేషాలివి -
నేటాలులో 1824లో స్థావరమేర్పరుచుకున్న బ్రిటిష్ వారు అక్కడ తేయాకు, ప్రత్తి, చెరకు తోటలను పెంచటం ప్రారంభించారు. 1855 సంవత్సరానికల్లా చెరకు వ్యవసాయం చాలా సులభం అని కనిపెట్టారు. కాని వారికెదురయిన సమస్య నమ్మకస్తులయిన వ్యవసాయ కార్మికులు దొరకడం.
1855 వ సంవత్సరంలో మారిషస్‌లో చెరకు వ్యవసాయదారులుగా ఉన్న మిల్లన్ సోదరులు నేటాలు వెళ్ళారు. వారితోబాటు బాబునాయుడు అనే ఆంధ్రుణ్ణి తీసుకుని వెళ్ళారు. వారే మొదట ఇండియా నుండి కట్టుబడి కూలీలను తేవాలనే ప్రతిపాదనకు నాంది పలికారు. సుదీర్ఘ చర్చల అనంతరం భారత ప్రభుత్వం కట్టుబడి కూలీలను దక్షిణాఫ్రికాలో ప్రవేశానికి అనుమతి నిచ్చింది.
1863 సంవత్సరానికల్లా 4000 మంది మద్రాసు నుండి, 1200 మంది కలకత్తా నుండి దక్షిణాఫ్రికాకు వలస వెళ్ళారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి వలస వచ్చిన వారిలో 40% ఆంధ్రులు, ప్రధమంలో చెరకు పరిశ్రమ ఆంధ్రులపై ఎక్కువ ఆధారపడి ఉండేది.
తెలుగు వలసదారులలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, పోర్టర్లు గుమస్తాలు, పశుపాలకులు, నావికులు, పోలీసులు, చాకలి పనివారు, రొట్టెల తయారీ దారులు ఉండేవారు. కాని ఆంధ్రులలో ఒక గుణ విశేషం ఉంది. వారు నిస్తేజులు కారు. కట్టుబడి కూలీల నుండి విముక్తులు కాగానే వారి తెలివితేటలు, చొరవతో వ్యవసాయదారులు కాగలిగారు, ఆంధ్రులలో బడా అరటిపండ్ల ఎగుమతిదారులు కూడా ఉన్నారు. పి.యమ్.నాయ్డు, రెడ్డి నాయ్డు బ్రదర్స్ చక్కెర మిల్లులకు చెరకు సరఫరా కోటా పర్మిట్లు ఉన్న చెరకు వ్యవసాయదారులు భాగ్యవంతులేకాక తెల్లవారితో సరితూగగల నైపుణ్యంతో వీరు వ్యవసాయక్షేత్ర నిర్వహణ జరిపారు.
1930 శకంలో సి.రెడ్డి, చిననాయుడు చెరకుతో పాటు టమోటాలు, చిక్కుళ్ళు, శనగలు సేధ్యం చేసేవారు. 1930-1940 సంవత్సరాల మధ్య కాలంలో 70 శాతం చిల్లర వ్యాపారం ఆంధ్రుల చేతిలో ఉంది.
పెట్టెల తయారీ పరిశ్రమ, ఇంటిసామాగ్రి తయారీ పరిశ్రమ, మట్టికుండల తయారీ పరిశ్రమ కూడా ఆంధ్రులు స్థాపించారు. పెరుమాళునాయ్డు, బంగారుచెట్టి నగల తయారీ పరిశ్రమలో ప్రముఖులు.
ఆంధ్రులు 1960 దశకంలో బట్టల, తోళ్ళ, వ్యాపార, ముద్రణ పరిశ్రమల్లోకి చొరబడ్డారు.
భారతీయ విధ్యాబోధనలో ఆంధ్రులు విశిష్టమైన పాత్ర నిర్వహించారు. భారతీయ పాఠశాలల్లో చాలామంది ఆంధ్రా అధ్యాపకులు ఉన్నారు. విద్యాశాఖలో కూడా చాలా మంది ఆంధ్రులు ఉన్నారు. ఆర్ధికశాస్త్రంలో ప్రధమంగా పట్టభద్రుడైన మొదటి ఆంద్రుడు వి.సర్కారినాయ్డు, మొట్టమొదటి మహిళా డాక్టర్ డా॥ కె.గునమ్. ఆర్.ఎస్.నాయ్డు దక్షిణాఫ్రికా ఉపాధ్యాయ సంఘం మొదటి అధ్యక్షుడు.
1990 లో డర్బన్ వెస్ట్‌విల్ విశ్వ విద్యాలయంలో మొదటి భారతీయ లెక్చరరు ఆంధ్రుడయిన ఆచార్య జయరామరెడ్డి, డర్బన్ నగరంలో డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్‌గా డా॥ అనుషానాయుడు ఉన్నారు. న్యాయవాద వృత్తిలో జి.నాయ్డు ప్రముఖుడు.
ఇక రాజకీయ రంగంలో పి.కె.నాయుడు గాంధీజీకి కుడిభుజంగా పరిగణించబడేవాడు. హెచ్.వి.నాయ్డు ట్రేడ్ యూనియన్ నాయకుడు. ఆంధ్రులు నేటాల్ ఇండియన్ కాంగ్రెస్‌లోనూ, ప్రతిఘటనా ఉధ్యమంలోనూ ప్రముఖపాత్ర వహించారు. 'కొసాటు' కార్యదర్శి శ్రీ జి.నాయ్డు.
హోటలు, మద్యపానీయ పరిశ్రమలు బహిరంగ విధానం అమలు చేసినప్పుడు ఆంధ్రులు వెంటనే ఈ రంగాలలో చొరబడి ప్రాబల్యం సంపాదించారు. రవాణా రంగంలో, భవననిర్మాణంలో కూడా ఆంధ్రులు ప్రాబల్యం సంపాదించారు. ప్రజాజీవనంలోనూ, సాంఘిక సేవారంగంలో కూడా ఆంధ్రులు ఏమాత్రం వెనుకబడిలేరు. దక్షిణాఫ్రికా సమాజంలో ఆంధ్రులు చాలా తక్కువ భాగం అనటానికి సందేహం లేదు. త్రొక్కివేత నిబంధనలను అధిగమించి ఇతర భాషల్లో మాట్లాడే సమూహాలతో పాటువారూ సమాజంలో పైకి వెళ్ళడం వారికార్యదీక్షకు, పట్టుదలకు ప్రతీకలు. కార్యసిద్ధికై తపన, త్యాగనిరతి వారిజీవనవిధానంలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఆంధ్రులు వారి సంస్కృతిని కాపాడుకుంటూనే దక్షిణాఫ్రికా సమాజంలో అంతర్భాగం అయిపోయారు.
- గవర్నర్ జనరల్ గార్డెన్ పార్టీ
మారిషస్ గవర్నర్ జనరల్ సర్‌వీరాస్వామి రింగడు సాయంత్రం 5 గంటలకు తన అధికార నివాసమైన లిరిడూట్ (ఆశ్రయము) లో గార్డెన్ పార్టీ ఇచ్చారు. విశాలమైన పచ్చిక బయళ్ళతో, పూదోటలతో, జలాశయాలతో, పక్షుల కేంద్రాలతో నిండిన ఆ రాజప్రసాదం ప్రకృతి రమణీయతకు దర్పణ.
ఫ్రెంచ్ గవర్నర్ ప్రాంకోస్ మహెడిలాబొర్డ్‌నాస్ 1748 లో బ్రిటిష్ వారి దాడులనుండి మహిళలను, పసిపిల్లలను రక్షించడానికి లిరిడూట్ (ఆశ్రయము) నీర్మించాడట. దీని చుట్టూ కందకం, దానిపైన పైకిలాగే వంతెన ఉండేవట. డేవిర్ తరువాత వచ్చిన బౌల్‌డితోజర్ భవనము చుట్టూ పూతోటలను, వనాలను పెంచాడు. పూసిఅబ్ల్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడు ప్రపంచంలోనీ అన్ని ప్రాంతాల నుండి మొక్కలను చెట్లను తెప్పించి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాడు. ఫ్రెంచి పరిపాలనాదక్షునిగా పేరొందిన పియరి పావరి ఈ ఉద్యానవనాన్ని ప్రపంచంలో కెల్లా అతి సుందర నందన వనాలలో ఒకటిగా తీర్చిదిద్దాడు.
1778 లో ఈ భవనాన్ని పునర్నిర్మించారు. గవర్నర్ జనరల్‌గా నియమితుడైన కౌంటాడి సౌలాన్ ఈ భవనాన్ని తన అధికార నివాసంగా మార్చాడు. ఆ విధంగా "లిరిడూట్ గవర్నర్ జనరల్ నివాసభవనం అయ్యింది. ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ కూడా దీనిలో నివాసముండి దాని అభివృద్దికి తోడ్పడ్డారు.
1968 మార్చి 12 న మారిషస్ స్వాతంత్ర్యం పొందింది. సర్‌జాన్ పావరి చివరి బ్రిటిష్ గవర్నర్ స్వతంత్ర మారిషస్ మొదటి గవర్నర్. జనరల్ సర్ అబ్దుల్ రహమెన్ మహ్మద్ ఉస్మాన్. ఆయన అంతకు పూర్వం మారిషస్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సాహిత్యాభిలాషగల గొప్ప సంస్కారిగా పేరొందారు.
మారిషస్ సివిల్ సర్వీసుల అధిపతిగా పని చేసిన సర్ దేవేంద్రనాథ్ చోయిన్‌చె 1978 మార్చిలో ద్వితీయ గవర్నర్ జనరల్ అయ్యారు.
1983 లో మారిషస్ జాతిపితగా పూజించబడే సర్ శివసాగర్ రామ్ గులామ్ గవర్నర్‌జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్రోద్యమంలో ప్రముఖపాత్ర నిర్వహించిన రామ్‌గులామ్ 1968 నుండి 1982 వరకు ప్రధానమంత్రిగా మారిషస్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. దీర్ఘకాల అనారోగ్యం తరువాత 1985 డిశెంబర్ 15 న ప్రఖ్యాతి పొందిన ఈ నివాసంలోనే కన్నుమూశారు.
మారిషస్ నాలుగవ గవర్నర్ జనరల్‌గా స్వాతంత్రోద్యమంలో ప్రముఖపాత్ర నిర్వహించి, రామ్‌గులామ్ మంత్రి మండలిలో ఆర్ధికమంత్రిగ పనిచేసిన సర్ వీరాస్వామి రింగడు నియుక్తులైనారు.
లిరిడూబ్ లో ఇటీవల నిర్మించిన జలాశయాలు, పక్షుల కేంద్రము శ్రీ రింగడు ఏర్పరచినవే.
- పెద్దగద్దె నెక్కిన తెలుగుపెద్ద
సర్ వీరాస్వామి రింగడు తండ్రి తెలుగువాడు, తల్లి తమిళవనిత. తెలుగు భాషా సంస్కృతులపై ఆయన అపారమైన అభిమానం చూపుతారు. ఆంధ్ర విశ్వ విధ్యాలయం డాక్టరేటుతో తెలుగు బిడ్డడైన సర్‌వీరాస్వామి రింగడును సత్కరించింది.
సర్‌వీరాస్వామి రింగడు 1920 సంవత్సరంలో పోర్టులూయిస్‌లో జన్మించారు. పోర్టులూయిస్ గ్రామర్ స్కూలులోనూ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోనూ విద్యాభ్యాసం చేసి 1948 లో న్యాయవాది పట్టా పొందారు. 1956 లో పోర్టులూయిస్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత లెజిస్లేటర్ అసెంబ్లీ సభ్యులై కార్మిక, సమాజరక్షణశాఖామంత్రి(1959-64),విద్యాశాఖామంత్రి(1964-67), వ్యవసాయ, ప్రకృతి వనరుల మంత్రి(1967-68), ఆర్ధికశాఖామంత్రి(1968-82)గా బాధ్యతలు నిర్వహించారు.
1986 జనవరి 17 న గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు. 70 సంవత్సరాల వృద్దుడైన శ్రీ రింగడు నిరాడంబరుడు, సాధుస్వభావుడు. గార్డెన్ పార్టీకి వెళ్ళిన మాకు ఎదురువచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు శ్రీ రింగడు దంపతులు. మా నాన్నగారు గాంధీ ప్రతిమను శ్రీ రింగడుకు బహూకరించారు. మనరాష్ట్రం నుండి వెళ్ళిన కళాకారులతో కూడా ఆయన చాలా కలివిడిగా తిరిగి వారితో ఎంతో ఓపిగ్గా ఫోటోలు తీయించుకున్నారు. మారిషస్ దేశ మంత్రులు, అధికారులు, అనధికారులు వివిధ రంగాల ప్రముఖులు గార్డెన్ పార్టీకి వచ్చారు. తేనీటివిందు పూర్తయ్యాక లిరిడూబ్ వరండాలో మన కళాకారులు ప్రదర్శన లిస్తూంటే పచ్చిక బయళ్ళల్లో గవర్నర్ జనరల్‌తో బాటు వందలాది మంది ప్రముఖులు ప్రదర్శనలను తిలకించటం ఓ మధురానుభూతి. తెలుగు చలన చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా ఖ్యాతి గడించి రాజకీయ రంగంలో ప్రవేశించి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్‌సభలో అడుగిడి భారత ప్రభుత్వ ఏకైక ప్రతినిధిగా మహాసభలకు అరుదెంచిన శ్రీమతి జమున 'సత్యభామ' ఏకపాత్రాభినయం ఆనాటి ముఖ్యాంశం.
"శ్రీకృష్ణతులాభారం" సినిమాలో ' సత్యభామ'గా ఆంధ్రుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి జమునే సత్యభామ-సత్యభామే జమున అన్న భావన కలిగేలా చేశారు. రంగస్థలం మీద సత్యభామ పాత్రాభినయంలో శ్రీ స్థానం వారిది ప్రత్యేక స్థానం. ఆయన స్వయంగా రచించి అభినయించిన 'మీరజాలగలడా నా యూనతి..' పాట తెలుగునాట బహుళప్రసిద్ధి గాంచింది. చివరకు సినిమాల్లో కూడా ఆ పాట చిత్రీకరణ జరిగింది.
ఆ పాటను శ్రీమతి జమున ఆలపించి అభినయించారు. ప్రముఖ రంగస్థల ప్రయోక్త డా॥ గరికపాటి రాజారావు ఆశీస్సులతో రంగస్థల రంగం నుండి సినిమా రంగానికి తరలి వెళ్ళిన శ్రీమతి జమున తన మాతృ రంగమైన రంగస్థలాన్ని మరచిపోవక పోవటం విశేషం. ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల సమాఖ్య స్థాపించి అధ్యక్షురాలిగా ఉంటూ పేద, వృద్ధ కళాకారులకు ఎనలేని సహాయం చేసింది శ్రీమతి జమున. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షురాలిగా నాటక రంగ అభివృద్ధికి కృషి జరిపింది. తాను 'సత్యభామ' పాత్ర ధరించి శ్రీకృష్ణతులాభారం నాటకం ప్రదర్శించి సమాఖ్యకు ఆర్ధిక సంపత్తి సమకూర్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది.
సత్యభామలో సాక్షాత్కరించే స్వాభిమానం, సాహస ప్రవృత్తి జమునలో కానవస్తాయి. జమున అభినవ సత్యభామై తన నటనా చాతుర్యంతో మారిషస్ గవర్నర్ జనరల్ తదితర ప్రముఖుల ప్రశంసలను అందుకుంది.
గోపాలరాజ్ భట్ బృందం 'నెమలి నృత్యం', సంపత్ కుమార్ 'జాలరి నృత్యం', ఆచంట వెంకటరత్నం నాయుడు దుర్యోధనుడి ఏకపాత్రాభినయం, మిద్దేరాముల బృందం 'ఒగ్గు కధ' ఆనాటి కార్యక్రమాల్లో ముఖ్యాంశాలు.
గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడు కళాకారులను విడివిడిగా అభినందించి ఫోటోలు తీయించుకున్నారు. గార్డెన్ పార్టికి మా మారిషస్ మిత్రుడు శ్రీ త్యాగరాజ సోకప్పడు వచ్చాడు. శ్రీ త్యాగరాజు మారిషస్ నుంచి వచ్చి విజయవాడ లయోలా కాలేజీలో చదివి పట్టభద్రుడైనాడు. మాకు అత్యంత ఆప్తులు, బంధువులు అయిన విజయవాడ వాస్తవ్యులు శ్రీ అర్జారామారావుగారి అమ్మాయి లక్ష్మిని వివాహమాడాడు. వారికి ఒక అబ్బాయి. మేము మారిషన్ కు వచ్చే కొద్ది రోజుల ముందే శ్రీ అర్జా రామారావుగారి సతీమణిహృద్రోగంతో హఠాత్తుగా మృతిచెందారు. తల్లి శ్రాద్ధకర్మలకు శ్రీమతి లక్ష్మీ రాలేకపోయింది
శ్రీ త్యాగరాజ్ మారిషస్ గణాంక శాఖలో పనిచేస్తున్నారు. శ్రీ త్యాగరాజ్ తో కలసి వారింటికీ వెళ్ళి శ్రీమతి లక్ష్మిని పరామర్శించి విజయవాడ విశేషాలు తెల్పాము. త్యాగారాజ్ ఇటీవలె చక్కటి డాబా ఒకటి నిర్మించుకున్నారు.
ఆ రోజు రాత్రి రామసుందర్ ప్రయాగ్ లోని స్టేట్ సెకండరీ స్కూల్లో మన సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలు జరిగాయి. మన కళాబృందాలు రెండు భాగాలుగా చీలి మారిషన్ లోని గ్రామప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రయాగలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలకు ఆ ప్రాంతంలోని తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరయినారు. మహిళలు తిలకం దిద్ది సాదరంగా ఆహ్వానించారు.
ఆనాటి సాంస్కృతిక ప్రదర్శనల్లో మలేషియా తెలుగు కళాకారుడు శ్రీ గణేశన్ భరతనాట్య ప్రదర్శన కనువిందు చేసింది. మలేషియాలోని తెలున్ ఇన్ టాక్ లోజన్మించిన శ్రీ గణేషన్ ఉన్నత విద్యాభ్యాసానికి మద్రాసు వచ్చి, తనలో నిగూఢంగా ఉన్న కళాప్రతిభ వెన్నుతట్టగా కలైమణి కె.జె.సరస వద్ద భరతనాట్యం అభ్యసించారు. భారతదేశంలో ఉన్న 8 సంవత్సరాలలో భరతనాట్యంలోనూ, కర్నాటక సంగీతం లోనూ నిష్ణాతులైనారు. దక్షిణభారతదేశంలో పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. నాట్యాచారుడై సినీనటి రోహిణికి గురువైనారు. మలేషియా తెలుగు అసోసియేషన్ తమ ప్రతినిధి వర్గంలో ఒక ప్రతిభావంతుడైన కళాకారుడును తీసుకురావటం ముదావహం.
రిటైర్డు తెలుగు ఉపాధ్యాయుడు శ్రీ సోమన్న సోమయ్య ఆ గ్రామస్ధుడు. తెలుగు అంటే ప్రాణం కంటే అధికం ఆయనకు. అంతర్జాతీయ తెలుగు సంస్థ మారిషస్ తెలుగు ఉపాధ్యాయులకు రిఫ్రెషింగ్ కోర్స్ హైద్రాబాద్ లో నిర్వహించినప్పుడు ఆయన మన రాష్ట్రానికి వచ్చారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా వచ్చారు. అప్పటి నుంచి వారు మాకు ఆత్మీయులు అయ్యారు. శ్రీ సోమయ్య మమ్మల్ని వారింటికి తీసుకుని వెళ్ళారు. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఎదురుగా శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి రంగుల ఫోటో గోడకు అలంకరించబడి ఉంది. ఒక్క క్షణం ఆశ్యర్యం-ఆనందం మా మనసుల్ని ముసురు కొన్నాయి.
శ్రీ పట్టాభి ఫోటో మాకే దొరకటం లేదు, మీకెలా లభ్యం అయ్యిందని ప్రశ్నిస్తే 1948 లో శ్రీ పట్టాభి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. ఆ ఉన్నత పీఠాన్ని తెలుగు వాడైన పట్టాభి అధిరోహించటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. అప్పుడా మహనీయుని చిత్రాన్ని ఇండియా నుంచి తెప్పించుకుని ఇంట్లో అలంకరించుకున్నాను అని శ్రీ సోమయ్య చెప్పారు.
మారిషస్ తెలుగు ప్రముఖుల్లో శ్రీ సోమయ్య చక్కగా తెలుగు మాట్లాడాడు. ఎదనంతా తెలుగు అభిమానం నింపుకున్న వ్యక్తి. శ్రీ సోమయ్య కుటుంబం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వెళ్ళటం వలన ఇంట్లో లేరు. ఆయనే పాలుకాచి, బిస్కెట్టు ఇచ్చి అతిధి మర్యాద చూపించారు. శ్రీ సోమయ్యకు రెండు చక్కని డాబాలు, కోళ్ళ ఫారం ఉన్నాయి.
హైద్రాబాద్ లో మతకల్లోలాలు రేగి చాలామంది చనిపోయినట్టు వార్తలు మారిషస్ లో ఉన్న మాకు తెలిసింది. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా హైద్రాబాద్ లోని శాంతి భద్రతల పరిస్థితి మమ్మల్ని ఆంబోళన పరచింది. శ్రీ సోమయ్యగారింటి నుంచి హైద్రాబాద్ కి ఫోన్ చేసి మా బావ డా॥ చంద్రశేఖర్ తో మాట్లాడిన తరువాత మా మనసులు కుదుట పడ్డాయి.
ఇటీవలి కాలంలో శాంతి సామరస్యాలతో విలసిల్లుతున్న హైద్రాబాద్ నగరంలో తిరిగి మతోన్మాద కరాళ రక్కసి విలయతాండవం చేసి దాదాపు 100 మందిని పాట్టన పెట్టుకోవటం-నగరం కర్ఫ్యూ నీడలో బోసి పోవటం" భయంలో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించబం సభ్యసమాజానికి సిగ్గుచేటు.
- 'భాష' సదస్సు
డిశెంబర్ 11వ తేదీన మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్లో సదస్సులు జరిగాయి. భాషపై జరిగిన సదస్సులో డా॥సి.నారాయణరెడ్డిగారు, శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు.
దక్షిణాఫ్రికాలో ఆంధ్రులలో తెలుగు భాషకు గల స్థానం గురించి శ్రీమతి వారిజా ప్రభాకర్ (దర్బన్ యూనివర్శిటీ, దక్షిణాఫ్రికా) ప్రసంగిస్తూ దక్షిణాఫ్రికాకు తెలుగువారి వలస 1860 లో ప్రారంభం అయ్యిందని, 1989 లో దేశజనాభాలో భారతీయులు మూడోశాతం ఉండగా దానిలో తెలుగువారు 10 వ శాతం ఉన్నారని తెలిపారు.
పిష్ మెన్ సిద్ధాంతం ప్రకారం వలసదారులు మొదటిదశలో తమ మాతృభాషద్వారా ఇంగ్లీషు నేర్చుకుంటారని, రెండవదశలో ఎక్కువమంది ఇంగ్లీషు నేర్చుకుని పరస్పర సంభాషణలలో ఇంగ్లీషు, మాతృభాష ఉపయోగిస్తారని, మూడవదశలో వలసదారులందరూ ఇంగ్లీషులోనూ, మాతృభాషలోనూ నిష్ణాతులవుతారని, నాలుగవదశలో ఇంగ్లీషు మాతృభాషను పూర్తిగా స్థానాంతరం చేస్తుందని, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తెలుగువారి పరిస్థితి నాలుగవ దశలో ఉందని శ్రీమతి వారిజా ప్రభాకర్ వివరించారు.
దక్షిణాఫ్రికా వలసదారులకు వారి ఆర్ధిక సామాజిక పురోగతికి జనసామాన్య భాషగా ఇంగ్లీషు నేర్చుకోవటం ఎంతో అవసరం. ఇంగ్లీషు తెలిసినవారు త్వరితగతిని ఆభివృద్ధి చెందుతున్నారు. వలసదారుల మాతృభాషకు సామాజికంగా ప్రాముఖ్యం లేనందువలన అంతా ఇంగ్లీషులోనే మాట్లాడుతూ, ఏకభాషా సంచాలకులుగా మారుతున్నారు. ప్రస్తుతము దక్షిణాఫ్రికాలో ఆంధ్రుల పరిస్థితి ఇదేనని శ్రీమతి వారిజా తెలిపారు.
అంతేకాక భారతీయ వలసదారులలో అల్పసంఖ్యాకులయిన తెలుగువారు, అధిక సంఖ్యాకులయిన తమిళులతో సాంఘిక సాంస్కృతిక కలయిక ప్రభావాల మూలంగా తమ ఉనికిని కోల్పోయి తమిళులతో విలీనం అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు.
దక్షిణాఫ్రికా ఆంధ్రులు తమ మాతృభాష పూర్తిగా అంతం కాకుండా కాపాడుకునేటందుకు మత, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కృషి చేస్తున్నారని, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడ్పాటు నందిస్తే దక్షిణాఫ్రికా ఆంధ్రులు తమ భాషా సంస్కృతులను కాపాడుకోవటానికి శక్తి వంచన లేకుండా కృషి జరపడానికి సంసిద్దులుగా ఉన్నారని శ్రీమతి వారిజా ప్రభాకర్ వివరించారు.
- మారిషస్‌లో తెలుగు భాషా వికాసం
'మారిషస్‌లో తెలుగు భాషావికాసం' గురించి శ్రీ రెడ్డిలక్ష్ముడు(మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్) సోదాహరణంగా వివరించారు. వారి ప్రసంగంలో కొన్ని విశేషాలు బొక్కెడు బువ్వతో ఎల్ల కష్టముల్ మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తులై పరిక, పుస్తకాలు లేకుండా పూర్వీకులు తాటాకులపై రాసి తెలుగు భాషను రక్షించి, బోధించారు. మారిషస్‌లో ఆంధ్రులు విరామ సమయంలో సముద్రతీరాన ఇసుకతిప్పలలో తెలుగు అక్షరాలు వ్రాసి తేనెలాంటి ఈ తెలుగు భాష తమ పిల్లలకి బోధించారని చెప్పారు.
తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలను ఆచరించి తెలుగు భాషలో అన్ని కార్యక్రమాలనూ చేసి రెక్కల కష్టాలతో ప్రచారం చేశారు. అట్లా ఈ దీవిలో తెలుగు భాష, తెలుగు సంస్కృతి తరతరాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
ఇక్కడకు వచ్చిన ఆంధ్రులు నూరుశాతం కష్టజీవులే. వాళ్ళకి తెలుగు భాషలో పాండిత్యం లేదు, పండితులు కారు, వాళ్ళు పురోహితులు కారు, పూజాకార్యక్రమ విధులు తెలియవు. వట్టి పామరులు, వాళ్ళు సహించిన బాధలు, పడిన కష్టాలు ఎవరితో మొరపెట్టాలని ఎంతతోచినా ఒక్క దేవుడి శరణం తప్ప ఎవ్వరూ కనపడలేదు.
రాత్రిపూట దేముడి పాదాలకు మొక్కి సింహాద్రి అప్పన్న పూజలతో, రామభజనలతో పాడటం జరుగుతుంది. భద్రాచలం రామదాసు కీర్తనలు, నృశింహస్వామి శతకం నుంచి పద్యాలు ఈ నాటికీ మారిషస్‌లో పాడుతూనే ఉన్నారు.
ఉగాది పండుగ గురించి మారిషస్ తెలుగు వాళ్ళకి 1950కి ముందు తెలీదని తోస్తోంది. తెలుగువాళ్ళ కార్యాలయాల్లో తెలుగుభాష ప్రతిబింబించేది. వేరేభాష తెలియని కారణంగా వాళ్ళు తమ పాస్ పోర్టులను కూడా అదే భాషలో వ్రాసి సంతకం చేశారు. ఇది 14-10-1847 నాటి ఒక పాస్ పోర్ట్‌లో కనిపించింది.
ప్రతీ ఏడు న్యూ ఇయిర్ సందర్భంగా నాటకాలు ప్రదర్శించేవారు. అవి రామనాటకం, వీరభద్రనాటకం. ఈ పౌరాణిక నాటక ప్రభావం వలనే తమకు పూజ చేయటం కోసం గుడి కావాలని, తమ నివాసం ఎదుట ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకుని ఒక గుడిగా మార్చుకున్నారు. 'రామలీలలు' కూడా ప్రదర్శన రూపంలో తెలుగు వాళ్ళు కొన్నిచోట్ల ప్రదర్శించారు.
1927 లో మారిషస్ తెలుగు అసోసియేషన్ అని ఒక సభ స్థాపించారు. ఇంతకు ముందు వ్యక్తిగతంగా భాషా ప్రచారం చేసినవాళ్ళు తెలుగు సభలో చేరి ఆ సభకు ఈ బాధ్యత ఇచ్చారు. చివరకు 1942లో మారిషస్ ఆంధ్రమహాసభ స్థాపించి దేశం నలుదిక్కులలో (MAMS) శాఖలు స్థాపించి సాయంత్రం తెలుగుభాష బోధన ఆరంభించారు. MAMS స్థాపనలో తెలుగువాళ్ళు ఉన్న ప్రదేశాలలో తెలుగు పాఠశాలలు, తెలుగు మందిరాలు కట్టుకునేందుకు తెలుగువాళ్ళు పూనుకున్నారు. 1972 నాటికి MAMS శాఖలు దేశంలో 59 ఉండేవి. 1990 నాటికి ఈ శాఖలు 75 కంటే ఎక్కువ ఉన్నాయి.
దేశంలో కొత్త కొత్త పరిశ్రమల స్థాపనలో అతివేగంగా వస్తున్న అభివృద్ధి వలన తెలుగు భాష అభ్యసనం కొంత తగ్గింది కాని - అభిమానం తెలుగువాళ్ళు పోగొట్టుకోలేదు. దానికి తోడ్పడి ప్రాణం ఇచ్చిన మహనీయుడు పండిత రామ్మూర్తి. ఆయన 1940వ సంవత్సరం నుంచి ఒక మతప్రచారకునివలె ఇంటింటికి వెళ్ళి యువకులను ఉత్సాహపరచి భాష భోదించారు. ఆయన 1960 చివరి వరకు ఈ కార్యక్రమం చేస్తూ పరమపదించారు. తరువాత పండిత ఒట్టు ఆంధ్రదేశంలో భాషాభ్యాసనం చేసి వచ్చి భాషాసేవకు అంకితం అయ్యారు. అలా ఆనాడు మా పూర్వీకులు తెలుగుభాష, సంస్కృతికి వేసిన పునాదులు ఈనాటి వరకు సుస్థిరంగా నిలిచిపోయాయి.
1954 సంవత్సరంలో రేడియో స్టేషన్ తొలిసారి తెలుగువాళృకోసం తెలుగుభాషలో ప్రసారం ఆరంభించింది. ఆదివారాలలో 15 నిముషాలే అయినా అది తెలుగువాళ్ళను చాలా ఆనందపరిచింది.
1958 సంవత్సరంలో ప్రాధమిక పాఠశాలల్లో తెలుగుపిల్లలకు తెలుగు భాషా బోధన ప్రభుత్వం ప్రారంభించింది. 1972 సంవత్సరంలో 52 సాయంత్రపు పాఠశాలల్లో తెలుగు బోధన జరుగుతూండేది.
బళ్ళో కావలసిన పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రభారతి వాచకాలు తెప్పించి ఇక్కడ మాపిల్లల స్థాయికి తగ్గట్టు ఉపయోగించటం జరిగింది. తత్ఫలితంగా ఇక్కడ యువకులైన తెలుగువాళ్ళు లిఖితభాషగా ఉన్న గ్రాంధికభాషనే భాషిత భాషగా సంభాషించేవారు. అప్పడు దేశంలో రెండురకాల తెలుగుభాషను మాట్లాడేవారు ఉన్నారు. ఒకరు మాండలీక సంబంధమైన తెలుగుభాషను మాట్లాడే ముసలివారు. మరొకరు గ్రాంధికభాషను నేర్చుకుని మాట్లాడే తెలుగు యువకులు. అది ఒక రకమైన గందరగోళానికి కారణమయ్యింది.
వ్యవహారిక భాషోద్యమానికి కన్యాశుల్కంతో గట్టిపునాది పడింది. ఆంధ్రాలోనే తెలుగుభాషలో గొప్ప మార్పు సంభవించటం వలన మారిషస్ దీని నుంచి తప్పించుకోలేకపోయింది.
1975వ సంవత్సరంలో I.T.E.C. EXPERTగా వచ్చిన వేటూరి ఆనందమూర్తిగారు ఇక్కడ భాషా బోధనలో మార్పు తీసుకురావటం తప్పదని భావించి 1975 నుంచి అన్ని బళ్ళల్లో వ్యావహారిక భాషాబోధన ఉండాలని నిర్ణయం తీసుకుని తెలుగు వారికి సలహా ఇచ్చారు. అప్పట్నుంచి మా దేశంలో పిల్లలకు ప్రచురించే పుస్తకాలు గ్రాంధికభాషలో కాకుండా వ్యావహారికభాషలో ఉండేలా ఆయన వ్రాసి ఇచ్చారు. ఈ రోజు కళాశాలల్లో కూడా అన్ని పరీక్షలకు వ్యావహారిక భాషకు ప్రాధాన్యత ఇస్తున్నాం. 1989 సంవత్సరపు లెక్కల ననుసరించి మారిషస్‌లో ప్రస్తుతం తెలుగుభాష పరిస్థితి
1. | MAMS శాఖలలో తెలుగుభాషను బోధించే బళ్ళు | - | 40 |
2. | తెలుగును బోధించే ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు | - | 100 |
3. | తెలుగును బోధించే కళాశాలలు | - | 2 |
4. | ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల తెలుగు ఉపాధ్యాయుల సంఖ్య | - | 125 |
5. | ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో తెలుగుభాషను చదివే పిల్లలు | - | 4000 |
మారిషస్‌లో తెలుగుభాషా వికాసం గురించి శ్రీరెడ్డి లక్ష్ముడుగారి ప్రసంగం ఎంతో వివరణాత్మకంగా ఉండి మారిషస్ ఆంధ్రులు తమ భాషా సంస్కృతులను పరిరక్షించుకొనుటకు చేసిన కృషిని విశదపరిచింది.
ఇంకా ఆనాటి సదస్సులో తరతరాల తెలుగుజాతిని గురించి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రీ చల్లా రామఫణి, శ్రీ చంద్రశేఖరభట్టు జీవితవిశేషాలను గురించి డాక్టర్ సంగంభట్ల నరసయ్య ప్రసంగించారు.
ఆరోజు మధ్యాహ్నం జరిగిన కళాసంస్కృతి సదస్సుకు తెలుగువిశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డా॥ ఎన్. శివరామమూర్తి అధ్యక్షత వహించారు. ఆంధ్రీకరణపై డా టి.పి.నాయుడు(దక్షిణాఫ్రికా),మారిషస్‌లో మహిళల స్థానంపై శ్రీమతి ఎ.ఎన్. ఆనందన్ (మారిషస్), మారిషస్‌లో తెలుగు పండుగలు ఆచార వ్యవహారాలపై శ్రీ ఎస్.అప్పయ్య (మారిషస్), ఆంధ్ర మహాభారతంపై ప్రొఫెసర్‌గిరిప్రకాష్ (మధురై యూనివర్శిటీ) ప్రసంగించారు.
సదస్సులు ముగిసిన పిమ్మట మా నాన్నగారు, నేను, శ్రీ గోవాడ సత్యారావు, శ్రీ త్యాగరాజ్‌తో కలసి తదుపరి కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం కారులో బయలుదేరాం, ముందుగా పోర్టులూయిస్‌లోని మార్షియన్ పత్రికా కార్యాలయానికి వెళ్ళాం. శ్రీ సత్యారావు లోపలికి వెళ్ళి ఆనాటి సదస్సు వార్తా విశేషాల్ని వారికి అందచేసి వచ్చారు.
శ్రీ సత్యారావు ఉద్యోగరీత్యా చాలాకాలం ఢిల్లీలో ఉండటంవలన ప్రవాసాంధ్రుల సమస్యలపట్ల చాలా అనుభవం గడించారు. వారి సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కావటంచేత మారిషస్ యువకుడు శ్రీ త్యాగరాజ్‌తో కారులో మారిషస్ ఆంధ్రుల సమస్యల్ని గురించి చర్చించసాగారు, మారిషస్ ఆంధ్రులలో రెండు వర్గాలు ఉన్నట్లు వారి చర్చల వలన బోధపడింది. శ్రీ త్యాగరాజ్ మారిషస్ తెలుగు ఫెడరేషన్‌కు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చిన్నచిన్న విభేదాలు ఉన్నా వాటిని విస్మరించి భాషాభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాలని సలహా ఇచ్చాము.
మన ఆంధ్రుల సౌంస్కృతిక బృందంవారి ప్రదర్శనలు మారిషస్‌లోని సుదూర గ్రామాలైన మహేబర్గ్, సాయిలకలలో ఏర్పాలు చేశారు.
సూర్యాస్తమయం వేళ సముద్రతీరం వెంట కారులో పయనిస్తూ ప్రకృతి సౌందర్యవీక్షణలో ఆకాశంలోని సప్తవర్ణాలని తిలకిస్తూ మలయపవనాల్ని ఆస్వాదించటం ఒకమధురానుభూతి. దారిలో ఒకచోట కారాపి బీచ్‌లో కాసేపు ఆగాం. మారిషస్‌లోని బీచ్‌ల నిర్వహణ చాలా చక్కగా ఉంటుంది. సెలవు రోజుల్లో బీచ్ కిటకిట లాడిపోతూంటుంది.
ఆ రాత్రి 7.30 గంటలకు సాయిలకలోని వివేకానంద సెకండరీ స్కూలులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యాం. మారిషస్ పార్లమెంటు సభ్యులు, తెలుగుబిడ్డ శ్రీ కృష్ణబాలిగాడు స్వాగతం చెప్పారు. ప్రభుత్వపక్షానికి వ్యతిరేకి అయినప్పటికీ శ్రీకృష్ణబాలిగాడు తెలుగు మహాసభల నిర్వహణకు పూర్తి మద్దతునిచ్చి సహకరించటం విశేషం. బాలిగాడుపట్ల మన తెలుగువారు చాలా ఆదరభావం చూపుతారు.
రాత్రి 9 గంటలకు వాకోస్‌లో తెలుగు మహాసభల ప్రతినిధివర్గం గౌరవార్ధం మారిషస్ రక్షకదళం SMF వారు విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అనిరుద్ జగన్నాధ్ విందుకు విచ్చేసి విదేశీప్రముఖులైన శ్రీ మండలి వెంకట కృష్ణారావు శ్రీ రాజారెడ్డి, శ్రీమతి రాధారెడ్డి, శ్రీ నాయుడు (దక్షిణాఫ్రికా)లకు SMF పక్షాన మెమెంటోలను ప్రదానం చేసి సత్కరించారు. పలువురు మారిషస్ మంత్రులు, అధికారులు ఈ విందుకు హాజరయ్యారు.
పరిపాలనాదక్షుడుగా పేరుపొందిన ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాధ్ 1930 మార్చి 29న జన్మించారు. మారిషస్, ఇంగ్లాండులో విద్యనభ్యసించి 1956లో న్యాయవాదవ్పత్తి చేపట్టారు. 1960లో లెజిస్లేబర్ కౌన్సిల్ సభ్యునిగా, వాకోస్‌పోయి నిక్స్ పట్టణ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1965లో మారిషస్ అభివృద్ధిశాఖామంత్రిగా 1967లో కార్మికమంత్రిగా పనిచేశారు. తిరిగి న్యాయవాదవృత్తి చేపట్టి 1969లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా పనిచేశారు. 1971లో "మూవ్‌మెంట్ మిలిటెంట్ మారిషస్ పార్టీలో చేరి 1976 ఎన్నికల్లో పార్లమెంటుకి ఎన్నికై ప్రతిపక్షనాయకునిగా వ్యవహరించారు. 1982లో జరిగిన ఎన్నికల తరువాత MMMI P.S.M పార్టీలలో చీలికలు వచ్చాయి. శ్రీ జగన్నాధ్ మూవ్ మెంట్ మిలిటెంట్ పార్టీ స్థాపించి 1983, 1987లలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారు.
సౌమ్యుడు, నిరాడంబరుడు అయిన శ్రీ జగన్నాథ్ విదేశీ ప్రతినిధులతో ఎంతో సౌహార్దంగా వ్యవహరించారు. ప్రత్యేకించి మా నాన్నగారిని ఆయనెంతో గౌరవభావంతో చూశారు. MAMS విందులో ప్రముఖులకు మెమెంటోలు బహుకరించారు. అందరూ వెళ్ళి ఆయన వద్దనుంచి మెమెంటోలు స్వీకరించారు. మా నాన్నగారు వెళ్ళి ఆయనవద్ద నుంచి మెమెంటో తీసుకునేందుకు సిద్ధపడగా ఆయన వారించి తానే మా నాన్నగారి వద్దకు వచ్చి మెమెంటో అందచేశారు. అది వారి సౌజన్యానికి నిదర్శనం.
డిశెంబర్ 12వ తేది మహాసభల ముగింపురోజు. ఆరోజు ఉదయం పదిగంటలకు ఆచార్య గిరిప్రకాష్ అధ్యక్షతన 'విదేశాలలో తెలుగువారు' సదస్సు జరిగింది. దక్షిణాఫ్రికాలో ఆంధ్రుల చరిత్ర గురించి శ్రీ బి.ఎ.నాయుడు (దక్షిణాఫ్రికా), మారిషస్‌లో వేమన పద్యాల గురించి శ్రీ ఆర్. అప్పడు (మారిషస్), మారిషస్‌లో తెలుగు బోధన ప్రభావం గురించి శ్రీ సోమన్న సోమయ్య ప్రసంగించారు.
- మారిషస్‌లో తెలుగుబోధన
మారిషన్ లో తెలుగు బోధన గురించి రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీ సోమన్న సోమయ్య చేసిన ఉపన్యాసం గమనించతగ్గది. మారిషస్‌లో శ్రమజీవులుగా అడుగుపెట్టిన తెలుగువారు తమ భాషను నిలబెట్టుకునేందుకు ఏవిధంగా ప్రయత్నించారో వివరణాత్మకంగా శ్రీ సోమయ్య చెప్పారు. తెలుగుబోధన సమస్యల గురించి మనం కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రసంగంలోని కొన్ని ముఖ్యభాగాలు-
పూర్వ కాలపు బోధనకీ ఆధునిక కాలపు బోధనకీ చాలా తేడా ఉంది. ఉదాహరణంగా సుమారు అరవై సంవత్సరాల కింద సాయంత్రపు బడుల్లో ఇప్పుడు మాదిరిగా, బడులు దేవాలయాలు విడిగా లేవు. ఆ సమయాన దేవాలయం ఒక మూల బడి నడిపేవారు. బడులు దర్బా గడ్డితోనైనా, చెరకు ఆకులతోనైనా కప్పి యుండేవి. మా బడి విషయం అంటే నేలపై ఇసకలు వేసి, వాటిపె చేతి వేలితో రాసేవారు. అవి ఎలా మొదలు పెట్టేవారంటే : ఓం నమః శివాయః సిద్ధం నమః అనే అక్షరాలు రాయిస్తూ గురువుగారు చదివించేవారు. ఈ అక్షరాలు బోధించే ముందు, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే సరస్వతి ప్రార్ధన చేసేవాళ్ళు. అప్పుడు గురువుగారు మాములుగా 'అయ్యోరు' అనే పేరులో ప్రసిద్దులు. ఈతనే ఆదేవాలయానికి అర్చకుడు కూడాను. ఈతన్ని పూజారి అంటారు. మాములుగా గురువుగారు సోమవారం నుంచి గురువారం దాక విధ్యార్ధులకి పాఠాలు చెప్పేవారు, అంటే వారానికి నాలుగు రోజులు మాత్రం బడి చదువు ఉండేది. శుక్రవారం నాడు నైవేద్యంతో సహా వచ్చి దేవాలయంలో అర్చన జరిగేది. సభాసదస్యులు అందరును కూడి రామభజనలు, కీర్తనలు పాడేవారు, బడిపిల్లలు కూడా ఆ భజనలు, కీర్తనలు అనుసరించేవాళ్ళు. ఇంకను ఆ ఓనమాలు చదివిన తర్వాత, అ ఆ ఇ ఈ ఉ ఊ ఋు ఋూ మొదలైనవి తర్వాత క ఖ గ ఘ చ చ జ ఝ ఞ మొదలైనవి. ఆ తర్వాత గురువుగారు విధ్యార్ధులచేత గుణింతాలు చదివించేవారు. చదవగలిగిన తర్వాత, ఒక విద్యార్ధి ముందు చెప్పేవాడు పిమ్మట తక్కిన విధ్యార్ధులు అనుసరించేవాళ్ళు అది ఎలా చెప్పేవారంటే : క కు దీర్ఘమిస్తే కా, క గుడిస్తే కి, కి కి గుడిదీర్ఘమిస్తే కీ, క కుకొమ్మిస్తే కు, కు కికొమ్ముదీర్ఘమిస్తే కూ మొదలైనవి. ఇది చిన్న గుణింతంతో ప్రసిద్దిగా ఉండేది. ఆ తర్వాత పెద్ద గుణింతాలు వస్తాయి. కక్కావత్తిస్తేక్క కక్తావత్తిస్తేక్త, కక్నావత్తిస్తే క్న, కక్మావత్తిస్తేక్మ, కక్యావత్తిస్తే క్య, కాక్రావత్తిస్తే క్ర, కక్షావత్తిస్తే క్ష, కక్వావత్తిస్తే క్వ మొదలైనవి.
ఈ పెద్ద గుణింతం తర్వాత పెద్ద బాల శిక్షలో చదివేవారు. ఆ సమయంలో మారిషస్ దేశంలో ఇప్పుడు మాదిరిగా కొత్త కొత్త పుస్తకాలు లేవు. మా తాత ముత్తాతలు నూట యాభై సం॥ల క్రింద ఈ మారిషస్ దేశానికి వస్తున్నప్పుడు తమ వెంట తెచ్చిన కొన్ని పాత పుస్తకాలు మాత్రమే. ఆ పుస్తకాల్లో పెద్ద బాల శిక్ష, బాల రామాయణం, పాత కుశలా యకము, కామమ్మ కధ, బాలి నాగమ్మ కధ, బొబ్బిలి కధ, రామదాసు చరిత్రము, యడ్ల రామదాసు చరిత్రము, తారకామృత సారము, నృసింహ శతకము, ఇంకా కొన్ని నాటకాల పుస్తకాలు వాటిలో రామ నాటకము, లవకుశ, రుక్మిణి కళ్యాణం, ప్రహ్లాద నాటకం, గంగా వివాహము మొదలైనవి. మొత్తం మీద రామ భజన మరీ నాటకాల పుస్తకాలే ఎక్కువగా ఉండవచ్చు. తమ తీరిక సమయాన మన పెద్దలు గుంపులుగా కూడి కామమ్మ కధ, బొబ్బిలి కధ లేదా బాల నాగమ్మ కధ చెప్పుకుని సంతోషించేవారు. శనివారం సాయంత్రం వేళ స్వేచ్చగా ఉండేవారు, కాబట్టి ఆ అవకాశం పురస్కరించుకుని అప్పుడప్పుడు రామ భజనం చేసేవాళ్ళు లేదా నాటకం ప్రదర్శించేవాళ్ళు. మాములుగా ఆదివారం నాడు ఒక పెళ్ళి కార్యం ఉంటే, శనివారం రాత్రిపూట రామ భజనం చేసేవాళ్ళు లేదా నాటకం ప్రదర్శించేవారు. ఆ నాటకాన్ని ఆచార్యుని 'వత్యారే' అనే వారు. ఈ రామ భజనం లేదా నాటకం గురించి పెద్ద పందిరి కట్టి దాంట్లో ఈ కార్యక్రమాలు జరిగేవి. తర్వాత గంగమ్మ పూజ కూడా ఆదివారం నాడే చేసేవారు. ఈ సందర్బంలో కూడా శనివారం రాత్రి పూట నాటకం ప్రదర్శించేవారు. ఈ గంగమ్మ పూజ 'అమ్మోరు' పండగలో ప్రసిద్దం. ఈపండగలో ఇతర ప్రాంతాల నుంచి తమ తమ చుట్టాల్ని ఆహ్వానిం చేవారు. ఈ పండగలో ఇతరులు కూడా పాల్గొనేవారు, ఎంతో వేడుకతో ఈ కార్యం జరిగేది. పైన చెప్పిన రామ భజనలూ, నాటకాలూ, పండగలూ మా పిల్లలను బాగా ఆకర్షించినవి. ఇలా మన భాషా సంస్కృతి ప్రభావం కూడా వాళ్ళ మీద పడింది. దీనితో మన తెలుగు భాషనీ, సంస్కృతినీ కాపాడుతూ సుమారు 1940 దాకా వచ్చారు మన పూర్వీకులు. ఈ సమయం దాకా సుమారు 50 - 60 మన తెలుగు వాళ్ళు తమ మాతృ భాష మాట్లాడేవారు. మొత్తం మీద సుమారు నూరు సంవత్సరం దాకా మన తెలుగు వాళ్ళలో తమ భాష మాట్లాడేవారి సంఖ్య 50 - 60
- ఇకను మన తెలుగు భాష బోధన పరిశీలిద్దాం
1930 నుంచి 1945 దాక తెలుగు భాష బోధించేవారి సంఖ్య తగ్గిపోయింది. తెలుగు పాఠాలు చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కారణమేమిటో అది చెప్పడం చాలా కష్టం. ఈ తెలుగు భాష బోధించే వాళ్ళలో కొంత మందిని ఇక్కడ పేర్కొంటాను - శ్రీ పిచ్చయ్యగారు Goodlands నివాసి, అప్పల స్వామిగారు Quartier Militaire నివాసి, శ్రీశ్రీ అప్పన్న మరీకన్నయ్యగారు Mon Loisir నివాసులు, దానయ్యగారు BelElang నివాసి, జగన్న మరీ సనాసిగారు, Belle Vue Maurel నివాసులు, శ్రీ రామమూర్తి అప్పన్న Mahebourg నివాసి, శ్రీ గుణయ్య ఒత్తుగారు LaClemence నివాసి ఇంకా కొందరు ఉన్నారు. ఈ 1945 నుంచి మన తెలుగు భాషా సంస్కృతికి ఒక విధంగా అనారోగ్యం సంభవింపసాగింది. ఉదాహరణంగా కొందరి ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలతో తెలుగు భాషలో మాట్లాడుతుంటే వీళ్ళకి ఈ తెలుగు భాష అర్ధమయ్యేది కాని ఏదో కారణంగా వీళ్ళు బీహారీ భాషలో జవాబిచ్చేవారు. దీనికి పెక్కు కారణాలు ఉండవచ్చు.
మన తెలుగు వారి సంఖ్య చాలా తక్కువ. వీరు నివసంచే చోట్ల నలుపక్కలు బీహారీ భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ. దారిలో ఇతర భాషలతో సహా బీహారీ భాషయే ఎక్కువ వినబడేది. మన తెలుగు బందుగులు, తమలో తెలుగు భాష పలికేటపుడు, బీహారీ సోదరులు, "ఏమండో మీరు, ఒండో మొండో అని పలుకుతున్నారే, మమ్ము తిడుతున్నారేమో" అని పరిహాసం చేసేవాళ్ళు బహుశః ఇదే కారణంగా లేదా మన వాళ్ళకి సిగ్గు తనం వల్లనో మన తెలుగు భాష బాగా దెబ్బతింది. ఈ దశలో మన తెలుగు భాష పట్ల ప్రోత్సాహం ఇచ్చేది ఎవరు? సహాయకులు ఎవరూ లేరు. సోంతంగా ప్రయత్నం చేయాలి.
- మా తాత ముత్తాతల స్వర్ణభూమియైన ఆంధ్రప్రదేశం నుంచి మన పూర్వీకులు మమ్ము మరిచిపోయారు. అప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోయిన బిడ్డలవలే మేమున్నాం.
సౌభాగ్య వశాత్తున కొందరు మహానుభావులు, ఆంధ్రప్రదేశం నుంచీ, మద్రాసు నుంచీ తెలుగు పుస్తకాలు తెప్పించ నారంభించారు. అది కూడా ఆరు నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత ఆ పుస్తకాలు లభించేవి గాని ఈ పుస్తకాలు తెప్పించేవారి సంఖ్య చాలా తక్కువ. 1940-1945 మధ్య తెలుగు భాషా ప్రచారకులలో స్వర్గీయ పండిత గున్నయ్య ఒత్తుగారు ముఖ్యులు. 1947 సం.లో ఈయన తెలుగు భాష బాగా నేర్చుకొనే ఉద్దేశ్యంతో ఆంధ్ర ప్రదేశానికి తరలి వెళ్ళారు. అక్కడ విశాఖపట్నంలో ఉండి సంస్కృతం, తెలుగు, హిందీ నేర్చుకుని 14 సంవత్సరాల తర్వాత "విద్యాభూషణ" సంపాదించుకుని మారిషస్ దేశానికి మరలి వచ్చారు. స్వర్గీయ పండిత రామమూర్తి అప్పన్నగారు వీలయినంత తెలుగు భాష ప్రచారం చేశారు. అంటే అప్పుడు మా మారిషస్ దేశంలో తెలుగు భాష ప్రచారకులు లేనట్టే. స్పష్టంగావించటానికి నా సొంత కధ ఇక్కడ చెప్పాలి. శ్రీ గున్నయ్య గురువుగారి దగ్గర నాలుగు నెలలు మాత్రం తెలుగు భాష నేర్చుకున్నాను. ఆయన ఆంధ్రప్రదేశానికి వెళ్ళిన తర్వాత నాకు తెలుగు భాష చెప్పేవారు ఎవరూ లేరు. నిరుత్సాహపడి నాలుగు సంవత్సరాలు తెలుగు పుస్తకాలు ముట్టలేదు. అప్పుడు ఒక బీహారీ భాష మాట్లాడే మిత్రుడితో సహా కొంత హిందీ భాష నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏదో హిందీ - తెలుగు translation పుస్తకం నాకు అందింది. దాని మూలంగా కొంత తెలుగు భాష నేర్చుకోగలిగాను. దీనితోనే నేను సంతోషించాను. కాని గురువు లేని చదువు ఎలా ఉంటుందో ఇది ఆలోచింపదగిన విషయం. 1947 సం, న Mauritius Andhra Maha sabha వారు ఆంధ్రప్రదేశం నుంచి తెలుగు పుస్తకాలు తెప్పించారు. అన్ని ప్రాంతాల్లో వీలయినంతా సాయంత్రపు తెలుగు బడులు తెరిచారు. ఆ బడుల్లో తెలుగు భాష బోధన ఆరంభించారు. అంత చక్కగా భాషా జ్ఞానం లేనప్పటికి వీలయినంత ప్రయత్నం చేశారు మన ఉపాధ్యాయులు. దీనితో మాకు కొంచెం ప్రోత్సాహం కలిగినట్టు అయింది. ఆ సమయంలో మన తెలుగు పుస్తకాలే మా ప్రచారకులు, మా ఆధారం. అది లేకపోతే మన తెలుగు తల్లి వ్యాధిగా అయిపోతుందని అనాలి.
1958 సంవత్సరమున ఆగష్టు నెల మా మారిషస్ ప్రభుత్వం వారు నలుగురు ఉపాధ్యాయుల్ని ఎన్నుకొన్నారు. వీళ్ళకి 1 september 58 ఇప్పించి, 1958 నుంచి ప్రాధమిక బడుల్లో తెలుగు భాషా బోధన మొదలుపెట్టారు. అప్పటి నుంచి మన తెలుగు భాషా సంస్కృతి గురించి ఒక కొత్త పుట్టుక అయిందని చెప్పాలి. మా మారిషస్ ప్రభుత్వం వారు ఈ భాష మొదలుపెట్టకుంటే అప్పుడే ఇది పోయి యుండేది. దీనిగురించి మా మారిషస్ ప్రభుత్వం వారికి మా కృతజ్ఞతలు తెలుపడమే మా కర్తవ్యం. ఈ మన తెలుగు భాష బోధన గురించి నియుక్తి గావింపబడిన పేర్లు ఇవి: Mr.Sri.Lingah Ramasamy, Erabadhoo Elliah, Mr.Sri.Encarsamy Veerasamy,Mr.Sri Somanah Somiah, ఈ నలుగురూ ప్రాధమిక పాఠశాలల్లో తెలుగు భాషా బోధనకు ఆది గురువులు.
ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాషా బోధన మొదలైనది గానీ, పాఠ్యప్రణాళిక లేదు. చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మేలు అన్నట్టు, అప్పుడు Mr.Sri Sanassee Gooriah తెలుగుభాష Supervisor గా ఉన్నారు. ఈతని కోరిక ప్రకారంగా శ్రీ సోమయ్యగారు మొట్ట మొదట తనకున్న తెలివితో పాఠ్యప్రణాళిక తయారు చేశారు. మా మారిషస్ ప్రభుత్వం ఆశీర్వాదం వల్ల ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాషా బోధన మొదలయినది, దీనితో బాటు మన తెలుగులకీ చాలా ప్రోత్సాహం కలిగింది. రొట్టె కొరకో, భాషా సంస్కృతి ప్రవృధి కొరకో, విద్యార్దులు తెలుగు భాష నేర్చుకోడానికి మరల మొదలుపెట్టారు. అదే సందర్భాన శ్రీ గున్నయ్య గురువుగారు డిశంబరు 1960 సం.న మా మారిషస్ దేశానికి మరలి వచ్చారు కదూ, ఈయన రాకతో మన తెలుగు వాళ్ళలో ఒక రకంగా మెలకువ వచ్చింది. శ్రీ గున్నయ్య గురువు ఆదేశ ప్రకారంగా మొట్ట మొదటి సారి ఉగాది పండగ Riviere du Rempart గ్రామంలో ఎంతో వేడుకతో జరిగింది. తర్వాత ఆంధ్ర అవతరణ ఉత్సవం జరిగింది. మన తెలుగు వారికి కూడా పండగలు, ఉత్సవాలు ఉన్నాయని తెలిసి మాకు ఎంతో గౌరవం కలిగింది. ప్రాణం కోల్పోవుతున్న వారి ఒంట్లో ప్రాణం పోసి నట్లయ్యింది. అప్పటి నుంచి అంటే 1962 నుంచి ప్రతి సంవత్సరం ఉగాది పండగ, ఆంధ్ర అవతరణ ఉత్సవం జరుపుకొంటాం. ఇవే మాకు సంపద. భారత ప్రభుత్వం ఆశీర్వాదం వల్ల, ఆంధ్రప్రదేశ్ అనుగ్రహం వల్ల 1965 సం.న Dr.V.Ananda Murthy Itec Expert గా మా మారిషస్ దేశానికి వచ్చారు. ఈయన మారిషస్ తెలుగు వాళ్ళ భాషా పరిస్థితి బాగా పరిశీలించారు. ప్రాధమిక పాఠశాల గురించి పాఠ్యపుస్తకాలు రాస్తూ, Training College లో విద్యార్ధులకి పాఠాలు చెబుతూ ఉన్నారు. వీటితో సహా శనివారం రోజుల్లో కోరిన ఇతర ఉపాధ్యాయులకి కూడా పాఠాలు చెప్పేవారు. ఈయన నిర్విరామ కృషి గురించి, Dr.V.Ananda Murthy గురువుగారిని మేం మరువలేము. ఈయన ప్రోత్సాహం వల్లనే కొందరు మిత్రులు G.C.E. పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణులయ్యారు. దీని గురించి మాకు ఇంకా ప్రోత్సాహం కలిగింది. ఇట్లాంటి విద్వాంసులు, భాషాభిమానులు మా మధ్యలోకి వస్తే మన తెలుగు భాష ఈ దేశంలో తప్పకుండా ప్రగతి చేస్తుందనీ, మన తెలుగు తల్లికి జయం ఔతుందనీ, మన తెలుగు తల్లికి మల్లెపూదండ అందుతుందని చెప్పగలము.
Dr.V.Ananda Murthy గురువుగారు Secondary లో ప్రాధమిక పాఠశాల గురించి పాఠాలు రాస్తుంటే వాటిని టైపు చేసేవారు. ఎవరూ లేరు కాబట్టి ఈయన కోరిక ప్రకారంగా శ్రీ సోమయ్యగారిని M.G.I.కి రప్పించి టైపు చేయమన్నారు. కొన్ని నెలల తర్వాత Dr.V.Ananda Murthy గురువుగారు Secondary School లో ఈ తెలుగు భాషా బోధన గురించి వాళ్ళకి చెబితే 'సరే' అని ఒప్పుకొని, వెంటనే వీళ్ళు మారిషన్ లో తెలుగు భాషా బోధన గురించి సోమయ్యగారిని నియమించారు. ఇలా శ్రీ సోమయ్యగారు మొట్ట మొదట Telugu Typist. మరీ మొట్టమొదలు కళాశాల ఉపాధ్యాయుడుగా 1978 లో నియమింపబడ్డారు.
1982 సం॥ న. Dr.V.AnandaMurthy గురువుగారు ఆంధ్ర ప్రదేశానికి తిరిగి వెళ్ళి పోయారు. అప్పుడు మాకు మార్గదర్శకులు ఎవరూ లేరు. మారిషన్ తెలుగు భాష మళ్ళీ అంధకారంలో పడి నట్లయ్యింది. ప్రాధమిక మరియు కళాశాల గురించి పాఠ్యపుస్తకాలు రాసే తగిన విద్వాంసులు లేరు. ఇది మాకు చాలా నిరుత్సాహం కలిగిస్తుంది. మా మారిషస్ ప్రభుత్వం వారి ప్రోత్సాహం లేకపోతే ఓ 50 సంవత్సర అవధిలో మా మారిషస్ దేశంలో తెలుగు భాష పోతుందని అనుమానంగా ఉంది. దీనితో మన తెలుగు తల్లికి మల్లెపూదండ బదులుగా తగిన చోట ఉండక పోవచ్చు అని నాకు తోస్తుంది.
- మా తాత ముత్తాతల స్వర్ణ భూమియైన ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన మా పెద్దలకు ఒక మనవి
మా మారిషస్ దేశానికి అపుడపుడు తగిన విద్వాంసులని పంపిస్తే, వలసిన పాఠ్యపుస్తకాలు తయారు చేస్తూ, కోరిన విద్యార్ధుల కోసం Diploma Course నడుపుతూంటే మాకు ఎంతో లాభం కలుగుతుందని నా నమ్మకం. M.G.I వారు ఇప్పుడే G.C.E. Advance Course ఏర్పాటు చేశారు మరి ఈ 1990 సం.న మొట్ట మొదటి సారిగా విద్యార్ధులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. International Telugu Institute వాళ్ళు 1977 లో 5 గురు మారిషస్ విద్యార్ధుల కోసం కోర్సు ఏర్పాటు చేశారు. దాని తర్వాత 13 సం॥ లు దాటింది, ఏ కోర్సు జరగలేదు. దీని బదులుగ ఆ మాదిరి కోర్సుమా మారిషన్ దేశంలోనే ఏర్పాటు చేస్తే 5 గురి బదులుగా 30 - 40 మందికి లాభం కలగవచ్చు. ఆఖరిలో మా పూర్వీకులు ఈ దేశానికి వచ్చి 150 సం.లు అయినది. 150 సం.లు అంటే 150 రోజులు కావు. ఎంతో కష్టంతో మన తెలుగు భాష ఈ ఆధునిక పరిస్థితిలో ఉంది. నేను చెప్పిన దాంట్లో బహుశః చాలా తప్పులు ఉండవచ్చు, భాష తేడా ఉండవచ్చు మీరు పెద్దలు దీని గురించి నన్ను క్షమించండి. దీంట్లో ముఖ్యమైనది ఏమిటంటే మా ఉద్దేశ్యము గ్రహించండి. దీనితో పాటు నేను సెలవు తీసుకుంటున్నాను.
జైమారిషన్ దేశం! జై భారతదేశం!! జై ఆంధ్ర ప్రదేశం!!
జై మన తెలుగు తల్లికి!!!
- ప్రతినిధుల సమావేశం
డా.సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల సమావేశం జరిగింది. ప్రతినిధులు ఉత్సాహంగా వాడిగా వేడిగా భాషాభివృద్ధిపై చర్చించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థను రద్దు చేయటం పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలుగు బోధనకు తగిన సహకారం లభించక పోవటం పట్ల ప్రతినిధులు ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాతృభాషాసంస్కృతుల పట్ల వారికి గల ప్రగాడాభిమానం వారి ప్రసంగాల్లో వ్యక్తం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాని, ఆయన పక్షాన మంత్రులుగాని ఎవరైనా వచ్చి వుంటే సభలు ఇంకా శోభాయమానంగా ఉండటమే కాకుండా, విదేశాంద్రుల సమస్యల పరిష్కారానికి కొంతమేర దోహదపడటానికి ఉపయోగపడేది. విధాన నిర్ణయాలు తీసుకోవల్సినవారు వారే కదా!
అదీకాక మారిషస్ గవర్నర్ జనరల్ ప్రధానమంత్రి సరసన మన మంత్రులు లేనిలోటు కొట్టొచ్చినట్లు కన్పించింది. కనీసం ప్రోటోకాల్ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరైనా మంత్రి వచ్చి ఉంటే బాగుండేది. ఈ విషయంలో మారిషస్ ఆంధ్రులు ఎంతగానో బాధపడ్డారు.
డా॥ సి.నారాయణరెడ్డి ప్రభృతులు లోటును కప్పిపుచ్చి కొంతమేరకు సఫలీకృతులైనప్పటికీ తీర్మానాలు అమలు పరచవల్సింది రాష్ట్ర ప్రభుత్వం - దానికి డా॥ సి.నారాయణరెడ్డి ఎంతవరకు బాధ్యత వహించి హామీ ఇవ్వగలరు. ప్రతినిధి వర్గనాయకుడిగా మహాసభల నివేదికను, తీర్మానాలను ప్రభుత్వానికి అందించగలరు కాని అమలుపరిచే విషయంలో ప్రభుత్వాన్ని శాసించలేరు కదా! ఇవి లోలోన అందరికీ శేష ప్రశ్నలు. అన్నిటికంటే మరో ముఖ్యమైన లోటు. ఏ మహాసభలకైనా సదస్సులు, అందులో చర్చించే విషయాలు ప్రాణం వంటివి. మారిషస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిద్యం పలచనకావటం చాలా విచారకరం. డా.సి.నారాయణరెడ్డి, శివరామమూర్తి మారిషస్‌కి వేరే కార్యక్రమాల మీద వచ్చిన ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు మినహాయిస్తే మన రాష్ట్రం నుండి సరైన ప్రాతినిద్యం లేదు.
కనీసం నలుగురైదుగురు తెలుగు పరిశోధకులను, ఆచార్యులను, పండితులను ప్రభుత్వం పంపించి ఉంటే బావుండేది.
దక్షిణాఫ్రికా, మలేషియా ఆంధ్ర సంఘంవారు తమ తమ దేశాల్లోని ప్రొఫెసర్లను, పెద్దలను తీసుకువచ్చి ఆయా దేశాల్లోని తెలుగు భాషా సమస్యలపై చక్కటి ప్రసంగం వ్యాసాలు సమర్పించారు.నిజానికి మహాసభలకు జీవం పోసిన వారు వారే. మారిషస్ ఆంధ్రులు తమ వ్యాసాలను తెలుగులోనే సమర్పించటం విశేషం.
- ముగింపుసభ
13 వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలుగు మహాసభల ముగింపు సమావేశం జరిగింది.
మారిషస్ విద్యామంత్రి శ్రీ ఆర్ముగం పరశురామన్ స్నాతకోపన్యాసం చేస్తూ 'మారిషస్ తెలుగు మహాసభలు' విజయవంతంగా జరిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చిన్న దేశంలో స్వల్ప సంఖ్యలో ఉన్న ఆంధ్రులు సభలను దిగ్విజయంగా నిర్వహించటం అభినందనీయమైన విషయం అని అన్నారు.
జనవరి 1991 నుంచి తెలుగు ఉపాధ్యాయులకు అలవెన్స్ 100 రూ.ల నుంచి 300 రూ.ల వరకూ పెంచటం జరుగుతుందని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వీడియో కేసెట్ల ద్వారా తెలుగు విధ్యాబోధన జరపాలని శ్రీ పరశురాం సూచించారు. మారిషస్‌లో తెలుగు భాషా వ్యాప్తికి తెలుగు విశ్వ విద్యాలయం చేపట్టే కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందివ్వగలదని హామీ ఇచ్చారు. సదస్సులో సమర్పించిన పత్రాలను మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ గ్రంధరూపంలో వెలువరుస్తుందని శ్రీ పరశురామ్ వెల్లడించారు.
మహాసభలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులకు శ్రీ పరశురామ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి ప్రపంచ తెలుగు మహాసభల భావనకు మూలపురుషుడైన శ్రీ మండలి వెంకట కృష్ణారావు ఆయురారోగ్యాలతో విలసిల్లి మున్ముందు అనేక కాన్పరెన్సుల్లో పాల్గొనాలనే ఆకాంక్ష శ్రీ పరశురామ్ వెలిబుచ్చారు. శ్రీ పరశురామ్ తమ ప్రసంగం చివర తెలుగులో -
- 'మహాసభలకు వచ్చినందుకు కృతజ్ఞతలు
- మారిషస్ దేశానికీ జయం
- తెలుగు భాషకి జయం
- భారతదేశానికీ జయం'
అంటూ ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని ముగించారు. మారిషస్ ఇంధన, జలవనరులమంత్రి శ్రీ మహేన్ ఉచ్చన్న పట్టలేని ఆనందంతో మహాసభలు గొప్పగా జరిగాయని, తమపూర్వీకుల బాటలో సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు శాయశక్తుల కృషిచేస్తామని చెప్పారు.
దక్షిణాఫ్రికా ప్రతినిధివర్గంనాయకుడు శ్రీ టి.పి.నాయ్డు, మలేషియా ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ పాల్‌నాయ్డు, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధివర్గం పక్షాన శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు మారిషస్ ప్రభుత్వానికి, మారిషస్ ఆంధ్ర మహాసభకు కృతజ్ఞతాంజలి పట్టారు.
విదేశీ ప్రముఖులకు మంత్రి శ్రీ ఉచ్చన్న మెమెంటోలు బహూకరించి సత్కరించారు.
మహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీలలో విజేతలైన విధ్యార్ధులకు శ్రీ మండలి వెంకట కృష్ణారావు బహుమతీ ప్రదానం చేశారు.
- తీర్మానాలు
- 1. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల మరియు విదేశాలలో ఉన్న తెలుగు విద్యార్ధులకు ఇంజినీరింగ్, మెడిసన్ కోర్సులలో సీట్లు పునరుద్ధరించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడానికి తీర్మానించడమయినది.
- 2. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలను విదేశాలలోని తెలుగువారు సందర్శించటానికి వీలుగా పధకాలను రూపొందించి, అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖను కోరడానికి తీర్మానించడమయినది.
- 3. భారతదేశంలోనూ, విదేశాలలోనూ తెలుగు అధ్యయనాన్ని ప్రోత్సాహించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి తీర్మానించడమయినది.
- 4. విదేశాలలోని తెలుగు వారి కోరిక మేరకు ఆయా దేశాలకు సాంస్కృతిక బృందాలను పంపించడానికి తీర్మానించడమయినది.
- 5. శిక్షణా పధకాల ద్వారానూ, బోధనా సామాగ్రిని మెరుగుపరచడం ద్వారానూ, ప్రణాళికా బద్దమైన బోధనా పద్దతుల నవలంబించటం ద్వారానూ, తెలుగు భాషాధ్యయనాన్ని ప్రోత్సాహించడానికి మారిషస్ లోని మోకా వద్ద మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌కూ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు విశ్వ విద్యాలయముకూసంధానం ఏర్పాటు చేయడానికి తీర్మానించటం అయినది.
- 6. తెలుగు భాషాధ్యయనా ఆసక్తి చూపే తెలుగువారి కొరకు కరస్పాండెన్స్ కోర్సులు పునరుద్ధరించడానికిగాను ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని అభ్యర్ధించడానికి తీర్మానించడమయినది.
- 7. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషాభివృద్ధి కృషి నిమిత్తం ప్రపంచంలోని తెలుగువారి నుండి భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుండి పొందిన మూల ధనంతో, ప్రపంచ తెలుగునిధిని'ని ఏర్పాటు చేయాలని తీర్మానించడమయినది.
- 8. కనీసం ప్రతి అయిదు సంవత్సరాలకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సన్నిహిత సహకారాలతో ప్రపంచ తెలుగు మహానభలను నిర్వహించాలని తీర్మానించడమయినది.
- 9. తెలుగు విశ్వ విద్యాలయములోని అంతర్జాతీయ తెలుగు కేంద్రం సన్నిహిత సహకారాలతో తెలుగు సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పెంపొందించడానికి తెలుగు అసోసియేషన్స్ సెడరేషన్ ఏర్పాటు చేయడానికి తీర్మానించడమయినది.
- 10. భాష, సంస్కృతి మరియు కళల కోర్సులలో విద్యనభ్యసించడానికి అభిలాషకల విదేశాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్యాలయాలలోనూ, విశ్వ విద్యాలయాలలోనూ స్కాలర్ షిప్‌లు ఏర్పాటుచేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించడానికి తీర్మానించడమయినది.
- నేషన్:ఆర్క్-ఎన్-సియల్
ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ పూసరాజ్ సూరయ్య వందన సమర్పణలో మహాసభ ముగింపు కార్యక్రమం ముగిసిన పిమ్మట మారిషస్ విద్యా సాంస్కృతికశాఖ వారు నేషన్ ఆర్క్-ఎన్-సియల్ పేరిట బహుభాషా సంస్కృతుల మేలికలయక అయిన కమనీయ సాంస్కృతిక ప్రదర్శనలు యిచ్చారు. శ్రీ రాజన్ అప్పడు తెలుగు భక్తి గీతాలతో ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో లాల్ మహ్మద్ బృందంవారి కవ్వాలి, గ్వాన్ మెహిత పాటల బృందంవారి భోజపూరి పాటలు వినిపించారు.
తెలుగు జానపద నృత్యం, తమిళ కోలాటం, చైనీస్ జానపద నృత్యం, టిప్నిడ్యాన్స్ ప్రేక్షకుల్ని పరవశింపచేశాయి. మంత్రి శ్రీ పరుశురామ్ అభివర్ణించినట్లు మారిషస్ భిన్న సంస్కృతుల అందాల హరివిల్లు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని శ్రీ చిన్నయ స్వామి సమర్పించారు.
- మారిషస్‌లో షాపింగ్
తీరిక చిక్కని మహాసభల కార్యక్రమాల నుంచి కాస్తంత తీరిక చేసుకుని పోర్టు లూయిస్‌లో నేనూ, శ్రీ ఆచంట, శ్రీత్యాగరాజుతో షాపింగ్ చేయడానికి వెళ్ళాము. మారిషన్ లో దొరకని వస్తువంటూ ఉండదు. అన్ని దేశాల వస్తువులు అక్కడ మనకు లభిస్తాయి. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రం మనదేశంలో కంటే ఎక్కువధరగా అనిపించాయి. బట్టలు చాలా చవక.
పోర్టులూయిస్‌లో శ్రీ గారయ్యగారనే ఆంధ్రవర్తకుడు పెద్ద బట్టల కొట్టు పెట్టారు. త్యాగరాజ్ మమ్మల్ని వారి దుకాణానికి తీసుకుని వెళ్ళారు. శ్రీ ఆచంట, నేనూ మా కుటుంబసభ్యులకు, పిల్లలకూ చీరలూ బట్టలూ తీసుకున్నాం. శ్రీ గారాయ్యగారి అబ్బాయి ఆంధ్రాలోనే వైద్యవిద్యనభ్యసించి హైద్రాబాద్ అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు ఎంతో ఆనందంగా శ్రీ గారయ్య దంపతులు మాకు చెప్పారు. ఒక చైనీస్ దుకాణంలో లవంగాలూ, దాల్చినచెక్కా చవకగా వుంటే కొన్నాం. బంధుమిత్రులకు బహుమతిగా తీసుకురావటానికి చిన్న చిన్న మారిషస్ జ్ఞాపికలు కొన్నాం.
మారిషస్‌లో దొంగల బెడద ఎక్కువగానే వుంది. శ్రీ త్యాగరాజ్ దారి పొడుగునా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. పోర్టులూయిస్‌లో మంచి రద్దీగా ఉన్న రోడ్డులో వెళ్తున్నాము. మా కెదురుగా ఇద్దరు నల్లగా, పొడుగ్గా , చింపిరి జుట్టుతో నీగ్రోల్లా ఉన్న వ్యక్తులు ఎదురు వస్తున్నారు. వారివాలకాలను గమనించిన శ్రీ త్యాగరాజ్ దొంగల్లా ఉన్నారని వారిని పరిశీలిస్తూ రాసాగారు. అక్కడ షాపింగ్ చేసి వస్తున్న ఒక అమ్మాయి నుంచి పర్సును కాజేయటానికి ప్రయత్నించారు. శ్రీ త్యాగరాజ్ క్రియోల్ భాషలో ఏదో అన్నాడు. వారు వెంటనే క్రియోల్లో పెద్దగా అరుస్తూ కోపంగా శ్రీ త్యాగరాజ్ మీదకు రాసాగారు. వారి వద్ద చిన్న చిన్న కత్తులుకూడా ఉన్నాయి. ఈ లోపుగా జనం పోగయ్యేసరికి వాళ్ళు తిట్టుకుంటూ పోయారు. మారిషస్‌లో ఇదొక అనుభవం.
పోర్టులూయిస్ నుంచి క్వార్టర్ బార్నలోని గోల్డ్ క్రిస్ట్ హోటల్‌కుఎనిమిది మైళ్లు బస్సులో ప్రయాణించాము. బస్సు స్టాపులో జనం ఎవరంతటవారు వెళ్ళి క్యూలో నిలబడతారు. త్రోసుకుని ఎక్కే ప్రయత్నం చేయరు. క్యూలో ఉన్నవారు వరుసగా వెళ్ళి బసు ఎక్కుతారు. బస్సు నిండగానే కదలిపోతుంది. మిగిలినవారు వెనుక వచ్చే మరో బస్సు కోసం వేచి నిలబడతారుగాని మనదేశంలో మాదిరిగా త్రోసుకుని ఎక్కి కిక్కిరిసి నిలబడి ప్రయాణం చేయరు. వారిక్రమశిక్షణ అద్భుతం.
- సంప్రదాయ పరిరక్షకులు తెలుగు మహిళలు
ఏ దేశపు సంస్కృతి అయినా, ఏ జాతి ఆచార వ్యవహారాలైనా స్త్రీల వలన నిలబడతాయి అని మారిషస్ ఆంధ్ర ఆడబడుచులు రుజువు చేశారు. 150 సంవత్సరాల క్రితం మన దేశం నుంచి తరలి వెళ్ళినప్పటికీ తెలుగువారి కట్టూబొట్టూ ఆచార వ్యవహారాలు మారిషస్‌లో నిలబడ్డాయంటే ఆ ఘనతంతా ఆంధ్రవనితలకే చెందుతుంది.
మారిషస్‌లో తెలుగువారి ఇళ్ళకు వెడితే వాకిళ్ళలో ముగ్గులూ, గుమ్మాలకు పూసిన పసుపు కుంకుమలూ కనిపిస్తాయి. తెలుగు మహిళ మన సంప్రదాయాలనూ సంస్కృతిని విస్మరించలేదనటానికి ఇంతకంటే నిదర్శనం మరేమీ లేదు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంగాని, ఆధునిక ధోరణులు కాని మన ఆంధ్ర స్త్రీల జోలికి రాకపోవటం విశేషం.
జీన్సూ గౌనులు మన వారిని ఆకర్షించలేకపోయాయి తెలుగుతనం వుట్టిపడ్తూ నుదుటని మెరిసే కుంకుమతో కుడి పమిట వేసుకుని మారిషస్ ఆంధ్ర వనితలు దర్శనమిస్తారు. ఆడ పిల్లలకు పరికిణీ, ఓణి, మగపిల్లలకు పంచకట్టు కట్టి వారు మురిసి పోతూంటూరు, తెలుగు మహాసభల ర్యాలీకి ఆడపిల్లలు రంగు రంగుల పరికిణీలూ, ఓణీలూ ధరించి వచ్చారు. పేరంటాలూ, నోములూ, వ్రతాలూ సంప్రదాయసిద్ధమైన వేడుకలను మన ఆడపడుచులు మరువలేదు. రామ భజనము, గోవిందపూజ, అమ్మోరు పండగల సందర్బాల్లో చుట్ట పక్కాలను పిల్చి పంచభక్ష్య పరమాన్నాలతో వారికి భోజనం పెట్టి ఆంధ్ర వనితలు 'అన్నపూర్ణ' అన్న పేరు సార్ధకం చేసుకున్నారు.
సహజంగా ఆంధ్ర వనితలు దైవభక్తి పరాయణులు మారిషస్ ఆంధ్రుల ఇళ్ళ ముందు చిన్న మందిరం లాంటిది ఉంటుంది. దానిని 'జంది' అని పిలుస్తారు. దానిలో ఆంజనేయుని ప్రతిమ పెట్టి పూజిస్తారు. ఆంజనేయుడు తమ ఇంటిని సదా రక్షిస్తాడని వారి ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతో వారు దొంగల భయాన్ని తాత్కాలికంగా మరచిపోయి తమ పని పాటల్లో లీనమై పోతారు.
ముదుసలి స్త్రీలు ఈ నాటికీ ఆ నాటి పౌరాణికపు పాటలూ, జానపద గేయాలూ, పెండ్లి పాటలూ పాడతారు. మారుతున్న కాలంలో వివాహ వ్యవస్థను కాపాడుకుంటూ మన వివాహ ఆచారాలను పాటించటం గొప్ప విషయం.
ఆంధప్రదేశ్‌లోని తెలుగువారిలాగానే వివాహ పద్ధతులు, కులాచారాలు, పూజలూ - పునస్కారాలు మారిషస్ లోని తెలుగు వారు జరుపుకుంటున్నారు. తమ రక్త సంబంధీకులు, తమ కులం లేక సామీప్యం ఉన్న ఇతర కులాల వారితోనే వివాహ సంబంధాలు పెట్టుకుంటారు. కుటుంబ గౌరవం, ఆస్తిపాస్తులను దృష్టిలో ఉంచుకుని వివాహాలు జరుగుతాయి. మారిషస్ తెలుగువారిలో తెలగ, కళింగ, కంపోలు కులాల వారు ఉన్నారు. వారిలో తెలగవారు సంఖ్యాపరంగా అధికులు. ఈ మూడు కులాల్లో వివాహాలు జరుగుతాయి.
సంక్రాంతి, శివరాత్రి, దీపావళి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి మొదలైన పండుగలను సంప్రదాయ సిద్ధంగా తెలుగువారు జరుపుకుంటూరు.
దీపావళిని మారిషస్‌లో ఉన్న ఉత్తర భారతీయుల కంటే ఆంధ్రులు, తమిళులు ఒక రోజు ముందుగా జరుపుకుంటూరు. శ్రీరాముడు లంక నుండి స్వస్థానానికి చేరడానికి దక్షిణ భారతాన్ని ముందుగా దాటాడని అందువలన ఒక రోజు ముందుగా జరుపుకుంటామని వారు చెప్పుతుంటారు.
ఉగాది మన తెలుగు సంవత్సరాది, పులుపు, చేదు రుచులతో పచ్చడి చేసి జీవితము కష్టసుఖాల కలయిక అని తెలియచెబుతారు ఆంధ్ర వనితలు.
- మారిషస్‌లో తెలుగువారి స్థానం
1972 జనాభా లెక్కల ప్రకారం మారిషస్‌లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 24, 233. మారిషస్‌లో తెలుగువారి కధనం ప్రకారం చాలా మంది తెలుగువారు ఇతర భాషలు మాట్లాడే వారిగా పొరబాటున నమోదు చేయించుకున్నందువలన తెలుగువారి సంఖ్య తక్కువగా ఉందని, భాషాపరంగా కాక తెలుగు జాతీయతప్రకారం లెక్కలు జరిపితే తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
70 మందిగల మారిషస్ పార్లమెంటులో తెలుగువారు నలుగురు ఉన్నారు. వారు (1) మహేన్ ఉచ్చన్న (ఇంధన జల వనరుల మంత్రి) (2) శ్రీ విష్ణు లక్ష్మీనాయుడు (వీరు గతంలో ఉప ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధాని అనిరుద్ జగన్నాధ్‌తో విభేదాల కారణంగా వైదొలిగారు) (3) శ్రీ రాజవీరాస్వామి గారు (వీరు గతంలో మారిషస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు.) (4) శ్రీ శ్రీకృష్ణ బాలిగాడు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలుగువారి సంఖ్య పెరగగలదనే ఆశాభావంతో ఉన్నారు మారిషన్ ఆంధ్రులు.
మారిషస్ ప్రభుత్వ శాఖల్లో తెలుగు వారు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. రామగులాం మెడికల్ రిసెర్చి సెంటర్‌ల్లో పని చేస్తున్న కార్డియాలజిస్టు, ప్రొఫెసర్ బాలిగారు. గుండె జబ్బులకు కనిపెట్టిన మందులు ప్రపంచ వ్యాప్తి చెందినవని చెప్పారు.
మారిషస్ ప్రభుత్వంలో బడ్జెట్ ఆఫీసరుగా పనిచేస్తున్న శ్రీ రామనాయ్డు సోకప్పడు (విష్ణు) ముల్కీ నిబంధన వలన హైద్రాబాద్‌లో మారిషస్ విద్యార్థులకు సీట్లు రాకపోవటం వలన ఢిల్లీ, బొంబాయి, బెంగుళూరు వెళ్ళి చదువుకోవలసి వస్తోందని, మరికొంతమంది ఫ్రాన్స్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వెళ్ళి చదువుకుంటున్నారని, మాతృ రాష్ట్రంలో చదవాలనే తపన తీరటం లేదని అన్నారు.
మ్యూజియం అధిపతిగా శ్రీ రాజన్న గజని, అటవీశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీ పోపయ్య పదవుల్లో ఉన్నారు. హెడ్ ఆఫ్ ఫ్రిజన్‌గా శ్రీ లక్ష్మయ్య, టెలికమ్యూనికేషన్ డైరెక్టర్‌గా శ్రీ పిండయ్య గతంలో పనిచేసి రిటైరయ్యారు.
ఆర్థికస్థితిలో హిందీవారి కంటే తెలుగువారే అధికులుగా ఉన్నారు. నేషనల్ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ ఎస్.ఎ. రాఘవుడు తెలుగువారిలో సంపన్నుడు. వందల సంఖ్యలో అద్దెకార్లు ఆయనకి ఉన్నాయట.
మారిషస్ టెలివిజన్‌లో నెల నెలా రెండు తెలుగు చలన చిత్రాలు ప్రసారం చేస్తారు. ప్రతి శనివారం తెలుగు సీరియల్ ప్రసారం చేస్తారు. మేము ఒక రోజు 'ఆనందో బ్రహ్మా' ప్రసారం అవుతూండగా చూశాము. మారిషస్ రేడియోలో మొదటి ఛానల్లో వారానికి మూడు రోజులు అరగంట చొప్పున తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. రెండవ ఛానల్లో ప్రతి రోజు అరగంట తెలుగు కార్యక్రమాలు ఉంటాయి.
నవంబరు 1న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్ ఆంధ్రులు పెద్ద ఎత్తున జరుపుతారు. మారిషస్ తెలుగువారిలో ఎవరిని కదిపినా అమరజీవిపాట్టి శ్రీరాములుగారి గురించి అనర్గళంగా చెబుతారు. నిజానికి మనకి సహితం తెలియని పొట్టి శ్రీరాములుగారి చరిత్ర వారు చెబుతూంటే విని విస్తు పోయాను. ప్రాణత్యాగంచేసి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టిన ఆ మహనీయుని పట్ల వారికి అనంతమైన కృతజ్ఞతా భావం హ్పదయంలో నిండిఉంది. దీనిని బట్టి స్వరాష్ట్రంపట్ల వారికి ఉన్న అభిమానం ఎంతటిదో గమనించవచ్చు.
- దక్షిణాఫ్రికా ప్రతినిధుల ఆదర్శం
డిసెంబర్ 13న మా తిరుగు ప్రయాణం. వారం రోజులుగా మారిషస్, దక్షిణాఫ్రికా ఆంధ్రుల అపూర్వ ప్రేమాభిమానాలకు నోచుకున్న మాకు వారిని వదలి వెళ్ళి పోతున్న భావన బాధించింది. ఆ రోజు ఉదయం గోల్డ్ క్రిస్ట్ హెూటల్లో దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభవారు మన ప్రతినిధుల గౌరవార్ధం బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు.
దక్షిణాఫ్రికాలో రాజకీయ పరిస్థితులు చక్కబడి మంచి రోజులు వస్తే నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మనందరం కలుసుకుందామని వీడ్కోలు సభలో ప్రసంగించినవారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికా ఆంధ్రుల ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ మండలి వెంకట కృష్ణారావు, శ్రీమతి జమున, డా అక్కినేని ప్రసంగించారు. చివరగా డా సి. నారాయణరెడ్డి తాత్విక ధోరణిలో తాను రచించిన తెలుగు గజల్ వినిపించారు.
మరణం ననువరించివస్తే ఏమంటూను నేనే మంటానూ
పాలుపట్టి, జోలపాడి పడుకోమంటాను -
లంచం ననుభజించివస్తే ఏమంటూను నేనే మంటానూ
తిరుమలగిరి హుండీలో జొరబడమంటాను
కామం ననుకలవరపెడితే ఏమంటానూ నేనే మంటానూ
అలిగివున్న పడుచు జంటతో కలబడమంటాను.
అని కమ్మగా సి.నా.రె. గొంతు పాడుతూంటే అందరి చేతులు వరుస కలిసి తాళం వేస్తూండగా సరదాగా వీడ్కోలు సభ ముగిసింది. దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ విష్ణు క్రిస్ నాయ్డు తన అడ్రసు నాకిచ్చి మాకు పూజా పునస్కారాలు జరిపేందుకు పురోహితులు కావాలి. ఆంధ్రదేశం నుండి ఎవరైనా వస్తే వారికి జీతం - వసతి సదుపాయం ఇస్తామని, ఎవరినైనా పంపటానికి ప్రయత్నించమని మరీ మరీ చెప్పారు. దక్షిణాఫ్రికా మహిళా ప్రతినిధి శ్రీమతి మహలచి రాపిటి మాతో ఎంతో కలివిడిగా ఉండేది. ఆమె మెడికల్ లైబ్రేరియన్‌గా దక్షిణాఫ్రికాలో పనిచేస్తోంది. మా తాతగారు అనకాపల్లి నుండి వలస వచ్చారని కూరలు, పండ్ల వ్యాపారం చేసేవారని చెప్పింది. ఆమె చూపించిన ఆప్యాయత, ఆత్మీయత మరువలేం.
భారమైన హృదయాలతో మారిషస్, దక్షిణాఫ్రికా ఆంధ్ర సోదరుల వద్ద శలవు తీసుకుని తిరుగు ప్రయాణానికై గోల్డ్ క్రీస్ట్ హెూటల్ విడిచి బయలుదేరాం.
మార్గమధ్యంలో మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ పూసరాజ్ సూరయ్య ఇంటికి వెళ్ళాము. శ్రీ సూరయ్య సతీమణి శ్రీమతి నిష్ట ,కుమార్తెలు ప్రియ, వందన ప్రేమ పూర్వక ఆహ్వానం పలికారు. మహాసభలను దిగ్విజయంగా నిర్వహించినందుకు శ్రీ సూరయ్యకు అభినందనలు తెలియచేసి కృతజ్ఞతలు చెప్పాము.
మహాసభలు మారిషస్ ఆంద్రులలో ఒక కదలిక, చైతన్యం తీసుకువచ్చాయని, మహాసభ తీర్మానాలు అమలు జరపక పోతే పడిన శ్రమంతా వృథా అవుతుందని శ్రీ సూరయ్య చెప్పారు. ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి ప్రపంచ సభలు జరపాలని, సంవత్సరానికి ఒకసారి ప్రతినిధులు కలుసుకోవాలని సూచించారు.
శ్రీమతి నిష్ట మారిషస్ సావెనీర్‌లను మాకు బహూకరించింది. వారి వద్ద శెలవు తీసుకుని బయలు దేరాం. శ్రీ త్యాగరాజ్ దారిలో నేషనల్ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ రాఘవుడు ఇంటికి తీసుకు వెళ్ళారు. తెలుగు వారిలో సంపన్నుడైన శ్రీ రాఘవుడు అతి నిరాడంబరుడు. ఆయన సతీమణి తెల్లగా మేలిమి ఛాయతో ఉండటం వలన పాశ్చాత్య వనిత అని భ్రమపడిన మాకు శ్రీ రాఘవుడు ఆమె ఆంధ్ర వనిత అని చెప్పి ఆశ్చర్యచకితులను చేశారు. శ్రీ రాఘవుడు ఇంటినుంచి హైద్రాబాద్‌కు ఫోన్ చేసి మేము బయలుదేరి వస్తున్న సంగతి చెబుదామని అనుకున్నాను. ముఖ్యమంత్రి డా చెన్నారెడ్డి రాజీనామా చేసినట్టు పత్రికలో వచ్చిందని చెప్పారు. నా ప్రక్కనున్న వేణుమాధవ్ ఈ విషయం విన్నారు.
మేము త్యాగరాజ్ ఇంటివద్ద భోజనం చేసి ఎయిర్ పోర్టుకు చేరుకున్నాము. అప్పటికి ప్రతినిధులు, మారిషస్ ఆంధ్రులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా వార్త అందరికీ తెలిసిపోయింది. అందరూ నా వద్దకు వచ్చి వివరాలు అడగటం ప్రారంభించారు. పూర్తివివరాలు నేను తెలుసుకోలేదు. ముఖ్యమంత్రి పదవికి చెన్నారెడ్డి రాజీనామా చేశారని మాత్రమే తెలిసిందని వారికి వివరించాను.
ఎయిర్ పోర్టులో రాష్ట్ర రాజకీయాల మీద చర్చ మొదలైంది. ఈ హఠాత్ పరిణామం అందర్నీ ఆశ్చర్య చకితులను చేసింది. డా॥ చెన్నారెడ్డి పరిపాలనలో తప్పొప్పులపై మాట్లాడసాగారు అందరూ.
- వీడ్కోలు
మారిషస్ మంత్రి శ్రీ ఉచ్చన్న, ఆంద్ర మహాసభ అధ్యక్షులు శ్రీ సూరయ్య ఎందరో మారిషస్ ఆంధ్రులు ఎయిర్‌పోర్టుకు వచ్చి మాకు బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్పారు. విమానం నుంచి మారిషస్ భూభాగాన్ని తిలకిస్తున్న నాకు కొసరాజు గీతం మనసులో మెదిలింది.
తెలుగువాడు ఏడనున్న తెలుగువాడు
తెలుగుభాషనే సొంపుగా పలుకుతాడు
- మరచిపోని అతని కట్టు
- మారిపోని అతని బొట్టు
తలుచుకున్న రోమరోమం పులకరిస్తుందీ
అభిమానం పొంగి పొరలి ఉరకలేస్తుందీ!
ఎంత నిజం!... పలుకు నేర్పిన గడ్డనీ ... పుట్టుకకు కారణం అయిన తల్లినీ ఎవరు మాత్రం మరచిపోగలరు? మారిషస్‌కు దూరం అవుతున్నాం. మారిషస్ ఆంధ్రులకు దూరం అవుతున్నాం... విమానం గాలిలోకి ఎగరగానే ... అయితే ఆ కొద్ది రోజుల సహచర్యం.. . పంచుకున్న పలుకులూ... అభిమానాలూ ...ఆత్మీయతలూ హృదయాలను విడిపోనీయనంత గట్టిగా ... ఘనంగా ముడి వేసేశాయి. స్నేహకపోతంలా....! ! ! అవును... తేనేలాంటి తెలుగుతనం ఆంధ్రులన్న వాళ్ళు ఎక్కడున్నా కలిపే ఉంచుతుంది.
మనోపలకం మీద చెరగని రూపాలతో.. . చెదరని బందాలలో ---
విమానం అలా అలా మబ్బు తునకల్ని చీల్చుకుంటూ .. మారిషస్‌కి వీడ్కోలు చెబుతూ భారతదేశంవైపు పయనిస్తోంది.
స్నేహకపోతంలా....! ! !
No comments:
Post a Comment