Friday, August 31, 2018

అంతర్జాతీయభాష (international language), ప్రపంచ భాష (global language) ల మధ్య తేడా

దాదాపు పదిహేనేళ్ళ కిందట ఇంటర్నెట్లో Spanish as a global language అనే ఒక వ్యాసం చదివాను. ఆ వ్యాసరచయిత ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీషుతో స్పానిష్ ని పోలుస్తూ, స్పానిష్ కూడా ఒక ప్రపంచ భాషగా మారడం గురించి కొన్ని ఆలోచనలు పంచుకున్నాడు. అతడికి ఆ విషయంలో డేవిడ్ క్రిస్టల్ రాసిన English as a Global Language (1997) అనే రచన స్ఫూర్తినిచ్చింది.
డేవిడ్ క్రిస్టల్ నేడు జీవించి ఉన్న ఇంగ్లీషు భాషాపండితుల్లో ఒక విజ్ఞాన సర్వస్వం వంటివాడు. అతడు ఇంగ్లీషు భాషాపరిణామాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తూ ఇంగ్లీషు గ్లోబల్ భాషగా పరిణమిస్తోందని చెప్తున్నప్పుడు, అంతర్జాతీయభాష (international language), ప్రపంచ భాష (global language) ల మధ్య తేడా ఉందని గుర్తుపట్టాడు.
ఒక భాష మాట్లాడే ప్రజలు వివిధ దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పుడు ఆ భాష కేవలం అంతర్జాతీయ భాష మాత్రమే అవుతుంది. అలా కాక, వివిధ దేశాల్లో ఉండే వివిధ భాషావ్యవహర్తలు కూడా ఒక భాష మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, ఆ భాష ప్రపంచభాషగా మారుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచమంతా వ్యాపించి ఉన్న రోజుల్లో ఇంగ్లీషు ఒక అంతర్జాతీయ భాష గా మాత్రమే ఉండింది. కాని 1980 తర్వాతనే ఇంగ్లీషు ఒక గ్లోబల్ భాషగా వికసించడం మొదలుపెట్టింది. చాలా కాలం పాటు ఇంగ్లీషుకి దూరంగా ఉన్న చైనా లాంటి మహాదేశం కూడా ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకోక తప్పని స్థితికి ఇంగ్లీషు చేరుకుంది.
అయితే, ఈ అవకాశం ఇంగ్లీషుకు మాత్రమే స్వంతమా? మరొక భాష ఈ స్థాయికి చేరుకునే అవకాశం లేదా? ఈ ప్రశ్నలతో ఆ స్పానిష్ భాషాభిమాని తన వ్యాసం మొదలుపెడుతూ, ఒక భాష ప్రపంచ భాష గా ఎదగాలంటే ఉండవలసిన ఈ లక్షణాలను స్థూలంగా పేర్కొన్నాడు.
ఒక భాష ప్రపంచభాషగా ఎదగడానికి ఆ భాష ని మాట్లాడే మూలవ్యవహర్తల సంఖ్యతోగాని, ఆ దేశం పరిమాణంతోగాని, ఆ భాషతాలూకు వ్యాకరణ నిర్మాణంతో గాని సంబంధం లేదు.
ఒక భాష ప్రపంచానికి పరిచయం కావడానికి, ఆ భాష మాట్లాడేవాళ్ళ రాజకీయ శక్తి తొలిరోజుల్లో ఉపయోగపడుతుంది. కాని, ఆ తరువాత కేవలం రాజకీయ శక్తి వల్ల ఆ భాష గ్లోబల్ భాషగా మారిపోదు.
ఒక భాష అంతర్జాతీయ స్థాయినుంచి ప్రపంచభాషగా మారే క్రమంలో అన్నిటికన్నా ముందు అవసరమైంది ఆ భాష కుండే చలనశీలత. అంటే వివిధ ప్రపంచ పరిణామాల్ని ఆ భాష ఎంత తొందరగా పట్టుకోగలదు, వ్యక్తం చేయగలదు అన్నది ముఖ్యం.
రెండవది, ఒక భాష ప్రపంచభాష కావాలంటే, ఆ భాష నేర్చుకోవడంలో ఒక ఆర్థిక ప్రయోజనం ఉండాలి. అంటే, ఆ భాష జీవనోపాధి భాషగా కూడా వికసించవలసి ఉంటుంది. ఉదాహరణకి, జపనీస్.
ఒక భాష జీవనోపాధి భాషగా మారాలంటే, ఆ భాష మాట్లాడే ప్రజలు ప్రపంచ వాణిజ్యంలోనూ, వస్తుసేవల ఉత్పత్తిలోనూ ప్రధానపాత్ర పోషించగలగాలి. ప్రపంచంలోని వివిధ దేశాలవారికి ఆ మూలభాషా వ్యవహర్తలతో మాట్లాడే అవసరం ప్రతిరోజూ కలగాలి. ఇందుకు ఉదాహరణ చైనీస్.
ఒక భాష ఆర్థికంగా ముందంజ వేస్తేనే చాలదు, ఆ భాషలో అత్యంత మౌలికమైన వైజ్ఞానిక, సాంకేతిక, తాత్త్విక వాజ్ఞ్మయం కూడా రావలసి ఉంటుంది. ఉదాహరణకి కిర్క్ గార్డ్ ని మూలంలో చదవడానికి ఎందరో డేనిష్ నేర్చుకోడానికి సిద్ధపడుతుంటారు. 500 ఏళ్ళ కిందట మిడిల్ ఇంగ్లీష్ గా ఉన్న ఆంగ్లో సాక్సన్ భాషను ఇంగ్లీషుగా మార్చిన వాళ్ళల్లో షేక్ స్పియర్ తో పాటు ఫ్రాన్సిస్ బేకన్, థామస్ హాబ్స్ కూడా ఉన్నారు. ఒక భాష సుసంపన్నం కావాలంటే గొప్ప సాహిత్యం రావాలి. కాని, అది 18 వ శతాబ్దం దాకానే సత్యం. గత రెండు వందల ఏళ్ళుగా ఏ భాషలో మౌలికమైన వైజ్ఞానిక పరిశోధన, తాత్త్విక చింతన, చర్చ జరుగుతున్నాయో, ఆ భాషలు మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకి జర్మన్. ఆధునికభాషల్లో అంత తాత్త్వికభాష మరొకటి లేదు. హిడెగ్గర్ లాంటి తాత్త్వికుణ్ణి ఇంగ్లీషు అనువాదంలో చదువుతున్నప్పుడు, ఇంగ్లీషు ఆ చింతన బరువు మోయలేకపోతున్నదనీ, తక్షణమే మనం జర్మన్ నేర్చుకోకతప్పదనీ గ్రహిస్తాం.
సరే, ఒక భాష బృహద్భాషగా పరిగణించబడాలంటే ఆ భాషలో గొప్ప సాహిత్యం వచ్చి ఉండాలనేది మళ్ళీ చెప్పవలసిన పనిలేదు. కాని, మనం కొత్తగా చెప్పుకోవలసిందేమంటే, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగాపెరుగుతూ వస్తేనే ఆ భాష ప్రపంచభాషగా మారుతుందనేది.
అంటే, ఆ మూలభాషలో గొప్ప సాహిత్యం ఉందనీ, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవలేకపోతే ప్రపంచం పేదదైపోతుందనే భావన కలిగేటంతగా, ఆ భాషా సాహిత్యం వివిధ ప్రపంచ భాషల్లోకి అనువాదం కావాలి. ఇందుకు చెప్పదగ్గ గొప్ప ఉదాహరణ రష్యన్.
ఒక భాష ప్రపంచభాషగా మారుతున్నదనడానికి క్రిస్టల్ చెప్పిన ఒక కొండ గుర్తు, ఆ భాషని ద్వితీయ భాషగా నేర్చుకోడానికి ఇష్టపడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎంత పెరుగుతోందో చూడమని.
ఆయన ఆ మాట రాసి ఇరవయ్యేళ్ళయ్యింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక డిజిటల్ పరికరం తయారు చేసినప్పుడు, అందులో డిఫాల్టుగా పొందుపరిచే భాషల్లో ఒకటికాగలినప్పుడే ఆ భాషని ప్రపంచ భాషగా పరిగణించగలమని. ఎన్నో భారతీయభాషలకన్నా ఎంతో చిన్నదైన జపనీస్ ని ఈ సూచిక ప్రకారమే నేను గ్లోబల్ భాషగా పేర్కొంటున్నాను.
ఒక భాష వికసించాలంటే, లిపి, వ్యాకరణం, పదజాలం ముఖ్యమైనవే గాని, మరీ ఏమంత ముఖ్యమైనవి కావు. ఒక భాషలో ఆ భాషా పదజాలం ఉన్నంతమాత్రాన దాన్ని మనం సజీవ భాష అనడానికి లేదు. వేరే భాషల పదజాలాన్ని ఆ భాష ఎంత శీఘ్రంగా, ఎంత విస్తారంగా స్వీకరించగలదో లేదో అన్నదాన్నిబట్టే ఆ భాష సజీవం అవునోకాదో చెప్పగలం. ఉదాహరణకి, ఇప్పటి ఇంగ్లీషులో మూల ఆంగ్లో సాక్సన్ పదజాలం 25 శాతం కన్నా తక్కువే. మూడొంతులు విదేశీ పదజాలంతోనే ఇంగ్లీషు వికసిస్తున్నది. భాషని పదజాలంగా పొరపడకూడదు.
నలుగురూ భాష నేర్చుకోడానికి మనం లిపిని సంస్కరించవలసిన అవసరం లేదు. అత్యంత సంక్లిష్టమైన లిపులు కలిగిన చైనీస్, కొరియన్, జపనీస్ వంటి భాషలు నేర్చుకోడానికి ప్రపంచానికి ఆ భాషల లిపి అడ్డం పడటం లేదు. అసలు ఒక భాషకి లిపి ఏమంత ముఖ్యం కూడా కాదు. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే హిందీకి స్వంత లిపి లేనే లేదు. మలేషియన్ భాష రోమన్ లిపినే వాడుకుంటున్నది.
ఒక భాషని వికసింపచేయడానికి ఆ భాషలో అక్షరాలు తగ్గించనక్కర్లేదు. ఏ భాషకైనా ఏదో ఒక సంక్లిష్ట పార్శ్వం ఉంటుంది. ఇంగ్లీషులో అక్షరాల సంక్లిష్టత తక్కువ, నిజమే, కాని స్పెల్లింగు సంక్లిష్టత చాలా ఎక్కువ. తానే కనుక భాషాదేవత అయి ఉంటే, ఇంగ్లీషు గ్లోబల్ భాష కావడానికి ఎంత మాత్రం ఇష్టపడి ఉండేవాడిని కానని స్వయంగా డేవిడ్ క్రిస్టల్ నే అన్నాడు. అందుకు ఆయన చూపించిన కారణం వికృతమైన ఇంగ్లీషు స్పెల్లింగు వ్యవస్థ. But ని బట్ అని పలుకుతున్నప్పుడు put ని మటుకు పుట్ అనీ ఎందుకు పలకాలో అర్థం కావటం లేదని డేవిడ్ క్రిష్టల్ కన్నా యాభై ఏళ్ళ ముందే 'విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు' రచయిత వాపోయాడు. ఒక భాషలోని అక్షరసంపద ఆ భాషలోని ఉచ్చారణసంపదకు కారణమవుతుంది. సంస్కృతమే ఇందుకు ఉదాహరణ.
వ్యాకరణం భాషకి వెన్నెముకనే గాని, స్థిరమైన వ్యాకరణం ఏ భాషకీ లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. తాను ఈజిప్టు వెళ్ళినప్పుడు అక్కడివాళ్ళు Welcome to Egypt అనకుండా, Welcome in Egypt అన్నారనీ, ఆ ఇంగ్లీషుని కూడా తాను ఆమోదించక తప్పలేదనీ క్రిష్టల్ ఒకచోట రాసుకున్నాడు.
ఈ నేపథ్యంలో తెలుగు భాష ఎక్కడుంది? ethnologue.com లెక్కల ప్రకారం సుమారు ఎనిమిదికోట్ల మంది మొదటిభాషగానూ, 5 కోట్ల మంది ద్వితీయ భాషగానూ మాట్లాడుతున్న ఈ భాష ప్రపంచ పటంలో ఎక్కడుంది?
గత ఇరవయ్యేళ్ళలో ఈ భాష నేర్చుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ముందుకొచ్చారు?
గత పదేళ్ళలో ఎన్ని వైజ్ఞానిక, తాత్త్విక గ్రంథాలు తెలుగు భాషలో వెలువడ్డాయి? ఎన్ని అనువదించబడ్డాయి?
ఎన్ని ప్రాచీన తెలుగు కావ్యాలు ఎన్ని ప్రపంచభాషల్లోకి అనువదించబడ్డాయి? ఎన్ని ప్రపంచవ్యాప్త సర్వశ్రేష్ఠ రచనలు తెలుగులోకి అనువదించబడ్డాయి?
తెలుగు భాషలో ఎన్ని వెబ్ సైట్లు నడుస్తున్నాయి? ఎన్ని బ్లాగులు నడుస్తున్నాయి? వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎందరు వీక్షించారు?
గత పదేళ్ళలో ప్రపంచ భాషల్లోంచి ఎన్ని కొత్త పదాలు తెలుగులోకి వచ్చాయి? ఎన్ని తెలుగు పదాలు ప్రపంచభాషల్లోకి ప్రవేశించాయి?
ఎన్ని నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు తెలుగులో రూపొందాయి? ఎన్ని స్పోకెన్ తెలుగు కోర్సులు కొత్తగా రూపొందాయి?
ఎన్ని డిజిటల్ పుస్తకాలు, ఎన్ని ఆడియో పుస్తకాలు తెలుగులో ప్రచురించబడ్డాయి? ఎన్ని ఆన్ లైన్లో కుదురుకున్నాయి?
మార్కెట్లోకి వస్తున్న కొత్త మొబైల్ ఫోనుల్లో ఎన్నింటిలో తెలుగు ఒక భాషగా by default అమర్చిఉంటున్నది?
మిత్రులారా, ఆలోచించవలసింది వీటి గురించి. అంతే తప్ప, ఒక్క ఇంగ్లీషు మాట కూడా లేకుండా ఎన్ని నిముషాలు మాట్లాడగలం, ఎన్ని ఇంగ్లీషు పదాలకి కృత్రిమ తెలుగు సమానార్థకాలు రూపొందించగలం, 56 అక్షరాల్లోనూ ఎన్ని అక్షరాల్ని నిర్మూలించాం, ఎన్ని సైన్ బోర్డులు తెలుగులో పెట్టామని కాదు.

No comments:

Post a Comment

Total Pageviews