Sunday, August 12, 2018

జీవితాన్ని అనుభవించు వయసే "అరవై" (ఒక హిందీ కవితకు స్వేచ్ఛానుకృతి)



whatsapp లో వచ్చిన ఓ చక్కని కవితకి నా పెన్సిల్ చిత్రం.
జీవితాన్ని అనుభవించు వయసే "అరవై" 
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే "దొర"వై..
హోంవర్కు దిగులు లేదు పసివాళ్ళలా..
వొత్తిడుల గుబులు లేదు పడుచువాళ్ళలా..
'నడికారు' లాగ లేదు కలవరం..
వొడిదొడుకులు లేకుండుటె ఒక వరం..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
బడి కెళ్ళాలని లేదు గడబిడ..
హడావిడి పడుట లేదు పని కడ..
బస్సు కొరకు వెయిటింగు బెరుకు లేదు..
ఉస్సురుస్సురనే ట్రాఫిక్ ఉలుకు లేదు..
ఉదయం రాందేవ్ యోగా, ధ్యానం
మధ్యాహ్నం ఎండ తగులని విరామం..
సాయంకాలాలు సమవయస్కులతో
చర్చోపచర్చలు, చతుర సంభాషణలు..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
అమ్మా నాన్నల పోరు లేదు..
ఆఫీసు, బాసు జోరు లేదు..
మనుమలు, మనుమరాళ్ళ ఆటపాటలు,
కొడుకులూ, కోడళ్ళు.. కూతుర్లూ అల్లుళ్ళ
హర్షాతిరేకాలు, ఆహ్లాదపూరితాలు..
ఆశీస్సులకై శిరసువంచే
ఆనందమయ సన్నివేశాలు..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
పాఠశాల, క్రమశిక్షణ వంటివి లేవు..
పరిమితులు, అనుమతుల బాధలు లేవు..
పెద్దవారు అడ్డుకునే సందేహం,
ఎవరేమంటారోననే అనుమానం
మచ్చుకైన కానరావు,
మరియాదలు తప్పవు..
ఏదైనా అనొచ్చు.. ఏమైనా కనొచ్చు..
మనసుకు తోచిన రీతి
మాట్లాడడమే పద్ధతి..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై. .
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
(ఒక హిందీ కవితకు స్వేచ్ఛానుకృతి)

No comments:

Post a Comment

Total Pageviews