Sunday, November 18, 2018

కార్తీక శుద్ధ ఏకాదశి నాడు " అంబరీష ఉపాఖ్యాన" పఠనం సర్వ శ్రేష్ఠం!

కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు, ఉపవాసం ఉండి, ఈ రోజున భాగవత పురాణంలోని " అంబరీష ఉపాఖ్యాన" పఠనం సర్వ శ్రేష్ఠం!
అంబరీషుని కథ భాగవత పురాణంలో ఇలా ఉంది. 
అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. నభగ మహారాజు కుమారుడు. శ్రేష్టుడైన అంబరీషుడు ఏడు దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజస్తంభాలమీద మోపి శుభాలనూ పొంది, రాజ్యసంపదను కలిగి చెడునడతకు లోనుకాకుండా, విష్ణుపూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఏమరుపాటు పొందక ఈ లోకంలో ప్రశస్తి గాంచాడు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు.
ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు.ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి, ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉండి, ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేసాడు. ఆయనను అత్యంత భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసుణ్ణి తన గౌరవ అతిథి గా ఉండమని అర్థించాడు అంబరీష మహారాజు. దుర్వాసుడు అందుకు సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదివైపు వెళ్ళాడు.
దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతోంది. నదీ స్నానానికని వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. అంబరీషుడు తమ కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ దళం తో కొంత మంచి నీళ్ళు పుచ్చుకుని దీక్ష విరమించి దుర్వాస ముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహించాడు. దుర్వాస ముని కోపం గురించి తెలిసిందే కదా!
అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకని లాగి ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలువగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క వేటుతో ఆ రాక్షసుణ్ణి సంహరించి దుర్వాసుడి వెంట పడింది. దుర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మ, శివుడి దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపడం తమ వల్ల కాదనీ, శ్రీ మహావిష్ణువు దగ్గరకే వెళ్ళమన్నారు. చివరికి దుర్వాసుడు శ్రీ మహా విష్ణువును వేడుకున్నాడు. ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బంధీ కాబట్టి ఆయన్నే వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుని వేడుకోగానే, ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు. భక్తికి పరమాత్ముని సైతం శాసించగల శక్తి ఉందన్న మాట ఈ ఘటన మనకి మరొక్క ఉదాహరణ!
అంబరీషోపాఖ్యానం కార్తీక మహాత్మ్యం లో కూడా వస్తుంది. ఈ సమయంలోనే దూర్వాస ముని కోపముతో అంబరీషుని రక రకాల జంతువులుగా కమ్మని శపిస్తే వాటన్నిటినీ విష్ణువు తీసుకుని ఆయన ఎత్తిన జన్మలే మన దశావతారాలు. ఈ అంబరీషుని కద్థ వేరు వేరు పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పబడింది. శివపురాణం లో కథ వేరే గా ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. సుదర్శన చక్రం రాక్షసుని చంపివేసిన తరువాత దుర్వాసుని వైపు వెళ్ళిందనీ, ఆయన శివ స్వరూపం కాబట్టి చక్రం వెనక్కు తగ్గిందనీ, నంది వచ్చి అంబరీషుని దుర్వాసుని క్షమాపణ వేడుకోమన్నాడనీ, అలాగే అంబరీషుడు దుర్వాసుని క్షమాపణ కోరాడని ఉంటుంది. అయితే ఈ అంబరీషుని కథ మనకి మాత్రం భాగవతంలో ఉన్నది ప్రమాణం గా తీస్కుంటాము.

కార్తిక పురాణము - పదకొండవ అధ్యాయము




రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. కార్తీకమాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణవ్రత ఫలము పొందును. కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలనుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును బొందుదురు. ఈవిషయమై యొక పూర్వకథగలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును. బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము. కళింగదేశమందు మందరుడను నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భార్యయుండెను. ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలైయుండెను. ఓరాజా! ఆసుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని యుండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యముకొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గానవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆధనమంతయు తాను హరించెను. 
తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్యగంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన బడిరి. యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి. జనకమహారాజా! ఆబ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును జేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓరాజా! ఇట్లుండగా దైవవశముచేత ఒక యతీశ్వరుడు హరినామముచేయుచు నాట్యముచేయుచు పులకాంకితశరీరుడై హరినామామృతమును పానముచేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను. ఆమెయు ఆయతిని జూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా! మీరు మాయింటికి వచ్చుటచేత నేను తరించితిని. మీవంటివారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్తలేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె యిట్లుచెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయిన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో మీయింటిలో పురాణ పఠనము జరుపవలెను, ఆపురాణమునకు దీపముకావలెను. నూనె తెచ్చెదను. గనుక వత్తి నీవు చేసిఇమ్ము.
Image may contain: flower శ్యామయనగా యౌవనవతియని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆచిన్నది విని సంతోషముతో గోమయముతెచ్చి ఆయిల్లు చక్కగా అలికినదై అందు అయిదురంగులతో ముగ్గులను బెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆదూదిచే రెండు వత్తులను జేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆచిన్నది దీపపాత్రను, వత్తిని తాను యిచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆదీపమునందు హరిని బూజించి మనశ్శుద్ధి కొరకై పురాణపఠనమారంభించెను. ఆమెయు ప్రతియింటికిబోయి పురాణశ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను. అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును, పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంకరించబడిన విమానమును దీసికొని క్వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆవిమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకుబోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి అచ్చట తనపి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతోనిట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి. ఈనరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈవిషయమును నాకు జెప్పుడు. వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును జేసియు పరధనాపహరణము జేసినాడు. వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈరెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్న వాి నొకనిని చంపి వానిధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు. వీడు నీభర్తను యీబ్రాహ్మణుని యిద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈనాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి. ఈపులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను. నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏపుణ్యము చేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను. ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా! కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలమును నీభర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగానిమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు బోయి ప్రజలను బిలిచిన పుణ్యమును ఈకృతఘ్నునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు. విష్ణుదాతలమాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారివారికిచ్చెను. దానిచేత వారు నరకమునుంి విడుదలయై దివ్యమానములనెక్కి ఆస్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీకమాసమందు పురాణశ్రవణమును జేయువాడు హరిలోకమందుండును. ఈచరిత్రను వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేికొని మోక్షమును బొందుదురు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాస్సమాప్తః



Friday, November 16, 2018

పంచ( ఐదు ) అనే సంఖ్య విశిష్టత

పంచ అనే సంఖ్య విశిష్టత

పంచ భూతములు – భూమి,నీరు, అగ్ని, గాలి, ఆకాశము. ( పృథివ్యాపస్తేజో వాయురాకాశములు )

పంచేంద్రియాలు -ఘ్రాణేంద్రియం (ముక్కు), రసనేంద్రియం (నాలుక), చక్షురింద్రియం (కన్ను), త్వగింద్రియం(చర్మం), శ్రోత్రేయింద్రియం (చెవి)

పంచ మహాపాతకాలు – స్వర్ణస్తేయం, సురాపానం, బ్రహ్మహత్య, గురుపత్నిగమనం, మహాపాతకసహవాసము (బంగారం దొంగిలించటం, మద్యం సేవించడం, బ్రాహ్మణుని హత్య చేయడం, గురువు భార్యను పొందడం,మహా పాపులతో చెలిమి చేయడం)

పంచ పర్వములు – కృష్ణపక్ష అష్టమి, కృష్ణపక్ష చతుర్డశి, అమావాస్య ,పూర్ణిమ, సంక్రాంతి

పంచ ప్రాణములు – ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం

పంచోపవాయువులు – నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనుంజయం

పంచ మహాకావ్యాలు- మనుచరిత్ర (పెద్దన), వసు చరిత్ర(భట్టుమూర్తి), రాఘవ పాండవీయం(సూరన), పాండురంగమాహత్మ్యం(తెనాలి రామలింగడు), శృంగార నైషధము(శ్రీనాధుడు).

పంచ కన్యలు – అహల్య, తార, ద్రౌపది,సీత, మండోదరి.

పంచారామాలు – ద్రాక్షారామం, భీమారామం, కుమారామారం, అమరారామం, క్షీరారామం.

పంచాయతన దేవతలు – ఆదిత్యం, ఆంబికం, గణనాధం, విష్ణుం,, మహేశ్వరం

పంచ ముఖాలు – ఆఘోరము, ఈశానము,తత్పురుషము, వామదేవము, సద్యోజాతము.

పంచ గంగలు – కావేరి, తుంగభద్ర, కృష్ణవేణీ, గౌతమి, భాగీరధి.

పంచ భక్ష్యములు – భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం.

పంచాంగములు – తిథి, వారము,నక్షత్రము, యోగము, కరణము

మాతృపంచకము – రాజు భార్య, అన్న భార్య, గురు భార్య, భార్యనుగన్న తల్లి, తన్ను గన్న తల్లి.

పితృపంచకం- తన్నుగన్నవాడు, తనకు వడుగు చేసినవాడు, చదువు చెప్పించినవాడు, విపత్తున అన్నము పెట్టి కాపాడినవాడు, ఆపద యందు భయము దేర్చి రక్షించినవాడు.

విష్ణుదేవుని పంచాయుధములు – శంఖము, చక్రము, గద,ఖడ్గము,,శార్గము

సంస్కృత పంచకావ్యములు – రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం, కాశే ఖండము, కిరాతార్జునీయం.

పంచవర్ణములు – తెలుపు, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ.( గాయత్రి దేవి ముఖములు )

పంచ గవ్యములు – గోమూత్రము, ఆవు పేడ,నెయ్యి, పెరుగు,పాలు.

పంచామృతములు – ఆవుపాలు,ఆవుపాల పెరుగు, ఆవునేయి, తేనె, పంచదార.

కార్తిక పురాణము - పదవ అధ్యాయము


జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మమందెవ్వడు? ఏమిపాపమును జేసెను? విష్ణుదూతలు చెప్పినమాటలను విని యమభటులు ఎందుకు యూరకుండిరి? యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును జెప్పిరి. అయ్యా! పాపాత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించువాడునునగు అజామిళునికి తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆమాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈఅజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామము చేయుటచేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను జ్పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణనుజేయువాడుజ్ జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వ జన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళు చాపుకుని శయనించుచు ఆయుధపాణియై స్నేహితులతో గూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను. ఆయూరిలోనొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియగు భార్యగలదు. ఆబ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నముకొరకై పట్టణములు, గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండెడివాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధ్యాన్యాదికమును శిరస్సుననుంచుకొని ఆకలితో యింటికివచ్చి భార్యతో ఓసీ! నాకుఆకలి కలుగుచున్నది. త్వరగా వంటచేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించెదను. భర్త యిట్లెన్ని మారులడిగినను భార్య అతని మాటను లెక్కచేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యూరకుండెను. అంత భర్త కోపించి దండముతో భార్యనుగొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్యసంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగానుండి రాత్రి భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికిపోయెను. సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించుమనెను. ఆమాటవిని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి. అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరు గొప్పకులమునందు బుట్టినవారు. మేము నిందుతులము. కాబట్టి యిట్టి సంపర్కము మీకు తగునా? ఈప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో ఆమెను కొట్టెను. ఆమెయు వానిని కొట్టి వానిని విడిచ రాజమార్గమున బోవుచుండగా పైనజెప్పిన శివార్చకుని జూచెను. అంతలో ఆస్త్రీ వానిని పట్టుకుని రతికేళికి రమ్మనమని పిలుచుకొనిపోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమునుబొంది భర్తవద్దకు బోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో గూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి కార్తీకపున్నమినాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ గలిగినది. ఆ హేతువులచేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును బొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనే యాతనలనొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఈమె పుట్టిన సమయము మంచిదాయని యొక బ్రాహ్మణునియడిగెను. అతడు ఈమె తండ్రిగండాన పుట్టినదని చెప్పెను. ఆమాటవిని చండాలుడు ఆశిశువును దీసుకొనిపోయి అరణ్యమందుంచెను. 
అంతలో ఒక బ్రాహ్మణుడు జూచి రోదనము చేయుచున్న ఆ శిశువును దీసికొనిపోయి తన ఇంటిలో దాసీగానున్నయొక స్త్రీకి నప్పగించెను. ఆదాసీది ఈమెను పెంచెనది. తరువాత ఈమెను అజామిళుడు దగ్గరకు తీసెను. తరువాత కథ పూర్వోక్తమే. రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిళుని పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అదిగాని యెడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము. ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరి పాదపద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు యెట్లు నశించును? ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తినొందెదరు. ఇందుకు సందియములేదు. కార్తీకధర్మమునకు పాపములను నశింపజేయి సామర్ధ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించనివాడు నరమునొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయి ఈకథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమొందుదురు. ఈకథను వినిపించువారు పాపవిముక్తులై వైకుంఠమందు విష్ణువుతో గూడి సుఖించును.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే దశమోధ్యాయస్సమాప్తః

భగవంతుని ప్రేమ కరుణ

భగవంతుని ప్రేమ కరుణ ఎలా ఉంటుందో ఒక చిన్న సంఘటన ఇస్కాన్ వారి ప్రసంగం ప్రేరణతో చెపుతాను.

       శ్రీ కృష్ణుడు బృందావనంలో ప్రతిరోజు 7 లక్షల ఆవులను రోజూ ఉదయం మేతకు తీసుకువెళ్లి...వాటితోనే సాయంత్రం వరకు ఉండి ఇంటికి తీసుకుని వచ్చేవారట...

      ఒకనాడు యశోద ..కృష్ణయ్యతో... క్రిష్ణయ్యా..నీవు రోజు ఆవులను మేతకు తీసుకొని వెళుతున్నావు...దారిలో రాళ్లు రప్పలు ఉంటాయి.
ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి నీ పాదాలు కందుతాయి...అందుకోసం అని నీకు పాదరక్షలు తెచ్చాను...ధరించి వెళ్ళమని చెప్పింది యశోదమ్మ..

     అప్పుడు కృష్ణుడు యశోదమ్మతో... అమ్మా నాతో ఈ ఆవులు కూడా తిరుగుతాయి... వాటికి కూడా రాళ్లు, ముళ్ళు, గుచ్చుకొంటాయి... వాటికి ఎండ వలన వాటి గిత్తలు కూడా కందుతాయి...కాబట్టి వాటికి పాదరక్షలు చేయించమ్మా.... అవి పాదరక్షలు ధరించినప్పుడే...నేను కూడా ధరిస్తాను అన్నాడట..
7 లక్షల ఆవులకి పాదరక్షలు చేయడం ఎలా అవుతుంది అని యశోద మిన్నకుండిపోయిందట..

   ఆవులు...కృష్ణయ్య తమ మీద చూపించే వాత్సల్యం చూసి..స్వామికి దారిలో రాళ్లు రప్పలు గుచ్చుకోకూడదని..ఆ ఆవులు అన్ని బృందావనం అంతా.. ఎక్కడా రాళ్లు రప్పలు లేకుండా తమ గిత్తలతో... నేలను సన్నని ఇసుక మాదిరిగా చదును చేసేసాయట... ఇప్పటికి బృందావనంలో నేల అలాగే ఉండటం విశేషం...

నీతి : భగవంతుడు అందరి మీద ఒకలాగే వాత్సల్యాన్ని, కరుణని చూపిస్తాడు...భక్తులు అది తెలుసుకొని స్వామి పట్ల అంకితభావంతో ఉండాలి..

కార్తీక పురాణం - 9వ అధ్యాయం.

విష్ణుదూతలడిగిరి. ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయముల్లన్నిటిని మాకు జెప్పుడు. ఇట్లని విష్ణుదూతలడుగగా యమదూతలు ఇట్లు పల్కిరి. ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను జేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని, పాపకర్మలందాసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును జేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపా పరిత్యాగియనగా తానువండిన అన్నములో ఇతరులకు యెంతమాత్రమును బెట్టకతానే అంతయు భుజించువాడు. పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజింిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయుసమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వనివానిని, తన్ను శరణుజొచ్చినవానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని బ్రాహ్మణహంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని, మేము దండింతుము. ఈమొదలయిన పాతకములను జేయు మానవులు యమలోకమందుండు మాచేత యాతనలను పొందుదురు. ఈఅజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును. ఈప్రకారముగా పలికిన యమదూతలమాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమియాశ్చర్యము. మీరింత మూఢులు, ధర్ మర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును జే్యువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములాచరించువాడును, జపహోమాదులాచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. No automatic alt text available.
కర్తృభోక్తృత్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము=ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని బూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను జేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను గట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును జేయించువాడును యమోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చనమాచరించి ఆతీర్థమును పానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతులయందుండగా ప్రాతస్స్నానమాచరించు వారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓరామయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశియందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందినయెడల వాడు సర్వపాపములు చేసినవాడయినను యమలోకమును పొందడు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.
Image may contain: 4 people
మహిమను తెలుసుకొనిగాని, తెలియకగాని, మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరి హరీయని అన్నయెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నియు భూమియందుగాని, స్వర్గమందుగాని హరినామసంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును జేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిళుని యమదూతలవలన విడిపించిరి. తరువాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించితిననెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి. తరువాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేకపోతినిగా ఛీ ఛీ నాబ్రతుకు సజ్జననిందితమాయెనుగదా, పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈదాసీభార్యను స్వీకరించితినిగదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా అయ్యో యెంత కష్టము,ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా. ఆనల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించినవాడను. ఇది నిజము. అట్లుగానిచో దాసీపతియైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును> నా జిహ్వహరినామమును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులనుజంపు నేనెక్కడ, మంగళకరమయిన నారాయణనామమెక్కడ? అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్తపాపవిముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియము లేదు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే నవమోధ్యాయస్సమాప్తః

పైనాపిల్‌... ఎంతో మేలు!

పైనాపిల్‌... ఎంతో మేలు!
పండ్లూ కూరగాయలు ఎంత తింటే అంత మంచిదన్నది తెలిసిందే. అయితే కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడంవల్ల వూబకాయం, మధుమేహం, హృద్రోగాలు... వంటి ఆరోగ్యసమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పైనాపిల్‌కు ఇది చక్కగా సరిపోతుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండటంవల్ల బీపీనీ తగ్గిస్తుంది.
* ఇందులోని సి-విటమిన్‌ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ క్యాన్సర్‌ను నిరోధిస్తుందట. దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుంది. పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ పరిశోధనల్లో తేలింది. ఇంకా ఇది ఆస్తమా నుంచీ రక్షిస్తుంది. కంటి కండరాల క్షీణతనీ తగ్గిస్తుందని తేలింది.
* క్యాన్సర్‌ రోగుల్లో రేడియేషన్‌ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ సమర్థంగా నివారించగలదని అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ పేర్కొంటోంది. ఈ ఎంజైమ్‌ పుండ్లూ గాయాలు త్వరగా మానేందుకూ తోడ్పడుతుందట. కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుంది.
* ఇందులోని పీచు మధుమేహానికి మందులా పనిచేస్తుంది. జీర్ణక్రియనూ పెంపొందిస్తుంది.
* ఇందులో సమృద్ధిగా దొరికే యాంటీఆక్సిడెంట్లు సంతాన సాఫల్యానికీ తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

Total Pageviews