Wednesday, December 5, 2018

మనిషి జీవితం విచిత్రమైంది

మనిషి జీవితం విచిత్రమైంది
"యవ్వనంలో సమయం,
శక్తి  రెండూ...ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..?

మధ్య వయసులో డబ్బు,
శక్తి  రెండూఉంటాయి.
కానీ సమయం ఉండదు..??

వృద్ధాప్యంలో సమయం,
డబ్బు రెండూఉంటాయి.
కానీ శక్తి మాత్రం ఉండదు..

తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
జీవితం ముగిసిపోతుంది.

మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..

మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...

కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి

ఆప్యాయత అనురాగలను పంచండి..
మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. 

మమ్మీ డాడి కల్చరు

” మమ్మీ డాడి ” చదువులొచ్చాక ‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము’ ఎగిరిపోయింది.నన్నడిగితే ‘వేయి పడగలు’ విలువ పెరిగిందంటాను.కాన్వెంట్ చదువులొచ్చాక,అన్ని పడగలూ పోయి ఉన్న ఆ ఒక్క పడగ కూడా ఎగిరిపోయింది.తెలుగు ‘మమ్మీల’ వ్యామోహం పుణ్యాన విశ్వనాథ వారు వేయిపడగల్లో తిట్టినదానికన్నా ఎక్కువ తిట్టాలి,’మమ్మీ డాడి కల్చరు’ కోసం తెలుగుతనాన్నీ, తెలుగు ఆత్మాభిమానాన్నీ,తెలుగు పౌరుషాన్నీ మంట కలిపేస్తున్న తెలుగు ‘మమ్మీల్ని’.

భాగవతంలో శ్రీ కృష్ణుడు మన్ను తిన్నాడని యశోద నోరు తెరవమన్నప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ‘మమ్మీ మన్నుతినగం నేశిశువునో ఆకొంటినో వెర్రినో’ అని చదవాల్సిన పరిస్థితి ఇప్పుడొచ్చింది.నోరారా ఇంటికి రాగానే పిల్లలు ‘అమ్మా’ అనకుండా ఈ ‘మమ్మీ’గోల ఎక్కడినించొచ్చిందిరా అని మా మేనత్తగారు ‘మమ్మీ-డాడీ’ గాళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా దులిపేస్తూంటారు.’మమ్మీ డాడీ’గాళ్ళకు ‘డింగ్డాంగ్ బెల్లు’ తెలిసినట్లుగా కృష్ణ శతకం, సుమతీ శతకం తెలవ్వు కదా;
అంచేత విశ్వనాథ వారు ఇంకా రెండు పడగలున్నాయని ఆ నవల్లో పొంగిపోయారు,కానీ కాన్వెంట్ల పిచ్చి గురించి వారు కాసుకోలేకపోయారు.ఆ రెండు పడగలనీ కూడా తెలుగు మమ్మీలు ఊడగొట్టేశారు.

శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో’మాలదాసరి’ కథలో మాలదాసరి చేత రాక్షసునికి జ్ఞానోపదేశం చేయిస్తారు. అంత గొప్ప కథ చదువుకునే అదృష్టం మనవాళ్ళకి ఉండొద్దూ?దసరా వచ్చిందంటే దసరా ఊరేగింపుల్లేవు. చిన్నపిల్లలు ఇంటింటికీ వెళ్ళి నిలబడి చదివే పద్యాలు విని ఆనందించని తెలుగు తల్లి ఉండేదా?
ఇంగ్లీషు గ్రామర్ సరీగ్గా రాకపోయినా’ఫాక్స్ టైల్ కాన్వెంటనో” ఆక్స్ఫొర్డ్ లిటిల్ కాన్వెంటనో’ పేరు కనబడ్డంతో శ్వేతవస్త్రాంభరధారులైన మలయాళీ రోమన్ కథొలిక్ నన్నమ్మలు, రుసరుసమంటూ,విసుక్కుంటూ తిరుగుతూ కనిపిస్తే చాలు,మన వాళ్ళకి ‘స్క్రూ’ లూజై వాళ్ళకి పాదాభివందనలు చేస్తారు. చిత్రం ఏమిటంటే విదేశాలలో ఉన్న తెలుగు వారు మన మతం,సంస్కృతి,ఆచారవ్యవహారాలూ అంటే పడి చస్తారు.పద్యం ఎలా తెలుగు వాడి సొత్తో, పచ్చడి అలాగ తెలుగువాడికి ప్రియాతి ప్రియమైనది.

పోతన్న గారు ‘అమ్మల గన్న యమ్మ’ అని భక్తితో అన్నారు కానీ,’మమ్మీల గన్న మమ్మీలు’ అనలేదుకదా. నాన్నా అని పిలిపించుకోవడంలో ఉన్న ఆప్యాయత దాడి,చాడి లాగ డాడీ అంటే వస్తుందా? ఈ చదువులు మన జీవితం నుంచి మనల్ని వేరు చేస్తున్నాయి.మన పిల్లల్ని జ్ఞానశూన్యులుగా చేస్తున్నాయి.తెలుగు భాష ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కుటుంబాల్లోని ఆడవాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందనేవారు ఒకప్పుడు. మరి ఇప్పుడో?.
లండన్ లో ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రాడు గోంగూర పచ్చడి వడ్డిస్తే దాన్నేవంటారు, గుర్తు లేదన్నాడుట.అలాటి వెధవల్ని నాలిక చీరేసి గొతిలో కప్పేయాలంటారు డాక్టర్ గూటాల కృష్ణమూర్తి గారు.విశ్వనాథ వారిచేత ఇంకా తిట్లు తినదగిన స్థాయిలోనే ఉంది మన సమాజం–వేయి పడగలూ జిందాబాద్. “

    ఈ వ్యాసాన్ని పురాణం వారు 70 ల్లోనే వ్రాశారు. తల్లితండ్రులకి తమ బిడ్డ తెలుగులోనే మాట్లాడి తగలడిపోతున్నాడేమో అన్న భావం ఉన్నంతవరకూ ఈ సమస్యకి అంతులేదు.మన దేశం లో ‘లంచగొండి’ తనం ఎలాగ పాతిపెట్తుకుపోయింది,
దానిని నిర్మూలించకలమా, అలాగే మన పిల్లలకి తెలుగు నేర్పించడమూనూ.’లంచం’ ఆపకలిగితే తెలుగు కూడా నేర్పగలము.

   తెలుగు గోల” అనే శీర్షిక క్రింద వ్రాశారు…రైళ్ళలొ కానీ,బస్సులలో కానీ మనకి ఒక రకమైన మాటలు వద్దన్నా వినిపిస్తూంటాయి.అరటిపళ్ళని అలా పిలవకుండా “కేళా కేళా” అని అరుస్తూంటాడు. అరటిపళ్ళని అరటిపళ్ళని పిలవడానికి సిగ్గు పడే జాతి మనది.శుభ్రమైన మామిడితాండ్రని –తాండ్ర తాండ్ర అని తాండ్ర పాపారయుళ్ళా గర్వంగా అరవక ఆంగ్లో ఇండియన్ లాగ ” మాంగో జెల్లీ మాంగో జెల్లీ ” అని అరుస్తాడు, అదీ తాండ్ర తయారుచేసే గోదావరి జిల్లాల్లో,
తాండ్ర అని పిలవడానికి నామోషీయేమో. జెల్లీ అని అరిచినవాడిని పిలిచి పూచి పుచ్చుకొని ఓ జెల్ల కొట్టాలి దిమ్మ తిరిగేలా. జీడిపప్పు అమ్మేవాడు “కాజూ కాజూ” అంటాడు. జీడిపప్పు అంటే వాడి హోదా ఏమిటో పోయినట్లు.
ఇంక రైల్లో భోజనం తెచ్చేవాడైతే “మీల్స్ మీల్స్” అని చెవి కోసిన మేకలా అరుస్తాడు కానీ, భోజనం అనడు. “పల్లీ పల్లీ ” అంటాడు కానీ హాయిగా వేరుశనగ పప్పూ అనడు.ఇడ్లీ వడా అంటాడు కానీ శుభ్రంగా గారె అనడు.ఎప్పుడైనా ఉడకపెట్టిన కోడి గుడ్లు తెస్తే ” అండా” అంటాడు. అండా ఏమిటీ వాడి పిండాకూడు !! ఆవడ అంటే హోటల్లో వాడికి అర్ధం అవదు, దహీవడా అనాలి.
ఇక మనవాళ్ళు భోజనాల దగ్గిర ” మీల్స్ ” తో ప్రారంభించి అరటికాయ కూర, వంకాయకూరా అని రామనామం జపించినట్లనలేరు, బేంగన్ అంటాడు, చట్నీ అంటాడు కానీ పచ్చడి అనడు. వంకాయ కూర అంటే వీడి పరువేమైనా గంగలో కలుస్తుందా,వీడి పిల్లనెవరూ చేసుకోరా, వీడి పెళ్ళాం వీడితో కాపురం చెయ్యనందా? ఈ తెలుగూస్ కి నోటిమీద వాతలు పెట్టించండి, తల్లి భాషలో మాట్లాడ్డానికి సిగ్గిల్లే దుర్మదాంధుల్ని. పులుసన్రా అంటే గ్రేవీ అంటాడు,పులుసులో ముక్కలు వేయడానికి కొంచెం సాఫ్ట్ పీసెస్ వేయండంటాడు.
ముష్టివాడు కొంచెం రైస్ వేయండనడు, అన్నం పెట్టు తల్లీ అంటాడు నోరారా.మన ఇంటి హీరో గారు ” రైస్ ఇలా అందుకో, కర్రీ ఇలా జరుపు,చట్నీ కాస్త రుబ్బూ,ఘీ ఉందా, పాప్పడ్ మరోటి వడ్డించమనూ” ఇలా సాగిస్తాడు కానీ
“తేనె పోక నోరు తీయన యగు రీతి” అన్నం అందుకోమనడు, కూర ఏమిటీ అనడు. మేంగోస్ అంటాడు కానీ మామిడిపండు అనలేడు.పెరుగంటే గుర్తొచ్చింది కర్డ్ అంటాడు.కారం ఎక్కువైతే చిల్లీస్ ఎక్కువ అని అఘోరిస్తాడు. భోజనం దగ్గర ఇంగ్లీష్ మాట్లాడేవాడి మూతిపళ్ళు రాలగొట్టాలని ఓ బిల్లు అసెంబ్లీ లో పాస్ చేయండి.
పట్టుచీరని సిల్క్ శారీ అనీ, రవికల గుడ్డని బ్లౌజ్పీస్ అనే స్థితికి దిగజారిపోయాము.మరి ఈ దేశాన్ని బాగుచేయలేం అని ఆత్మహత్య చేసికుంటారా లేక హత్యలు చేస్తారా, మీరే నిర్ణయించుకోవాలి. ”

    ఇదండీ ఆయన ఆత్మఘోషా.ఆయన చెప్పినట్లుగా ఈ పైత్యం అంటే మాతృభాషలో మాట్లాడడానికి నామోషీ అనుకోవడం మనవారికే చెల్లింది.మా చిన్నతనంలో మేమేమీ కాన్వెంటులకు వెళ్ళలేదు, తెలుగు లోనే నేర్చుకున్నాము, దానితో పాటు ఇంగ్లీష్ నేర్పారు.ఇప్పుడు దానికి వ్యతిరేకం–ఇంగ్లీషుతో పాటు వీలుంటేనే మాతృభాష. మిగిలిన రాష్ట్రాల్లో మరీ ఇంత అన్యాయం కాదు.మహరాష్ట్రలో మరాఠీ స్కూల్లో నేర్చుకోవాల్సిందే.



రచన :- భమిడిపాటి ఫణిబాబు 

Saturday, December 1, 2018

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని
ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం
తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.
తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే ) ఒక శంక.
అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన
కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.
కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ
అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. అన్నాడు.
వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.
భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి
ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప
ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.
చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా
చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న
ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ
నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.
ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం'
అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.
మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ
తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో
యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో
మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ,
అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను. అన్నాడు.
కాళిదాసు నవ్వాడు; 'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న
ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం
క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం
ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే
నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.
ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో
ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో
ఏ చిన్న మార్పూ అవసరం లేదు.
ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.
ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.
కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్
(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో
ఒకరుగా ఒదిగి ;
అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా
ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న
(మనకు)
అవిదిత గతమయామా - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన
జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.
అవునవును అన్నాడు భవభూతి.
అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు
రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)
అని చెప్తే మరీ బాగుంటుంది.
పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.
రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు
కాళిదాసు.
అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల
గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.
అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.
నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా
ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే
నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమె సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం
భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.
భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు.
కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.
భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం' 'మాలతీమాధవం'
'మహావీరచరితం' భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు.
-----------------------------శుభరాత్రి-------------------------------- 

Tuesday, November 27, 2018

కథ

అనగా అనగా ఒక ఊళ్ళో అట్ల పండా అనే బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ల అమ్మ తప్ప 'నా' అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అట్లపండా భిక్షాటన చేసేవాడు; వాళ్ల అమ్మేమో కూలిపనికి వెళ్ళేది. దాంతోటే వాళ్ల జీవనం గడుస్తూండేది.
ఒకరోజున అట్లపండాకి ఎక్కడా ఒక్క పిడికెడు బియ్యంకూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. "ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం?" అని బాధ పడుతూ, రోజూ వెళ్ళే దారిలో కాకుండా మరో క్రొత్త దారిలో నడవటం మొదలు పెట్టాడు.

అతను అట్లా అడవి దారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించిందతనికి. దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది. తను ఎంత అలిసిపోయాడో కూడా‌ గుర్తుకొచ్చింది. చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోకి ఒక్క దోసెడు నీళ్ళు తీసుకున్నాడు. పాట మొదలు పెట్టాడు- "ఇదిగో, బువ్వ తిన్నానూ.." అని ఆ నీళ్ళు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్ళు తీసుకొని, "పాయసం త్రాగానూ.." అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్ళు తీసుకుంటూ "బూరెలు ఇవిగో తింటున్నా..పప్పు నెయ్యీ తింటున్నా.."అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు.

ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూస్తే జాలి వేసింది. "అయ్యో పాపం" అనుకొని, ఆ తల్లి ఒక కుండను తీసుకొని, దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ అమర్చి, దాన్ని అట్ల పండా వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళలోంచి పైకి తేలి తేలి పండా దగ్గరికి చేరింది!

అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి అట్లపండా‌ ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకొని ఒడ్డు చేరుకున్నాడు; మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగానే అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు ప్రక్కనే ఉన్న అరటి చెట్టునుండి ఆకొకటి తెచ్చుకొని, కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ కడుపునిండా తిన్నాడు. చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి! "అమ్మకి పాపం, ఇవంటే ఎంత ఇష్టమో" అని, వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకొని ఇంటికి పరుగుతీసాడు.

కుండ చలవ వల్ల తల్లీ కొడుకు లిద్దరికీ ఆరోజు కడుపునిండా తిండి దొరికింది. రోజూ తెలవారకనే పనికి వెళ్ళే తల్లి, మరునాడు పనికి పోనేలేదు!

అట్లపండాని పిలిచి అన్నది-"ఒరే, మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను. నువ్వు వేరే ఎక్కడా అడుక్కోనవసరం లేదు. రోజూ కోనేరు దగ్గరికే వెళ్ళు నాయనా" అని. అట్ల పండాకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం‌ మానేసి, రోజూ కులాసాగా నడచుకుంటూ కోనేరు దగ్గరికే వెళ్ళి రావటం మొదలు పెట్టాడు.

కోనేరు చేరుకోగానే తను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రం లాగా చదివేసి పది దోసిళ్ల నీరు త్రాగేవాడు వాడు. గంగమ్మ తల్లి జాలిపడి, ఒక కుండనిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లీ కొడుకులకి పని చెయ్యవలసిన అవసరమే లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తినీ తినీ అట్లపండాకు బొజ్జ పెరగటం కూడా‌ మొదలైంది!

కొన్ని రోజులు ఇట్లా గడిసాక, గంగమ్మ తల్లికి అర్థమైంది- తన దయ కారణంగా తల్లీ కొడుకులిద్దరూ సోంబేరులవుతున్నారు! "ఇట్లా అయితే ఎలాగ, గుణపాఠం నేర్పాల్సిందే" అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండనిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది- ముష్టిఘాతాలు, లెంపకాయలు, గుద్దులు, తొడపాశాలు- ఇలాంటివన్నమాట. రోజూలాగానే ఆ కుండ తేలుకుంటూ అట్లపండా దగ్గరికి వచ్చింది. వాడు గబగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి, సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరచుకొని, కుండకున్న మూతను తీసాడు- వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది. "ఓలెమ్మో, ఓరి నాయనో" అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు వాడు. అయితే దెబ్బలు వాడిని వదిలితేగా..? వాడు ఎటు వెళ్తే అటు వెంబడించాయి అవి. చివరికి వాడి మెదడు పనిచెయ్యటం మొదలు పెట్టింది- పరుగు పరుగున కుండ దగ్గరికి చేరుకొని, వాడు దాని మూత మూసేయగానే ఒక్క క్షణంలో దెబ్బలన్నీ మాయమైపోయాయి!

అట్ల పండా నిశ్శబ్దంగా అక్కడే కూర్చొని ఆలోచించాడు- "ఇట్లా ఎందుకు జరిగింది?" అని. తను చేసిన తప్పేంటో అర్థమైంది వాడికి. వాడు లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, "ఇకమీద నేను నీ దగ్గరికి రాను తల్లీ, బుద్ధి వచ్చింది. ఏదో ఒక పనిచేసుకొని బ్రతుకుతాను" అని, కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు.

ఆసరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్లమ్మ. అట్లపండా కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి, ఆమె దాని మూత తీసి "ఈరోజు ఏమున్నాయి?" అని చూడనే చూసింది. ఇంకేముంది, ఆమె మీదకూడా దెబ్బల వర్షం మొదలు! ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు- ఆమె కేకలు వేసుకుంటూ‌ ఇల్లంతా గుండ్రగా పరుగెత్తింది. ఆమె కేకలు విని అట్ల పండా లోపలికి పరుగెత్తుకు వచ్చి కుండమీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనం అవ్వనే అయ్యింది!

"అబ్బా! అయ్యో! అమ్మా!" అనుకుంటూ ముసలమ్మ అక్కడే, చేరగిలపడింది, కుండకేసి భయం భయంగా చూస్తూ. "ఇకమీద మనం ఏదో ఒక పనిచేసుకొని మర్యాదగా బ్రతుకుదాం అమ్మా! ఈ అడుక్కు తినేది వద్దు. ఈ కుండని ఎక్కడైనా ఎవ్వరికీ అందని చోట పెట్టిరా" అన్నాడు అట్లపండా ఆమెతో. ఆమె భయం భయంగానే ఆ కుండని పట్టుకెళ్ళి, పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి, చేతులు దులుపుకున్నది- "సరేలేరా, మన రాత అంతే!" అంటూ.

అయితే ఏమైందంటే, ఆరోజు రాత్రి దివాణంలో దొంగలు పడ్డారు. రాజుగారికి పన్ను చెల్లించేందుకుగాను గ్రామపెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలైంది.

ఆ నలుగురు దొంగలూ ఒక పెద్ద పెట్టెనిండా బంగారు నగలు, ఆభరణాలు అన్నీ మోసుకొచ్చుకొని, అట్లపండా ఇంటి పెరడును చేరుకున్నారు.

"వీటిని వంతులు వేసుకుందాంరా" అన్నాడు వాళ్లలో ఒకడు. అందరూ సరేనని, అటూ ఇటూ చూస్తే, మొత్తం నిశ్శబ్దంగా ఉంది. "సరే, ఇక్కడే కూర్చుందాం, ఏమౌతుంది?" అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి, బట్ట పరచుకొని కూర్చున్నారు. దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ల కంట పడనే పడింది: "ఒరే, ఈ కుండ బాగుంది, అందులో ఏముందో చూద్దాం" అని వాళ్ళు దాని మూత తెరిచేసరికి ఏముంది, గుద్దుల వర్షం మొదలైపోయింది.

దొంగలు నలుగురూ "ఆలో లక్ష్మణా" అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు.

కొద్ది సేపటికి లేచి వచ్చిన అట్లపండా, వాళ్ల అమ్మ తమ దిబ్బమీద పెట్టిఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూసాక తల్లీ కొడుకులిద్దరికీ నోట మాటరాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెని ఇంట్లోకి మోసుకెళ్ళారు. అయితే, వాళ్ళిద్దరికీ ఆసరికే జ్ఞానోదయం అయి ఉన్నది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెని సొంతం చేసుకునే సాహసం చెయ్యలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామపెద్దకు అప్పగించారు.
"దొంగలు ఉమ్మడి ఆస్తినే ఎత్తుకెళ్ళారే, ఎలాగ?" అని తలపట్టుకొని కూర్చున్న గ్రామపెద్దకి అట్లపండా దేవుడల్లే కనిపించాడు.
ఆయన వాడిని పొగిడి, వాడి నిజాయితీని మెచ్చుకొని, వాడికి ఓ చిన్నపాటి సన్మానం చెయ్యటమే కాక, గ్రామ పంచాయితీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు! దాంతో తల్లీ కొడుకుల పేదరికమూ పోయింది; వాళ్లకు మంచిరోజులొచ్చాయి!

హంస - వేటగాడు. (కథ)

హంస - వేటగాడు

నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంసకథ తెలుసుకుందాం. మహేంద్రపురంని ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమినాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనయినంతవరకు ఇతర పక్షులకు సాయంచేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమజాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది.

మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒక రోజు వేటకోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవ్వాళ్ళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గానీ అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరిరంతో ఉస్సూరుమంటూ చెట్టు క్రింద కూర్చన్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కను విసనకర్రలా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు క్రిందే పడుకుండిపోయాడు.

అదే సమయంలో అక్కడకి వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపటానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయటానికి నీకు సిగ్గుగా లేదు అంది. దానికి హంస మిత్రమా! పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనయినంత సాయం చెయ్యాలి అంది. చెయ్యి! చెయ్యి బాగా సాయం చెయ్యి! అంటూ పావురం ఎగతాళిగా నవ్వూతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలా రెట్ట వేసి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగాపోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళుతెరచి తల పైకెత్తి చెట్టు మీదకు చూసాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లొ గుచ్చుకుని దాని ప్రాణాలను తీసీంది.

నీచబుద్ధి కల పావురం చేసిన పనికి పరోపకార బుద్ది కల హంస తన ప్రాణాలను పోగొట్టుకుంది కనుక నీచబుద్ధి కలవారితో స్నేహం చెయ్యటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి.

వైస్యులపై కంచె కవిత డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్



Tuesday, November 20, 2018

కూరగాయల మనోభావాలు..



గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...
పొట్లకాయకి పొగరు ఎక్కువ..
ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....
చిక్కుడుకు చికాకు ఎక్కువ..
ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....
కందకి..వెటకారం ఎక్కువ..
ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....
వంకాయకి గర్వమెక్కువ ..
కూరగాయలన్నింటికీ తనే రారాజునని....
బెండకాయకి ఆనందమెక్కువ..
తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....
దొండకాయకి ఆందోళనెక్కువ..
కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....
కాకరకాయకి శాంతమెక్కువ..
ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....
బంగాళాదుంపకి సహనమెక్కువ..
కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....
గుమ్మడికాయకి గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....
ఉల్లిపాయకి టెక్కు ఎక్కున..
తానులేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....
మిర్చికి కోపమెక్కువ..
ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....
కరివేపాకుకి మిడిసిపాటు ఎక్కువ..
తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....
బీరకాయకి దిగులెక్కువ..
తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....
కారెట్ కి బీట్ రూట్ కి హంగామా ఎక్కువ..
తమంతటి రంగు ఎవరికీ లేదని....!!
😊😊😁😁😆😆😜😜

Total Pageviews