Wednesday, December 5, 2018

మమ్మీ డాడి కల్చరు

” మమ్మీ డాడి ” చదువులొచ్చాక ‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము’ ఎగిరిపోయింది.నన్నడిగితే ‘వేయి పడగలు’ విలువ పెరిగిందంటాను.కాన్వెంట్ చదువులొచ్చాక,అన్ని పడగలూ పోయి ఉన్న ఆ ఒక్క పడగ కూడా ఎగిరిపోయింది.తెలుగు ‘మమ్మీల’ వ్యామోహం పుణ్యాన విశ్వనాథ వారు వేయిపడగల్లో తిట్టినదానికన్నా ఎక్కువ తిట్టాలి,’మమ్మీ డాడి కల్చరు’ కోసం తెలుగుతనాన్నీ, తెలుగు ఆత్మాభిమానాన్నీ,తెలుగు పౌరుషాన్నీ మంట కలిపేస్తున్న తెలుగు ‘మమ్మీల్ని’.

భాగవతంలో శ్రీ కృష్ణుడు మన్ను తిన్నాడని యశోద నోరు తెరవమన్నప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ‘మమ్మీ మన్నుతినగం నేశిశువునో ఆకొంటినో వెర్రినో’ అని చదవాల్సిన పరిస్థితి ఇప్పుడొచ్చింది.నోరారా ఇంటికి రాగానే పిల్లలు ‘అమ్మా’ అనకుండా ఈ ‘మమ్మీ’గోల ఎక్కడినించొచ్చిందిరా అని మా మేనత్తగారు ‘మమ్మీ-డాడీ’ గాళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా దులిపేస్తూంటారు.’మమ్మీ డాడీ’గాళ్ళకు ‘డింగ్డాంగ్ బెల్లు’ తెలిసినట్లుగా కృష్ణ శతకం, సుమతీ శతకం తెలవ్వు కదా;
అంచేత విశ్వనాథ వారు ఇంకా రెండు పడగలున్నాయని ఆ నవల్లో పొంగిపోయారు,కానీ కాన్వెంట్ల పిచ్చి గురించి వారు కాసుకోలేకపోయారు.ఆ రెండు పడగలనీ కూడా తెలుగు మమ్మీలు ఊడగొట్టేశారు.

శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో’మాలదాసరి’ కథలో మాలదాసరి చేత రాక్షసునికి జ్ఞానోపదేశం చేయిస్తారు. అంత గొప్ప కథ చదువుకునే అదృష్టం మనవాళ్ళకి ఉండొద్దూ?దసరా వచ్చిందంటే దసరా ఊరేగింపుల్లేవు. చిన్నపిల్లలు ఇంటింటికీ వెళ్ళి నిలబడి చదివే పద్యాలు విని ఆనందించని తెలుగు తల్లి ఉండేదా?
ఇంగ్లీషు గ్రామర్ సరీగ్గా రాకపోయినా’ఫాక్స్ టైల్ కాన్వెంటనో” ఆక్స్ఫొర్డ్ లిటిల్ కాన్వెంటనో’ పేరు కనబడ్డంతో శ్వేతవస్త్రాంభరధారులైన మలయాళీ రోమన్ కథొలిక్ నన్నమ్మలు, రుసరుసమంటూ,విసుక్కుంటూ తిరుగుతూ కనిపిస్తే చాలు,మన వాళ్ళకి ‘స్క్రూ’ లూజై వాళ్ళకి పాదాభివందనలు చేస్తారు. చిత్రం ఏమిటంటే విదేశాలలో ఉన్న తెలుగు వారు మన మతం,సంస్కృతి,ఆచారవ్యవహారాలూ అంటే పడి చస్తారు.పద్యం ఎలా తెలుగు వాడి సొత్తో, పచ్చడి అలాగ తెలుగువాడికి ప్రియాతి ప్రియమైనది.

పోతన్న గారు ‘అమ్మల గన్న యమ్మ’ అని భక్తితో అన్నారు కానీ,’మమ్మీల గన్న మమ్మీలు’ అనలేదుకదా. నాన్నా అని పిలిపించుకోవడంలో ఉన్న ఆప్యాయత దాడి,చాడి లాగ డాడీ అంటే వస్తుందా? ఈ చదువులు మన జీవితం నుంచి మనల్ని వేరు చేస్తున్నాయి.మన పిల్లల్ని జ్ఞానశూన్యులుగా చేస్తున్నాయి.తెలుగు భాష ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కుటుంబాల్లోని ఆడవాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందనేవారు ఒకప్పుడు. మరి ఇప్పుడో?.
లండన్ లో ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రాడు గోంగూర పచ్చడి వడ్డిస్తే దాన్నేవంటారు, గుర్తు లేదన్నాడుట.అలాటి వెధవల్ని నాలిక చీరేసి గొతిలో కప్పేయాలంటారు డాక్టర్ గూటాల కృష్ణమూర్తి గారు.విశ్వనాథ వారిచేత ఇంకా తిట్లు తినదగిన స్థాయిలోనే ఉంది మన సమాజం–వేయి పడగలూ జిందాబాద్. “

    ఈ వ్యాసాన్ని పురాణం వారు 70 ల్లోనే వ్రాశారు. తల్లితండ్రులకి తమ బిడ్డ తెలుగులోనే మాట్లాడి తగలడిపోతున్నాడేమో అన్న భావం ఉన్నంతవరకూ ఈ సమస్యకి అంతులేదు.మన దేశం లో ‘లంచగొండి’ తనం ఎలాగ పాతిపెట్తుకుపోయింది,
దానిని నిర్మూలించకలమా, అలాగే మన పిల్లలకి తెలుగు నేర్పించడమూనూ.’లంచం’ ఆపకలిగితే తెలుగు కూడా నేర్పగలము.

   తెలుగు గోల” అనే శీర్షిక క్రింద వ్రాశారు…రైళ్ళలొ కానీ,బస్సులలో కానీ మనకి ఒక రకమైన మాటలు వద్దన్నా వినిపిస్తూంటాయి.అరటిపళ్ళని అలా పిలవకుండా “కేళా కేళా” అని అరుస్తూంటాడు. అరటిపళ్ళని అరటిపళ్ళని పిలవడానికి సిగ్గు పడే జాతి మనది.శుభ్రమైన మామిడితాండ్రని –తాండ్ర తాండ్ర అని తాండ్ర పాపారయుళ్ళా గర్వంగా అరవక ఆంగ్లో ఇండియన్ లాగ ” మాంగో జెల్లీ మాంగో జెల్లీ ” అని అరుస్తాడు, అదీ తాండ్ర తయారుచేసే గోదావరి జిల్లాల్లో,
తాండ్ర అని పిలవడానికి నామోషీయేమో. జెల్లీ అని అరిచినవాడిని పిలిచి పూచి పుచ్చుకొని ఓ జెల్ల కొట్టాలి దిమ్మ తిరిగేలా. జీడిపప్పు అమ్మేవాడు “కాజూ కాజూ” అంటాడు. జీడిపప్పు అంటే వాడి హోదా ఏమిటో పోయినట్లు.
ఇంక రైల్లో భోజనం తెచ్చేవాడైతే “మీల్స్ మీల్స్” అని చెవి కోసిన మేకలా అరుస్తాడు కానీ, భోజనం అనడు. “పల్లీ పల్లీ ” అంటాడు కానీ హాయిగా వేరుశనగ పప్పూ అనడు.ఇడ్లీ వడా అంటాడు కానీ శుభ్రంగా గారె అనడు.ఎప్పుడైనా ఉడకపెట్టిన కోడి గుడ్లు తెస్తే ” అండా” అంటాడు. అండా ఏమిటీ వాడి పిండాకూడు !! ఆవడ అంటే హోటల్లో వాడికి అర్ధం అవదు, దహీవడా అనాలి.
ఇక మనవాళ్ళు భోజనాల దగ్గిర ” మీల్స్ ” తో ప్రారంభించి అరటికాయ కూర, వంకాయకూరా అని రామనామం జపించినట్లనలేరు, బేంగన్ అంటాడు, చట్నీ అంటాడు కానీ పచ్చడి అనడు. వంకాయ కూర అంటే వీడి పరువేమైనా గంగలో కలుస్తుందా,వీడి పిల్లనెవరూ చేసుకోరా, వీడి పెళ్ళాం వీడితో కాపురం చెయ్యనందా? ఈ తెలుగూస్ కి నోటిమీద వాతలు పెట్టించండి, తల్లి భాషలో మాట్లాడ్డానికి సిగ్గిల్లే దుర్మదాంధుల్ని. పులుసన్రా అంటే గ్రేవీ అంటాడు,పులుసులో ముక్కలు వేయడానికి కొంచెం సాఫ్ట్ పీసెస్ వేయండంటాడు.
ముష్టివాడు కొంచెం రైస్ వేయండనడు, అన్నం పెట్టు తల్లీ అంటాడు నోరారా.మన ఇంటి హీరో గారు ” రైస్ ఇలా అందుకో, కర్రీ ఇలా జరుపు,చట్నీ కాస్త రుబ్బూ,ఘీ ఉందా, పాప్పడ్ మరోటి వడ్డించమనూ” ఇలా సాగిస్తాడు కానీ
“తేనె పోక నోరు తీయన యగు రీతి” అన్నం అందుకోమనడు, కూర ఏమిటీ అనడు. మేంగోస్ అంటాడు కానీ మామిడిపండు అనలేడు.పెరుగంటే గుర్తొచ్చింది కర్డ్ అంటాడు.కారం ఎక్కువైతే చిల్లీస్ ఎక్కువ అని అఘోరిస్తాడు. భోజనం దగ్గర ఇంగ్లీష్ మాట్లాడేవాడి మూతిపళ్ళు రాలగొట్టాలని ఓ బిల్లు అసెంబ్లీ లో పాస్ చేయండి.
పట్టుచీరని సిల్క్ శారీ అనీ, రవికల గుడ్డని బ్లౌజ్పీస్ అనే స్థితికి దిగజారిపోయాము.మరి ఈ దేశాన్ని బాగుచేయలేం అని ఆత్మహత్య చేసికుంటారా లేక హత్యలు చేస్తారా, మీరే నిర్ణయించుకోవాలి. ”

    ఇదండీ ఆయన ఆత్మఘోషా.ఆయన చెప్పినట్లుగా ఈ పైత్యం అంటే మాతృభాషలో మాట్లాడడానికి నామోషీ అనుకోవడం మనవారికే చెల్లింది.మా చిన్నతనంలో మేమేమీ కాన్వెంటులకు వెళ్ళలేదు, తెలుగు లోనే నేర్చుకున్నాము, దానితో పాటు ఇంగ్లీష్ నేర్పారు.ఇప్పుడు దానికి వ్యతిరేకం–ఇంగ్లీషుతో పాటు వీలుంటేనే మాతృభాష. మిగిలిన రాష్ట్రాల్లో మరీ ఇంత అన్యాయం కాదు.మహరాష్ట్రలో మరాఠీ స్కూల్లో నేర్చుకోవాల్సిందే.



రచన :- భమిడిపాటి ఫణిబాబు 

No comments:

Post a Comment

Total Pageviews