Tuesday, December 29, 2020

తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?

 తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?


డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ  ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.


ఎందుకు ? 


ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?


మన తెలుగులో మాటలు లేవా ? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !

కానీ మనం పలకం. 


వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.


మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.


ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 


టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 


టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. 

మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?


నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.


పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 


మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 

ఇతరులు అనుకోవాలన్న భావన.


ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.


అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.

Monday, December 28, 2020

సమయం గడిచిపోయింది, ఎలా గడిచిందో తెలియదు, ఇవన్నీ..జరిగిపోయాయి.. కానీ కాలం ఎలా గడిచిందో..తెలియనేలేదు. It's truth of life.

 సమయం  గడిచిపోయింది, 

 ఎలా  గడిచిందో తెలియదు, 

జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది  తెలియకుండానే.


భుజాలపైకి..ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు.

   తెలియనేలేదు..

 

అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. 

ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో తెలియదు


ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ..

కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు


ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది.

కానీ 

ఇప్పుడు  నాపిల్లలకు  నేను బాధ్యత గా మారాను 

ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియదు. .


ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం..

కానీ..

ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో..

ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు. 


ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..

అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో తెలియదు. 


  ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..

    ఎప్పుడు  రిటైర్  అయ్యామో..

తెలియనేలేదు.


పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో..

వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో తెలియదు. 


రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియదు. 


ఇప్పుడే   ఆలోచిస్తున్నాను..నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..

కానీ..

శరీరం  సహకరించడం లేదు. 


    ఇవన్నీ..జరిగిపోయాయి..

కానీ  కాలం  ఎలా  గడిచిందో..తెలియనేలేదు. 


It's  truth  of life.

Sunday, December 27, 2020

చిన్నారి కీర్తన! చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్‌ భవ!!!

 పిల్లలు దేవుడు చల్లనివారే..కల్లకపటమెరుగని కరుణామయులే...

చిన్నారి కీర్తన! చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్‌ భవ!!!

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా 

తేరులా సెలయేరులా కలకలా గలగలా కదలి వచ్చింది ఓ చిన్ని అప్సర

ఈ సాయంత్రం వచ్చి నిలిచింది మా కనుల ముందర

నిదురించే తోటలోకి ఓ పాటలా వచ్చింది ఈ చిన్నారి కీర్తన  

ఉన్న కాసేపూ రమ్యంగా మా కుటీరాన రంగవల్లులల్లింది 

కమ్మటి కల బహుమతిగా ఇచ్చింది

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది 

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా 

ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా 

ఉన్న ఆ కాసేపు చిరునవ్వులతో అలరించింది 

గోదారి కెరటాల గీతాలు నాలో పలికించింది 

చల్లగా చిరుజల్లుగా జలజలా గలగలా కదలి వచ్చింది ఈ చిన్నిఅప్సర

ఊహలన్ని రెక్కలొచ్చి ఎగిరి ఎక్కడెక్కడి అక్షరాలనో ఇలా ఏరుకొచ్చాయి   

లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెతికి వెలికి తీసాయి 

వీణలా నెరజాణలా కలకల గలగలా కదలి నవ్వింది ఈ చిన్ని అప్సర

తటపర్తి రాజగోపాలన్ గారి ఓ గజల్‌నూ గుర్తుచేసింది 

ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్‌ 

సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్

అమ్మ గుండెలోదూరి ఆనందంతో తుళ్ళి

ఆదమరచి నిదరోయే ఆ సౌఖ్యం నాకిచ్చెయ్

కేరింతలతో కుదిపి బుల్లి బొంతలు తడిపి

ఊయల కొలువులు ఏలే ఆ రాజ్యం నాకిచ్చెయ్

చెత్తను వేసెబుట్ట ఆట సామను పుట్ట

విరిగినవన్నీ నావే నా మాన్యం నాకిచ్చెయ్

అమ్మ లాలనకు ముందు బ్రహ్మ వేదాలు బందు

ముక్తి కేలనే మనసా బాల్యం కోసం తపస్సు చెయ్

చూచిన వన్నీ కోరుతూ ఏడుస్తుంటే రాజా

అమ్మ పెట్టిన తాయిలం ఆ భాగ్యం నాకిచ్చెయ్

"నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అన్న తిలక్‌ 

పలుకులు మననం చేసుకుందాం! చిన్నారుల బాల్యాన్ని టి.వి, కంప్యూటర్‌, సెల్ల్‌ల్లో బందీ చెయ్యకుండా 

అందంగా, ఆనందంగా ఎదగనిద్దాం!
















యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: 

అన్న వేదవాక్యాన్ని నిత్యం మననం చేసుకుంటూ స్త్రీమూర్తులను గౌరవిద్దాం!

ఉన్న కాసేపు నాలో ఎన్నెన్నో భావాల అలజడులు లేపిన

                                     చిన్నారి చిట్టితల్లి కీర్తనా చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్‌ భవ!!!                                 ఇలా అమాయకపు చిరునవ్వులు చిందిస్తూ నిండు నూరేళ్ళు సుఖంగా ఆనందంగా వర్ధిల్లు చిట్టితల్లీ అని అశీర్వదించండి!!

Friday, December 25, 2020

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నిపుణ నరేంద్ర కుమారా! జయోస్తు! విజయోస్తు!! దిగ్విజయోస్తు!!

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నిపుణ నరేంద్ర కుమారా    

జయోస్తు! విజయోస్తు!! దిగ్విజయోస్తు!!

ఇల్లలుకుతూ పేరు మర్చిన ఈగలా 

సొంతిల్లు కోసం చెప్పులరిగేలా తిరిగిన ముళ్ళబాట 

తిరగేస్తే పూలబాటగా చరిత్ర తిరగరాస్తే 

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నాణ్యత 

వందలాది ఎకరాల్లో సదనాలు

ఎన్నోనందనవన నిలయాలు

అందుబాటులో ఆనంద ఆలయాలు 

నమ్మకానికి ఆనవాళ్ళు ఆ తెలుగు లోగిళ్ళు వాకిళ్ళు 

ఎక్కడ కడప జిల్లాలోని చాపాడు గ్రామం

ఆరుగురి సంతానంలో చిన్నవాడు 

చిన్ననాటి నుంచి కష్టాలను ఇష్టంగా మలుచుకున్నవాడు  

చదువు కోసం పెద్దన్న ప్రోద్బలం, ప్రోత్సాహం అంది పుచ్చుకున్నవాడు 

భాగ్యనగర జీవనం చదువుల్లో రాణించి  

అద్దె ఇంటి బాధలు తీరి సొంతింటి కలలు తీరే క్రమంలో 

ఎన్నో ఉద్యోగాలు వరించినా ఎందరికో సొంతిటి కలలు తీర్చు కలల రాకుమారా 

అనుభవం పెట్టుబడిగా 

అందుబాటు ధరల్లో నాణ్యమైన సదనాలు కట్టే దిట్టగా 

పెద్దపేరు పేరు తెచ్చుకున్న నరేంద్ర కుమారా  

ఉన్నత ఆలోచన ఉత్తమ ఆచరణ 

బంధుమిత్ర ప్రేమ సామ్రాజ్య  

కామరాజ రాకుమారా  

ఐంతింతై ఎదిగిన త్రివిక్రమా  

ఎదిగిన కొద్దీ ఒదిగే పరాక్రమా 

ఇంకా ఎదగాలి మరెంతో ఎదగాలి 

ఎందరి ఆశలో ఇంధనంగా 

నింగే సరిహద్దుగా మీ ఆశయాల సాధనలో 

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నిపుణ నరేంద్ర కుమారా   

జయోస్తు! విజయోస్తు!! దిగ్విజయోస్తు!!

పంచ్ ..పంచ్ మీద పంచ్ (1) అబ్బాయ్ శాస్త్రిగారి ఇల్లు ఎక్కడవుంది బాబు (ఎక్కడా అంటే ఆయన యిల్లుమీద ఎక్కడండి అంటాడేమొననని ముందుజాగ్రత్తగా)

 పంచ్ ..పంచ్ మీద పంచ్

(1) అబ్బాయ్ శాస్త్రిగారి ఇల్లు ఎక్కడవుంది బాబు (ఎక్కడా అంటే ఆయన యిల్లుమీద  ఎక్కడండి అంటాడేమొననని ముందుజాగ్రత్తగా) 

మాయింటి పక్కనేనండి

అలాగా మరిమీయిల్లు ఎక్కడవుంది

శాస్త్రిగారి యింటిపక్కనే

(2) రైలు వేగంతగ్గింది. పైబెర్తుమీద పడుకున్న ప్రయాణీకుడికి గబుక్కున మెలుకువ వచ్చి, కిందికూర్చున్న కుర్రాణ్ణి అడిగాడు

ఒరే అబ్బాయ్ వచ్చేది ఏమిటి?

స్టేషనండి

తెలుసులేరా. ఏంస్టేషను ?

రైల్వేస్టేషను

(3) భార్య ఏమండీ పనసాయకూర ఎలావుంది 

నామొహంలావుంది

అయ్యో అంత అసహ్యంగావుందా

(భర్తకు వళ్ళుడింది మరొకసారి భర్త రివర్సు పంచ్ ఇద్దామని వేచియుండగా)

భార్య:  ఏమండీ మీకు యిష్టమని ములక్కాడ, ఉల్లిపాయ, బంగాళాదుంపలు MTR మషాలాపొడి వేసి సాంబారు చేసా. ఎలావుందో రుచిచూసి చెప్పండి

భర్త(ఆ దొరికావులే అనుకొని) నీమొహంలావుంది.

భార్య: పోనిలెండి  ఇప్పటికైనా మెచ్చుకున్నారు

(ఒక మనవి ఇవి నేను విన్నవే. ఎక్కడ, ఎప్పుడు ఆవివరాలు గుర్తులేవుకాని ఈ పంచ్ వాక్యాలు గుర్తున్నాయి.) 

(నవ్వు అరోగ్యానికి మంచిదిట)

వేదములు మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు. మానవ సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.

వేదములు మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు.
మానవ సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.

ఈ క్రింద ఇవ్వబడిన ఆశీర్వాద శాంతి మంత్రములు, మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి విశ్వం శాంతి, శుభం మరియు క్షేమం కొరకు పఠించేవారు. వేదపండితులు మరియు బ్రాహ్మణుల ద్వారా పఠించబడే ఈ ఆశీర్వాద శాంతి మంత్రములు సమాజంలో, శ్రేయస్సును, శాంతిని, శుభాన్ని పెంచడానికి ఖచ్చితంగా దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఆవశ్యకత వుంది

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
సర్వ జీవులు రక్షింపబడుదురు గాక.! సర్వ జీవులు పోషింపబడుదురు గాక.!
అందరూ కలిసి పని చేయుగాక.!
(అందరూ సమాజ శ్రేయస్సు కోసం)
మన మేధస్సు వృద్ది చెందు గాక.!
మన మధ్య విద్వేషాలు రాకుండుగాక..!
ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.!
*****************************

👉ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..!
ఓం సర్వేషాం శాంతిర్భవతు..!
ఓం సర్వేషాం పూర్ణం భవతు..!
ఓం సర్వేషాం మంగళం భవతు..!

తాత్పర్యం:
అందరికి ఆయురారోగ్య సుఖసంతోషములు కలుగుగాక..!
అందరికి శాంతి కలుగు గాక..!
అందరికి పూర్ణ స్థితి కలుగుగాక..! సర్వులకు శుభము కలుగుగాక..!
*****************************

👉ఓం సర్వేత్ర సుఖిన: సంతు,
సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:
అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..!
అందరూ ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..!
అందరికీ ఉన్నత స్థితి కలుగు గాక..!
ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక..!
*****************************

👉కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:

తాత్పర్యం:
మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశములో ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి  నిర్భయులై జీవింతురు గాక. 
*****************************

👉ఓం అసతోమా సద్గమయ..!
తమసోమా జ్యోతిర్గమయ..!మృత్యోర్మా అమృతంగమయ..!
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అందరినీ, అన్యాయము, అధర్మం మరియు అసత్యము నుంచి న్యాయం, ధర్మం మరియు సత్యము వైపునకు గొనిపొమ్ము. అజ్ఞానమనే అంధకారము నుండి సజ్ఞానస్వరూపమైన వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.
*****************************

👉స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు..!

తాత్పర్యం:
ప్రజలకు శుభము కలుగు గాక..!
ఈ భూమిని పాలించే ప్రభువులందరూ ధర్మం మరియు న్యాయ మార్గంలో పాలింతురు గాక..!
గోవులకు, బ్రాహ్మణులకు సర్వదా క్షేమము, సంతోషము మరియు శుభము ప్రతిరోజూ కలుగునట్లుగా పాలింపబడుదురుగాక..!
జగతి లోని సర్వ జనులందరూ సదా సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక..!
*****************************

👉ఓం శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం శం నో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి:
శం నో విష్ణు రురుక్రమ:
నమో బ్రాహ్మణః
నమో వాయు:
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం, అవతు మక్తారం
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక..!
బ్రాహ్మణులకు వందనం. వాయుదేవునకు వందనం.
నీవే ప్రత్యక్ష బ్రహ్మవు.
నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను.
సత్యము మరియు బ్రహ్మము నన్ను రక్షించు గాక..!
నా గురువులను, సంరక్షకులను రక్షించు గాక..!
*****************************

👉ఓం ద్యౌ శాంతి:..!
అంతరిక్షం శాంతి:..!
పృథివీ శాంతి:..!
ఆపా శాంతి:..!
ఔషదయ శాంతి:..!
వనస్పతయ: శాంతి:‌..!
విశ్వే దేవా: శాంతి:..!
బ్రహ్మ శాంతి:..!
సర్వం శాంతి:..!
శాంతి రేవా: శాంతి:..!
సామా: శాంతిరేది :..!
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై ఉన్న ఓషధులు మరియు వనమూలికలు,
అన్ని లోకము లందలి దేవతలయందు, బ్రహ్మ యందు, సర్వ జనులయందు, శాంతి నెలకొను గాక..!
పంచభూతముల ప్రకృతి వలన కాని,  బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక..! శాంతి యందె శాంతి నెలకొను గాక..! నాయందు శాంతి నెలకొను గాక..!

పైన చెప్పిన ఆశీర్వాద శాంతి మంత్రములు అందరూ తప్పక చదివి అర్ధం చేసుకోండి. మన భారతీయ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం పఠింపబడుతున్నవి.

ధర్మో రక్షతి రక్షితః...!
ధర్మో రక్షతి రక్షితః...!
ధర్మో రక్షతి రక్షితః...!

అనగా, అందరూ వారి వారికి నిర్దేశించిన ధర్మమార్గములో జీవనం కొనసాగిస్తూ వుంటే, ఆ ధర్మమే, ఎలాంటి దుష్టాంతరాలు రాకుండా, మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలా తప్పక కాపాడుతుంది అని..!


* * * సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు * * *

*****************************

🙏భవదీయుడు🙏
ముక్తాపురం వేంకట కృష్ణమోహన్
+91 9704440791
👉 ఇప్పటికి దాదాపు 2490 మంది సభ్యులు వున్న మా గ్రూపులు👇
(శ్రీవైష్ణవం శరణాగతి 1/2/3/4/5/6,
ఆధ్యాత్మికం సనాతనం 1/2/3/4
ఓం శైవం శివోహం 1/2 )

అంతరించిపోతున్న బజ్జీసాంప్రదాయం బాధపడుతున్నవారు: కాలనాధభట్తవీరభద్రశాస్త్రి

అంతరించిపోతున్న బజ్జీసాంప్రదాయం

బాధపడుతున్నవారు: కాలనాధభట్తవీరభద్రశాస్త్రి

**  **  **

ఎంతసేపూ మిరిపకాయబజ్జీలే తప్ప ఇంకేవీ గుర్తుకురావా?

అసలు బజ్జీలకు పితామహ ప్రపితామహులు అరటికాయ బజ్జీలు. బంగాళాదుంప, కాకర, వాము ఆకు, వంకాయ దర్మిలా ఉల్లిపాయకూడా

అవతలహోరున వాన. మండువాలోగిల్లో మధ్యవున్న చతురస్య కుండిలో ధారాపాతంగా పైన పెంకులకప్పునుంచి

వాన నయాగరా జలపాతంలా జాలువారుతూవుంటే చాపమీదకూర్చుని మగరాయుళ్ళు చతుర్ముఖ పారాయణ చేస్తూ మధ్యమధ్య నారీమణుల హస్తపాకచాతుర్య సంభవమైన వేడివేడి బజ్జీలు తింటూవుంటే, మరికొందరు డిటెక్టివ్ నవలో వార పక్షమాసపత్రికలో చదువుతూ పేజీలు తిప్పుతూ ఆసమయంలొ వేడివేడి బజ్జీలు తింటూఆస్వాదిస్తూవుంటే. కన్నెపిల్లలు చింతగింజలతో వామనగుంట ఆడుతూ మధ్య మధ్య వేడివేడి బజ్జీలుతింటూవుంటే, నవదంపతులు గదిలో మంచంమీదకూర్చుని భార్య బజ్జీని భర్తనోట పెట్టి తానొకటి భర్త తననొటపెట్టగా తింటూవుంటే 

చెప్పలేను ఆహాయి ఎంతోగొప్పగవుంటుందోయి

మారోజుల్లో మిరపకాయబజ్జీలు ఎరగం అంటే సత్యదూరంకాదు

పచ్చిమిర్పకాయ నూరిన మెత్తని ఉప్పులో అద్దుకొని పప్పు అన్నం తినడం అలవాటు. 

అంతేగాని పచ్చిమిరపకాయలోని (అహం) కారమ్ నూనేలోవేగితే అబ్బే హుళక్కేకదా!

మరోవిషయం

పులిహారలో చింతపండు రసం ఆరసంతోబాటు వుడికిన ఎండుమిరపకాయలు 

ఎప్పుడన్నా విడిగా ఆఎండుమిరపకాయలు నమిలారా? పుల్లపుల్లగా కారంకారంగా..అబ్బో పులిహారకి అనుపానంకదండీ

అసలు మారోజుల్లొవివాహాలలొ మధ్యాహ్నం స్నాక్సు తీపి బూందీ, వేడివెడి అరటి, బంగాళాదుంపబజ్జీలే. నో ఉల్లిపాయ

ఉదయం ఫలహారం ఉప్మాయే. 

బడా వివాహాలలో ఉదయం పెసరట్టు ఉప్మా

2009 నవంబరు ఒకటవతేదీన అమెరికా హ్యూస్తన్ నగరంలో మాద్వితీయపుత్రుని ప్రధమపుత్రిక వివాహానికి ఉప్మాయే ఉదయం ఫలహారం

దర్మిలా కాలంతోమార్పులువచ్చి ఏవేవో చేస్తున్నారు

వెళ్ళండి   ఏభైసంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆరోజుల్లోని  వంటలు ఆస్వాదించండి

**  **  **

కొసమెరుపు: నాకు మిరపకాయ అంటే మహా చెడ్డభయం. నాశ్రీమతికి మహాయిష్టం. 

కనుక తనని తల్చుకుంటూ ఈ రచన తనకే అంకితం

Total Pageviews