పిల్లలు దేవుడు చల్లనివారే..కల్లకపటమెరుగని కరుణామయులే...
చిన్నారి కీర్తన! చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్ భవ!!!
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
తేరులా సెలయేరులా కలకలా గలగలా కదలి వచ్చింది ఓ చిన్ని అప్సర
ఈ సాయంత్రం వచ్చి నిలిచింది మా కనుల ముందర
నిదురించే తోటలోకి ఓ పాటలా వచ్చింది ఈ చిన్నారి కీర్తన
ఉన్న కాసేపూ రమ్యంగా మా కుటీరాన రంగవల్లులల్లింది
కమ్మటి కల బహుమతిగా ఇచ్చింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
ఉన్న ఆ కాసేపు చిరునవ్వులతో అలరించింది
గోదారి కెరటాల గీతాలు నాలో పలికించింది
చల్లగా చిరుజల్లుగా జలజలా గలగలా కదలి వచ్చింది ఈ చిన్నిఅప్సర
ఊహలన్ని రెక్కలొచ్చి ఎగిరి ఎక్కడెక్కడి అక్షరాలనో ఇలా ఏరుకొచ్చాయి
లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెతికి వెలికి తీసాయి
వీణలా నెరజాణలా కలకల గలగలా కదలి నవ్వింది ఈ చిన్ని అప్సర
తటపర్తి రాజగోపాలన్ గారి ఓ గజల్‌నూ గుర్తుచేసింది
ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్
సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్
అమ్మ గుండెలోదూరి ఆనందంతో తుళ్ళి
ఆదమరచి నిదరోయే ఆ సౌఖ్యం నాకిచ్చెయ్
కేరింతలతో కుదిపి బుల్లి బొంతలు తడిపి
ఊయల కొలువులు ఏలే ఆ రాజ్యం నాకిచ్చెయ్
చెత్తను వేసెబుట్ట ఆట సామను పుట్ట
విరిగినవన్నీ నావే నా మాన్యం నాకిచ్చెయ్
అమ్మ లాలనకు ముందు బ్రహ్మ వేదాలు బందు
ముక్తి కేలనే మనసా బాల్యం కోసం తపస్సు చెయ్
చూచిన వన్నీ కోరుతూ ఏడుస్తుంటే రాజా
అమ్మ పెట్టిన తాయిలం ఆ భాగ్యం నాకిచ్చెయ్
"నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అన్న తిలక్
పలుకులు మననం చేసుకుందాం! చిన్నారుల బాల్యాన్ని టి.వి, కంప్యూటర్, సెల్ల్‌ల్లో బందీ చెయ్యకుండా
అందంగా, ఆనందంగా ఎదగనిద్దాం!
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:
అన్న వేదవాక్యాన్ని నిత్యం మననం చేసుకుంటూ స్త్రీమూర్తులను గౌరవిద్దాం!
ఉన్న కాసేపు నాలో ఎన్నెన్నో భావాల అలజడులు లేపిన
చిన్నారి చిట్టితల్లి కీర్తనా చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్ భవ!!! ఇలా అమాయకపు చిరునవ్వులు చిందిస్తూ నిండు నూరేళ్ళు సుఖంగా ఆనందంగా వర్ధిల్లు చిట్టితల్లీ అని అశీర్వదించండి!!
No comments:
Post a Comment