సువార్తలు ఎప్పుడు తెరిచినా నాకు గొప్ప స్ఫూర్తీ, చెప్పలేనంత సాంత్వనా కలుగుతుంటాయి. అందులోనూ, గొప్ప భాష్యకారులెవరేనా సువార్తలమీద రాసినది చదువుతుంటే తెల్లవారేవేళ ఆకాశమంతా పరుచుకునే తెలివెలుగులాంటిది నా హృదయాన్ని ఆవరించి వెలిగిస్తూండటం నాకు అనుభవం. ఈ మధ్య అట్లాంటి పుస్తకం ఒకటి దాచుకుని దాచుకుని చదివాను.
యూజిని ఎ పీటర్సన్ అమెరికాకి చెందిన బోధకుడు, బైబిల్ వ్యాఖ్యాత, ప్రసంగి. 21 వ శతాబ్దానికి తగినట్టుగా బైబిల్ సందేశాన్ని విడమర్చి చెప్తున్నవాడిగా ఆయన ఇప్పటికే ప్రసిద్ధిచెందాడు. ఆయన రాసిన పుస్తకాల్లో ఒకటి, Tell it Slant: A Conversation on the Language of Jesus in his Stories and Prayers(2008) అనే రచన నా కంటపడింది. ఆ పుస్తకాన్ని అధ్యాత్మిక గ్రంథమనాలో, లేక అత్యున్నత స్థాయి సాహిత్య పఠనం అనాలో నేను తేల్చుకోలేకున్నాను.
ఆ రచన రెండు భాగాలు. మొదటి భాగంలో ఆయన లూకా సువార్త ఆధారంగా క్రీస్తు చెప్పిన కథల్ని మళ్ళా మనకొకసారి వివరిస్తాడు. రెండవ భాగంలో, నాలుగు సువార్తల్లోనూ క్రీస్తు చేసిన ప్రార్థనల్ని ఏరి తెచ్చి, వాటిని మరొక మారు మనకోసం పునఃపఠించి వ్యాఖ్యానిస్తాడు. రెండు భాగాలూ కూడా అత్యంత విలువైన రచనలు. క్రీస్తు ప్రార్థనల్ని ఆయన ప్రతి పదాన్నీ వివరించిన తీరు బ్రహ్మసూత్ర భాష్యంలాంటిది అని చెప్పవచ్చు. కాని, ఇక్కడ మీతో మొదటి భాగం గురించే పంచుకుందామనుకుంటున్నాను.
నాలుగు సువార్తల్లోనూ మార్కు, మత్తయి, లూకా సువార్తల్ని సారూప్య సువార్తలు అంటారు. అవన్నీ ఒక మూల సువార్త ఆధారంగా రాసినవని భావిస్తున్నారు. తిరిగి ఆ మూడింటిలోనూ మార్కు సువార్త మొదటిదనీ, తక్కిన రెండూ ఆయన్ని అనుసరించినవనీ పరిశోధకులు చెప్తున్నారు. ఆ మూడు సువార్తలూ కూడా యేసు జీవితవిశేషాల్ని ఆధారం చేసుకుని ఆయన బోధల్నీ, తన జీవితం ద్వారానూ, మరణం ద్వారానూ, పునరుత్థానం ద్వారానూ ఆయన ఈ లోకానికి తీసుకువచ్చిన దైవసందేశాన్ని వివరించే రచనలు. నాలుగవ సువార్త యోహాను సువార్త పూర్తిగా తాత్త్విక రచన. అక్కడ క్రీస్తు జీవితవిశేషాలకన్నా, ఆయన జీవితంలోని ప్రతి సంఘటననీ, ప్రతి ఒక్క ఉపమానాన్నీ, ప్రతి ఒక్క బోధననీ పూర్తిగా ఆధ్యాత్మిక దృష్టితో వివరించిన రచన.
సువార్తలతో నాకు చిన్నప్పటినుంచీ పరిచయం ఉన్నప్పటికీ ఆ నాలుగింటిలోనూ నన్ను మొదట ఆకట్టుకున్నది నాలుగవ సువార్తనే. కాని చాలా ఏళ్ళ తరువాత మత్తయిని చదివినప్పుడు చిన్నచిన్న వాక్యాల్లో, సాదాసీదా వివరాల్తో ఆయన ఎంత అనల్పార్థ రచన చేసాడో బోధపడింది. ఇప్పుడు, ఈ రచన ద్వారా లూకా సువార్త నాకు కొత్తగా కనిపిస్తున్నది.
అన్నిటికన్నా ముందు సృష్ట్యాదిలో శబ్దం మాత్రమే ఉందనీ, ఆ శబ్దం (వాక్యం, logos, మన భాషలో చెప్పాలంటే ప్రణవం) వెలుగై ఉండేదనీ, ఆ శబ్దం రక్తమాంసాలు ధరించి భూమ్మీద యేసుగా అవతరించిందనీ సువార్తలు చెప్తాయి. ఆ శబ్దాన్ని వేదం వాక్కు అంది. ఆ వాక్కు ఎంత పవిత్రమైందో, ఆ వాక్కుని విశ్వసించినవాళ్ళు, ఈ లోకాన్ని ఎట్లా తరించగలరో వివరించడమే పీటర్ సన్ రచన తాలూకు ముఖ్య ఉద్దేశం.
మన దర్శనాలు ఆరుప్రమాణాల్ని ఆధారం చేసుకున్నప్పటికీ శబ్దప్రమాణాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా భావించాయి. ఈ వ్యాఖ్యాత కూడా సువార్తను ఒక శబ్ద ప్రమాణంగా తీసుకున్నాడు. అందులోని ప్రతి ఒక్క పదం, పదబంధం, వాక్యం, చివరికి విరామచిహ్నాల్ని కూడా అతడు ఎంతో నిష్టతో, శ్రద్ధతో సంభావించి, ఆ శబ్దార్థాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పరితపించాడు. ఈ ప్రపంచంలోని తక్కిన శబ్దాలు మనల్ని బంధిస్తాయి. కాని దైవ వాక్యం మనల్ని విడిపిస్తుంది. అసలు ఆ మాటకొస్తే యేసు జీవితం కూడా ఒక శబ్దప్రమాణాన్ని నమ్మి తన జీవితాన్ని అందుకు ఉదాహరణగా తీర్చిదిద్దుకోవడమే కదా. పూర్వనిబంధన ప్రవక్తల్ని, ముఖ్యంగా ఇషయ్యాని యేసు పరిపూర్ణంగా విశ్వసించాడు కాబట్టే క్రీస్తు కాగలిగాడు.
శబ్దానికి మూడు వినియోగాలుంటాయి అంటాడు పీటర్సన్. మొదటిది ప్రవచనం (preaching). ప్రవచనమంటే ప్రకటన. అది భగవంతుడి గురించిన సమాచారాన్ని అందరూ వినేలా బిగ్గరగా ప్రకటించడం. మార్కు సువార్త అటువంటి ప్రచనంతో మొదలయ్యిందనీ, అది గలిలియలో యేసు సూచకక్రియలు మొదలుపెట్టడంతో మొదలవుతుందనీ అంటాడు పీటర్ సన్. శబ్దానికున్న రెండవ వినియోగం బోధన (teaching).అంటే తరగతిగదుల్లో ఉపాధ్యాయులు పిల్లలకి బోధించడమనే కాదు, అసలు ఎవరేనా సరే, తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, రచయిత, కవి మనం ఈ లోకంలో ఎట్లా మసలాలో, జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, ప్రతి ఒక్క విశేషంతోనూ ఓపిగ్గా విడమరిచి చెప్పడం. క్రీస్తు అట్లాంటి బోధకుడని మత్తయి సువార్త చెప్తుందంటాడు పీటర్ సన్. మన జీవితాల్లో విడివిడిగా ఉన్న అనుభవాల్ని ఒకదానికొకటి కలుపుతూ వాటికొక సమగ్రతనీ, సార్థకతనీ సమకూర్చడం బోధన లక్ష్యమనీ, గలిలయలోనూ, యెరుషలేం లోనూ కూడా ఒక బోధకుడిగా క్రీస్తు చేసింది అదేననీ కూడా అంటాడాయన.
ఇక శబ్దవినియోగంలోని మూడవ అంశం, ముఖ్యమైన అంశం, మన రోజువారీ వ్యవహారంలో మనం మాటాడుకునే మాటలు. మామూలు మాటలు. చిన్నవీ, పెద్దవీ మన పనులు, మనచుట్టూ ఉండే మనుషులతో దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి మనం చెప్పుకునే మాటలు, ఇచ్చే ఆదేశాలూ, కోరుకునే అభ్యర్థనలూ, ప్రశంసలూ, అభిశంసనలూ అన్నీ. మనం మామూలుగా ఈ శాబ్దిక వ్యవాహారానికి ఏమంత ప్రాధాన్యత నివ్వం. ఇది మన వ్యావహారిక జీవితానికి సంబంధించింది అనీ, మన పారమార్థిక జీవితానికి సంబంధించిన పార్శ్వానికీ, ఈ వ్యావహారిక భాషకీ ఏమీ సంబంధంలేదని భావిస్తాం. కాని క్రీస్తు దృష్టిలో, ఈ రోజువారీ, అల్ప సంఘటనలకి సంబంధించిన చిన్న చిన్న మాటలకీ, ప్రవచనానికీ, బోధనకీ మధ్య ఏమీ తేడా లేదు. పైగా, పీటర్ సన్ చెప్పేదేమంటే, ఇటువంటి రోజువారీ సంభాషణల్లో, ఈ small talk లోనే క్రీస్తు మనకి మరింత చేరువగా కనిపిస్తాడని. లూకా తన సువార్తలో చిత్రించిన యేసు ఇటువంటి రోజువారీ జీవితానికి చెందిన యేసు అని చెప్తాడాయన. ఆ కోణంలో ఆయన సువార్తను చదివిన తీరు, వ్యాఖ్యానించిన పద్ధతి నిజంగా నేనిప్పటిదాకా ఎక్కడా చదవలేదు.
మార్కు చిత్రించిన క్రీస్తు ప్రవచనకారుడు కాగా, మత్తయి చిత్రించిన క్రీస్తు బోధకుడు కాగా లూకా చిత్రించిన క్రీస్తు సంభాషణకారుడు, ముఖ్యంగా కథకుడు అనేది పీటర్ సన్ ప్రతిపాదన. అందులోనూ తక్కిన సువార్తల్లో లేనిదీ, లూకాలోనే ప్రత్యేకంగా ఉన్నదీ, క్రీస్తు గలిలయనుండి సమరయ మీదుగా యెరుషలేం ప్రయాణించినప్పుడు ఆ దారిపొడుగునా చెప్పిన కథలు. దాదాపుగా పది అధ్యాయాల పొడుగునా (9:51-19:44) లూకా వర్ణించిన ఆ ప్రయాణాన్ని పీటర్ సన్ ఆద్యంతం ఒక అత్యున్నత రూపకాలంకారంగా వివరిస్తాడు.
యేసు మహిమ మొదటిసారిగా గలిలయలో ప్రకటితమయ్యింది. ఒకవైపు బాపిస్త్మమిచ్చే యోహాను ఉరుములాగా భగవ్సందేశాన్ని, పూర్వ ప్రవక్తల ప్రవచనాల్ని వినిపిస్తుంటే, యేసు నిశ్శబ్దంగా గలిలయ సముద్రపు ఒడ్డున పల్లెల్లో పేదల్నీ, పతితుల్నీ, దీనుల్నీ కలుసుకుంటో, అక్కున చేర్చుకుంటో, వారి అస్వస్థ జీవితాన్ని స్వస్థపరుస్తో ఉన్నాడు. యెరుషలేం లో క్రీస్తు అవతార ప్రయోజనం లోకానికి పూర్తిగా వెల్లడి అయింది. ఆయన చివరి సారి యెరుషలేంలో అడుగుపెట్టిన తరువాత వారం రోజులు కూడా కాకుండానే ఒకదానివెనక ఒకటి సంఘటనలు నాటకీయంగా జరిగాయి. తన శిష్యుడి మోసం వల్ల ఆయన పట్టుబడటం, ముందు మతాధిపతులూ, తర్వాత రాజప్రతినిధులూ ఆయన్ని విచారించడం, శిలువ వెయ్యడం, ఆ తర్వాత ఆయన పునరుత్థానం వెనువెంటనే జరిగిపొయ్యాయి. క్రీస్తు ఒక బోధకుడు మాత్రమే కాదు, లోక రక్షకుడని యెరుషలేంలోనే రుజువయ్యింది.
తన జీవితానికీ, బోధనకీ, జీవనసార్థక్యానికీ అత్యంత అనుకూలమైన గలిలయనుండి యెరుషలేం వెళ్ళడానికి క్రీస్తు సమరియా మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ముఖ్యంగా సమరయులకీ, యూదులకీ మధ్య జాతివైరం ఉండగా, ఆ మార్గం కఠినమైన దారి మాత్రమే కాదు, సామాజికంగా కూడా అత్యంత ప్రతికూలం అని తెలిసిన తరువాత కూడా క్రీస్తు ఆ దారినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ ప్రశ్నలకి లూకా సువార్త ఆధారంగా పీటర్ సన్ ఇచ్చిన వివరణ మహిమాన్వితంగా ఉంది.
లూకా సువార్తలో అధిక భాగం క్రీస్తు సమరయ గుండా చేసిన ప్రయాణానికి కేటాయించడమే కాకుండా, ఆ దారిపొడుగునా క్రీస్తు చెప్పిన కథల్ని చెప్పడంతో ఆ ప్రయాణమొక travel narrative గా మారిపోయిందంటాడు పీటర్ సన్. గలిలయ, సమరయ, యెరుషలేం వట్టి ప్రాంతాలు మాత్రమే కాక, మెటఫర్లుగా మారిపోయేయంటాడు. మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రార్థనవేళలూ, పూజా సమయాలూ, ప్రవచన ఘడియలూ గలిలయ, యెరుషలేం వంటివి కాగా, ఆ వేళల మధ్యనుండే మన దైనందిన జీవితం సమరయలాంటిది. ఒక ఆదివారం గలిలయ కాగా మరొక ఆదివారం యెరుషలేం లాంటిది. ప్రభువుని తలుచుకోవడానికి అర్పించుకున్న ఆ రెండు ఆదివారాల మధ్య మనం గడిపే తక్కిన ఆరు రోజుల జీవితం సమరయలో చేసే ప్రయాణం లాంటిది. అది మన దృష్టిలో అత్యంత లౌకికం, ఈశ్వరదూరం, శ్రద్ధావిదూరం. ఆ ఆరురోజుల్నీ మనమెట్లానో గడుపుతాం, మన శారీరిక, ప్రాపంచిక అవసరాల్ని ఏదో ఒక విధంగా తృప్తి పరుచుకుంటో. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆరురోజుల పాటూ మనం భగవంతుడినుంచి ముఖం చాటేసుకుని తిరుగుతాం. కాని యేసు అట్లా కాదు. ఆయన ప్రతి రోజూ భగవత్సాన్నిధ్య సుఖం అనుభవిస్తూనే ఉంటాడు. ప్రవచనాల్లోనూ, బోధనవేళల్లోనూ మాత్రమే కాదు, తన రోజువారీ జీవితంలో తనకి తారసపడ్డ ప్రతి ఒక్కరితోనూ, ప్రతి ఒక్క వ్యవహారంలోనూ కూడా ఆయన పూర్ణమానవుడిగానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు, అటువంటి రోజువారీ జీవితంలోని మామూలు మాటల్లోనే, మనతో చెప్పే కథల్లోనే ఆయన ప్రేమైక హృదయం, ఆయన దయ, ఆయన విశ్వాసం మనకి మరింత స్పష్టంగా ద్యోతకమవుతాయి.
గలిలయ నుండి యెరుషలేం దాదాపు డెభ్భై మైళ్ళ కఠిన ప్రయాణం. కాలినడకన మూడు నాలుగు రోజుల ప్రయాణం. ఆ దారిపొడుగునా యేసు తన శిష్యులతో నెమ్మదిగా, ప్రేమగా మాట్లాడుతోనే ఉన్నాడు. ఆ మాటలకి ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు. అవి ఎప్పటికప్పుడు తనకి తారసపడుతున్న వాళ్ళని పలకరించడంలోంచో లేదా తనని ఎవరేనా ఏదైన ప్రశ్న అడిగినప్పుడు జవాబివ్వడంలోంచో రూపుదిద్దుకున్న సంభాషణలు. ఆ సంభాషణల్లోంచే ఆయన చెప్పిన అపురూపమైన కథలు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించమని చెప్తే, నా పొరుగువాడెవరు అని అడిగిన ప్రశ్నకి ఒక సమరయుణ్ణి ఉదాహరణగా చూపిస్తూ యేసు చెప్పిన మహిమాన్వితమైన కథతో సమరయ ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రశ్న అడిగినాయన ఒక ధర్మశాస్త్ర పండితుడు. నీ పొరుగువాడు నీవంటి యూదునే అని చెప్పలేదు యేసు ఆయనకి. యూదులు ద్వేషించే సమరయుణ్ణి ఉదాహరణగా చూపించడం క్రీస్తు విజ్ఞతకి మాత్రమే కాదు, ఎల్లల్లేని ఆయన ప్రేమైక చిత్తానికి కూడా నిరూపణ. మన పొరుగువాడు మన ఇంటిపక్కనుండేవాడో లేదా ఆఫీసులో మన సహోద్యోగినో మాత్రమే కాదు. మనం ఎవరితో కలిసి జీవించక తప్పదో, అలా జీవించవలసి వచ్చినందువల్ల ఎవరిని మనం సదా ద్వేషిస్తూ ఉంటామో అతడు మన పొరుగువాడు. నన్ను నేను ప్రేమించుకున్నట్టు నేనతణ్ణి ప్రేమించడం సాధన చెయ్యమంటున్నాడు యేసు. ఆ సాధన క్రమంలో భాగంగానే ఆయన యెరుషలేం వెళ్ళడానికి సమరయ గుండా పొయ్యే తోవ ఎంచుకున్నాడు.
అట్లా యేసు ఒకటి కాదు, ఆ దారిపొడుగునా మొత్తం పది కథలు చెప్పాడు. అవి వట్టి కథలు కావు, పది ఉపనిషత్తులని అర్థమయ్యింది నాకు పీటర్ సన్ రచన చదువుతుంటే. అవి కూడా ప్రవచనాలుగానో, బోధనలుగానో కాక, కథలుగా చెప్పడం. ఆ కథలు కూడా తన స్వజనం మధ్య, తన స్వదేశంలోకాక, తనకి అత్యంత ప్రతికూలమైన దారిలో చెప్పడం. అందువల్లనే ఆ కథలు వింటున్నప్పుడు మనలో ఏదో జరుగుతుంది. అదేమిటో కూడా పీటర్ సన్ తనే ఇలా చెప్తున్నాడు:
Every time Jesus tells a story, the world of those who listen enlarges, understanding deepens, imaginations are energiged. Without stories, we end up with stereotypes-a flat earth with flar cardboard figures taht have not texture or depth, no interior.
No comments:
Post a Comment