Sunday, December 20, 2020

మితృలతో షష్ఠి కబుర్లు...శంకరనారాయణ బ్రహ్మ ధవళగిరి సుబ్రహ్మణ్య షష్ఠి

 మితృలతో షష్ఠి కబుర్లు...

"సుబ్రహ్మణ్య షష్ఠి" అనడానికి చిన్నప్పుడు నోరు తిరిగేది కాదు.
బబ్రమణ్యం అనేవాడ్ని.
మా బామ్మ
"ఒరే తప్పురా అలా అనకూడదని సుబ్బారాయిడి షష్ఠి" అని సులభంగా నేర్పింది.
ఇక షష్ఠి పండగంటే నాకావయసులో తెలిసింది
"బడికిసెలవు..
గుడిదగ్గర తీర్థం."
ఊహ తెలిసాకా తణుకు లో మా బామ్మవేలు పట్టుకు చూసిన షష్ఠి తీర్ధం
శ్రీ కేశవస్వామి వారి గుడినించి
గోస్తనీ నది వంతెన మీదుగా
శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి దాకా వుండేది.
రొడ్ కి ఎడా పెడా వివిధ దుకాణాలు దాదాపు అర కిలోమీటర్ దర్శనంకై భక్తుల వరస.
ఇప్పటికీ నాకు పూర్ణ అవగాహన లేని "పూలూ పడగలూ" గుళ్ళో ఇవ్వడం.
ఇక తీర్ధం లో
ఓ అట్టబండికి
మట్టి ఢంకా రంగుకాయితాలతో కట్టి రెండు వెదురు పుల్లలు కింద రెండు మట్టి చక్రాల బండి కి పురుకోస కట్టి లాగుతూంటే అది "డమడమ శబ్దంతో వింతగా వుండేది దానికి నేను "డమడక్కలబండి" అనేవాడ్ని దాని వెల పది పైసలు.
ఇంక ఎరుపు పసుపు నీలం రంగు కాయితాల కళ్ళజోళ్ళు.. రైయ్ రైయ్ మని చప్పుడు చేసే తిప్పుడు పుల్లలు..దెయ్యం బొమ్మల మాస్కులు..
రంగుకాయితం పువ్వుని ఓ పుల్లకి గుచ్చి పైకి పట్టుకుని పీ...పిపీప్..అంటూ పరిగెడుతూంటే ఆ పువ్వు గిర్రున తిరుగుతూండేది.
బుడగలు బూరాలూ పిల్లనగ్రోవులూ సరేసరి.
ఇంకో తమాషా
ఓ ఇనుపచువ్వకి ఆంజనేయుడిలా కోతి బొమ్మ గుచ్చి దాన్ని పైకీ కిందకీ తిప్పుతూంటే కోతికొమ్మచ్చి నా చేతిలో భలే ముచ్చట.
తీర్థం లో కొనుక్కున్నవి మర్నాడు బళ్ళో సావాసగాళ్ళకి చూపెట్టడం మరో అచ్చట.
తినుబండారాలపై అంత ఆసక్తి వుండేది కాదు.
ఓమాటు నేను ఉండ్రాజవరంలో మారాంబాబయ్య దగ్గర ఏడో తరగతి చదూకునేటపుడు
షష్ఠి తీర్ధం కి మా తాతయ్యగారు బామ్మగారు వచ్చారు.
అసలది ఉండ్రాజవరం కాదట. నిన్నే శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ద్వారా నాకు తెలిసింది అది "ఉరగరాజపురం"ట. ఉరగమంటే పాము.
ఆ గ్రామంలో చిన్న ఏరు పక్కన గల సుబ్బారాయుడి గుడి దగ్గర్నించి మా పట్టాభి మాస్టారింటి వీధి చివరి దాకా ఓ ఫర్లాంగంతా తీర్ధమే..
ఆరోజు మా తాతయ్యగారు నాకో "రూపాయి"ఫెళఫెళ లాడే కొత్త కాయితం ఇచ్చారు.
ఆరోజే నాకు తొలి సారి తెలిసింది షష్ఠి నాడు ఆయన పుట్టిన రోజని.
ఆ రోజే నేను తొలిసారి "రూపాయిని చూడడం ముట్టుకోవడం".
అంతదాకా పదిపైసలు పావలా అర్దరూపాయిలే నా సంపాదన కాని పైసలు చూడడం.ముట్టుకోవడం.
తొలి సారి రూపాయి చేతిలో పడగానే మతి పోయింది.
ఆరోజు రాత్రి
వాళ్ళు వెళ్ళి పోగానే మా రాంబాబయ్య
"ఏరా రూపాయేదీ" అన్నాడు.
నాకు అది ఆయనకిచ్చేయాలేమొ అనుకుని
" కొనేసుకున్నా"
అన్నా
చెంపపై కొట్టీ "రూపాయిఅంతా ఖర్చు పెట్టెసావా ఏంకొన్నావ్ చూపించు" అన్నాడు.
ఉక్రోషంగా నేను
ఆ రూపాయిని బాబయ్య మొఖానికేసి కొట్టి
"నేనేం కొనుక్కోలేదు."
.అని ఏడ్చేసా..
ఆ వయసు నించే నా అపార్ధపు ఉక్రోషాలతో చేయని తప్పుకు శిక్ష అనుభవించడం మొదలైంది.
కధ పక్కదారి పడుతోందికదా..
సరే ఇక ముగింపుగా మా జట్టుగాళ్ళందరం
"డబ్బారేకుల సుబ్బారాయుడి పండగోయ్..దబ్బు దబ్బున అందరూ రారండోయ్ "
అని తీర్థం లో అరుస్తు తిరిగేవాళ్ళం.
ఇవీ నా "సుబ్బారాయిడి షష్ఠి"
గురుతుల కబుర్లు.
చదివిన మీకు ధన్యవాదాలు
మీ
శంకరనారాయణ బ్రహ్మ ధవళగిరి
సుబ్రహ్మణ్య షష్ఠి
20.12.20
ఆదివారం
ఉ.10.50 ని

No comments:

Post a Comment

Total Pageviews