Friday, May 8, 2015

ఆరోగ్యమే మహాభాగ్యం!!!

                                                     ఇవి మీకు తెలుసా ?

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

Tuesday, May 5, 2015

మంచిమాట!!

మంచిమాట!!

విజయం సాధించడానికి ముఖ్యంగా కావలసినది
నమ్మకంతో కూడిన ఆశయం!!!


ఈశ్లోకం అన్నిరకాల భాధలను తప్పించి, దుఃఖాన్ని పోగొట్టి అన్నివిధాల శాంతిని ధైర్యాన్ని కలిగిస్తుంది.

జై హనుమాన్!!!

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ 
హనుమాన్  యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ.

ఈశ్లోకం అన్నిరకాల భాధలను తప్పించి, దుఃఖాన్ని పోగొట్టి అన్నివిధాల శాంతిని  ధైర్యాన్ని కలిగిస్తుంది. 


నాన్ననెపుడు మరువకురా



                                   నాన్ననెపుడు మరువకురా

నీ జన్మకి మూలమైన నాన్ననెపుడు మరువకురా
గుండెలపై ఆడించిన నాన్ననెపుడు మరువకురా
వేలుపట్టి నడిపిస్తూ తప్పటడుగు సరిచేసెను
గమ్యాలను చూపించిన నాన్ననెపుడు మరువకురా
పలకమీద బలపంతో ఓనమాలు దిద్దించెను
విద్వత్తుకి విత్తేసిన నాన్ననెపుడు మరువకురా
మంచివైన అలవాట్లను దగ్గరుండి నేర్పించెను
వ్యసనాలను తుంచేసిన నాన్ననెపుడు మరువకురా
చెడ్డవారి స్నేహాలను ఒక్కొక్కటి తప్పించెను
ఆదిలోనె వారించిన నాన్ననెపుడు మరువకురా
పుణ్యకర్మలెన్నొ చేసి పాపభీతినే పెంచెను
సన్మార్గము పట్టించిన నాన్ననెపుడు మరువకురా
కఠినంగా కనిపించే కొబ్బరియని వదిలేవూ
లోలోపల ప్రేమించిన నాన్ననెపుడు మరువకురా
రెప్పకూడ ఒకోసారి కాయదుగా కను'పాపను'
ప్రాణంలా కాపాడిన నాన్ననెపుడు మరువకురా
కనబడతవి భుజంమీద సవారీలు మాత్రమే
భార్య బిడ్డలను మోసిన నాన్ననెపుడు మరువకురా
అలుపెరుగని కెరటంరా ... నాన్నంటే నెలరాజా
జన్మంతా కష్టించిన నాన్ననెపుడు మరువకురా 
@శ్రీ.

Monday, May 4, 2015

జోల పాటలను విని ఎంత కాలమయ్యిందో!

                                              జోల పాటలను విని ఎంత కాలమయ్యిందో!
                                *******************************

జో అచ్యుతానంద జో జో ముకుందా!
లాలి పరమానంద రామగోవిందా!
తెలుగు సాహిత్యంలో గల గొప్పతనం పసితనం నుంచి పిల్లల్ని గోముగా భక్తిరసము రంగరించి పెంచదం సంప్రదాయంగా వస్తూంది.పిల్లల పెంపకంలో జోలపాట వారిని సంతోషపెట్టటమే కాక మనలో భక్తి రసాన్ని నింపేది.
పసిడి వయసులో పసిడి నవ్వుల పాప మేలుకున్నప్పుడు నిద్రపుచ్చడానికి జోల పాట పుట్టింది.ఇది కవిత్వం కోసమో,సంగీతంకోసమో కల్పింపబడిన పాట కాదు.మాతృవాత్సల్య ప్రతీక.కామక్రోధ,లోభ,మోహ మద మాత్సర్యాలకు అతీతమైన చిరతానందస్వరూపుడైన శిశువును జో కొట్టడమే ఈ లాలిపాట ఆంతర్యం.
కౌసల్యా మాత శ్రీరామచంద్రుని పసితనంలో ఊయలలో పడుకోబెట్టి జోల పాడితే కాని పడుకునేవాడు కాడుట.
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా-అని పాడితే కాని నిదురపోయెవాడు కాడుట.
నా చిన్నతనంలో తల్లులు ఈ పాటను పాడేవారు
పదునాలుగు భువనములు తొట్టె గావించి
నాలుగు వేదాల గొలుసులమరించి
-అంటూ వుయ్యాల ఊపుతూ నిదురబుచ్చేవారు.
నా చిట్టిపాప-నా చిట్టి తండ్రి
నిదురపోర-నా బంగారు బుజ్జి -అంటూ ఇంటింటా తల్లులు వాత్సల్యంతో పసిబిడ్డలను తరతరాలుగా వస్తున్న కర్ర ఉయ్యాలలోనో లేదా ఇంటిలో వాసానికో,పొలం పనులు చేసే తల్లులైతే ఏ చెట్టుకొమ్మకో చీరను కట్టి పిల్లలను పడుకోపెట్టి జోల పాడేవారు.
కొందరు మాటలను మాధుర్యంగా స్వరం చేసుకుని జోల పాడేవారు.
ఊరుకోర నా తండ్రి ఊరుకోరా
అమ్మ అలసి పోయింది పొద్దుపోయింది
చిన్ని తండ్రి నిదురపో,నా కన్నబాబు నిదురపో
అన్న అలసిపోయాడు,వాడికి బువ్వ పెట్టాలి.
నిదురపోరా నాన్న ! నిదురపోరా!
అందమైన గుర్రాలు నీకోసమొచ్చాయి
చక్కని చందమామ చుక్కల్ని పంపింది!
ఏడవకు చిన్నా ఏడవకమ్మా
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను!
నా బుల్లి రామయ్యా నిదుర పోవయ్యా!
నా చిన్ని కృష్నయ్యా నిదుర పోవయ్యా!
-అంతకూ పిల్లవాడు ఊరుకోకపోతే-
అందాల నీ కనుల కాటుక
కరిగేల ఏడుస్తున్నావు,బాబూ!
అత్తమ్మ కొట్టిందా నా అందాల బాబు
పిన్నమ్మ కొట్టిందా నా చేమంతిమొగ్గా
మామ కొట్టాడా నా మల్లెచెండూ
తాత కొట్టారా నా తామరపూచెండూ
పాలుపట్టే అత్త పట్టుకు కొట్టిందా?
నీ చెంప కందితే నా గుండే చెరువౌవురా
నీ కళ్ళు ఎర్రబారితే నే చూడలేను
నను కన్న తండ్రి ఊరుకోరా-
అని తల్లి పాటతీరులో కాసేపు ఊరుకున్నట్టే ఊరుకుని మళ్ళి ఏడుపు ప్రారంభిస్తాడు.మిగతా ఏడుపును ఆపడానికి ఆ తల్లి తిరిగి గొంతెత్తుతుంది.
ఊరుకో నా బాబు ఊరుకో బుజ్జీ
నిదురపో చిన్నారి నిదురపోవయ్యా
నిదుర లేచేసరికి నీ నాన్న తెస్తాడు బుల్లి గుర్రాలు
బండి కట్టి బజారుకెడదాము!
నీకు కావలసినవన్ని కొనుక్కొందాము
అక్కలూ వస్తారు అన్నలూ వస్తారు
మామయ్య వస్తాడూ అత్త వస్తుంది
అందరూ కలిసి నిన్నెత్తుకుంటారు.
-అంతవరకు ఉంగా ఉంగా అంటూ ఏడిచిన పాప హాయిగా నిదుర పోతుంది.
బువ్వ తినడానికి మారాము చేసే పిల్లల్ని చంకలో ఎత్తుకుని చందమామను చూపిస్తూ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
బండిమీద రావే బంతిపూలు తేవే
వెండి పళ్ళెములో వేడిబువ్వ తేవే
అబ్బాయి తినగానే ఆటకులారగించి పోవే!
-ఇలా పిల్లల్ని జోలపాడి ఊరుకోపెట్టేవారు.ఆ తల్లులంతా చదువుకున్నవారు కాదు, పల్లెలలో వుండేవారు. పిల్లలకు మూడేళ్ళు వచ్చేవరకూ వారిని ఆడిస్తూ పాడిస్తూ ప్రేమ వాత్సల్యాలను కురిపించేవారు.రామాయణ భారతాలను చిన్నచిన్న కధలుగా చెప్పేవారు.చిన్నచిన్న శతక పద్యాలను చెప్పేవారు.ఇప్పటి పిల్లలకు ఈ అచ్చట ముచ్చట లేనేలేవు. టీవీల ముందు కూర్చోపెట్టి పోగో చానల్,బార్బీ బొమ్మలు ,టాయ్ గన్నులు ,మార్పు వస్తుందా? ఎవరు పూనుకోవాలి?ఎక్కడ నించి ప్రారంభించాలి?
నేను ఆలోచిస్తూనే వున్నాను,మీరు ఆలోచించండి.

-గోటేటి వెంకటేశ్వరరావు,

మంచిమాట!!

మంచిమాట!!

అహంకారం మనిషిని పతనం చేయటమేగాక 
అనామకునిగా చేయడానికి ముఖ్య కారణం అవుతుంది.


శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు ఎందుకు?

శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు  ఎందుకు?

                                   శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అనేది సంప్రదాయసిద్ధమైన  ఆచారం. అజయోర్ధ్వియోర్మధ్యే నంది శంకర యోరపి అనే  ప్రమాణాన్ని బట్టి మేకపోతుల నడుమ, ద్విజుల నడుమ, నంది శంకరుల నడుమ నడువరాదని అంటారు. ఎందుకంటె శివుడు భాక్తానుగ్రహ తత్పరుడు. నంది శివభక్తులలోఅగ్రగణ్యుడు, శివునికి వాహనమైనవాడు, శివునే పాదపద్మాలను ఎడతెగకుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు. శంకరుడు గూడా అవిచ్చిన్నంగా భక్తాగ్రగణ్యుడైన  నందీశ్వరుడిపై అనుగ్రహదృష్టిని ప్రసరింపచేస్తుంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్చేదం ఏర్పడుతుంది. అందువల్ల ఇరువురికీ అడ్డుతగిలిన వారిపై వారికీ కోపం రావచ్చు. అందుకే  శివలింగానికి, నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అని పెద్దలు చెపుతారు.

మందాకినీ సలిల చందన చర్చితాయ 
నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ 
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ 
తస్మై మ కారాయ నమః శివాయ!!!  


Sunday, May 3, 2015

జీవిత లక్ష్మాన్ని గుర్తిద్దాం - జీవన గమనాన్ని సాగిద్దాం

మానవజన్మ విలువ ఎంత.?
(మానవ జన్మ విలువ చెప్పేఒక రాయి కథ)
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక
రోజున తన పని చేసుకుంటూ ఉండగా
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు.
ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల
తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి
రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది
తరువాత ఆ రాయిని అదే పనికి
చాలా సార్లు వాడుకున్నది.
ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని
వెళ్ళాడు.
ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ (పల్లీపట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.
అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడసాగాడు.
కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.
నీతి :-
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు.
అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొంద గలుగుతారు.
లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
జీవిత లక్ష్మాన్ని గుర్తిద్దాం - జీవన గమనాన్ని సాగిద్దాం
శ్రీ గంపా నాగేశ్వర రావు గారి పోస్ట్ ఇది. 

తెలుగు తల్లికి మల్లె దండ (రాయప్రోలు సుబ్బారావు)



తెలుగు తల్లికి మల్లె దండ
(రాయప్రోలు సుబ్బారావు)
పాల క్రొమ్మీగడల్ వచ్చి వెన్నయి విచ్చి
తీయని నునుపూసలాయెనేమో
కమ్మని మకరంద కణములు స్నేహించి
చిన్నారి పలుకులై చిక్కెనేమో

పూల లావణ్యంబు పొంగి చక్కదనాల
పిందెలై రుచులెక్కి పెరిగెనేమో
సెలయేటి యుయ్యాల కులుకు టోయ్యారముల్
ముద్దు ముచ్చటలయి ముదిరెనేమో

పాటకును, పద్యమునకు నబ్రముగ నొదిగి
చవికి చాతుర్యమునకు, సాజముగ సాగి
పోరునకు పొత్తునకు జాతి పొంది పొసగు
మా తెలుగు తల్లి మెడ కిదె మల్లెదండ!!

Saturday, May 2, 2015

అందరికీ శుభరాత్రి!!!

మన ఆలోచనల్లోని నాణ్యతను బట్టి మన జీవితంలో ఆనందం వుంటుంది.
అందరికీ శుభరాత్రి!!!


మంచిమాట!!

మంచిమాట!!

మంచి నడవడిక ఎవరో ఇచ్చే కానుక కాదు 
ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.



Friday, May 1, 2015

బ్రౌనింగ్ కవి వాక్యాలే అనువాద కవిత

ఆ వాక్యం చూసినప్పుడు కలిగిన ఆ పులకింత రోజంతా అట్లానే ఉంది. రాత్రి భోజనాలప్పుడు విజ్జికీ, పిల్లలకీ చెప్పాను కూడా. ఎక్కడి శరభవరం, ఎక్కడి ఇన్నిస్ ఫ్రీ సరోవరం!
సాహిత్యమే కదా ఒక సేతువు కట్టింది.
ఆ వాక్యం మళ్ళా మళ్ళా గుర్తొస్తున్నప్పుడల్లా నాకు మరెన్నో స్థలాలు కాలాలూ మదిలో మెదుల్తూ ఉన్నాయి. చీనాలో ఒకప్పుడు తాంగ్ రాజవంశానికి రాజధానిగా ఉన్న చాంగాన్ ( ఇప్పటి క్సియాన్ ) లో దు-ఫూ, లి బాయ్ లు కవిత్వం చెప్పిన రోజులు, ఉత్తర జపాన్ లో సైగ్యొ కవీంద్రుడు నడిచిన దారుల్లో బషొ కూడా వర్ణించిన శిరాకవా సరిహద్దు, అక్కడి విల్లో చెట్టూ, గొగోల్, డాస్టవస్కీ, టాల్ స్టాయి ల మొదలుగా ప్రతి రష్యన్ మహారచయితా వర్ణించిన సెంట్ పీటర్స్ బర్గ్ వీథులు, బ్యునోస్ ఎయిర్స్ నేషనల్ లైబ్రరీ నేలమాళిగలో బోర్హెస్ తడుములాడిన పుస్తకాల అల్మైరాలు, - ఇలాంటివే ఎన్నో మదిలో మెదిలాయి.
రామారావు కన్నెగంటి వీటన్నిటినీ నా కళ్ళతో చూడాలి,చూసిన ప్రతి తావునుంచీ నాకో సందేశం పంపాలి.
అదీ కాక, వసంతంలో తోలివసంతం నుంచి మలివసంతానికి మలుపు తిరిగే ఈ చైత్రవైశాఖాల సరిహద్దులో నిలబడినప్పుడు నాకు బ్రౌనింగ్ కవి వాక్యాలే పదేపదే గుర్తొస్తూన్నాయి:
O to be in England
Now that April's there
And whoever wakes in England
Sees, some morning unaware
That the lowest boughs and the brushwood sheaf
Round the elm tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England -now!
And after April, when May follows,
And the whitethroat builds and all the swallows!...
ఆ వాక్యాలు నాలో ఈ వాక్యాల్ని కదిలిస్తూన్నాయి.
వైశాఖం ప్రవేశించినప్పుడు
ఉండవలసింది నువ్వా కొండల్లో
ఇక్కడ నగరవీథుల్లో
దట్టంగా పరుచుకున్న చెట్టునీడలు
నీకు తూర్పుకనుమలుగానే గోచరిస్తాయి.
వేసవిరాత్రుల్లో మీ ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళు
రాత్రి పదిగంటలెప్పుడవుతుందా అని రోజంతా చూసేవాడివి
అప్పుడు మాసిన కోరారంగు తెరవెనక
వాళ్ళు హారతిపట్టి 'పరబ్రహ్మ పరమేశ్వర 'అనగానే
నీలో ఒక నిండారు జలపాతం.
ఇప్పుడు తురాయి చెట్లగుబుర్లలో
తొలి ఎరుపురేకలట్లా హారతివెలిగించాయి.
ఇప్పుడు నువ్వు ప్రాచీన చీనానగరం చాంగాన్ లోనే ఉన్నావు
వీథుల్లో రాలుతున్న పసుపు పూలమధ్య నడుస్తూ
ప్రాచీన చీనాకవిలా నువ్వు కూడా
కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదనుకుంటావు.
రోజులెంత నిర్దయగా,
నిస్సారంగానైనా గడవనివ్వు,
కాని ప్రతి వైశాఖం నీకోసం
గుప్పెడు శనగల్లాగా
వేసవి సోమరిక్షణాల్ని
పట్టుకొస్తూనే ఉంటుంది.

మార్టిన్ సన్ మూడు కవితలు


కవిత
ఇప్పుడు మనమీ భూమ్మీద ఒక తాళం వాయిద్దాం
ఆ తాళం మరేదో కాదు, ఒకప్పటి నీ చందమామనే.
వానాకాలపు అడవుల్ని కొమ్ముతో గోరాడినంతకాలం గోరాడి
ఇప్పుడు ఏడు సత్రాల యజమానిలాగా లావెక్కిపోయాడు.
చిత్తడినేలలలోతుల్లోంచో,ఆకాశమంత ఎత్తుల్లోంచో
నువ్వు ఊహించగలిగిన మాటల్లోనే మేం మాట్లాడతాం
వికసించినవో, వాడిపోయినవో నక్షత్రాలకుమళ్ళా ప్రాణంపోసి
నీ చేతుల్లో ఉన్న పువ్వులో కొత్త పరిమళం ఊపిరూదుతాం
తమ్ముడూ, తమ్ముడూ, ఏమైనా రానివ్వు-
దవానలం, బీభత్సం, నేల నాలుగు చెరగులా విప్లవం,
కాని గుర్తుపెట్టుకో,ఎప్పటికీ, ఈ రెండుమాటలూ:
పువ్వుకి పరిమళాలూదు.
స్వగ్రామం
నీ స్వగ్రామంలో వానపాములు గుల్లబరిచిన తోటలో
కాశీరత్నం తీగె ఇంకా పూస్తూనే ఉంది.
ఇళ్ళల్లో పాతాకాలపు పొడవాటి గోడగడియారాలు టిక్కుటిక్కుమంటూనే ఉన్నాయి.
ఇళ్ళ కప్పుల్లోంచి యూపస్తంభాల్లాగా పొగపైకి లేస్తోనే ఉంది.
ఎన్నో సముద్రాల మీద ఎంతో కఠినాతికఠిన జీవితం ముగించుకుని
క్రూరాతిక్రూరమైన తావులన్నీ చూసి వచ్చినవాడికి
ఈ శాంతిమయ గ్రామం ఒక ప్రశాంత అసత్యంగా గోచరిస్తుంది.
కాని ఈ అసత్యానికే జీవితమంతా చుట్టుకుపోవాలనిపిస్తుంది.
ఈ ఒక్క అసత్యం కోసం
ఎన్ని దుష్టసత్యాల్నైనా కాళ్ళతో మట్టేసి రావాలనిపిస్తుంది.
శ్రోతలు
వినడమొక్కటే తెలిసిన ఆ రోజుల్లో
నెగడిచుట్టూ చేరి పెద్దవాళ్ళంతా
అంతిమదినందాకా, ఒక రక్షకుడెవరో
వాళ్ళని శుభ్రపరిచే క్షణంకోసం వేచిచూస్తూ
తమ పాపమయదేహాల్ని చలిగాచుకుంటూ ఉండేవాళ్ళు.
ఎక్కణ్ణుంచో ఒక పిల్లి మావుమనేది, నెగడి రగుల్తుండేది,
పొగగొట్టాలు కూతపెట్టేవి.
కాలుజారిన ఒక పిల్లను తలుచుకుంటూ
ఎవరో శోకభరితంగా గొంతెత్తేవారు.
పళ్ళూడి పొద్దువాటారినవాళ్ళు
పొల్లుపోయిన ధాన్యంగురించో
పురుగుపట్టినపంటగురించో మాట్లాడుకునేవాళ్ళు.
ఆ చిన్నప్పటి నెగడిదగ్గరే నేనిప్పటికీ గడ్డకట్టుకుపోయాను.

హేరీ మార్టిన్ సన్ (1904-1978) స్వీడిష్ రచయిత, కవి, యాత్రాచరిత్రకారుడు

మొన్న ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కడో దూరదేశాన్నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రియబంధువులాగా హేరీ మార్టిన్సన్ కవితాసంపుటి The Procession of Memories, Selected Poems 1929-1945 నా కోసం ఎదురుచూస్తూ ఉంది.
కొన్నాళ్ళకిందట Chickweed Wintergreen, Selected Poems చదివినప్పణ్ణుంచీ మార్టిన్ సన్ కవిత్వం పట్ల గొప్ప ఇష్టం పెంచుకున్నాను. అందులో ఉన్న కవితలు కొన్ని ఈ పుస్తకంలో కూడా ఉన్నప్పటికీ, అనువాదకులు వేరు కావడంతో మళ్ళా కొత్త కవితలు చదివినట్టే ఉంది. Chickweed Wintergreen రాబిన్ ఫుల్టన్ అనువాదాలు, The Procession of Memories కి లార్స్ నోర్డ్ స్ట్రోం అనువాదకుడు.
హేరీ మార్టిన్ సన్ (1904-1978) స్వీడిష్ రచయిత, కవి, యాత్రాచరిత్రకారుడు. 1974 లో మరొక స్వీడిష్ నవలాకారుడితో కలిసి సాహిత్యానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నాడు.
మార్టిన్ సన్ జీవితం కథ కన్నా విచిత్రమైంది.ఆరేళ్ళ వయసులోనే కుటుంబం ముక్కలైంది. తండ్రి క్షయవ్యాథితో మరణించాడు. అఏడుగురు పిల్లల్ని సాకలేక తల్లి అమెరికా పారిపోయింది. పిల్లలంతా తలోదిక్కూ అయిపోయారు. మార్టిన్ సన్ కూడా తర్వాత పదేళ్ళ పాటు రరకాల ఇళ్ళల్లో,పొలాల్లో బతుకుతెరువు వెతుక్కోవలసి వచ్చింది. పదహారో ఏట నావికుడిగా మారాడు. ఆ ప్రయాణాల్లో అమెరికా వెళ్ళవచ్చుననీ, తల్ల్ని చూడొచ్చనీ కోరిక. 1922 లో అమెరికా వెళ్ళడమైతే వెళ్ళాడుగానీ,తల్లిని చూడలేకపోయాడు. 1927 లో మలేరియా బారినపడి క్షయవ్యాధి సూచనలు కనిపించడంతో సముద్రాన్ని వదిలి మళ్ళా స్వీడన్ చేరుకున్నాడు. నిరాశ్రయుడిగా, నిర్భాగ్యుడిగా జీవిస్తుండగా హెల్గా జొహన్సన్ అనే ఒక వామపక్షస్త్రీవాది పరిచయమైంది. ఆమె అతడికన్నా పధ్నాలుగేళ్ళు పెద్దది. ముగ్గురు పిల్లలతల్లి. ఆమె స్టాక్ హోం శివార్లలో ఉన్న తన వ్యవసాయక్షేత్రానికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని మార్టిన్ సన్ ని ఆహ్వానించింది. ఆ పరిచయం ప్రణయంగా మారి ఆ మరుసటి ఏడాది వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత 1940 లో వాళ్ళిద్దరూ విడిపోయేదాకా ఆ కాలమంతా మార్టిన్ సన్ జీవితంలో అత్యున్నతమైన, సృజనాత్మకంగా సుసంపన్నమైన కాలం. ఒకదానివెనక ఒకటి అతడు కవిత్వం, నవలలు, వ్యాసాలు, నాటకాలు,రేడియో నాటకాలు రాస్తూనే ఉన్నాడు. కాని అతడికి రాజకీయ నిబద్ధత లేదని అతణ్ణి హెల్గా వదిలిపెట్టేసాక, ఇంగ్రిడ్ లిండ్ క్రాంజ్ అనే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. 1949 నుంచీ స్వీడిష్ అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. 74 లో అతడి కవిత్వానికి నోబెల్ బహుమతి వచ్చిందిగాని, ఆ ఎంపిక కమిటీలో అతడు కూడా ఉన్నందువల్ల తీవ్ర విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో అతడు రాయడం, ప్రచురించడం మానేసాడు. ఆ విమర్శ మానసికంగా కలిగించిన ఒత్తిడి తట్టుకోలేక నాలుగేళ్ళు తిరక్కుండానే ఒకరోజు హాస్పటల్లో తన పేగులు కత్తిరించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మార్టిన్ సన్ చక్కటి పాఠశాల చదువుకు నోచుకున్నవాడు కాడు. కాని చదువుని ప్రేమించాడు, సాహిత్యాన్ని ప్రేమించాడు. ప్రకృతిని ఆరాధించాడు. భూగోళ,ఖగోళ శాస్త్రాలు అతణ్ణి సమ్మోహితుణ్ణి చేసాయి. నిరాశ్రయంగా గడిచిన బాల్యం, ప్రపంచసముద్రాలన్నిటిమీదా పయనించిన యవ్వనం, ఏళ్ళ తరబడి ఆకాశాన్ని మాత్రమే చూస్తూ ఖండాంతరాల మీద సాగిన జీవితం అతడి దృష్టిని అసీమితం చేసేసాయి.. 'ఒక తుహినకణంలో విశ్వాన్ని దర్శించగల కవిత్వం 'అతడిదని నోబెల్ కమిటీ ప్రస్తుతించింది.
ఒక దిమ్మరిగా,కూలీగా, నిర్భాగుడిగా జీవించినప్పటికీ మార్టిన్ సన్ కవిత్వం సోషలిస్టు తరహా ప్రసంగాలకు పూనుకోదు, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోదు. ఎంతో ఆరోగ్యవంతంగా, నవనవలాడే పండులాగా, అప్పుడే వికసించిన అడవిపువ్వులాగా, దూరంగా కనవచ్చే దీవి మీద వినవచ్చే తొలిపక్షి కూజితంలాగా కొత్తగా తాజాగా ఉంటుంది. ఏ కవిత చదివినా ప్రాణం లేచివచ్చినట్టుంటుంది.
మార్టిన్ సన్ లానే నేను కూడా తొమ్మిదో ఏటనే ఇల్లు వదిలిపెట్టాను. అతడు తనవికాని దారుల్లో సంచరించినట్టే నేను కూడ నావి కాని దారుల్లో, తీరాల్లో ప్రయాణిస్తూనే ఉన్నాను. అతడిలానే నేను కూడా తల్లి కోసం వెతుక్కుంటూనే ఉన్నాను. అతడిలానే నాకు కూడా పూలూ, ముళ్ళూ అనే తేడా లేకుండా ప్రకృతి మొత్తం ప్రాణప్రదం. బహుశా అందుకేనేమో ఆ కవిత్వం చదువుతుంటే ఒక ఫిన్నిష్ విమర్శకురాలు రాసినట్టుగా Reading poetry is human nearness అని అనిపిస్తుంది.

తాటి ముంజలు పరిచయం చేద్దాం!

ఇప్పటి పిల్లలకి 
వేసవి అంటే? కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఏ.సిలు
వేసవి సెలవులు అంటే మొబైల్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, టి వి లో కార్టూన్ చానల్స్.
మరి మా చిన్నప్పుడో....అబ్బో ఎన్ని సంగతులు ఎన్నెన్ని సంగతులు వీటన్నింటి గురించి ప్రతి రోజూ బోలెడు కబుర్లు చెప్పుకుందాం! 
వేసవి అంటే?
తాటి ముంజెలు, ఐస్ ప్రూట్స్, డ్రింక్ బండి లో చల్లని పానీయాలు     
వివిధ కాలాలకి తగినట్లుగా ప్రకృతి మనకెన్నో సదుపాయాలూ ఇచ్చింది. పూర్వం ఆయా కాలాల్లో వచ్చే కాయలు, పండ్లు మన ఆహారంలో భాగం అయ్యేవి, ఆధునికత పుణ్యమా అని వాటికి దూరమయ్యాం. వాటిని  నేటి తరానికి పరిచయం చెయ్యడం మన కనీస కర్తవ్యం.. వేసవిలో మండే ఎండలు వాటినుంచి ఉపశమనానికి  పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు,  తాటిముంజలు ఇలా ఎన్నో ఉన్నాయి.
ముందుగా ...తాటి ముంజలు పరిచయం చేద్దాం! వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు విూదపడకుండా ఒడుపుగా బొటన వేలితో పై పోర తీసి తినటం ఒక సరదా...తాటి ముంజెల వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు ...ఆరోగ్యానికి  ఎంతో మేలుచేస్తాయి.  ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. తాజాగా ఉండే ఈ తాటిముంజ జ్యూసీ లిచీ ఫ్రూట్ లా ఉంటుంది.  తాజా లేలేత కొబ్బరి బోండాం రుచి కలిగి ఉంటుంది. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.  తాటి ముంజల్లో అధిక నీటిశాతం ఉండటం వల్ల దీని వల్ల శరీరానికి తగినంత తేమ అందించి, చర్మంను, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు, డీహైడ్రేషన్ నివారణకి గొప్పగా సహాయపడుతుంది. ఉదర సంబధ సమస్యలకు, అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారించడంలో, మలద్ధకం పోగొట్టే అద్భుత చికిత్స, అన్ని కాలాల్లో కన్నా ఎండవేడిమికి  ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు.అందుకు ప్రధాన కారణం, శరీరం నుండి నీటిని కోల్పోవడం వల్ల వచ్చే నీరసం, అలసటను నివారించి, తక్షణ శక్తిని పొందవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగిన మన దేశీయ ఉత్పత్తులను సేవిద్దాం! తాటి ముంజెలు తిన్న తర్వాత మూడు  కాయలతో చక్కని బండిని తాయారు చేసేవాళ్ళం ఆడుకోడానికి నిజంగా వేసవి లో తాతగారి ఊరు లేదా ఏదైనా గ్రామాన్ని మీ పిల్లలతో దర్శింప చెయ్యండి. మన సంస్కృతి లోని  ప్రతి చెట్టు చేమ వీటన్నింటి గురించి వివరించండి.  రేపు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం!! మణిసాయి విస్సా ఫౌండేషన్. 

జపం చేసేటప్పుడు 108 సంఖ్య తో ఎందుకు చేస్తారు?

                            జపం చేసేటప్పుడు 108 సంఖ్య తో ఎందుకు చేస్తారు?

               108 నరములతో 108 కేంద్రాలతో మానవుడి మెదడు ఉంది. అందుకనే 108 సార్లు  108 జపమాలతో ఓ మంత్రాన్ని జపించమని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. పగడాలతో జపిస్తే వేయింతల ఫలము, రత్నమాలతో జపిస్తే పదివేలరెట్లూ, ధర్భముడితో నూరుకోట్ల రెట్లు, రుద్రాక్షల ద్వారా అనంతమైన ఫలము  లభిస్తుందని లింగపురాణం చెబుతోంది. చాలా మందికి జపం గట్టిగా చదవాలా .... లేక  నెమ్మదిగా చదవాలా అని సందేహం ఉంది. గట్టిగా అందరికీ వినపడేటట్లు చదివినా వినపడీ వినపడకుండా ఉండేటట్లు, మనసులో జపం చేసుకున్నా ఏ పద్ధతిలో చేసుకున్నా ఉత్తమమేనని పెద్దలు చెపుతారు.

Total Pageviews