Sunday, March 19, 2017

కుప్పిలి పద్మగారి కవిత్వం

“ రవ్వంత పుప్పొడి పరిమళంతో రంగుల భావుకత్వంతో గుభాళించే పద్మం ఈవిడ కవిత్వం “
(ఈ వారం కవితాంతరంగంలో ప్రముఖ కథా రచయిత్రి కుప్పిలి పద్మగారి కవిత్వం)
~
రాజారామ్.
రా
వచ్చేయ్
నిండు చందమామ తిరిగి
నెలవంకై యే దారిలో
పరిగెడుతోంది…
బోల్డన్ని తారకలు, కాసింత
చల్లగాలి పరుచుకొంటున్న యీ
రాత్రి
మనం కలుద్దాం
అత్యంత పురాతన వైన్
ఫ్రైడ్ గ్రీన్ టమేటో, రా సాల్ట్ డ్ చిల్లీస్
సిద్దంగా వుంచుతాను
గార్లిక్ బ్రెడ్ తీసుకురా…
నా కిష్టమైన నీ పసుపుపచ్చని
ఫ్యాబ్ ఇండియా
కుర్తా ధరించి
వో కొత్త పాటతో
రా
మన శ్వాసలకి
సరి కొత్త రిధమ్ ని
పరిచయం చేద్దాం “
సొంత మెదడు కుండీలో పూచిన భావాల గులాబీలకీ,గుల్ మెహర్లకీ, స్వంత భావనా వీణా మీద కంపించిన భావోద్రేక స్వరాలకీ, స్వంత ప్రజ్ఞా ఫలకం మీద ప్రతిఫలించిన సప్తవర్ణ భావ ప్రతిబింబాలకీ అక్షరరూపమివ్వడం కుప్పిలి పద్మ గారి కవిత్వంలొని వైవిధ్య శిల్పరహస్యం.
కవిత్వానికి కానీ కథకు కానీ కొత్త రిథమ్ ని పరిచయం చేసే కవయిత్రి కథా రచయిత్రి కుప్పిలి పద్మ గారు.కథల కొలనులోనే కాదు కవిత్వపు సరస్సులో కూడా అరవిరిసిన పద్మం కుప్పిలి పద్మగారు. భావ తీవ్రతను అక్షరాల్లోకి అద్భుతంగా కాంతివంతంగా వొంపే చాకచక్యం పద్మ గారి స్వంతం.
ప్రతి రాత్రి చందమామను వెలిగించుకొనే సమయంలో విరబూసిన మనోఛాయా రంగుల్నిఅక్షరాలు చేసి రాస్తుందేమో ఈ కవయిత్రి అందుకే యెప్పటికి చెదిరిపోని పంచరంగుల మేఘాల్ని సంతరించుకున్న కవిత్వాలయ్యాయి.
“నువ్వూ వానా నేనూ
యెప్పుడూ కలుసుకోనేలేదు
యిటునుంచి యింద్రధనస్సుల్ని
యెన్ని సంధించినా
నీ ఆకాశం యెన్నడూ వర్షించనే లేదు
వాగులు వరదలయ్యాయి
నదులు సముద్రాలయ్యాయి
కన్నీటి మడుగులో కాగితప్పడవలు తేలిపోయాయి
రుతుపవనాలు వెళ్లిపోయాయి
నా హృదయం వొక దుర్భిక్ష ప్రాంతం
దుఃఖానికి తెరిపిలేదు
వొక్క గొడుగులో యిద్దరం పట్టం
తుఫాన్ల వేళ అయింది స్నేహమా
ప్రమాద సూచిక యెగరవేయి “
సంధించేది ధనుస్సునే మన్మథుడైనా ఎవరైనా.ఇంధ్ర ధనుస్సులెన్ని ఆమె సంధించిన అతని హృదయ ఆకాశం నుండి కురవాల్సిన ప్రేమ వర్షం కురువనేలేదని, మాములుగా ఇంద్ర ధనుస్సు ఏర్పడితే వర్షం కురుస్తుందనే భావనను ఇక్కడ చెబుతూ సూచిస్తూ ఆమె కన్నీటి వర్షం కురిసి ఆమె ప్రేమ వాగులై వరదలై నదులై సముద్రాలై పారినప్పటికీ అతను చలించి ప్రవహించలేదనే ఒక ఆలోచనను పాఠకుడికి ఇస్తూ..తన కన్నీటి మడుగులో అతనికి సంబంధించిన ఊహలన్ని కాగితపు పడవలై కొట్టుకుపోయాయనే ఒక విషాదా భావాన్ని పలికించింది తన కవితలో. అలా అతని ప్రేమ వర్షం కురవకపోడానికి కారణం ఆమె హృదయం వొక దుర్భిక్ష ప్రాంతమని చెబుతూ తుఫాన్ల వేళ అయ్యింది ప్రమాద సూచిక ఎగురవేయమని హెచ్చరిక చేస్తుంది. ఈ కవిత చదివితే కవయిత్రి పద్మ వ్యూహ్యం అర్థమవుతుంది.ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడలేనట్లు తెరిపిలేని దుఃఖ వర్షంలో తడవకుంఆ ఏ గొడుగు ఆపలేదని చెప్పడానికి “వొక్క గొడుగులొయిద్దరం పట్టం “ – అని అంటుంది. ఒకనొక ప్రేమికురాలి భావ సంచయ రాగాల్ని ఎంత అద్భుతంగా అక్షర వీణ మీద పలికించిందో తెలుస్తుంది.
పద్మ గారు కవిత్వానికి ఎంత చిక్కదనపు గాఢత అద్దుతారో రాసే వచనానికి అంతకన్నా మించిన పరిమళత్వపు గాఢతనద్దుతారు.ప్రెమను గురించి చెప్పిన ఈ కింది వాక్యాలే ఇందుకు నిదర్శనం.
’పసివసంతాల సంభ్రమాశ్చర్యాల యింద్రజాలం. గిలిగింతల మాఘపరాగ లేతచల్లదనం. పరవశించే ఫాల్గుణపూలతేనే గాలుల తీయదనం. రంగురంగుల పత్ర సోయగాల శిశిరపు వెచ్చదనం. తడి మెరిసే శ్రావణపు తేమదనం. ఆరు రుతువుల విలక్షణ దివ్యానుభూతిరాగంతో మదిచెవిలో మనసుచిలుకలు పాడే మృదుగీతం.”
అచ్చమైన కవిత్వంలా వచనమై తేలిపోకుండా వచనాన్ని కూడా రాయడం’ ముక్త’సరిగా దేన్నయిన చెప్పడం కూడా ఒక అనితరసాధ్యకళే. ఈ కళ ఈ కథా కవయిత్రి లో పుష్కలం.
నిజానికీ మనకైనా ప్రకృతికైనా ప్రాణవాయువు ప్రేమ ఒక్కటేనని ఎందరు చెప్పగలరు?ఎందరు ఈ మాటను కవిత్వంగా హృద్యంగా మలుచగలరు ? ప్రేమ కున్న మహత్తర శక్తిని ఇట్లా కవిత్వంగా పద్మ పరిమళ భరితంగా ఈ కవయిత్రి చేసింది చూడండి.
“ విఫలమైన ఆశలని
మళ్లీమళ్లీ వెదజల్లాలి
యేదో వొక
చినుకు
మొలకెత్తించే వరకు
లంగరేసిన కలలని
మళ్లీమళ్లీ విప్పుతుండాలి
యెదో వొక
అల
కదిల్చే వరకు
బంధీయైన యిష్టాలని
మళ్లీమళ్లీ విడిచిపెడుతుండాలి
యేదో వొక గాలి తెమ్మర
యెగరనిచ్చే వరకు
యెప్పటికప్పుడు
తరం నిరంతరం
వొక కొత్త ప్రపంచాన్ని
ఆవిష్కరించాలనుకొంటుంది
ప్రతి రుతువు
అచ్చమైన తనవైన
పువ్వులతో ఫలాలతో
అనాదిగా
మళ్లీమళ్లీ
జీవధారగా ప్రభవిస్తునే వుంది
మనకైనా ప్రకృతికైనా
ప్రాణ వాయువొక్కటే
ప్రేమ!!!”
ఇదే ప్రేమకున్న పరాకాష్ట స్వభావం.ఇది ఈ కవితలో పాద పాదాన ప్రవహిస్తోంది. ప్రేమకు కూడా ఒక రుతువు వుంటుందని అది వికసించే సమయమొస్తే పరిమళించే పూలవనం కాదని అదొక దుర్గమారణ్యమని ..అందులోని గాఢతను మెరుపు శిల్పంతో చెబుతారు పద్మ గారు
“ప్రేమలు వికసించే రుతువులో
హృదయం వుద్యాన వనం కాదు
అదొక అరణ్యం
అమందానందంతో కిక్కిరిసిన
దుర్గమారణ్యం “
నిశీధి గారికి పూల ముద్దులతోఅందించినకవితలో”రండి మరొక్కసారి మనమంతాచెట్టుకొకరు పుట్టకొకరు తుప్పలవెంటా పుంతల వెంటా పడి తిరుగుదాం “ అంటుంది ఈ కవయిత్రి.ఎందుకంటే పూల కోసం పూలని ని మాలలుగా కట్టడం కోసం అట. అది కూడా పూల వేట చేస్తూ..పూలకన్నా సుకుమారపు పదాలనేసి పదాల పరదాల మాటున భావాల్ని అద్భుతంగా దాచేసీ చదివినప్పుడు గుప్ఫున గుభాళింప చేస్తారు పద్మ గారు. ఇందులో “పూల వేటగత్తెలమై” అనే పదం ప్రయోగించి ఆడపిల్లలకు పూలపట్ల గల మక్కువను మనకు పట్టిస్తుంది.
“రెండు జడలన్ని
తేలిక
డిసెంబరాలతో
తొక్కుడు బిళ్ళలాడుతోంటే
బుగ్గల్లో
పసుపచ్చని చిరునవ్వుల
పుప్పొడి
మెరుస్తుంటే
యింట్లో వాళ్ళ కళ్ళుకప్పి
హేమంతకాలపు
చెట్లంటా పుట్టలంటా
పూల వేటగత్తెలమై “
మనసు దిగులు పొరలపై ప్రసరించే నులి వెచ్చని స్పర్శా కిరణాన్ని రమ్మని పిలిచే ఈ కవయిత్రి ఎంత గొప్ప నిర్మాణ చాతుర్యంతో కవిత్వాన్ని ఆరంభిస్తుందో చూడండి.చదువరిని తనతో పాటు లాక్కెళ్ళే ఒకానొక కవిత మొదలు పెట్టే కళ అందరిలో ఒక్కలా వుండదు. పద్మగారు కవితను చదివే వారిలో ఒక ఉత్కంఠ మొదలయ్యేలా కవితని మొదలెడతారు.
“ యెన్ని సాయంత్రాలని పొదిగినా
వొక రాత్రి కానప్పుడు
నీ సాయం కోసం లేచొచ్చాను “
సాయంత్రాలని పొదగడమేమిటి ? అవి రాత్రి కావడమేమిటి ? అనే ప్రశ్నలు చదివే పాఠకుల్లో మొదలయ్యి కవిత పూర్తంతా చదివేసాకా ఆ కవిత లోలోతుల్లోకి వెళ్ళిపోతారు . తన లోని అతని సమక్షాన్ని సంధించే కాంక్ష ను ఎంత చిక్కటి వ్యక్తీకరణతో కవిత్వం చేయగలిగిందో అవగాహన చేసుకోగలుగుతాడు.ఈ కింది పద్యం చదువండి ఈ కవయిత్రి అభివ్యక్తీ కరణ సామర్థ్యంలోని చిక్కదనం స్ఫురించడానికి.
“ ప్రపంచానికి తెరలు దించి
మనిద్దరమే మిగిలే
యేకాంత రంగస్థలాన్ని
సృష్టించాను
వేసవి తొలిజాము తుమ్మెదా
తొలకరి యింద్రధనువూ
హేమంతపు పులకరింతా ...
సమయం లేదని
రుతువులన్నీ వోకేసారి ముంచుకొచ్చాయి
సమక్షాన్ని సంధించి కాంక్ష
కనుసైగ చేసింది
మనం కోసుకోలేమని కాబోలు
పున్నాగ మాత్రం
అదేపనిగా పూల వాన కురిపిస్తోంది
యెన్ని పాటల్ని అల్లినా
వొక ప్రేమకానప్పుడు
యిక నాతోనే నేను లేచిపోతాను.”
కనురెప్పల తపన ఏమిటో ఎందుకో కొందరికే తెలుస్తుంది. ఆ కొందరిలో ఈ కవయిత్రి గారొకరు . మనో ప్రవాహంలోని అసంపూర్ణ స్వప్నాల్ని పువ్వులు చేసి అవి వికసించిన ప్రతిసారి కనురెప్పలకీ ఈ తపన కలుగుతుందని గాడమైన అనుభవాన్ని లోతైన కవిత్వంగా ఇలా మలిచింది ఈ కవయిత్రి.
“మనోప్రవాహంలో వొకింత వణికిన అసంపూర్ణ స్వప్నాలు
ఆ సాయంకాలపు పువ్వులు వికసించిన ప్రతిసారి
మళ్ళీ పూర్ణ పగడపు కలలై
కాటుక కళ్ళల్లో విహరించాలని
కనురెప్పలకింత తపన యెందుకో “
పద్మ గారు రాసిన కవితల్లో మంచి నిర్మాణశిల్పం, నిరుత్తర ఊహాని కలిగించే భావుకత కవిత్వపు పరిమళాన్ని వెదజల్లే పదగుంఫనం వున్న కవిత “ గుస గుస నిలువెల్ల “ అనేది.
“అతని బలిష్టమైన చేతుల్లో
ముందుకీ వెనక్కీ
కదులుతున్న తెడ్దు”
అంటూ ఈ కవిత మొదలవుతుంది. అతని చుట్టూ తెర చాప కదలాడే చప్పుడు నేపథ్య సంగీతమై పరుచుకున్నసమయంలో అతను ఎదురుగా వున్న సమయంలో అన్ని ఏకమైన సాయం కాలంలో మోహ మేఘాలు కమ్ముకొన్నాయట. అప్పుడు చెప్పాలా వద్దా అనే గుస గుస నిలువెల్ల ఆవరించదట.ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి అందులోకి పాఠకున్నిరప్పించి అతన్ని అందులో మమేకం చేయించే శైలి ఎక్కడ నేర్చుకుందో తెలీదు కానీ దృశ్యాన్ని విజువలైజ్ చేసి కళ్ళముందు నిలబెడుతుంది ఈవిడ .
“మనో నీడల రంగుల
సౌరభ ప్రవాహపు వాలులో
ప్రవహిస్తున్న కళ్ళ మిల మిలల్ని
కనిపెట్టలేని
చూపులకీ”
ఇలా ఒక మనో భావ సంచయానికి ఆకృతి నివ్వడానికి ఒక పోలిక చెబుతుంది .
“ ఆ పచ్చని చిలుకలు
రామ చిలుకలని
గుర్తులు చెప్పినట్టు
తెరిచి తెరువని పుస్తకంలో
ప్రేమ ఆనవాలునెలా
చూపించటం
యెవ్వరికైనా “
ఎవరికి ఎవరిపైన ఎందుకు యిష్టం ఏర్పడుతుందో చెప్పడానికి ఏ కొలతలు ప్రమాణాలు లేవని చెప్పడానికి ,ఇస్టాయిష్టాలను తెలిపే మెనూలు లేవని చెప్పడానికీ ఈ కవయిత్రి రాసిన పంక్తులు మనల్ని గుసగుసల్లోకి నెడుతాయి.
“యే ఫ్లేవర్డ్
కాఫీ,ఐస్ క్రీమ్
కావాలో
ఆర్డర్ యిచ్చినట్లు
యిష్టాన్ని ..అలానే
యెందుకు యిష్టమో
చెప్పే
మెనూ
యెక్కడా..?”
కుప్పిలి పద్మ గారు కథలు రాస్తారు అద్భుతంగా. బహుశా ఆ కథా కథనంలో నుంచి తెచ్చుకున్న శిల్ప విశేషం కవితల్లో కూడా కనిపిస్తుటుంది.
“ఆ పుష్యమాసపు రాత్రి
పల్చని నిద్ర...
చలింకా వీడని ఆ వుదయం
కాసింత పొగ మంచు
పాల ప్యాకెట్, దిన పత్రికల కోసం
వీధి తలుపు తెరిచేసరికి
యింటి ముందు
యెంతో యిష్టంగా
పెంచుకొన్న పసుపచ్చని
చామంతి పువ్వులు
నడుమ
ముక్కలుముక్కలై
తెల్లని కాగితాలపై
నీ కవిత్వం నల్లనల్లని అక్షరాలక్షరాలుగా
చెల్లాచెదురై
మరోసారి మనం గాయపడ్డాం!!!”
దృశ్య చిత్రణ ,వాతావరణ చిత్రణ ద్వారా కవిత్వం సాధించడం పద్మగారికిష్టం.అందుకే ఆలంకారాలు ,ఉపమానాలు ,మెటాఫర్ లు ఎక్కువగా పద్మ గారు వాడరు. పై కవితలో గాయపడిన హృదయపు బాధను నల్ల నల్ల అక్షరాలుగా ధ్వనింప చేసింది కవయిత్రి.
కథల్నే కాదు కవితల్ని మాత్రమే కాదు మ్యూజింగ్స్ ఒక్కటే కాదు ఇతర భాషా కవితల్ని కూడా పూలరేకుల్లాంటి సౌకుమార్య పదాలతో మూల కవితా సౌందర్యం ఏమాత్రం చెడకుండా అనువాదం చేయే గలిగే శక్తి పద్మ గారికుందని చేరన్ కవి రాసిన A Rainy Day ని ఆమె చేసిన అనువాదం చదివితే నిర్మొహమాటంగా చెప్పొచ్చు.
“నీకు గుర్తుందా
వాన కురిసిన ఆ రోజు ?
పసుపచ్చని సూర్యరశ్మిగా మొదలైన
ఆ సాయంకాలం
వానగా మారింది.
సైకిల్ మీద నువ్వు
కొంచెం ఎడంగా ,
ఎందుకోగానీ మన నీడలు మాత్రం
పెనవేసుకొని
మనతోనే కదుల్తు.”
సాయంకాలం వానై మనల్ని కమ్ముకున్న అనుభూతిని ఇవ్వడమే కాదు వాన కురిసిన జ్ఞాపకాన్ని మదిలో ముద్రిస్తుంది ఈ కవిత. వాన చెప్పిన రహస్యాన్ని విన్న కవయిత్రి, కథల సాలభంజికల్ని మలిచిన శిల్పి కుప్పిలి పద్మ గారు కథల్లో వేసిన సరికొత్త స్త్రీవాద ముద్రల్ని కవిత్వం వేయలేదేమో అని అనిపిస్తుంది. త్వరలో ఆమె కొత్త కవిత్వం సంపుటి గా వస్తుందన్న ఆశతో కథల్లో తాను నిరసించిన అడ్డుగోడల్ని,లక్ష్మణరేఖల్ని కవిత్వంలో కూడా బద్దలుకొట్టి తుడిచేయాలని.. కోరుకుంటూ..వచ్చే వారం మరో కవి కవితాంతరంగాన్ని చూద్దాం.

No comments:

Post a Comment

Total Pageviews