ఎన్నో పనులు, ఎన్నో కర్తవ్యాలు, ఎన్నో వ్యాపకాల మధ్య మన రోజువారీ జీవితం గడుస్తూ ఉండవచ్చుగాక, కాని,మనల్ని సతమతం చేసే ఎన్నో ఆలోచనల మధ్య, ఆలోచనకీ, ఆలోచనకీ మధ్య విరామంలో,మన ప్రమేయం లేకుండానే మన మనసుని ఏదో ఒక తలపు ఆక్రమిస్తూ ఉంటుంది. ఏదో ఒక స్నేహమో, ఒక దృశ్యమో, ఒక హృదయమో మనని లోబరుచుకుంటూ ఉంటాయి.అట్లా మనని ఏ తలపు లోబరుచుకుంటుందో దానికే మన హృదయం నిజంగా అంకితమయినట్టు.
నా మటుకు నాకు మా ఊరూ, ఆ కొండలూ, ఆ అడవీ, ఆ నీడలూ, కొండలమీంచి ఉదయించే ప్రభాతాలూ, ఆ ఇళ్ళమీంచి పరుచుకునే సాయంకాలపు ఎండా-ఈ దృశ్యాలే నా అంతరంగ గర్భాలయంలో ప్రతిష్టితమయిపోయాయి. మధ్యలో కొన్నాళ్ళపాటో, కొన్నేళ్ళపాటో కొన్ని స్నేహాలో, కొన్ని కలలో,కొన్ని వైఫల్యాలో నా అంతరంగాన్ని మసకబరిచి ఉండవచ్చుగాక,కొన్ని ప్రేమలో, కొన్ని శరాఘాతాలో పొగలాగా కమ్ముకుని ఉండవచ్చుగాక,కాని, మళ్ళా నెమ్మదిగా, ఆ వెన్నెలరాత్రులో,ఆ వర్షాకాలాలో నా తలపుల్లో కుదురుకోగానే నాకేదో గొప్ప స్వస్థత చేకూరినట్టుగానూ, నేను మళ్ళా మనిషినయినట్టుగానూ అనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా మాఘఫాల్గుణాల్లో మొదలై, ఈ తొలివసంతవేళలదాకా నా మనసంతా ఆ అడవిదారుల్లోనే సంచరిస్తూ ఉంటుంది. ఆ నల్లజీడిచెట్లు, ఆ తపసిచెట్లు,ఆకులన్నీ రాలిపోయిన బూడిదరంగు అడవిలో అన్నిటికన్నా ముందు చిత్రకారుడి లేతాకుపచ్చరంగు చిలకరించినట్టు చిగురించే నెమలిచెట్లు, ఆ కొండదారుల్లోనే నేను తిరుగుతూ ఉంటాను. ఇక ఇప్పుడు ఆ కొండవార,అ అడవిపల్లెలో, లేతపసుపు వెలుతురు ధారాపాతంగా కురుస్తున్నట్టు ఉంటుంది. ఆ వెలుగుని ఒక కవితగా పిండి వడగట్టాలని నాలోనేనే ఎన్నో వాక్యాలు దారంలాగా పేనుకుంటూ ఉంటాను. కాని స్వరకల్పనకు ట్యూన్ దొరకని సంగీతకారుడిలాగా ఒకటే కొట్టుమిట్టాడుతుంటాను.
సరిగ్గా అట్లాంటి వేళల్లోనే ప్రాచీన చైనా కవులవైపూ, ప్రాచీన చీనాచిత్రలేఖనాల వైపూ చూస్తూంటాను. ఆకాశాన్నీ, భూమినీ పట్టుదారాలతో కలిపికుట్టడమెట్లానో వాళ్ళకే తెలుసు. ఆ కవితల్లో వాళ్ళీ లోకాన్నే చిత్రించారుగానీ, వాటిని చదువుతుంటే, అలౌకికమయిన స్ఫూర్తి ఒకటి మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. ఆ బొమ్మల్లో,ఆ నల్లటి గీతల్లో వాళ్ళు కొండలు, అడవులు, నదులు, పడవలు, ఒంటరి బాటసారులు, కలయికలు, వియోగాలు అన్నిట్నీ చిత్రించిపెట్టారు.
ఆ బొమ్మల్నట్లా తదేకంగా చూస్తూంటాను. చిన్నపిల్లలు, ఇంకా చదవడం రానివాళ్ళు, బొమ్మల పుస్తకాలు చూస్తారే అట్లా. ఆ బొమ్మల్ని చూస్తూ ఆ అక్షరాల్లో ఏముందో ఊహిస్తూంటారే అట్లా. ఆ చైనా కవితల్ని బట్టి వాళ్ళ బొమ్మల్నీ, ఆ బొమ్మల్ని బట్టి ఆ కవితల్నీ పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఉదాహరణకి,
చిత్రకారుడూ, కవీ కూడా అయిన వాంగ్ వీ రాసిన ఏ నాలుగు వాక్యాలు చదివినా మనసంతా ఖాళీ అయిపోతుంది. ఆ విస్తారమైన మనోక్షేత్రం మీద సూర్యరశ్మినో, చంద్రకాంతినో వర్షించడం మొదలుపెడుతుంది. ఈ కవిత చూడండి:
చిత్రకారుడూ, కవీ కూడా అయిన వాంగ్ వీ రాసిన ఏ నాలుగు వాక్యాలు చదివినా మనసంతా ఖాళీ అయిపోతుంది. ఆ విస్తారమైన మనోక్షేత్రం మీద సూర్యరశ్మినో, చంద్రకాంతినో వర్షించడం మొదలుపెడుతుంది. ఈ కవిత చూడండి:
నిర్జనపర్వతశ్రేణి,
కనుచూపు మేర ఎవరూ లేరు
ప్రతిధ్వనులుమటుకే వినబడుతున్నవి
అడవిలోతట్టున నీల-హరితశాద్వలం పైన
మెత్తటి లోవెలుగు.
కనుచూపు మేర ఎవరూ లేరు
ప్రతిధ్వనులుమటుకే వినబడుతున్నవి
అడవిలోతట్టున నీల-హరితశాద్వలం పైన
మెత్తటి లోవెలుగు.
ఈ నిశ్శబ్దం ఒక విమానంలాంటిది. దీన్లో అడుగుపెట్టి నేనా ప్రాచీన శైలశ్రేణిమీంచి,ఆ విస్మృతకాననాలగుండా కొన్ని క్షణాల్లోనే ఎన్నో భ్రమణాలు పూర్తిచేస్తూ ఉంటాను.
అక్కడొక కొండ మీద ఒక పూరిల్లు ఉంటుంది, ఆ వాలులోంచి ఆ కొండమీదకి సన్నని కాలిబాట ఉంటుంది. ఆ బాట పక్క మాఘమాసంలో మంకెనలూ, వైశాఖమాసంలో తురాయిలూ పూస్తూ ఉంటాయి. రాత్రి ఒక వసంత వాన రహస్యంగా కురిసి ఉంటుంది. తెల్లవారగానే తడిసిన ఆ బాట మీద పూలు రాలి ఉంటాయి. ఆ కొండమీద కుటీరంలో నాకోసం ఒక అతిథి వచ్చి ఉంటాడనీ, కాని ఆ అథితి ఇంకా నిద్రలేచి ఉండడనీ అనిపిస్తూంటుంది. ఈ మనోజ్ఞచిత్రాన్ని నా మనసులో పచ్చబొట్టు పొడిచింది వాంగ్ వీ రాసిన ఈ కవితనే కదా:
అక్కడొక కొండ మీద ఒక పూరిల్లు ఉంటుంది, ఆ వాలులోంచి ఆ కొండమీదకి సన్నని కాలిబాట ఉంటుంది. ఆ బాట పక్క మాఘమాసంలో మంకెనలూ, వైశాఖమాసంలో తురాయిలూ పూస్తూ ఉంటాయి. రాత్రి ఒక వసంత వాన రహస్యంగా కురిసి ఉంటుంది. తెల్లవారగానే తడిసిన ఆ బాట మీద పూలు రాలి ఉంటాయి. ఆ కొండమీద కుటీరంలో నాకోసం ఒక అతిథి వచ్చి ఉంటాడనీ, కాని ఆ అథితి ఇంకా నిద్రలేచి ఉండడనీ అనిపిస్తూంటుంది. ఈ మనోజ్ఞచిత్రాన్ని నా మనసులో పచ్చబొట్టు పొడిచింది వాంగ్ వీ రాసిన ఈ కవితనే కదా:
ఎర్రటి మంకెన పూత మీదరాత్రికురిసిన వాన
వసంతవనాలలేతాకుపచ్చమీద తొలగని పొగమంచు
రాలిన పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
పక్షుల కిలకిల, కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదు.
వసంతవనాలలేతాకుపచ్చమీద తొలగని పొగమంచు
రాలిన పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
పక్షుల కిలకిల, కొండమీద అతిథి ఇంకా నిద్రలేవలేదు.
నాలో రెండు పొరలున్నాయనిపిస్తుంది. లోపల ఒక ప్రవాహం, దాని మీద మరొక ప్రవాహం. సంఘానికీ, రాజ్యానికీ, ధర్మానికీ సంబంధించినదంతా ఆ పై పై ఉరవడి మాత్రమే. ఆ విషయాలు ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా అదంతా ఎందుకో నాలోపల్లోపలకి ఇంకదు. వరదనీళ్ళలాగా అది ఎంత ఉధృతంగా ప్రవహించినా, కళ్ళముందే కొట్టుకుపోతుంది. కాని ఆ లోపలి ప్రవాహం, అది యుగాల కాలమానం ప్రకారం అత్యంత మందంగా, అత్యంత గోప్యంగా ప్రవహిస్తూంటుంది. ఆ ప్రవాహం ఒడ్డునో లేదా, ఆ ప్రవాహమధ్యంలోనో ఏ నావ మీదనో పూర్వకవులు కనిపిస్తూంటారు. బహుశా నా అసలైన జీవితానుభవం అది. ఒక కాలానికో, ఒక దేశానికో, ఒక భాషకో పరిమితమయింది కాదది. అందుకనే 1200 వందల ఏళ్ళ కిందటి ప్రాచీన చైనా కవి లి-బాయి రాసిన ఈ కవిత చదివితే, నా సమకాలికులందరికన్న ఎంతో సన్నిహితుణ్ణి కలుసుకున్నట్టు ఉంటుంది:
నువ్వెందుకింకా ఆ పచ్చటికొండలకే
అంటిపెట్టుకున్నావని
అడుగుతారు వాళ్ళు.
నేను చిరునవ్వి ఊరుకుంటాను.
నా మనసు తేలికపడుతుంది.
అడవి సంపెంగలు
ఏటిబాటన కిందకు ప్రవహిస్తూంటాయి
వాటి జాడ కూడా మిగలదు.
మనకి కనిపిస్తున్నవాటికన్నా ఆవల
మరెన్నో భూములున్నాయి,
మరెన్నో ఆకాశాలున్నాయి.
అంటిపెట్టుకున్నావని
అడుగుతారు వాళ్ళు.
నేను చిరునవ్వి ఊరుకుంటాను.
నా మనసు తేలికపడుతుంది.
అడవి సంపెంగలు
ఏటిబాటన కిందకు ప్రవహిస్తూంటాయి
వాటి జాడ కూడా మిగలదు.
మనకి కనిపిస్తున్నవాటికన్నా ఆవల
మరెన్నో భూములున్నాయి,
మరెన్నో ఆకాశాలున్నాయి.
నా కంటిముందు కనిపిస్తున్నదొక్కటే ఆకాశం కాదనేదే నాకు గొప్ప ఊరట. ఇక్కడ నగరంలో నేనుంటున్న వీథిలో రాలుతున్న పసుపు పూలని చూడగానే నేను తిరిగిన పూర్వపుదారులన్నీ నా తలపుల్లో ప్రత్యక్షమవుతాయి. హృదయాన్ని గాయపరచడానికి ఒక పూలరేకు చాలు. ఇక రాలుతున్న అన్ని పూలరేకల్ని చూస్తే చెప్పేదేముంది?
దు-ఫు ఇలా అన్నాడని విక్రమ సేథ్ గుర్తుచేస్తున్నాడు:
The pain of death's farewells grows dim.
The pain of life's farewells stays new
The pain of life's farewells stays new
అలాగని ఒక అతిథి కోసం చూడకుండా ఉండలేను. ఎవరో ఒక కొత్తస్నేహితుడో, స్నేహితురాలో ఆ బాటమ్మట, చివరి మలుపు తిరిగి, ఏ తెల్లవారు జామునో మొదటి ఆటో పట్టుకుని నా ఇంటికొస్తున్నారన్నట్టే ఎప్పుడూ ఒక ఊహ. జీవితమంతా ప్రవాసిగానే గడిపిన దు-ఫు మటుకే ఇట్లాంటి కవిత రాయగలడు:
నా ఇంటిచుట్టూ వసంతకాలపు సెలయేరు
రోజూ కొంగలు మటుకే వచ్చిపోతుంటాయి
రాలిన ఆ పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
అతిథుల్లేరు.తలుపు తెరిచే ఉంది.
ఈ దారిన అడుగుపెట్టిన మొదటిమనిషివి నువ్వే.
నువ్వు వెళ్ళవెలసిన వూరింకా దూరం.
నా ఆతిథ్యమేమంత గొప్పదికాదు,
పేదవాణ్ణి,ఉన్నది కొద్ది పానీయం .
చూడు,నీకిష్టమయితే ఆ పాతకాలపు
పెద్దమనిషి, నా పొరుగింటాయన్ని పిలుస్తాను
ఒక్క గుక్క కలిసి తాగుదాం.
రోజూ కొంగలు మటుకే వచ్చిపోతుంటాయి
రాలిన ఆ పూలనింకా ఎవరూ తుడిచిపెట్టలేదు
అతిథుల్లేరు.తలుపు తెరిచే ఉంది.
ఈ దారిన అడుగుపెట్టిన మొదటిమనిషివి నువ్వే.
నువ్వు వెళ్ళవెలసిన వూరింకా దూరం.
నా ఆతిథ్యమేమంత గొప్పదికాదు,
పేదవాణ్ణి,ఉన్నది కొద్ది పానీయం .
చూడు,నీకిష్టమయితే ఆ పాతకాలపు
పెద్దమనిషి, నా పొరుగింటాయన్ని పిలుస్తాను
ఒక్క గుక్క కలిసి తాగుదాం.
తన కవిత్వమంతా పేదవాళ్ళ గురించీ, కఠోరవాస్తవాల గురించీ మాత్రమే రాస్తూ వచ్చిన బై-జుయికి కూడా వసంతకాలమంటే తన ఊరే గుర్తొస్తుంది. అతడి కవిత:
చియాంగ్ నాన్ లో నా పాతగ్రామంలో
నది ఒడ్డున నేనో మొక్క నాటాను.
నది ఒడ్డున నేనో మొక్క నాటాను.
రెండేళ్ళయింది
ఇంటికి దూరమై ఎక్కడెక్కడో
తిరుగుతున్నాను
ఇంటికి దూరమై ఎక్కడెక్కడో
తిరుగుతున్నాను
అయినా ఆ నది ఒడ్డున ఆ పచ్చదనం
కల్లోకొస్తూనే ఉంటుంది
చియాంగ్ నాన్ లో నది ఒడ్డున
ఆ చెట్టుకింద ఇప్పుడెవరు చేరిఉంటారా
అని తలపు తొలుస్తూనే ఉంటుంది.
కల్లోకొస్తూనే ఉంటుంది
చియాంగ్ నాన్ లో నది ఒడ్డున
ఆ చెట్టుకింద ఇప్పుడెవరు చేరిఉంటారా
అని తలపు తొలుస్తూనే ఉంటుంది.
రోజువారీ జీవితం సణుగుతూనే ఉంటుంది. నగరం రణగొణధ్వని ఆగదు. క్రీస్తు చెప్పినట్టు సీజర్ వి సీజర్ కీ, దేవుడివి దేవుడికీ విడివిడిగా చెల్లించడమెట్లానో, ఆ విద్య ఇప్పటికి పూర్తిగా పట్టుబడింది.
లోకంలో నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇప్పుడా ఆ అడవిపల్లెలో ఆ చిగురించిన చింతతోపులో ఆ కొండసంపెంగ చెట్టుదగ్గర ఎవరు జమకూడేరా అని నా తలపుల్లో తొంగిచూస్తుంటాను.
No comments:
Post a Comment