Friday, March 31, 2017

హేమలంబి నవవర్ష శుభాశయాలు:--వేటూరి ఆనందమూర్తి.

హేమలంబి నవవర్ష శుభాశయాలు:
అవనిపై మధుమాస మవతరించిన వేళ
జగ్తతిపై వాసంత చైత్రరథమే కదిలె
పుడమితల్లికి ఒడలు పులకరింతలై పోయె
దిశ లెల్ల దరహస దీప్తిరేఖలు పర్వె
నభ మెల్ల చైతన్య నాదమేదుర మాయె
రాగదమ్మ నవాబ్దమా! స్వాగతం బందుకొనుమా!
వందనము నవవర్షమా! కుసుమాభినందనల నందుకొనుమా!//
ఈశ్వరారాధన ప్రవణమౌ ప్రజకెల్ల
నీప్సితార్థము లన్ని యీడేరగా వలెను
బహుజన హితమ్ముగా బహుజన సుఖమ్ముగా
బహుమాన్యమై వరల వలయున్
 గతము భవితకును మార్గము చూపి వర్త మా
న తరమ్ము నడిపింపవలయున్
హిత మెరిగి లోకసమ్మతమైన మత మెరిగి
సతము శ్రేయము గూర్పవలయున్
ధనధాన్యములు సంపదభివృద్ధు లలరారి
ధర్మచింతన పెరుగవలయున్
తనుమనమ్ములు సర్వజనసేవకే అంకి
తము లన్నభావమ్ము వలయున్.//
చాంద్రమానము ననుసరించే జాతి కంతా పర్వదిన మిది
చైత్ర శుద్ధ ప్రతిపదాది వసంత ఋతువున కిదే ఆది
సకల కర్ణాటాంధ్ర మహరాష్ట్రాదు లందరి కిదె యుగాది
ఈ యుగాదే మన యుగాది – ఇదే మన సంవత్సరాది//
ఆరు రుచుల ఉగాది పచ్చ్డడి ననుభవించే అవసర మ్మిది
వేయి రుచుల ఉగాదిగొజ్జు రసాయనమ్మై మనుచు నా డిది//
వీటి ముంగిట తోరణాలూ వేగుజాము తలంటు తానాల్
కొత్త దుస్తులు పిండివంటలు గుడులలో పంచాంగ పఠనాల్
కల్గు యోగ సుయోగ దుర్యోగాలు వత్సర ఫలశ్రవణాల్
ఇష్టమృష్టాన్నాలు పూజలు శిష్టజన సంసేవనాలు // ఈ యుగాదే//
మావికొమ్మలు వేపరెమ్మలు ప్రోవులై విరబూచు ఋతువిది
కోకిలమ్ములు బం భరమ్ములు కొసరి కూసే పూల తే రిది
పురులు విప్పిన మయూరమ్ములు పొత్తు కోరే కొత్త కా రిది
శిశిర మేగిన వసంతానికి చెలువు గూర్చే చిగురు తొడు గిది//ఈ యుగాదే//
వేటూరి ఆనందమూర్తి.

No comments:

Post a Comment

Total Pageviews