Sunday, February 9, 2020

ఆ విధాత తలపున ఓ గొప్ప ఆలోచన ప్రభవించి ఈ సినీవినీలాకాశంలో సిరి"వెన్నెలసాగరమథనం"లో ప్రభవించిన చంద్రుడీయన.....
వినీల గగనపు వేదికపై... ప్రాక్దిశ వీణియపై...
ఆ దినకరుని మయూఖ తంత్రులపై...
విహంగ తతుల కిలకిల స్వనములతో మానవ జాతిని తెల్లారింది లెగండో అని మేల్కొలిపే సుప్రభాత సేవకుడీయన.....
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమనుకునే సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడిగే విప్లవ స్పూర్తి.....
తనదరికిరాని వనాల దగ్గరకే వసంతాన్ని తీసుకెళ్ళగలిగే లలిత భావగీతి.....
ఆకాశంలో స్వర్ణకమలాల ఆశల హరివిల్లుకు కొత్త రెక్కలు తొడిగించి, జామురాతిరిలో జాబిలమ్మకు కోపం రాకుండా లలితప్రియకమలాలతో అందెల రవళులు వినిపించే సాహితీ సరస్వతి.....
ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దనే చిరంతర స్పూర్తి...
జేడీ"చక్రవర్తికి" వీధిలో బిచ్చగత్తెతో బంధుత్వాన్ని కలిపిన "మనీ"షితడు.....
బ్యాచిలర్ బ్రదర్ ని భర్తగా మారొద్దని బీకేర్ ఫుల్ అని సలహా ఇచ్చిన సంసారి.....
"తెలవారదేమో స్వామి" సినిమా పాట కాదేమో... అన్నమాచార్య సంకీర్తనేమో లేక త్యాగరాజస్వామి క్రుతి గానీ అయిఉంటుందని ఎవార్డు ఇవ్వడానికి వీలులేని "స్వయంక్రుతాపరాధం" చేసుకున్న పండితుడు.....
బోటనీ పాఠం కోసం క్లాసురూములో తపస్సు చేయడం వేస్ట్ రా గురూ అంటూనే బలపం పట్టి భామ ఒళ్ళో "అ ఆ ఇ ఈ"లు నేర్పిన
ప్రేమబడిపంతులు.....
ఏ తోడూ లేక ఎటో వెళ్ళిపోయిన మనసు చిలకను గంగ పుట్టిన హరిపాదాన చేర్చగల తత్త్వవేత్త.....
సామజవరగమన కాళ్ళను చూసి వదలని తన కంటి చూపులను దయలేకుండా తొక్కుకుని వెళ్ళొద్దనే ప్రేమికుడు.....
తెలుగు సినిమాపాటల ప్రబంధ సాహిత్యం పాలిట అల్లసాని పెద్దన...
నేటితరం "సినీపాటకులకు" (రచయితలకు) మాత్రం పెద్దన్న...

No comments:

Post a Comment

Total Pageviews