Wednesday, May 12, 2021

 "ద్వారానికి తారామణిహారం "   అర్థం ఏమిటి? 10-05-21

ద్వారానికి తారామణిహారం

హారతి వెన్నెల కర్పూరం

మోసం ద్వేషం లేని సీమలో

మొగసాల* నిలిచె నీ మందారం.

        ౼ దేవులపల్లి కృష్ణశాస్త్రి    మొగసాల = ముఖశాల ... ఇంటి  ముందరి శాల       (సాయబాన ... తెలంగాణ పదం)

త్వన్మనోహర వ్యాఖ్యానం అపేక్షించి

- శ్రీ గురిజాల రామశేషయ్య 

--------------------------------------------------------------------------

నమస్కారం.

“త్వన్మనోహర వ్యాఖ్యాన” పదం మీ అభిమానంలోనుంచి పుట్టుకు వచ్చింది.

నేనేమిటో, నా స్థాయి ఏమిటో నాకు తెలుసు.

తన యెఱిగినయర్థంబు… అని మహాభారతం, వెనక ముందరికి బెద్దలకెల్లను వివరపు సమ్మతి యీ వెరవు  (4-432) అని అన్నమయ్య  నన్ను నిరంత రం  ప్రచోదనం చేస్తుంటారు.

అందుకే నిత్య విద్యార్థిని అయిన నేను ఎవరు అడిగినా   వ్యాఖ్యానం చేయటానికి ప్రయత్నిస్తుంటాను. 

మనోహరత్వం మల్లినాథ స్థాయివారిది. నాది కాదు.

 ****

దేవులపల్లివారి ఈ మనోహరమైన  పాటను మీరు ప్రస్తావించిన వెంటనే  “ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు. కాని ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తమూ ఇక్షురసార్ణవమే...” అను  శ్రీశ్రీ వాక్యం గుర్తుకు వచ్చింది.

మీరు అడిగిన చరణాన్ని వివరించాలంటే  ఆపాత మధురమైన ఆ మల్లెల సౌరభ గీతాన్ని ఆద్యంతం ఒకసారి ఆస్వాదించాలి.చరణాలు, పల్లవి పరస్పర సంబంధం కలిగినవి.

ఇది మల్లెల వేళయనీ .....ఇది మల్లెల మాసమనీ

తొందరపడి ఒక కోయిల

ముందే కూసిందీ ........విందులు చేసింది

కసిరే ఎండలు కాల్చునని.....

ముసిరే వానలు ముంచునని...

ఇక కసిరే ఎండలు కాల్చునని.....

మరి ముసిరే వానలు ముంచునని...

ఎరుగని కోయిల ఎగిరింది.....విరిగిన రెక్కల ఒరిగింది ......

నేలకు ఒరిగింది ...... ఇది మల్లెల వేళయనీ…..

మరిగిపోయేది మానవ హృదయం.......

కరుణ కలిగేది చల్లని దైవం ......

వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం....

వసివాడని కుసుమ విలాసం....     ఇది మల్లెల వేళయనీ…..

ద్వారానికి తారామణిహారం........హారతి వెన్నెల కర్పూరం..........

మోసం ద్వేషం లేని సీమలో .......

మొగసాల నిలిచె ఈ  మందారం.... ఇది మల్లెల వేళయనీ…..

--------------------------------------------------------------------

సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే వ్రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా వ్రాయవచ్చు అని పెద్దలు అంటారు.

అటువంటి  దేవులపల్లి  గీతం ఇది.

ఎక్కడా మల్లెల వేళ ఉండదు. వెన్నెల మాసముండదు. వెన్నెల వేళ ఉండాలి లేదా మల్లెల మాసముండాలి. నిజమే.  

కాని మనసున మల్లెల మాలలు ఊగించిన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇది.

ఈ విమర్శకి కృష్ణశాస్త్రి గారే జవాబు చెప్పారట. 

 “తొందర పడి ఒక కోయిలా ముందే కూసిందని – ఈ పాట పల్లవిలోనే సందర్భం చెప్పడం జరిగింది. వెన్నెల మాసం, మల్లెల వేళా అన్న భావం తొందరపడే కోయిలదే నని స్ఫురించేలా వ్రాసాను “ అని దేవులపల్లి చెప్పారట. (తాడేపల్లి)

 1

 మోసపోయిన ఒక నాయిక ఇక్కడ కోకిల.

ఏది నమ్మాలో , ఎవరిని నమ్మాలో, ఎక్కడ నమ్మాలో తెలియక మోసపోయిన  నాయికను  కోకిలగా ఈ గీతంలో దేవులపల్లి ప్రతీకాత్మకంగా చెప్పారు. 

కసిరే ఎండలు కాల్చునని.....

ముసిరే వానలు ముంచునని...

ఇక కసిరే ఎండలు కాల్చునని.....

మరి ముసిరే వానలు ముంచునని...

ఎరుగక కోయిల ఎగిరింది.....విరిగిన రెక్కల ఒరిగింది ......

నేలకు ఒరిగింది ...... 

మండిపోయే ఎండలు వేరు. కసిరే ఎండలు వేరు. కోపం ఎదుటి వాని జీవితాన్ని నాశనం చేస్తుంది.  కోపగించిన ఎండ లోకాన్ని మంటల్లో  కాలుస్తుంది. బూడిద చేస్తుంది. నాయకుడు కసిరే ఎండ అని తెలియక , కోకిల వంటి నాయిక అతని దగ్గరగా వచ్చింది. ప్రేమతో ఎగిరింది. యథార్థ స్వరూపం తెలిసి విరిగిన రెక్కలతో, శిథిలమయిన రెక్కలతో ప్రేమ విరహితగా  నేలకు ఒరిగింది. అలాగే ఎడతెగని వానలు ( ముసురు) ముంచేస్తాయి. నాయకుని దుర్మార్గపు చేత ముసురు. అది తెలియక  కోకిల దగ్గరగా వెల్లింది. అతని దుర్మార్గపు చేష్ట అనే ముసురులో మునిగి ఎగరలేని స్థితిలో కోకిల( నాయిక)  నేలకు ఒరిగింది.

కసిరే ఎండ ,ముసిరే వాన   ఈ చరణంలో దుర్మార్గులయిన వ్యక్తులకు ప్రతీకలు. వారికి దూరంగా ఉండమని కోకిలమ్మలవంటి  నాయికలకు  హెచ్చరిక ఇది. 

(తాడేపల్లి)

మరిగిపోయేది మానవ హృదయం.......

కరుణ కలిగేది చల్లని దైవం ......

వాడే లతకు ఎదురై వచ్చువాడని. వసంతమాసం....

వసివాడని కుసుమ విలాసం.... ఇది మల్లెల వేళయనీ…..

మొదటి చరణంలో  బాధపడిన కోకిలకు ( నాయికకు) ఈరెండో చరణంలో కవి  ఆశ్వాసన కలిగించారు.  సమస్త  బాధోపహత జీవులకు కూడా కవి అశావహ దృక్పథం కలిగించారు. 

అనుకోకుండా బాధ వస్తుంది. దానికి కుమిలిపోకూడదు. మానవ హృదయం బాధ వచ్చినప్పుడు  బాధాకారకాన్ని తలచుకొని  మరిగిపోతుంటుంది.

అది తగదు.

మరిగిపోయే మానవ హృదయం కరుణ కలిగిన  చల్లని దైవాన్ని తలచుకొని విషాదం నుంచి బయటపడాలి.

ముందు పాదంలో మరిగిపోవటం.. తరువాత పాదంలో చల్లని … ఇది ఉత్తమ రచనా కళ.

వాడిపోయిన లతలను(కష్ట జీవులను)  ఓదార్చటానికి   వాడిపోని  వసంతమాసం(దైవ రూపంలో మానవత్వం)  తనకు తానుగా- మనం-  పిలువకపోయినా ఎదురుగా వచ్చి ఓదారుస్తుంది. 

ఆ కుసుమ విలాసం ( ఉత్తముల ఓదార్పు మాటల చల్లదనం) వసివాడనిది. వాడిపోనిది.

 (తాడేపల్లి)

ద్వారానికి తారామణిహారం........హారతి వెన్నెల కర్పూరం..........

మోసం ద్వేషం లేని సీమలో .......

మొగసాల నిలిచేనే మందారం.... ఇది మల్లెల వేళయనీ…..

రెండో చరణంలోని ఆశ్వాసన ఈ మూడో చరణంలో వెన్నెల చల్లదనాన్ని కలుపుకొన్నది.

బాధా జీవులారా ! మీకు ఆశ్వాసన కలగటానికి ఒక పని చేయండి.

ఆకాశమనే ద్వారానికి నక్షత్రాల  మణి హారాన్ని కట్టారు. ఒకసారి చూడండి.

హారం కట్టటమే కాదు.దానికి హారతి ఇస్తున్నారు.

దేనితో? 

వెన్నెల కర్పూరంతో హారతి ఇస్తున్నారు.

మోసం, ద్వేషంలేని ఆ ప్రదేశంలో -

ఆ  ముఖ మండపంలో మందారం ( ఒక పువ్వు , పువ్వు అనే నాయిక) నిలిచింది. 

ఆకాశమనే ద్వారానికి నక్షత్రాల  మణి హారం అద్భుతమైన భావం. దానికి పై స్థాయికి తీసుకు వెళ్లింది వెన్నెలను తెల్లని 

కర్పూరంతో పోల్చటం. 

నక్షత్రం తెలుపు.

 వెన్నెల తెలుపు.

తెలుపు స్వచ్చతకు ప్రతీక.

అందువల్ల మోసం, ద్వేషంలేని ఆ ప్రదేశం కూడా  తెలుపు .

 ఇక్కడే నాయిక నిలుస్తుంది . నిలవాలి కూడా . కసిరే ఎండల, ముసిరే వానల ప్రవృత్తి ఉన్న వ్యక్తుల నీడలో  కాదు.

స్వచ్చతకు మణి హారాలు పట్టే ఆకాశమంత ఎత్తైన  వ్యక్తిత్వమున్న నాయకుల దగ్గర  , నాయికలు నిలుస్తారు. 

 ***

మోసపోయిన స్త్రీ వృత్తాంతాన్ని కోకిల పరంగా  చెబుతూ  గుచ్చుకొనే 

ముళ్లకు-  పూల మృదుత్వాన్ని పంచిన  కృష్ణ శాస్త్రి కి ఏమి 

ఇవ్వగలం? ! హృదయాన్ని తప్ప.  

- తాడేపల్లి పతంజలి

No comments:

Post a Comment

Total Pageviews