యెన్నెన్నో పేజీలూ - కొన్ని గులాబీ రేకులు...
కుప్పిలి పద్మ
----------------
యీ రోజు చలంగారి పుస్తకాలని పోస్ట్ చేద్దాం అని వుదయం అల్మారాలోంచి తీసాను. వాటిని తిరిగి యిప్పడు అల్మారాలో సర్దుతున్నప్పుడు పురూరవలోంచి వో గులాబీ పువ్వు జారిపడింది. తదేకంగా అ పువ్వునే చూస్తుండి పోయాయా... యెప్పుడు ఆ పుస్తకపు పేజీల మధ్యా ఆ పువ్వుని ప్రెస్ చెయ్యడానికి పెట్టి వుంటాను... యేమో...
చప్పున అన్ని పుస్తకాల పేజీలని తిప్పుతుంటే ప్రేమ లేఖల నడుమ నెమలీకలు కనిపించాయి.
మొదటి ముద్రణ శశిరేఖ నడుమ యెప్పటిదో వో మొగలి రేకు కవిపించింది. పొరలు పొరలుగా పొడిపొడిగా... పరిమళమే లేకుండా... అచ్చంగా ప్రింట్ పుస్తకానికి చదువరికి వున్న పర్సనల్ సంబంధం miss అవుతున్న కాలoలో నిలబడి వున్నామేమో వొక్క సారిగా దిగులేసింది
.
పుస్తకాలకి అట్టలు వేసుకోవటం... తీరుగా సర్ధుకోవటం
అవే లోకంగా గడిపిన సమయాలు వాటి చుట్టూ అల్లుకొన్న స్నేహాలు పేజి తిప్పినప్పుడల్లా కళ్ళతోనే గబగబా క్రింద వరకూ స్క్రోల్ చేసే చూపులు...
పోగు పడిన పుస్తకాలకి చూసి లక్ష కళ్ళుoటే బాగుణ్ణు అనుక్కున సందర్భాలు ఆ పుస్తకాల నుంచి మన మనసులోకి జీవితాల్లోకి జలజలా చొచ్చుకొచ్చిన పాత్రలూ
పూలతీగల్లా అల్లుకుపోయిన మనసులు కొత్త పుస్తకాల్లో పేజీలని తిప్పినప్పుడు పలకరించే పరిమళం
చదువుతూ చదువుతూ పుస్తకాన్ని గుండెల మీద వుంచుకొని నిద్రలోకి మనం జారుకొంటున్నప్పుడు ఆ పేజీలూ మనతో నిద్రలోకి జారుకునేవా లేదా మన హృదయానికి మిగిలినపేజీలని చదివి వినిపించేవా...
కళ్ళకి దద్దరగా పెట్టుకొని చదువుతుంటే దాదాపు నుదిటికి అంటుకుపోతున్నప్పుడూ కళ్ళకి అంత దగ్గరగా పెట్టి చదవొద్దు యెన్ని సార్లు చెప్పాలి వో ఆత్మీయమైన యింట్లో వారి కేక
వేసవి సాయంకాలాలు కుంకుడు కాయలతో తలస్నానం చేసి ఆ జుట్టుని ఆరపెట్టుకొంటూ వో పుస్తకం చేత్తో పట్టుకొని అలా వాలో లేదా కూర్చుని వొళ్ళో పెట్టుకొనో రామచిలుక మామిడి పొండుని ముక్కుతో కొంచెం కొంచెం కొరుక్కు తిన్నట్టు గబగబా చదివేస్తే పుస్తకం యెక్కడ అయిపోతుందోనన్నట్టు కొద్దికొద్దిగా చదవటం...
ప్రయాణాల్లో... కాలేజి కారిడార్లలో స్నేహితుల కోసం వెళుతూనో...
కాంపస్ పచ్చికలో స్నేహితులకి చదివి వినిపించినవో...
యెనేన్ని జ్ఞాపకాలో... పుస్తకానికి మనకి నడుమ స్నేహం వుండేది. వ్యక్తిగత అనుబంధం వుండేది.
యిప్పుడు నెట్ కనెక్షన్... సిగ్నల్స్ చార్గింగ్ చెక్ చేసుకోవటానికి మాత్రమే యీ చేతుల పని.
చేతి వేళ్ళకి తగలని పేజీలని చదువుతున్నాం కదా చేతి రాతలానే అక్షరాలున్న కాగితాలు మెల్లమెల్లగా మన చేతి వేళ్ళ నుంచి జారిపోతాయా...
నిజ్జంగా బెంగేసింది...
------
కుప్పిలి పద్మ
....
పోయిన యేడాది పోస్ట్.
Fb థాంక్యూ.
No comments:
Post a Comment