Sunday, November 6, 2016

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ...దృశ్య రూపం 2 వ భాగం



ముఖపుస్తక బంధుమిత్రులకు శుభోదయం! ఈ దిగువ లంకె నొక్కండి..ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 2 వ భాగం   

https://www.youtube.com/watch?v=whCRVXAordk


కార్తిక పురాణం 7వ రోజు పారాయణము...














Saturday, November 5, 2016

కార్తీక పురాణము 6వ అధ్యాయము (దీపదానవిధి - మాహాత్మ్యం)




కార్తిక పురాణము - ఆరవ అధ్యాయము
కార్తీక పురాణము 6వ అధ్యాయము (దీపదానవిధి - మాహాత్మ్యం) 
అథ షష్ఠాధ్యాయ ప్రారంభః
వశిష్ఠుడు మరల ఇట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు దీపదానము జేసిన వారు జ్ఞానమును బొంది విష్ణులోకమును బొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో గాని పాత్రను జేసి గోఘృతమును బోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును జెప్పుచు ఆదీపమును దానము జేయవలెను.
శ్లో!! సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ!!
దీపము సర్వజ్ఞానదాయకము. సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును జేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీకమాసమందాచరించిన యెడల అనంతఫలమును బొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుస్సును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత చేయబడిన తెలిసి, తెలియక జేసిన పాపములు నశించును. ఈవిషయమందు పురాతనపు కథ యొకటి ఉన్నది వినుము.
పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత బంధువిహీనయైనయొక స్త్రీ గలదు. ఆస్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను చేసెడిది. అమ్మకము కొనుటయి చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆస్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు. హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు. ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగమువలన శ్రీరంగమునకుబోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి అయ్యో ఈచిన్నది అన్యాయంగా నరకములపాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియె. ఛీ మూఢురాలా ఇప్పుడు నామాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈదేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములము నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందుపడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈదేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లుచేసిన యెడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహమువలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆమాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను. సూర్యోదయసమయాన శీతోదకస్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈప్రకారముగా కార్తీకమాసము నెల రోజులు చేసి బ్రాహ్మణభోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆస్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది. కాబట్టి కార్తీకమాసమందు అన్నిటికంటె దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా!ఈరహస్యమును నీకు జెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసారబంధనమును త్రెంచుకుని వైకుంఠము బొందుదురు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయస్సమాప్తః

Thursday, November 3, 2016

కార్తీక పురాణము 5వ అధ్యాయము (వనభోజన మహిమ) పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సౌజన్యం తో


కార్తీక పురాణము 5వ అధ్యాయము (వనభోజన మహిమ) 

ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని, విష్ణ్యాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తియగును. ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు. కార్తీకమాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించ వలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుక్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును.

వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను - యని వశిష్ఠులవారు చెప్పిరి. అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను? దానికి గల కారణమేమి" యని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా చెప్పనారంభించిరి.

కిరాత మూషికములు మోక్షము నొందుట:

రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనా డతని తండ్రి కుమారుని పిలిచి "బిడ్డా! నీ దురాచారముల కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినయెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తికూడా కలుగును. కాన,నీవు అటులచేయు" మని బోధించెను. అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమేకాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిదికాదా?' అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రీ "ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావిచెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక" అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి "తండ్రీ! క్షమింపుము. అజ్ఞానంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మెప్పు డే విధముగా కలుగునో దానికితగు తరుణోపాయమేమో వివరింపు" మని ప్రాధేయపడెను. అంతట తండ్రి "బిడ్డా! నాశాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీ వెప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు" అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపముపొంది అడవికిపోయి, ఒక చెట్టుతొఱ్ఱలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను.

ఆ యడవి కావేరీ నదీతీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములో నొకరోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీనదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికమువున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరిదగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టుమొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరిజాడ తెలుసుకొని, 'వీరు బాటసారులైవుందురు. వీరివద్దనున్నధన మపహరించవచ్చు ' ననెడు దుర్భుద్ధితో వారికడకు వచ్చిచూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి " మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నామనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది. గాన, వివరింపుడు" అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీకపురాణము పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము" అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురణశ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమ్మునకై చెట్టుమొదట దాగివుండి పురాణమంతయు వినుచుండిన యెలుకకూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపమునుండి విముక్తుడనైతి" నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.

కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ యధ్యాయము
ఐదవ రోజు పారాయణము సమాప్తము.

వానల్లు కురవాలి... వానదేవుడా వరిచేలు పండాలి... వానదేవుడా!

'Rain Rain go away
come again another day'
మంచుతో నిండిన దేశాల్లో పాడుకునే పాట ఇది. ఇది కాదు మన సంస్కృతి.
నెలకు మూడు వానలు కురవాలి అని మనం కోరుకుంటాం.
వానల్లు కురవాలి... వానదేవుడా
వరిచేలు పండాలి... వానదేవుడా!
నల్లనల్ల మేఘాలు... వానదేవుడా
మెల్లంగ కురవాలి... వానదేవుడా...!
పచ్చనీ పైరులే... వానదేవుడా
ఏపుగా ఎదగాలి... వానదేవుడా!
చెరువులన్నీ నిండాలి... వానదేవుడా
ఏరులై పారాలి... వానదేవుడా...!
చేలన్నీ పండాలి... వానదేవుడా
గాదెలన్నీ నిండాలి... వానదేవుడా!
కప్పలకు పెళ్ళిళ్ళు... వానదేవుడా
గొప్పగా చెయ్యాలి... వానదేవుడా...!

సత్యప్రభావం.

సత్యప్రభావం.

పూర్వం ఒక రాజ్యంలో గజదొంగ యుండేవాడు. అర్ధారాత్రి పూట దొంగతనాలు చేసేవాడు. బాగా చీకటి పడేవరకు గ్రామాలలోయున్న దేవాలయములలో సత్కాలక్షేపాలలో పాల్గొనేవాడు. అలా చీకటి పడేవరకు వేచియుండేవాడు. దీని కారణంగా అతనికి తన జీవిత తరుణోపాయం ఏమిటి అనే వ్యధ అతనిలో జనించింది. ఒకరోజు అతడు ఆధ్యాత్మిక బోధ చేసే ఒక పండితుని వద్దకు వెళ్ళి నా జీవిత తరుణోపాయం సెలవివ్వండి అని ప్రార్ధించాడు. “నీవు దొంగతనం మానివేయమన్నాడు” ఆ పండితుడు. “అది నా వృత్తి. దానిని మానలేనన్నాడు.” “సరే భగవన్నామము మానసికంగా” చేయమన్నాడు”. అదీ కుదరదన్నాడు. అయితే “సత్యవ్రత దీక్ష స్వీకరించి సత్యము” పలకమన్నాడు. దానికి గజదొంగ తన దగ్గరకి ఎవ్వరు రారు కనుక సత్యం పలకటం తేలికయని “సరే”నన్నాడు. ఒకరోజు రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరి వెళ్ళాడు. ఇంతలో రాజు, అతని సేనాని మారువేషాలలో తిరుగుతూ అతనిని గమనించి “ఎక్కడికి బయలుదేరావు” అని అడిగారు. దానికి ఆ గజదొంగ నేను రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరానని చెప్పాడు. “అరె! ఇంత పెద్ద విషయాన్ని ఇంత ధైర్యంగా ఎలా చెప్పావు ప్రమాదం కదా” అన్నారు. దానికి “అయ్యా! నేను ఒక స్వామి వద్ద సత్యం పలుకుతానని ప్రమాణం చేశాను. కనుక మీతో సత్యమే చెప్పాను” అన్నాడు. ఆరోజు రాత్రి కోటలో గజదొంగ నాలుగు వజ్రాలు కాజేశాడు. సేనాని చాకచక్యంగా గజదొంగను పట్టుకున్నాడు. దొంగవద్ద నాలుగు వజ్రాలు దొరికినవి. కాని మంత్రి ఐదో వజ్రం ఎక్కడ అని గదమాయించాడు. అయ్యా! నేను అబద్దమాడను. అది నా నియమము. నేను నాలుగు వజ్రాలే దొంగిలించాను అన్నాడు. దొంగతనం జరుగగానే ప్రధమ విచారణ మంత్రిగారే చేసినందువల్ల ఆ అయిదో వజ్రం మంత్రిగారే అపహరించి దొంగపై అబాంఢము వేశాడని రాజు గ్రహించి మంత్రిని సోదా చేయగా అతని వద్ద అయిదవ వజ్రం దొరికింది. మంత్రిని ఆ పదవినుండి తొలగించి గజదొంగకు తన ఆస్థానంలో నగర రక్షణ పదవి ఇచ్చి అతనిని రాజు సత్కరించాడు.
సత్యానికి కట్టుబడ్డ దొంగ నగర రక్షణ పదవిలో నియమింపబడ్డాడు. సత్యానికి యుండే విలువని ప్రాధాన్యతను గుర్తెరిగి భారతజాతి ఔన్నత్యానికి వెన్నెముక అయిన సత్యధర్మ దీక్షను అందరు స్వీకరించాల్సియున్నది. సత్యం జాతి ఔన్యత్యం ఆయు:ప్రమాణాలని పెంచుతుందని అందరూ గ్రహించాలి.

పరనిందో భయావహః!!

పరనిందో భయావహః
ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న  పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.
లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత  ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.
"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది.. కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది.  శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.
పార్వతికి ఈ  ప్రశ్న చాలా బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం  సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని  ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి.  ఏంచెప్పాలి?  కొంచెం ఆలోచించింది.
"సుతను బలిమఖే "  అంది.
'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం.  ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు  తన భర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే. 'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది.
లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.
తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం.   మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని  లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.
మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు  మీఆయన కూడ నాట్యం చేస్తాడు.   ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం.
పార్వతి సమాధానం ఇంత పదునుగా
ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంత పనయింది. ఏలాగో కూడగట్టుకుంది.
ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది.
క్వను చ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది. మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి  కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం.పార్వతి వెంటనే అంది.
' నైవ జానే వరాహం ' అంది
“ ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది.
బాలే! కచ్చిన్న దృష్ట :  జరఠ వృషపతి: ? అనడిగింది. 'మీ వాహనం అదే ఆ  ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం.  మీరు నేల పై తిరుగుతారు.మీ వాహనం  ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే
వెంటనే అందుకుంది.
"గోప ఏవాస్య వేత్తా " అంది. 'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా?  పో! పోయి, మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది.మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం.

Total Pageviews