కార్తీక పురాణము 5వ అధ్యాయము (వనభోజన మహిమ)
ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమందుగాని, విష్ణ్యాలయమునందుగాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వ పాపములును నివృత్తియగును. ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు. కార్తీకమాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడను భుజించ వలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుక్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును.
వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను - యని వశిష్ఠులవారు చెప్పిరి. అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మ మేల కలిగెను? దానికి గల కారణమేమి" యని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా చెప్పనారంభించిరి.
కిరాత మూషికములు మోక్షము నొందుట:
రాజా! కావేరీతీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనా డతని తండ్రి కుమారుని పిలిచి "బిడ్డా! నీ దురాచారముల కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినయెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తికూడా కలుగును. కాన,నీవు అటులచేయు" మని బోధించెను. అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమేకాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిదికాదా?' అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రీ "ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలము నంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావిచెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక" అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి "తండ్రీ! క్షమింపుము. అజ్ఞానంధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మెప్పు డే విధముగా కలుగునో దానికితగు తరుణోపాయమేమో వివరింపు" మని ప్రాధేయపడెను. అంతట తండ్రి "బిడ్డా! నాశాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీ వెప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు" అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపముపొంది అడవికిపోయి, ఒక చెట్టుతొఱ్ఱలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను.
ఆ యడవి కావేరీ నదీతీరమునకు సమీపమున నుండుటచే స్నానార్ధమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీకమాసములో నొకరోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీనదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికమువున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీకపురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరిదగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టుమొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరిజాడ తెలుసుకొని, 'వీరు బాటసారులైవుందురు. వీరివద్దనున్నధన మపహరించవచ్చు ' ననెడు దుర్భుద్ధితో వారికడకు వచ్చిచూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి " మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నామనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది. గాన, వివరింపుడు" అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీకపురాణము పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకింపుము" అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీకమహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురణశ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమ్మునకై చెట్టుమొదట దాగివుండి పురాణమంతయు వినుచుండిన యెలుకకూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా యీ మూషిక రూపమునుండి విముక్తుడనైతి" నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.
కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించవలెను.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ యధ్యాయము
ఐదవ రోజు పారాయణము సమాప్తము.
No comments:
Post a Comment