Sunday, November 13, 2016

శుభాకాంక్షలు సుశీలమ్మా! .........జగదీష్ కొచ్చెర్లకోట

‘మదిలో వీణలు'మ్రోగించే మంజులగానం
‘మనసే కోవెలగా' మార్చే భక్తిరసామృతం
‘మామిడి కొమ్మే' మళ్ళీ పూసే ఆశావాదం
‘మాటలకందని' భావాలు పలికే సుస్వరం

‘ఎవరు నేర్పారో' ఈకొమ్మకింత సంగీతం!
‘ఎంత మధురమో' ఆపాట విన్న జీవితం!
‘ఏరాగమైనా, ఏతాళమైనా' ఆమె సొంతం
‘ఏతల్లి నినుకన్నదో' ఆమె జన్మ సుకృతం!

‘పాడితే శిలలైనా' కరిగేంత కరుణరసాత్మకం
‘పాడమని నిన్నడు'గుతాం ఆచంద్రతారార్కం
‘పదేపదే పాడినా' ప్రతిపాటా పంచామృతం
‘పాలకడలిపై'వాడినే కదిలించే భావగర్భితం

‘నిదురించే తోటలో' కమ్మటికలలిచ్చే నీగానం
‘నీవులేక' ఏస్వరకర్తకూ వీణ పలకదు నిజం
‘నీవురావు నిదురరాద'నే పాట మాకు వరం
‘నీమదిచల్లగా' అనిపాడితేనే నిదురాగమనం

ఎనభై వసంతాలను చూసిన ఈతెల్లకోకిల ఎన్నడూ మావిచిగురుని తినకపోయినా ఎల్లవేళలా ఎల్లలున్నంత కాలం తనగళ మాధుర్యాన్ని ఎల్లరకూ పంచివ్వాలని నాఆకాంక్ష!

శుభాకాంక్షలు సుశీలమ్మా!

.........జగదీష్ కొచ్చెర్లకోట

No comments:

Post a Comment

Total Pageviews