కార్తిక పురాణము - ఆరవ అధ్యాయము
కార్తీక పురాణము 6వ అధ్యాయము (దీపదానవిధి - మాహాత్మ్యం)
అథ షష్ఠాధ్యాయ ప్రారంభః
వశిష్ఠుడు మరల ఇట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు దీపదానము జేసిన వారు జ్ఞానమును బొంది విష్ణులోకమును బొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో గాని పాత్రను జేసి గోఘృతమును బోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును జెప్పుచు ఆదీపమును దానము జేయవలెను.
శ్లో!! సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ!!
దీపము సర్వజ్ఞానదాయకము. సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును జేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీకమాసమందాచరించిన యెడల అనంతఫలమును బొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుస్సును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత చేయబడిన తెలిసి, తెలియక జేసిన పాపములు నశించును. ఈవిషయమందు పురాతనపు కథ యొకటి ఉన్నది వినుము.
పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత బంధువిహీనయైనయొక స్త్రీ గలదు. ఆస్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను చేసెడిది. అమ్మకము కొనుటయి చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆస్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు. హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు. ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగమువలన శ్రీరంగమునకుబోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి అయ్యో ఈచిన్నది అన్యాయంగా నరకములపాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియె. ఛీ మూఢురాలా ఇప్పుడు నామాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈదేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములము నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందుపడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈదేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లుచేసిన యెడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహమువలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆమాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను. సూర్యోదయసమయాన శీతోదకస్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈప్రకారముగా కార్తీకమాసము నెల రోజులు చేసి బ్రాహ్మణభోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆస్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది. కాబట్టి కార్తీకమాసమందు అన్నిటికంటె దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా!ఈరహస్యమును నీకు జెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసారబంధనమును త్రెంచుకుని వైకుంఠము బొందుదురు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయస్సమాప్తః
No comments:
Post a Comment