Wednesday, September 11, 2019

భోజరాజు, బ్రహ్మచారి,కాళిదాసు భోజరాజా! శంభుడికి దూరం వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారు

భోజరాజు ఒకనాడు కొలువు దీరి యుండగా,ఒక బ్రహ్మచారి వచ్చి రాజును చిరంజీవ అని
ఆశీర్వ దించాడు.
రాజు ఆ యువ బ్రహ్మచారిని బ్రహ్మచారీ!ఈ కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం
యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించావు?నిత్య వుపవాసాలతో యిలా ఎందుకు
కృశించి పోవడం?గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ
కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.అన్నాడు.
అందుకు బ్రహ్మచారి రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది
ఏముంటుంది?అయినా
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహా: -శాంతి: ప్రియా గేహినీ,
వృత్తి: -- వన్యలతా ఫలై: నివసనం, వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నిర్వృతి:
తేషాం - ఇందు కళావతంస యామినాం మోక్షేపి నో నః స్పృహా
అర్థము:--లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే ఇల్లు,మనశ్శాంతి, మనోనిగ్రహమే మా
ఇల్లాలు, అడవులలో
తీగేలతో,పండ్లతోనే సహవాసమే మా జీవన విధానం.చెట్టు పట్టలే మాకు వస్త్రాలు,మంచి
మాటలు అనే అమృత ప్రవాహం లో నిరంతర మునిగి తేలే వాళ్ళం, ఎవరికైతే ఈ
సుఖాలు వుంటాయో అలాంటి చంద్ర
మౌళీశ్వరుడి భక్తులము ,యోగులమూ అయిన మాకు మోక్షం మీద కూడా కోరిక
వుండదు.అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము ఏమైనా వుంటే
చెప్పండి.అన్నాడు
అప్పుడు అతడు రాజా!మేము కాశీయాత్రకు వెళుతున్నాము.దయచేసి మీ సభలోని
పండితులను భార్యా సమేతం గా మాతో పాటు యాత్రకు పంపించండి.త్రోవ పొడుగునా
శ్రమ తెలియకుండా పండిత గోష్టులు
జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.అన్నాడు ఆ బ్రహ్మచారి.రాజు అందుకు
సరే అన్నాడు రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళారు,ఒక్క
కాళిదాసు తప్ప.మీరు ఎందుకు వెళ్ళలేదు?అని రాజు కాళిదాసును అడిగాడు.కాళిదాసు
ఒక శ్లోకం లో బదులిచ్చాడు.
తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో: దూర వర్తినః
యస్య గౌరీశ్వరః చిత్తే / తీర్థం,భోజ! పరం హి సః
అర్థము:--భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు
వెళతారు,ఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజుకు కోపం వచ్చింది.కానీ ఏమీ చెయ్యలేక
వూరుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత భోజరాజు కాళిదాసు ను యీ రోజేమైనా విశేష మైన వార్త మీ చెవిన
పడిందా?అని అడిగాడు.కాళిదాసు నా చెవిన పడ్డది వార్త కాదు మహారాజా!అని ఒక శ్లోకం
చదివాడు.
మేరౌ, మందర కందరాసు, హిమవత్ సానౌ.మహేంద్రాచలే,
కైలాసస్య శిలా తలేషు, మలయ ప్రాక్ - భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గనై: (ణయై:) వుద్గీయ మానం యశః
అర్థము:--చారణులనే దివ్య గాయకుల బృందాల చేత,నీ కీర్తి గురించి
పాడబడుతున్నపాటలు వినబడ్డాయి
మేరు పర్వతం మీదా,మందర పర్వతపు గుహలలో,హిమాలయాల మీదా, మలయ
పర్వత శిఖ రాగ్రాల
మీదా,సహ్యాద్రి మీదా యిలా అనేకానేక ప్రదేశాలలో చారణులనే దివ్యగాయకుల
బృందాల చేత కొనియాడ బడుతున్న నీ కీర్తి వినపడ్డది
.
అప్పుడు భోజుడు సంతోషం తో కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని
నేను వినగలిగే వాడిని కాదు కదా!అనుకున్నాడు.కాళిదాసు మీద అతని కోపం
యెగిరిపోయింది.
------------------శుభరాత్రి -------------------------------

కవయామి వయామి యామి భోజరాజు నేతగాడు

ఒకనాడు భోజరాజు ఆస్థానానికి దక్షిణ దేశం నుండి లక్ష్మీధరుడు అనే కవి వచ్చాడు.
ఆయన ముఖం తేజస్సు తో వెలిగిపోతూ వుంది.భోజరాజు ఆ కవిని గురించి ఎప్పుడూ విని
వుండలేదు .ఆయనను చూడగానే ఈయన మహానుభావుడు అనే అభిప్రాయం కలిగింది.
కవిగారు భోజరాజుకు మంగళ వాక్యాలతో స్వస్తి చెప్పి అభివాదం చేసి కూర్చున్నాడు
రాజా! నీది పండిత,మండిత సభ.నీవు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడివి.అని ఒక శ్లోకం చెప్పాడు
భోజ ప్రతాపం తు విధాయ ధాత్రా
శేషై: నిరస్తై:పరమాణుభి:కిం
హరే: కారే భూత్ పవి,రంబరే చ
భాను:పయోధే:ఉదరే కృశాను:
అర్థము:--ఆ బ్రహ్మ భోజుడి పరాక్రమాన్ని సృష్టించి,మిగిలిపోయి వదిలేసిన
పరమాణువులతో యింద్రుడి చేతిలోని వజ్రాయుధమూ,ఆకాశము లో సూర్యుడు,
,సముద్రం మధ్యలో బడబాగ్ని తయారయ్యాయేమో.
ధాత్రా=ఆ బ్రహ్మ చేత భోజప్రతాపం విధాయ=భోజుడి పరాక్రమం సృష్టించ బడి, శేషై:
నిరస్తై పరమాణుభి:=మిగిలిపోయి పారేసిన పరమాణువు లతో,హరే: కరే అభూత పవి:=ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఏర్పడింది,ఆకాశములో సూర్యుడూ,పయోధే ఉదరే కృశాను:=సముద్ర గర్భం లో బడబాగ్ని కూడా ఏర్పడి నాయేమో
రాజు,సభికులు ఆ శ్లోకం విని చకితులయ్యారు.రాజు కవికి అక్షరలక్షలు యిచ్చాడు.
రాజా నీ రాజ్యం లోనే ఉండిపోవాలనే కోరికతో సకుటుంబంగా వచ్చాను అన్నాడు
లక్ష్మీధరుడు. ఎందుకంటే
క్షమీ దాతాః గుణ గ్రాహీ స్వామీ స్వామీ పుణ్య యేన లభ్యతే
అనుకూలః శుఛి: దక్షః కవిహి విద్వాన్ సుదుర్లభః
తా:-- క్షమాగుణం వున్నవాడు,దాత, ప్రతిభ గురించగలవాడు.అయిన ప్రభువు పుణ్యం .
వలననే లభిస్తాడు.దానికి తోడు, అనుకూలుడూ,నిర్మలుడూ,సమర్థుడూ,పైపెచ్చు కవీ, విద్వాంసుడూ అయిన నీలాంటి రాజు దొరకడం చాలా కష్టం..
భోజరాజుకు అలాంటి కవులు ఆశ్రయం కోరి వస్తే యింక కావలిసింది ఏముంటుంది?
ఈయనకు వెంటనే ఒక ఇల్లు ఏర్పాటు చేయ వలిసిందని మంత్రిని ఆజ్ఞాపించాడు.
ఆ సమయము లో ఏ ఇల్లూ ఆయనకు యివ్వద్ఫానికి ఖాళీగా లేదు.మంత్రి వెతికి
వెతికి ఒక నేత గాడు వున్న యింటికి వెళ్లి నీవు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి.ఈ
యింట్లోకి మహా విద్వాంసుడికి ఇవ్వాల్సి వుంది అని చెప్పాడు.ఆ నేతగాడికి చాలా
బాధ కలిగింది.యిప్పటి కిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే తనేక్కడికి వెళ్ళాలి?అని
నేరుగా రాజు గారి దగ్గరకు వెళ్లి నమస్కరించి తన గోడు చెప్పుకున్నాడు.రాజా!నీ
మంత్రి నన్ను మూర్ఖుడిగా లెక్క కట్టేశాడు.అన్యాయంగా నన్నుయింటినుంచి
వెళ్లగొడుతున్నాడు..ఎవరో గొప్ప విద్వాంసుడికి యిస్తాడట.నీవైనా పరీక్షించి చూడు
నేను మూర్ఖుడి నో పండితుడనో అని ఈ శ్లోకం చెప్పాడు.
కావ్యం కరోమి నహి చారు తరం కరోమి
యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి
భూపాల మౌళి మణి రంజిత పాద పీట
హే సాహసాంక! కవయామి వయామి యామి
తా:--కావ్యం నేనూ వ్రాస్తాను.కానీ అంత చక్కగా రాయలేను.బాగా ప్రయత్నిస్తే
చక్కగానూ వ్రాయగలను.,శత్రురాజుల శిరస్సు మీది రత్నాల కాంతి చేత ఎర్రగా
ప్రకాశించే పాద పీఠంకల మహారాజా! సాహసమే మారు పేరుగా గలవాడా! కవయామి=కవిత్వమూ వ్రాస్తాను,వయామి=నేతా నేస్తాను,యామి=వెళ్ళమంటే వెళ్ళీ పోతాను. ఈ శ్లోకంలో చమత్కారమేమిటంటే .చివరి పాదం లోని 'కవయామి' 'వయామి' 'యామి' అన్నమాటలు ఎంతో చమత్కార యుక్తములుఎలాగంటే 'కవయామి' అనేది ఒక క్రియాపదం. కవిత్వముచెప్పగలను అని దాని అర్థం.అందులో మొదటి అక్షరం 'క' తీసివేస్తే 'వయామి' అవుతుంది. అంటే మగ్గం నేసుకోగలను అని అర్థం, దానిలోనుండి 'వ' అనే అక్షరం తీసివేస్తే 'యామి' అవుతుంది. వెళిపోగలను అని అర్థం. యిలా ఒకపదం నుండి ఒక్కొక్క అక్షరాన్ని తగ్గిస్తూ పోతే యింకో క్రియాపదం రావడం ఎంతో చమత్కారం.
రాజుకు ఒక నేతగాడు తనను నువ్వు అని సంబోధిస్తుంటే ఆశ్చర్యమూ,ఆ నేతగాడి
కవితా మాధుర్యానికి సంతోషమూ కలిగాయి. కవితా శక్తి మాటయితే కొంచెంఆలోచించ
వలిసిందే కానీ నీ శ్లోకం చాలా బాగుంది.అన్నాడు. ఆ నేత కార్మికుడికి కొంచెం కోపం వచ్చింది.పైకి మాత్రం రాజా!ఒక్క విషయం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం వేరు,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక ,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక పోతున్నాను.అన్నాడు. ఏమిటా విషయం?సంకోచించకుండా చెప్పు అన్నాడు రాజు. దేవా!నేను కాళిదాసును తప్ప ఇతరులను కవులుగా పరిగణించ లేకపోతున్నాను.నీ సభలో కవిత్వ తత్వం తెలిసిన విద్వాంసులు కాళిదాసు తప్ప యింకెవరున్నారు?అని యింకో శ్లోకం చెప్పాడు.
యత్-సారస్వత సౌరభం గురు కృపా పీయూష పాకోద్భవం
తత్ -లభ్యం కవినైవ;హఠతః పాఠ ప్రతిష్ఠాజుషా
కాసారే దివసం వసన్నపి పయః పూరం పరం పంకిలం
కుర్వాణః కమలాకరస్య లభతే కిం సౌరభం సైరిభః
అర్థము:--కవిత్వ సౌరభం అనేది గురు కృప అనే అమృతపాకం వల్ల పుట్టేది.అది కవి
అయిన వాడికే లభిస్తుంది.బలవంతంగా (హఠతః)పాఠాలు చెప్పించుకుని
ఎక్కించుకునే వాడికి దొరకదు.రోజంతా చెరువులో కూర్చొని (కాసారే దివసం వాసన్ అపి) చెరువునంతా పూర్తిగా కలుషితం చేస్తున్న (పయః పూరం పరం పంకిలం కుర్వాణః)
దున్నపోతు(సైరిభః) తామరకొలను సౌరభాన్ని పొందుతుందా?
అయం మే వాగ్గుమ్భః-విశదపద వైదగ్ధ్య మధురః
స్ఫురత్-బంధః, వంధ్యః పరహృది,కృతార్థ: కవిహృది
కటాక్షః-వామాక్ష్యా: దరదళిత నేత్రాంత గళితః
కుమారే నిస్సారః,స తు కిమపి యూనః సుఖయతి.
అర్థము:- ఈ నా పద గుంభనము స్పష్ట మైన పదాల అమరికతో మధురమైనది,పద
బంధాల మెరుపు గలది.అది కవి హృదయాన్నే మెప్పిస్తుంది.యితర హృదయాలలో
అది నిష్ఫల మైపోతుంది. అతివ అరమోడ్పు కన్నుల నుంచి జారే చూపు పసిబాలుడికి
పనికి రాదు,పడుచు వాడి నయితేనే అది ఉల్లాస పరచగలదు. పోతే నేను నిన్ను నువ్వు నువ్వు అన్నానని కోపగించుకోకు.
బాల్యే సుతానాం,సురతేంగ నానాం
స్తుతౌ కవీనాం,సమరే భటానాం
'త్వం' కార యుక్తాః హి గిరః ప్రశ స్తాః
కః ది ప్రభో మోహభరం, స్మరత్వం
అర్థము:--బాల్యం లో కుమారులకూ,ఏకాంత ప్రణయ వేళలలో స్త్రీలకూ,స్తుతించే
టప్పుడు కవులకూ,యుద్ధము లో సైనికులకూ 'నువ్వు' అన్న సంబోధన తో కూడిన
మాటలే ప్రశస్తమయిన మాటలని శాస్త్రం జ్ఞాపకం చేసుకో నీ కెందుకీ అపార్థం?
బోజరాజు బాగా చెప్పావు అని మెచ్చుకొని అతనికి అక్షర లక్షలిచ్చి సన్మానించటమే
కాక వున్న యింట్లోనే ఉండేందుకు అనుమతి నిచ్చి పంపేశాడు.ఆ లక్ష్మీధర కవికి
త్వరగా ఒక భవనం నిర్మించమని,అంతవరకూ అతన్ని అతిథి గృహం లోనే వుంచమని
మంత్రిని ఆదేశించాడు. అలా ఆ నేతగాడు కవిత్వం చెప్పి రాజును మెప్పించి తన యింటిని కాపాడుకున్నాడు.

అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము డా .యస్వీ రాఘవేంద్ర రావు

నీరాజనము
సకల సాహితీ ప్రక్రియా స్రష్ట వగుచు
నాంధ్రభాషా ప్రపంచము నద్భుతముగ
"వేయి పడగల " మోసిన "విశ్వనాథ"
ఎటుల సేవించి నీ ఋణ మీగ గలము ?
"చెలియలికట్ట" లేని సువిశేష చిరత్న వినూత్న సాహితీ
జలనిధి ! "కల్పవృక్షము" నొసంగితి, కావ్య సుధారసంబులన్
తెలుగు జనాళి తన్పితివి దివ్యకవీంద్ర ! "కళాప్రపూర్ణ !" నీ
వల "శశిదూతమున్" నెఱపి, తాంధ్రియు వాఙ్మయ కౌముదిం గనెన్.
"ఆంధ్ర పౌరుషము"ను, "నాంధ్ర ప్రశస్తి"యు
దెసల నీ కతమున తేజరిల్లు
"జ్ఞానపీఠ" సు"కవిసమ్రా" డ్ప్రథితకీర్తి !
వీక దనరిన "జగదేకవీర !"
నవ్యులలో నవ్యుడవై,
కావ్య పునర్జీవన ఘనకార్య సవన సం
సేవ్యుడవై మంటివి, సం
దీవ్యత్కవిచంద్ర ! కొనుము నీరాజనముల్.
"గిరికుమారుని ప్రేమగీతాలు" నేర్పి,
"అనార్కలి" భగ్నప్రణయము తెల్పి,
"నర్తనశాల" లో నాట్యాలు నేర్పించి,
"వేనరాజు కథ" ను విశదపఱచి,
"మాస్వామి" కీర్తించి మహితభక్తి,
నల "స్వర్గానికి నిచ్చెనల్" రహిని గూర్చి,
"కోకిలమ్మకు పెళ్ళి కూర్మి చేయించి,
"కిన్నెరసాని" పాటలో కరుణ నింపి,
వివిధ సాహితీ ప్రక్రియా విలసనమున
ఆంధ్ర వాణిని కైసేసి తమరవీర !
ఆర్ష సంస్కృతి "ధర్మచక్రావతార !"
అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము
డా .యస్వీ రాఘవేంద్ర రావు

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్

భవభూతి మహాకవి ''ఉత్తరరామచరిత్రమ్ " నాటకం వ్రాయటం పూర్తిచేసిన తర్వాత, దాన్ని
ఆ కాలంలో అతిప్రసిద్ధుడైన కాళిదాస మహాకవికి చూపించి ఆయన అభిప్రాయం
తెలుసుకోవాలని కొన్నాళ్ళు తహతహలాడాడు బాణభట్టులాగే.
తీరా నాటకం చదివి నచ్చకపోతే మహాకవి ఏమంటాడో అని (బాణుడిలాగే ) ఒక శంక.
అందువల్ల తను స్వయంగా కాళిదాసుకు నాటకం చూపించటానికి సంశయించి, తన
కుమారుడికి తన కుమారుడికి తన తాళపత్రగ్రంథం యిచ్చి కాళిదాసు యింటికి పంపాడు.
కాళిదాసు యింట్లో కూచుని చదరంగం ఆడుకుంటున్నాడు. భవభూతి కుమారుడు కాళిదాసుతో మీరు కొంచెం సమయమిస్తే, మా నాన్నగారి నాటకం మీకు వినిపించి మీ
అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. అన్నాడు.
వేరే సమయమెందుకు?వచ్చావుగదా!యిప్పుడే చదివి వినిపించు. ఒక చెవి పడేసి వినేస్తాను. అన్నాడు చదరంగం బల్లమీది నుంచి దృష్టి కూడా మరల్చకుండా.
భవభూతి కుమారుడికి మనసు చివుక్కుమంది. తన తండ్రి వ్రాసిన మహాకావ్యం, శ్రద్ధపెట్టి వినేందుకు కూడా యిష్టం లేని ఈ అహంభావికి నాటకమంతా వినిపించటం చెవిటివాడి
ముందు శంఖమూది నట్టు గదా! అనిపించింది. కానీ ఏంచేస్తాడు?తన తండ్రికి కాళిదాసు గురుతుల్యుడు, అంతకంటే ఎక్కువే. ఈయన అభిప్రాయం తెలుసుకుంటే తప్ప
ఆయనకు మనః శాంతి లేదు. చేసేది లేక నాటకమంతా చదివి వినిపించాడు.
చదివాడు కానీ కాళిదాసు ఒక్క ముక్కైనా విన్నాడని అతనికి నమ్మకం లేదు. ఆయన మానాన ఆయన చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇటుపక్కకు తిరిగి చూడనైనా
చూడలేదు. అంతా చదివాక మాత్రం,నోటినిండా తాంబూలం తో అస్పష్టన్గా సున్నా ఎక్కువైంది అని మాత్రం వినిపించింది. భవభూతి కుమారుడికి 'ఓహో! ఈ వ్యసనపరుడైన అహంభావికి తాంబూలంలో సున్నం ఎక్కువైనట్లుంది. దానిమీద వున్న
ఆసక్తి గూడా ఈయనకు యితరులు వ్రాసిన కావ్యాల మీద లేదు.అనుకొన్నాడు. ఆ
నిర్లక్ష్యం, అనాసక్తి అతన్ని బాగా నొప్పించాయి.
ఒకనమస్కారం పెట్టి యింటికివెళ్ళి తండ్రితో జరిగినదంతా చెప్పాడు. విని ఆయనకూడా చిన్నబుచ్చుకున్నాడు.
తండ్రీ కొడుకులిద్దరూ యిలా దిగాలుగా కూర్చొని వుండగా, కాళిదాసేభవభూతి యింటికి వచ్చాడు. వస్తూనే భవభూతిని కౌగలించుకొని ఎంత గొప్పగా వ్రాశావయ్యా! గ్రంథం'
అని మెచ్చుకున్నాడు. భవభూతి ఆయనను కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు.
మాటల మధ్యలో భవభూతి,కాళిదాసుతో మహాకవీ, నా కుమారుడు మీకీ నాటకం చదివి వినిపించినప్పుడు మీరు మరేదో పనిలో వుండి, అంత శ్రద్ధగా వినలేక పోయారనీ చెప్పాడు. అంతా విన్న తర్వాత కూడా మీరు నాటకం విషయం ప్రస్తావించకుండా, మీ
తాంబూలంలో సున్నం ఎక్కువవడం గురించి మాత్రం ఏది అన్నారని చెప్పాడు. మీరేమో
యిప్పుడు నా నాటకాన్ని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏదో సాటి కవినని మర్యాదతో
మీరిలా అంటున్నారనని అనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే, మరోసారి నాటకమంతా నేనే స్వయంగా మీకు చదివి వినిపిస్తాను. ఈసారైనా విని మీ సూచనలూ,
అభిప్రాయమూ నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తాను. అన్నాడు.
కాళిదాసు నవ్వాడు; 'కవిరాజా, నాకు కావ్యరచనలో, కావ్య పఠనంలో, శ్రవణంలో వున్న
ఆసక్తి మరే విషయంపైనా లేదు. మీ చిరంజీవి చదువుతున్నప్పుడు, నేను మీ కావ్యం
క్షుణ్ణ౦గా, శ్రద్ధగా విన్నాను. పూర్తిగా ఏకాగ్రతతో. మీరు కావాలంటే నేను ఆ నాటకం
ఆమూలాగ్రం ఇప్పటికిప్పుడు తిరిగి చెప్పగలను. నాటకం నాకెంతో నచ్చింది కనుకే
నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అభినందించటం నాధర్మం అని భావించి వచ్చాను.నేను అన్నమాటలు పై పై మర్యాదకోసం చెప్పినవి కావు.' అన్నాడు.
ఇక సున్నం విషయమా? మీ అబ్బాయి నేనన్నది సరిగా వినలేదు. నేనన్నది సున్నం గురించికాదు. 'సున్న' గురించి , నాటకం లో ఒకే ఒకచోట ఒక్క సున్నాఎక్కువైందేమో
ఆ సున్నా తీసేస్తే ఆ శ్లోకం మరింత రమ్యంగా వుంటుందేమో ననిపించింది. అందుకే సున్న ఎక్కువైందేమో నాని చిన్న సూచన చేశాను తప్ప మీ అద్భుతమైన నాటకం లో
ఏ చిన్న మార్పూ అవసరం లేదు.
ఆ మాటలువిని భవభూతి ఉప్పొంగి పోయాడు. ఉత్సాహంగా సున్న ఎక్కువైంది ఏ శ్లోకం లో స్వామీ?నాటకంలో శ్లోకాలన్నీ గబ గబ మీకు వినిపిస్తాను.దయచేసి చెప్పండి. అన్నాడు.
ఆ అవసరం లేదు. నీ కావ్యంలో ఏ శ్లోకమైనా నేను మరిచిపోతే కదా నువ్వు నాకు గుర్తు చేసేది? మొదటి అంకం లోనే, రాముడు తను అరణ్యవాసంలో సీతతో గడిపిన తొలిరోజులు గుర్తు చేసుకుంటూ వుండే సందర్భంలో ఒక మనోహరమైన శ్లోకం చెప్పావు.
కిమపి కిమపి మందం మంద మాసక్తి యోగాత్
అవిరళిత కపోలం జల్పతోర క్రమేణ
అశిధిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణో
అవిదిత గతయామా రాత్రి రేవం వ్యరంసీత్
(అశిధిల పరిరంభ -వ్యాపృత-ఏక - ఏక - దోష్ణో: = అతి సన్నిహితంగా ఒకరి బాహువులలో
ఒకరుగా ఒదిగి ;
అవిరళిత కపోలం - చెక్కిలికీ చెక్కిలికీ మధ్యస్థలం లేకుండా
ఆసక్తి యోగాత్ - అక్రమేణ - కిమపి కిమపి - మందం మందం - జల్పతో: = ఆసక్తి బట్టే తప్ప - మారె వారసలేకుండా - ఏవేవో ముచ్చట్లు - గుసగుసలుగా చెప్పుకుంటున్న
(మనకు)
అవిదిత గతమయామా - రాత్రి: - ఏవం - వ్యరంసీత్ = తెలియకుండా దొర్లిపోయిన
జాములు గల రాత్రి యిలా గడిచిపోయింది.
అవునవును అన్నాడు భవభూతి.
అందులో రాత్రిరేవం వ్యరంసీత్ (రాత్రి యిలా గడిచిపోయింది.) అనే బదులు
రాత్రి రేవ వ్యరంసీత్ (రాత్రిగడిచి పోయింది, మాటలు యింకా మిగిలే వున్నాయి)
అని చెప్తే మరీ బాగుంటుంది.
పరస్పరం అనురక్తులైన దంపతుల మాటలు ఎడతెగనివి.అలా ఉంటూనే ఉంటాయి.
రాత్రి జాములు మాత్రం దొర్లిపోతూంటాయి. అని అందమైన భావం వస్తుంది.అన్నాడు
కాళిదాసు.
అవశ్యం మహాకవి! ఎంత అద్భుతమైనమార్పు సూచించారు! అందుకే తమరు కవికుల
గురువులు అన్నాడు ఆనంద భాష్పాలతో భవభూతి.
అదేమీలేదు మీ అంతటివారు మీరు, మహాకవులు.
నాటకేషు చ కావ్యేషు వయం వా వయమేవ వా
ఉత్తరే రామచరితే భవభూతి: విశిష్యతే
నాటక రచనలో, కావ్య రచనలో మాకు మేమే సాటి. ఉత్తరరామచరిత్ర లో మాత్రం
భవభూతి మమ్మల్ని మించి పోయాడు. అని చెప్పక తప్పదు. అన్నాడు కాళిదాసు.
భవభూతి కవిగానే కాక గొప్ప దార్శనికుడిగా కూడా ప్రసిద్ధి పొందినవాడంటారు.
కన్యాకుబ్జ౦ రాజు యశోవర్మ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈయన విదర్భ దేశం వాడని కొందరూ, గ్వాలియర్ ప్రాంతం వాడని కొందరూ,ఆంద్రుడని కొందరూ వాదించారు.
భవభూతి రచనలు మూడూ నాటకాలే.'ఉత్తరరామచరితం' 'మాలతీమాధవం'
'మహావీరచరితం' భవభూతి కరుణరసాన్ని ఎక్కువ అభిమానించాడు'.ఏకో రసః కరుణ ఏవ!'
-----------------------------శుభరాత్రి----------------------------

Friday, August 16, 2019

"కుంచమంత కూతురుమంచం భోజనం" "ముదితల్ నేర్వగరాని విద్యకలదే దేశమంటే మనుషులోయ్"

ఈ వీడియో చూడడానికి వినోదంగానే ఉన్నా ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది. 
"కుంచమంత కూతురుంటే మంచం మీదే భోజనం" అని ఒక సామెత 
అలాగే "ముదితల్ నేర్వగరాని విద్యాకలదే ముద్దార నేర్పింపగాన్" అన్నారు 
పిల్లల పెంపకం అన్నది అత్యంత ముఖ్యమైనది. అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం 
చిన్నప్పటినుంచి పిల్లలని టి.విలకి, కంప్యూటర్లకి, సెల్ల్ ఫోన్స్ కి బందీలుగా చేసి కొద్దిగా ఎదగగానే ప్లే స్కూల్ నుంచి ఐఐటీ చదువుల మత్తులో వారిలో సృజనాత్మకత, మానవీయత లేకుండా చేస్తున్నాం. 
ఈ సందర్భంగా 1910 లో రచించబడి 09/ 08 /1913 లో కృష్ణాపత్రికలో ప్రచురించబడిన గురజాడ వారి "దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్" ఈ పలుకులు ఎప్పటికీ విశ్వజాతి నిర్మాణానికి పునాది రాయి. ఒకసారి దేశం 73 వ స్వేచ్ఛా వాయువులు ఆస్వాదిస్తున్న వేళ మననం చేసుకుందాం! దేశానికీ దశ, దిశా తెలియచెప్పగల సత్తా ఉన్న దేశభక్తి పూరిత పూర్తి గీతం మీకోసం: సత్యసాయి - విస్సా ఫౌండేషన్
దేశమును ప్రేమించుమన్నా
1.దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా!
వొట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టి మేల్‌ తలపెట్టవోయి.
2.పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయి;
తిండి కలిగితె కండ కలదోయి;
కండ కలవాడేను మనిషోయి!
3.యీసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయి.
4.అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి
దేశి సరుకుల నమ్మవలెనోయి !
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి.
5.వెనక చూసిన కార్యమేమోయి?
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి!
6.పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే,
వ్యర్థ కలహం పెంచబోకోయి
కత్తి వైరం కాల్చవోయి
7.దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొకమేల్‌
కూర్చి జనులకు చూపవోయి
8.ఓర్వలేమిపిశాచి దేశం
మూలుగులు పీల్చేసెనోయ్,
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయి
9.పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయి?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయి!
10.స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టి కాదోయి
దేశమంటే మనుషులోయి!
11.చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయి
12.మతం వేరైతేను యేమోయి?
మనసు లొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయి!
13.దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి,
నరుల చమటను తడిసి మూలం,
ధనం పంటలు పండవలెనోయి!
14.ఆకులందున అణగిమణగీ
కవిత కోయిల పలకవలెనోయి;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయి!

Sunday, August 11, 2019

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు 2

తృష్ణ...: గుంటూరు శేషేంద్ర శర్మ కవిత: "ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిత్వాన్ని శ్రీ శ్రీ మొదలు విశ్వనాధ సత్యనారాయణ,...

Total Pageviews