Thursday, September 19, 2019

ఉత్తరానికోఉత్తరం

#ఉత్తరానికోఉత్తరం

పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం 🙏
ఉభకుశలోపరి.. !
సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు, సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం..
మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ.. రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు.. ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం.. 'ఎక్కడున్నావ్' అంటే అమీర్ పేటలో ఉన్నా 'అంబర్ పేటలో ఉన్నా' అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం.. ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం.. కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్..

ఉత్తరం రాస్తున్నప్పుడు హృదయావిష్కరణ జరిగేది.. ఫోన్ మాటల్లో ఆచితూచి అడ్డంగా అబద్ధాలాడేస్తున్నాం, లోపలొకటి పెట్టుకుని బయటకు ఇంకో మాట చెప్తున్నాం.. బొత్తిగా పాడైపోయాం.. ఒళ్ళంతా కుళ్ళుపోయి జబ్బుచేసున్నాం.. ఒక్కసారి మళ్ళీ మీ హవాతో మాకు ట్రీట్మెంట్ మొదలెట్టండి ఉత్తరం గారూ.. పుణ్యముంటుంది..🙏

పోనీ పెరిగిన సో కాల్డ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అవకాశం ఉంది కదా, అందులోనే మనస్ఫూర్తిగా ఒక ఉత్తరం లాంటి సందేశాలు పంపుకుందాం అనుకుంటే, అది కూడా ఇష్టానుసారంగా వాడేస్తున్నాం.. ఎవరో పంపిన మెసేజెస్ అటూఇటూ పంపేసి, అదేదో మా మేధావితనం అన్నట్టు గొప్పయిపోవడం,పిచ్చి
పిచ్చి ఇమేజ్లు,పనికి మాలిన వీడియోలు షేర్ చేసుకుంటూ 'కిక్కిక్కిక్కికిక్కి' అని నవ్వుకుంటూ పెద్ద మేధావుల్లా మెదళ్లను సానపట్టుకోవడం తప్ప ఏదీ ఎందుకూ పనికిరావట్లేదు..
మళ్ళోకసారి రండి ఉత్తరం గారూ ప్లీజ్ 🙏

మీరు లేకపోవడం వల్ల..
ప్రేయసి మళ్ళీ మళ్ళీ చదువుకునే ముత్యాల పొగడ్తల ప్రేమలేఖ పత్తాలేకుండా పోయింది..
బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది..
భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది..
బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది..
ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది..

"అమ్మా.. అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది..
"ఏమేవ్.. అల్లుడు ఉత్తరం రాసాడు..అమ్మాయి నెల తప్పిందట" అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు..
ఇలాంటి ఎన్నో ఎన్నో భావాల బంధాలు మృగ్యమైపోయాయి..

'గుండె గొంతులో కొట్లాడటం'
'మనసు ఆర్తితో ద్రవించడం'
'అక్షరాలు ఆనందంతో స్రవించడం'
మానేసాయి..
మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి..

మొత్తంగా మాటల్లో అక్షరాలున్నాయి కానీ, వాటికి ఎమోషన్ లేకుండా పోయింది.. చాలా కృతకంగా, అసహజంగా ఉన్నాయిప్పుడు మానవ సంబంధాలు.. అందుకే ఉత్తరం గారూ.. మళ్ళీ రండి.. 🙏

సాంకేతిక పరిజ్ఞానం ఎంతైనా పెరగడం అభివృద్ధి కావచ్చు.. దానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ మాయమైపోతున్న మానవ సంబంధాలు తిరిగి రావాలనే ఆకాంక్ష నాది..

ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను..

ఇట్లు..
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికి కోరుకునే చాదస్తపు మనిషి..😔

దేవాలయంలో గడప వలసిన విధానం

"నేను మళ్ళీ ఆలయానికి  రాను"

ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది.  "నేను ఇకపై ఆలయానికి రాను"

తండ్రి ఇలా అడిగాడు: "ఎందుకో నేను తెలుసుకోవచ్చా?"

ఆమె ఇలా అన్నది: " భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ  మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి , వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె

తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు, ఆపై ఇలా అన్నాడు: "సరే ... నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నాకోసం చిన్న పని చేయగలవా?" అన్నాడు  తండ్రి

ఆమె అన్నది: "చెప్పండి .. నాన్నగారు, ఏమిటది?"

తండ్రి ఇలా చెప్పాడు: "దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి వచ్చినా కూడా నీళ్ళు  ఏమాత్రం క్రింద పడకుండా రావాలి."  రాగలవా? అన్నాడు తండ్రి

కుమార్తె చెప్పింది: "ఓ ... తప్పకుండా నేను చేయగలను."

అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది:

"చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను"

అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు:

1. ఈసారి వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్ తో ఉండగా నీవు  చూశావా?

2.  ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్  చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూశావా?

3. ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా?

ఆమె ఇలా చెప్పింది: "నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి  గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించలేదు "

అతను ఆమెతో చెప్పాడు: "నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినదిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయనగురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు, పైగా నీవంటి వారిని చూసి వారుకూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధనా మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నతపథంలో నడిపిస్తాయి" .....

దేవాలయంలో గడప వలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది .....🙏 ఏకాగ్రత.....🙏సాధన ముఖ్యం ..... 🙏🙏

🌷 దసరా పాట🌷


🌷 దసరా పాట🌷


దసరా వచ్చేసింది కదండి.
నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.
 దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే
ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...

ఇదే ఆ దసరా పాట

పల్లవి-

1⃣
ఏదయా మీదయ మామీద లేదు!
ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసల బడక!
చేతిలో లేదనక  ఇవ్వలేమనక !

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!
రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!
2⃣

పావలా బేడైతె పట్టేది లేదు!
అర్థరూపాయైతె అంటేది లేదు!
ముప్పావలైతేను ముట్టేది లేదు!
రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!
హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

3⃣
అయ్యవారికి చాలు ఐదు వరహాలు!
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!
మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!
శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

 *
దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి  వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.

పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.

లోగుట్టు


ఒక వ్యక్తి అభివృద్ధి గాని
కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.

ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు.
వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి
ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.
దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.

పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.
ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు
విద్యార్ధులకు
ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో.
దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.
ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.

అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.
ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది...
💐💐💐💐💐💐

పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?

పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?

శ్లో || ఆదిత్య గణనాథం చ దేవీం రుద్రం చ కేశవం |
పంచదైవత్యమిత్యుక్తం సర్వకర్మసు పూజయేత్ ||
మన హిందూ సాంప్రదాయంలో కులాలకు అతీతంగా ఆస్తికులైన వారందరూ తమ పూజా మందిరాలలో ఐదుగురు (పంచదేవాతలు) విగ్రహాలను ఉంచి పూజించాలి. అవి సూర్యుడు, గణేశుడు, (దేవి) పార్వతి, శివుడు, విష్ణువు. వీరిని సమిష్టిగా పంచాయతన అని వ్యవహరిస్తారు. పంచభూతాలకు ప్రతీకగా కూడా భావించవచ్చు. మన హిందూ, సనాతన సాంప్రదాయ రీత్యా ఈ పంచాయచన పూజ ఎంతో శ్రేష్ఠమైనదిగా మహా ఋషులు తెలిపారు. సకల శుభకార్యాలలోనూ, ప్రతినిత్యం ఈ ఐదుగురు దేవతను పూజించటం ఆ గృహంలో నివశించేవారందరికీ శ్రేయస్సు చేకూరుతుంది. ఈ ఐదుగురు దేవతలా విగ్రహాలు, చిన్నవి మీ గుప్పిటలో సరిపోయే కొలత ఉన్నవి వీటిని ఒక పళ్ళెంలో వుంచుకుని పూర్వాభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. ప్రతిరోజూ శుభ్రమైన బట్టతో శుభ్రపరచాలి. సమయాభావం ఉన్నవారు కేవలం ఐదు నిమిషాలలో పూజ పూర్తి చేయవచ్చు. అది ఎలాగంటే ...?

కేవలం పంచ ఉపచార పూజ ... దేవతల పేర్లు చెప్పి
1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం సమర్పయామి అంటే చాలు. అయితే అన్నిటికంటె ముఖ్యంగా భగవంతుని పూజలో, ఉపచార సమర్పణలో అర్చనచేసే వ్యక్తి భక్తిశ్రద్ధలే గీటురాళ్ళు. అందుకే చివరగా శాస్త్రం "తత్ర భక్తి శ్రద్ధా గరీయసీ'' అంటుంది.

Wednesday, September 11, 2019

భోజరాజు, బ్రహ్మచారి,కాళిదాసు భోజరాజా! శంభుడికి దూరం వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారు

భోజరాజు ఒకనాడు కొలువు దీరి యుండగా,ఒక బ్రహ్మచారి వచ్చి రాజును చిరంజీవ అని
ఆశీర్వ దించాడు.
రాజు ఆ యువ బ్రహ్మచారిని బ్రహ్మచారీ!ఈ కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం
యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించావు?నిత్య వుపవాసాలతో యిలా ఎందుకు
కృశించి పోవడం?గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ
కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.అన్నాడు.
అందుకు బ్రహ్మచారి రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది
ఏముంటుంది?అయినా
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహా: -శాంతి: ప్రియా గేహినీ,
వృత్తి: -- వన్యలతా ఫలై: నివసనం, వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నిర్వృతి:
తేషాం - ఇందు కళావతంస యామినాం మోక్షేపి నో నః స్పృహా
అర్థము:--లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే ఇల్లు,మనశ్శాంతి, మనోనిగ్రహమే మా
ఇల్లాలు, అడవులలో
తీగేలతో,పండ్లతోనే సహవాసమే మా జీవన విధానం.చెట్టు పట్టలే మాకు వస్త్రాలు,మంచి
మాటలు అనే అమృత ప్రవాహం లో నిరంతర మునిగి తేలే వాళ్ళం, ఎవరికైతే ఈ
సుఖాలు వుంటాయో అలాంటి చంద్ర
మౌళీశ్వరుడి భక్తులము ,యోగులమూ అయిన మాకు మోక్షం మీద కూడా కోరిక
వుండదు.అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము ఏమైనా వుంటే
చెప్పండి.అన్నాడు
అప్పుడు అతడు రాజా!మేము కాశీయాత్రకు వెళుతున్నాము.దయచేసి మీ సభలోని
పండితులను భార్యా సమేతం గా మాతో పాటు యాత్రకు పంపించండి.త్రోవ పొడుగునా
శ్రమ తెలియకుండా పండిత గోష్టులు
జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.అన్నాడు ఆ బ్రహ్మచారి.రాజు అందుకు
సరే అన్నాడు రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళారు,ఒక్క
కాళిదాసు తప్ప.మీరు ఎందుకు వెళ్ళలేదు?అని రాజు కాళిదాసును అడిగాడు.కాళిదాసు
ఒక శ్లోకం లో బదులిచ్చాడు.
తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో: దూర వర్తినః
యస్య గౌరీశ్వరః చిత్తే / తీర్థం,భోజ! పరం హి సః
అర్థము:--భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు
వెళతారు,ఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజుకు కోపం వచ్చింది.కానీ ఏమీ చెయ్యలేక
వూరుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత భోజరాజు కాళిదాసు ను యీ రోజేమైనా విశేష మైన వార్త మీ చెవిన
పడిందా?అని అడిగాడు.కాళిదాసు నా చెవిన పడ్డది వార్త కాదు మహారాజా!అని ఒక శ్లోకం
చదివాడు.
మేరౌ, మందర కందరాసు, హిమవత్ సానౌ.మహేంద్రాచలే,
కైలాసస్య శిలా తలేషు, మలయ ప్రాక్ - భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గనై: (ణయై:) వుద్గీయ మానం యశః
అర్థము:--చారణులనే దివ్య గాయకుల బృందాల చేత,నీ కీర్తి గురించి
పాడబడుతున్నపాటలు వినబడ్డాయి
మేరు పర్వతం మీదా,మందర పర్వతపు గుహలలో,హిమాలయాల మీదా, మలయ
పర్వత శిఖ రాగ్రాల
మీదా,సహ్యాద్రి మీదా యిలా అనేకానేక ప్రదేశాలలో చారణులనే దివ్యగాయకుల
బృందాల చేత కొనియాడ బడుతున్న నీ కీర్తి వినపడ్డది
.
అప్పుడు భోజుడు సంతోషం తో కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని
నేను వినగలిగే వాడిని కాదు కదా!అనుకున్నాడు.కాళిదాసు మీద అతని కోపం
యెగిరిపోయింది.
------------------శుభరాత్రి -------------------------------

కవయామి వయామి యామి భోజరాజు నేతగాడు

ఒకనాడు భోజరాజు ఆస్థానానికి దక్షిణ దేశం నుండి లక్ష్మీధరుడు అనే కవి వచ్చాడు.
ఆయన ముఖం తేజస్సు తో వెలిగిపోతూ వుంది.భోజరాజు ఆ కవిని గురించి ఎప్పుడూ విని
వుండలేదు .ఆయనను చూడగానే ఈయన మహానుభావుడు అనే అభిప్రాయం కలిగింది.
కవిగారు భోజరాజుకు మంగళ వాక్యాలతో స్వస్తి చెప్పి అభివాదం చేసి కూర్చున్నాడు
రాజా! నీది పండిత,మండిత సభ.నీవు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడివి.అని ఒక శ్లోకం చెప్పాడు
భోజ ప్రతాపం తు విధాయ ధాత్రా
శేషై: నిరస్తై:పరమాణుభి:కిం
హరే: కారే భూత్ పవి,రంబరే చ
భాను:పయోధే:ఉదరే కృశాను:
అర్థము:--ఆ బ్రహ్మ భోజుడి పరాక్రమాన్ని సృష్టించి,మిగిలిపోయి వదిలేసిన
పరమాణువులతో యింద్రుడి చేతిలోని వజ్రాయుధమూ,ఆకాశము లో సూర్యుడు,
,సముద్రం మధ్యలో బడబాగ్ని తయారయ్యాయేమో.
ధాత్రా=ఆ బ్రహ్మ చేత భోజప్రతాపం విధాయ=భోజుడి పరాక్రమం సృష్టించ బడి, శేషై:
నిరస్తై పరమాణుభి:=మిగిలిపోయి పారేసిన పరమాణువు లతో,హరే: కరే అభూత పవి:=ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఏర్పడింది,ఆకాశములో సూర్యుడూ,పయోధే ఉదరే కృశాను:=సముద్ర గర్భం లో బడబాగ్ని కూడా ఏర్పడి నాయేమో
రాజు,సభికులు ఆ శ్లోకం విని చకితులయ్యారు.రాజు కవికి అక్షరలక్షలు యిచ్చాడు.
రాజా నీ రాజ్యం లోనే ఉండిపోవాలనే కోరికతో సకుటుంబంగా వచ్చాను అన్నాడు
లక్ష్మీధరుడు. ఎందుకంటే
క్షమీ దాతాః గుణ గ్రాహీ స్వామీ స్వామీ పుణ్య యేన లభ్యతే
అనుకూలః శుఛి: దక్షః కవిహి విద్వాన్ సుదుర్లభః
తా:-- క్షమాగుణం వున్నవాడు,దాత, ప్రతిభ గురించగలవాడు.అయిన ప్రభువు పుణ్యం .
వలననే లభిస్తాడు.దానికి తోడు, అనుకూలుడూ,నిర్మలుడూ,సమర్థుడూ,పైపెచ్చు కవీ, విద్వాంసుడూ అయిన నీలాంటి రాజు దొరకడం చాలా కష్టం..
భోజరాజుకు అలాంటి కవులు ఆశ్రయం కోరి వస్తే యింక కావలిసింది ఏముంటుంది?
ఈయనకు వెంటనే ఒక ఇల్లు ఏర్పాటు చేయ వలిసిందని మంత్రిని ఆజ్ఞాపించాడు.
ఆ సమయము లో ఏ ఇల్లూ ఆయనకు యివ్వద్ఫానికి ఖాళీగా లేదు.మంత్రి వెతికి
వెతికి ఒక నేత గాడు వున్న యింటికి వెళ్లి నీవు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి.ఈ
యింట్లోకి మహా విద్వాంసుడికి ఇవ్వాల్సి వుంది అని చెప్పాడు.ఆ నేతగాడికి చాలా
బాధ కలిగింది.యిప్పటి కిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే తనేక్కడికి వెళ్ళాలి?అని
నేరుగా రాజు గారి దగ్గరకు వెళ్లి నమస్కరించి తన గోడు చెప్పుకున్నాడు.రాజా!నీ
మంత్రి నన్ను మూర్ఖుడిగా లెక్క కట్టేశాడు.అన్యాయంగా నన్నుయింటినుంచి
వెళ్లగొడుతున్నాడు..ఎవరో గొప్ప విద్వాంసుడికి యిస్తాడట.నీవైనా పరీక్షించి చూడు
నేను మూర్ఖుడి నో పండితుడనో అని ఈ శ్లోకం చెప్పాడు.
కావ్యం కరోమి నహి చారు తరం కరోమి
యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి
భూపాల మౌళి మణి రంజిత పాద పీట
హే సాహసాంక! కవయామి వయామి యామి
తా:--కావ్యం నేనూ వ్రాస్తాను.కానీ అంత చక్కగా రాయలేను.బాగా ప్రయత్నిస్తే
చక్కగానూ వ్రాయగలను.,శత్రురాజుల శిరస్సు మీది రత్నాల కాంతి చేత ఎర్రగా
ప్రకాశించే పాద పీఠంకల మహారాజా! సాహసమే మారు పేరుగా గలవాడా! కవయామి=కవిత్వమూ వ్రాస్తాను,వయామి=నేతా నేస్తాను,యామి=వెళ్ళమంటే వెళ్ళీ పోతాను. ఈ శ్లోకంలో చమత్కారమేమిటంటే .చివరి పాదం లోని 'కవయామి' 'వయామి' 'యామి' అన్నమాటలు ఎంతో చమత్కార యుక్తములుఎలాగంటే 'కవయామి' అనేది ఒక క్రియాపదం. కవిత్వముచెప్పగలను అని దాని అర్థం.అందులో మొదటి అక్షరం 'క' తీసివేస్తే 'వయామి' అవుతుంది. అంటే మగ్గం నేసుకోగలను అని అర్థం, దానిలోనుండి 'వ' అనే అక్షరం తీసివేస్తే 'యామి' అవుతుంది. వెళిపోగలను అని అర్థం. యిలా ఒకపదం నుండి ఒక్కొక్క అక్షరాన్ని తగ్గిస్తూ పోతే యింకో క్రియాపదం రావడం ఎంతో చమత్కారం.
రాజుకు ఒక నేతగాడు తనను నువ్వు అని సంబోధిస్తుంటే ఆశ్చర్యమూ,ఆ నేతగాడి
కవితా మాధుర్యానికి సంతోషమూ కలిగాయి. కవితా శక్తి మాటయితే కొంచెంఆలోచించ
వలిసిందే కానీ నీ శ్లోకం చాలా బాగుంది.అన్నాడు. ఆ నేత కార్మికుడికి కొంచెం కోపం వచ్చింది.పైకి మాత్రం రాజా!ఒక్క విషయం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం చెప్పాలని వుంది.కానీ రాజధర్మం వేరు,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక ,విద్వాంసుల ధర్మం వేరు అందుకని చెప్పలేక పోతున్నాను.అన్నాడు. ఏమిటా విషయం?సంకోచించకుండా చెప్పు అన్నాడు రాజు. దేవా!నేను కాళిదాసును తప్ప ఇతరులను కవులుగా పరిగణించ లేకపోతున్నాను.నీ సభలో కవిత్వ తత్వం తెలిసిన విద్వాంసులు కాళిదాసు తప్ప యింకెవరున్నారు?అని యింకో శ్లోకం చెప్పాడు.
యత్-సారస్వత సౌరభం గురు కృపా పీయూష పాకోద్భవం
తత్ -లభ్యం కవినైవ;హఠతః పాఠ ప్రతిష్ఠాజుషా
కాసారే దివసం వసన్నపి పయః పూరం పరం పంకిలం
కుర్వాణః కమలాకరస్య లభతే కిం సౌరభం సైరిభః
అర్థము:--కవిత్వ సౌరభం అనేది గురు కృప అనే అమృతపాకం వల్ల పుట్టేది.అది కవి
అయిన వాడికే లభిస్తుంది.బలవంతంగా (హఠతః)పాఠాలు చెప్పించుకుని
ఎక్కించుకునే వాడికి దొరకదు.రోజంతా చెరువులో కూర్చొని (కాసారే దివసం వాసన్ అపి) చెరువునంతా పూర్తిగా కలుషితం చేస్తున్న (పయః పూరం పరం పంకిలం కుర్వాణః)
దున్నపోతు(సైరిభః) తామరకొలను సౌరభాన్ని పొందుతుందా?
అయం మే వాగ్గుమ్భః-విశదపద వైదగ్ధ్య మధురః
స్ఫురత్-బంధః, వంధ్యః పరహృది,కృతార్థ: కవిహృది
కటాక్షః-వామాక్ష్యా: దరదళిత నేత్రాంత గళితః
కుమారే నిస్సారః,స తు కిమపి యూనః సుఖయతి.
అర్థము:- ఈ నా పద గుంభనము స్పష్ట మైన పదాల అమరికతో మధురమైనది,పద
బంధాల మెరుపు గలది.అది కవి హృదయాన్నే మెప్పిస్తుంది.యితర హృదయాలలో
అది నిష్ఫల మైపోతుంది. అతివ అరమోడ్పు కన్నుల నుంచి జారే చూపు పసిబాలుడికి
పనికి రాదు,పడుచు వాడి నయితేనే అది ఉల్లాస పరచగలదు. పోతే నేను నిన్ను నువ్వు నువ్వు అన్నానని కోపగించుకోకు.
బాల్యే సుతానాం,సురతేంగ నానాం
స్తుతౌ కవీనాం,సమరే భటానాం
'త్వం' కార యుక్తాః హి గిరః ప్రశ స్తాః
కః ది ప్రభో మోహభరం, స్మరత్వం
అర్థము:--బాల్యం లో కుమారులకూ,ఏకాంత ప్రణయ వేళలలో స్త్రీలకూ,స్తుతించే
టప్పుడు కవులకూ,యుద్ధము లో సైనికులకూ 'నువ్వు' అన్న సంబోధన తో కూడిన
మాటలే ప్రశస్తమయిన మాటలని శాస్త్రం జ్ఞాపకం చేసుకో నీ కెందుకీ అపార్థం?
బోజరాజు బాగా చెప్పావు అని మెచ్చుకొని అతనికి అక్షర లక్షలిచ్చి సన్మానించటమే
కాక వున్న యింట్లోనే ఉండేందుకు అనుమతి నిచ్చి పంపేశాడు.ఆ లక్ష్మీధర కవికి
త్వరగా ఒక భవనం నిర్మించమని,అంతవరకూ అతన్ని అతిథి గృహం లోనే వుంచమని
మంత్రిని ఆదేశించాడు. అలా ఆ నేతగాడు కవిత్వం చెప్పి రాజును మెప్పించి తన యింటిని కాపాడుకున్నాడు.

అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము డా .యస్వీ రాఘవేంద్ర రావు

నీరాజనము
సకల సాహితీ ప్రక్రియా స్రష్ట వగుచు
నాంధ్రభాషా ప్రపంచము నద్భుతముగ
"వేయి పడగల " మోసిన "విశ్వనాథ"
ఎటుల సేవించి నీ ఋణ మీగ గలము ?
"చెలియలికట్ట" లేని సువిశేష చిరత్న వినూత్న సాహితీ
జలనిధి ! "కల్పవృక్షము" నొసంగితి, కావ్య సుధారసంబులన్
తెలుగు జనాళి తన్పితివి దివ్యకవీంద్ర ! "కళాప్రపూర్ణ !" నీ
వల "శశిదూతమున్" నెఱపి, తాంధ్రియు వాఙ్మయ కౌముదిం గనెన్.
"ఆంధ్ర పౌరుషము"ను, "నాంధ్ర ప్రశస్తి"యు
దెసల నీ కతమున తేజరిల్లు
"జ్ఞానపీఠ" సు"కవిసమ్రా" డ్ప్రథితకీర్తి !
వీక దనరిన "జగదేకవీర !"
నవ్యులలో నవ్యుడవై,
కావ్య పునర్జీవన ఘనకార్య సవన సం
సేవ్యుడవై మంటివి, సం
దీవ్యత్కవిచంద్ర ! కొనుము నీరాజనముల్.
"గిరికుమారుని ప్రేమగీతాలు" నేర్పి,
"అనార్కలి" భగ్నప్రణయము తెల్పి,
"నర్తనశాల" లో నాట్యాలు నేర్పించి,
"వేనరాజు కథ" ను విశదపఱచి,
"మాస్వామి" కీర్తించి మహితభక్తి,
నల "స్వర్గానికి నిచ్చెనల్" రహిని గూర్చి,
"కోకిలమ్మకు పెళ్ళి కూర్మి చేయించి,
"కిన్నెరసాని" పాటలో కరుణ నింపి,
వివిధ సాహితీ ప్రక్రియా విలసనమున
ఆంధ్ర వాణిని కైసేసి తమరవీర !
ఆర్ష సంస్కృతి "ధర్మచక్రావతార !"
అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము
డా .యస్వీ రాఘవేంద్ర రావు

Total Pageviews