Sunday, February 7, 2016

"వంకాయ కూర" మూలాలు..
!!ఈ వంటకం హరప్పన్ కాలం నాటిదట!!
------------------------------------------
వంకాయ వంటి కూరయు... పంకజముఖి సీత వంటి భామామణియున్... శంకరుని వంటి దైవము... లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే’’ వంకాయ వంటి కూర, పద్మం వంటి ముఖం కలిగిన సీత వంటి స్త్రీ, శివుడి లాంటి దేవుడు, లంకాధిపతి రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు లేరన్నది ఈ చాటువు అర్థం. ఇంతకీ ఈ కూర మొట్టమొదట ఎవరు చేశారంటారు? అమ్మమ్మలు, నానమ్మలు వండిపెడితే సుష్టుగా లొట్టలేసుకు తిన్నాం గానీ... ఈ సందేహం మాత్రం ఎప్పుడూ రాలేదు కదా? అరుణిమా కశ్యప్... స్టీవ్ వెబర్, సోయితీ బెనర్జీలకు వచ్చింది. వాళ్ల శోధన... పాకశాస్త్ర ప్రయోగాల పుణ్యమా అని ఇప్పుడు వంకాయ కూర మూలాలు తెలిశాయి.
ఆశ్చర్యంగా అనిపించినా... ఈ వంటకం హరప్పన్ కాలం నాటిదట! హరప్పన్లు వంకాయ కూర తినేవారా? మీకెలా తెలుసు? వాళ్లేమైనా ‘కుక్ బుక్’ రాసిపెట్టారా? పోనీ వేదాల్లో ఈ వంటకం ప్రస్తావనేమైనా ఉందా? ఇవేనా మీ బుర్రల్లో మెదులుతున్న ప్రశ్నలు. హరప్పన్లు వంటల పుస్తకాలు రాయలేదుగానీ... వంట వండుకున్న పాత్రలు వదిలారుగా? అవిచాలు... అప్పుడెప్పుడో వాళ్లు ఏం వండుకున్నారో తెలుసుకునేందుకు అంటున్నారు అరుణిమా కశ్యప్, స్టీవ్ వెబర్‌లు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఈ ఇద్దరు పరిశోధకులు కొన్నేళ్ల క్రితం ఈ ప్రయోగాలు చేపట్టారు.
హరప్ప మట్టిపాత్రల అడుగుభాగాలను మైక్రోస్కోపుల సాయంతో నిశితంగా పరిశీలించినప్పుడు... అక్కడి రసాయన అవశేషాలను విశ్లేషించినప్పుడు ఆ కాలంలో వాడిన మసాలాలు, దినుసుల గురించి తెలిసిందట. హరప్ప నాగరికత తవ్వకాలు జరుగుతున్న ఫర్మానా (ప్రస్తుత హర్యానా) ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకాలను పరిశీలించి, పరిశోధన వ్యాసాలను క్షుణ్ణంగా పరిశోధించిన తరువాత వీరిద్దరూ ఆనాటి వంటకం వంకాయదని తేల్చారు.
మరి సొయితీ బెనర్జీ ఏం చేశారు? అరుణిమ, స్టీవ్‌ల మాదిరిగానే ఢిల్లీకి చెందిన ఈ రచయిత్రి కూడా ఆ కాలం నాటి వంటకాన్ని మళ్లీ వండే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా. అరుణిమా, స్టీవ్‌లు పింగాణీ పాత్రలో వండితే... సోయితీ దేశీ స్టైయిల్లో మట్టి కుండలు, కట్టెలపొయ్యి వాడి వంకాయ కూర వండారు. చిత్రమైన విషయమేమిటంటే... హర్యానా ప్రాంతంలో ఇప్పుడు వంకాయ కూర చాలా అరుదుగా మాత్రమే వండుతారట. హరప్పన్ వంకాయ కూర మీ ఇంట్లో వండాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వండేయండి.
ఇదిగో రెసిపీ..!
కావాల్సిన పదార్థాలు.. లేత వంకాయలు 15, అల్లం... 2 అంగుళాల సైజు, పసుపు కొమ్ము ఒకటి (లేదంటే పావు టేబుల్‌స్పూన్ పసుపు పొడి), జీలకర్ర... అర టేబుల్ స్పూన్, మామిడికాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర రసం పొడి (చెరకు రసాన్ని ఆరబెట్టాక మిగిలే పొడి) లేదా చక్కెర, పబ్రి (హర్యానా ప్రాంతంలో లభిస్తుంది. మనం దీన్ని కొత్తిమీరతో సరిపెట్టుకోవచ్చు), రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రుచికి తగినంత ఉప్పు.
వండే విధానం...: లేత వంకాయలను తొడిమల వరకూ నిలువుగా చీల్చి.. వాటిని ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టుకోవాలి. అల్లం + పసుపు కొమ్ము + జీలకర్రలను మరీ మెత్తగా కాకుండా రుబ్బిపెట్టుకోవాలి. ఈ మసాలాను మట్టికుండలో నువ్వుల నూనె వేసి అది వేడెక్కిన తరువాత కలుపుకోవాలి. రెండు నిమిషాల తరువాత వంకాయలు వేయాలి. దాదాపు పది నిమిషాలపాటు వేగనిచ్చి... పచ్చిమామిడికాయల ముక్కలు కలుపుకోవాలి. ఒక కప్పు నీళ్లు, చక్కెర రసం పొడి, ఉప్పు కలిపి వంకాయలు మెత్తబడే వరకూ ఉడకనివ్వాలి. చివరల్లో పబ్రి (మనమైతే కొత్తిమీర) వేసేస్తే హరప్పన్ వంకాయ కూర రెడీ. వేడివేడి సజ్జరొట్టెలతో ఈ కూర మరింత రుచికరంగా ఉంటుందట!..సాక్షితెలుగు...
'' అమ్మకు ప్రాణాభివందనం''
------------------------------
అమ్మ స్పర్శలో.. బ్రహ్మ..
బ్రహ్మ సృష్టిలో.. అమ్మ..
నవమాసాలు భారాన్ని భరిస్తూ -
పునర్జన్మకి వాకిళ్ళు తెరుస్తూ..
గాయపడి - బాధపడి
పచ్చిపయితో తన ప్రతిరూపాన్ని(ఓ పసిపాపను)
ప్రపంచానికి పరిచయం చేసిన..
అమ్మకు ప్రాణాభివందనం
అమ్మ ఒడిలో - తొలి బడిలో
చనుపాలతో పెంచి - మురిపాలనే పంచి..
పసిపాపల ప్రపంచ భాషలో....
పలకించి - పులకించి,
ఉగ్గుపోసి ఊసునేర్పిన..
నడకతో నడతను నేర్పిన..
అమ్మకు ప్రాణాభివందనం..
అమ్మ హృదయం - నా నివాస స్థలంలో
మొలకేసిన మానవత్వం - నా మానసిక సాహిత్యం....
మనసుతో మనిషిలా - ప్రజాహిత పౌరుడిలా
అక్షరాల్లో తలకట్టులా - ఆహార్యానికి పంచకట్టి
తెలుగుజాతి వారసులుగా ....
భారతీయత/జాతీయత నేర్పిన..
తెలుగమ్మకు ప్రాణాభివందనం..
అమ్మ పేరులో - అమ్మ ఊరులో..
గుండె పిలుపులో - తెలుగు పలుకులో
వేదాలలో శ్లోకాల్లా - త్యాగాల బాటలో
సమైక్యతా పథంలో - మమైక్యతా రథంలో
వందేమాతరం వారసులుగా....
దేశభక్తితో తీర్చిదిద్దిన ..
భారతమ్మకు ప్రాణాభివందనం..
ఒక ఊరిలో ఒక పరమ పండితుడు ఓ పెద్ద భవంతిలో ఉండే వాడు అదే ఇంటి ఎదురుగా ఓ వేశ్య ఓ చిన్న ఇంట్లో ఉండేదట ........ఇద్దరు కూడా మనుషులే కాని పరిస్థితుల్లో తేడాలు ధనిక బీద తనాల్లో తేడాలు ......
ప్రతి రోజు పండితుడు ఆ వేశ్యని ,ఆ ఇంటికి వచ్చేవాళ్ళని తిట్టుకుంటూ ఉండేవాడట ........కాని ఆ వేశ్య మాత్రం దేవుడా ఆ ముందింటి వాళ్ళలాగా నాకు ఓ మంచి జీవితాన్ని ఇచ్చి ఉంటే సదా నీ సేవలో ఉండేదాన్ని కదా అని రోజు కంట తడి పెట్టుకునేదట ........అందుకే అంటారు చేసే పని ఎలాంటిది నిబద్దతతో చెయ్యాలి ఎదుటివారిని ఎలాంటి పరిస్థితుల్లోను కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని ..........జ్ణానిగా ఉండాల్సిన పండితుడు దిగజారి మాట్లాడుతుంటే , అనుకోని పరిస్థితుల్లో చేయకూడని పని చేస్తూ కూడా తనని తన పరిస్థితిని తలచుకునే బాధ పడే ఆ పడతి నిజంగా మంచి మనిషే అని చెప్పుకోవాలి ...........
ఎంతో కష్టపడినా నీకు ఇక్కడ దొరకని అవకాశం అక్కడకు అంత దూరం వెళ్లి చదివేలా చేసాయి .........పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితిలోను మనసుకి మాలిన్యాన్ని తాకనీయకుండా జాగ్రత్త పడుతూ నీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని ప్రతిభను వెలికి తీసుకునేందుకు నీకు ఇదే సరైన అవకాశం అనుకొని అన్ని విధాలా నీకు అనుకూలంగా మలచుకునేందుకు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడంలో ఎన్నడు వెనకడుగు వేయవద్దు .నీ జీవితంలో ప్రాధాన్యతను బట్టి వాటికి కావలసిన ప్రణాళికలు వేసుకోవాలి.నీ బలహీనతలే నీ బంగారు భవితకు అవరోధాలనేది అక్షర సత్యం .
స్నేహం చేయడంలో తప్పులేదు కాని స్నేహం ముసుగులో మోసపూరితమైన ఆలోచనలు చేసే వాళ్ళను గమనించడం కూడా చాలా అవసరం .అలాగే సమస్యని బట్టి సాటి మనిషిగా నీ స్నేహితులకు సహాయపడటం కూడా ఓ మంచి సుగుణం .ప్రతి రోజులో ప్రతి సెకను చాలా అమూల్యమైనది ఆ సమయాన్ని దుర్వినియోగం చేసి తరువాత బాధ పడటంలో అర్ధమే ఉండదు.సమయం సాగిపోతూనే ఉంటుంది .ఆ సమయంతో పోటీ పడి పరుగులు తీస్తూ నలుగురికి ఉపయోగపడే నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలని అప్పుడప్పుడు చెప్పాలని అనిపించే కొన్ని మంచి మాటలు
అందుకే అంటారు మనిషి జ్ఞానం ఓ దివ్వె లాంటిది అని .చీకటిలో పెడితే వెలుగుని ఇస్తుంది .దేవుని ముందు పెడితే దైవత్వాన్ని సంతరించుకుంటుంది .అదే దివ్వెను తీసుకు వెళ్లి చనిపోయిన మనిషి తలదగ్గర పెడితే ఆ మనిషి చనిపోయాడని సాక్ష్యమై కనిపిస్తుంది . తోటలో పడి ఉన్న ఎండిపోయిన ఆకుల మద్య పెడితే ఆ తోటనే కాల్చి వేస్తుంది అని .
మనలో ఉన్న జ్ఞానాన్ని ఇనుమడింప చేసుకోవాలి అనుకుంటే మహోన్నతమైన వ్యక్తుల మద్యనే ఉండేలా చేసుకోవాలి అప్పుడే అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే జ్ఞాన దీపమై నలుగురికీ వెలుగుని పంచడానికి కావలసిన జ్ఞాన సంపదను పెంచుకునే వాళ్ళం అవుతాం..

Thursday, February 4, 2016

        ఫలం, పత్రం, పుష్పం, తోయం సమర్పయామి అంటాముకదా 

                            దాని అర్ధం ఏమిటంటే... 


పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.

(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, 

సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో 

విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే 

కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం 

తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, 

ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి.

కొబ్బరికాయ :- కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. కొట్టిన 

కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే - లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును 

సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని 

వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, 

సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు. అలానే కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా, గట్టిగా 

ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా, లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశీదకరిస్తూ, 

మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి 

అర్పించడమనే అర్ధాని కొందరు చెప్తారు.
తెలుసుకుందాం......
సజ్జనులు
సత్పురుషులను, సాధుపుంగవులను, అవమానించరాదు, దూషించరాదు, ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైన, దుర్భాషలాడరాదు. మహాత్ములకు, మహర్షులకు, అస్త్రశస్త్రాలు అవసరంలేదు. వారి శక్తి వారి వాక్కుల్లోనె ఉంటుంది. ఆ శక్తి పిడుగు కన్నా ప్రమాదకరమైనది. ఒకవేళ వారు ప్రశ్నించకపోయినా, ప్రతీకార చర్యకు పూనుకోక పోయినా, వారి మనస్తాపమే మనకు మహాశాపమై తగులుతుంది.
తల్లిప్రేమ
తల్లి కుటుంబానికి మూలకేంద్రం, ఆదర్శమూర్తి. తల్లి ప్రేమ కన్నా ఏ ప్రేమ ఈ సృష్టిలో భగవంతుని ప్రేమకు ప్రతిరూపంగా ఉండగలదు? అందువల్ల తల్లి సాక్షాత్తు భగవదవతారం. -- స్వామి వివేకానంద.
భగవద్భక్తి
ప్రబలంగా మండుతున్న అగ్ని కట్టెలను భస్మం చేసినట్లు, భగవంతుని పట్ల గల భక్తి సమస్త పాపాలను దగ్ధం చేస్తుంది. కావున భక్తినిష్ఠుడవు కమ్ము. భక్తి వలన సాధ్యం కానిదేదీ లేదు. -- శ్రీమద్భాగవతం.
మానావమానములు
లోకులు ఎంత సులభంగా స్తుతిస్తారో అంతే సులభంగా నిదించనూగలరు. కాబట్టి నిన్ను గురించి లోకులు చేసే నిందాస్తుతులను ఎన్నడూ పట్టించుకోకు. భగవాన్ శ్రీరామకృష్ణులు
సజ్జన సాంగత్యం
సాధుపురుషుల సాంగత్యం ఒక్క నిమిషమైనా, ఆ సాంగత్య మహిమతో సరిపోలిస్తే లోకంలోని ఏ సంపదలు అందుకు సాటిరావు. పరమ భక్తుల సాంగత్యానికి ముక్తి కూడా సాటిరాదు. .. శ్రీమద్భాగవతం.
భగవన్నామస్మరణ
ఎవరు భగవన్నామాన్ని స్మరించేవారు ఎవరైనా శ్రేష్ఠులే! అలాంటివారు జపతపాలు, యజ్ఞయాగాలు, తీర్థస్నానాలు, వేదధ్యయనాలు ఆచరించినవారే అగుదురు. -- శ్రీమద్భాగవతం.
ధ్యానం
ధ్యానమంటే తుచ్ఛవిషయాలకు బానిస కాకుండా ప్రతిఘటించగలిగేలా మనల్ని సమర్థులను చేసే శక్తి, బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేసి శాంతమరచడమే ధ్యానం. -- స్వామి వివేకానంద.
ఆత్మోన్నతి
మనం ఓ మూల కూర్చొని మనలోని లోపాలను గురించి దుఃఖించడం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదు. వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నమే ఆత్మోన్నతిని కలుగజేస్తుంది. -- స్వామి వివేకానంద.
శ్రేయోమార్గం
శ్రేయస్సును చేకూర్చే మార్గం అత్యంత దుర్గమమైనది. కాబట్టి అనేకమంది అపజయం పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రలోభాలను ఎదుర్కొని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. -- స్వామి వివేకానంద.
స్త్రీ - వేదవిద్య
వేదకాలంలో గార్గి, మైత్రేయీలాంటి వారికి పారమార్థిక జ్ఞాన సంపాదనకు అర్హత ఎలా ఉన్నదో , నేటి మహిళలకు కూడా అటువంటి అధికారం ఉన్నది.. -- స్వామి వివేకానంద.
జ్ఞాని
నీటికాకి శరీరానికి నీటి చుక్కలు అంటుకున్న అది రెక్కలను టపటపలాడించగానే అవి రాలిపోతాయి. అలాగే, ముక్తపురుషుడు ఈ లోకంలో నీటికాకిలాగా జీవిస్తాడు. ... శ్రీ రామకృష్ణ.
గృహస్తు - ఆహారం
వండుకునే ఆహారంలో మొదటి భాగం అతిథులకు, రెండవ భాగం మూగజీవులకు, మూడవ భాగం పసిపిల్లలకు కేటాయించి, నాలుగవ భాగాన్ని తాము స్వీకరించాలి. -- స్వామి వివేకానంద.
సిద్ధులు - అల్పప్రయోజనాలు
రోగనివారణ చేయడం, వ్యాజ్యాలను గెలిపించడం లాంటి సిద్ధులను ప్రయోగించేవారు అల్పబుద్ధులు. పరమేశ్వర చరణారవిందాలను తప్ప మరిదేన్నీ కోరనివారే నిజమైన భక్తులు. ... శ్రీ రామకృష్ణలు


శుభోదయం../\..

పద్మా సనే పద్మకరే సర్వ లోకైక పూజితా
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
క్షీరో దార్ణ వసంభూతే కమలే కమలాలయే
సుస్థి రాభ వమే గేహే సురాసుర నమస్క్రతే!!

తా|| పద్మాసన మందు కూర్చున్నదానవు, చేత పద్మ పుష్పములను పట్టు కొనియున్న దానవు సర్వజనులచేత ప్రశంసంప బడుచున్న దానవు అయిన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు నా పైదయ కలిగి ఉండుము. పాలసముద్ర మందు పుట్టి ననీ వెల్లప్పుడును మాగృహమందు శాశ్వతముగా ఉండుము.



Wednesday, February 3, 2016

సంవత్సరాల తరబడి కనీస వేతనం కూడా రాని బీద అర్చకుల వ్యధ.

ఓయీ అర్చక సోదరా !
1. నీ భవిత మరచి వంశపారంపర్య అర్చకునిగా చేరతావు నీవారు వదిలేసిన ఆలయంలో
స్వలాభాపేక్ష లేక అభివృద్ధి చేస్తావు ఆలయాన్ని
అంతవరకు దేవాలయమే పట్టని బంధుగణాలు
ఎగిరి వస్తారు హక్కులతో రెక్కలు కట్టుకొని వంతుల కొరకు.
2. నీ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక లేస్తావు బ్రహ్మీముహూర్తంలో
స్వామికి చేస్తావు పూజలు సర్వలోక శ్రేయస్సు కొరకై
నిన్ను మరచి చేస్తావు స్తోత్రాలు లోకాభివృద్దికై
నీకై ప్రతి ఫలాపేక్ష లేని స్వామి సేవనే ఆశిస్తావు పరమావధిగా.
3. ఇక మొదలవుతుంది కోరికలతో భక్తుల తాకిడి
నీవు చెప్పాలి స్వామికి భక్తుల తృప్తికై గోత్ర నామాల ఘోషలు
తెస్తారు భక్తులు స్వామికి అగరు హారతి కర్పూరాలు
వాటి పొగతో పడతాయి నీ ఊపిరితిత్తులకు చిల్లులు.
4. పంచుతావు అందరికి పవిత్రమైన తీర్థ ప్రసాదాలు
కోరతారు అందరూ ఖర్చు లేని నీ ఆశీస్సులు
తీస్తారు మెరిసే కాగితాలతో మనీ పర్సులు
వాటిలో వెదకుతారు పళ్ళెంలో వేయుటకు అర్థ రూపాయి కాసులు.
5. వస్తారు స్వామి దర్శనానికి బంధు గణాలతో అధికార మంత్రులు
నీవు పలకాలి పూర్ణకుంభాలతో వారికి సుస్వాగతాలు
వారికి ఇవ్వాలి ఆశీర్వచన శేష వస్త్ర ప్రసాదాలు
వారి వద్ద నీ విలువ మాత్రం పూర్ణ కుంభం లోని ఎండు మామిడాకులు.
6. జరపాలి గ్రామస్తుల కొరకు వైభవం గా ఉత్సవాలు
చేస్తారు ఎంత ఖర్చు అయినా స్వామి వారి ఊరేగింపులు
కానీ నిత్య ధూప దీప నైవేద్యాలకు ఉండవు సొమ్ములు
సంవత్సరాలు గడచినా నీకు మాత్రం రావు జీత భత్యాలు.
7. పండుగలకు అయినా, ఉత్సవాలకు అయినా నీవు చేయాలి అదనపు సర్వీసు
నీ వేతనాలు ఎప్పుడు వస్తాయి అనేది ఆ దేవునకే తెలుసు
పండుగలకు ఆనందంగా నూతన వస్త్రాలు ధరించి వస్తారు భక్తులు
ఆరోజు కూడా నీవు ధరించక తప్పదు మసి బారిన మడివస్త్రాలు.

8. నీ మంచి తనం తో భక్తుల చేత నింపిస్తావు డిబ్బీలు
కానీ నీకిచ్చే జీతంతో నిండవు రెండు పూటలా నీ భార్యా పిల్లల కడుపులు
నీవు పెంచే ఆదాయంతో అందరికి చేస్తారు అన్న దానాలు
నీ నివాసం మాత్రం పడిపోతున్న తాటాకుపాకలు.
9. ఆదాయం పెరిగిన ఆలయాల చుట్టూ చీమల్లా చేరతారు ట్రష్టీలు
వారితో పాటు చేరతాయి ఆలయాలలో రాజకీయాలు
ఆదాయం లేని ఆలయాలకు బదిలీలు చేసినా చేరరు మేనేజరులు
నీకు మాత్రం తప్పదు అప్పు చేసైనా నిత్య ధూప దీప నైవేద్యాలు.
10. నీ తల్లిదండ్రులు నీ వివాహానికై వెదకుతారు కన్యామణిని
అర్చక అల్లుడా !! అని చిన్న చూపు చూస్తారు కన్యాదాతలు
గుమాస్తా అయినా చాలు, అర్చకుడు వద్దని నిక్కచ్చిగా చెబుతారు కాంతామణులు
నీతో జతకడితే వారి జీవితం లో ఆనందాలు దూరమని కాబోలు.

11. ఎంతో అవసరంతో ఆశగా పెడతావు పెళ్లి, ఉపనయన లోనులు
అవి శాంక్షన్ అయ్యేకాలానికి పుడతారు నీకు మనుమలు
నీ కనీస వేతనానికి కూడా ఉండవు ఆలయం లో సొమ్ములు
కాని ఆలయంలో స్వీపరుకు కూడా ఉంటాయి పేస్కేలులు.
12. నీ జీవిత చరమాంకం వరకు ఆలయంలో భక్తులకు చేస్తావు సేవలు
ధూపాలతో వచ్చిన రోగాలతో చివరకు నీకై తెరుస్తారు వైకుంట ద్వారాలు
నీవారు చేయాలి నీ అంతిమ సంస్కార ఖర్చులకై ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు
నీ అంతిమయాత్రకైనా రారు నీ ఆశీస్సులు పొందిన భక్తులు .

-----సంవత్సరాల తరబడి కనీస వేతనం కూడా రాని బీద అర్చకుల వ్యధ.

* శివరామకృష్ణ *

Total Pageviews