Thursday, February 4, 2016

తెలుసుకుందాం......
సజ్జనులు
సత్పురుషులను, సాధుపుంగవులను, అవమానించరాదు, దూషించరాదు, ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైన, దుర్భాషలాడరాదు. మహాత్ములకు, మహర్షులకు, అస్త్రశస్త్రాలు అవసరంలేదు. వారి శక్తి వారి వాక్కుల్లోనె ఉంటుంది. ఆ శక్తి పిడుగు కన్నా ప్రమాదకరమైనది. ఒకవేళ వారు ప్రశ్నించకపోయినా, ప్రతీకార చర్యకు పూనుకోక పోయినా, వారి మనస్తాపమే మనకు మహాశాపమై తగులుతుంది.
తల్లిప్రేమ
తల్లి కుటుంబానికి మూలకేంద్రం, ఆదర్శమూర్తి. తల్లి ప్రేమ కన్నా ఏ ప్రేమ ఈ సృష్టిలో భగవంతుని ప్రేమకు ప్రతిరూపంగా ఉండగలదు? అందువల్ల తల్లి సాక్షాత్తు భగవదవతారం. -- స్వామి వివేకానంద.
భగవద్భక్తి
ప్రబలంగా మండుతున్న అగ్ని కట్టెలను భస్మం చేసినట్లు, భగవంతుని పట్ల గల భక్తి సమస్త పాపాలను దగ్ధం చేస్తుంది. కావున భక్తినిష్ఠుడవు కమ్ము. భక్తి వలన సాధ్యం కానిదేదీ లేదు. -- శ్రీమద్భాగవతం.
మానావమానములు
లోకులు ఎంత సులభంగా స్తుతిస్తారో అంతే సులభంగా నిదించనూగలరు. కాబట్టి నిన్ను గురించి లోకులు చేసే నిందాస్తుతులను ఎన్నడూ పట్టించుకోకు. భగవాన్ శ్రీరామకృష్ణులు
సజ్జన సాంగత్యం
సాధుపురుషుల సాంగత్యం ఒక్క నిమిషమైనా, ఆ సాంగత్య మహిమతో సరిపోలిస్తే లోకంలోని ఏ సంపదలు అందుకు సాటిరావు. పరమ భక్తుల సాంగత్యానికి ముక్తి కూడా సాటిరాదు. .. శ్రీమద్భాగవతం.
భగవన్నామస్మరణ
ఎవరు భగవన్నామాన్ని స్మరించేవారు ఎవరైనా శ్రేష్ఠులే! అలాంటివారు జపతపాలు, యజ్ఞయాగాలు, తీర్థస్నానాలు, వేదధ్యయనాలు ఆచరించినవారే అగుదురు. -- శ్రీమద్భాగవతం.
ధ్యానం
ధ్యానమంటే తుచ్ఛవిషయాలకు బానిస కాకుండా ప్రతిఘటించగలిగేలా మనల్ని సమర్థులను చేసే శక్తి, బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేసి శాంతమరచడమే ధ్యానం. -- స్వామి వివేకానంద.
ఆత్మోన్నతి
మనం ఓ మూల కూర్చొని మనలోని లోపాలను గురించి దుఃఖించడం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదు. వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నమే ఆత్మోన్నతిని కలుగజేస్తుంది. -- స్వామి వివేకానంద.
శ్రేయోమార్గం
శ్రేయస్సును చేకూర్చే మార్గం అత్యంత దుర్గమమైనది. కాబట్టి అనేకమంది అపజయం పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రలోభాలను ఎదుర్కొని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. -- స్వామి వివేకానంద.
స్త్రీ - వేదవిద్య
వేదకాలంలో గార్గి, మైత్రేయీలాంటి వారికి పారమార్థిక జ్ఞాన సంపాదనకు అర్హత ఎలా ఉన్నదో , నేటి మహిళలకు కూడా అటువంటి అధికారం ఉన్నది.. -- స్వామి వివేకానంద.
జ్ఞాని
నీటికాకి శరీరానికి నీటి చుక్కలు అంటుకున్న అది రెక్కలను టపటపలాడించగానే అవి రాలిపోతాయి. అలాగే, ముక్తపురుషుడు ఈ లోకంలో నీటికాకిలాగా జీవిస్తాడు. ... శ్రీ రామకృష్ణ.
గృహస్తు - ఆహారం
వండుకునే ఆహారంలో మొదటి భాగం అతిథులకు, రెండవ భాగం మూగజీవులకు, మూడవ భాగం పసిపిల్లలకు కేటాయించి, నాలుగవ భాగాన్ని తాము స్వీకరించాలి. -- స్వామి వివేకానంద.
సిద్ధులు - అల్పప్రయోజనాలు
రోగనివారణ చేయడం, వ్యాజ్యాలను గెలిపించడం లాంటి సిద్ధులను ప్రయోగించేవారు అల్పబుద్ధులు. పరమేశ్వర చరణారవిందాలను తప్ప మరిదేన్నీ కోరనివారే నిజమైన భక్తులు. ... శ్రీ రామకృష్ణలు

No comments:

Post a Comment

Total Pageviews