Wednesday, February 3, 2016

సంవత్సరాల తరబడి కనీస వేతనం కూడా రాని బీద అర్చకుల వ్యధ.

ఓయీ అర్చక సోదరా !
1. నీ భవిత మరచి వంశపారంపర్య అర్చకునిగా చేరతావు నీవారు వదిలేసిన ఆలయంలో
స్వలాభాపేక్ష లేక అభివృద్ధి చేస్తావు ఆలయాన్ని
అంతవరకు దేవాలయమే పట్టని బంధుగణాలు
ఎగిరి వస్తారు హక్కులతో రెక్కలు కట్టుకొని వంతుల కొరకు.
2. నీ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక లేస్తావు బ్రహ్మీముహూర్తంలో
స్వామికి చేస్తావు పూజలు సర్వలోక శ్రేయస్సు కొరకై
నిన్ను మరచి చేస్తావు స్తోత్రాలు లోకాభివృద్దికై
నీకై ప్రతి ఫలాపేక్ష లేని స్వామి సేవనే ఆశిస్తావు పరమావధిగా.
3. ఇక మొదలవుతుంది కోరికలతో భక్తుల తాకిడి
నీవు చెప్పాలి స్వామికి భక్తుల తృప్తికై గోత్ర నామాల ఘోషలు
తెస్తారు భక్తులు స్వామికి అగరు హారతి కర్పూరాలు
వాటి పొగతో పడతాయి నీ ఊపిరితిత్తులకు చిల్లులు.
4. పంచుతావు అందరికి పవిత్రమైన తీర్థ ప్రసాదాలు
కోరతారు అందరూ ఖర్చు లేని నీ ఆశీస్సులు
తీస్తారు మెరిసే కాగితాలతో మనీ పర్సులు
వాటిలో వెదకుతారు పళ్ళెంలో వేయుటకు అర్థ రూపాయి కాసులు.
5. వస్తారు స్వామి దర్శనానికి బంధు గణాలతో అధికార మంత్రులు
నీవు పలకాలి పూర్ణకుంభాలతో వారికి సుస్వాగతాలు
వారికి ఇవ్వాలి ఆశీర్వచన శేష వస్త్ర ప్రసాదాలు
వారి వద్ద నీ విలువ మాత్రం పూర్ణ కుంభం లోని ఎండు మామిడాకులు.
6. జరపాలి గ్రామస్తుల కొరకు వైభవం గా ఉత్సవాలు
చేస్తారు ఎంత ఖర్చు అయినా స్వామి వారి ఊరేగింపులు
కానీ నిత్య ధూప దీప నైవేద్యాలకు ఉండవు సొమ్ములు
సంవత్సరాలు గడచినా నీకు మాత్రం రావు జీత భత్యాలు.
7. పండుగలకు అయినా, ఉత్సవాలకు అయినా నీవు చేయాలి అదనపు సర్వీసు
నీ వేతనాలు ఎప్పుడు వస్తాయి అనేది ఆ దేవునకే తెలుసు
పండుగలకు ఆనందంగా నూతన వస్త్రాలు ధరించి వస్తారు భక్తులు
ఆరోజు కూడా నీవు ధరించక తప్పదు మసి బారిన మడివస్త్రాలు.

8. నీ మంచి తనం తో భక్తుల చేత నింపిస్తావు డిబ్బీలు
కానీ నీకిచ్చే జీతంతో నిండవు రెండు పూటలా నీ భార్యా పిల్లల కడుపులు
నీవు పెంచే ఆదాయంతో అందరికి చేస్తారు అన్న దానాలు
నీ నివాసం మాత్రం పడిపోతున్న తాటాకుపాకలు.
9. ఆదాయం పెరిగిన ఆలయాల చుట్టూ చీమల్లా చేరతారు ట్రష్టీలు
వారితో పాటు చేరతాయి ఆలయాలలో రాజకీయాలు
ఆదాయం లేని ఆలయాలకు బదిలీలు చేసినా చేరరు మేనేజరులు
నీకు మాత్రం తప్పదు అప్పు చేసైనా నిత్య ధూప దీప నైవేద్యాలు.
10. నీ తల్లిదండ్రులు నీ వివాహానికై వెదకుతారు కన్యామణిని
అర్చక అల్లుడా !! అని చిన్న చూపు చూస్తారు కన్యాదాతలు
గుమాస్తా అయినా చాలు, అర్చకుడు వద్దని నిక్కచ్చిగా చెబుతారు కాంతామణులు
నీతో జతకడితే వారి జీవితం లో ఆనందాలు దూరమని కాబోలు.

11. ఎంతో అవసరంతో ఆశగా పెడతావు పెళ్లి, ఉపనయన లోనులు
అవి శాంక్షన్ అయ్యేకాలానికి పుడతారు నీకు మనుమలు
నీ కనీస వేతనానికి కూడా ఉండవు ఆలయం లో సొమ్ములు
కాని ఆలయంలో స్వీపరుకు కూడా ఉంటాయి పేస్కేలులు.
12. నీ జీవిత చరమాంకం వరకు ఆలయంలో భక్తులకు చేస్తావు సేవలు
ధూపాలతో వచ్చిన రోగాలతో చివరకు నీకై తెరుస్తారు వైకుంట ద్వారాలు
నీవారు చేయాలి నీ అంతిమ సంస్కార ఖర్చులకై ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు
నీ అంతిమయాత్రకైనా రారు నీ ఆశీస్సులు పొందిన భక్తులు .

-----సంవత్సరాల తరబడి కనీస వేతనం కూడా రాని బీద అర్చకుల వ్యధ.

* శివరామకృష్ణ *

No comments:

Post a Comment

Total Pageviews