Monday, February 1, 2016

కాల గణనానికి సంబంధించి శక సంవత్సరం అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. అటు చరిత్ర, ఇటు పురాణ ప్రశస్తి అన్నీ కలిసి అల్లుకొన్న ఓ చక్కటి సత్యబద్ధ కథగా శాలివాహన శకానికి సంబంధించిన ఈ కథ బహుళ ప్రచారంలో ఉంది. శాలివాహన శకం, విక్రమార్క శకం అనేవి ఎప్పటి నుంచి వచ్చాయన్నది ఇక్కడ వివరంగా కనిపిస్తుంది. దీంతో పాటు మన జాతిలో దైవాంశ సంభూతులుగా ఉన్న మహానీయుల శక్తియుక్తులు ఎంత గొప్పవో కూడా ఈ కథ ద్వారానే అవగతమవుతూ ఉంటుంది.
భారతావనిలో వింధ్య పర్వతాలకు ఓ ప్రముఖ స్థానముంది. ఈ పర్వతాలకు ఉత్తరాన ఉన్నదంతా ఉత్తర భారతమని, దక్షిణాన ఉన్న దంతా దక్షిణ భారతమని అంటూ ఉంటారు. అలాగే వింధ్యకు దక్షిణాన శాలివాహన శకం అని, ఉత్తరాన విక్రమార్క శకమని కాలాన్ని లెక్కలోకి తీసుకోవడం ఉంది.
దీనికి సంబంధించిన కథను పరిశీలిస్తే... పూర్వం పురంధర పురంలో ఓ వర్తకుడు ఉండేవాడు. ఆ రోజుల్లో విక్రమార్కుడు రాజ్యపాలన చేస్తుండే వాడు. ఆ వర్తకుడు బాగానే ధనాన్ని సంపాదించాడు. తనకు కాలం సమీపించిందని తెలుసుకొన్న ఆ వ్యాపారి నాలుగు పాత్రలను సేకరించి వాటిలో ఏవేవో ఉంచి గట్టి మూతలు బిగించాడు. తన నలుగురు కుమారులను పిలిచి తాను చనిపోయిన తర్వాత మాత్రమే ఎవరెవరు ఏఏ పాత్రలను తీసుకోవాలో చెప్పి మరణించాడు. ఈ తర్వాత ఆ వర్తకుడి కుమారులు నలుగురూ తమ కిచ్చిన పాత్రల మూతలను తీశారు. వాటిలో వరుసగా ఒక దానిలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు ఉన్నాయి. నలుగురు కుమారులకు తమ తండ్రి ఆంతర్యమేమిటో, తమ ఆస్తిని ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. చాలా మందిని దాని గురించి అడిగారు. ఆ పాత్రలలో ఉన్న దాన్ని బట్టి ఆస్తిని పంచుకోవాలన్నది తమ తండ్రి కోరికని, మట్టి, బొగ్గులు, ఎముకలు, తవుడు పాత్రలలో ఉన్నాయని, ఈ చిక్కు ముడేమిటో తమకు అర్థం కావటం లేదని వర్తకుడి కుమారులు  ఎంతమంది దగ్గరకు వెళ్ళినా తగిన సమాధానమే దొరకలేదు. చివరకు ప్రతిష్టాన పురంలో ఉంటున్న నాటి రాజు విక్రమార్కుడి దగ్గరకు కూడా వెళ్ళినా సమస్యకు సమాధానం దొరకలేదు. విక్రమార్కుడి రాజ్యంలోని మేధావులంతా దాన్ని గురించే ఆలోచిస్తున్నారు. అదే రోజుల్లో నాగరాజు తక్షకుడి అంశతో జన్మించిన ఓ బాలుడు ఉండేవాడు. అతను పుట్టక ముందే అతడి తల్లి విధవరాలైంది. ఆమెకు ఒక కుమ్మరి ఆశ్రయమిచ్చాడు. ఆ ఇంట్లోనే ఆ బాలుడు జన్మించాడు. అతడే శాలివాహనుడు అనే పేరున పెరిగి పెద్దవాడయ్యాడు. వర్తకుల కుమారుల సమస్య శాలివాహనుడి దాకా వచ్చింది. అతడు వెంటనే దీనికోసం ఇంతగా ఆలోచించాలా? మట్టితో నిండిన పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్ర దక్కిన వాడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలి. బొగ్గులతో నిండిన పాత్ర దక్కిన వాడు ఆస్తిలోని కలపను తీసుకోవాలి. ఎముకలు నిండిన పాత్ర వచ్చిన వాడు ఏనుగులు, గుర్రాలు తదితర పశు సంపదను తీసుకోవాలి. తవుడు నిండిన పాత్ర వచ్చిన వాడు ధాన్యాలను పంచుకోవాలన్నదే ఆ మరణించిన వర్తకుడి ఆంతర్యమని శాలివాహనుడు విడమరిచి చెప్పాడు. ఆ చిక్కుముడి సమస్యను అంత తేలికగా శాలివాహనుడు తీర్చిన విషయం ఆ నోటా ఈ నోటా పడి విక్రమార్క మహారాజు దాకా వెళ్ళింది. తన రాజ్యంలో ఉన్న అంత తెలివైన వాడిని చూడాలని విక్రమార్కుడు అనుకుని శాలివాహనుడిని తన దగ్గరకు రమ్మనమని కబురు పెట్టాడు. అయితే శాలివాహనుడు అంతగా తనను చూడాలంటే విక్రమార్కుడినే తన దగ్గరకు రమ్మనమన్నాడు. ఆ మాటకు రాజుకు కోపం ముంచుకొచ్చింది. వెంటనే శాలివాహనుడిని సంహరించమని సైన్యాన్ని పంపాడు. ఆ విషయం తెలిసిన శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు, గుర్రాల బొమ్మలు లాంటివి చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్క సేనల మీదకు పంపాడు. అలాగే సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి రాజు సేనలన్నీ నిద్ర పోయేలా చేశాడు. విక్రమార్కుడికి తొలుత ఏం చేయాలో అర్థం కాక ఆ తర్వాత నాగరాజును ప్రార్థించి ఆయన అనుగ్రహంతో తనే సైనికులందరి నిద్రను పొగొట్టాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల మధ్యన భీకర యుద్ధం జరుగుతండటంతో మధ్యలో ఆకాశవాణి కల్పించుకుని యుద్ధం ఆపమని రాజీ మార్గంగా ఉత్తర దిక్కున ఉన్న భూమినంతా విక్రమార్రుడు, దక్షిణాన ఉన్న రాజ్యాన్నంతటినీ శాలివాహనుడు పాలించుకోమని చెప్పింది. అలా శాలివాహనుడు ఒక శకాన్ని స్థాపించాడు. అది ప్రారంభమైంది చైత్ర శుక్ల పాడ్యమి నాడు. చైత్ర శుక్ల పాడ్యమే ఉగాదిగా అలా అయిందని పెద్దలు చెబుతుంటారు. కాలం ఒక సంవత్సరం కొలమానంగా అమలులోకి రావటం, శక సంవత్సరం లాంటివి వ్యాప్తిలోకి రావటం అనే విషయాలను ఈ కథ ప్రస్తావించింది.

No comments:

Post a Comment

Total Pageviews